వేపలగడ్డ తండా
ఉదయం ఆరు గంటల సమయం.. అది, సుదిమళ్ల పంచాయతీలోని వేపలగడ్డ తండా. వణికించే చలి. ఇళ్ల నుంచి ఒకరొక్కరుగా బయటికొస్తున్నారు. గుంపులు గుంపులుగా వెళుతున్నారు. చలికి వణుకుతూనే..వడివడిగా ముందుకు సాగుతున్నారు. దాదాపు రెండు కిలోమీటర్ల దూరం వరకు వారి ప్రయాణం సాగింది. కొద్దిసేపటి తరువాత తిరిగొస్తున్నారు. వారందరి చేతుల్లో బిందెలు..!వెళ్లేప్పుడు ఖాళీవి తీసుకెళ్లారు.. నీళ్లు నింపుకుని తిరిగొస్తున్నారు..!! అప్పుడు సమయం.. ఉదయం ఎనిమిది గంటలు.
ఇల్లెందు:
‘‘మాకు రోజూ ఈ నీటి కష్టాలు తప్పడం లేదు. అంతదూరం (రెండు కి.మీ.) కాళ్లీడ్చుకుంటూ వెళతాం. నీళ్ల బిందెలు మోసుకుంటూ వస్తాం. మాకు ఇంకెన్నాళ్లీ కష్టాలు? కాళ్ల నొప్పో, కీళ్ల నొప్పో, రోగమో రొష్టో వచ్చి మేం మంచాన పడితే పరిస్థితేంటి? నీళ్లెవరు తేవాలి? మా కష్టాలను ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. ఒక్కోసారి ఏడుపొస్తంది...’’ – ఇది, వేపలగడ్డ గ్రామస్తుల నీటి వ్యథ.. కన్నీటి గాథ. ఈ వ్యథ–గాథ ఇప్పటిది కాదు. ఏళ్ల కిందటిది. అప్పటి నుంచి ఇదే దుస్థితి.
ఇల్లెందు మండలంలో...
సుభాష్‌నగర్, ఆజాద్‌నగర్, సంజయ్‌నగర్, ఇందిరానగర్, బాలాజీనగర్‌లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. వీటి నీటి అవసరాలు తీర్చేందుకు నాలుగు మంచినీటి ఓవర్‌హెడ్ ట్యాంకులు ఉన్నాయి. వీటిలోని నీరు చాలడం లేదు. సుదిమళ్ల పంచాయతీలోని హనుమంతులపాడు, సుదిమళ్ల, పూబెల్లి, వేపలగడ్డ, వేపలగడ్డ తండాల్లో తీవ్ర నీటి ఎద్దడి ఉంది. రొంపేడు పంచాయతీలోని మామిడిగుండాల, మర్రిగూడెం పంచాయతీలోనూ లోనూ ఇదే పరిస్థితి. ఇందిరానగర్‌లో వేసిన రెండు బోర్లలో చుక్క నీరు పడలేదు. మండలంలో మొత్తం 590 చేతి పంపులు, 101 మంచినీటి పథకాలు ఉన్నాయి. నీటి అవసరాలకు ఇవి
వేపలగడ్డ తండాలో...
వేపలగడ్డ తండాలో సుమారు 500 జనాభా ఉంది. ఇక్కడి మంచినీటి ట్యాంక్ కొన్నాళ్ల నుంచి నిరుపయోగంగా మారింది. ఇక్కడ ఒకేఒక్క చేతి పంపు ఉంది. అది కూడా మొరాయిస్తోంది. దీంతో ఈ తండా వాసులు తమ ఊరికి రెండు కిలోమీటర్ల దూరంలో గల తొడిదలగూడెంలోని బావి నుంచి నీటిని తోడుకుని బిందెలలో మోసుకొస్తున్నారు. తాగటానికే కాదు.. వాడకానికి కూడా అంత దూరం నుంచి నీళ్లు తెచ్చుకోవడం కష్టంగా మారింది. దీనిని భరించలేక, నెల క్రితం ఆందోళనకు దిగారు. మరో చేతి పంపు ఏర్పాటు చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. మంగళవారం రాత్రే ఇక్కడకు డ్రిల్ మిషన్ వచ్చింది.
ఇల్లెందు పట్టణంలో...
భూగర్భ జలం అడుగంటింది. ఇక్కడి బొగ్గు బావుల కారణంగా చేతి పంపులు, బోర్లు, బావుల్లో నీరు ఇంకిపోతోంది. పట్టణ ప్రజల దాహార్తి తీర్చే ఇల్లెందులపాడు చెరువులోనూ జలం అడుగంటింది. సుమారు 50వేల జనాభాగల ఇల్లెందు పట్టణానికి వేసవిలో నీరందించాలంటే 47 లెవల్ పైపులైన్ పనులు పూర్తికావాలి. లేనట్టయితే, రానున్న రెండు నెలల్లో పట్టణ ప్రజలకు పట్టపగలే (నీటి) చుక్కలు కనిపిస్తాయి. పట్టణంలో ప్రస్తుతం 58 చేతి పంపులు ఉన్నాయి. వీటిలో 30 మాత్రమే పనిచేస్తున్నాయి. 15, 16, 17 వార్డుల్లో నీటి ఎద్దడి వర్ణనాతీతంగా ఉంది. ఇక్కడ ఏళ్లతరబడి వాటర్ ట్యాంకర్ల ద్వారానే నీటి సరఫరా సాగుతోంది.
సా....గుతున్న భగీరథ పనులు
ఇల్లెందులోని కోరగుట్ట వద్ద ఏర్పాటు చేయతలపెట్టిన మిషన్ భగీరథ (వాటర్ గ్రిడ్) పనులు గత రెండేళ్ల నుంచి కొనసా...గుతూనే ఉన్నాయి. ఇవి పూర్తయితే... పట్టణ, మండల వాసుల దాహార్తి తీరుతుంది.
తక్షణ కర్తవ్యం...
అవసరమైన చోట్లకు వాటర్ ట్యాంకర్లు పంపాలి. బోరు బావుల లోతు పెంచాలి. మూలనపడిన చేతి పంపులను బాగు చేయించాలి. తక్షణం చేయాల్సిన పనులివి.
Comments
Please login to add a commentAdd a comment