పాక్‌ వలపు వల.. గుట్టు రట్టు | Pakistan Honey Trap Busted in Hyderabad | Sakshi
Sakshi News home page

పాక్‌ వలపు వల? l

Published Sun, Nov 17 2019 9:43 AM | Last Updated on Sun, Nov 17 2019 2:08 PM

Pakistan Honey Trap Busted in Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ కాల్స్‌ను లోకల్‌ కాల్స్‌గా మార్చే ప్రైవేటు టెలిఫోన్‌ ఎక్స్చేంజ్‌ గుట్టు రట్టయింది. దేశంలోని ఆర్మీ అధికారులకు హనీట్రాప్‌ ద్వారా వల వేసేందుకు యత్నిస్తున్న పాకిస్తాన్‌ గూడచార సంస్థ ఐఎస్‌ఐ కుట్రను నగర టాస్క్‌ఫోర్స్, మిలిటరీ ఇంటెలిజెన్స్‌ సంయుక్త ఆపరేషన్‌ ద్వారా ఛేదించారు. నిందితులంతా అత్యాధునిక వీఓఐపీ (వాయిస్‌ ఓవర్‌ ఇంటర్‌నెట్‌ ప్రొటోకాల్‌) సాంకేతికతను ఉపయోగించి ఈ పనికి పాల్పడుతున్నట్లు వెల్లడైంది. అత్యాధునిక సాంకేతిక పరికరాలు, ఇంటర్‌నెట్‌ సాయంతో తక్కువ చార్జీలతో విదేశాలకు ఫోన్‌కాల్స్‌ మాట్లాడుకోడానికి వేసే ఎత్తుగడే వీఓఐపీ. ఈ విధానం ద్వారా విదేశాల నుంచి కాల్స్‌ వచ్చినా, దాన్ని రిసీవ్‌ చేసుకునేవారికి లోకల్‌ నంబరుతోనే డిస్‌ప్లే అవుతుంది. ఒకవేళ తిరిగి ఆ నంబరుకు కాల్‌ చేసినా అది కనెక్ట్‌ కాదు.

బయటపడింది ఇలా?..
ఇటీవల ఢిల్లీలో పనిచేసే ఇద్దరు ఆర్మీ అధికారులకు అనుమానాస్పద కాల్స్‌ వచ్చాయి. తిరిగి కాల్‌ చేస్తే కలవలేదు. అనుమానంతో మిలిటరీ ఇంటెలిజెన్స్‌కు సమాచారమిచ్చారు. వారు నగర పోలీసులను అప్రమత్తం చేయడంతో సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ రంగంలోకి దిగింది. మొత్తానికి ఢిల్లీలో తీగలాగితే ఎప్పట్లాగే హైదరాబాద్‌లో డొంక కదిలింది. సదరు కాల్స్‌ చాంద్రాయణగుట్ట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఇస్మాయిల్‌ నగర్‌లోని ఓ గేటెడ్‌ కమ్యూనిటీ నుంచి నుంచి వస్తున్నట్లుగా గుర్తించారు. పోలీసుల రాకను గుర్తించిన ప్రైవేట్‌ టెలిఫోన్‌ ఎక్సే్ఛంజ్‌ నిర్వాహకులు పారిపోయారు. పోలీసులు ప్రైవేట్‌ టెలిఫోన్‌ ఎక్సే్ఛంజ్‌కు సంబంధించిన పలు పరికరాలను, నగరం చిరునామాతో ఉన్న 60 సిమ్‌కార్డులను స్వాధీనం చేసుకున్నారు.  దీని వెనుక ఇమ్రాన్‌ఖాన్, మహమ్మద్‌ అక్బర్‌ అనే పాత నేరస్థుల హస్తం ఉందన్న సమాచారంతో వారి కోసం గాలిస్తున్నారు. ఇలా శత్రుదేశం నుంచి వచ్చే కాల్స్‌ను మన ఆర్మీ అధికారులకు డైవర్ట్‌ చేయడం కొత్త అనుమానాలకు దారి తీస్తోంది. పరారీలో ఉన్న అనుమానితులు చిక్కితేనే పాకిస్తాన్‌ నుంచి వచ్చే కాల్స్‌ను డైవర్ట్‌ చేయాల్సిన అవసరమేం వచ్చింది? ఆర్మీ అధికారులను ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారన్న విషయాలు వెల్లడయ్యే అవకాశముంది. దీన్ని హనీట్రాప్‌గానూ అనుమానిస్తున్న అధికారులు ఆ కోణంలోనూ విచారణ జరుపుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement