Facial Recognition
-
నేటి నుంచి సెక్రటేరియట్లో ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్..
-
ఇక అన్ని స్కూళ్లలో ‘ఫేషియల్ రికగ్నిషన్’
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో ఇక నుంచి పూర్తి స్థాయిలో ఫేషియల్ రికగ్నిషన్ హాజరు విధానాన్ని అమలు చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి తాజాగా అన్ని స్కూళ్లకు పాఠశాల విద్య డైరెక్టర్ కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని 26 వేల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు నమోదును పారదర్శకంగా నిర్వహించేందుకు ఫేషియల్ రికగ్నిషన్ విధానాన్ని ప్రవేశపెట్టారు. దీనివల్ల హాజరు విధానంలో అక్రమాలకు ఆస్కారం లేకుండా చేయాలని భావిస్తున్నారు. దీని కోసం ప్రత్యేక యాప్‌ను కూడా రూపొందించారు. కాగా, ఈ హాజరు విధానం ద్వారానే విద్యార్థులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం, స్కూల్ డ్రెస్, పాఠ్యపుస్తకాలు ఇవ్వాలన్నది విద్యాశాఖ ఆలోచన. అయితే, ఈ విధానాన్ని దాదాపు ఏడాదికిందటే ప్రవేశపెట్టినప్పటికీ ఇప్పటి వరకూ 40 శాతం స్కూళ్లలో కూడా అమలు కావడం లేదు. ఇంతకాలం ఎన్నికల విధులు, ఉపాధ్యాయులకు శిక్షణ ఉండటం వల్ల ఈ అంశాన్ని పట్టించుకోలేదు. ఇక నుంచి ఈ ప్రక్రియను పకడ్బందీగా కొనసాగించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. తప్పుడు హాజరుకు చెక్ ఇప్పటి వరకూ ప్రభుత్వ స్కూళ్లలో ఉపాధ్యాయులు హాజరు తీసుకునే విధానం ఉండేది. ప్రతీ నెల చివరి తేదీలో తరగతుల వారీగా హెచ్ఎంలు విద్యార్థుల హాజరును రాష్ట్ర కార్యాలయానికి పంపేవాళ్లు. అయితే ఈ వివరాలకు విద్యార్థులకు అందించే భోజనం, దుస్తులు, పుస్తకాల లెక్కకు సరిపోవడం లేదని ఉన్నతాధికారులు అంటున్నారు. అలాగే పాఠశాల నిర్వహణ నిధులను కూడా కచ్చితంగా లెక్కగట్టలేపోతున్నారు. విద్యార్థుల సంఖ్యను బట్టి 30 లోపు ఉన్న స్కూలుకు రూ. 5 వేలు, 31కి మించి ఉన్న స్కూలుకు రూ. 10 వేల చొప్పున నిర్వహణ నిధులు ఇస్తున్నారు. కొన్ని స్కూళ్లలో విద్యార్థుల హాజరును తప్పుగా చూపించి, నిధులు ఎక్కువ తీసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. కాగా, హైదరాబాద్‌లోని చాలా స్కూళ్లలో ఫేషియల్ రికగ్నైజేషన్ హాజరును అసలు అమలు చేయడం లేదు. దీనికి అనేక రకాల సాంకేతిక కారణాలు చెబుతున్నారు. ముందు నెట్ ఇవ్వాలి –– పి.రాజాభాను చంద్రప్రకాశ్ (ప్రభుత్వ హెచ్ఎంల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు) ఫేషియల్ రికగ్నైజేషన్ హాజరు అమలు విషయంలో అధికారులు సాంకేతిక ఇబ్బందులను పరిశీలించాలి. చాలా స్కూళ్లలో నెట్ సదుపాయం లేదు. ఈ హాజరు విధానం కోసం పక్క వాళ్ల నెట్ తీసుకోవడం రోజూ సాధ్యం కాదు. హెచ్ఎంల మొబైల్ నెట్ కొన్ని సార్లు పనిచేయడం లేదు. ఫేషియల్‌తో పాటు స్కూల్లో రికార్డు కోసం మ్యాన్యువల్‌గా హాజరు తీసుకోవడం కూడా బోధన సమయానికి ఇబ్బందే. మొదటి పీరియడ్‌లో చాలా సమయం హాజరుకే పోయే అవకాశం ఉంది. దీనిపై క్షేత్రస్థాయి సమస్యలు పరిశీలించాలి. నెట్ సదుపాయం అందుబాటులోకి తేవాలి. -
బయోమెట్రిక్ బదులు ఇక ‘ఫేషియల్’
సాక్షి, అమరావతి: సంక్షేమ పథకాల అమలులో ప్రస్తుతం ఉపయోగిస్తున్న ‘బయోమెట్రిక్’ విధానం స్థానంలో ‘ఫేషియల్ అథంటికేషన్’ అనే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. భవిష్యత్‌లో వేలిముద్రల ఆధారంగా కాకుండా ముఖం ఆధారంగా లబ్ధిదారులను గుర్తిస్తారు. ప్రస్తుతం ప్రభుత్వం ఏ సంక్షేమ పథకం అమలుచేస్తున్నా.. ముందుగా ఆయా పథకాల లబ్ధిదారుల అందరి నుంచి వేలిముద్రలను సేకరించి, వాటిని లబ్ధిదారుని ఆధార్ నమోదు సమయం నాటి వేలిముద్రలతో పోల్చి ధృవీకరించుకుంటారు. అదే ఫేషియల్ ఆథంటికేషన్ విధానం అమలులోకి వస్తే వేలిముద్రలకు బదులు లబ్ధిదారుని ముఖాన్ని, అతడి ఆధార్‌లోని ముఖకవళికలతో పోల్చి ధృవీకరించుకుంటారు. ప్రస్తుతం అమలుచేస్తున్న బయోమెట్రిక్ విధానంలో లబ్ధిదారుల వేలిముద్రలు సరిపోక సమస్యలు తలెత్తున్నాయి. వృద్ధులు, ఎక్కువ కాయకష్టం పనులు చేసేవాళ్ల వేలిముద్రలు అరిగిపోతుండడంతో బయోమెట్రిక్ సమయంలో సమస్యలొస్తున్నాయి. బయోమెట్రిక్‌కు బదులు ఐరిష్ విధానం అమలుచేసినా.. కళ్ల శుక్లం ఆపరేషన్ చేసుకున్న వారితో సమస్యలు ఏర్పడుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఉదా.. పింఛన్ల పంపిణీలో వేలిముద్రలు సరిపోక ప్రతీనెలా దాదాపు రెండు లక్షల మందికి ఆధార్‌తో సంబంధం లేకుండా పంపిణీ జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. అలాంటి వారి ఫొటోలు ముందుగా యాప్‌లో నమోదు చేసి, పంపిణీ చేసే సమయంలో ఆ లబ్ధిదారుని ఫొటోతో సరిపోల్చుకుని పంపిణీ చేస్తున్నారు. ఇందులో సిబ్బంది చేతివాటం ప్రదర్శించే అవకాశముంది. దీంతో ఫేషియల్ అథంటికేషన్ విధానాన్ని అమలుచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. నిర్వహణ ఖర్చుల్లోనూ ఆదా.. ఇక సంక్షేమ పథకాల కోసం ప్రస్తుతం మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లతో పాటు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు మూడు లక్షల బయోమెట్రిక్ పరికరాలను ప్రభుత్వ యంత్రాంగం వినియోగిస్తోంది. అవి సున్నితమైనవి కావడంతో.. ఏటా 30–40 వేల పరికరాలు కొత్తవి కొనుగోలు చేయాల్సి వస్తోంది. అదే ఫేషియల్ అథంటికేషన్ విధానంలో అదనంగా ఎలాంటి పరికరాలు ఉపయోగించాల్సిన అవసరం ఉండదని అధికారులు వెల్లడించారు. మొబైల్ యాప్ ద్వారా లబ్ధిదారుని ముఖాన్ని స్కాన్ చేయగా, అది ఆధార్‌కు అనుసంధానమై లబ్ధిదారుని సమాచారంతో సరిపోల్చుకుంటుందన్నారు. కేంద్రం, యూఏడీ అనుమతి తప్పనిసరి ఈ రెండూ విధానాలు అధార్ డేటాతో అనుసంధానం అవుతున్నప్పటికీ బయోమెట్రిక్ విధానంలో తలెత్తే ఇబ్బందలన్నింటినీ ఫేషియల్ అథంటికేషన్ విధానంతో అధిగమించడంతోపాటు పూర్తి పారదర్శకంగానూ అమలుచెయ్యొచ్చని అధికారులు అంటున్నారు. అలాగే, బయోమెట్రిక్ స్థానంలో ఫేషియల్ అథంటికేషన్ అమలుచేయాలంటే కేంద్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫరేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆమోదంతో పాటు ఆధార్ డేటా మొత్తం అనుసంధానమై ఉండే యూఏడీ విభాగం అనుమతి తప్పనిసరి. ఇక దేశంలో ఫేషియల్ అథంటికేషన్ విధానం అమలుచేసే తొలి రాష్ట్రం మన ఏపీయే కావడం గమనార్హం. కనీసం 150 మందిపై పరిశీలన తర్వాతే.. కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫరేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, యూఏడీ ఈ ఫేషియల్ అథంటికేషన్ విధానాన్ని రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా అమలుకు అనుమతి తెలపడంతో.. విజయవాడలోని గ్రామ, వార్డు సచివాలయ శాఖ ప్రధాన కార్యాలయంలో మొదటగా అమలుచేస్తున్నారు. ఐదు రోజులుగా ఉద్యోగుల హాజరును ఫేషియల్ అథంటికేషన్ విధానంలో అమలుచేస్తున్నారు. మొదట ఐదుగురు ఉద్యోగుల హాజరును పరిశీలిస్తున్నారు. తర్వాత కార్యాలయంలోని మొత్తం 150 మంది సిబ్బంది హాజరును పరిశీలించాక.. మంత్రిత్వ శాఖ, యూఏడీ విభాగం తుది ఆమోదం కోసం నివేదిక సమర్పిస్తారు. ఆ తర్వాతే అన్ని సంక్షేమ పథకాల అమలులో ఈ విధానం ప్రవేశపెట్టేందుకు వీలు ఏర్పడుతుందని అధికారులు తెలిపారు. -
చైనాపై భారత్ ఏఐ నిఘా.. చీమ చిటుక్కుమన్నా..
సరిహద్దుల్లో చైనా కవ్వింపులకు దిగుతోంది! లద్దాఖ్, అరుణాచల్ ప్రదేశ్లలో... చడీచప్పుడు లేకుండా బలగాలను మోహరించడం... రోడ్లు, వంతెనలు మాత్రమే కాదు.. రాత్రికి రాత్రి డజన్ల కొద్దీ నిర్మాణాలను కూడా కట్టేస్తూ ఇబ్బంది పెట్టేస్తోంది! ఈ నేపథ్యంలో రోజురోజుకూ క్లిష్టతరమవుతున్న సరిహద్దుల రక్షణకు... భారత ప్రభుత్వం కృత్రిమ మేధను రంగంలోకి దింపేందుకు సిద్ధమవుతోంది!! వాస్తవాదీన రేఖకు ఆవల.. చీమ చిటుక్కుమన్నా గుర్తించేందుకు... అందుకు తగ్గట్టుగా ప్రమాదాన్ని అంచనా వేసేందుకూ మనుషుల్లా ఆలోచించే సాఫ్ట్వేర్లు 24 గంటలూ పనిచేయనున్నాయి!! సాక్షి, హైదరాబాద్: చైనా, పాకిస్తాన్ వంటి శత్రుదేశాల నుంచి తనను తాను కాపాడుకునేందుకు భారత్ తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఒకవైపు సరిహద్దుల్లో రోడ్లు వంతెనలు, విమానాశ్రయాల వంటి మౌలిక సదుపాయాలను పెంచుకుంటూనే... ఇంకోవైపు అత్యాధునిక టెక్నాలజీల సాయంతో శత్రువు ఆనుపానులు పసిగట్టే ప్రయత్నాలనూ వేగవంతం చేసింది. ఇటీవలి కాలంలో చైనాతో కొనసాగుతున్న సరిహద్దు సమస్యల నేపథ్యంలో దేశం తూర్పు విభాగంలో నిఘాను మరింత కట్టుదిట్టం చేసేందుకు కృత్రిమ మేధ సాయం తీసుకుంటోంది. జంతువుల కదలికలూ గుర్తించేలా... వాస్తవాదీన రేఖ వెంబడి నిఘా పెట్టేందుకు మానవరహిత విమానాలు, రాడార్లు అమర్చిన హెలికాప్టర్లు ఇప్పటికే పని చేస్తున్నాయి. వీటితోపాటు ఉపగ్రహాల నుంచి అందే ఛాయాచిత్రాలు, నేలపై వేర్వేరు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సెన్సర్లు అన్నీ ఎప్పటికప్పుడు చైనా సైన్యం కదలికలకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తున్నాయి. ఇలా వేర్వేరు మార్గాల ద్వారా అందే సమాచారాన్ని అరుణాచల్ ప్రదేశ్‌లోని ‘రూపా’లో ఏర్పాటు చేసిన నిఘా కేంద్రంలో విశ్లేషిస్తుంటారు. కృత్రిమమేధ సాయంతో వీడియోలను, ఛాయాచిత్రాలను కలిపి కదలికలను స్పష్టంగా గుర్తిస్తున్నారు. ఈ శ్రమ వృథా పోవడం లేదు. చైనా సైన్యంలో ఎంత మంది ఉన్నారు? ఏ రకమైన వాహనాలు వాడుతున్నారు? సరిహద్దుల వెంబడి ఎలాంటి మౌలిక సదుపాయాల నిర్మాణం జరిగిందన్న సమాచారం ఎప్పటికప్పుడు తెలుస్తోంది. వీటి ఆధారంగా చైనా దూకుడుకు కళ్లెం వేసే అవకాశం లభిస్తోంది. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. సరిహద్దులకు అవల సైనికుల రవాణా జరగుతోందా? లేక గొర్రెలు, ఆవుల్లాంటి జంతువులు కదులుతున్నాయా? అన్నది కూడా కృత్రిమ మేధ సాయంతో పనిచేసే నిఘా సాఫ్ట్వేర్ ద్వారా తెలుసుకోగలగడం!! డీఆర్డీవో ప్రయత్నాలూ ముమ్మరం... భవిష్యత్తు యుద్ధాలన్నీ సైబర్ యుద్ధాలే అన్న అంచనా రూఢీ అవుతున్న నేపథ్యంలో దేశ రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ కృత్రిమ మేధ, రోబోటిక్స్ వంటి అత్యాధునిక టెక్నాలజీలను అన్ని స్థాయిల్లో వాడేందుకు రంగం సిద్ధం చేస్తోంది. యుద్ధరంగంలో కృత్రిమ మేధ ఆధారిత ఆయుధ వ్యవస్థలను దింపడం చాలా సులువు. శత్రు భయంకరం కూడా. కంటికి కనిపించకుండానే శత్రువుకు విపరీతమైన నష్టాన్ని కలుగచేస్తాయి. ఇదంతా జరిగేందుకు కేవలం మూడు నాలుగేళ్లు సరిపోతుందని... అయితే ఈ ప్రక్రియ ఇప్పటికే మొదలైందంటున్నారు మిలటరీ నిపుణులు. డీఆర్డీవోకు చెందిన సెంటర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్ దాదాపు 150 మంది ఇంజినీర్ల సాయంతో ఏఐ రోబోటిక్స్, నియంత్రణ వ్యవస్థల ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తోంది. శత్రువులకు చిక్కకుండా రహస్యంగా సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునేందుకు అవసరమైన నెట్‌వర్క్‌లూ ఇందులో ఉన్నాయి. ఫేషియల్ రికగ్నిషన్కూ... ఏఐ! బస్టాండ్లు మొదలుకొని విమానాశ్రయాల వరకూ చాలాచోట్ల ముఖాలను గుర్తించే సాఫ్ట్వేర్లతో కూడిన కెమెరాలు సహజంగానే ఉం టాయి. కానీ.. మిలటరీ విషయానికి వచ్చేసరికి వీటి పాత్ర పరిమితమైంందే! ఈ నేపథ్యంలోనే కృత్రిమ మేధను ఉపయోగించుకుని అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లోనూ ముఖాలను గుర్తించే సాఫ్ట్వేర్ ఒకదాన్ని తయారు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అస్సాం ఎలక్ట్రానిక్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇజ్రాయెల్ సంస్థ కోర్‌సైట్ ఏఐలు కలిసికట్టుగా కొత్త సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేయనున్నాయి. ఈ సాఫ్ట్‌వేర్‌తో వెలుతురు బాగా తక్కువగా ఉన్న చోట్ల మాత్రమే కాదు... అతిక్లిష్టమైన కోణాల్లోంచి.. వేగంగా కదులుతున్నా, గుంపులో కొందరిని మాత్రమే కూడా గుర్తుపట్టి ఫొటోలు తీయవచ్చు. అంతేకాకుండా.. ముఖంలో సగం కప్పి ఉంచుకున్నా గుర్తించేలా ఈ కొత్త సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేస్తున్నారు. మానవ రహిత వాహనాలు డీఆర్డీవో సంస్థలు కృత్రిమ మేధతో పనిచేసే రోబోలు కొన్నింటిని ఇప్పటికే తయారు చేశాయి. వీటిల్లో శత్రుస్థావరాల పరిశీలన, నిఘా పెట్టే ఓ రోబో ఉంది. గోడలెక్కే, నాలుగు, ఆరు కాళ్లతో నడవగలిగిన రోబోలూ రెడీగా ఉన్నాయి. యుద్ధం లేదా ఘర్షణల్లో గాయపడ్డ సైనికులను వేగంగా యుద్ధభూమి నుంచి బయటకు తరలించేందుకు స్మార్ట్ వీల్‌చె యిర్లు, ఇంటర్నెట్ ట్రాఫిక్‌పై నిఘా పెట్టేందుకు నెట్వర్క్ ట్రాఫిక్ అనాలసిస్ (నేత్ర) వ్యసవ్థలను కూడా సిద్ధం చేసింది డీఆర్డీవో. గత ఏడాది జనవరిలో లక్నోలో జరిగిన ‘డిఫెన్స్ ఎక్స్పో’లో వీటిని ప్రదర్శించారు కూడా. -
Facebook: ‘మనుషుల్ని కోతుల్లాగా..’! ఫేస్బుక్లో దుమారం
సోషల్ మీడియా దిగ్గజ ప్లాట్‌ఫామ్ ఫేస్బుక్ వివాదంలో చిక్కుకుంది. రేసిజం సంబంధిత ఫీచర్‌ను ఎంకరేజ్ చేయడం ద్వారా నెటిజన్స్ నుంచి విమర్శలు ఎదుర్కొంది. అయితే నష్టనివారణ కోసం క్షమాపణలు చెప్పినప్పటికీ.. నెటిజన్స్ ఆగ్రహం మాత్రం చల్లారడం లేదు. విషయం ఏంటంటే.. ఓ బ్రిటిష్ టాబ్లాయిడ్‌కు చెందిన వీడియో(జూన్ 2020లోది) ఒకటి ఈ మధ్య ఫేస్బుక్లో వైరల్ అయ్యింది. ఆ వీడియోలో నల్ల జాతీయులను ఉద్దేశించి.. ‘ఇలాంటి కోతుల వీడియోలు మరిన్ని కోరుకుంటున్నారా?’ అంటూ యూజర్లను కోరింది ఫేస్బుక్. అంతే.. ఇది జాత్యంహాకార వ్యవహారమేనంటూ ఫేస్బుక్ తీరును దుమ్మెత్తిపోస్తున్నారు కొందరు. ఇది కచ్చితంగా పొరపాటే. జరిగిన దానికి క్షమాపణలు చెప్తున్నాం అని ఫేస్బుక్ ప్రకటించింది. ఆ టాపిక్‌ను డిసేబుల్ చేయడంతో పాటు పొరపాటు ఎక్కడ జరిగిందనేదానిపై దర్యాప్తు చేయిస్తామని ఓ ప్రకటనలో పేర్కొంది. ఇదిలా ఉంటే ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్‌పై మేధావులు, మానవ హక్కుల సంఘాల నుంచి తీవ్ర ఎత్తున్న అభ్యంతరాలు వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రైమేట్స్‌లో కోతులు, చింపాంజీలు, గొరిల్లాతో పాటు మనుషులు కూడా ఉంటారని, బహుశా ఆ ఉద్దేశంతో అలా రికమండేషన్ వచ్చి ఉంటుందని కొందరు టెక్నికల్ నిపుణులు చెప్తున్నారు. అయినప్పటికీ ఇది ముమ్మాటికీ రేసిజం వ్యవహారామేనని ఫేస్‌బుక్‌పై దావాకి సిద్ధం అవుతున్నారు మనోభావాలు దెబ్బతిన్న కొందరు. చదవండి: భారత్ కొత్త ఐటీ చట్టాలపై పోరుకు రెడీ -
ఫేక్ ఓటర్లకు ‘ఫేషియల్’ చెక్!
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే తొలిసారిగా అత్యాధునిక సాంకేతికతను ప్రయోగాత్మకంగా పరిశీలించేందుకు తెలంగాణ వేదిక కానుంది. ఎన్నికల్లో దొంగ ఓట్లు, బోగస్ ఓట్లకు అడ్డుకట్ట వేయడం అనేది ఒక సమస్యగా మారిన విషయం తెలిసిందే. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా పరిమితంగా కొన్ని పోలింగ్ బూత్‌ల్లో అర్హులైన ఓటర్ల గుర్తింపునకు ఫేషియల్ రికగ్నిషన్ టెక్నా లజీ ఉపయోగించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) నిర్ణయించింది. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలం కొంపల్లి మున్సిపాలిటీలోని పది పోలింగ్స్టేషన్లలో పోలింగ్ సందర్భంగా ఈ టెక్నాలజీని ఎస్ఈసీ పైలెట్ ప్రాజెక్టు కింద అమలుచేయనుంది. ఇందులో వచ్చే ఫలితాలను బట్టి భవిష్యత్‌లో జరిగే వివిధ ఎన్నికల్లో ఈ సాంకేతికను ఉపయోగించాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏం చేస్తారు? పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్న కొంపల్లి మున్సిపాలిటీల్లోని ఎంపిక చేసిన 10 వార్డుల్లోని ఫొటో ఓటర్ల జాబితాలను డౌన్లోడ్ చేసుకుని అందుబాటులో పెట్టుకుంటారు. ఓటేసేందుకు వచ్చే వారిని స్మార్ట్‌ఫోన్ లేదా ట్యాబ్‌తో ఫొటో తీస్తారు. అనంతరం ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ యాప్‌లో ఈ ఫొటోలను ఓటర్ల డేటాబేస్‌తో సరిచూస్తారు ఓటర్ ఫొటో దానితో మ్యాచ్ అయితే ఓటేసేందుకు అనుమతిస్తా రు. ఈ పైలెట్ ప్రాజెక్టు కోసం పది బూత్‌ల ఎంపికతో పాటు పదిమంది పోలింగ్ ఆఫీసర్లకు ఈ సాంకేతికతను ఉపయోగించేందుకు శిక్షణ ఇస్తామని ఎస్ఈసీ కార్యదర్శి ఎం.అశోక్‌కుమార్ సాక్షికి తెలిపారు. మూడు సాంకేతికతల కలబోత... ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటా, మెషిన్ లెర్నిం గ్ అండ్ డీప్ లెర్నింగ్’లను ఉపయోగించి ఈ మొబైల్ యాప్‌ను రూపొందించారు. రాష్ట్ర ప్రభుత్వ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కమ్యూనికేషన్స్ శాఖ ఆధ్వర్యంలోని తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ (టీఎస్టీఎస్) ఈ యాప్‌ను రూపొందించింది. సెల్ఫీ లేదా లైవ్ ఫొటో తీసుకోవడం ద్వారా లైవ్ అథెంటికేషన్, పేరు, చిరునామా, ఇతర డెమోగ్రాఫిక్ వివరాలతో, డేటాబేస్‌లోని 10, 15 ఏళ్ల క్రితం నాటి ఫొటోతో మ్యాచ్ చేస్తే ఈ వివరాలున్న వ్యక్తి సెల్ఫీ దిగిన వ్యక్తి ఒకరే అనే అథెంటికేషన్ వస్తుంది. ఈ విషయంలో మనుషుల ప్రమేయం లేకుండా సిస్టమే అన్నీ చేస్తుంది. మూడు సంస్థలు వేర్వేరుగా రూపొందించిన సాంకేతికతలను ఒకచోట చేర్చి వాటిని టీఎస్టీఎస్ ఆధ్వర్యంలో మొబైల్‌యాప్‌తో అనుసంధానించారు. ప్రస్తుతం దీనిని కొంతమేరకు ట్రెజరీ విభాగం రిటైరైన ఉద్యోగుల పెన్షన్ విషయంలో లైవ్ అథెంటికేషన్ కోసం ఉపయోగిస్తుండగా, ఈ విభాగంలో మరింత విస్తృతంగా ఉపయోగించాలని నిర్ణయించారు. తాజాగా ఆసరా పింఛన్ల విషయంలోనూ ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని పరిశీలించారు. కొన్ని నెలల క్రితం సంగారెడ్డి జిల్లా కందిమండలం ఎద్దుమైలారం గ్రామంలో ఈ మొబైల్‌యాప్‌ను ఒక పైలెట్ ప్రాజెక్టు రూపంలో ప్రయోగాత్మకంగా అమలు చేశారు. ఈ పైలెట్ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో విజయవంతం కావడంతో ఆసరా పింఛన్ల చెల్లింపునకు దీనిని విస్తృతస్థాయిలో ఉపయోగించాలనే ఆలోచనతో పంచాయతీరాజ్ శాఖ ఉంది. -
ముఖం చూపిస్తే.. డబ్బులిస్తుంది
డబ్బులు కావాలంటే.. ఏటీఎంకి వెళ్లి తీసుకుంటాం. ఆ మెషీన్లో కార్డు ఉంచి పిన్ నంబర్ ఎంటర్ చేసి.. కావాల్సిన డబ్బులు తీసుకుంటాం. అయితే ఆ పిన్ నంబర్ మర్చిపోయినా.. వేరే అపరిచితులకు ఆ నంబర్ తెలిసినా ఇబ్బందులు తప్పవు. అందుకోసం బ్యాంకులు చాలా ఏర్పాట్లు చేశాయి. కానీ స్పెయిన్‌లోని బార్సిలోనా సిటీలో ఉన్న ఓ బ్యాంకు డబ్బులు తీసుకునేందుకు ఏటీఎం కేంద్రాల్లో వినూత్నమైన ఏర్పాటు చేసింది. ఏంటంటే మన ముఖాన్ని గుర్తుపట్టి డబ్బులు ఇచ్చే నూతన సాంకేతికతను అందుబాటులోకి తెచ్చింది. ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా డబ్బులు ఇచ్చే ఏటీఎం ఏర్పాటు చేయడం ప్రపంచంలోనే ఇది తొలిసారి కావడం విశేషం. అక్కడి కెయిక్సా బ్యాంకు ఈ టెక్నాలజీని వాడుకుంటోంది. దీనిద్వారా మన డబ్బు ఎంతో సేఫ్‌గా డ్రా చేసుకోవచ్చని బ్యాంకు చైర్మన్ జోర్డీ గాల్ తెలిపారు. ఏటీఎంలోని కెమెరా మన ముఖంలోని దాదాపు 16 వేల అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే మనకు డబ్బు ఇస్తుందట. అంతేకాదు నిరక్షరాస్యులు కూడా చాలా సులభంగా ఈ ఏటీఎంల ద్వారా ఎంతో సురక్షితంగా డబ్బును తీసుకోవచ్చు. ఈ ఏడాది చివరికి బార్సిలోనా పట్టణంలో అన్ని ఏటీఎం కేంద్రాల్లో ఈ వ్యవస్థలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నట్లు కెయిక్సా బ్యాంకు సీఈవో గొంజాలో చెబుతున్నారు. -
నాలుగేళ్ల తర్వాత టెక్నాలజీతో ఆచూకీ..
సాక్షి, హైదరాబాద్: ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో పాటు, అధునాతన టెక్నాలజీతో పలు కీలక కేసులను చాకచాక్యంగా పరిష్కరిస్తూ తెలంగాణ పోలీసులు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అదే విధంగా.. ఇటీవలే ఫెషియల్ రికగ్నైజేషన్ టూల్ సహాయంతో తప్పిపోయిన వారిని సొంతవారి చెంతకు చేరుస్తున్న తెలంగాణ పోలీసులు మరో కేసును విజయవంతంగా చేధించారు. తాజాగా మతిస్థిమితం లేని ఓ బాలికను వారి తల్లిదండ్రులకు అప్పగించారు. 2014లో మతిస్థిమితం లేని ఓ బాలిక ఇంట్లో నుంచి తప్పిపోయింది. ఆ తర్వాత గార్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి.. అప్పటి నుంచి ఆమెను ఘట్కేసర్లోని చైల్డ్ హోమ్‌లో ఉంచారు. తాజాగా ఫెషియల్ రికగ్నైజేషన్ సాంకేతికతో ఆ బాలిక వివరాలు సేకరించే ప్రయత్నం చేసిన పోలీసులు అందులో విజయం సాధించారు. ఆ బాలికను వారి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ విషయాన్ని మహిళా భద్రత విభాగం చీఫ్ స్వాతి లక్రా ట్విటర్ ద్వారా వెల్లడించారు. #FacialRecognition Another successful detection by our Telangana Police Facial Recognition tool. She is of unsound mind, left home in 2014 and since missing. A case was registered at Garla P.S and kept at a Child Home in Ghatkesar in the year 2014. Restored to parents now. pic.twitter.com/AcWGkNifFM — Swati Lakra IPS (@IGWomenSafety) October 24, 2018 -
ఆధార్ "ఫేషియల్ రికగ్నిషన్" త్వరలో
సాక్షి, న్యూఢిల్లీ: ఆధార్ వ్యవస్థకు మరింత భద్రత కల్పించేలా యుఐడిఎఐ మరిన్ని చర్యల్ని చేపట్టనుంది. ఆధార్ ప్రమాణీకరణలో అదనపు ఫీచర్‌గా ఫేషియల్ రికగ్నిషన్‌ను మాండేటరీ చేయనుంది. ఆధార్ గుర్తింపును మరింత పకడ్బందీగా చేసేందుకు ఇకపై ఫేషియల్ రికగ్నిషన్ కూడా తప్పనిసరి చేయనున్నట్టు యుఐడిఎఐ తెలిపింది. సెప్టెంబర్ 15నుంచి ఆధార్ నెంబర్లను వారివారి ఫేషియల్ రికగ్నిషన్‌తో అనుసంధానం చేయాలని యూఐడీఏఐ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే వేలిముద్రలు, చేతిముద్రలు, కంటిపాపలతో ఆధార్ సెక్యూరిటీ కోసం జాగ్రత్తలు తీసుకున్న అధికారులు మరిన్ని భద్రతా ప్రమాణాల దృష్ట్యా ఇకపై ఫేషియల్ రికగ్నిషన్ ని తప్పనిసరి చేస్తున్నారు. ఈ మేరకు యూఐడీఏఐ తో పనిచేస్తున్న అన్ని ఏజెన్సీలు, సర్టిఫైడ్ బయోమెట్రిక్ డివైస్ ప్రొవైడర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ ప్రక్రియ పూర్తయ్యాక ఓ పది శాతం లావాదేవీలను పరిశీలించి సమీక్షిస్తామని సీఈఓ అజయ్ భూషణ్ చెప్పారు.ఈ నిబంధనను ఎవరు అతిక్రమించినా సెక్షన్ 42, 43 ప్రకారం జైలుశిక్ష గానీ, జరిమానా గానీ లేదా రెండూ గానీ విధిస్తారని అజయ్ భూషణ్ చెప్పారు. కాగా ఆధార్ చట్టబద్దతను సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు వాదనలు కొనసాగుతున్నాయి. -
‘తెలంగాణలొ నేరం చేయాలంటే భయపడాల్సిందే’
సాక్షి, హైదరాబాద్ : ‘కికీ చాలెంజ్ వల్ల మీ జీవితాలే ప్రమాదంలో పడే అవకాశం ఉంది. తెలంగాణలో ఎవరు ఈ కికీ చాలెంజ్‌ను తీసుకోవద్దు. కికీ చాలెంజ్ అంటూ డ్యాన్స్ చేసినా, దీనికి సంబంధించిన వీడియోలను ఇంటర్నెట్లో అప్లోడ్ చేసినా కఠిన చర్యలు తప్పవం’టూ హెచ్చరించారు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి. నేరాల నియంత్రణలో భాగంగా ‘ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్’ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా గురువారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘తెలంగాణలో నేరాల నియంత్రణ కోసం నూతన సాఫ్ట్వేర్ ‘ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్’ను అందుబాటులోకి తీసుకొస్తున్నాం. ఇందులో భాగంగా దాదాపు లక్ష ఫోటోలను ఈ సిస్టంలో అప్లోడ్ చేస్తున్నాం. పాత నేరస్తుల వివరాలను, వారి ఫింగర్ ప్రింట్స్ వివరాలను కూడా డేటా బేస్ ద్వారా ఈ సిస్టమ్‌లో పొందుపరుస్తాం. ఫలితంగా నేరస్తులను గుర్తుపట్టడం తేలిక అవుతుంది. మిస్సింగ్ కేసులు, క్రిమినల్ కేసులు, గుర్తు తెలియని వ్యక్తులకు సంబంధించిన నేరాలను త్వరితగతిన పరిష్కరించడానికి ఈ టెక్నాలజీ ఎంతో సహకరిస్తుంది. ఇక మీదట తెలంగాణలో నేరం చేయాలంటే ఎవరైనా భయపడాల్సిందే. నేరాలను అదుపు చేయడానికి ఈ సిస్టమ్ ఎంతో ఉపయోగపడుతుంది’. దేశంలోనే మొట్టమొదటి సారిగా తెలంగాణ పోలీస్ శాఖ ఈ ‘ఫేషియల్ రేకగ్నైజేషన్ సిస్టమ్’ను ఏర్పాటు చేస్తుందని మహేందర్ రెడ్డి తెలిపారు. నేటి నుంచే ‘టీఎస్ కాప్’ యాప్‌కు ఈ సిస్టమ్‌ను అనుసంధానం చేస్తున్నామన్నారు. అంతేకాక త్వరలోనే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఇన్వెస్టిగేషన్ అధికారులందరికి ఈ సిస్టమ్ గురించి శిక్షణ ఇచ్చి వాడుకలోకి తీసుకొస్తామని తెలిపారు. -
టెక్నికల్ ప్రాబ్లమ్.. అమెజాన్‌తో తంటాలు
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ సాంకేతికతతో అమెరికన్ సెనెటర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అమెజాన్.కామ్‌కు చెందిన ఫేషియల్ రికగ్నిషన్(ముఖాలను గుర్తించే) మెషీన్లు వారి గుర్తింపును తప్పుగా చూపిస్తున్నాయి. కరుడుగట్టిన క్రిమినల్స్‌గా గుర్తిస్తుండటంతో తరచూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య మే నెల నుంచి మరీ ఎక్కువైపోయిందని ప్రముఖ సర్వే సంస్థ ది అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ ఆఫ్ నార్తన్ కాలిఫోర్నియా(ఏఎల్‌సీయూ) ఓ నివేదికలో వెల్లడించింది. ఓరెగాన్, ఓర్లాండో, ఫ్లోరిడాలోని సెనెటర్ల కోసం ఏర్పాటు చేసిన మెషీన్లలో ఈ పొరపాటును ఎక్కువగా గుర్తించారు. ఎడర్వర్డ్ మార్కే, డీ మాస్, తదితరులతోపాటు లూయిస్ లాంటి దిగ్గజాలను ఇలా మొత్తం 28 మంది సెనెటర్లను క్రిమినల్స్‌గా గుర్తింపును చూపిస్తున్నాయి. చట్టసభల్లో, కార్యాలయాల్లో, సమావేశాల్లో వాళ్లు పాల్గొన్నప్పుడు సెనెటర్లను ఫేషియల్ సర్వైలెన్స్ కెమెరాలు వారిని క్రిమినల్స్‌గా చూపిస్తున్నాయి. దీంతో పోలీసులు అప్రమత్తమై వారి వద్దకు వెళ్తున్నారు. ఈ రకంగా అన్ని రకాలుగా ఇబ్బందులే ఎదురవుతున్నాయి అని ఏసీఎల్యూ పేర్కొంది. ఒక్క కాలిఫోర్నియాలోనే 25,000 వేల మంది డేటా అమెజాన్ ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్‌లో నిక్షిప్తమై ఉంది. అలాంటప్పుడు మున్ముందు సామాన్యులకు కూడా ఈ పొరపాటుతో ముప్పు తలెత్తే అవకాశం ఉందని ఏఎల్‌సీయూ అంటోంది. ఈ విషయంలో గతంలో కొందరు సెనెటర్లు లేఖలు రాసినా ఎలాంటి స్పందన లేదని వెల్లడించింది. అయితే అమెజాన్ మాత్రం తమ పొరపాటును సర్దిపుచ్చుకునే ప్రయత్నమే చేస్తోంది. ‘ఒక వ్యక్తి రియల్ టైమ్ ఇమేజ్‌లను పాత ఫొటోలతో పోల్చి ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ పనిచేస్తుంది. అలాంటప్పుడు పొరపాటు సదరు ఏజెన్సీ సంస్థలదే తప్ప మాది కాదు’ అని అమెజాన్ ప్రతినిధి ఒకరు చెబుతున్నారు. రాయల్ వివాహ వేడుక దగ్గరి నుంచి చిన్న చిన్న పార్కుల్లో పిల్లలు తప్పిపోయిన సమయంలో కూడా అమెజాన్ మెషీన్లనే ఉపయోగిస్తున్నారని, అక్కడ ఎవరికీ రాని ఇబ్బందులు ఇక్కడ మాత్రమే ఎందుకొస్తున్నాయన్న వాదనను అమెజాన్ తెరపైకి తెస్తున్నారు. ఏల్సీయూ మాత్రం మెషీన్లలో 80 శాతం ఇన్స్టాలైజేషన్లో పొరపాట్లు ఉన్నాయని, కావాలంటే బహిరంగంగా నిరూపిస్తామని అంటోంది. ఏదిఏమైనా టెక్నాలజీపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టి వినియోగదారుల్లో నమ్మకం పెంచాల్సిన అవసరం అమెజాన్‌పైనే ఉందన్నది చాలా మంది చెబుతున్న అభిప్రాయం. -
ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజితో 45 వేల మంది పిల్లల గుర్తింపు!
టెక్నాలజీ రెండువైపులా పదునున్న కత్తి అని మనం చాలాసార్లు వినే ఉంటాం గానీ.. చెడు కోసం ఎలా ఉపయోగపడుతుందన్న ఉదాహరణలే ఎక్కువగా కనిపిస్తూంటాయి. నాణేనికి ఇంకోవైపు తార్కాణాలు అరుదుగా బయటపడుతూంటాయి. న్యూఢిల్లీలో ఇటీవల జరిగిన ఒక సంఘటన ఈ కోవకే చెందుతుంది. విషయం ఏమిటంటే.. ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీని న్యూఢిల్లీ పోలీసులు ఓ మంచిపనికి ఉపయోగించడం. ఇళ్లల్లోంచి పారిపోయి వీధుల్లోకి చేరిన కొన్ని వేల మంది పిల్లలను ఈ టెక్నాలజీ ఆధారంగా పోలీసులు గుర్తించగలిగారు. దేశవ్యాప్తంగా వేర్వేరు పోలీస్ స్టేషన్లలో ‘తప్పిపోయిన’ పిల్లల విషయంలో నమోదైన 60 వేల కేసుల్లో వారి ఫొటోలు సేకరించి.. అందులో 45 వేల మంది... ఢిల్లీలోని వేర్వేరు అనాధాశ్రమాల్లో ఉన్నట్లు గుర్తించారు. గత నెల ఆరవ తేదీన ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్‌కు ఫొటోలు అందివ్వగా, కేవలం నాలుగు రోజుల్లో పిల్లలందరినీ గుర్తించడం విశేషం. పిల్లలను వారి కుటుంబాలతో కలిపేందుకు ప్రస్తుతం ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. దేశం మొత్తం మీద దాదాపు రెండు లక్షల మంది పిల్లలు తప్పిపోయినట్లు గణాంకాలు చెబుతున్నాయని, వేర్వేరు ప్రభుత్వ సంస్థల్లో ఆశ్రయం పొందుతున్న వారు 90 వేల వరకూ ఉన్నారని ‘బచ్పన్ బచావో’ ఆందోళన్ సంస్థ కార్యకర్త భువన్ రిబ్హూ అంటున్నారు. ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ ఢిల్లీలో సాధించిన విజయం స్ఫూర్తిగా ఇప్పుడు ఇతర రాష్ట్రాల పోలీసులు కూడా దీన్ని వాడుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. -
ఫేస్బుక్లో ఇదేం మిస్టరీ
సాక్షి, ముంబై : సాంకేతికతలోని లోపమో.. కారణమేదో తెలీనప్పటికీ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్లో ఓ వ్యవహారం మిస్టరీగా మారింది. తమ ఫోటోలను ఎవరైనా ట్యాగ్ చేయని పక్షంలో ఖాతాదారులకు ఉపయుక్తంగా ఉంటుందని ‘ఫేస్ రికగ్నిషన్’(ముఖం గుర్తింపు) ఫీచర్‌ను ఫేస్బుక్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. తద్వారా ఖాతాదారుడి ఫోటో ఫేస్బుక్లో ఎక్కడ, ఎవరు అప్ లోడ్ చేసినా.. దానికదే గుర్తించి పేరును చూపిస్తుంది. అంతేకాదు సదరు ఖాతాదారుడికి అది నోటిఫికేషన్ కూడా వెళ్తుంది. అయితే ముంజిర్ అహ్మద్ అనే జర్నలిస్ట్‌కు మాత్రం ఇది చిక్కులను తెచ్చిపెడుతోంది. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన రేస్-3 చిత్ర పోస్టర్‌ను తాజాగా విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఫేస్బుక్లో ఎవరు ఆ ఫోటోను అప్లోడ్ చేసినా.. ఫేషియల్ రికగ్నిషన్ లో సల్మాన్ ఫేస్ ముంజిర్ పేరును చూపిస్తోంది. ఇలా ముంజిర్ ఫేస్బుక్ అకౌంట్లో ఫ్రెండ్స్ లిస్ట్‌లో ఉన్నవాళ్లే కాదు.. బయటి వ్యక్తులు ఎవరు ఫోటోను అప్ లోడ్ చేసినా ముంజిర్కే నోటిఫికేషన్ వెళ్తోంది. ‘ఏం జరుగుతోంది? కుప్పలు తెప్పలుగా నోటిఫికేషన్లు వస్తున్నాయ్. నేనేమైనా సల్మాన్‌లా ఉన్నానా? ఈ సమస్య నా ఒక్కడికేనా? లేక నాలాగే ఇంకా ఎవరైనా బాధపడుతున్నారా? ఫేస్బుక్ ఫేషియల్ రికగ్నిషన్ దారుణంగా విఫలమైంది. కానీ, ఇది నా వృత్తికి ముడిపడిన అంశం. అందుకే ఫేస్‌బుక్‌ను వీడలేను. ఆ ఫీచర్‌ను ఆఫ్ చేయలేను’ అని ముంజిర్ పేర్కొన్నాడు. దీనిపై స్పందించిన ఫేస్ బుక్.. ఈ విషయంపై అధికారికంగా ఫిర్యాదు అందలేదని.. అయినప్పటికీ దర్యాప్తు చేపట్టామని పేర్కొంది. #Facebook Facial Recognition Fail. Recently Facebook introduced facial recognition feature and I turned on this feature. People are uploading Salman Khan’s Race 3 poster and Facebook is sending me notification which says ‘XYZ uploaded a photo you might be in’ WTF? pic.twitter.com/TzwJsSg1SG — Munzir Ahmad (@iamhacker) 26 March 2018 -
ఆధార్ ధ్రువీకరణకు ఇక ఫేస్ రికగ్నిషన్
న్యూఢిల్లీ: బయోమెట్రిక్ పద్ధతి వల్ల ఆధార్ ధ్రువీకరణ సమయంలో సమస్యలు ఎదుర్కొంటున్న వారి కోసం భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) మరో కొత్త విధానాన్ని తీసుకురాబోతోంది. ఇప్పటిదాకా కేవలం వేలి ముద్రలు, ఐరిస్ ద్వారానే ఆధార్ ధ్రువీకరణకు అవకాశం ఉండగా, ఇకపై ముఖాకృతిని గుర్తించటం (ఫేస్ రికగ్నిషన్) ద్వారా కూడా ధ్రువీకరణ చేసుకునే వెసులుబాటును కల్పించనుంది. ఏవేనీ కారణాల వల్ల వేలిముద్రలు చెరిగిపోయిన లేదా బాగా దెబ్బతిన్న వారికి, వృద్ధాప్యంలో ఉండి వేలిముద్ర వేయలేని వారికి యూఐడీఏఐ తాజా నిర్ణయం ఎంతో ఉపయోగకరం. అయితే ఫేస్ రికగ్నిషన్ విధానంలో ధ్రువీకరణ చేసుకోవాలంటే ముఖానికి తోడు వేలిముద్ర లేదా కళ్లు (ఐరిస్) లేదా ఆధార్ డేటా బేస్‌లో రిజిస్టర్ అయి ఉన్న మొబైల్‌కి వచ్చే ఓటీపీ (వన్ టైం పాస్వర్డ్)....వీటిలో ఏదో ఒకటి కూడా కచ్చితంగా అవసరం. ఈ విధానాన్ని జూలై 1 నుంచి అవసరమైన చోట ఉపయోగించుకోవచ్చని యూఐడీఏఐ సోమవారం వెల్లడించింది. ఫేస్ రికగ్నిషన్ కోసం కొత్తగా రిజిస్ట్రేషన్ అవసరం లేదనీ, ఇంతకు ముందే ఆధార్ డేటాబేస్‌లో ఉన్న ఫొటోనే ఇందుకోసం వాడతారని తెలిపింది. ఫేస్ రికగ్నిషన్‌కు అవకాశం కల్పించేలా ధ్రువీకరణ యంత్రాల్లో కూడా మార్పులు చేసేందుకు యూఐడీఏఐ ఆయా యంత్రాల ఉత్పత్తిదారులతో కలిసి పనిచేయనుంది. ప్రస్తుతం దేశంలో 119 కోట్ల మందికి ఆధార్ కార్డులుండగా, సగటున రోజుకు 4 కోట్ల ఆధార్ ధ్రువీకరణలు జరుగుతున్నాయి. ఆధార్ సమాచారానికి మరింత భద్రత, గోప్యత కోసం 16 అంకెల వర్చువల్ గుర్తింపు సంఖ్యను కేటాయించే విధానాన్ని కూడా మార్చి 1 నుంచి అమలు చేస్తామని యూఐడీఏఐ ఇప్పటికే ప్రకటించడం తెలిసిందే. -
గొర్రెల బాధను తెలుసుకునేందుకు....
కాలిఫోర్నియా: మనుషుల్లో బాధను వ్యక్తం చేయడానికి హావభావాలతోపాటు మాటలు ఉంటాయి. మాటలురాని మూగ జంతువులు తాము అనుభవిస్తున్న బాధను ఎలా వ్యక్తం చేస్తాయి? వాటి అరుపులు, ముఖ హావాభావాల్లో వచ్చే తేడాను బట్టి వాటి బాధను అర్థం చేసుకోవచ్చు. ఇంతవరకు జరుగుతున్నది అదే. గొర్రెలాంటి మూగజీవుల ముఖాల భావాలను బట్టి వాటి శారీరక బాధను గుర్తించేందుకు కాలిఫోర్నియా యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు కృత్రిమ మేథస్సును సృష్టించారు. శారీరక బాధను అనుభవిస్తున్నప్పుడు గొర్రె కళ్లు చిన్నగా ముడుచుకుపోతాయి. చెక్కిళ్లు గట్టిగా బిగుసుకుంటాయి. చెవులు ముందుకు ముడుచుకుపోతాయి. పెదవులు కిందకు వచ్చి వెనక్కి బిగుసుకుంటాయి. ముక్కు రంధ్రాలు ‘వీ’ ఆకారంలోకి మారుతాయి. ఈ ఐదు మార్పుల ద్వారా వాటిని బాధను అర్థం చేసుకోవచ్చు. సాధారణ గొర్రె ముఖాలతో ఈ ఐదు రకాల మార్పులను పోల్చి వాటిని బాధను కృత్రిమ మేథస్సు గుర్తిస్తుంటుంది. బాధ తీవ్రతను కూడా తెలియజేయగలదు. కెమేరా ముందు గొర్రె ముఖాలున్నప్పుడు వాటి బాధను ఫొటోల ద్వారా ఏఐ గుర్తించవచ్చు. మరి పక్కకో, వెనక్కో ఉన్నప్పుడు ఎలా గుర్తించాలి? అదే అంశంపై ఇప్పుడు పరిశోధకులు దృష్టిని సారించారు. ఈ పరిశోధనల్లో కూడా విజయం సాధిస్తే గొర్రెల బాధను త్వరగా గుర్తించి వాటిని పశువైద్య శాలలకు తీసుకెళ్లడానికి వీలవుతుంది. -
ముఖాన్ని గుర్తించే సాఫ్ట్వేర్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డేటా సొల్యూషన్స్ రంగంలో ఉన్న అమెరికా కంపెనీ వాయిస్ ఆఫ్ బిగ్‌డేటా(వీవోబీడీ) వ్యక్తులను కచ్చితంగా గుర్తించే సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసింది. ఫేషియల్ సిగ్నేచర్ పేరుతో రూపొందించిన ఈ సాఫ్ట్వేర్ పనితీరును ప్రస్తుతం అంచనా వేసే పనిలో కంపెనీ నిమగ్నమైంది. అక్టోబరులో అమెరికాలో అందుబాటులోకి తీసుకొస్తామని, ఆ తర్వాత భారత్‌లో ప్రవేశపెడతామని కంపెనీ సీఈవో శ్రీనివాస్ కిషన్ తెలిపారు. వాయిస్ ఆఫ్ బిగ్‌డేటా కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సందర్భంగా శుక్రవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. ఫేషియల్ సిగ్నేచర్‌తో 80-90 శాతం కచ్చితత్వం ఉంటుందని ఆయన చెప్పారు. ఇప్పటికే అమర్చిన కెమెరాలతోనూ ఇది సాధ్యపడుతుందని వివరించారు. పోలీసు రికార్డుల్లో ఉన్న ఒక నేరస్తుడు ఏదైనా ప్రదేశానికి వెళ్లినప్పుడు అతన్ని సులభంగా గుర్తించి అప్రమత్తం చేసేందుకు దోహదం చేస్తుందని వివరించారు. ఇక దుకాణాల్లో అయితే కస్టమర్ ఏ వస్తువులను కొంటున్నారు, ఏ వస్తువుల పట్ల ఆసక్తి కనబరుస్తున్నారు, అతను/ఆమె తరచూ వచ్చే కస్టమరా? వంటి విషయాలు ఈ సాఫ్ట్వేర్ ద్వారా తెలుసుకోవచ్చని తెలిపారు. భారత్‌లో పేటెంటు కోసం దరఖాస్తు చేశామని, అమెరికాలోనూ దాఖలు చేయనున్నామని పేర్కొన్నారు.