Year End : చలో టూర్‌ | - | Sakshi
Sakshi News home page

Year End : చలో టూర్‌

Published Fri, Dec 22 2023 4:34 AM | Last Updated on Fri, Dec 29 2023 1:57 PM

- - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: నగరవాసికి నయాసాల్‌ జోష్‌ వచ్చేసింది. ఏటా డిసెంబర్‌ చివరి వారంలో ఏదో ