illendu
-
6న కాంగ్రెస్‌లోకి భద్రాచలం ఎమ్మెల్యే?
ఇల్లెందు: భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు తెలిసింది. ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి పలుమార్లు సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన ఆయన గత నెల 12న మణుగూరులో కాంగ్రెస్ ఆధ్వర్యాన జరిగిన సభకు సైతం హాజరయ్యారు. మంగళవారం ఇల్లెందులో జరిగిన మహబూబాబాద్ లోక్‌సభ స్థాయి కాంగ్రెస్ సమావేశంలోనూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలసి వెంకట్రావు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమైనట్లు సమాచారం. ఈ నెల 6న తుక్కుగూడలో జరిగే సభలో రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది. దీనిపై వెంకట్రావును వివరణ కోరగా త్వరలో వివరాలు వెల్లడిస్తానని చెప్పారు. వ్యవస్థలను కేసీఆర్ నాశనం చేశారు: తుమ్మల ఇల్లెందు సభలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ పదేళ్ల పాలనలో వ్యవస్థలన్నీ దుర్వి నియోగం చేశారని ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా గత ఎన్నికల సందర్భంగా సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారంటీలు అమలు చేసి తీరతామని, గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు కొనసాగిస్తూ కొత్తవి కూడా అమలు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో 7,145 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి ప్రతి గింజనూ కొంటామన్నారు. ఇప్పటికే 92.36 శాతం రైతుబంధు పంపిణీ పూర్తి చేశామని, పంటల బీమా పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. -
తెలంగాణాలో కాంగ్రెస్ బోణీ, సంబరాల్లో కాంగ్రెస్
సాక్షి,హైదరాబాద్: తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ బోణీ కొట్టింది. ఎన్నికల కౌంటింగ్‌లో ఆదినుంచీ కాంగ్రెస్ దూసుకుపోతోంది. తాజా ఫలితాల ప్రకారం కాంగ్రెస్ రెండు స్థానాల్లో విజయం సాధించింది. దీంతో హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. కాంగ్రెస్ నేత టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నివాసం వద్ద కూడా బాణా సంచాపేల్చి కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. అశ్వరావుపేటలో కాంగ్రెస్ అభ్యర్థి జరే ఆదినారాయణ విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థిపై 23వేల ఓట్ల మెజార్టీలో గెలుపొందారు. అటు ఇల్లందులో కోరం కనకయ్య 18 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2,290 అభ్యర్థులు పోటీ పడ్డారు. తాజా ట్రెండ్ ప్రకారం బీఆర్ఎస్ హ్యాట్రిక్ ఆశలు గల్లంతు అయినట్టే కనిపిస్తోంది. దీంత తుది ఫలితాలపై సర్వత్రా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. TRS = BRS = VRS #TelanganaElectionResults — Danasari Seethakka (@seethakkaMLA) December 3, 2023 -
గుప్పెడంత మనసు.. హిజ్రాతో ప్రేమపెళ్లి
ఇల్లెందు: సమాజం నుంచి విమర్శలు, జనాల నుంచి తేడా చూపులు ఎదురైనా.. కలిసే బతకాలనుకుంది ఆ జంట. కారణంగా.. ఆ జంటలో ఒకరు యువకుడు, మరొకరు ట్రాన్స్‌జెండర్ కావడమే!. మూడు నెలలుగా ఆమెతో సహజీవనం చేస్తున్న ఓ యువకుడు.. చివరకు తన ప్రేమకథను సుఖాంతం చేసుకున్నాడు. పెద్దలను ఒప్పించి వాళ్ల సమక్షంలోనే మూడుముళ్లతో ఒక్కటయ్యాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో జరిగిందీ ఘటన. జయశంకర్ భూపాలపల్లికి చెందిన రూపేశ్‌కు ఆళ్లపల్లి మండలం అనంతోగు గ్రామానికి చెందిన అఖిల(రేవతి) అనే హిజ్రాతో మూడేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. స్నేహం చిగురించి అదికాస్త ప్రేమకు దారితీసింది. దీంతో ఇద్దరూ ఒకరిని విడిచి మరొకరు ఉండలేని స్థితికి చేరుకున్నారు. రహస్యంగా.. ఇల్లెందులోని స్టేషన్‌బస్తీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని మూడు నెలలుగా సహజీవనం చేశారు. చుట్టుపక్కల వాళ్లు ఎన్ని మాటలు అన్నా.. బయట ఇబ్బందులు ఎదురైనా ఆ జంట ఒకరి చెయ్యి మరొకరు వీడలేదు. అయితే, ఇలా ఎంతకాలం తల్లిదండ్రులను మోసం చేయాలి అనుకున్న రూపేశ్.. ధైర్యం తెచ్చుకున్నాడు. ఏది ఏమైనా తమ ప్రేమ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాలనుకున్నాడు. భయంభయంగానే వాళ్లకు చెప్పాడు. ముందు వాళ్లు కంగారుపడ్డారు.. తిట్టారు. అయితే తమ ప్రేమను విప్పి వాళ్లను ఒప్పించాడు. వారు కూడా అంగీకరించడంతో నిన్న(శుక్రవారం, మార్చి 11 2022) రూపేశ్-అఖిలకు ఘనంగా వివాహం జరిగింది. ఎవరు ఎమనుకున్నా.. తమ మనుసులు మంచివని, ఒకరినొకరు అర్థం చేసుకున్నామని, జీవితాంతం ఇలాగే కలిసి ఉంటామని చెబుతోంది ఆ జంట. -
వీళ్లను కన్న బిడ్డల్లా చూసుకుంటా : మహిళా ఎమ్మెల్యే
ఇల్లెందు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందుకు చెందిన ఇద్దరు అనాథ పిల్లలకు ఎమ్మెల్యే హరిప్రియ అండగా నిలిచారు. భట్టు గణేశ్, స్రవంతి దంపతులు. మూడేళ్ల క్రితం గొంతు కేన్సర్‌తో గణేశ్, మూడు నెలల క్రితం కిడ్నీ సమస్యలతో స్రవంతి మృతి చెందారు. దీంతో వారి పిల్లలు ఏడేళ్ల కృషన్, ఐదేళ్ల హరిప్రియ భారం అమ్మమ్మ నాగమణిపై పడింది. వారి ఇబ్బందులను గణేశ్ మిత్రుడు ఫణి మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్లో వివరించాడు. వెంటనే స్పందించిన కేటీఆర్.. స్థానిక ఎమ్మెల్యే హరిప్రియ, కలెక్టర్ డి.అనుదీప్, జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారి వరలక్ష్మికి ఈ సమాచారం అందించారు. దీంతో ఎమ్మెల్యే హరిప్రియ చిన్నారుల వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకున్నారు. పిల్లలను కన్న బిడ్డల్లా చూసుకుంటానని, ఇద్దరికీ విద్య, ఇతర అవసరాలకు సాయం అందిస్తానని, డబుల్ బెడ్రూం ఇల్లు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. వారిని దత్తత తీసుకుంటున్నానని ప్రకటించారు. చదవండి: చిన్నారి వైద్యానికి కేటీఆర్ సాయం -
అవకాశమిస్తే ‘గౌరవం’ కోసం పోరాడుతా
టేకులపల్లి: రెండున్నరేళ్ల పాటు జిల్లాలోని రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారానికి, సంక్షేమానికి ఎంతగానో కృషి చేశానని, మళ్లీ తనకు అవకాశం ఇస్తే పెండింగ్‌లో ఉన్న గౌరవ వేతనం కోసం పోరాడుతానని తెలంగాణ రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ఊకే శేఖర్‌రావు పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం మండల కేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండున్నర సంవత్సరాల క్రితం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రమేష్ బాబు ఆధ్వర్యంలో జిల్లా కమిటీలు నియమించడం జరిగిందని తెలిపారు. ఆయన ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కమిటీలను రద్దు చేశారని పేర్కొన్నారు. ఈనెల 22న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన కమిటీని ఎన్నుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. జిల్లాలోని 23 మండలాలు 321 రేషన్ డీలర్లు సహృదయంతో ఆలోచించి తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని కోరారు. డీలర్లకు రావాల్సి పాత బకాయిల్లో సగం సాధించామని, మధ్యాహ్న భోజనం బకాయిలు యాబై శాతం సాధించామని తెలిపారు. గౌరవ వేతనం సాధించేంత వరకు విశ్రమించేది లేదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మండల అధ్యక్షుడు ఆంగోలు సంతులాల్, జిల్లా ఉపాధ్యక్షుడు అజ్మీర రామ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గుగులోత్ హేమచందర్, బాణోతు భాస్కర్, వాంకుడోత్ వెంకటేశ్ పాల్గొన్నారు. -
ఏడాది కాలంలో నలుగురిని మింగిన 'ఆ' జలపాతం!
సాక్షి, ఇల్లెందు: ఏడు బావుల జలపాతం మృత్యు కుహురంగా మారుతోంది. రెండో రోజుల క్రితం ఇల్లెందు మండలంలోని రాఘబోయినగూడేనికి ఇద్దరు యువకులు విహారానికి వెళ్లగా.. ఒకరు మృతి చెందిన విషయం విదితమే. అప్పటి నుంచి మరో యువకుడి ఆచూకీ తెలియకుండాపోయింది. గురువారం కుటుంబ సభ్యులు, గ్రామస్తులు మరోసారి జలపాతం వద్దకు వెళ్లి వెతకగా మృతదేహం లభించింది. ఏడాది కాలంలో ఇక్కడ నలుగురు యువకులు మృతి చెందారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం, మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం సరిహద్దుల్లో ఉన్న ఏడు బావుల జలపాతం ప్రమాదభరితంగా మారుతోంది. గ్రామస్తుల కథనం మేరకు.. ఇల్లెందు మండలం రాఘబోయినగూడేనికి చెందిన పొగాకు నాగేశ్వరరావు, లలిత దంపతుల కుమారుడు సురేష్ (22), తన స్నేహితుడు దొడ్డా మహేష్(16)తో కలిసి గత మంగళవారం సాయంత్రం సరదాగా ఏడుబావుల జలపాతానికి వెళ్లారు. జలపాతం తిలకిస్తున్న క్రమంలో పైనుంచి జారి బావిలో పడిపోయారు. ఇద్దరూ అక్కడిక్కడే మృతి చెందారు. మరుసటి రోజు అటు వైపునకు వెళ్లిన కొందరు సురేష్ మృతదేహాన్ని గమనించి ఫొటోలు తీసి వాట్సాప్ గ్రూపుల్లో పెట్టారు. అప్పటికే రాఘబోయినగూడేనికి చెందిన ఇద్దరు యువకులు కనిపించటం లేదని కుటుంబ సభ్యులు వెతకసాగారు. వాట్సాప్‌లో ఫొటోలు చూసి సురేష్ వేసుకున్న దుస్తులు, ద్విచక్ర వాహనం గమనించి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు జలపాతం వద్దకు వెళ్లారు. అప్పటికే గంగారం పోలీసులు మృతదేహాన్ని పాఖాల కొత్తగూడ తరలించారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. జారి పడి.. సొరికేలో ఇరుక్కుపోయి.. తన స్నేహితుడు సురేష్ గుట్ట పైనుంచి జారి పడి చనిపోయిన సంఘటనను చూసిన మహేష్ భయానికి పారిపోయి ఉంటాడని అంతా భావించారు. కానీ ఎక్కడా ఆచూకీ లేకపోవడంతో గురువారం మరోసారి సంఘటన స్థలానికి వెళ్లి బావుల్లో వెతికారు. బావి లోపల పడిపోయి ఓ సొరికేలో ఇరుక్కుని ఉండటాన్ని గమనించి బయటకు లాగారు. ఆ మృతదేహం మహేష్దిగా గుర్తించారు. గంగారం పోలీసులకు సమాచారం అందించగా, వారు పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని పాఖాల కొత్తగూడ తరలించారు. మహేష్ చిన్నతనంలోనే తండ్రి కుటుంబాన్ని వదిలేసి వెళ్లిపోయాడు. తల్లి నాగమణితో కలిసి అమ్మమ్మ దేవనబోయిన మంగమ్మ ఇంటి వద్ద ఉంటున్నారు. నాగమణికి ఇద్దరు కుమారులు కాగా మహేష్ పెద్ద కుమారుడు. రాఘబోయినగూడెం గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు ఏడు బావుల అందాలను తిలకించేందుకు వెళ్లి మృత్యువాత పడటంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పొలానికి పురుగు మందులు తీసుకొస్తామని వెళ్లి.. పొలానికి పురుగు మందుల తీసుకొస్తామని చెప్పి సురేష్, మహేష్‌లు రాఘబోయినగూడెం నుంచి ఇల్లెందుకు బయలుదేరారు. మంగళవారం సాయంత్రం నాలుగు గంటల వరకు రాఘబోయినగూడెం వారికి ఇల్లెందులో కనిపించారు. ఆ సమయంలో అకస్మాత్తుగా వారికి ఏడు బావుల జలపాతం తిలకించాలని ఆలోచన ఎందుకు వచ్చిందో కాని అక్కడి వెళ్లారు. ఆ సమయంలో అటవీ ప్రాంతంలో వర్షం కురిసినట్లు ఆ ఏరియా వాసులు, చేన్ల వద్ద పనులు చేసే వారు పేర్కొంటున్నారు. గుట్ట పైకి వెళ్లిన తర్వాత, వర్షం కురుస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు జారి పడిపోయి ఉంటారని గ్రామస్తులు భావిస్తున్నారు. ఇద్దరూ తీవ్రంగా గాయాలపాలై ఉండటం, బావుల్లో పడిపోవటం వల్ల మృతి చెంది ఉంటారని సంఘటన స్థలాన్ని చూసిన వారు చెబుతున్నారు. ప్రమాదభరితంగా ఉన్న ఏడు బావుల జలపాతాన్ని నిషేధిత స్థలంగా ప్రకటించాలని, గుట్టపైకి వెళ్లేందుకు రక్షణ ఏర్పాట్లు చేయాలని ప్రజలు కోరుతున్నారు. -
మా టీచర్ మాకే కావాలి..
ఇల్లెందు: మా టీచర్ మాకే కావాలి... టీచర్లు లేకుంటే టీసీలు ఇవ్వండి.. వేరే బడికి వెళ్లిపోతాం.. అంటూ తరగతి గదిలోకి వెళ్లకుండా విద్యార్థినులు బైఠాయించారు. పట్టణంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో 9, 10 తరగతుల విద్యార్థినులు తమ ఉపాధ్యాయుల డిప్యుటేషన్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మంగళవారం పాఠశాల ఆవరణలో బైఠాయించిన విద్యార్థినులు ఉపాధ్యాయుడు శ్రీనివాస్‌ను పాల్వంచకు డిప్యుటేషన్ మీద పంపుతున్నారని, తమకు బోధించే వారు ఉండరని వారు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థినులు ఆందోళన చేస్తున్న సమాచారం తెలుసుకున్న ఏటీడీఓ సత్యనారాయణ పాఠశాలకు చేరుకుని విద్యార్థినులతో చర్చించారు. అనంతరం డీడీ జహీరుద్ధీన్‌తో మాట్లాడారు. డిప్యూటేషన్‌పై ఎవరినీ పంపించమని చెప్పడంతో ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా పీడీఎస్‌యూ రాష్ట్ర, జిల్లా నాయకులు పృధ్వీ, సీతారామారాజు మాట్లాడుతూ ఆశ్రమ పాఠశాలలో ఆరంభం నుంచి అన్నీ సమస్యలే ఉన్నాయన్నారు. ఇదే విషయమై ఐటీడీఏ డీడీ జహీరుద్ధీన్‌ను వివరణ కోరగా పాల్వంచలో విద్యార్థినులు ఎక్కువ ఉండి ఉపాధ్యాయులు లేకపోవటంతో అక్కడికి డిప్యుటేషన్ ఇచ్చామని తెలిపారు. -
అణచి వేసేందుకే మావోయిస్టు ముద్ర
ఇల్లెందు: టీఆర్ఎస్ ప్రభుత్వం గిరిజనుల రక్షణ కోసం ఉన్న చట్టాలు, జీఓలు అమలు చేయకపోగా గిరిజనులు సాగు చేస్తున్న పోడు భూములను లాక్కునేందుకు ప్రయత్నిస్తోందని తుడుందెబ్బ జాతీయ కన్వీనర్ రమణాల లక్ష్మయ్య ఆరోపించారు. బుధవారం ఇల్లెందు ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తుడుందెబ్బను దెబ్బతీసేందుకు మావోయిస్టు ముద్ర వేస్తున్నారన్నారు. భదాద్రి కొత్తగూడెం జిల్లా జిల్లా ఎస్పీ సునిల్‌దత్ చేసిన ప్రకటన పునఃపరిశీలించుకోవాలని కోరారు. తుడుందెబ్బ సంఘం మావోయిస్టు కనుసన్నల్లో పని చేస్తున్నట్లు ప్రకటించటాన్ని తీవ్రంగా ఖండించారు. పోడు భూముల సమస్యకు పూర్వం నుంచి ఆదివాసీలు అనేక ఉద్యమాలు చేశారని గుర్తు చేశారు. ఆదివాసీ ఉద్యమాలకు చరిత్ర ఉందని, అల్లూరి, కొమ్రంభీ, కోలాం, మన్యం తిరుగుబాట్లు, బిర్సాముండా లాంటి పోరాటాలు జరిగాయని, నేడు ఆదివాసీలు విద్య, ఉద్యోగ రంగాల్లోనూ ఉన్నారని, చట్టాలు, జీఓలు అవపోసానం పట్టి ఆదివాసీల అభివృద్ధికి కంకణం కట్టుకుని పని చేస్తున్నట్లు తెలిపారు. 5వ షెడ్యూల్, పెసా చట్టం, జీఓ నంబర్ 3, వర్గీకణ లాంటి సమస్యల కోసం 24 ఏళ్లుగా పోరాడుతున్నామని ఆయన తెలిపారు. తుడుందెబ్బ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వట్టం ఉపేందర్ మాట్లాడుతూ టీఆర్ఎస్ మలి దశ పోరు నీళ్లు, నిధులు, నియామకాల కోసం జరిగితే జల్, జంగిల్, జమీన్ కోసం నాటి నుంచి నేటి వరకు ఆదివాసీలు పోరాడుతున్నారని తెలిపారు. కేసులు, బెదిరింపుల ద్వారా ఆదివాసీ ఉద్యమం నిర్వీర్యమై పోదన్నారు. తప్పుడు కేసులు బనాయించటం, జైళ్లపాలు చేయటం, మావోయిస్టులకు అంటగట్టడం పరిపాటిగా మారిందన్నారు. భదాద్రి ఎస్పీ ప్రకటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. -
ఏజెన్సీలో ‘పోడు’ పోరు
ఇల్లెందు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం ముత్తారపుకట్ట పంచాయతీ పరిధిలోని వీరాపురం, కోటగడ్డ గ్రామాల్లో పోడు పోరు ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ ఘర్షణలో 19 మంది ఆదివాసీలను పోలీసులు అరెస్టు చేశారు. కోటగడ్డ గ్రామం పరిధిలోని 20 హెక్టార్ల భూమి విషయంలో గత ఏడాది కాలంగా అటవీ శాఖకు, ఆదివాసీలకు పోరు జరుగుతోంది. ఈ భూమిలో మొక్కలు నాటేందుకు అధికారులు శనివారం ఉదయం ట్రాక్టర్లతో దుక్కి దున్నుతుండగా 19 మంది ఆదివాసీలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో అటవీశాఖ సెక్షన్ అధికారి సుక్కి, బీట్ అధికారి సత్యవతికి గాయాలయ్యాయి. కొందరు గిరిజనులు కూడా గాయపడ్డారు. అనంతరం ఆదివాసీలను అరెస్టు చేసి ఇల్లెందు పోలీస్‌స్టేషన్‌కు తరలించిన తర్వాత అటవీ అధికారులు ట్రాక్టర్లతో దుక్కులు దున్నారు. ఈ సందర్భంగా ఎఫ్డీఓ అనిల్‌కుమార్ విలేకరులతో మాట్లాడుతూ.. కోటగడ్డ అటవీ ప్రాంతంలో మొత్తం 34 హెక్టార్లు ఉండేదని, ఇందులో 14 హెక్టార్లు గిరిజనులకు, 20 హెక్టార్లు అటవీ శాఖ పరిధిలో ఉండేలా గతంలోనే ఒప్పందం జరిగిందని తెలిపారు. ఈ భూమికి సంబంధించి ఎవరికీ పట్టాలు లేవని, ఒకవేళ ఎవరి వద్దనైనా ఉంటే అవి చూపిస్తే.. మొక్కలు నాటిన తర్వాత కూడా వారికే అప్పగిస్తామని చెప్పారు. హక్కు పత్రాలు లేకుండా పోడు నరికి భూమి తమదే అంటే వదిలిపెట్టేది లేదని తేల్చి చెప్పారు. అరెస్టు చేసిన వారిలో ఒక్కరికి కూడా హక్కు పత్రాలు లేవని స్పష్టం చేశారు. కాగా, ముత్తారపుకట్ట సర్పంచ్ మంకిడి కృష్ణ మాట్లాడుతూ.. ఈ భూమిలో మల్లెల కృష కు 9 ఎకరాలు, కళకు 5 ఎకరాలు, సుగుణకు 4 ఎకరాల పట్టా ఉందని, రైతుబంధు పథకం కింద సాయం కూడా పొందారని వివరించారు. -
భద్రాచలం టు మహబూబాబాద్
2009లో మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఏర్పడింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్, నర్సంపేట, డోర్నకల్, ములుగు అసెంబ్లీ నియోజకవర్గాలతోపాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లెందు, భద్రాచలం, పినపాక అసెంబ్లీస్థానాలు దీని పరిధిలో ఉన్నాయి. ఏడింటిలో ఆరు గిరిజన రిజర్వ్డ్ నియోజకవర్గాలే. మొత్తం ఓటర్లు 13,57,806 మంది ఉండగా, పురుషులు 6,74,028 మంది, మహిళలు 6,83,713, మంది, ఇతరులు: 65 మంది ఉన్నారు. సాక్షి, ఇల్లెందు: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గిరిజన ప్రాంతంగా పేరొందిన భద్రాచలం పార్లమెంట్ నియోజకవర్గం ఉండేది. 2009 నియోజకవర్గాల పునర్విభజనలో భద్రాచలం స్థానంలో మహబూబాబాద్ ఏర్పాటు చేశారు. 1967లో భద్రాచలం ఎస్టీ నియోజకవర్గం ఏర్పడింది. ఆనాడు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి బీకే రాధాబాయి(1,21,630) తన సమీప సీపీఎంకు చెందిన కేసీ శాంతరాజు(54,395) మీద గెలుపొందారు. 1971లో కాంగ్రెస్ నుంచి బీఆర్ ఆనందరావు(1,15,367)తన సమీప సీపీఐకి చెందిన నూప బొజ్జి (47,319) మీద గెలుపొందారు. 1977లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన రాధాబాయి ఆనందరావు(1,55,198), తన సమీప బీఎల్పీ అభ్యర్థి పి. వాణీ రామారావు(59,230) మీద గెలుపొందారు. 1980లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన రాధాబాయి ఆనందరావు(147534) తన సమీప సీపీఐ అభ్యర్థి కారం చంద్రయ్య(79,209) మీద గెలుపొందారు. 1984లో సీపీఐ నుంచి పోటీ చేసిన సోడె రామయ్య(1,95,618) తన సమీప అభ్యర్థి బీఆర్ ఆనందరావు(1,70,978) మీద గెలుపొందారు. 1991లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కె. కమల కుమారి(238956) తన సమీప సీపీఐ అభ్యర్థి సోడె రామయ్య(1,94,785) మీద గెలుపొందారు. 1996లో సీపీఐ నుంచి పోటీ చేసిన సోడె రామయ్య(2,45,212) తన సమీప అభ్యర్థి కె.కమల కుమారి(2,17,806)పై గెలుపొందారు. 1998లో సీపీఐ నుంచి పోటీ చేసిన సోడె రామయ్య(2,63,141) తన సమీప అభ్యర్థి కె. కమలకుమారి(2,03,701)పై గెలుపొందారు. 1999లో టీడీపీ నుంచి పోటీ చేసిన దుంప మేరి విజయకుమారి తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి టి. రత్నబాయి(2,56,490)పై గెలుపొందారు. 2004లో సీపీఎం నుంచి పోటీ చేసిన మిడియం బాబూరావు(3,73,148) తన సమీప టీడీపీ అభ్యర్థి ఫణీశ్వరమ్మ(3,19,342) మీద గెలుపొందారు. 2009లో మహబూబాబాద్ ఆవిర్భావం.. 2009లో భద్రాచలం రద్దు చేయగా మహబూబాబాద్ ఏర్పాటు చేశారు. 2009లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన బలరాం నాయక్ (3,94, 447) తన సమీప ప్రత్యర్థి సీపీఐకి చెందిన కుం జా శ్రీనివాసరావు(3,25,490)పై గెలుపొందారు. 2014లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన అజ్మీర సీతారాం నాయక్(3,20,569) కాంగ్రెస్‌కు చెందిన బలరాం నాయక్(2,85,577)మీద గెలుపొందారు. పూర్వపు మహబూబాబాద్ నియోజకవర్గంలో... మహబూబాబాద్ నియోజకకవర్గం 1951లో జనరల్‌గా ఉండేది. ఇక్కడి నుంచి తొలి దఫా రామస్వామి ఎంపీగా గెలుపొందారు. 1951లో కాంగ్రెస్ నుంచి జనార్దన్‌రెడ్డి(1,73,926) తన సమీప ఎస్పీ అభ్యర్థి ఎం. రామిరెడ్డి(1,02,131)పై గెలుపొందారు. 1957లో కాంగ్రెస్ నుంచి మధుసూదన్‌రెడ్డి (1,03,964)తన సమీప పీడీఎఫ్ అభ్యర్థి సర్వభట్ల రామనాథం(96,708)మీదగెలుపొందారు. 1962లో కాంగ్రెస్ నుంచి మధుసూదన్‌రావు (1,26,100) తన సమీప సీపీఐకి చెందిన తీగల సత్యనారాయణరావు(1,12,524) మీద గెలుపొందారు. 1965లో (బైఎలక్షన్) కాంగ్రెస్ నుంచి రామసహాయం సురేందర్‌రెడ్డి(1,61,156), తన సమీప సీపీఎం అభ్యర్థి మద్దికాయల ఓంకార్(43,819) మీద గెలుపొందారు. ఈ ఎన్నికల తర్వాత వచ్చిన పునర్విభజనతో మహబూబాబాద్ నియోజకవర్గం రద్దయింది. తిరిగి 2009లో.. తిరిగి 2009లో మహబూబాబాబాద్ ఎస్టీ నియోజకవర్గం ఆవిర్భవించగా తొలి దఫా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోరిక బలరాం నాయక్(3,94,447) తన సమీప సీపీఐకి చెందిన కుంజా శ్రీనివాసరావు మీద (3,25,490)గెలుపొందారు. 2014లో టీఆర్ఎస్ నుంచి అజ్మీర సీతారాం నాయక్(3,20,569)తన సమీప కాంగ్రెస్‌కు చెందిన బలరాం నాయక్(2,85,577) మీద గెలుపొందారు. -
అభివృద్ధికి కృషి చేస్తా
సాక్షి,ఇల్లెందు: ఇల్లెందు నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటానని, గెలిపిస్తే అభివృద్ధికి కృషి చేస్తానని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే, స్వతంత్ర అభ్యర్థి ఊకె అబ్బయ్య అన్నారు. శుక్రవారం మండలంలోని హనుమంతుపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇల్లెందు నుంచి రెండు దఫాలు ఎమ్మెల్యేగా గెలుపొందానని, తన హయాంలో ఈ ప్రాంతం అభివృద్ధి చెందిందని అన్నారు. వివిధ పార్టీలకు చెందిన పలువురు పదవులకు రాజీనామా చేసి తనతో పని చేస్తామని ప్రకటించారని ఆయన తెలిపారు. గ్యాస్ సిలిండర్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. నాయకులు దళపతి శ్రీనివాసరాజు, రాంప్రసాద్, జక్కుల కృష్ణ, భిక్షపతి యాదవ్, భద్రూ, నామోదర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
బందీగా అమ్మ... ఆకలితో పసికూన
మూడు నెలల పదకొండు రోజుల వయసున్న ఈ పసికూనకు మాట్లాడే శక్తే ఉంటే.. తన తల్లిని ఇలాగే వేడుకునేవాడేమో...!!! ఆ తల్లి ఎవరు..? ఎక్కడికెళ్లింది...? పసికూనకు ఎందుకు దూరమైంది,...? వీటికి సమాధానమే ఈ కథనం... ఇల్లెందు : ఇదొక ప్రేమికుడి వేదన. ఇదొక ప్రియురాలి యాతన. ఇదొక పసికూన రోదన. ఇల్లెందు మండలం రొంపేడు పంచాయతీ మిట్టపల్లి తండాకు చెందిన ఆమె పేరు బి.రజిత, గార్ల మండలం ముల్కనూరుకు చెందిన అతడి పేరు బళ్లెం కళ్యాణ్. వీరిద్దరూ ప్రేమించుకున్నారు. గార్ల శివాలయంలో ఏడాది క్రితం పెళ్లి చేసుకున్నారు. వీరి ప్రేమ–పెళ్లికి రజిత తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. వారి నుంచి తామిద్దరికీ ప్రాణ భయం ఉందంటూ గార్ల పోలీసులను ఆ ప్రేమ జంట ఆశ్రయించింది. వారిని ఇల్లెందు పోలీస్ స్టేషన్‌కు గార్ల పోలీసులు పంపించారు. రజిత తల్లిదండ్రులను ఇల్లెందు పోలీసులు పిలిపించారు. కౌన్సిలింగ్ నిర్వహించారు. ఆ తరువాత, రజిత– కళ్యాణ్ జంట హైదరాబాద్ వెళ్లింది. అక్కడే ఉంటున్నారు. రజిత గర్భవతయింది. ప్రసవం కోసం భర్తతో కలిసి ముల్కనూరుకు వచ్చింది. కొన్ని రోజులు గడిచాయి. రజితతో ఆమె తల్లిదండ్రులు, కుటుంబీకులు ఫోన్లో మాట్లాడసాగారు. యోగ క్షేమాలు తెలుసుకోసాగారు. మార్చి 19న పండంటి బాబుకు రజిత జన్మనిచ్చింది. బాబును, రజితను చూసేందుకు తల్లిదండ్రులు పలుమార్లు ముల్కనూరు వచ్చారు. రజిత–కళ్యాణ్ కుటుంబాల మధ్య సుహృద్బావ వాతావరణం ఏర్పడింది. వారం రోజుల కిందట రజిత అస్వస్థురాలైంది. ఆమె కుటుంబీకులకు తెలిసింది. ఇల్లెందులోని ఆస్పత్రిలో వైద్యం చేయిస్తామన్నారు. కళ్యాణ్–రజిత దంపతులు తమ పసికూనతో ఇల్లెందు చేరుకున్నారు. ప్రైవేటు వైద్యశాలలో రజితకు ఆమె కుటుంబీకులు వైద్యం చేయించారు. ఆ దంపతులు ఆ రోజు సాయంత్రం ముల్కనూరు చేరుకున్నారు. ఇంటికి రావాలంటూ రెండు రోజుల కిందట రజిత కుటుంబీకుల నుంచి పిలుపొచ్చింది. బాబును తీసుకుని కళ్యాణ్–రజిత ఇల్లెందు వచ్చారు. ఆమెను మిట్టపల్లిలోని పుట్టింటికి పంపించాడు. ఆ పసికూనకు ఆరోగ్యం బాగోలేదు. సాయంత్రానికి రావాలని, అప్పటివరకు బాబును తన వద్దనే ఉంచుకుంటానని అన్నాడు. ఆమె సరేనంది. తన పుట్టింటికి వెళ్లింది. సాయంత్రం వరకు కళ్యాణ్‌తో రజిత ఫోన్లో మాట్లాడింది. మరో గంటలో బయల్దేరుతానని చెప్పింది. సాయంత్రమైంది. ఆమె రాలేదు. బాబు ఏడుస్తున్నాడు. రజితకు ఫోన్ చేశాడు. ఆమె కుటుంబీకులు మాట్లాడారు. ‘‘రజిత రాదు. నీ దిక్కున్న చోట చెప్పుకోపో...’’ – అటు నుంచి వచ్చిన సమాధానమిది. ఈ హఠాత్పరిణామంతో కళ్యాణ్‌కు నోట మాట రాలేదు. శనివారం సాయంత్రమైంది. ఆ పసికూనకు ఒకటిన్నర రోజుపాటు తల్లి పాలు లేవు. పాపం.. ఆకలవుతుందేమో..! గుక్కపట్టి ఏడుస్తున్నాడు. కళ్యాణ్‌కు ఎటూ పాలుపోలేదు. పసికూనను ఎత్తుకుని, తన తల్లి సువార్తతో కలిసి ఇల్లెందు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాడు. జరిగినదంతా చెప్పాడు (ఫిర్యాదు చేశాడు). పోలీసులు స్పందించడం లేదని కళ్యాణ్ అంటున్నాడు. తనకు, తమ బిడ్డకు న్యాయం చేయాలని వేడుకుంటున్నాడు. ఎస్సై ఏమంటున్నారంటే.... దీనిపై ఇల్లెందు ఎస్ఐ బి.రాజును ‘సాక్షి’ వివరణ కోరింది. ‘‘తన భార్య రజితను మిట్టపల్లిలోని ఆమె పుట్టింటి వాళ్లు బంధించారంటూ పోలీస్ స్టేషన్‌కు కళ్యాణ్ వచ్చి ఫిర్యాదు చేశాడు. ఆదివారం ఉదయం మిట్టపల్లి నుంచి రజితను, తల్లిదండ్రులను స్టేషన్‌కు పిలిపించి విచారిస్తాం. ఫ్యామిలీ కౌన్సిలింగ్ కోసం ఖమ్మానికి రిఫర్ చేస్తాం. తనను బంధించినట్టుగా రజిత చెప్పలేదు. ఆమెను బంధించినట్టుగా ఆ గ్రామానికి చెందిన ఎవ్వరూ కూడా చెప్పలేదు. ఎవరైనా చెబితే... ఆ కుటుంబంపై చర్యలు తీసుకుంటాం. ఆమె తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లి ఉండవచ్చు. అలాంటప్పుడు ఆమెను బంధించినట్టు ఎలా అవుతుంది...? బంధించారని కళ్యాణ్ చెబితే సరిపోదు’’ అని, ఎస్సై అన్నారు. పాపం.. పసికూన.. ‘‘తల్లి నులివెచ్చని స్పర్శకు, పాలకు దూరమైన ఆ పసికందు పరిస్థితేమిటి..? తల్లిపాలకు దూరమై నిన్నటి రాత్రికి ఒకటిన్నర రోజు. ఎస్సై చెప్పినట్టుగా... కౌన్సిలింగ్ జరిపించి, తల్లి వద్దకు బిడ్డను పంపించేసరికి ఎన్ని గంటలు.. ఎన్ని రోజులు పడుతుందో...? అప్పటివరకు ఆ పసికందు ఆకలిదప్పులు, ఆరోగ్యం పట్టించుకునేదెవరు..? (పసిపిల్లల సంరక్షణ.. తండ్రికన్నా తల్లితోనే సాధ్యం కదా..!)’’ ఈ జంట–పసికూన వ్యవహారం తెలిసిన–చూసిన వారందరి ఆవేదన ఇది -
కన్నీటి కష్టాలు
ఉదయం ఆరు గంటల సమయం.. అది, సుదిమళ్ల పంచాయతీలోని వేపలగడ్డ తండా. వణికించే చలి. ఇళ్ల నుంచి ఒకరొక్కరుగా బయటికొస్తున్నారు. గుంపులు గుంపులుగా వెళుతున్నారు. చలికి వణుకుతూనే..వడివడిగా ముందుకు సాగుతున్నారు. దాదాపు రెండు కిలోమీటర్ల దూరం వరకు వారి ప్రయాణం సాగింది. కొద్దిసేపటి తరువాత తిరిగొస్తున్నారు. వారందరి చేతుల్లో బిందెలు..!వెళ్లేప్పుడు ఖాళీవి తీసుకెళ్లారు.. నీళ్లు నింపుకుని తిరిగొస్తున్నారు..!! అప్పుడు సమయం.. ఉదయం ఎనిమిది గంటలు. ఇల్లెందు: ‘‘మాకు రోజూ ఈ నీటి కష్టాలు తప్పడం లేదు. అంతదూరం (రెండు కి.మీ.) కాళ్లీడ్చుకుంటూ వెళతాం. నీళ్ల బిందెలు మోసుకుంటూ వస్తాం. మాకు ఇంకెన్నాళ్లీ కష్టాలు? కాళ్ల నొప్పో, కీళ్ల నొప్పో, రోగమో రొష్టో వచ్చి మేం మంచాన పడితే పరిస్థితేంటి? నీళ్లెవరు తేవాలి? మా కష్టాలను ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. ఒక్కోసారి ఏడుపొస్తంది...’’ – ఇది, వేపలగడ్డ గ్రామస్తుల నీటి వ్యథ.. కన్నీటి గాథ. ఈ వ్యథ–గాథ ఇప్పటిది కాదు. ఏళ్ల కిందటిది. అప్పటి నుంచి ఇదే దుస్థితి. ఇల్లెందు మండలంలో... సుభాష్‌నగర్, ఆజాద్‌నగర్, సంజయ్‌నగర్, ఇందిరానగర్, బాలాజీనగర్‌లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. వీటి నీటి అవసరాలు తీర్చేందుకు నాలుగు మంచినీటి ఓవర్‌హెడ్ ట్యాంకులు ఉన్నాయి. వీటిలోని నీరు చాలడం లేదు. సుదిమళ్ల పంచాయతీలోని హనుమంతులపాడు, సుదిమళ్ల, పూబెల్లి, వేపలగడ్డ, వేపలగడ్డ తండాల్లో తీవ్ర నీటి ఎద్దడి ఉంది. రొంపేడు పంచాయతీలోని మామిడిగుండాల, మర్రిగూడెం పంచాయతీలోనూ లోనూ ఇదే పరిస్థితి. ఇందిరానగర్‌లో వేసిన రెండు బోర్లలో చుక్క నీరు పడలేదు. మండలంలో మొత్తం 590 చేతి పంపులు, 101 మంచినీటి పథకాలు ఉన్నాయి. నీటి అవసరాలకు ఇవి వేపలగడ్డ తండాలో... వేపలగడ్డ తండాలో సుమారు 500 జనాభా ఉంది. ఇక్కడి మంచినీటి ట్యాంక్ కొన్నాళ్ల నుంచి నిరుపయోగంగా మారింది. ఇక్కడ ఒకేఒక్క చేతి పంపు ఉంది. అది కూడా మొరాయిస్తోంది. దీంతో ఈ తండా వాసులు తమ ఊరికి రెండు కిలోమీటర్ల దూరంలో గల తొడిదలగూడెంలోని బావి నుంచి నీటిని తోడుకుని బిందెలలో మోసుకొస్తున్నారు. తాగటానికే కాదు.. వాడకానికి కూడా అంత దూరం నుంచి నీళ్లు తెచ్చుకోవడం కష్టంగా మారింది. దీనిని భరించలేక, నెల క్రితం ఆందోళనకు దిగారు. మరో చేతి పంపు ఏర్పాటు చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. మంగళవారం రాత్రే ఇక్కడకు డ్రిల్ మిషన్ వచ్చింది. ఇల్లెందు పట్టణంలో... భూగర్భ జలం అడుగంటింది. ఇక్కడి బొగ్గు బావుల కారణంగా చేతి పంపులు, బోర్లు, బావుల్లో నీరు ఇంకిపోతోంది. పట్టణ ప్రజల దాహార్తి తీర్చే ఇల్లెందులపాడు చెరువులోనూ జలం అడుగంటింది. సుమారు 50వేల జనాభాగల ఇల్లెందు పట్టణానికి వేసవిలో నీరందించాలంటే 47 లెవల్ పైపులైన్ పనులు పూర్తికావాలి. లేనట్టయితే, రానున్న రెండు నెలల్లో పట్టణ ప్రజలకు పట్టపగలే (నీటి) చుక్కలు కనిపిస్తాయి. పట్టణంలో ప్రస్తుతం 58 చేతి పంపులు ఉన్నాయి. వీటిలో 30 మాత్రమే పనిచేస్తున్నాయి. 15, 16, 17 వార్డుల్లో నీటి ఎద్దడి వర్ణనాతీతంగా ఉంది. ఇక్కడ ఏళ్లతరబడి వాటర్ ట్యాంకర్ల ద్వారానే నీటి సరఫరా సాగుతోంది. సా....గుతున్న భగీరథ పనులు ఇల్లెందులోని కోరగుట్ట వద్ద ఏర్పాటు చేయతలపెట్టిన మిషన్ భగీరథ (వాటర్ గ్రిడ్) పనులు గత రెండేళ్ల నుంచి కొనసా...గుతూనే ఉన్నాయి. ఇవి పూర్తయితే... పట్టణ, మండల వాసుల దాహార్తి తీరుతుంది. తక్షణ కర్తవ్యం... అవసరమైన చోట్లకు వాటర్ ట్యాంకర్లు పంపాలి. బోరు బావుల లోతు పెంచాలి. మూలనపడిన చేతి పంపులను బాగు చేయించాలి. తక్షణం చేయాల్సిన పనులివి. -
వార్డెన్, హెచ్ఎంను సస్పెండ్ చేయాలి
ఇల్లెందు: గిరిజన ఆశ్రమ పాఠశాల హాస్టల్ వార్డెన్, పాఠశాల హెడ్మాస్టర్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు రోడ్డుపై ఆందోళన చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం రొంపేడ్ గిరిజన ఆశ్రమ పాఠశాల వసతి గృహానికి చెందిన 11 క్వింటాళ్ల బియ్యం అక్రమంగా తరలిపోయాయి. ఈ వ్యవహారంలో వార్డెన్‌ను, హెచ్ఎంను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు. విషయం తెలుసుకున్న సహాయ గిరిజన సంక్షేమ అధికారి అక్కడికి వచ్చి వారికి హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. -
సం‘క్షామ’ హాస్టళ్లు
ఇల్లెందు : గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు చదువుతో పాటు సకల సౌకర్యాలు, మెరుగైన ఆహారం అందించాలి. ఇందుకోసం మార్కెట్లో సరుకుల ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలు పెంచాలి. కానీ గత మూడేళ్లుగా ప్రభుత్వం మెస్ చార్జీలు పెంచకపోగా విద్యార్థులకు అందించే ఆహార పరిమాణం తగ్గిస్తోంది. మెస్ చార్జీలకు, మెనూ అమలుకు పొంతన లేకపోవడంతో హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలల నిర్వహణ తలకు మించిన భారంగా మారిందని సంక్షేమాధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పౌష్టికాహారం సక్రమంగా అందక విద్యార్థులు రక్తహీనతతో వ్యాధుల బారిన పడుతున్నారు. 3 నుంచి ఏడో తరగతి విద్యార్థులకు రోజుకు రూ.25, 8, 9, 10 తరగతుల వారికి రూ.28.33 చొప్పున అందించాలి. ఇందులో రెండు పూటలా భోజనం, ఉదయం అల్పాహారం, సాయంత్రం స్నాక్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ డబ్బు సరిపోక టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్లు నాసిరకమైన సరుకులు సరఫరా చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఎదిగే పిల్లలకు మజ్జిగ, పెరుగు అందని ద్రాక్షలా మారింది. కనీసం ఆదివారం కూడా వీరికి పిండి వంటల రుచి తెలియదు. మాంసాహారం ఊసే లేదు. అరటి పండు మినహా మిగితా ఏ పండూ వీరి దరి చేరదు. ఇక హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలల్లో ప్రతిరోజు ఉదయం ఉప్మా, పులిహోర, కిచిడి, జీరా రైస్, ఎగ్ బిర్యానీ, ఆలుగడ్డ కూర, మధ్యాహ్నం భోజనం, పప్పు, కూరగాయలు, కోడిగుడ్లు అందించాల్సి ఉంది. సాయంత్రం స్నాక్స్‌లో మూడు పీస్‌లు పల్లిపట్టీ, శనగలు 20 గ్రాములు, గ్రీన్ పీస్ 20 గ్రాములు, బొబ్బర్లు, శనివారం స్వీటు అందజేయాలి. రాత్రి పూట భోజనంలో అన్నం, కూరగాయలు, సాంబారు అందించాలి. విద్యార్థుల్లో జ్ఞాపకశక్తి కొరవడకుండా ఉండేందుకు విటమిన్లు కలిగిన ఆహారం ఇవ్వాలి. ‘ప్రత్యేక’ పాలనలో పెరగని చార్జీలు.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు విద్యాసంవత్సరాల్లో మెస్ చార్జీలు ఏమాత్రం పెంచలేదు. 2004లో అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి మెస్ చార్జీలు పెంచగా తదనంతరం అధికారం చేపట్టిన కిరణ్‌కుమార్‌రెడ్డి మరోమారు చార్జీలు పెంచారు. ఆ తర్వాత నూతన రాష్ట్రం ఆవిర్భవించి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం సన్న బియ్యం అందజేస్తున్నప్పటికీ మెస్ చార్జీలు పెంచటం విస్మరించింది. నింగినంటుతున్న నిత్యావసరాల ధరలు.. నిత్యావసర సరుకుల ధరలు చుక్కలను అంటుతుండగా విద్యార్థులకు అందించే మెస్ చార్జీలు మాత్రం యథాతథంగానే ఉంచారు. దీంతో హాస్టల్, ఆశ్రమ పాఠశాలల సంక్షేమాధికారులు(హెచ్‌డబ్ల్యూఓ) మూస పద్ధతిలో తక్కువ ధరకు లభించే కూరగాయలతో కాలం గడుపుతున్నారు. ఇక కాస్మొటిక్స్ చార్జీల కింద బాలురకు నెలకు రూ.50, బాలికలకు నెలకు రూ.75 చెల్లిస్తున్నారు. ఏళ్లు గడిచినా ఈ చార్జీలు మాత్రం పెంచటం లేదు. బాలురకు కనీసం రూ.100, బాలికలకు రూ.150 చెల్లించాలని విద్యార్థులు కోరుతున్నారు. బాలుర క్షౌ రానికి పైసా కూడా విడుదల చేయటం లేదు. జిల్లాలో 24 బాలుర, 22 బాలికల ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో బాలురు 7, 721 మంది, బాలికలు 8,958 మంది ఉన్నారు. ఇక గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో 12 బాలుర హాస్టళ్లలో 1215 మంది, ఆరు బాలికల హాస్టళ్లలో 1305 మంది ఉన్నారు. హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలల్లో విద్యనభ్యసించే వారికి 3 నుంచి 7వ తరగతి వరకు రోజుకు 475 గ్రాములు, 8, 9, 10 తరగతుల వారికి 525 గ్రాముల బియ్యం కేటాయించారు. 2015–16లో కిలో పప్పు ధర రూ.103 ఉండగా, నేడు అదే పప్పు ధర కిలో రూ.145కు సరఫరా చేస్తున్నారు. అయితే అప్పుడు ఒక్కో విద్యార్ధికి పప్పు 25 గ్రామలు ఇవ్వగా నేడు 35 గ్రాములు ఇస్తున్నారు. నాడు 25 గ్రాములకు రూ. 2.58 ఉండగా ప్రస్తుతం రూ. 5.08కి పెంచారు. ఒక్కో విద్యార్ధికి పప్పు 10 గ్రాములు పెంచగా రూ. 2.58 పైసల నుంచి రూ. 5.08 పైసలకు భారం పెంచారు. నూనె 15 గ్రాముల నుంచి 10 గ్రాములకు తగ్గించారు. చింతపండు 18 గ్రాముల నుంచి 10 గ్రాములకు తగ్గించారు. కారం పొడి 8 గ్రాముల నుంచి 6 గ్రాములకు తగ్గించారు. ఉప్మా రవ్వ ఒక విద్యార్థికి 40 గ్రాములు కేటాయించగా, నేడు 30కి తగ్గించారు. ఇలా ఒకటి, రెండు వస్తువులు పెంచినా మిగితా అన్నింటి పరిమాణం తగ్గించడం గమనార్హం. -
ఇల్లెందులో భారీ వర్షం
ఇల్లెందు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలంలో మంగళవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. సుమారు గంటపాటు కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. దీంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అకాల వర్షంతో జన జీవనం స్తంభించింది. ప్రస్తుతం చిన్నపాటి చినుకులు కురుస్తున్నాయి. -
కనకయ్య ‘కారు’ ఎక్కేనా..?
ఇల్లెందు: ఇల్లెందు కాంగ్రెస్‌లో ‘రేణుక తుపాన్’ మొదలైంది. పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన వారిపై చర్య తీసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్య గత రెండు నెలల క్రితం పీసీసీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఇల్లెందు నియోజకవర్గంలో రేణుక వర్గానికి చెందిన 12 మందిని పీసీసీ ఇటీవల సస్పెండ్ చేసింది. అయితే తమ అనుచరులపై వేటు వేయడాన్ని రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి తీవ్రంగా ఆక్షేపించారు. జిల్లాలో తాను ఉన్నంత కాలం కార్యకర్తలకు ఎలాంటి ఢోకా లేదని ఆమె భరోసా ఇచ్చారు. అయితే గత ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన వారిని రేణుక వెనకేసుకొస్తున్నారని ఎమ్మెల్యే వర్గీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో గురువారం ఇల్లెందు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టాలని కోరేందుకు ఎమ్మెల్యే కోరం కనకయ్య సీఎం కేసీఆర్ ఇంటికి వెళ్లి కలిశారు. నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను సీఎంకు వివరించారు. అవన్నీ సావధానంగా విన్న కేసీఆర్.. బంగారు తెలంగాణ పట్ల తనకున్న విజన్‌ను ఎమ్మెల్యే ముందుంచారు. బంగారు తెలంగాణలో భాగస్వాములు కావాలని, టీఆర్ఎస్లోకి రావాలని కనకయ్యను కేసీఆర్ స్వయంగా ఆహ్వానించారు. అయితే తన విజయానికి కృషి చేసిన కార్యకర్తలు, ప్రజల మనోభావాలకు అనుగుణంగానే నడుచుకుంటానని, వారి అభీష్టం మేరకే తన నిర్ణయం ఉంటుందని సీఎంకు చెప్పారని సమాచారం. కాగా, ఎమ్మెల్యే అనచరుల్లో ముఖ్యమైన నేతలు టీఆర్ఎస్ వైపు అడుగు వేసేందుకు సంసిద్ధంగా ఉన్నారని తెలిసింది. వచ్చే ఐదేళ్లలో అభివృద్ధితో పాటు నియోజకవర్గ ప్రజలను మెప్పించేలా పాలన సాగించాలంటే ప్రభుత్వ సహకారం అవసరమని, కేసీఆర్ ఆహ్వానం మేరకే గులాబీ తీర్థం పుచ్చుకుంటే నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేసే అవకాశం ఉంటుందని వారు అభిప్రాయపడుతున్నారు. ఇందుకోసం ఒకటి, రెండు రోజుల్లో నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించి కార్యకర్తల మనోభావాలు తెలుసుకుంటామని ఎమ్మెల్యే అనుచర నాయకుడు ఒకరు తెలిపారు. సెప్టెంబర్ ఒకటిన వీరంతా టీఆర్ఎస్లో చేరే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. -
ఎన్డీ నేతల అరెస్టు
ఇల్లెందు : తమ భూములను దున్నుకోనివ్వడం లేదం టూ టీఆర్ఎస్ నాయకుడు దేవీలాల్ నాయక్ ఫిర్యాదు ఇచ్చిన నేపథ్యంలో న్యూడెమోక్రసీ నాయకులను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. సీఐ ఎన్.రమేష్ నేతృత్వంలో ఎన్డీ నాయకులు నాయిని రాజు తదితరులను వారి ఇళ్ల వద్ద అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సమాచారం అందుకున్న ఎన్డీ కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, నాయకులు రాయల చంద్రశే ఖర్, జగ్గన్నల ఆధ్వర్యంలో సుమారు 200 మంది పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. సుమారు రెండు గంటల పాటు ఈ ఆందోళన జరిగింది. ఈక్రమంలో సీఐ ఎన్.రమేష్‌తో ఎన్డీ నేతలు వాగ్వాదానికి దిగారు. భూవివాధంలో మీ జోక్యం ఏమిటని, ఏ అధికారంతో అరెస్టు చేశారని ప్రశ్నించారు. ఆయుధాలతో వచ్చి బెదిరింపులకు పాల్పడినట్లు తమ వద్ద ఆధారాలున్నాయని, అందులో భాగంగానే అరెస్టు చేయాల్సి వచ్చిందని సీఐ సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలో వాగ్వాదం తారస్థాయికి చేరుకుంది. తనను ఏకవచనంతో సంబోధించడంతో సీఐ అసహనం వ్యక్తం చేశారు. స్టేషన్ ఎదుట నుంచి పది నిమిషాల్లో వైదొలగాలని మైక్‌లో ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే సబ్ డివిజన్‌కు చెందిన పలువురు సీఐలు, ఎస్సైలను, కొత్తగూడెం నుంచి ప్రత్యేక బలగాలను రప్పించారు. ఆందోళనకారులను మించిన స్థాయిలో పోలీసు బలగాలు స్టేషన్ ముందుకు చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆందోళన విషయాన్ని సీఐ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఏఎస్పీ రమణకుమార్ హుటాహుటిన ఇల్లెందు చేరుకుని ఆందోళన చేస్తున్న ఎన్డీ నేతలను స్టేషన్లోకి పిలిచి చర్చించారు. సమస్యను పరిష్కరిస్తామని ఏఎస్పీ హామీ ఇవ్వడంతో ఎన్డీ నేతలు ఆందోళన విరమించారు. వివాదం ఇలా... ధర్మారం తండాకు చెందిన లాకావత్ దేవీలాల్ నాయక్ భూముల విషయంలో 2006 నుంచి వివాదం నడుస్తోంది. తనకు తీవ్ర అన్యాయం జరిగిందని దేవీలాల్ నాయక్ ఇటీవల ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే గత నెల 22న భూముల వద్ద దేవీలాల్‌కు, ఎన్డీ నేతలకు మధ్య వాగ్వాడం చోటుచేసుకున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో దేవీలాల్ ఫిర్యాదు మేరకు ఎన్డీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. -
ముందుకు సాగని ‘ఇండోర్’
ఇల్లెందు : క్రీడారంగాన్ని ప్రోత్సహించాలంటే అందుకు అనువైన సదుపాయాలు అందుబాటులో ఉండాలి. ఇందుకోసం ప్రతి నియోజకవర్గ కేంద్రంలో జిల్లా స్థాయి క్రీడాకారుల ఎంపికకు అవసరమైన పోటీలు నిర్వహించేందుకు ఇండోర్ స్టేడియం నిర్మించాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. అయితే జిల్లాలో రెండు స్టేడియాల నిర్మాణ పనులు మాత్రమే ప్రారంభం కాగా, మిగిలిన వాటి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. జిల్లాలో ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఒక్కో స్టేడియం నిర్మాణానికి రూ.1.10 కోట్ల చొప్పున మంజూరు చేసింది. 2012-13 మార్చిలో స్టేడియాల నిర్మాణానికి పలు చోట్ల స్థలాలను అన్వేషించారు. జిలాల్లో ఖమ్మం, కొత్తగూడెం, వైరాలో ఇప్పటికే ఉన్న స్టేడియాలను అధునికీకరించి, మిగతా నియోజకవర్గాల్లో నూతనంగా నిర్మించాలని ప్రభుత్వం భావించింది. ఈ క్రమంలో పినపాక, మధిర నియోజకవర్గం చింతకానిలో స్థలాలు లభించటంతో నిర్మాణం చేపట్టారు. ఇక ఇల్లెందు, భద్రాచలం, పాలేరు, అశ్వారావుపేట, సత్తుపల్లి నియోజకవర్గ కేంద్రాల్లో స్థలాలు లభించక పనులు ప్రారంభించ లేదు. ఇప్పుడు కొత్త ప్రభుత్వమైనా.. చొరవ తీసుకుని స్టేడియాలను నిర్మిస్తుందా అని క్రీడాభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. 2012-13లో జిల్లాలో ఒక్కో స్టేడియం నిర్మాణానికి రూ. 1.10 కోట్ల చొప్పున నిధులు మంజూరయ్యాయి. ఇక ఇప్పటికే నిర్మితమై ఉన్న ఖమ్మం స్టేడియం ఆధునికీకరణకు రూ.20 లక్షలు, కొత్తగూడెంనకు రూ.5 ల క్షలు, వైరాకు రూ.60 లక్షలు మంజూరు చేశారు. మిగితా వాటిలో ఒక్కో స్టేడియం నిర్మాణానికి 5 నుంచి 10 ఎకరాల స్థలం అవసరం కాగా, ఆ భూమి దొరకకపోవడంతో అధికారులు హైరానా పడుతున్నారు. స్థల సమస్యతోనే నిర్మాణాల్లో జాప్యం : డీఎస్ఓ ఈ విషయమై జిల్లా డీఎస్ఓ కబీర్‌దాస్‌ను వివరణ కోరగా ...చింతకాని, పినపాకలో స్టేడియాలు నిర్మాణంలో ఉన్నట్లు చెప్పారు. మిగతా స్టేడియాల నిర్మాణానికి స్థలాలు లభించకపోవటం సమస్యగా మారిందన్నారు. ఇటీవల నూతన రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు- మన క్రీడల కార్యక్రమంలో ప్రతి పంచాయతీ కేంద్రంలో 2 నుంచి 3 ఎకరాలు, మండల కేంద్రంలో 5 నుంచి 7 ఎకరాలకు తగ్గకుండా స్థలాలు సేకరించాలని జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ అధికారులకు లేఖలు పంపించిందన్నారు. అయితే నూతన ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపైనే స్టేడియాల నిర్మాణం ఆధారపడి ఉంటుందన్నారు. -
ఉక్కు పరిశ్రమకు కేంద్రం ఆమోదం
