తాగునీటి వసతి లేక ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు
ఎండలు పెరుగుతుండటంతో నానాటికీ తీవ్రమవుతున్న సమస్య
రాష్ట్రవ్యాప్తంగా వేలాది పాఠశాలల్లో ఇదే దుస్థితి
విద్యాశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చిన డీఈఓలు
6 వేల స్కూళ్లకు ‘మిషన్ భగీరథ’దూరం
4,500 పాఠశాలల్లో ట్యాంకుల నిర్వహణ లోపం
10 వేల స్కూళ్లల్లో ఇళ్ల నుంచే నీళ్లు తెచ్చుకుంటున్న వైనం
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో 450 ప్రభుత్వ స్కూళ్లకు తాగునీటి సరఫరా లేదు. 1,000కి పైగా స్కూళ్లలో స్థానికులు అరకొరగా కుండల్లో, క్యాన్లలో నీళ్లు అందిస్తున్నారు. మొదటి గంటలోనే ఇవి ఖాళీ. మధ్యాహ్నం వేళ విద్యార్థులు మంచినీటి కోసం అల్లాడే
పరిస్థితి ఉంది.
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో(Government school) ఇతర సౌకర్యాల మాట అటుంచితే వందలాది స్కూళ్లలో కనీసం తాగునీటి(Drinking water) వసతి లేకపోవడంతో విద్యార్థులు(Students) ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం ఎండలు పెరుగుతుండటంతో సమస్య మరింత తీవ్రంగా మారుతోంది. దాహం తీర్చుకునేందుకు పిల్లలు దిక్కులు చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇటీవల విద్యాశాఖ జరిపిన సమీక్షలో దాదాపుగా అన్ని జిల్లాల డీఈవోలు ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చారు.
మధ్యాహ్న భోజన సమయంలోనూ తాగునీరు అందుబాటులో లేని పరిస్థితి ఉంటోందని ఎంఈవోలు వివరిస్తున్నారు. స్కూళ్ళలో నీటి ట్యాంకుల నిర్వహణ సరిగా లేకపోవడం, గత ప్రభుత్వం ప్రారంభించిన మిషన్ భగీరథ మంచినీటి సరఫరా లేకపోవడం, అనేకచోట్ల విద్యుత్ కోతల కారణంగా ఓవర్ హెడ్ ట్యాంకులు నిండకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంటోంది.
రాష్ట్రవ్యాప్తంగా 26 వేల ప్రభుత్వ స్కూళ్లుండగా.. ప్రభుత్వానికి అందిన వివరాల ప్రకారం దాదాపు 6 వేల స్కూళ్ళకు భగీరథ నీరు సరఫరా అవ్వడం లేదు. 10 వేల స్కూళ్ళల్లో విద్యార్థులు ఇంటి నుంచి తెచ్చుకున్న నీళ్ళే తాగుతున్నారు. దాదాపు 4500 స్కూళ్ళల్లో నీళ్ళ ట్యాంకులు మరమ్మతుకు నోచుకోకపోవడం లేదా, నిర్వహణ లోపం వల్ల విద్యార్థులకు మంచి నీటి కొరత ఉంది.
దాదాపు అన్నిచోట్లా అదే దుస్థితి
⇒ ఆదిలాబాద్ జిల్లాలోని పలు స్కూళ్ళలో విద్యార్థులకు మంచినీటి సౌకర్యం లేదు. మధ్యాహ్న భోజనం చేసేటప్పుడు నీటి కోసం విద్యార్థులు ఎగబడే పరిస్థితి ఉంది. అంతమంది విద్యార్థులకు వాటర్ క్యాన్లలో నీళ్లు తేవడం సాధ్యం కావడం లేదని అక్కడి డీఈవో ఉన్నతాధికారులకు తెలిపారు.
⇒ కరీంనగర్ జిల్లాలోని 600 స్కూళ్ళకు మిషన్ భగీరథ నీటి సరఫరా లేదు. తాగునీటి కోసం ప్రధానోపాధ్యాయులు.. స్థానిక నేతలను ఆశ్రయిస్తున్నారు. కొన్నిచోట్ల స్థానికులు నీళ్ళు అందిస్తున్నారు. 800 ప్రభుత్వ స్కూళ్ళల్లో మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత చేతులు కడుక్కునే నీళ్ళు కూడా పొదుపుగా వాడాల్సిన పరిస్థితి ఉంది.
⇒ నిజామాబాద్‌లో పలు హాస్టళ్ళు, స్కూళ్ళల్లో నీటి నిల్వకు అవసరమైన వాటర్ ట్యాంకులు లేవు. దీంతో అప్పటికప్పుడు క్యాన్లలో నీళ్ళు తెప్పిస్తున్నారు. ఇవి మొదటి గంటలోనే అయిపోతున్నాయి.
⇒ వరంగల్ జిల్లాలో 1500 స్కూళ్ళలో విద్యార్థులు ఇళ్ళ నుంచే నీళ్ళు తెచ్చుకుంటున్నారు. తెచ్చుకోని తోటి విద్యార్థులు దాహం అవుతోందని అన్నా.. సందేహిస్తూనే ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటోంది. పలువురు హెచ్‌ఎంలు ఈ విషయాన్ని స్థానిక ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్ళారు.
⇒ ఉమ్మడి ఖమ్మం జిల్లా మారుమూల పల్లెల్లోని 820 పాఠశాలల్లో తాగునీటి సరఫరా అరకొరగా ఉంది. దీంతో విద్యార్థులు మధ్యలోనే స్కూళ్ళ నుంచి ఇంటికెళ్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో 600 స్కూళ్ళలో నీటి ట్యాంకుల నిర్వహణ సరిగా లేకపోవడంతో విద్యార్థులు దాహార్తితో అల్లాడుతున్నారు.
ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి
పెరుగుతున్న ఎండలతో పాటు స్కూళ్లలో మంచినీటి సమస్య తీవ్రమవుతుండటంతో విద్యాశాఖ అప్రమత్తమైంది. పాఠశాలల నుంచి సమగ్ర వివరాలు తెప్పించుకునే పనిలో ఉంది. టెన్త్ పరీక్షలు దగ్గర పడుతున్న దృష్ట్యా విద్యార్థులకు ప్రత్యేక క్లాసులు నిర్వహిస్తుండటంతో నీటి కొరత వేధిస్తోందని విద్యాశాఖ అధికారులు గుర్తించారు.
తక్షణ చర్యలు తీసుకునేందుకు వీలుగా ప్రత్యేక బడ్జెట్ విడుదల కోసం ప్రభుత్వానికి లేఖ రాయాలని నిర్ణయించారు. ఈలోగా స్థానిక ప్రజాప్రతినిధులు, అలా వీలు కాకపోతే హెచ్‌ఎంలు అవసరమైన తాగు నీటిని తెప్పించాలని, ఇందుకు సంబంధించిన బిల్లులను చెల్లిస్తామని డీఈవోలకు తెలిపారు. ఎంఈవోలు స్కూళ్ళలో నీటి సమస్యపై దృష్టి పెట్టాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment