నగర శివారు పర్వతాల్లో.. ప్రకృతి పరవళ్లు..
కొండ కోనల్లో జలపాతాల గలగలలు
ప్రకృతి అందాల వెంట యువత విహారం
వర్షాకాలంలో సెలయేటికి ఫ్యామిలీ ట్రిప్స్..
నగర వాసులను ఆకర్షిస్తున్న పలు ప్రదేశాలు
జలకళతో జలపాతాల వద్ద పర్యాటకుల సందడి
చిన్ని చిన్ని ఆశ అంటూ పాతికేళ్ల క్రితం ఓ సినిమాలో హీరోయిన్ నీళ్లలో తడుస్తూ పరవశించి పాడినా, జల.. జల.. జలపాతం.. నువ్వు అంటూ ఇటీవల ఓ సినిమాలో హీరో కీర్తించినా.. ప్రకృతి అందాల్లో జలధారల ప్రత్యేకతే వేరు. అలాంటి నిలువెత్తు నీటి సౌందర్యాన్ని ఆస్వాదించాలంటే వాటర్ ఫాల్స్‌ని మించిన మార్గం లేదు. ఆ తెల్లని నీళ్ల సిరుల్ని కళ్లకు హత్తుకోవాలంటే.. మాన్‌సూన్‌ని మించిన సీజన్ లేదు. మిగిలిన అన్ని కాలాల్లోనూ పొడి పొడిగా సాదాసీదాగా కనిపించే ప్రాంతాలు.. వర్షాకాలంలో మాత్రం హర్షామోదాల కేరింతల నిలయాలుగా మారిపోతాయి. ఈ సీజన్‌లో నప్పే ట్రిప్స్‌గా జలధారల దారి పట్టేవారి కోసం మన నగరం నుంచి అందుబాటు దూరంలో ఉన్న కొన్ని జలపాతాల విశేషాలివి..
వాటర్ ఫాల్స్.. ఈ పేరు చెప్పగానే ప్రకృతి ప్రేమికులు ఎవరైనా వాటి అందాలను ఆస్వాదించేందుకు ఉవి్వళ్లూరుతారు.. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకూ ఆ జలపాతం కింద తడిసి ముద్దవ్వాలనుకుంటారు. నగరం నుంచి దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో పలు జలపాతాలు నగర వాసులను ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా వర్షా కాలంలో కొండ కోనల్లో ప్రకృతి ఒడిలో గంగ పరవళ్లు.. సెలయేటి గలగలలు చెవులకు వినసొంపుగా వినిపిస్తాయి. భువనగిరికి దగ్గర్లో ఓ జలపాతం ఉంటుంది. చుట్టూ పచ్చదనం రాతి గుట్టలు ప్రకృతి ప్రేమికులకు కొత్త అనుభూతిని ఆస్వాదించే అవకాశాన్ని అందిస్తుంది.
బొగత.. మన ఘనత..
తెలంగాణ వాసులు సగర్వంగా చెప్పుకునే అద్భుత అందాల ఘనతగా బొగత జలపాతాన్ని చెప్పుకోవచ్చు. భద్రాచలం నుంచి 120 కిమీ దూరంలో నగరం నుంచి 329 కిమీ దూరంలో ఉందీ వాటర్ ఫాల్స్. ఖమ్మం జిల్లాలో, రాష్ట్రంలో రెండో అతిపెద్ద జలపాతం ఇదే. తెలంగాణ నయాగరగా పేరుగాంచి మాన్‌సూన్‌లో అత్యంత రద్దీగా ఉండే ప్రదేశం. ఇక్కడకు చేరుకోడానికి సందర్శకులు కొంత దూరం ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది.
రాయకల్.. జలరాశుల్..
పోతపోసిన ప్రకృతి అందాల నిలయం రాయకల్ జలపాతం కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని రాయకల్ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో పెద్దగట్లు, రాయకల్ జలపాతం ఉంటాయి. మార్గమధ్యంలో పచ్చని ప్రకృతిని ఆస్వాదిస్తూ ప్రయాణించొచ్చు. కొండమీది నుంచి రాసులు పోస్తున్నట్టు కిందకు దుమికే నీటి ధారలు రాయకల్ జలపాత దృశ్యం కనువిందు చేస్తుంది.
మల్లెల తీర్థం.. అరణ్య మార్గం..
నగరానికి దాదాపు 185 కిమీ దూరంలో నల్లమల అరణ్యంలో ఉంది. ఈ జలపాతానికి చేరుకోడానికి, అడవి గుండా ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. ఇది కొంతమేర సాహసోపేతమైన ప్రయాణం అనే చెప్పాలి.
రాజేంద్రనగర్.. వాటర్ ఫాల్స్..
నగరానికి కేవలం 13.9 కిమీ దూరంలో ఈ సుందరమైన జలపాతం శీఘ్ర విహారానికి అనువైనది. సందర్శకులు ఒక చిన్న రైడ్ ద్వారా ఈ ప్రదేశానికి చేరుకోవచ్చు.
జలజల.. కుంటాల..
తెలంగాణలోనే ఎత్తైన జలపాతం. నగరం నుంచి 564.9 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ జలపాతం ఆదిలా బాద్‌లో ఉంది. దాదాపు 200 అడుగుల ఎత్తు నుంచి కిందికి దూకుతూ వీక్షకులకు
అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది.
వైజాగ్ వారి ఆతిథ్యం.. అందం ‘చందం’
నల్లగొండ నుంచి 65 కిలోమీటర్ల దూరంలో వైజాగ్ కాలనీ ఉంది. దేవరకొండ నియోజకవర్గంలోని చందం పేట మండలంలో కృష్ణానది బ్యాక్ వాటర్ ఆనుకుని ఉన్న కుగ్రామం ఇది. ఇక్కడి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. నలువైపులా నల్లమల అడవులు, గుట్టలతో కప్పి ఉంటుంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు కడుతున్నప్పుడు వైజాగ్‌కు చెందిన కొన్ని కుటుంబాలు స్థిరపడడంతో దీనికి వైజాగ్ కాలనీగా పేరొచి్చంది. వీకెండ్‌లో టూరిస్టుల కోసం కాలనీ వాసులే వసతి ఏర్పాట్లు చేస్తుంటారు. బోటింగ్ సౌకర్యం కూడా ఉంది. కృష్ణానదిలో పట్టిన తాజా చేపల వంటకాలు ఇక్కడ ఫేమస్.
ఎత్తిపోతల.. జలకళ..
సిటీకి 163.4 కిలోమీటర్ల దూరంలో చంద్రవంక నది సమీపంలో ఈ జలపాతం సందర్శకులను ఆకట్టుకుంటుంది. సమీపంలోని మొసళ్ల పెంపక కేంద్రం కూడా సందర్శనీయమే. నాగార్జున సాగర్ డ్యామ్ వైపు ఎన్‌హెచ్ 56 నుంచి డ్రైవింగ్ చేయడం ద్వారా జలపాతాన్ని, డ్యామ్‌ను చూడవచ్చు.
భీముని పాదం.. ఆనందానికి ఆ‘మోదం’
దట్టమైన అటవీ ప్రాంతం, చుట్టూఎత్తయిన కొండలు, పక్షుల కిలకిలలు. సాయంత్రం వేళ అడవి జంతువుల అరుపులు, వర్షా కాలంలో ఎత్తయిన గుట్ట మీది నుంచి పాదం మధ్యలో జాలువారే నీటి సిరులు.. అస్వాదించాలంటే భీమునిపాదం జలపాతం దగ్గరికి పోవాల్సిందే. మానుకోట జిల్లాలో ఏకైక పర్యాటక ప్రాంతంగా దీన్ని
చెప్పుకుంటారు.
ఏడు బావుల.. వింతలా..
బయ్యారం, గంగారం సరిహద్దుల్లో మిర్యాలపెంట సమీపంలో ఏడుబావుల జలపాతాలున్నాయి. పాండవుల గుట్టపై సహజసిద్ధంగా ఏర్పడ్డాయి. జలపాతం నుంచి కిందికి పడే నీళ్లు కొద్ది దూరం ప్రవహించి తరువాత అదృశ్యమవడం. దాదాపు 50 అడుగుల ఎత్తు నుంచి పాలధారలా నీళ్లు పడుతూ కనువిందు చేస్తుంది.
పచ్చని నెచ్చెలి.. చెచ్చెర..
ఉమ్మడి ఆదిలాబాద్‌లో ఎన్నో జలపాతాలున్నా ఎక్కువ మందికి పరిచయం లేని జలపాతం చెచ్చెర. కుమ్రం భీం అసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలంలోని కౌరగామ్ సమీపంలో దట్టమైన అటవీ ప్రాంతంలో ఉందీ జలపాతం. ఎత్తయిన కొండల మధ్యలో 200 అడుగుల ఎత్తు నుంచి కిందికి దూకే జలపాతాన్ని చూడటం కనువిందే. ఇక్కడి ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు, కట్టుబాట్లు ఆకట్టుకుంటాయి.
Comments
Please login to add a commentAdd a comment