చైనాపై భారత్‌ ఏఐ నిఘా.. చీమ చిటుక్కుమన్నా.. | Artificial Intelligence surveillance eye on China | Sakshi
Sakshi News home page

చైనాపై భారత్‌ ఏఐ నిఘా.. చీమ చిటుక్కుమన్నా..

Published Mon, Oct 25 2021 5:11 AM | Last Updated on Mon, Oct 25 2021 1:58 PM

Artificial Intelligence surveillance eye on China - Sakshi

సరిహద్దుల్లో చైనా కవ్వింపులకు దిగుతోంది! లద్దాఖ్, అరుణాచల్‌ ప్రదేశ్‌లలో... చడీచప్పుడు లేకుండా బలగాలను మోహరించడం... రోడ్లు, వంతెనలు మాత్రమే కాదు..   రాత్రికి రాత్రి డజన్ల కొద్దీ నిర్మాణాలను కూడా కట్టేస్తూ ఇబ్బంది పెట్టేస్తోంది! ఈ నేపథ్యంలో రోజురోజుకూ క్లిష్టతరమవుతున్న సరిహద్దుల రక్షణకు... భారత ప్రభుత్వం కృత్రిమ మేధను రంగంలోకి దింపేందుకు సిద్ధమవుతోంది!! వాస్తవాదీన రేఖకు ఆవల.. చీమ చిటుక్కుమన్నా గుర్తించేందుకు... అందుకు తగ్గట్టుగా ప్రమాదాన్ని అంచనా వేసేందుకూ మనుషుల్లా ఆలోచించే సాఫ్ట్‌వేర్‌లు 24 గంటలూ పనిచేయనున్నాయి!!

సాక్షి, హైదరాబాద్‌: చైనా, పాకిస్తాన్‌ వంటి శత్రుదేశాల నుంచి తనను తాను కాపాడుకునేందుకు భారత్‌ తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఒకవైపు సరిహద్దుల్లో రోడ్లు వంతెనలు, విమానాశ్రయాల వంటి మౌలిక సదుపాయాలను పెంచుకుంటూనే... ఇంకోవైపు అత్యాధునిక టెక్నాలజీల సాయంతో శత్రువు ఆనుపానులు పసిగట్టే ప్రయత్నాలనూ వేగవంతం చేసింది. ఇటీవలి కాలంలో చైనాతో కొనసాగుతున్న సరిహద్దు సమస్యల నేపథ్యంలో దేశం తూర్పు విభాగంలో నిఘాను మరింత కట్టుదిట్టం చేసేందుకు కృత్రిమ మేధ సాయం తీసుకుంటోంది.   

జంతువుల కదలికలూ గుర్తించేలా...
వాస్తవాదీన రేఖ వెంబడి నిఘా పెట్టేందుకు మానవరహిత విమానాలు, రాడార్లు అమర్చిన హెలికాప్టర్లు ఇప్పటికే పని చేస్తున్నాయి. వీటితోపాటు ఉపగ్రహాల నుంచి అందే ఛాయాచిత్రాలు, నేలపై వేర్వేరు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సెన్సర్లు అన్నీ ఎప్పటికప్పుడు చైనా సైన్యం కదలికలకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తున్నాయి. ఇలా వేర్వేరు మార్గాల ద్వారా అందే సమాచారాన్ని అరుణాచల్‌ ప్రదేశ్‌లోని ‘రూపా’లో ఏర్పాటు చేసిన నిఘా కేంద్రంలో విశ్లేషిస్తుంటారు. కృత్రిమమేధ సాయంతో వీడియోలను, ఛాయాచిత్రాలను కలిపి కదలికలను స్పష్టంగా గుర్తిస్తున్నారు. ఈ శ్రమ వృథా పోవడం లేదు.

చైనా సైన్యంలో ఎంత మంది ఉన్నారు? ఏ రకమైన వాహనాలు వాడుతున్నారు? సరిహద్దుల వెంబడి ఎలాంటి మౌలిక సదుపాయాల నిర్మాణం జరిగిందన్న సమాచారం ఎప్పటికప్పుడు తెలుస్తోంది. వీటి ఆధారంగా చైనా దూకుడుకు కళ్లెం వేసే అవకాశం లభిస్తోంది. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. సరిహద్దులకు అవల సైనికుల రవాణా జరగుతోందా? లేక గొర్రెలు, ఆవుల్లాంటి జంతువులు కదులుతున్నాయా? అన్నది కూడా కృత్రిమ మేధ సాయంతో పనిచేసే నిఘా సాఫ్ట్‌వేర్‌ ద్వారా తెలుసుకోగలగడం!!

డీఆర్‌డీవో ప్రయత్నాలూ ముమ్మరం...
భవిష్యత్తు యుద్ధాలన్నీ సైబర్‌ యుద్ధాలే అన్న అంచనా రూఢీ అవుతున్న నేపథ్యంలో దేశ రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ కృత్రిమ మేధ, రోబోటిక్స్‌ వంటి అత్యాధునిక టెక్నాలజీలను అన్ని స్థాయిల్లో వాడేందుకు రంగం సిద్ధం చేస్తోంది. యుద్ధరంగంలో కృత్రిమ మేధ ఆధారిత ఆయుధ వ్యవస్థలను దింపడం చాలా సులువు. శత్రు భయంకరం కూడా. కంటికి కనిపించకుండానే శత్రువుకు విపరీతమైన నష్టాన్ని కలుగచేస్తాయి.

ఇదంతా జరిగేందుకు కేవలం మూడు నాలుగేళ్లు సరిపోతుందని... అయితే ఈ ప్రక్రియ ఇప్పటికే మొదలైందంటున్నారు మిలటరీ నిపుణులు. డీఆర్‌డీవోకు చెందిన సెంటర్‌ ఫర్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రోబోటిక్స్‌ దాదాపు 150 మంది ఇంజినీర్ల సాయంతో ఏఐ రోబోటిక్స్, నియంత్రణ వ్యవస్థల ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తోంది. శత్రువులకు చిక్కకుండా రహస్యంగా సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునేందుకు అవసరమైన నెట్‌వర్క్‌లూ ఇందులో ఉన్నాయి.  

ఫేషియల్‌ రికగ్నిషన్‌కూ... ఏఐ!
బస్టాండ్లు మొదలుకొని విమానాశ్రయాల వరకూ చాలాచోట్ల ముఖాలను గుర్తించే సాఫ్ట్‌వేర్లతో కూడిన కెమెరాలు సహజంగానే ఉం టాయి. కానీ.. మిలటరీ విషయానికి వచ్చేసరికి వీటి పాత్ర పరిమితమైంందే! ఈ నేపథ్యంలోనే కృత్రిమ మేధను ఉపయోగించుకుని అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లోనూ ముఖాలను గుర్తించే సాఫ్ట్‌వేర్‌ ఒకదాన్ని తయారు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

అస్సాం ఎలక్ట్రానిక్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఇజ్రాయెల్‌ సంస్థ కోర్‌సైట్‌ ఏఐలు కలిసికట్టుగా కొత్త సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేయనున్నాయి. ఈ సాఫ్ట్‌వేర్‌తో వెలుతురు బాగా తక్కువగా ఉన్న చోట్ల మాత్రమే కాదు... అతిక్లిష్టమైన కోణాల్లోంచి.. వేగంగా కదులుతున్నా, గుంపులో కొందరిని మాత్రమే కూడా గుర్తుపట్టి ఫొటోలు తీయవచ్చు. అంతేకాకుండా.. ముఖంలో సగం కప్పి ఉంచుకున్నా గుర్తించేలా ఈ కొత్త సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేస్తున్నారు.

మానవ రహిత వాహనాలు
డీఆర్‌డీవో సంస్థలు కృత్రిమ మేధతో పనిచేసే రోబోలు కొన్నింటిని ఇప్పటికే తయారు చేశాయి. వీటిల్లో శత్రుస్థావరాల పరిశీలన, నిఘా పెట్టే ఓ రోబో ఉంది. గోడలెక్కే, నాలుగు, ఆరు కాళ్లతో నడవగలిగిన రోబోలూ రెడీగా ఉన్నాయి.

యుద్ధం లేదా ఘర్షణల్లో గాయపడ్డ సైనికులను వేగంగా యుద్ధభూమి నుంచి బయటకు తరలించేందుకు స్మార్ట్‌ వీల్‌చె యిర్లు, ఇంటర్నెట్‌ ట్రాఫిక్‌పై నిఘా పెట్టేందుకు నెట్‌వర్క్‌ ట్రాఫిక్‌ అనాలసిస్‌ (నేత్ర) వ్యసవ్థలను కూడా సిద్ధం చేసింది డీఆర్‌డీవో. గత ఏడాది జనవరిలో లక్నోలో జరిగిన ‘డిఫెన్స్‌ ఎక్స్‌పో’లో వీటిని ప్రదర్శించారు కూడా.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement