water prblems
-
సాగునీరు ఇవ్వకుంటే ఆత్మహత్యలే
మంథని: నీరు లేక కళ్లెదుటే పంటలు ఎండిపోతుంటే అన్నదాతలు అరిగోస పడుతున్నారు. ‘అధికార యంత్రాంగం స్పందించి ఇప్పటికైనా నీరు అందించి చేతికొచ్చే పంటలను కాపాడాలి.. లేదంటే మాకు చావుతప్ప మారోమార్గం లేదు’ అని ఆవేదన వ్యక్తం చేస్తూ పెద్దపల్లి జిల్లా మంథని – గోదావరిఖని ప్రధాన రహదారిపై మంగళవారం వేలాది మంది రైతులు రాస్తారోకో చేశారు. చేతుల్లో పురుగులమందు డబ్బాలు, వరి గంటలు పట్టుకొని రోడ్డుపై రోడ్డుపై బైఠాయించారు. గంట పాటు ఉండిపోయారు. వరి పొట్టదశకు చేరిందని, నీరు అందక పంట కళ్లముందే ఎండిపోతుంటే గుండెలు తరుక్కుపోతున్నాయని కన్నీటిపర్యంతమయ్యారు. కాలువ నీరే ఆధారంగా పంటలు సాగుచేస్తే ఎగువన ఉన్న కొందరు రైతులు మోటార్లు పెట్టి చివరి ఆయకట్టుకు సాగునీరు అందకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్, నీటిపారుదల శాఖ అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ దుస్థితి నెలకొందని ఆరోపించారు. ఆందోళన తీవ్రరూపం దాల్చడంతో రోడ్డుకు ఇరు వైపులా వందలాది వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. సమాచారం అందుకున్న మంథని సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై వెంకటకృష్ణ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆందోళన విరమించాలని రైతులను కోరారు. నీటిపారుదల శాఖ ఈఈ బలరాం అక్కడకు చేరుకొని అక్రమంగా విద్యుత్ వినియోగించడంతోపాటు, కాలువలో విద్యుత్ మోటార్లు బిగిస్తున్న విషయంపై తమకు ఫిర్యాదు చేయాలన్నారు. విచా రణ జరిపి వాటిని తొలగించి చివరి ఆయకట్టుకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. దీంతో రైతులు శాంతించారు. -
జిల్లాకు చుక్క నీరైనా ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం
ఖలీల్‌వాడి: తొమ్మిది ఏళ్లలో సీఎం కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు చుక్కనీరు అందించలేదని రాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షుడు ఆన్వేష్‌రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ భవన్లో మంగళవారం జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు ముప్ప గంగారెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కిసాన్ కాంగ్రెస్ సమీక్ష సమా వేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కిసాన్ కాంగ్రెస్ కమిటీ, మండల అధ్యక్షులను ప్రకటిస్తూ నియామక పత్రాలు అందించారు. అనంతరం అన్వేష్‌రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాకు సాగు నీరు అందించడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలం చెందిందన్నారు. 21 ప్యాకేజీ ద్వారా గ్రావిటీ ద్వారా సాగు నీరు అందించే అవకాశం ఉన్నా, కమీషన్ల కోసం పైపు లైన్ ఏర్పాటు చేసి, ఇంత వరకు సాగునీరు అందించలేదన్నారు. కాంగ్రెస్ హయాంలో గుత్ప, అలీసాగర్ ఎత్తిపోతల పథకం నిర్మించామన్నారు. మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి ఆధ్వర్యంలో సాగునీటిపై రైతులతో సమావేశాలు ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లాలో తరుగు పేరు మీద దోపిడీ జరిగితే మంత్రి, ఎమ్మెల్యేలు మౌనంగా ఉన్నారని, ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు. అకాల వర్షాలతో పంట నష్టపోయినా ఇంత వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం పరిహారం అందించలేదన్నారు. రైతులకు ఇంతవరకు రుణమాఫీ చేయలేదన్నారు. ముప్ప గంగారెడ్డి మాట్లాడుతూ.. గ్రామాల్లో కిసాన్ కాంగ్రెస్ నాయకులు ప్రజల వద్దకు వెళ్లి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు చేసిన మోసాలను వివరించాలన్నారు. రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే చేసే పనులను రైతులకు ఏకకాలంలో రూ.2లక్షల రుణమాఫీ చేస్తుందని తెలిపారు. భూమిలేని ఉపాధి హామీ కూలీలకు రూ.12వేలు ప్రతియేటా అందిస్తామన్నారు. పీసీసీ ఉపాధ్యక్షుడు తాహెర్‌బిన్‌హందాన్, జిల్లా కిసాన్ సెల్ ఇన్‌ఛార్జి ఆదిరెడ్డి, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్‌రెడ్డి తదితరులు ఉన్నారు. -
సొంతపిచ్‌పై...అఖిలేశ్‌కు అగ్నిపరీక్ష!
ఉత్తరప్రదేశ్ మొదటిదశ ఎన్నికల్లో జాట్లు కీలకంగా మారగా.. రెండోదశలో (ఫిబ్రవరి 14న పోలింగ్ జరిగింది) ముస్లిం ఆధిపత్య ప్రాంతాల్లో పోలింగ్ జరిగింది. ఈనెల 20న మూడోదశ పోలింగ్ యాదవుల బెల్ట్‌లో జరుగుతోంది. మూడు ప్రాంతాల్లో విస్తరించి ఉన్న 16 జిల్లాల్లోని 59 నియోజకవర్గాల్లో యాదవ సామాజికవర్గ బలమెక్కువ. సమాజ్‌వాది (ఎస్పీ)కి దీన్ని కంచుకోటగా అభివర్ణిస్తారు. అలాంటి ఈ ప్రాంతంలో 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీకి తలబొప్పి కట్టింది. అఖిలేశ్‌పై తిరుగుబాటు చేసి సొంతకుంపటి పెట్టుకున్న బాబాయి శివపాల్ సింగ్ యాదవ్‌తో ఇటీవలే సయోధ్య కుదుర్చుకోవడం ద్వారా పరిస్థితిని చక్కదిద్దుకున్నప్పటికీ ఎస్పీ అధినేతకు మూడోదశ విషమపరీక్షగా నిలుస్తుందని భావిస్తున్నారు. ఈ ప్రాంతంలోని కర్హల్ నుంచే అఖిలేశ్ స్వయంగా బరిలో నిలిచారు. బాబాయ్‌తో సయోధ్యతో పూర్వవైభవంపై ఆశలు పశ్చిమ యూపీలోని..ఐదు జిల్లాలు, అవధ్ ప్రాంతంలోని ఆరు జిల్లాలు, బుందేల్‌ఖండ్ ప్రాంతంలోని ఐదు సీట్లకు ఫిబ్రవరి 20న మూడోదశ పోలింగ్ జరగనుంది. ఫిరోజాబాద్,, కాస్గంజ్, ఎతాహ్, మెయిన్‌పురి,, ఫరూకాబాద్,, కన్నౌజ్, ఔరాయా జిల్లాలు 2017లో అఖిలేశ్ పార్టీకి ఓటువేయలేదు.ఫలితంగా ఐదేళ్ల కిందట మొత్తం 59 సీట్లలో బీజేపీ ఏకంగా 49 తమ ఖాతాలో వేసేసుకుంది. సమాజ్‌వాది పార్టీ తొమ్మిది సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఎస్పీ అధినేత కుటుంబకలహాలు పార్టీ విజయావకాశాలను తీవ్రంగా దెబ్బతీశాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీఎస్పీతో పొత్తు ఉన్నప్పటికీ అఖిలేశ్ సతీమణి డింపుల్ యాదవ్ కన్నౌజ్ నుంచి ఓటమి పాలయ్యారు. అంతకుముందు 2012లో ఈ 59 సీట్లలో (20న పోలింగ్ జరిగే స్థానాలు) ఎస్పీ 37 చోట్ల నెగ్గడం గమనార్హం.. దీన్ని దృష్టిలో పెట్టుకొనే ఈ బెల్ట్‌లో ఎస్పీ విజయావకావలు దెబ్బతినకూడదనే ఉద్దేశంతో అఖిలేశ్ తన శివపాల్ యాదవ్‌ను మళ్లీ అక్కున చేర్చుకున్నారు. గతంలో హథ్రాస్ గ్యాంగ్‌రేప్ ఘటన కూడా ఈ ప్రాంతంలోనే జరిగింది. దీని నుంచి లబ్ధి పొందాలని చూస్తున్న ఎస్పీ అధినేత ఎన్నికల ప్రచారంలో పదేపదే ప్రస్తావిస్తున్నారు. అలాగే ప్రతినెలా ‘హథ్రాస్ కి బేటి స్మృతి దివస్’ను నిర్వహిస్తున్నారు. బుందేల్‌ఖండ్ బాగా వెనుకబడిన ప్రాంతం కావడతో నిరుద్యోగ సమస్య, నీటి ఎద్దటి తదిదర సమస్యలు ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని.. ఎస్పీ అధికారంలోకి వస్తే ఉచిత రేషన్, నెలకు కిలో నెయ్యిని అందిస్తామని అఖిలేశ్ ఓటర్లుకు హామీ ఇచ్చారు. ఒకప్పుడు బుందేల్‌ఖండ్ బీఎస్పీకి కంచుకోటగా ఉండేది. కానీ 2017లో వీచిన బీజేపీ గాలితో బీఎస్పీ తుడిచిపెట్టుకుపోయింది. హైటెన్షన్ పోరు కర్హాల్ నియోజకవర్గంలో అఖిలేశ్‌కు పోటీగా ఓబీసీ నాయకుడు, కేంద్ర మంత్రి సత్యపాల్‌సింగ్ బఘేల్‌ను బీజేపీ బరిలోకి దింపింది. ఈ స్థానంలో మొత్తం ఓటర్లలో 38 శాతం మంది యాదవులే. తర్వాతి స్థానంలో క్షత్రియులు ఉంటారు. భోగావ్ నియోజకవర్గంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి రామ్‌నరేశ్ అగ్నిహోత్రికే బీజేపీ టిక్కెట్టు ఇచ్చింది. కాన్పూర్ నగర్ జిల్లాలోని మహారాజ్‌పూర్ నుంచి సతీష్ మహానాను బీజేపీ మరోసారి రంగంలోకి దిగింది. తొలిదశ ఎన్నికలు పశ్చిమ యూపీలో జరిగినందువల్ల తమకు అనుకూలత ఉందని భావిస్తున్న అఖిలేశ్ యాదవ్ మూడోదశలో ఎలాగైనా పైచేయి సాధించాలనే పట్టుదలతో పని చేస్తోంది.దీంట్లో పైచేయి సాధిస్తే మిగతా నాలుగు దశల్లో కొంత ప్రశాంతంగా పనిచేసుకోవచ్చని ఎస్పీ భావిస్తోంది. యోగి నేతృత్వంలోని బీజేపీ సర్కార్ కుల, సంకుచిత, నియంతృత్వ పాలనకు ముగింపు పల కండి. సమాజంలోని అన్ని వర్గాలను సమదృష్టితో చూసే బహుజన సమాజ్ పార్టీకే పట్టంకట్టండి. దోపిడీదారుల అరాచకాలతో గతంలో యూపీ ప్రాంత ప్రజలు అవస్థలు పడ్డారు. మా పాలనలో వీరందరినీ ఏరిపారేశాం. ఎస్పీ పాలనలో రాష్ట్రంలో కేవలం ఒక వర్గం వారే అభివృద్ధి ఫలాలను అందుకున్నారు. మా ప్రభుత్వం వెనకబడిన కులాల అభివృద్ధి కోసం ఎంతగానో శ్రమించింది. మిగతా పార్టీల్లా మేం నెరవేర్చని వాగ్దానాలు చేయబోం. అందుకే ఈసారి ఎన్నికల్లో పార్టీ మేనిఫెస్టోను విడుదలచేయలేదు. – బీఎస్పీ చీఫ్ మాయావతి అఖిలేశ్ గెలుపు ఖాయమని మొదట్లో అతి విశ్వాసంతో ఉన్నారు. తాను పోటీ చేస్తున్న కర్హాల్ నియోజకవర్గంలో స్వయంగా ప్రచారం చేయా ల్సిన పనే లేదని, నేరుగా ఫలితాలు వెలువడే రోజు(మార్చి పదో తేదీ)న కర్హాల్ వస్తానని అఖిలేశ్ ధీమా వ్యక్తంచేశారు. కానీ ప్రస్తుతం పరిస్థితి మారినట్లు స్పష్టంగా తెలుస్తోంది. స్వయంగా ములాయం సింగ్‌తో ముందే ప్రచారం చేయిస్తున్నారు. ఆయన ఈ ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొనడం ఇదే తొలిసారి. ఈసారి ఎన్నికల్లో 300 సీట్లు సాధించి బీజేపీ ఘన విజయం సాధించాలని ఓటర్లు ఆకాంక్షిస్తే.. ఈ గెలుపు పరంపర కర్హాల్ నుంచే మొదలవ్వాలి. – హోం మంత్రి అమిత్ షా – నేషనల్ డెస్క్, సాక్షి -
నీటి కటకట.. ఒంటెల కాల్చివేత
సిడ్నీ: కరవుతో అల్లాడుతున్న ఆస్ట్రేలియాలో నీళ్లు ఎక్కువగా తాగే పదివేల ఒంటెలను కాల్చేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. శిక్షణ పొందిన షూటర్లతో హెలికాప్టర్ల నుంచి కాల్చడం ద్వారా ఒంటెల సామూహిక హనన కార్యక్రమం బుధవారం నుంచే ప్రారంభం కానుంది. నీళ్లకోసం వెంపర్లాడుతున్న ఈ మూగజీవాలు గుంపులుగా మానవ ఆవాసాల వద్దకు వచ్చేస్తున్నాయని, ఫలితంగా అక్కడి గిరిజన తెగల ప్రజలకు ముప్పు ఏర్పడుతోందని ప్రభుత్వం చెబుతోంది. భారీ సంఖ్యలో ఉండే ఒంటెల మందలు నీటి కోసం వెతుక్కుంటూ గ్రామీణ ప్రాంతాల్లోకి చొరబడుతున్నాయని, మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయడమే కాకుండా.. ఆహారం, నీళ్లను వాడేస్తున్నాయని దక్షిణ ఆస్ట్రేలియా అధికారి ఒకరు తెలిపారు. ఆస్ట్రేలియాలో కనివినీ ఎరుగని రీతిలో వేడి వాతావరణం కొనసాగుతూండటంతో కొన్ని చోట్ల నీళ్లు అడుగంటిపోయి కార్చిచ్చులు పెచ్చరిల్లిపోతున్న విషయం తెలిసిందే. కరవు కారణంగా జంతువులను రక్షించుకోవడమూ కష్టమవుతోందని నీటికోసం పోటీపడే క్రమంలో కొన్ని ఒంటెలు తొక్కిసలాటలో మరణించగా... మరికొన్ని నీళ్లులేక మరణించాయని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. కొన్నిచోట్ల మృతదేహాల కారణంగా తాగునీరు కలుషితమైన సందర్భాలూ ఉన్నాయని చెప్పారు. -
గత పాలకుల నిర్లక్ష్యంవల్లే..
సాక్షి, భీమవరం(పశ్చిమగోదావరి) : భీమవరం పట్టణంలోని మంచినీటి సమస్యకు గత పదేళ్లుగా పాలకుల నిర్లక్ష్యం, అవగాహన లోపమే కారణమని స్ధానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ధ్వజమెత్తారు. తక్కువ జనాభా ఉన్న ప్రాంతానికి ఎక్కువ నీరు, ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాలకు తక్కువ నీరు పంపిణీ చేస్తూ ప్రజలను ఇబ్బందులు పాలు చేశారని ఆదివారం రాత్రి తన క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ ఎన్.అమరయ్యతో కలసి విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. గత పదేళ్లుగా మున్సిపాల్టీని పాలిస్తున్న టీడీపీ నాయకులు, ఎమ్మెల్యే కూడా మంచినీటి సమస్యపై దృష్టిపెట్టలేదని విమర్శించారు. పదేళ్లుగా పట్టణ జనాభాతోపాటు పట్టణానికి వివిధ అవసరాల కోసం వచ్చే ప్రజల సంఖ్య పెరిగినా ఆ మేరకు నీటి సరఫరా చేయడానికి ఎలాంటి ప్రత్యేక ప్రణాళిక రూపొందించలేదన్నారు. మంచినీటి సరఫరా కోసం కేంద్రప్రభుత్వం రెండేళ్ల క్రితం నిధులు మంజూరు చేసినా వాటిని సద్వినియోగం చేసుకోవడంలో గత పాలకులు విఫలమయ్యారని శ్రీనివాస్ దుయ్యబట్టారు. అమృత పథకంలో పైపులైన్లు వేయాల్సివుంటుందని తెలిసిన ప్రాంతాల్లో సైతం సిమెంట్ రోడ్డు నిర్మించి ఆ తరువాత వాటిని «పగులగొట్టి మంచినీటి పైపులైను వేయడం మున్సిపల్ పాలకుల అవగాహనా రాహిత్యానికి నిదర్శనమన్నారు. సీఎం దృష్టికి తీసుకెళ్తా ఒక పక్క పట్టణ శివారు ప్రాంతాల ప్రజలకు తాగునీరు అందక ఇక్కట్లు పడుతుంటే ఎలాంటి ఆలోచన లేకుండా కొత్తగా 1,500 కుళాయి కలెక్షన్లు కొత్తగా ఇచ్చి మరింత ఇబ్బందులకు గురిచేశారని ఆవేదన వ్యక్తంచేశారు. పట్టణం మొత్తం మీద వన్‌టౌన్, త్రీటౌన్ ప్రాంతంలో సుమారు లక్షా 65 వేల మంది జనాభా ఉండగా వారికి నాలుగు ఓహెచ్‌ఆర్ ద్వారా కేవలం 53 లక్షల లీటర్ల నీటిని సరఫరా చేస్తుంటే కేవలం 32 వేల మంది జనాభా ఉన్న రెండో పట్టణ పరిధిలో రెండు ఓహెచ్‌ఆర్‌ల ద్వారా ఏకంగా 31 లక్షల లీటర్ల నీటిని సరఫరా చేయడం విచిత్రంగా ఉందన్నారు. వన్‌టౌన్ పరిధిలోని ఓహెచ్‌ఆర్‌ల ద్వారా పంపిణీ చేసే 53 లక్షల లీటర్ల నీటిలో 10 లక్షల లీటర్ల నీటిని ట్యాంకర్ల ద్వారా వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారని వివరించారు. పట్టణానికి అవసరమైన సమ్మర్‌స్టోరేజ్ ట్యాంక్‌తోపాటు మరో మంచినీటి చెరువు ఉన్నా నీటి సరఫరా చేయడానికి అవసరమైన ఓహెచ్‌ఆర్‌లు, పైపులైనులు లేవని, వీటిని నూతనంగా ఏర్పాటుచేయడానికి గత పాలకులు ఎలాంటి కృషిచేయలేదని ఎమ్మెల్యే శ్రీనివాస్ విమర్శించారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన తరువాత ప్రధానంగా మంచినీటి సమస్యపైనే దృష్టిసారించానని దానిలో భాగంగా మున్సిపల్ కమిషనర్, మునిసిపల్ ఇంజనీర్లతో సమీక్షించినట్లు చెప్పారు. పట్టణ ప్రజల అవసరాలకు కోటి 40 లక్షల లీటర్ల నీటిని సరఫరా చేయాల్సివుండగా పైపులైన్లు అస్తవ్యస్థంగా ఉండడం, సరిపడా ఓహెచ్‌ఆర్‌లు లేకపోవడం వల్ల కేవలం 85 లక్షల లీటర్ల నీటిని మాత్రమే సరఫరా చేస్తున్నట్లు తెలిసిందన్నారు. పట్టణానికి మరో మూడు ఓహెచ్‌ఆర్‌లు అవసరమవుతాయని అమృత్ పథకంలో దుర్గాపురంలో నిర్మాణం చేపట్టారని, మరో రెండు ఓహెచ్‌ఆర్‌ల నిర్మాణానికి ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సివుందన్నారు. మంచినీటి సమస్య ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి సత్వర పరిష్కారానికి కృషిచేస్తానని ఆయన స్పష్టం చేశారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన తరువాత తాగునీటి కష్టాలు వచ్చినట్లు కొంతమంది ప్రచారం చేస్తున్నారని, నియోజకవర్గ ప్రజలంతా సంతోషంగా ఉంటేనే తాను సంతోషంగా ఉంటానని శ్రీనివాస్ స్పష్టం చేశారు. డ్రయిన్లలో పూడికతీతలోను అలసత్వమే.... మున్సిపల్ పాలకులు పట్టించుకోకపోవడంతో పట్టణంలోని డ్రయిన్లలో పూడికతీత పనులు జూన్, జూలైలో చేపడుతున్నారని శ్రీనివాస్ విమర్శించారు. పూడిక మట్టి వర్షాల కారణంగా తిరిగి డ్రయిన్లలోకి చేరుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. -
నీళ్లు లేవు.. నీడా లేదు!
నల్లగొండ : వేసవిలో ఇతర పనులు దొరకని పరిస్థితి. అలాంటి వారు వలస వెళ్లకుండా, కుటుంబ పోషణలో ఇబ్బందులు పడకుండా ఉండేందుకు చేపట్టిన జాతీయ ఉపాధి హామీ పథకం పనుల వద్ద సౌకర్యాలు కరు వయ్యాయి. అసౌకర్యాల నడుమ కూలీలు పనులు చేస్తున్నారు. పనిచేసే చోట కూలీలకోసం టెంట్లు ఏర్పాటు చేయాలని నిబంధన ఉన్నా సిబ్బంది పట్టించుకోవడం లేదు. అధికారులు తాము అన్ని గ్రూప్‌లకు టెంట్లు ఇచ్చామని చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో కనిపించడం లేదు. జిల్లాలో మొత్తం 8,76,807 మంది ఉపాధి హామీ కూలీలు నమోదై ఉన్నారు. 3,69,000 జాబ్‌కార్డులు ఉన్నాయి. వేసవిలో ప్రత్యేక పనుల కోసం అధికారులు ఇటీవల ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వ అనుమతి పొందారు. ఏప్రిల్ 2019 నుంచి మార్చి 2020 వరకు 77 లక్షల పనిదినాలు కల్పించాలని అధికారులు నిర్ణయించారు. ప్రతి కుటుంబానికి 100 రోజులు పని తప్పనిసరిగా కల్పించాల్సి ఉంది. ఇందుకు సుమారు 240 కోట్ల రూపాయలను ఖర్చు చేయాలని నిర్ణయించారు. ఈ నెల 1వ తేదీ నుంచి జిల్లాలో ఉపాధి హామీ పనులను అమలు చేస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో కూలీలకు 5 లక్షల పనిదినాలు కల్పించినట్లు అధికారులు చెబుతున్నారు. చేసిన పనులకుగాను 9 కోట్ల రూపాయలను కూలీల ఖాతాలో జమచేసినట్లు అధికారులు తెలుపుతున్నారు. భానుడి విశ్వరూపం.. ఎండాకాలంలో భానుడు తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతున్నాయి. ప్రస్తుతం గ్రామాల్లో ఇంకుడుగుంతలు, కందకాలు, చెరువుల పూడిక, చెట్ల తొలగింపు, నర్సరీలు, కాల్వ పూడిక తదితర పనులు చేస్తున్నారు. ఉదయం 9 గంటలకే ఎండ సుర్రుమంటోంది. కూలీలు ఎండ తీవ్రతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎండ తీవ్రంగా ఉండడంతో ఉదయం పూట వెళ్లి పనులు చేస్తున్నారు. ఉపాధి నిబంధనల ప్రకారం కూలీలకు పనిచేసే చోట టెంట్లు ఏర్పాటు చేయాలి. అధికారులు ఎప్పుడో గ్రామాల వారీగా అందించారు. ఎక్కడా అటువంటి ఏర్పాట్లు చేయడం లేదు. అసలు అవి ఉన్నాయా లేవా అన్నది తెలియని పరిస్థితి.. దీంతో కూలీలు చెట్లకింద సేదదీరుతున్నారు. కూలీలే తట్టలు, మంచి నీరు కూడా తెచ్చుకుంటున్నారు. అందుకు అధికారులు డబ్బులు చెల్లిస్తున్నామని చెబుతున్నారు. సౌకర్యాలు లేవు మేము పక్షం రోజులుగా కడపర్తి పెద్ద చెరువులో ఉపాధి హామీ పనులు చేస్తున్నాం. మంచీనటి సౌకర్యం కూడా లేదు. కనీసం టెంట్లు కూడా వేయలేదు. పనులు చేసేందుకు గడ్డపారలు కూడా ఇవ్వలేదు. ఎండకు ఎండుతూ ఉపాధి హామీ పనులు చేస్తున్నాం... – నూనె లింగయ్య, ఉపాధి కూలీ, కడపర్తి, నకిరేకల్ ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌లు పెట్టాలి ఉపాధి హామీ పనులు జరుగుతున్న ప్రదేశాలలో ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌లు కూడా ఇవ్వాలి. వడదెబ్బకు గురైనప్పుడు కూలీలకు ఇబ్బందులు ఎదురవుతాయి. పని చేస్తున్న ప్రదేశాలలో టెంట్లు కూడా వేయాలి. – జీడిపల్లి లక్ష్మమ్మ, ఉపాధి హామీ మేట్, కడపర్తి, నకిరేకల్ మండలం -
ఓట్ల మోహం.. తీరని దాహం..
