న్యూయార్క్: దేశవ్యాప్తంగా గత ఏడాది ప్రకంపనలు సృష్టించిన పెగసస్ స్పైవేర్ వివాదం మరోసారి కేంద్రంలో మోదీ ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టేసింది. ఈ స్పైవేర్‌ను 2017లో ఇజ్రాయెల్ నుంచి స్వయంగా కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేసిందని అమెరికాకు చెందిన న్యూయార్క్ టైమ్స్ పత్రిక సంచలన కథనాన్ని ప్రచురించింది. రక్షణ ఒప్పందంలో భాగంగా అత్యంత ఆధునిక ఆయుధాలు, క్షిపణి వ్యవస్థతో పాటు పెగసస్ స్పైవేర్‌ని భారత్ కొనుగోలు చేసిందని ఆ కథనం ఆరోపించింది. 200 కోట్ల డాలర్ల విలువైన ఒప్పందంలో (రూ.15 వేల కోట్లు) భాగంగా పెగసస్ స్పైవేర్ కూడా కొనుగోలు చేసినట్టు పేర్కొంది.
ఏడాది పాటు పరిశోధన చేసి, ఎన్నో దేశాలకు చెందిన ప్రభుత్వ, ఇంటెలిజెన్స్ అధికారుల, సైబర్ నిపుణుల్ని ఇంటర్వ్యూలు చేసి ఈ విషయాన్ని రూఢి చేసుకున్నామని వెల్లడించింది. భారత్‌లో కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ సహా విపక్ష నాయకులు, ప్రభుత్వ అధికారులు, జర్నలిస్టులు, మానవ హక్కుల సంఘాల నేతలు, సామాజిక కార్యకర్తలు, పారిశ్రామికవేత్తల ఫోన్లు ట్యాప్ చేయడానికి ఈ పెగసస్ స్పైవేర్‌ని కేంద్ర ప్రభుత్వం ప్రయోగించినట్టుగా గత ఏడాది జులైలో ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. భారత్‌తో పాటు మరికొన్ని దేశ ప్రభుత్వాలు ఈ నిఘా వ్యవస్థని వాడినట్టుగా ఆరోపణలు రావడంతో సమాజంలో వివిధ వర్గాల గోప్యత ప్రశ్నార్థకంగా మారింది.
ఔననక.. కాదనక!
పెగసస్ స్పైవేర్ అంశం పార్లమెంటు వర్షాకాల సమావేశాలను దాదాపు తుడిచిపెట్టినపుడు కూడా కేంద్రంలోని మోదీ సర్కారు చాలా నర్మగర్భంగా సమాధానమిచ్చింది. ఏది జరిగినా... నిబంధనల ప్రకారమే, సంబంధిత చట్టాలకు లోబడి మాత్రమే జరిగిందని చెప్పుకొచ్చింది. సుప్రీంకోర్టు అడిగినపుడు కూడా ఇదే సమాధానం ఇచ్చింది. దేశ భద్రతతో ముడిపడి ఉన్న అంశం కాబట్టి ఇంతకంటే ఇంకేమీ చెప్పలేమని బదులిచ్చింది. పెగసస్ నిఘాపై స్వతంత్య్ర కమిటీతో విచారణ జరిపించి నేరుగా సుప్రీంకోర్టుకే నివేదిక సమర్పించేలా ఏర్పాట్లు చేస్తామని పేర్కొంది. అయితే సీజేఐ జస్టిస్ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఇందుకు అంగీకరించలేదు. గత ఏడాది అక్టోబరు 27న సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి ఆర్.వి.రవీంద్రన్ నేతృత్వంలో సాంకేతిక నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
– నేషనల్ డెస్క్, సాక్షి
Comments
Please login to add a commentAdd a comment