speed breaker
-
‘స్పీడ్ బ్రేకర్’ ప్రాణం పోసింది!
కొల్హాపూర్: వైద్యుడు నిర్లక్ష్యంగా ఓ రోగి చనిపోయాడని చెప్పినా ఒక స్పీడ్‌బ్రేకర్ (Speed Breaker) కారణంగా ఆ రోగి మళ్లీ బతికొచ్చిన వైనం మహారాష్ట్రలో (Maharashtra) చోటుచేసుకుంది. రెండు వారాల క్రితం జరిగిన ఈ వింత ఘటన తాలూకు వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. గత ఏడాది డిసెంబర్ 16వ తేదీన కొల్హాపూర్ జిల్లాలోని (Kolhapur District) కసాబా–బావడా ప్రాంతానికి చెందిన 65 ఏళ్ల పాండురంగ ఉల్పే అనే వ్యక్తికి గుండెపోటు రావడంతో వెంటనే హుటాహుటిన దగ్గర్లోని ఆస్పత్రిలో చేరారు.అయితే అప్పటికే ఆయన మృతిచెందినట్లు ఆ ఆస్పత్రిలోని వైద్యులు ప్రకటించారు. దీంతో మృతదేహాన్ని తిరిగి సొంతూరుకు తీసుకెళ్లేందుకు ఒక అంబులెన్సును సిద్ధంచేశారు. పాండురంగ పరమపదించారన్న వార్త అప్పటికే సొంతూరిలో పాకింది. వెంటనే బంధువులు, స్నేహితులు, తెల్సిన వాళ్లు ఇంటికి రావడం మొదలెట్టారు. అందరూ ఇంటి వద్ద వేచి చూస్తుండటంతో మృతదేహాన్ని త్వరగా ఇంటికి తరలించాలన్న ఆత్రుతలో అంబులెన్సుకు డ్రైవర్ వేగంగా పోనిచ్చాడు.మార్గమధ్యంలో రహదారిపై ఉన్న ఒక పెద్ద స్పీడ్‌బ్రేకర్‌ను చూడకుండా అలాగే వేగంగా పోనిచ్చాడు. దీంతో వాహనం భారీ కుదుపులకు లోనైంది. ఈ సమయంలో పాండురంగ శరీరం అటుఇటూ కదలిపోయింది. తర్వాత శరీరాన్ని స్ట్రెచర్‌పైకి సవ్యంగా జరిపేటప్పుడు పాండురంగ చేతి వేళ్లు కదలడం చూసి ఆయన భార్య హుతాశురాలైంది. వెంటనే అంబులెన్సుకు ఇంటికి బదులు దగ్గర్లోని మరో ఆస్పత్రికి పోనిచ్చి పాండురంగను ఐసీయూలో చేర్పించారు. ఆయన ఇంకా ప్రాణాలతో ఉన్నారని తేల్చిన అక్కడి వైద్యులు పాండురంగకు వెంటనే యాంజియోప్లాస్టీ చేశారు. రెండు వారాల తర్వాత ఆయన పూర్తిగా కోలుకుని సోమవారం ఇంటికొచ్చారు. దీంతో ఆశ్చర్యపోవడం అందరి వంతైంది. ‘‘ఆ స్పీడ్‌బ్రేకర్ లేకపోయి ఉంటే మా ఆయన ఇలా ఇంటికి కాకుండా నేరుగా శ్మశానానికే వెళ్లేవారు’’ అని పాండురంగ భార్య నవ్వుతూ చెప్పారు. బతికున్న రోగిని చనిపోయాడని సర్టిఫై చేసిన ఆస్పత్రిపై చర్యలు తీసుకోవాలని పాండురంగ కుటుంబం నిర్ణయించుకుంది. త్వరలో ఆస్పత్రికి నోటీసులు పంపి కోర్టుకీడుస్తామని పేర్కొంది. -
శభాష్...రేణుక!
పుట్లూరు: రోడ్డుపై ఉన్న స్పీడ్ బ్రేకర్‌ను గమనించక చాలా మంది వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. రెండు రోజుల క్రితం యల్లనూరుకు వెళ్తున్న ఓ మహిళ బైక్‌పై నుంచి జారి పడి మృతి చెందింది. తాడిపత్రి–యల్లనూరు ప్రధాన రోడ్డుపై శనగలగూడూరు వద్ద స్పీడ్ బ్రేకర్ వల్ల వాహనదారులు పడుతున్న ఇబ్బందులను ఆ గ్రామ వలంటీర్ రేణుక గమనించింది. ప్రమాదాలను నివారించడానికి తనవంతు ప్రయత్నం చేసింది. తెల్ల పెయింట్‌తో స్లో అని ఆంగ్లంలో అక్షరాలు రాయడంతో పాటు స్పీడ్ బ్రేకర్ కనిపించేలా సూచిక ఏర్పాటు చేసింది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు శభాష్ రేణుక అని అభినందిస్తున్నారు. -
ప్రాణం తీసిన స్పీడ్ బ్రేకర్..!
కరీంనగర్: రాత్రి సమయంలో బైక్ స్పీడ్ బ్రేకర్ పైనుంచి వెళ్లడంతో ఓ యువకుడు ఎగిరి బండరాయిపై పడి, అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. చిగురుమామిడి మండలంలోని నవాబుపేట్‌కు చెందిన బోయిని అజయ్(27) శుక్రవారం ద్విచక్రవాహనంపై హుస్నాబాద్ వెళ్లాడు. రాత్రి 9.30 గంటల సమయంలో స్వగ్రామం వస్తున్నాడు. గ్రామ క్రాసింగ్ వద్ద స్పీడ్ బ్రేకర్‌ను గమనించకుండా వెళ్లడంతో ఎగిరి బండరాయిపై పడ్డాడు. అతని తలకు తీవ్ర గాయాలై సంఘటన స్థలంలోనే ప్రాణాలు వదిలాడు. మృతుడికి తల్లి అనసూర్య, తండ్రి లక్ష్మయ్య, ఒక అక్క, చెల్లెలు ఉన్నారు. అక్కకు వివాహం చేశారు. అజయ్ అవివాహితుడు కాగా హుస్నాబాద్‌లోని ఓ ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. -
స్పీడ్‌బ్రేకర్ వద్ద మృత్యుఘోష
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో బెంగళూరు – మంగళూరు జాతీయ రహదారిపై హాసన్ సమీపంలో భువనహళ్లి బైపాస్ వద్ద క్వాలిస్ – టాటా సుమో ఢీకొన్నాయి. ప్రమాదంలో క్వాలిస్‌లోని ప్రదీప్ కుమార్ (26), చంద్రశేఖర్ (28), నవీన్ కుమార్ (30), సునీల్ (25), అనిల్ కుమార్ (32) అనే ఐదుగురు మృతి చెందినట్లు గుర్తించారు. అందరూ కోలారు జిల్లా కేజీఎఫ్ పట్టణానికి చెందినవారు. ఒకరు పెళ్లికి, మరొకరు పుణ్యక్షేత్రానికి.. కేజీఎఫ్‌కు చెందిన 8 మంది క్వాలిస్‌లో ఉడుపిలో జరిగే వివాహానికి బయలుదేరారు. కోలారు జిల్లా ముళబాగిలుకు చెందిన 10 మంది టాటా సుమోలో ధర్మస్థల పుణ్యక్షేత్రానికి వెళ్తున్నారు. ప్రమాదస్థలి వద్ద స్పీడ్ బ్రేకర్ ఉండటంతో టాటా సుమో నెమ్మది అయ్యింది. వెనుక వస్తున్న క్వాలిస్ వేగం అదుపు చేయలేక సుమోను ఢీకొట్టగా రెండు వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. ఘటనా స్థలంలోనే క్వాలిస్‌లోని నలుగురు దుర్మరణం చెందగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. టాటా సుమోలో ప్రయాణిస్తూ గాయపడిన వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను హాసన్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. మొత్తం 13 మందికి గాయాలయ్యాయి. ప్రమాదాల నిలయం.. వారం రోజుల క్రితమే మంగళూరు జాతీయ రహదారిపై చెన్నరాయపట్టణ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. రోడ్డును ఇష్టానుసారం మలుపులతో నిర్మించడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. వేగ నియంత్రణ సూచికలు లేవు. అండర్‌పాస్‌లు ఉన్న చోట ఎలాంటి సూచిక బోర్డులు లేవు. మలుపుల వద్ద రోడ్డు నిర్మాణం సరిగా లేకపోవడంతో వాహనాలు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొన్న ఘటనలు ఎన్నో ఉన్నాయి. దీనికి తోడు బెంగళూరు – మంగళూరు నాలుగు లేన్లను రెండుకు కుదించడంతో సమస్య ఏర్పడుతోంది. చదవండి: రోడ్డు ప్రమాదం: మృతదేహంతో 10 కిమీ ప్రయాణం ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న బీజేపీ ఎంపీ -
ఎర్లీ ఎలక్షన్స్‌కు స్పీడ్ బ్రేకర్?
-
రోడ్డుప్రమాదంలో టీచర్ దుర్మరణం
రాయచోటి, న్యూస్‌లైన్: రాయచోటిలోని లక్కిరెడ్డిపల్లె మార్గంలో రింగ్ రోడ్డు వద్ద స్పీడ్ బ్రేకర్ దాటుతుండగా స్కూటర్‌పై నుంచి జారిపడిన ఘటనలో వసంతలక్ష్మి (47) అనే ఉపాధ్యాయురాలు మృతి చెందింది. లక్కిరెడ్డిపల్లెకు చెందిన అయ్యల సోమయాజుల బాలసుబ్రహ్మణ్యం భార్య వసంతలక్ష్మి పెనగలూరు మండలం చక్రంపేట ఉన్నత పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. ప్రతి రోజు రాయచోటికి చేరుకొని అక్కడి నుంచి చక్రంపేటకు వెళ్లేవారు. బుధవారం ఉదయం స్కూల్‌కు వెళ్లి తిరిగి బస్సులో రాయచోటికి రాత్రి 8గంటలకు చేరుకున్నారు. ప్రతి రోజు స్కూటర్‌పై ఆమెను భర్త బైక్‌లో ఇంటికి తీసుకెళ్లేవారు. బుధవారం రాత్రి ఆమె భర్తకు పని ఉండడంతో మరొక వ్యక్తికి స్కూటర్ ఇచ్చి పంపారు. రాయచోటి నుంచి వారు స్కూటర్‌పై బయలుదేరగా రింగ్ రోడ్డు వద్ద అదే రోజు ఉదయమే ఎత్తుగా వేసిన స్పీడ్ బ్రేకర్‌ను గమనించకుండా దాటుతుండగా వెనకవైపు కుర్చొని ఉన్న ఆమె ఎగిరి రోడ్డుపై పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆమె తల వెనకవైపు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండటంతో తిరుపతికి రెఫర్ చేశారు. స్విమ్స్‌కు తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని గురువారం రాయచోటి ఆస్పత్రికి తీసుకొచ్చారు. మృతురాలికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. స్పీడ్ బ్రేకర్ ఎత్తు ఎక్కువగా ఉండడం, అక్కడ సూచికలు లేకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగింది. విషయం తెలిసి ఆర్అండ్బీ అధికారులు అప్పటికప్పుడే జేసీబీతో స్పీడ్ బ్రేకర్‌ను తొలగించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.