ఇల్లెందు, న్యూస్‌లైన్: జిల్లాలో 30వేల కోట్ల రూపాయల వ్యయంతో ఉక్కు పరిశ్రమ (స్టీల్ ప్లాంట్) ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని జాయింట్ కలెక్టర్ (జేసీ) సురేంద్రమోహన్ తెలిపారు. ఈ పరిశ్రమ ఏర్పాటు కోసం స్థలాలను పరిశీలిస్తున్నట్టు చెప్పారు. ఆయన గురువారం కొత్తగూడెం, ఇల్లెందు, బయ్యారం మండలాల్లో పర్యటించారు. అనంతరం, ఇల్లెందులోని సింగరేణి గెస్ట్‌హౌస్‌లో విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు అనువైన ప్రాంతాలను పరిశీలించేందుకు న్యూఢిల్లీ నుంచి తొమ్మిదిమందితో కూడిన స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా(సెయిల్) బృందాన్ని కేంద్ర ప్రభుత్వం పంపిందని అన్నారు. బయ్యారం మండలంలోని ధర్మాపురం (నామాలపాడు), పాల్వంచ మండలంలోని మూడు ప్రాంతాలను, కొత్తగూడెం మండలంలో ఒక ప్రాంతాన్ని ఈ బృందం పరిశీలించిందన్నారు. ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు 2500 ఎకరాలు... టౌన్షిప్ కోసం మరో 500 ఎకరాల స్థలం అవసరమవుతుందని జేసీ తెలిపారు. ప్లాంట్ ఏర్పాటుకు 1.5 టీఎంసీ నీరు కావాల్సుంటుందని చెప్పారు. దీని కోసం కిన్నెరసాని, గోదావరి, బయ్యారం పెద్ద చెరువులను సెయిల్ బృందానికి చూపినట్టు చెప్పారు. ఉక్కు పరిశ్రమకు అవసరమైన సున్నపు రాయిని మన పక్కనున్న నల్గొండ జిల్లా నుంచి తెప్పించవచ్చని అన్నారు. స్టీల్ ప్లాంట్ నిర్మాణంపై మైనింగ్, రెవిన్యూ, ఇరిగేషన్, సింగరేణి, పొల్యుషన్ కంట్రోల్ బోర్డ్, ఫారెస్ట్, జెన్కో అధికారులతో బుధవారం ఖమ్మంలో చర్చించినట్టు చెప్పారు. సెయిల్ బృందం సర్వే అనంతరం నివేదికను డిల్లీకి పంపిస్తామన్నారు. ఆ తర్వాత, ప్లాంటు నిర్మాణ ప్రదేశంపై స్పష్టత వస్తుందన్నారు. -
మూడోరోజు జోరు
సాక్షి, ఖమ్మం: మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు జోరందుకున్నాయి. నామినేషన్లు ప్రారంభమైన తొలి రెండురోజులు ఈ ప్రక్రియ మందకొడిగా సాగింది. మూడోరోజు బుధవారం అభ్యర్థులు ఉత్సాహంతో నామినేషన్లు వేశారు. ఇల్లెందు, కొత్తగూడెం, మధిర, సత్తుపలి నగర పంచాయతీలకు మొత్తం 118 నామినేషన్లు దాఖలయ్యాయి. కానీ మధిరలో తొలిరోజు నామినేషన్ల స్వీకరణ నుంచి ఇప్పటి వరకు ఒకటే నామినేషన్ దాఖలవడం గమనార్హం. ఈనెల 10 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైనా రెండు రోజులు మాత్రం నామినేషన్లు అంతగా దాఖలు కాలేదు. బుధవారం మంచిరోజు కావడంతో అభ్యర్థులు కోలాహలంగా నామినేషన్లు దాఖలు చేశారు. కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో పలు వార్డులకు 40 నామినేషన్లు, ఇల్లెందులో 53, సత్తుపల్లిలో 24 నామిషన్లు దాఖలు కాగా మధిరలో మాత్రం ఒకే ఒక నామినేషన్ వేశారు. మధిర నగరపంచాయతీ పరిధిలో 20 వార్డులు ఉన్నాయి. పదో వార్డుకు స్వతంత్ర అభ్యర్థిగా తిమ్మినేని రామారావు నామినేషన్ దాఖలు చేశారు. రెండు రోజులుగా ఒక నామినేషన్ కూడా దాఖలు కాలేదు. నామినేషన్ల స్వీకరణ నుంచి ఇప్పటి వరకు పార్టీల పరంగా ఒక్క అభ్యర్థి కూడా మధిర నగర పంచాయతీలోని వార్డులకు నామినేషన్ వేయలేదు. స్థానికంగా పొత్తులు ఇంకా ఖరారు కాకపోవడంతో బరిలో నిలవాలనుకుంటున్న అభ్యర్థులు హైరానాపడుతున్నారు. వార్డు సభ్యుడిగా తమకు అవకాశం కల్పించాలని ఆశావాహులు తమ నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కొత్తగూడెం, సత్తుపల్లిలో ఎస్సీ, ఎస్జీ జనరల్, మహిళలకు రిజర్వు అయిన వార్డుల్లో అసలు అభ్యర్థులు దొరకక పార్టీల నేతలు వెదుకులాట ప్రారంభించారు. పార్టీ కార్యకర్తలు కూడా లేకపోవడంతో ఏమి చేయాలో నేతలకు పాలుపోవడం లేదు. రిజర్వు అయ్యి పార్టీ పరంగా కార్యకర్తలు లేనిచోట...అసలు పార్టీల్లో తిరగని విద్యావంతులపై నేతలు కన్నేశారు. తుది గడువు నాటికి వారిని ఒప్పించి నామినేషన్ వేయించడానికి కసరత్తు చేస్తున్నారు. నామినేషన్ల స్వీకరణ తుది గడువు దగ్గర పడుతుండటంతో అభ్యర్థుల విషయంలో పలు పార్టీలది ఇదే పరిస్థితి. ఇప్పటికే ఖరారైన వారు చివరిరోజు 14న సందడితో నామినేషన్లు వేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. -
మంగన్న ఎన్కౌంటర్ బూటకం
ఇల్లెందు, న్యూస్‌లైన్: మావోయిస్టు నేత మంగన్న అనారోగ్యంతో బాధపడుతూ ముంగుడవలస కొండ ప్రాంతంలోని కుగ్రామంలో షెల్టర్ తీసుకుని వైద్యం పొందుతుండగా పట్టుకుని కాల్చి చంపి ఎన్కౌంటర్ అంటూ కట్టుకథలు అల్లుతున్నారని అమరవీరుల బంధుమిత్రుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు పద్మ ఆరోపించారు. మంగన్న అంత్యక్రియల్లో పాల్గొనేందుకు శుక్రవారం ఇల్లెందు మండలం మిట్టపల్లి వచ్చిన ఆమె మాట్లాడారు. మావోయిస్టు నేతల తలలకు ప్రభుత్వం ప్రకటించిన రివార్డులు పోలీసులు ఆశపడి అత్యంత పాశవికంగా మారణహోమం ృష్టిస్తున్నారని అన్నారు. ప్రజల జీవితాలు బాగు చేసేందుకు మంగన్న చిరు ప్రాయంలోనే ఉద్యమంలో చేరి తన మనసులోకి స్వార్ధమనే భావం రాకుండా ఉండేందుకు వివాహం కూడా చేసుకోలేదని అన్నారు. రాజకీయనేతలు రోజుకోపార్టీ మారుస్తూ మేనిఫెస్టోలను ఇష్టారాజ్యంగా మారుస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని, ఈ క్రమంలో ప్రజా సమస్యల పరిష్కారమే అజెండాగా మావోయిస్టు ఉద్యమం పని చేస్తోందని ఆమె అన్నారు. మంగన్న ఎన్‌కౌంటర్‌పై న్యాయ విచారణ జరిపించి అందుకు బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల హక్కుల కోసం పోరాడిన మంగన్న : ఇల్లెందు, ములుగు ఎమ్మెల్యేలు ఊకె అబ్బయ్య, సీతక్క ప్రజల హక్కులను కాపాడేందుకు సుధీర్ఘ కాలం పాటు పోరాడి అశువులు బాసిన మంగన్న ఆశయం గొప్పదని ఇల్లెందు, ములుగు ఎమ్మెల్యేలు ఊకె అబ్బయ్య, సీతక్కలు అన్నారు. మంగన్న వృుతదేహాన్ని సందర్శించి నివాళులర్పించిన అనంతరం వారు మాట్లాడారు. మంగన్న లక్ష్యం మరవలేనిది: ఎస్వీ సుధీర్ఘ కాలం పాటు విప్లవోద్యమంలో అలుపెరగని పోరాటం చేసిన మావోయిస్టు నేత మంగన్న లక్ష్యం మరువలేనిదని న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యులు సాధినేని వెంకటేశ్వరరావు అన్నారు. మంగన్న వృుతదేహాన్ని సందర్శించి నివాళులర్పించిన ఆయన మాట్లాడుతూ ఈ దేశానికి నూతన ప్రజాస్వామిక విప్లవమే మార్గమన్నారు. హింసించి హతమార్చారు : మాజీ ఎమ్మెల్యే గుమ్మడి సీపీఐ ఎంఎల్లో దళ సభ్యుడిగా చేరిన మంగన్న అంచెలంచెలుగా ఎదిగి ప్రజల పక్షాన ముందుకు సాగుతున్న క్రమంలో పోలీసులు పట్టుకుని చిత్ర హింసలకు గురి చేశారని ఎన్డీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, వరంగల్ కార్యదర్శి చిన్న చంద్రన్నలు అన్నారు. మంగన్న నేరం చేస్తే పట్టుకుని శిక్షించాల్సిన పోలీసులు ఎలాంటి విచారణ లేకుండానే హతమార్చి ఎన్కౌంటర్ కట్టుకథలు అల్లినారని అన్నారు. రాజ్యహింసకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. గ్రీన్‌హంట్ పేరుతో పోలీసులను అడవుల్లోకి అధిక సంఖ్యలో తరలించి నరమేధాన్ని సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మహాజన సోషలిస్టు పార్టీ ఖమ్మం జిల్లా నాయకులు సుగుణరావు, తుడుందెబ్బ నాయకులు వట్టం ఉపేందర్, వట్టం నారాయణ, ఈసం నర్సింమారావు, రమణాల లక్ష్మయ్య, జవ్వాజి లక్ష్మీనారాయణ, కొడెం వెంకటేశ్వర్లు, ఎస్కె సంథాని, న్యూడెమోక్రసీ (చంద్రన్న) నాయకులు గౌని ఐలయ్య, జడ సత్యనారాయణ, జె.సీతారామయ్య, ఎన్డీ (రాయలవర్గం) నాయకులు కిన్నెర నర్సయ్య, అజయ్, మోకాళ్ల కృష్ణ,నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
నిరసన గళం... గందరగోళం...
ఇల్లెందు, న్యూస్‌లైన్ : ఇల్లెందులో శుక్రవారం మూడోవిడత రచ్చబండ సభ వివిధ పార్టీల ఆందోళనలతో ఆద్యంతం రసాభాసగా మారింది. పలుమార్లు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. స్థానిక ఫారెస్ట్ గ్రౌండ్లో ఎమ్మెల్యే ఊకె అబ్బయ్య అధ్యక్షతన సభ ప్రారంభమైంది. ఈ సభలో ఒకటి తరువాత ఒకటిగా వరుస ఘటనలు ఇలా జరిగాయి... వేదిక పైకి ఎమ్మెల్యే రాగానే.. బ్యానర్ నుంచి సీమాంధ్ర సీఎం ఫొటో తొలగించాలని టీఆర్ఎస్ నాయకులు పట్టుబట్టారు. వారికి డీఎస్పీ కె.కృష్ణ నచ్చచెబుతుండగా... కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దాస్యం ప్రమోద్ కుమార్ తదితరులు వేదిక పైకి వెళ్లి సీఎం ఫొటో తొలగించారు. రచ్చబండ కార్యక్రమ రూపకర్తయిన దివంగత సీఎం వైఎస్సార్ ఫొటో ఎందుకు పెట్టలేదంటూ వైఎస్ఆర్ సీపీ మండల కన్వీనర్ పులి సైదులు, నాయకులు దొడ్డా డానియేల్, కోండ్రు భద్రయ్య తదితరులు ఆందోళనకు దిగారు. వీరిని పోలీసులు అడ్డుకుని అక్కడి నుంచి తొలగించారు. బయ్యారంలో ఉక్కు, మామిడిగుండాలలో ల్యాటరైట్ పరిశ్రమ నెలకొల్పాలని; తుపాను బాధిత రైతులను ఆదుకోవాలని, ఇల్లెందులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని, మార్కెట్‌ను తెరిపించాలని, గత రెండు రచ్చబండల్లో ప్రజలు ఇచ్చిన దరఖాస్తుల్లో ఎన్నింటిని పరిష్కరించారో లెక్క చెప్పాలని తదితర డిమాండ్లతో న్యూడెమోక్రసీ సబ్ డివిజన్ కార్యదర్శి ఎన్.రాజు, పట్టణ కార్యదర్శి టి.నాగేశ్వరరావు తదితరుల ఆధ్వర్యంలో కార్యకర్తలు చేపట్టిన ఆందోళ న ఉద్రిక్తంగా మారింది. నాయకులపై ఒకానొక దశలో పోలీసులు చేయి చేసుకున్నారు. దీనిని నిరసిస్తూ సభావేదిక ముందు న్యూడెమోక్రసీ నాయకులు బైఠాయించారు. వారిని తొలగించేందుకు పోలీసులు యత్నించారు. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో నాయకులు తూలి కింద పడిపోయారు. కౌంటర్లలో ఇచ్చిన అర్జీలకు రసీదులు ఇవ్వాలంటూ టీఆర్ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు. వారిని పోలీసలు అడ్డుకున్నారు. ఇల్లెందు సింగరేణి 21 ఏరియా కాలనీ సమస్యలు పరిష్కరించాలంటూ సర్పంచ్ ఎస్.పార్వతి, ఉప సర్పంచ్ రెంటాల లక్ష్మి, పీఏసీఎస్ అధ్యక్షుడు ఆవుల కిరణ్ ఆధ్వర్యంలో స్థానికులు సభావేదిక ముందు బైఠాయించారు. సమస్యలపై కలెక్టర్, జాయింట్ కలెక్టర్‌తో చర్చిద్దాంటూ వారిని ఎమ్మెలే ఊకె అబ్బయ్య శాంతింపచేశారు. తుపానుతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, అర్హులైన పోడు భూములకు పట్టాలివ్వాలని, మామిడిగుండాలలో ల్యాటరైట్ పరిశ్రమను ప్రభుత్వం నెలకొల్పాలని, ఇల్లెందుకు బస్ డిపో మంజూరు చేయాలని, ప్యాసింజర్ రైలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం డివిజన్ కార్యదర్శి మెరుగు సత్యనారాయణ, నాయకులు దేవులపల్లి యాకయ్య, నబీ తదితరులు ఆందోళనకు దిగారు. మున్నూరు కాపు కులస్తులకు కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ ఆ సంఘం నాయకులు పులి సైదులు, పోషం వెంకటేశ్వర్లు, పాలెపు ఆనంద్, సతీష్ తదితరులు ఆందోళన నిర్వహించారు. వారిని పోలీసులు తొలగించారు. చివరిగా, ఎమ్మెల్యే ఊకె అబ్బయ్య మాట్లాడుతూ.. బస్ డిపో ఏర్పాటు, మామిడిగుండాల సీలింగ్ భూములు, పోడు భూములకు హక్కులు, ల్యాటరైట్ ఖనిజ పరిశ్రమ ఏర్పాటు తదితరాంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళుతున్నట్టు చెప్పారు. భద్రాచలం తెలంగాణలో భాగమేనంటూ సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. -
శీలం ఖరీదు రూ.2 లక్షలు
* పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు ఇల్లెందు: ప్రేమించానని మాయమాటలు చెప్పి గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి చేసుకున్న ఓ యువకుడు చివరకు ఆ యువతిని వదిలించుకునేందుకు రూ. 2లక్షల ఖరీదు కట్టిన సంఘటన ఇది. ఖమ్మం జిల్లా ఇల్లెందు మండలం బొల్లినగర్లో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా ఆదివారం వెలుగులోకి వచ్చింది. వివరాలివీ... ఇల్లెందు మండలం బొల్లినగర్కు చెందిన ఓ యువతి అదే ఏరియాకు చెందిన ఎం.వెంకటేశ్ ఏడాదిగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరికీ తల్లిదండ్రులు లేరు. సదరు యువకుడికి ఖమ్మంలో ఉండే అతని మామ సాయం అందిస్తుండగా ఇల్లెందులో ఉంటున్నాడు. ఆ యువతి డీఎంఎల్టీ కోర్సు ఇటీవలే పూర్తి చేసింది. వీరి ప్రేమకు వెంకటేశ్ మామ అభ్యంతరం చెప్పటంతో నాలుగు నెలల క్రితం ఎవరికీ తెలియకుండా యువతి ఇంట్లోనే పసుపుతాడు కట్టి పెళ్లి చేసుకున్నాడు. నాలుగు నెలలు కాపురం చేసిన తర్వాత యువతి గర్భం దాల్చడంతో అబార్షన్ చేయించాడు. అనంతరం ఆమెను వదిలించుకునేందుకు పంచాయితీ పెట్టించాడు. దీంతో పెద్దలు యువతికి రూ. 2లక్షలు ఇప్పించేందుకు తీర్మానించారు. పంచాయితీ జరిగిన రెండు రోజుల తర్వాత ఆ యువతి తనకు భర్తే కావాలంటూ ఇల్లెందు పోలీసులను ఆశ్రయించింది. ఈ వ్యవహారంపై పోలీసులు విచారణ చేపట్టారు.