ప్రపంచ దేశాలను వణికిస్తున్న 'వాన్నక్రై'
లండన్: కంప్యూటర్ హ్యాకర్లు మరో సారి పంజా విసిరారు. ఏకంగా అమెరికా వాడే హ్యాకింగ్ టూల్స్‌నే దొంగిలించారు. తద్వారా వేలాది కంప్యూటర్లలో రాన్సమ్వేర్ వైరస్‌ను ప్రవేశపెట్టి సమాచారాన్ని చోరీ చేశారు. వివరాల్లోకి వెళ్తే కంప్యూటర్లకు అత్యంత ప్రమాదకరమైన రాన్సమ్వేర్ వైరస్ వేగంగా విస్తరిస్తోంది.
ఇటీవల జరిగిన రాన్సమ్వేర్ దాడుల్లో సుమారు వంద దేశాల కంప్యూటర్లు దీని బారిన పడ్డాయి. 'వాన్న క్రై' అనే పేరుతో కంప్యూటర్లలోకి చొచ్చుకుపోతున్న ఈ వైరస్..క్షణాల్లో కంప్యూటర్ వ్యవస్థను స్తంభింపజేస్తుంది. వైరస్ ఎంటరైన క్షణాల్లోనే..డబ్బు చెల్లిస్తేగానీ పని నడవదంటూ ఓ సందేశం కన్పిస్తోంది. ఆ వెంటనే మొత్తం ఐటీ వ్యవస్థ సమస్తం మొరాయిస్తుంది. కేవలం 10 గంటల వ్యవధిలోనే ఏకంగా 45 వేలకు పైగా సైబర్ దాడులు జరిగినట్లు గుర్తించారు. సుమారు 60వేల కంప్యూటర్ల సమాచారాన్ని హ్యాకర్లు తస్కరించారు. ప్రపంచంలో అత్యంత భద్రతా విభాగం ఉన్న అమెరికా భద్రతా విభాగం అమెరికా జాతీయ సెక్యూరిటీ సంస్థ ఉపయోగించే హ్యాకింగ్ టూల్స్‌తో ఈ సైబర్‌దాడులు జరిగాయి. ప్రపంచంలోని పలు ప్రముఖ కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి.
అంతర్జాతీయ కొరియర్ సంస్థ ఫెడెక్స్, యూకేలో పలు ప్రధాన ఆస్పత్రులు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ వైరస్ పలు రూపాల్లో మెయిల్స్, ఉద్యోగ అవకాశాలను ఎరగా చూపి మన కంప్యూటర్లలో ప్రవేశిస్తుంది. అనంతరం కంప్యూటర్లోని విషయాన్ని ఎన్‌క్రిప్ట్ చేసి డీక్రిప్ట్ చేయడానికి డబ్బు ఇవాలని డిమాండ్ చేస్తుంది. స్పెయిన్‌కు చెందిన టెలికం దిగ్గజం టెలిఫోనికా, పోర్చుగల్ టెలికాం, టెలిఫోనికా అర్జెంటీనా సంస్థలు దీని బారిన పడ్డాయి.
ఈ సైబర్ దాడికి ప్రధానంగా బ్రిటన్‌లోని అత్యధిక ఆస్పత్రుల ఐటీ వ్యవస్థ ఛిన్నాభిన్నమైంది. దాంతో అక్కడి జాతీయ ఆరోగ్య సేవలు దాదాపు స్తంభించిపోయాయి. చేసేదిలేక ఆస్పత్రి సిబ్బంది...తమ కంప్యూటర్లను కట్టేసి అత్యవసర సేవలను ఇతర ఆస్పత్రులకు మళ్లించారు. ఐటీ వ్యవస్థ కుప్పకూలిన కారణంగా వైద్య సేవలకు తీవ్ర విఘాతం ఏర్పడిందని, రోగుల క్షేమం కోసం ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేశామని బ్రిటన్ వైద్యాధికారులు చెప్తున్నారు.
సైబర్ అటాక్ కారణంగా మరో పెనుముప్పు కూడా ఎదురవుతోందని నిపుణులు భావిస్తున్నారు. 'వాన్నక్రై' వైరస్ ప్రధానంగా మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌కు సంబంధించిన 'ఎటర్నల్ బ్లూ' అనే తాజా ప్యాచ్ ద్వారా వ్యాపిస్తోందని గుర్తించారు. ఇంకోవైపు డబ్బు డిమాండ్ చేస్తూ కంప్యూటర్ తెరలపై దర్శమిస్తున్న సందేశాలు...ఇప్పుడు వాట్సాప్‌లోనూ ప్రపంచాన్ని చుట్టుముట్టాయి. ఇది మరింత విస్తరించే ప్రమాదం వుందని, చరిత్రలో ఇదే అతి పెద్ద సైబర్ అటాక్ కావచ్చని నిపుణులు భావిస్తున్నారు.