ఏడు బావుల జలపాతం: దొడ్డా మహేష్ మృతదేహం (ఇన్‌సెట్), మహేష్ (ఫైల్)
సాక్షి, ఇల్లెందు: ఏడు బావుల జలపాతం మృత్యు కుహురంగా మారుతోంది. రెండో రోజుల క్రితం ఇల్లెందు మండలంలోని రాఘబోయినగూడేనికి ఇద్దరు యువకులు విహారానికి వెళ్లగా.. ఒకరు మృతి చెందిన విషయం విదితమే. అప్పటి నుంచి మరో యువకుడి ఆచూకీ తెలియకుండాపోయింది. గురువారం కుటుంబ సభ్యులు, గ్రామస్తులు మరోసారి జలపాతం వద్దకు వెళ్లి వెతకగా మృతదేహం లభించింది. ఏడాది కాలంలో ఇక్కడ నలుగురు యువకులు మృతి చెందారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం, మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం సరిహద్దుల్లో ఉన్న ఏడు బావుల జలపాతం ప్రమాదభరితంగా మారుతోంది. గ్రామస్తుల కథనం మేరకు.. ఇల్లెందు మండలం రాఘబోయినగూడేనికి చెందిన పొగాకు నాగేశ్వరరావు, లలిత దంపతుల కుమారుడు సురేష్ (22), తన స్నేహితుడు దొడ్డా మహేష్(16)తో కలిసి గత మంగళవారం సాయంత్రం సరదాగా ఏడుబావుల జలపాతానికి వెళ్లారు. జలపాతం తిలకిస్తున్న క్రమంలో పైనుంచి జారి బావిలో పడిపోయారు. ఇద్దరూ అక్కడిక్కడే మృతి చెందారు. మరుసటి రోజు అటు వైపునకు వెళ్లిన కొందరు సురేష్ మృతదేహాన్ని గమనించి ఫొటోలు తీసి వాట్సాప్ గ్రూపుల్లో పెట్టారు. అప్పటికే రాఘబోయినగూడేనికి చెందిన ఇద్దరు యువకులు కనిపించటం లేదని కుటుంబ సభ్యులు వెతకసాగారు. వాట్సాప్‌లో ఫొటోలు చూసి సురేష్ వేసుకున్న దుస్తులు, ద్విచక్ర వాహనం గమనించి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు జలపాతం వద్దకు వెళ్లారు. అప్పటికే గంగారం పోలీసులు మృతదేహాన్ని పాఖాల కొత్తగూడ తరలించారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.
జారి పడి.. సొరికేలో ఇరుక్కుపోయి..
తన స్నేహితుడు సురేష్ గుట్ట పైనుంచి జారి పడి చనిపోయిన సంఘటనను చూసిన మహేష్ భయానికి పారిపోయి ఉంటాడని అంతా భావించారు. కానీ ఎక్కడా ఆచూకీ లేకపోవడంతో గురువారం మరోసారి సంఘటన స్థలానికి వెళ్లి బావుల్లో వెతికారు. బావి లోపల పడిపోయి ఓ సొరికేలో ఇరుక్కుని ఉండటాన్ని గమనించి బయటకు లాగారు. ఆ మృతదేహం మహేష్‌దిగా గుర్తించారు. గంగారం పోలీసులకు సమాచారం అందించగా, వారు పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని పాఖాల కొత్తగూడ తరలించారు. మహేష్ చిన్నతనంలోనే తండ్రి కుటుంబాన్ని వదిలేసి వెళ్లిపోయాడు. తల్లి నాగమణితో కలిసి అమ్మమ్మ దేవనబోయిన మంగమ్మ ఇంటి వద్ద ఉంటున్నారు. నాగమణికి ఇద్దరు కుమారులు కాగా మహేష్ పెద్ద కుమారుడు. రాఘబోయినగూడెం గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు ఏడు బావుల అందాలను తిలకించేందుకు వెళ్లి మృత్యువాత పడటంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
పొలానికి పురుగు మందులు తీసుకొస్తామని వెళ్లి..
పొలానికి పురుగు మందుల తీసుకొస్తామని చెప్పి సురేష్, మహేష్‌లు రాఘబోయినగూడెం నుంచి ఇల్లెందుకు బయలుదేరారు. మంగళవారం సాయంత్రం నాలుగు గంటల వరకు రాఘబోయినగూడెం వారికి ఇల్లెందులో కనిపించారు. ఆ సమయంలో అకస్మాత్తుగా వారికి ఏడు బావుల జలపాతం తిలకించాలని ఆలోచన ఎందుకు వచ్చిందో కాని అక్కడి వెళ్లారు. ఆ సమయంలో అటవీ ప్రాంతంలో వర్షం కురిసినట్లు ఆ ఏరియా వాసులు, చేన్ల వద్ద పనులు చేసే వారు పేర్కొంటున్నారు. గుట్ట పైకి వెళ్లిన తర్వాత, వర్షం కురుస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు జారి పడిపోయి ఉంటారని గ్రామస్తులు భావిస్తున్నారు. ఇద్దరూ తీవ్రంగా గాయాలపాలై ఉండటం, బావుల్లో పడిపోవటం వల్ల మృతి చెంది ఉంటారని సంఘటన స్థలాన్ని చూసిన వారు చెబుతున్నారు. ప్రమాదభరితంగా ఉన్న ఏడు బావుల జలపాతాన్ని నిషేధిత స్థలంగా ప్రకటించాలని, గుట్టపైకి వెళ్లేందుకు రక్షణ ఏర్పాట్లు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment