రాయచోటి, న్యూస్‌లైన్: రాయచోటిలోని లక్కిరెడ్డిపల్లె మార్గంలో రింగ్ రోడ్డు వద్ద స్పీడ్ బ్రేకర్ దాటుతుండగా స్కూటర్‌పై నుంచి జారిపడిన ఘటనలో వసంతలక్ష్మి (47) అనే ఉపాధ్యాయురాలు మృతి చెందింది. లక్కిరెడ్డిపల్లెకు చెందిన అయ్యల సోమయాజుల బాలసుబ్రహ్మణ్యం భార్య వసంతలక్ష్మి పెనగలూరు మండలం చక్రంపేట ఉన్నత పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. ప్రతి రోజు రాయచోటికి చేరుకొని అక్కడి నుంచి చక్రంపేటకు వెళ్లేవారు. బుధవారం ఉదయం స్కూల్‌కు వెళ్లి తిరిగి బస్సులో రాయచోటికి రాత్రి 8గంటలకు చేరుకున్నారు. ప్రతి రోజు స్కూటర్‌పై ఆమెను భర్త బైక్‌లో ఇంటికి తీసుకెళ్లేవారు. బుధవారం రాత్రి ఆమె భర్తకు పని ఉండడంతో మరొక వ్యక్తికి స్కూటర్ ఇచ్చి పంపారు.
రాయచోటి నుంచి వారు స్కూటర్‌పై బయలుదేరగా రింగ్ రోడ్డు వద్ద అదే రోజు ఉదయమే ఎత్తుగా వేసిన స్పీడ్ బ్రేకర్‌ను గమనించకుండా దాటుతుండగా వెనకవైపు కుర్చొని ఉన్న ఆమె ఎగిరి రోడ్డుపై పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆమె తల వెనకవైపు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండటంతో తిరుపతికి రెఫర్ చేశారు. స్విమ్స్‌కు తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు.
మృతదేహాన్ని గురువారం రాయచోటి ఆస్పత్రికి తీసుకొచ్చారు. మృతురాలికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. స్పీడ్ బ్రేకర్ ఎత్తు ఎక్కువగా ఉండడం, అక్కడ సూచికలు లేకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగింది. విషయం తెలిసి ఆర్‌అండ్‌బీ అధికారులు అప్పటికప్పుడే జేసీబీతో స్పీడ్ బ్రేకర్‌ను తొలగించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డుప్రమాదంలో టీచర్ దుర్మరణం
Published Fri, Feb 28 2014 2:36 AM | Last Updated on Sat, Sep 2 2017 4:10 AM
Advertisement