సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో ఇక నుంచి పూర్తి స్థాయిలో ఫేషియల్ రికగ్నిషన్ హాజరు విధానాన్ని అమలు చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి తాజాగా అన్ని స్కూళ్లకు పాఠశాల విద్య డైరెక్టర్ కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని 26 వేల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు నమోదును పారదర్శకంగా నిర్వహించేందుకు ఫేషియల్ రికగ్నిషన్ విధానాన్ని ప్రవేశపెట్టారు. దీనివల్ల హాజరు విధానంలో అక్రమాలకు ఆస్కారం లేకుండా చేయాలని భావిస్తున్నారు.
దీని కోసం ప్రత్యేక యాప్‌ను కూడా రూపొందించారు. కాగా, ఈ హాజరు విధానం ద్వారానే విద్యార్థులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం, స్కూల్ డ్రెస్, పాఠ్యపుస్తకాలు ఇవ్వాలన్నది విద్యాశాఖ ఆలోచన. అయితే, ఈ విధానాన్ని దాదాపు ఏడాదికిందటే ప్రవేశపెట్టినప్పటికీ ఇప్పటి వరకూ 40 శాతం స్కూళ్లలో కూడా అమలు కావడం లేదు. ఇంతకాలం ఎన్నికల విధులు, ఉపాధ్యాయులకు శిక్షణ ఉండటం వల్ల ఈ అంశాన్ని పట్టించుకోలేదు. ఇక నుంచి ఈ ప్రక్రియను పకడ్బందీగా కొనసాగించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు.
తప్పుడు హాజరుకు చెక్
ఇప్పటి వరకూ ప్రభుత్వ స్కూళ్లలో ఉపాధ్యాయులు హాజరు తీసుకునే విధానం ఉండేది. ప్రతీ నెల చివరి తేదీలో తరగతుల వారీగా హెచ్‌ఎంలు విద్యార్థుల హాజరును రాష్ట్ర కార్యాలయానికి పంపేవాళ్లు. అయితే ఈ వివరాలకు విద్యార్థులకు అందించే భోజనం, దుస్తులు, పుస్తకాల లెక్కకు సరిపోవడం లేదని ఉన్నతాధికారులు అంటున్నారు. అలాగే పాఠశాల నిర్వహణ నిధులను కూడా కచ్చితంగా లెక్కగట్టలేపోతున్నారు.
విద్యార్థుల సంఖ్యను బట్టి 30 లోపు ఉన్న స్కూలుకు రూ. 5 వేలు, 31కి మించి ఉన్న స్కూలుకు రూ. 10 వేల చొప్పున నిర్వహణ నిధులు ఇస్తున్నారు. కొన్ని స్కూళ్లలో విద్యార్థుల హాజరును తప్పుగా చూపించి, నిధులు ఎక్కువ తీసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. కాగా, హైదరాబాద్‌లోని చాలా స్కూళ్లలో ఫేషియల్ రికగ్నైజేషన్ హాజరును అసలు అమలు చేయడం లేదు. దీనికి అనేక రకాల సాంకేతిక కారణాలు చెబుతున్నారు.
ముందు నెట్ ఇవ్వాలి
–– పి.రాజాభాను చంద్రప్రకాశ్ (ప్రభుత్వ హెచ్‌ఎంల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు)
ఫేషియల్ రికగ్నైజేషన్ హాజరు అమలు విషయంలో అధికారులు సాంకేతిక ఇబ్బందులను పరిశీలించాలి. చాలా స్కూళ్లలో నెట్ సదుపాయం లేదు. ఈ హాజరు విధానం కోసం పక్క వాళ్ల నెట్ తీసుకోవడం రోజూ సాధ్యం కాదు. హెచ్‌ఎంల మొబైల్ నెట్ కొన్ని సార్లు పనిచేయడం లేదు. ఫేషియల్‌తో పాటు స్కూల్‌లో రికార్డు కోసం మ్యాన్యువల్‌గా హాజరు తీసుకోవడం కూడా బోధన సమయానికి ఇబ్బందే. మొదటి పీరియడ్‌లో చాలా సమయం హాజరుకే పోయే అవకాశం ఉంది. దీనిపై క్షేత్రస్థాయి సమస్యలు పరిశీలించాలి. నెట్ సదుపాయం అందుబాటులోకి తేవాలి.
ఇక అన్ని స్కూళ్లలో ‘ఫేషియల్ రికగ్నిషన్’
Published Tue, Jan 2 2024 4:43 AM | Last Updated on Tue, Jan 2 2024 10:05 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment