చనిపోయాడనుకున్న వ్యక్తి అంబులెన్స్‌లో బతికొచ్చిన వైనం
కొల్హాపూర్: వైద్యుడు నిర్లక్ష్యంగా ఓ రోగి చనిపోయాడని చెప్పినా ఒక స్పీడ్‌బ్రేకర్ (Speed Breaker) కారణంగా ఆ రోగి మళ్లీ బతికొచ్చిన వైనం మహారాష్ట్రలో (Maharashtra) చోటుచేసుకుంది. రెండు వారాల క్రితం జరిగిన ఈ వింత ఘటన తాలూకు వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. గత ఏడాది డిసెంబర్ 16వ తేదీన కొల్హాపూర్ జిల్లాలోని (Kolhapur District) కసాబా–బావడా ప్రాంతానికి చెందిన 65 ఏళ్ల పాండురంగ ఉల్పే అనే వ్యక్తికి గుండెపోటు రావడంతో వెంటనే హుటాహుటిన దగ్గర్లోని ఆస్పత్రిలో చేరారు.
అయితే అప్పటికే ఆయన మృతిచెందినట్లు ఆ ఆస్పత్రిలోని వైద్యులు ప్రకటించారు. దీంతో మృతదేహాన్ని తిరిగి సొంతూరుకు తీసుకెళ్లేందుకు ఒక అంబులెన్సును సిద్ధంచేశారు. పాండురంగ పరమపదించారన్న వార్త అప్పటికే సొంతూరిలో పాకింది. వెంటనే బంధువులు, స్నేహితులు, తెల్సిన వాళ్లు ఇంటికి రావడం మొదలెట్టారు. అందరూ ఇంటి వద్ద వేచి చూస్తుండటంతో మృతదేహాన్ని త్వరగా ఇంటికి తరలించాలన్న ఆత్రుతలో అంబులెన్సుకు డ్రైవర్ వేగంగా పోనిచ్చాడు.
మార్గమధ్యంలో రహదారిపై ఉన్న ఒక పెద్ద స్పీడ్‌బ్రేకర్‌ను చూడకుండా అలాగే వేగంగా పోనిచ్చాడు. దీంతో వాహనం భారీ కుదుపులకు లోనైంది. ఈ సమయంలో పాండురంగ శరీరం అటుఇటూ కదలిపోయింది. తర్వాత శరీరాన్ని స్ట్రెచర్‌పైకి సవ్యంగా జరిపేటప్పుడు పాండురంగ చేతి వేళ్లు కదలడం చూసి ఆయన భార్య హుతాశురాలైంది. వెంటనే అంబులెన్సుకు ఇంటికి బదులు దగ్గర్లోని మరో ఆస్పత్రికి పోనిచ్చి పాండురంగను ఐసీయూలో చేర్పించారు.
ఆయన ఇంకా ప్రాణాలతో ఉన్నారని తేల్చిన అక్కడి వైద్యులు పాండురంగకు వెంటనే యాంజియోప్లాస్టీ చేశారు. రెండు వారాల తర్వాత ఆయన పూర్తిగా కోలుకుని సోమవారం ఇంటికొచ్చారు. దీంతో ఆశ్చర్యపోవడం అందరి వంతైంది. ‘‘ఆ స్పీడ్‌బ్రేకర్ లేకపోయి ఉంటే మా ఆయన ఇలా ఇంటికి కాకుండా నేరుగా శ్మశానానికే వెళ్లేవారు’’ అని పాండురంగ భార్య నవ్వుతూ చెప్పారు. బతికున్న రోగిని చనిపోయాడని సర్టిఫై చేసిన ఆస్పత్రిపై చర్యలు తీసుకోవాలని పాండురంగ కుటుంబం నిర్ణయించుకుంది. త్వరలో ఆస్పత్రికి నోటీసులు పంపి కోర్టుకీడుస్తామని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment