లక్డీకాపూల్: తమ దేశంలో కిడ్నీ బాధితులకు ఎక్కువ కాలం డయాలసిస్ చేయమని.. కిడ్నీ మార్పిడికే ప్రాధాన్యత ఇస్తామని నెదర్లాండ్స్ ఆరోగ్య, సంక్షేమ, క్రీడల శాఖ మంత్రి ప్రొఫెసర్ ఎర్నెస్ట్ కైపర్స్ తెలిపారు. తెలంగాణలోని వైద్య సేవలను అధ్యయనం చేసేందుకు వచ్చిన ఆయన గురువారం నిమ్స్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలోని లివర్ డయాలసిస్, మెడికల్ ఆంకాలజీ, యూరాలజీ విభాగాలను పరిశీలించి రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు.
స్క్రీనింగ్ కేన్సర్, మామోగ్రామ్, రొమ్ము కేన్సర్, సర్వైకల్ కేన్సర్‌కు అందిస్తున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిమ్స్ లెర్నింగ్ సెంటర్‌లో నిమ్స్ వైద్యులతో ఏర్పాటు చేసిన ఇంటరాక్టివ్ సెషన్‌లో పాల్గొన్న కైపర్స్... నెదర్లాండ్స్‌లోని వైద్య సేవల తీరును వివరించారు. అత్యవసర చికిత్స అవసరమయ్యే రోగులను తమ దేశంలో హెలికాప్టర్లలో ఆస్పత్రికి తరలిస్తామని చెప్పారు.
కోవిడ్ తర్వాత ఎదురవుతున్న పరిణామాల నేపథ్యంలో నిమ్స్‌తో కలసి ఓ వ్యాక్సిన్ రూపొందించాలన్న యోచనలో ఉన్నట్లు కైపర్స్ తెలిపారు. అలాగే వైద్యవిద్యపై ఎక్సే్ఛంజ్ ప్రోగ్రాం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. బ్యాక్టీరియా, యాంటీబయోటెక్ డ్రగ్స్‌పై పరిశోధనలకు నిమ్స్‌తో ఒప్పందం చేసుకున్నట్లు కైపర్స్ వివరించారు.
తెలంగాణలో వైద్య సేవలు బాగున్నాయి..
రాష్ట్రంలో అమలు చేస్తున్న ఆరోగ్య పథకాలు బాగున్నాయని నెదర్లాండ్స్ మంత్రి ఎర్నెస్ట్ కైపర్స్ ప్రశంసించారు. తెలంగాణలో పదేళ్ల కాలంలో మాతాశిశు మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించడం గొప్ప విషయమని... అందుకే తెలంగాణ వైద్యపరంగా నీతి అయోగ్ లెక్కల ప్రకారం 11 స్థానం నుంచి 3వ స్ధానానికి చేరిందన్నారు.
కాగా, రాష్ట్రంలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లోనే ట్రామా సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం యోచిస్తోందని నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ నగరి బీరప్ప తెలిపారు. 50 పడకలతో కూడిన ఈ సెంటర్లలో అన్ని రకాల అత్యవసర వైద్యసేవలను అందించేలా చర్యలు తీసుకుంటోందన్నారు.
నెదర్లాండ్స్ మంత్రి కైపర్స్, ఆ దేశ ప్రతినిధి బృందాన్ని ఆయన ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో నిమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ నిమ్మ సత్యనారాయణ, డీన్ డాక్టర్ లిజా రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment