Telangana: 'స్మార్ట్‌'గా సర్కారీ స్కూల్‌ | Teaching through digital screens in 3,673 govt schools in Telangana | Sakshi
Sakshi News home page

Telangana: 'స్మార్ట్‌'గా సర్కారీ స్కూల్‌

Published Mon, Jan 6 2025 4:38 AM | Last Updated on Mon, Jan 6 2025 4:38 AM

Teaching through digital screens in 3,673 govt schools in Telangana

3,673 ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్‌ స్క్రీన్ల ద్వారా తొలిదశలో బోధన

ఇంటర్నెట్‌ సదుపాయం, ఆధునిక కంప్యూటర్‌ వ్యవస్థ, డిజిటల్‌ లైబ్రరీ, సరిపడా టీచర్లు,ఇతర మౌలిక వసతులు, ఆట స్థలం,ఉచిత రవాణా వసతి ఉండాలి 

మండలానికి రెండు లేదా మూడు పెద్ద స్కూళ్లుంటే చాలు.. ఆ మేరకు 10 వేల చిన్న స్కూళ్లు విలీనం చేయాలి 

స్మార్ట్‌ విద్యా విధానం, పెద్ద స్కూళ్లు నాణ్యత పెంచుతాయి

ప్రభుత్వానికి విద్యా కమిషన్‌ సిఫారసు! త్వరలో నివేదిక

సాక్షి, హైదరాబాద్‌:  ఇంటర్నెట్‌ సదుపాయం, ఆధునిక కంప్యూటర్‌ వ్యవస్థ, డిజిటల్‌ లైబ్రరీ, అన్నిటికీ మించి డిజిటల్‌ విద్యాబోధనకు అనుగుణంగా డిజిటల్‌ స్క్రీన్లు..తదితర ఏర్పాట్లతో రాష్ట్రంలోని స్కూళ్లను పూర్తిగా డిజిటలైజ్‌ చేయాలని విద్యా కమిషన్‌ భావిస్తోంది. మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత పెరగాలంటే పెద్ద స్కూళ్ళ ఏర్పాటే మార్గమని స్పష్టం చేస్తోంది. ఈ విధానంతో ప్రైవేటు స్కూళ్ళకు దీటుగా ప్రభుత్వ విద్యాసంస్థలను ముందుకు తీసుకెళ్ళొచ్చని అభిప్రాయపడుతోంది. 

విద్యార్థుల సంఖ్యను బట్టి మండలానికి 2 లేదా 3 స్కూళ్ళు ఉంటే సరిపోతుందని సూచిస్తోంది. విద్యా రంగం సంస్కరణలపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యా కమిషన్‌ వంద రోజులు స్కూళ్ళ నాణ్యతపై అధ్యయనం చేసింది. ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు, విద్యావేత్తలు, స్థానిక ప్రజా ప్రతినిధుల అభిప్రాయాలను తెలుసుకుంది. తక్షణమే తీసుకోవాల్సిన దిద్దుబాటు చర్యలకు సంబంధించిన కొన్ని సిఫారసులతో త్వరలోనే నివేదిక సమర్పించనుంది. విశ్వసనీయ సమాచారం మేరకు నివేదికలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.  

స్మార్ట్‌ విద్యా విధానంతో నాణ్యత: పాఠశాలల్లో ప్రతి సబ్జెక్టుకు సరిపడా టీచర్లు, ప్రయోగశాలలు, విశాలమైన తరగతులు, స్మార్ట్‌ కిచెన్, మౌలిక వసతులు, ఆట స్థలం ఉండేలా చూడాలి. విద్యార్థులు ప్రత్యక్షంగా చూసి వివిధ అంశాలు నేర్చుకునేందుకు వీలుగా స్టడీ టూర్లు నిర్వహించాలి. తొలిదశలో 3,673 పాఠశాలల్లోని 7,346 తరగతుల్లో తక్షణమే డిజిటల్‌ స్క్రీన్‌ ద్వారా బోధన జరగాలి. స్మార్ట్‌ విద్యా విధానం నాణ్యతను పెంచుతుంది. ఇందుకు కనీసం రూ.300 కోట్లు ఖర్చవుతుంది. 

ఒక్కో స్కూల్లో 100కు పైగా విద్యార్థులుండాలి 
పెద్ద స్కూళ్ల నిర్ణయం తీసుకునే ముందు ముఖ్యమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 41,628 ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లున్నాయి. ఇందులో 59 లక్షల మంది చదువుతున్నారు. ప్రభుత్వ స్కూళ్ళు 26,337 ఉంటే, వాటిల్లో 22.63 లక్షల మంది విద్యార్థులున్నారు. 11 వేల ప్రైవేటు స్కూళ్ళల్లో 34 లక్షల మందికి పైగా ఉన్నారు. ప్రైవేటు స్కూళ్ళు కూడా ఊరూరా లేవు. మండలంలోనూ ఒకటికి మించి ఉండటం లేదు. 

వీటిల్లో కనిష్టంగా 500, గరిష్టంగా 4 వేల మంది విద్యార్థులుంటున్నారు. కానీ రాష్ట్రంలోని 1,800 ప్రభుత్వ స్కూళ్ళల్లో అసలు అడ్మిషన్లే లేవు. 8,782 స్కూళ్ళల్లో 30కి మించి విద్యార్థులు లేరు. ఇందులో ప్రాథమిక పాఠశాలలే 8 వేలకుపైగా ఉన్నాయి. 10 వేల స్కూళ్ళల్లో 100 మందికి మించి లేరు. 5,800 స్కూళ్ళల్లో ఒకే ఉపాధ్యాయుడు ఐదు తరగతులకు బోధించే పరిస్థితి ఉంది. నిబంధనల ప్రకారం ప్రతి 30 మందికి ఒక టీచర్‌ ఉండాలి. 

కానీ ఇటీవల బదిలీలు, పదోన్నతుల నేపథ్యంలో 20 మందికి ఒక టీచర్‌ ఉండాలనే నిబంధన తెచ్చారు. అయినప్పటికీ గత ఏడాది కన్నా ఈ సంవత్సరం 1.62 లక్షల ప్రవేశాలు తగ్గాయి. ఈ నేపథ్యంలో ఒక్కో స్కూల్లో కనీసం వందకు పైగా విద్యార్థులు ఉండేలా చూడాలనేది మెజారిటీ అభిప్రాయంగా ఉంది. దీనిని పరిగణనలోకి తీసుకుంటే రాష్ట్రంలో పది వేల స్కూళ్ళను ఆయా మండలాల పరిధిలో విలీనం చేయవచ్చు.  

ఉచిత రవాణా వ్యవస్థ అవసరం 
గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులను ప్రైవేటు యాజమాన్యాలు సులభంగా దూరంలో ఉన్న తమ స్కూళ్ళకు తీసుకెళ్తున్నాయి. ఇందుకోసం బస్సులు, ఆటోలు, వ్యాన్లు ఉపయోగిస్తున్నాయి. ఇదే తరహాలో ప్రభుత్వ స్కూళ్ళకు ఉచిత రవాణా వ్యవస్థ ఉండాలి. సూదూర ప్రాంతాలకు విద్యార్థులను పంపేందుకు 92 శాతం గ్రామీణ ప్రాంతాల తల్లిదండ్రులు సిద్ధంగా ఉన్నట్టు మా అభిప్రాయ సేకరణలో తేలింది. అయితే రవాణా సౌకర్యం కోసం ఖర్చు పెట్టేందుకు వాళ్ళు సిద్ధంగా లేరు. అందువల్ల ప్రభుత్వం ఉచితంగా ఈ సౌకర్యం కల్పిస్తే ప్రభుత్వ స్కూళ్ళ వైపే మొగ్గు చూపుతారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement