ప్రమాదంలో నుజ్జునుజ్జుయిన వాహనాలు
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో బెంగళూరు – మంగళూరు జాతీయ రహదారిపై హాసన్ సమీపంలో భువనహళ్లి బైపాస్ వద్ద క్వాలిస్ – టాటా సుమో ఢీకొన్నాయి. ప్రమాదంలో క్వాలిస్‌లోని ప్రదీప్ కుమార్ (26), చంద్రశేఖర్ (28), నవీన్ కుమార్ (30), సునీల్ (25), అనిల్ కుమార్ (32) అనే ఐదుగురు మృతి చెందినట్లు గుర్తించారు. అందరూ కోలారు జిల్లా కేజీఎఫ్ పట్టణానికి చెందినవారు.
ఒకరు పెళ్లికి, మరొకరు పుణ్యక్షేత్రానికి..
కేజీఎఫ్‌కు చెందిన 8 మంది క్వాలిస్‌లో ఉడుపిలో జరిగే వివాహానికి బయలుదేరారు. కోలారు జిల్లా ముళబాగిలుకు చెందిన 10 మంది టాటా సుమోలో ధర్మస్థల పుణ్యక్షేత్రానికి వెళ్తున్నారు. ప్రమాదస్థలి వద్ద స్పీడ్ బ్రేకర్ ఉండటంతో టాటా సుమో నెమ్మది అయ్యింది. వెనుక వస్తున్న క్వాలిస్ వేగం అదుపు చేయలేక సుమోను ఢీకొట్టగా రెండు వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. ఘటనా స్థలంలోనే క్వాలిస్‌లోని నలుగురు దుర్మరణం చెందగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. టాటా సుమోలో ప్రయాణిస్తూ గాయపడిన వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను హాసన్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. మొత్తం 13 మందికి గాయాలయ్యాయి.
ప్రమాదాల నిలయం..
వారం రోజుల క్రితమే మంగళూరు జాతీయ రహదారిపై చెన్నరాయపట్టణ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. రోడ్డును ఇష్టానుసారం మలుపులతో నిర్మించడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. వేగ నియంత్రణ సూచికలు లేవు. అండర్‌పాస్‌లు ఉన్న చోట ఎలాంటి సూచిక బోర్డులు లేవు. మలుపుల వద్ద రోడ్డు నిర్మాణం సరిగా లేకపోవడంతో వాహనాలు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొన్న ఘటనలు ఎన్నో ఉన్నాయి. దీనికి తోడు బెంగళూరు – మంగళూరు నాలుగు లేన్లను రెండుకు కుదించడంతో సమస్య ఏర్పడుతోంది.
చదవండి:
రోడ్డు ప్రమాదం: మృతదేహంతో 10 కిమీ ప్రయాణం
ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న బీజేపీ ఎంపీ
Comments
Please login to add a commentAdd a comment