![PM Narendra Modi and US NSA Michael Waltz Meet at Blair House](/styles/webp/s3/article_images/2025/02/14/130220251944-PTI02_13_2025_.jpg.webp?itok=Q2Lxz38T)
అమెరికా భద్రతా సలహాదారు మైకేల్ వాల్జ్‌తో మోదీ భేటీ
తులసి గబార్డ్‌తోనూ సమావేశం
వాషింగ్టన్: అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మైఖేల్ వాల్జ్(Michael Waltz)తో ప్రధాని మోదీ(Narendra Modi) గురువారం భేటీ అయ్యారు. రక్షణ, సాంకేతికత, భద్రత వంటి అంశాలపై వారు చర్చించారు. మైఖేల్ వాల్ట్‌జ్‌తో ఫలవంతమైన చర్చ జరిగిందని ‘ఎక్స్’లో మోదీ పేర్కొన్నారు. భారత్‌కు ఆయన గొప్ప స్నేహితుడు అని కొనియాడారు. భారత్– అమెరికా సంబంధాల్లో రక్షణ, సాంకేతికత, భద్రత.. అత్యంత ముఖ్యమైన కోణాలని, వీటిపై తమ మధ్య ఫలప్రదమైన చర్చ జరిగిందని మోదీ తెలిపారు.
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(Artificial Intelligence), సెమీకండక్టర్స్, అంతరిక్ష రంగంలో పరస్పర సహకారానికి ఎన్నో అవకాశాలున్నాయని పేర్కొన్నారు. ఈ భేటీలో భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సైతం పాల్గొన్నారు. ఫ్రాన్స్ పర్యటన ముగించుకున్న మోదీ స్థానిక కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం 5.30 గంటలకు అమెరికా రాజధాని వాషింగ్టన్ డి.సి.కి చేరుకున్నారు. ప్రవాస భారతీయులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
భారత్ మాతాకీ జై, వందేమాతరం, మోదీ మోదీ అంటూ నినదించారు. చలి వణికిస్తున్నా, వర్షం పడుతున్నా లెక్కచేయకుండా మోదీకి స్వాగతం పలకడానికి తరలివచ్చారు. నగరం నడిబొడ్డున ఉన్న చరిత్రాత్మక బ్లెయిర్ హౌస్‌లో మోదీ బస చేశారు. రాజధానిలో అడుగుపెట్టిన తర్వాత మోదీ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. భారత్–అమెరికా మధ్య సమగ్ర అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవడానికి అధ్యక్షుడు ట్రంప్‌తో సమావేశం కోసం ఆసక్తి ఎదురు చూస్తున్నానని పేర్కొన్నారు. భారత్, అమెరికా ప్రయోజనాలు కాపాడడంతోపాటు మన భూగోళానికి మంచి జరిగేలా పని చేస్తామన్నారు.
భారత్–అమెరికా బంధానికి మద్దతుదారు తులసి
డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో ‘డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్’గా నియమితులైన హిందూ–అమెరికన్ తులసి గబార్డ్‌తో మోదీ సమావేశమయ్యారు. బ్లెయిర్ హౌస్‌లో ఈ భేటీ జరిగింది. భారత్–అమెరికా సంబంధాలపై వారు చర్చించారు. ఉగ్రవాద వ్యతిరేక పోరాటం, సైబర్ సెక్యూరిటీలో ఇంటెలిజెన్స్ సహకారం మరింత పెంపొందించుకోవాలని నిర్ణయించుకున్నారు. రెండు దేశాల మధ్య స్నేహం మరింత బలపడాలని తులసి గబార్డ్ కోరుకుంటున్నారని మోదీ చెప్పారు. భారత్–అమెరికా బంధానికి ఆమె గట్టి మద్దతుదారు అని పేర్కొన్నారు.
‘డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్’గా అత్యున్నత పదవి చేపట్టినందుకు తులసి గబార్డ్‌కు అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు మోదీ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ప్రధాని మోదీ రెండు రోజులపాటు అమెరికాలో పర్యటిస్తారు. భారత కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఆయన సమావేశమవుతారు. ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ట్రంప్ ‘అమెరికా ఫస్టు’ అనే విధానంతో ముందుకెళ్తూ అక్రమ వలసలపై కఠినంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఈ భేటీపై ఆసక్తి నెలకొంది. ప్రధానంగా భారతీయ అక్రమ వలసదార్లపై కరుణ చూపేలా తన మిత్రుడైన ట్రంప్‌ను మోదీ ఒప్పిస్తారా? అనే చర్చ సాగుతోంది. భారత ఉత్పత్తులపై టారిఫ్‌లు పెంచక తప్పదని ట్రంప్ ఇప్పటికే సంకేతాలిచ్చారు. టారిఫ్‌ల మోత మోగించకుండా ఉపశమనం లభించేలా చూడడం ఇప్పుడు మోదీ ముందున్న కర్తవ్యం అని నిపుణులు చెబుతున్నారు.
త్వరలో అమెరికా నుంచి మరో 487 మంది వలసదారులు
న్యూఢిల్లీ: మరో 487 మంది అక్రమ వలస దారులను అమెరికా ప్రభుత్వం వెనక్కి పంపించనుందని కేంద్రం శుక్రవారం వెల్లడించింది. ట్రంప్ ప్రభు త్వం చేపట్టిన వలసదారుల ఏరివేతలో భాగంగా మొదటి విడతగా ఈ నెల 5న 104 మంది అక్రమ వలసదారులతో కూడిన అమెరికా వైమానిక దళ ప్రత్యేక విమానం అమృతసర్‌కు రావడం తెలిసిందే. భారతీ యులుగా భావిస్తున్న మరో 487 మందిని గుర్తించిన అమెరికా అధికారులు వెనక్కి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు.
మరికొంతమందికి సంబంధించిన సమాచారం అమెరికా అధికారులు వెల్లడించనందున అక్రమ వలసదారుల సంఖ్య మరింత పెరిగే అవకాశా లున్నాయని ఆయన పేర్కొన్నారు. అమెరికా అధికారులు పంపించిన 487 మంది వలసదారుల పేర్లు, ఇతర వివరాల జాబితాను పరిశీలిస్తున్నామని చెప్పారు. మొదటి విడతలో పంపించిన 104 మందిలో పంజాబ్, హరియాణాలకు చెందిన వారు అత్యధికులుండటం తెలిసిందే. తమను వెనక్కి పంపే సమయంలో అమె రికా అధికారులు విమానంలో సుదీర్ఘ ప్రయాణ సమయంలో నేరస్తుల మాదిరిగా చేతులు, కాళ్లకు బేడీలు వేసి ఉంచారని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై అమెరికా అమెరికాకు ఆందోళన తెలుపుతామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment