
టెక్నాలజీ రెండువైపులా పదునున్న కత్తి అని మనం చాలాసార్లు వినే ఉంటాం గానీ.. చెడు కోసం ఎలా ఉపయోగపడుతుందన్న ఉదాహరణలే ఎక్కువగా కనిపిస్తూంటాయి. నాణేనికి ఇంకోవైపు తార్కాణాలు అరుదుగా బయటపడుతూంటాయి. న్యూఢిల్లీలో ఇటీవల జరిగిన ఒక సంఘటన ఈ కోవకే చెందుతుంది. విషయం ఏమిటంటే.. ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీని న్యూఢిల్లీ పోలీసులు ఓ మంచిపనికి ఉపయోగించడం. ఇళ్లల్లోంచి పారిపోయి వీధుల్లోకి చేరిన కొన్ని వేల మంది పిల్లలను ఈ టెక్నాలజీ ఆధారంగా పోలీసులు గుర్తించగలిగారు. దేశవ్యాప్తంగా వేర్వేరు పోలీస్ స్టేషన్లలో ‘తప్పిపోయిన’ పిల్లల విషయంలో నమోదైన 60 వేల కేసుల్లో వారి ఫొటోలు సేకరించి.. అందులో 45 వేల మంది... ఢిల్లీలోని వేర్వేరు అనాధాశ్రమాల్లో ఉన్నట్లు గుర్తించారు.
గత నెల ఆరవ తేదీన ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్‌కు ఫొటోలు అందివ్వగా, కేవలం నాలుగు రోజుల్లో పిల్లలందరినీ గుర్తించడం విశేషం. పిల్లలను వారి కుటుంబాలతో కలిపేందుకు ప్రస్తుతం ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. దేశం మొత్తం మీద దాదాపు రెండు లక్షల మంది పిల్లలు తప్పిపోయినట్లు గణాంకాలు చెబుతున్నాయని, వేర్వేరు ప్రభుత్వ సంస్థల్లో ఆశ్రయం పొందుతున్న వారు 90 వేల వరకూ ఉన్నారని ‘బచ్‌పన్ బచావో’ ఆందోళన్ సంస్థ కార్యకర్త భువన్ రిబ్‌హూ అంటున్నారు. ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్ ఢిల్లీలో సాధించిన విజయం స్ఫూర్తిగా ఇప్పుడు ఇతర రాష్ట్రాల పోలీసులు కూడా దీన్ని వాడుకునే ప్రయత్నాల్లో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment