amrita hospital
-
ఆరోగ్యం, ఆధ్యాత్మికం మమేకం: ప్రధాని మోదీ
ఫరీదాబాద్(హరియాణా): భారత్‌లో ఆరోగ్య సంరక్షణకు, ఆధ్యాత్మికతకు దగ్గరి సంబంధముందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. బుధవారం హరియాణాలోని ఫరీదాబాద్‌లో 2,600 పడకల భారీ, అధునాతన అమృత సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించి మోదీ ప్రారంభోపన్యాసం చేశారు. మాతా అమృతానందమయి, హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ‘కోవిడ్ ఉధృతి కాలంలో కరోనా టీకాలపై కొందరు దుష్ప్రచారం చేశారు. వాటికి ఆధ్యాత్మికవేత్తలు అడ్డుకట్టవేశారు. దీంతో ప్రజలంతా కోవిడ్ వ్యాక్సినేషన్లో భాగస్వాములయ్యారు. దేశంలో వ్యాక్సినేషన్ విస్తృతమైంది. స్పిరిట్యువల్– ప్రైవేట్ పార్ట్నర్షిప్ విజయానికి చక్కని ఉదాహరణ ఇది. భారత్‌లో ఆరోగ్య సంరక్షణకు, ఆధ్యాత్మికతకు అంతర్లీన సంబంధముంది’ అని మోదీ వ్యాఖ్యానించారు. అమృత ఆస్పత్రిని 130 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. ఆస్పత్రి భవంతిపై హెలిప్యాడ్ సౌకర్యముంది. మరోవైపు, ప్రధాని పంజాబ్‌లోని ముల్లన్‌పూర్‌లో 300 పడకల హోమీ బాబా క్యాన్సర్ ఆస్పత్రి, రీసెర్చ్ సెంటర్‌ను ప్రారంభించారు. హెల్త్‌కేర్ రంగంలో దేశంలో గత ఏడు దశాబ్దాల్లో జరగనంత అభివృద్ధి ఈ ఎనిమిదేళ్లలో సాకారమైందని మోదీ వ్యాఖ్యానించారు. ఇదీ చదవండి: స్వతంత్ర మీడియాని అణచివేసేందుకు యత్నాలు -
అయ్యో ‘పాపం..
- అప్పుడే పుట్టిన పసివాడిపై కర్కశత్వం - బ్లేడ్‌తో గొంతుకోసిన గుర్తు తెలియన వ్యక్తులు - కాపాడిన హెడ్‌కానిస్టేబుల్ జనార్దన్ - అమృత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పసి బాలుడు తల్లిగర్భం నుంచి అప్పుడే బయటకు వచ్చాడు... బొడ్డు పేగు కూడా అలానే ఉంది.. ఆ చిన్నారి ఇంకా లోకాన్ని చూడనే లేదు.. అలాంటి పసివాడిపై ఎవరో కర్కశత్వం చూపారు.. బ్లేడ్‌తో గొంతు కోసి నిర్మానుష్య ప్రదేశంలో పడేశారు. ఈ హృదయవిదారక ఘటన సోమవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో హన్మకొండ లష్కర్‌బజార్‌లో చోటుచేసుకుంది. స్థానికుడు కేయూ పీఎస్ హెడ్‌కానిస్టేబుల్ జనార్దన్ చిన్నారి రోదనలు విని అక్కడికి వచ్చి పరిశీలించారు. నేలపై చీమలుపట్టి.. రక్తం కారుతూ ఏడుస్తూ కనిపించింది శిశువు. తక్షణమే స్పందించిన జనార్దన్ తన కుమారుడి సహాయంతో మ్యాక్స్‌కేర్ ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు పిల్లల వైద్యుడి వద్దకు తీసుకెళ్లాలని సూచించడంతో కిషన్‌పురలోని అమృత ఆస్పత్రికి తీసుకెళ్లాడు. పరీక్షించిన వైద్యులు చిన్నారి గొంతుపై బ్లేడ్‌తో కోసినట్లుగా గుర్తించి వైద్యసేవలందించారు. ప్రస్తుతం శిశువు ఐసీయూలో ఉంచి చికిత్స పొందుతోందని, ఆరోగ్యంగానే ఉన్నట్లు అమృత ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ రమేష్ తెలిపారు. అవాంచిన గర్బం దాల్చిన యువతి అప్పుడే పుట్టిన మగబాబును చెత్తకుప్పలో వేయడంతోపాటు బ్లేడుతో కోసి ఉంటుందని స్థానికులు అంటున్నారు. చిన్నారి ఘటనపై అమృత హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ రమేష్ స్పందిస్తూ... చిన్నారి కోలుకునే వరకు ఉచిత వైద్యసేవలందించనున్నట్లు ఆయన వెల్లడించారు. సత్వరమే స్పందించి పసివాడిని ఆస్పత్రికి తీసుకెళ్లిన కేయూ పీఎస్ హెడ్ కానిస్టేబుల్ జనార్దన్‌ను పలువురు అభినందించారు. -
తొలిసారిగా నిశ్శబ్ద ఎమ్మారై
ఎప్పుడైనా మీరు ఎమ్మారై తీయించుకోవడం గానీ, ఎవరికైనా దగ్గరుండి తీయించడం గానీ జరిగిందా? ఆ సమయంలో దాదాపు చిన్న స్థాయి విమానం వెళ్తున్నంత శబ్దం వస్తుంటుంది. కానీ అసలు ఏమాత్రం శబ్దం చేయకుండా నిశ్శబ్దంగా తన పని తాను చేసుకెళ్లిపోయే ఎమ్మారైని తొలిసారిగా కొచ్చిలోని అమృతా హాస్పిటల్లో ఏర్పాటు చేశారు. జీఈ కంపెనీ రూపొందించిన ఈ సైలెంట్ స్కాన్ టెక్నాలజీతో అసలు శబ్దం చేయని ఎమ్మారైని అమృతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఏఐఎంఎస్)లో ఏర్పాటుచేశారు. సాధారణ ఎమ్మారైల నుంచి 110 డెసిబుల్స్ శబ్దం వస్తుంది. ఇది స్టీలు మిల్లు నడుస్తున్నప్పుడు, లేదా విమానం ఇంజన్ వస్తున్నప్పుడు, బాగా ట్రాఫిక్ ఎక్కువ ఉన్నప్పుడు వెలువడే శబ్దానికి సమానం. కొత్త ఎమ్మారై యంత్రం మాత్రం అస్సలు శబ్దమన్నదే చేయకుండా కామ్‌గా ఉంటుందని జీఈ హెల్త్ కేర్ ఎమ్మారై ఇమేజింగ్ సీనియర్ డైరెక్టర్ డాక్టర్ కార్తీక్ కుప్పుస్వామి తెలిపారు. దీనివల్ల రోగులకు ప్రశాంతంగా ఉంటుందని, ఎలాంటి ఇబ్బంది ఉండబోదని ఆయన అన్నారు. ఎమ్మారై తీయించుకునేటప్పుడు రోగి ఏమాత్రం కదిలినా.. దాని రిపోర్టు నాణ్యతలో తేడా వస్తుంది. శబ్దం రావడం వల్ల రోగి అసౌకర్యంగా ఫీలై.. ఎంతో కొంత కదులుతారు. ఆ సమస్య ఈ సైలెంట్ ఎమ్మారైతో ఉండబోదని అంటున్నారు. ఈ కొత్త మిషన్‌ను మెదడుతో పాటు కాలేయం స్కానింగ్‌కు కూడా ఉపయోగించవచ్చట.