సాక్షి, వేలేరుపాడు: ఎన్నికల సమయంలో ఓట్ల కోసం ఆ గ్రామానికి కాలినడకన నేతలు వెళతారు. గుక్కెడు నీటి కోసం ఆ గ్రామ కొండరెడ్లు పడుతున్న కష్టాలు కళ్లారా చూస్తారు. కష్టాలు తీరుస్తామని హామీలు ఇస్తారు. అయితే ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆ గ్రామం వైపు కన్నెత్తి చూడకుండా మిన్నకుండి పోతారు. ఇది 50 ఏళ్లుగా నాయకులకు పరిపాటిగా మారింది. వేలేరుపాడు మండలంలోని అటవీ ప్రాంతంలో అత్యంత మారుమూలన ఉన్న కాకిస్‌నూరు గ్రామ దుస్థితి ఇది. ఎలాంటి రహదారి, విద్యుత్ సౌకర్యంలేని ఈ గ్రామానికి గోదావరి మార్గం గుండా వెళ్లాల్సిందే. వేలేరుపాడు మండలం టేకుపల్లి దాటాక గోదావరి ఒడ్డునుంచి రెండు కిలోమీటర్లు కాలినడకన ప్రయాణిస్తే పెద్దగుట్టపై ఈ గ్రామం కనిపిస్తుంది. ఇక్కడ 120 కొండరెడ్ల కుటుంబాలు ఉన్నాయి. గ్రామం ఏర్పడి దాదాపు వందేళ్లు అవుతోంది. గ్రామస్తులు మొదటి నుంచి తాగునీటి కోసం కష్టాలు పడుతూనే ఉన్నారు. గ్రామానికి చేరువలో ఉన్న పాపికొండల కాలువ నీరే వీరికి తాగునీరు. ఈ కాలువ వర్షాకాలంలో ఉధృతంగా ప్రవహిస్తుంది. అయితే ఆ సమయంలో నీరంతా బురద రంగులో ఉండటంతో వీరు తాగరు. వర్షం నీటిని మాత్రమే తాగునీరుగా వినియోగిస్తారు. అదెలా అంటే ఓ పలుచటి గుడ్డను నాలుగువైపులా తాళ్లతో కట్టి మధ్యలో రాయి ఉంచుతారు. దాని కింద బిందె పెట్టి నీళ్లు పట్టుకుంటారు. ఆ నీటిని వర్షాకాలం సీజన్లో తాగుతారు. ఆ తర్వాత రోజుల్లో పాపికొండల కాలువ నీరు వీరికి దిక్కు. అటవీ ప్రాంతంలో భారీ గుట్టల నడుమ ఆకులు అలమలు పడి పారే ఈ కాలువ చెలమల్లో నీటిని తోడుకుని తాగుతున్నారు. చెలమల నుంచి నీటి బిందెలతో మహిళలు గుట్టపైకి ఎక్కుతూ పడరాని పాట్లు పడుతున్నారు. ఈ కలుషిత నీరు తాగడం వల్ల రోగాలబారినా పడుతున్నారు. ఈ గ్రామంలో కనీసం మంచినీటి చేతిపంపు వేయించేందుకు కూడా ఎవరూ ప్రయత్నించిన దాఖలాలు కూడా లేవు. కొత్త పాలకులు అయినా ఇటుగా దృష్టి సారించాలని వీరంతా కోరుతున్నారు. -
గ్రామాల్లో దాహం.. దాహం
సాక్షి,గాండ్లపెంట: వేసవి కాలం రాకముందే పలు గ్రామాల్లో భూగర్భజలాలు అడుగంటి దాహం కేకలు వినిపిస్తున్నాయి. తాగునీటి సమస్యతో స్థానికుల సతమతమవుతున్నారు. చుక్క నీటి కోసం రాత్రిళ్లు జాగరణ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గాండ్లపెంట మండల పరిధిలోని మలమీదపల్లి గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాలైన దేవలచెరువుపల్లి, కరణంవారిపల్లి, కోటూరు గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. కోటూరు గ్రామంలో టీడీపీకి చెందిన ఓ జెడ్పీటీసీ ఉన్నా పట్టించుకోవడం లేదు. కోటూరులో గత నాలుగు నెలలుగా మంచినీటి కోసం ఇబ్బందులు పడుతున్నా అధికారులు, పాలకులు పట్టించుకోలేదని గ్రామస్తులు విచారం వ్యక్తం చేస్తున్నారు. మలమీదపల్లి గ్రామ పంచాయతీ బోరులో అదనపు పైపులు అమర్చినా నీరు ఓహెచ్‌ఆర్ ట్యాంకు చేరకపోవడంతో ఎగువ ప్రాంతాల్లోని వారు రాత్రి సమయంలో ఎక్కడ బోర్లు ఉంటే అక్కడికి వెళ్లి నీళ్లు తెచ్చుకుంటున్నారు. పంచాయతీ బోరు నీటిని నేరుగా ఓహెచ్‌ఆర్ ట్యాంకుకు నింపితే అందరికి నీరు అందే వీలుందని మలమీదపల్లి ఎంపీటీసీ వైస్ ఎంపీపీ ఆదెప్పనాయుడు తెలిపారు. ఎగువ ప్రాంతాల్లో కుటుంబాలు అధికంగా ఉన్నాయని, పంచాయతీ నీటిని నేరుగా ట్యాంకుకు పంపితే కొద్దో గొప్పో ఎగువ ప్రాంతాలకు నీరు అందే వీలుంది. అదే విధంగా దేవలచెరువుపల్లిలో నాలుగు నెలలుగా తీవ్ర తాగునీటి ఎద్దడి ఏర్పడినా ఎవరూ స్పందించలేదు. కోటూరులో పంచాయతీ పథకంలో నీరు అడుగంటి పోవడంతో వచ్చే కొద్దిపాటి నీటి కోసం రాత్రిళ్లు బిందెలు కోళాయిల వద్ద ఉంచాల్సిన దుస్థితి నెలకొంది. -
భారత్‌లో తీవ్రమైన నీటి ఎద్దడి
న్యూఢిల్లీ: భారత చరిత్రలోనే తొలిసారిగా దేశం దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటోందని నీతి ఆయోగ్ వెల్లడించింది. ఈ పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతోందని ‘కంపోజిట్ వాటర్ మేనేజ్మెంట్ ఇండెక్స్’ పేరుతో గురువారం విడుదల చేసిన నివేదికలో స్పష్టం చేసింది. ‘ప్రస్తుతం దేశంలో 60కోట్ల మంది తీవ్రమైన నీటి కొరతతో ఉన్నారు. సరైన తాగునీరు లేనికారణంగా ఏటా 2లక్షల మంది చనిపోతున్నారు’ అని ఈ నివేదికలో నీతిఆయోగ్ పేర్కొంది. ఇప్పటినుంచే దేశంలో జలవనరులు, వాటి వినియోగంపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని గుర్తుచేసింది. ‘2030 కల్లా దేశంలో నీటి సరఫరాకు రెట్టింపుగా డిమాండ్ ఉండబోతుంది. దేశ ప్రజలందరికీ నీటి కొరత తప్పేట్లులేదు. దీని కారణంగా జీడీపీ 6 శాతానికి పడిపోతుంది’ అని ఈ నివేదిక విడుదల సందర్భంగా కేంద్ర జలవనరుల మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. 122 దేశాల్లోని పరిస్థితుల ఆధారంగా వివిధ అంతర్జాతీయ సంస్థలు సిద్ధం చేసిన నీటి నాణ్యత సూచీలో భారత్ 120వ స్థానంలో ఉండటం.. దేశంలోని 70% నీరు కలుషితమవడాన్నీ ఈ నివేదిక పేర్కొంది. 2030 కల్లా ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ సహా 21 నగరాల్లో భూగర్భజలాలు అడుగంటిపోతాయని.. దీంతో 10కోట్ల మందిపై ప్రభావం ఉంటుందంది. -
కందకాలతో కరువు తీరింది!
‘వర్షానికి కరువు లేకపోయినా ఎండాకాలం పంటలకు సాగు నీటి కరువు వెంటాడుతూ ఉండేది. కానీ కందకాలు తవ్వుకున్న తర్వాత ఈ ఏడాది ఎండాకాలం కూడా బోర్లలో పుష్కలంగా నీరు ఉండడంతో నిశ్చింతగా ఉన్నామ’ని అంటున్నారు వై.వి. కృష్ణమోహన్, శైలజ రైతు దంపతులు. సిద్ధిపేట జిల్లా జగ్దేవ్పూర్ మండలం చాట్లపల్లి గ్రామ పరిధిలో వీరు ఏడేళ్ల క్రితం 43 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. 2013లో ఆరెకరాల్లో మామిడి మొక్కలు నాటారు. మిగతా పొలంలో మొక్కజొన్న తదితర పంటలు పండిస్తున్నారు. ఐదు బోర్లు వేశారు. ఆ ప్రాంతంలో ఏటా 800 ఎం.ఎం. వర్షం కురుస్తుంది. వర్షానికి ఎప్పుడూ కరువు లేదు. కానీ, ఎండాకాలం వచ్చే సరికి బోర్లు ఎండిపోవడం షరామామూలుగా మారింది. పెట్టిన తోటను ఎండాకాలం కాపాడుకోగలమా లేదా అన్న అభద్రత వెంటాడుతూ ఉండేది. బోర్ల ద్వారా నీటిని తోడి నిల్వ చేసుకుందామని రెండు నీటికుంటలు తవ్వించుకొని ప్లాస్టిక్ షీట్ పరిచారు. అయితే, ఎండాకాలం వచ్చేసరికి బోర్లు ఎండిపోతుండడంతో ఈ నీటి కుంటలు వృథాగా మారాయి. ఈ నేపథ్యంలో కందకాల ద్వారా నీటి భద్రత పొందవచ్చని సాక్షి కథనం ద్వారా తెలుసుకున్నారు. తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల వేదిక పెద్దలు సంగెం చంద్రమౌళి, మేరెడ్డి శ్యాంప్రసాద్‌రెడ్డి, గోలి దామోదర్‌రెడ్డిలను సంప్రదించారు. 2017 మే నెలలో సుమారు రూ. 40 వేలు ఖర్చుపెట్టి వాలుకు అడ్డంగా, మీటరు లోతు, మీటరు వెడల్పున కందకాలు తవ్వించారు. నీరు పొలం దాటి బయటకు పోకుండా చూడడానికి మరో రెండు నీటి కుంటలను సైతం తవ్వించారు. గత ఖరీఫ్కాలంలోను, అక్టోబర్–సెప్టెంబర్‌లోనూ కురిసిన వర్షాలకు అనేక సార్లు కందకాలు నిండి భూమిలోపలికి వర్షపు నీరు ఇంకింది. దీంతో భూగర్భ జల మట్టం పెరిగింది. ఈ కారణంగా ఈ ఏడాది రోహిణీకార్తెలో కూడా బోర్లలో పుష్కలంగా నీరు ఉంది. 3 నీటికుంటల్లో 80 లక్షల లీటర్ల నీరు నిల్వ ఉంది. వర్షం కురిసినప్పుడు కందకాల ద్వారా భూమికి నీటిని తాపినందువల్ల నీటి కరువు మాయమైందని కృష్ణమోహన్ సంతోషంగా చెప్పారు. కేవలం రూ. 40 వేల ఖర్చుతో కందకాలు తవ్వడం వల్ల నీటి కొరత లేకుండా పోవడం విశేషం. ప్రస్తుతం 10 ఎకరాల్లో మామిడి, 10 ఎకరాల్లో నిమ్మ, 5 ఎకరాల్లో జామ, ఉసిరి తోటలున్నాయి. ఈ ఏడాది 2 ఎకరాల్లో వరుసగా 3 పంటలు తొలిసారి వరి సాగు చేశామని కృష్ణమోహన్ వివరించారు. తమ పక్క పొలంలో ఎప్పుడూ లేనిది రెండు బోర్లలో నీరు వస్తున్నాయని కూడా తెలిపారు. కందకాల ద్వారా సాగు నీటి భద్రత పొందవచ్చన్న తన అనుభవాన్ని పరిసర గ్రామాల్లో రైతులకు తెలియజెప్పేందుకు సదస్సులు నిర్వహించాలనుకుంటున్నట్లు కృష్ణమోహన్(99490 55225) తెలిపారు. కృష్ణమోహన్ -
అభివృద్ధికి ఎక్కడ.. ?
బెల్లంపల్లిరూరల్ : బెల్లంపల్లి మండలం ఆకెనపల్లి గ్రామ పంచాయతీ అభివృద్ధికి నోచుకోకుండా పోతోంది. మండలంలో పెద్ద గ్రామ పంచాయతీ అయినప్పటికీ కనీస సౌకర్యాలు లేక గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆకెనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో దాదాపు 6 వేల మంది జనాభా నివసిస్తున్నారు. గ్రామంలో అభివృద్ధి పనులు అంతంత మాత్రంగానే కనిపిస్తున్నాయి. ఎంపీపీ సొంత గ్రామమైనా అభివృద్ధి ఏమీ జరగలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధ్వానంగా రోడ్లు.. గ్రామంలో కొన్నేళ్ల క్రితం నిర్మించిన అంతర్గత రోడ్లు ఇప్పుడు అధ్వానంగా మారాయి. కంకరతేలి, గుంతలుగా మారి నడక సాగించడానికి ఇబ్బందికరంగా ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో వాహన చోదకులు అదుపు తప్పి గుంతలలో పడిన ఘటనలు కూడా ఉన్నాయి. కొన్ని వాడల్లో ఇప్పటి వరకు సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టలేదు. ఎస్సీ కాలనీ, నేతకాని వాడలలో సమస్యలు తీష్ట వేశాయి. మరికొన్ని వాడల్లో మట్టి రోడ్లు వేసినా గుంతలుగా మారాయి. స్ధానిక ప్రజా నిధులు వారి అనుచరుల వాడల్లో మాత్రమే సీసీ రోడ్లు నిర్మించారనే ఆరోపణలు గ్రామస్తులు చేస్తున్నారు. రోడ్లపైనే మురికి నీరు.. గ్రామంలో మురికి నీరు పారేందుకు డ్రైనేజీ వ్యవస్థ లేదు. అక్కడక్కడ మాత్రమే మురికి నీటి కాలువలు ఉన్నా అవి చెత్తతో నిండడంతో రోడ్లపై మురికి నీరు పారుతోంది. మురికి నీటి కాలువలు నిర్మించక పోవడంతో ఆ మురికి నీరంతా రోడ్లపై పారుతూ కంపు కొడుతోంది. పారిశుధ్యం అస్తవ్యస్తం కావడంతో దోమలు విపరీతంగా వృద్ధి చెందాయి.ఏళ్లు గడుస్తున్నా కాలువల నిర్మాణం జరగడం లేదు. తాగు నీటి సమస్య తీవ్రం.. గ్రామంలో రెండు ఓవర్ హెడ్ ట్యాంక్‌లు ఉన్నాయి. వీటి ద్వారా గ్రామస్తులకు మంచి నీరందించాల్సి ఉండగా ట్యాంకుల నిర్వాహణ సరిగా చేపట్టడం లేదు. పక్షం రోజులకోసారి క్లోరినేషన్ చేయాల్సి ఉండగా నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో నీటిలో చిన్న చిన్న పురుగులు వస్తున్నట్లు గ్రామస్తులు పేర్కొంటున్నారు. గ్రామీణులకు తాగునీటిని అందించడంలో ప్రజా ప్రతినిధులకు పట్టింపు లేనట్లు కనిపిస్తోంది. ఎంపీపీ స్వగ్రామంలో ఈ తీరైన సమస్యలు విలయతాండవం చేస్తుండడంతో స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా గ్రామ సర్పంచ్, ఎంపీపీ గ్రామాభివృద్ధికి చిత్తశుద్ధితో వ్యవహరించాలని పలువురు కోరుతున్నారు. -
ఎమ్మెల్యే దత్తత గ్రామంలో తాగునీటి ఎద్దడి
కోనరావుపేట(వేములవాడ): తమ కాలనీల్లో తాగునీటి సమస్యలు అధికమవుతున్నాయని, ఈ సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ మామిడిపల్లిలో మహిళలు ఖాళీబిందెలతో ఆదివారం రోడ్డెక్కారు. మామిడిపల్లిలోని 2, 3, 4 వార్డుల్లో కొన్నిరోజులుగా తాగునీటికి తీవ్రఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన చెందారు. సుమారు రెండు నెలలుగా నీరు దొరకక అవస్థలు పడుతుమన్నారు. నీటి సమస్యలు అధికం కావడంతో రోడ్డెక్కామని వివరించారు. వేములవాడ–సిరికొండ ప్రధాన రహదారిపై ఖాళీ బిందెలతో బైఠాయించారు. తమ కాలనీల్లో తాగునీటి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మామిడిపల్లి గ్రామాన్ని ఎమ్మెల్యే రమేశ్‌బాబు దత్తత తీసుకుని, అభివృద్ధి పనులు చేయడం మర్చిపోయారని ఆరోపించారు. గ్రామంలో నీటి సమస్యలు ఎక్కువ అవుతున్నా పట్టించుకోవడంలేదని దుయ్యబట్టారు. విషయం తెలుసుకున్న సర్పంచ్ పన్నాల విజయ.. సంఘటనా స్థలతానికి చేరుకుని ఆందోళన చేస్తున్న మహిళలతో మాట్లాడారు. నీటి సమస్యలు ఎక్కువగా ఉన్న వార్డుల్లో ఇంటికో డ్రమ్ము నీరు రోజూ అందేలా చూస్తామని హామీ ఇవ్వడంతో మహిళలు ఆందోళన విరమించారు. ∙ రోడ్డెక్కి మహిళల నిరసన -
జటిలం!
వేసవిలో తాగునీటి ఎద్దడిని నివారించేందుకు గ్రామీణ నీటి సరఫరా విభాగం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాల్సి ఉంది. ఈ ఏడాది మార్చిలోగా అన్ని జనావాసాలకు ‘మిషన్ భగీరథ’ ద్వారా తాగునీరు అందించాలని ప్రభుత్వం నిర్దేశించింది. ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో ‘మిషన్ భగీరథ’ పథకం పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు గ్రామాల్లో అంతర్గత పైపులైన్ల నిర్మాణం చాలా చోట్ల ప్రారంభం కాలేదు. మిషన్ భగీరథ ద్వారా ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో వేసవిలో తాగునీటి సరఫరా అసాధ్యంగా కనిపిస్తోంది. ఇప్పటికే మారుమూల గ్రామాలు, గిరిజన తండాల్లో మొదలైన తాగునీటి సమస్యపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్... సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో రెండున్నర వేలకు పైగా జనావాసాలు ఉన్నాయి. వీటిలో 1,700కు పైగా జనావాసాల్లో మాత్రమే సంపూర్ణంగానో, పాక్షికంగానో వివిధ తాగునీటి పథకాల ద్వారా సరఫరా అవుతోంది. గ్రామీణ ప్రాం తాల్లో సీపీడబ్ల్యూఎస్, పీడబ్ల్యూఎస్, ఎంపీడబ్ల్యూఎస్ తదితర పథకాల కిం ద గ్రామీణ నీటి సరఫరా విభాగం తాగునీటిని అందిస్తోంది. తాగునీటి పథకాలు, బోరు మోటార్లు లేని చోట చేతి పంపులు దాహార్తిని తీరుస్తున్నా యి. ఏటా వేసవిలో భూగర్భ జలా లు అడుగంటుతుండడంతో తాగునీ టి పథకాలు వట్టిపోతున్నాయి. ప్రస్తు తం ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో సగటు భూగర్భ జలమట్టం ఉపరితలం నుంచి 16.07 మీటర్లుగా నమోదైంది. వేసవిలో మే నాటికి భూగర్భ జలమట్టం 17 నుంచి 19 మీటర్ల లోతుకు పడిపోయే అవకాశం ఉంది. సింగూరు నుంచి ఈ ఏడాది దిగువకు నీటిని విడుదల చేయడంతో ప్రస్తు తం ప్రాజెక్టులో 13 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. దీంతో మంజీ ర తీర ప్రాంత గ్రామాలతో పాటు గిరిజన తండాలు, మారుమూల గ్రా మాల్లో తాగునీటి సమస్య తీవ్ర రూ పం దాలుస్తోంది. సంగారెడ్డి జిల్లా పరిధిలోని నారాయణఖేడ్, హత్నూ ర, ఆర్సీపురం, జహీరాబాద్, రాయికోడ్ తదితర మండలాల్లో ఇప్పటికే సగటు భూగర్భ జలమట్టం 19 మీట ర్ల లోతున ఉంది. మెదక్ జిల్లా రామాయంపేట, చిన్నశంకరంపేట, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్, ములుగు ప్రాంతాల్లోనూ భూగర్భ జల మట్టం వేగంగా పడిపోతోంది. పూర్తి కాని మిషన్ భగీరథ మిషన్ భగీరథ పనులు పూర్తి చేసి ఇంటింటికీ తాగునీరు అందిస్తామని ప్రభుత్వం చెబుతున్నా.. క్షేత్ర స్థాయి లో పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. సింగూరు రిజర్వాయర్ వ ద్ద ఇంటేక్వెల్తో పాటు ఫిల్టర్‌బెడ్ ప నులు పూర్తయినా.. గ్రామాల్లో అం తర్గత పైపులైన్ల పనులు జరగడం లేదు. ♦ సంగారెడ్డి జిల్లాలో ‘ఇంట్రా విలేజి’లో భాగంగా మొదటి దశలో రూ. 57.48 కోట్లతో మునిపల్లి, న్యాలకల్, ఝరాసంగం మండలాల్లో పనులు జరుగుతున్నాయి. మిగతా మండలా ల్లో రూ.335.41 అంచనా వ్యయంతో రెండో దశ పనులు ప్రారంభమయ్యా యి. రేట్లు గిట్టుబాటు కావడం లేదనే కారణంగా కాంట్రాక్టర్లు పనులు చేపట్టేందుకు ముందుకు రావడం లేదు. మిషన్ భగీరథలో కీలకమైన ఓహెచ్ఎస్ఆర్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. రూ.335.41 కోట్ల అంచనా వ్యయంతో 794 ఓహెచ్ఎస్ఆర్లు మంజూరు కాగా, కేవలం 400 ట్యాంకుల నిర్మాణం జరుగుతోంది. ♦ మెదక్ జిల్లాలో ఇంట్రా విలేజీలో మొదటి దశలో నర్సాపూర్ సెగ్మెంట్ లో రూ.69.61 కోట్లు, గజ్వేల్ సెగ్మెం ట్లో రూ.47.04 కోట్ల పనులు పురోగతిలో ఉన్నాయి. రెండో దశలో రూ. 178.43 కోట్ల పనులు చేపట్టినట్లు చెబుతున్నా పురోగతి లేదు. ‘ఇంట్రా గ్రిడ్’ కింద 22 మండలాలకు 376 ఓహెచ్ఎస్ఆర్లు మంజూరు కాగా, 241 పనులు పురోగతిలో ఉన్నాయి. ♦ సిద్దిపేట జిల్లాలో 487 ఓహెచ్‌ఎస్‌ఆర్‌లకు గాను వంద పనులు పురోగతిలో ఉన్నాయి. ఇంట్రాలో భాగంగా 2,574 కిలోమీటర్ల మేర పై పులైను వేయాల్సి ఉండగా, చాలా గ్రా మాల్లో పనులు ప్రారంభం కాలేదు. వేసవి కార్యాచరణ ఏదీ? భూగర్భ జలాలు వేగంగా అడుగంటుతుండడం, తాగునీటి పథకాలు వట్టి పోతుండడంతో గ్రామీణ నీటి సరఫరా విభాగం ఏటా ‘వేసవి కార్యాచర ణ ప్రణాళిక’ సిద్ధం చేస్తోంది. విపత్తు నివారణ నిధి (సీఆర్ఎఫ్) ట్యాంకర్ల ద్వారా రవాణా, బోరు బావులను అద్దెకు తీసుకోవడం ద్వారా తాగునీటి గండం నుంచి జనావాసాలు గట్టెక్కుతున్నాయి. మరోవైపు నాన్ సీఆర్ఎఫ్ నిధి నుంచి చేతి పంపుల మరమ్మతు, బోరు బావుల్లో పూడిక తీత, లోతు చేయడం, బోరు మోటార్ల మరమ్మ తు, పైపులైన్లు పొడగింపు వంటి పను లు వేసవి కార్యాచరణ ప్రణాళికలో పొందు పర్చాల్సి ఉంటుంది. ఈ ఏడా ది మార్చి నాటికి ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని జనావాసాలన్నింటికీ మిష న్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీటి సరఫరాకు ప్రభుత్వం ఆదేశించిం ది. ఈ పథకంలో అత్యంత కీలకమైన మెయిన్ ట్రంక్ (ప్రధాన పైపులైను) పనులు మాత్రమే పూర్తి కాగా, ఓహెచ్ఎస్ఆర్, ఇంట్రా (అంతర్గత పైపులైన్) పనులు చాలాచోట్ల అసంపూర్తిగా ఉ న్నాయి. కార్యాచరణ ప్రణాళిలో భాగంగా నీటి ఎద్దడి ఎదురయ్యే జనావాసాలను ముందస్తుగా గుర్తించాల్సి ఉంటుంది. సమస్యాత్మక ప్రాంతాలు, స్థానికంగా అందుబాటులో ఉండే నీటి వనరులు, చేతి పంపుల మరమ్మతు, రవాణాకయ్యే ఖర్చును అంచనా వేయాలి. ఎన్ని జనావాసాలకు రవాణా చేయాల్సి ఉంటుంది. మిషన్ భగీరథ నీరు ఇస్తున్నందున వేసవి కార్యాచరణ అవసరం లేదనే అభిప్రాయంతో ప్రభుత్వం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. -
తాగునీటి తిప్పలు
చండ్రుగొండ : మండలంలోని తిప్పనపల్లి గ్రామంలో తాగునీటి ఎద్దడి నెలకొంది. దీంతో ఆగ్రహించిన మహిళలు శుక్రవారం గ్రామంలో ఖాళీ బిందెలతో రాస్తారోకో చేశారు. తిప్పనపల్లి గ్రామంలోని పాతూరులో డైరెక్డ్ పంపింగ్ సిస్టం ద్వార తాగునీటి సరఫరా జరుగుతోంది. అయితే బోరుబావిలో నీటి జలాలు అడుగంటిపోవడంతో నెలరోజులుగా తాగునీటి ఇబ్బందులు నెలకొన్నాయి. సుమారు 200 కుటుంబాలు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడున్నారు. అధికారులకు, ప్రజాప్రతినిధులకు అనేకమార్లు సమస్య వివరించినప్పటికి చర్యలు తీసుకోలేదని లతీఫ్బీ, జాన్‌బీ, సాబీర, హుసేన్‌బీ తెలిపారు. ఈ క్రమంలోనే తాము రోడ్డెక్కి నిరసన తెలియజేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఇప్పటికైన అధికారులు సత్వర చర్యలు తీసుకుని తాగునీటి సరఫరా పునరుద్ధరించాలని వారు కోరుతున్నారు. -
కన్నీటి కష్టాలు
ఉదయం ఆరు గంటల సమయం.. అది, సుదిమళ్ల పంచాయతీలోని వేపలగడ్డ తండా. వణికించే చలి. ఇళ్ల నుంచి ఒకరొక్కరుగా బయటికొస్తున్నారు. గుంపులు గుంపులుగా వెళుతున్నారు. చలికి వణుకుతూనే..వడివడిగా ముందుకు సాగుతున్నారు. దాదాపు రెండు కిలోమీటర్ల దూరం వరకు వారి ప్రయాణం సాగింది. కొద్దిసేపటి తరువాత తిరిగొస్తున్నారు. వారందరి చేతుల్లో బిందెలు..!వెళ్లేప్పుడు ఖాళీవి తీసుకెళ్లారు.. నీళ్లు నింపుకుని తిరిగొస్తున్నారు..!! అప్పుడు సమయం.. ఉదయం ఎనిమిది గంటలు. ఇల్లెందు: ‘‘మాకు రోజూ ఈ నీటి కష్టాలు తప్పడం లేదు. అంతదూరం (రెండు కి.మీ.) కాళ్లీడ్చుకుంటూ వెళతాం. నీళ్ల బిందెలు మోసుకుంటూ వస్తాం. మాకు ఇంకెన్నాళ్లీ కష్టాలు? కాళ్ల నొప్పో, కీళ్ల నొప్పో, రోగమో రొష్టో వచ్చి మేం మంచాన పడితే పరిస్థితేంటి? నీళ్లెవరు తేవాలి? మా కష్టాలను ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. ఒక్కోసారి ఏడుపొస్తంది...’’ – ఇది, వేపలగడ్డ గ్రామస్తుల నీటి వ్యథ.. కన్నీటి గాథ. ఈ వ్యథ–గాథ ఇప్పటిది కాదు. ఏళ్ల కిందటిది. అప్పటి నుంచి ఇదే దుస్థితి. ఇల్లెందు మండలంలో... సుభాష్‌నగర్, ఆజాద్‌నగర్, సంజయ్‌నగర్, ఇందిరానగర్, బాలాజీనగర్‌లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. వీటి నీటి అవసరాలు తీర్చేందుకు నాలుగు మంచినీటి ఓవర్‌హెడ్ ట్యాంకులు ఉన్నాయి. వీటిలోని నీరు చాలడం లేదు. సుదిమళ్ల పంచాయతీలోని హనుమంతులపాడు, సుదిమళ్ల, పూబెల్లి, వేపలగడ్డ, వేపలగడ్డ తండాల్లో తీవ్ర నీటి ఎద్దడి ఉంది. రొంపేడు పంచాయతీలోని మామిడిగుండాల, మర్రిగూడెం పంచాయతీలోనూ లోనూ ఇదే పరిస్థితి. ఇందిరానగర్‌లో వేసిన రెండు బోర్లలో చుక్క నీరు పడలేదు. మండలంలో మొత్తం 590 చేతి పంపులు, 101 మంచినీటి పథకాలు ఉన్నాయి. నీటి అవసరాలకు ఇవి వేపలగడ్డ తండాలో... వేపలగడ్డ తండాలో సుమారు 500 జనాభా ఉంది. ఇక్కడి మంచినీటి ట్యాంక్ కొన్నాళ్ల నుంచి నిరుపయోగంగా మారింది. ఇక్కడ ఒకేఒక్క చేతి పంపు ఉంది. అది కూడా మొరాయిస్తోంది. దీంతో ఈ తండా వాసులు తమ ఊరికి రెండు కిలోమీటర్ల దూరంలో గల తొడిదలగూడెంలోని బావి నుంచి నీటిని తోడుకుని బిందెలలో మోసుకొస్తున్నారు. తాగటానికే కాదు.. వాడకానికి కూడా అంత దూరం నుంచి నీళ్లు తెచ్చుకోవడం కష్టంగా మారింది. దీనిని భరించలేక, నెల క్రితం ఆందోళనకు దిగారు. మరో చేతి పంపు ఏర్పాటు చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. మంగళవారం రాత్రే ఇక్కడకు డ్రిల్ మిషన్ వచ్చింది. ఇల్లెందు పట్టణంలో... భూగర్భ జలం అడుగంటింది. ఇక్కడి బొగ్గు బావుల కారణంగా చేతి పంపులు, బోర్లు, బావుల్లో నీరు ఇంకిపోతోంది. పట్టణ ప్రజల దాహార్తి తీర్చే ఇల్లెందులపాడు చెరువులోనూ జలం అడుగంటింది. సుమారు 50వేల జనాభాగల ఇల్లెందు పట్టణానికి వేసవిలో నీరందించాలంటే 47 లెవల్ పైపులైన్ పనులు పూర్తికావాలి. లేనట్టయితే, రానున్న రెండు నెలల్లో పట్టణ ప్రజలకు పట్టపగలే (నీటి) చుక్కలు కనిపిస్తాయి. పట్టణంలో ప్రస్తుతం 58 చేతి పంపులు ఉన్నాయి. వీటిలో 30 మాత్రమే పనిచేస్తున్నాయి. 15, 16, 17 వార్డుల్లో నీటి ఎద్దడి వర్ణనాతీతంగా ఉంది. ఇక్కడ ఏళ్లతరబడి వాటర్ ట్యాంకర్ల ద్వారానే నీటి సరఫరా సాగుతోంది. సా....గుతున్న భగీరథ పనులు ఇల్లెందులోని కోరగుట్ట వద్ద ఏర్పాటు చేయతలపెట్టిన మిషన్ భగీరథ (వాటర్ గ్రిడ్) పనులు గత రెండేళ్ల నుంచి కొనసా...గుతూనే ఉన్నాయి. ఇవి పూర్తయితే... పట్టణ, మండల వాసుల దాహార్తి తీరుతుంది. తక్షణ కర్తవ్యం... అవసరమైన చోట్లకు వాటర్ ట్యాంకర్లు పంపాలి. బోరు బావుల లోతు పెంచాలి. మూలనపడిన చేతి పంపులను బాగు చేయించాలి. తక్షణం చేయాల్సిన పనులివి. -
వేసవికి ముందే..
ఇల్లెందుఅర్బన్: మండల పరిధిలోని కొత్తపూసపల్లి గ్రా మస్తులకు వేసవి కాలం ప్రారంభం కాకముందే నీటి కష్టాలు మొదలయ్యాయి. గ్రామంలో 50 కుటుంబాలు నివస్తిస్తున్నాయి. గ్రామం సమీపంలోని బ్రీటీష్ దొరల హాయంలో నిర్మించిన బావిలో నుంచి నీటిని గ్రామంలోని వాటర్ ట్యాంకుల్లోకి సరఫరా చేసి అనంతరం ఇండ్లల్లోకి సరఫరా చేస్తున్నారు. బ్రీటీష్ బావి ద్వా రానే గ్రామస్తులు తమ దాహార్తీని తీర్చుకుంటున్నారు. ఇది ఇలా ఉండగా జనవరి చివరి వారం నుంచే భానుడి ప్రతాపం చూపిస్తుండటంతో బావిలో నీరు అడుగుంటిపోతోంది. దీంతో ఆరు రోజులకోసారి నీటిని సరఫరా చేయాల్సి వస్తోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో నిర్మించిన 5 మినీ వాటర్ ట్యాంకులు నీటి సరఫరా తగ్గిపోవడంతో నిరుపయోగంగా మారుతున్నాయి. ఇది ఇలా ఉండగా 30 ఏళ్ల క్రితం వాటర్‌ట్యాంకులకు నీటి సరఫరా కోసం ఏర్పాటు చేసిన పైపులైన్లు పూర్తిగా శిథితమై తరచూ లీకేజీలవుతున్నాయి. దీంతో 20 నిమిషాల్లో నిండాల్సిన ట్యాంకు గంట సమయమైనా కూడ నిండటంలేదని గ్రామస్తులు చెబుతున్నారు. మార్చి చివరి నాటిలోపే బావిలో పూర్తి గా నీరు అడుగంటిపోతుందని అంటున్నారు. ప్రత్యామ్నాయంగా నీటి వసతిని కల్పించేందుకు రొంపేడు పంచాయతీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని వాపోతున్నారు. నిరుపయోగంగా ట్యాంకు గ్రామ ప్రజలకు నిరంతరం నీటిని అందిచేందుకు 2004లో సింగరేణి యాజమాన్యం రూ 14లక్షల వ్యయంతో గ్రామంలో ఓవర్ హెడ్‌ట్యాంకు నిర్మించడంతో పాటుగా సింగరేణి యాజమాన్యమే నీటిని సరఫరా చేసింది. కాలక్రమేణా ట్యాంకుకు ఏర్పాటు చేసిన పైపులైన్లు పూర్తిగా ధ్వంసం కాకపోవడంతో దాదాపు 9 ఏళ్లపాటు ట్యాంకు నిరుపయోగంగానే దర్శనమిస్తోంది. నీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునే వారేలేరని ఆవేదన వ్యక్తంచేశారు. వారానికోసారి.. గ్రామ ప్రజలకు నీటిని అందించే బ్రిటీష్ కాలంలో నిర్మించిన బావిలో నీరు సగానికిపైగా అడుగంటిపోవడంతో ప్రస్తుతం ఆరు రోజులకోసారి నీటిని సరఫరా చేస్తున్నారు. ఇటు సింగరేణి యాజమాన్యం, అటు పంచాయతీ అధికారులు కూడ నీటి ఎద్దడి సమస్యను తీర్చడంలో శ్రద్ధ కనబర్చడంలేదు . – కుమారస్వామి, పూసపల్లి నీటి కష్టాలు వేసవి ప్రారంభం కాకముందే పూసపల్లి గ్రామస్తులు నీటి కష్టాలు పడుతున్నారు. బావిలో సరిపడ నీరు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అరకొర నీటి సరఫరా చేస్తున్నా పైపులైన్ లీకేజీల ద్వారా ప్రజల దాహార్తీ తీరడంలేదు. ఇప్పటికైనా అ«ధికారులుస్పందించి తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చేయాలి. – బలరాం, పూసపల్లి -
సమస్యలకు పరిష్కారం ఉద్యమమే
శృంగవరపుకోట: సమస్యలకు పరిష్కారం ఊడిగం కాదు..ఉద్యమమే అంటూ ఆంద్రప్రదేశ్ మహిళాసమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు వి.జయలక్ష్మి పిలుపునిచ్చారు. శనివారం స్థానిక సుబ్బరామిరెడ్డి కల్యాణ మండపంలో ఏపీ మహిళాసమాఖ్య జిల్లా కార్యవర్గ సమా వేశాన్ని శనివారం మధ్యాహ్నం నిర్వహించారు. ఈ సమావేశంలో సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు వి.జయలక్ష్మి మాట్లాడుతూ మనువు కాలం నంచి పురుషాధిక్య సమాజంలో మహిళ వివక్షకు గురవుతూనే ఉందన్నారు. అన్ని మతాలు మహిళలకు సమాన హక్కులు లేవనే ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి విమల మాట్లాడుతూ పల్లెల్లో మంచినీళ్లు లేకున్నా మద్యం ఏరులై పారుతోందన్నారు. నిత్యవసరాలు నింగిని అంటుతున్నాయని, మహిళల్లో ఆర్థిక స్వావలంబన లేదన్నారు. పోరాటాలే స్ఫూర్తిగా సాగితేనే సమానహక్కులు సాధ్యమన్నారు. సమాఖ్య జిల్లా గౌరవాధ్యక్షురాలు మద్ది మాణిక్యం అధ్యక్షతన కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బి.రమణమ్మ, మిడ్డే మీల్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధానకార్యదర్శి పి.లక్ష్మి, ఎస్.కోట నియోజకవర్గ అద్యక్షురాలు ఎ.పార్వతి. కార్యదర్శి వాడపల్లి సుధలతో పాటూ సుమారు 200 మంది మహిళా సమాఖ్య సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. -
ఖాళీ బిందెలతో మహిళల ధర్నా
దామరచర్ల: నల్గొండ జిల్లా దామరచర్లలోని కాలనీలకు చెందిన మహిళలు మంచినీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శనివారం ఉదయం ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో ధర్నా చేశారు. నీటి ఎద్దడిపై ఎన్నిసార్లు ఉన్నతాధితారులకు విన్నవించినా ప్రయోజనం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఎంపీడీవో నీటి ఎద్దడికి నివారణకు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వారు ధర్నా విరమించారు.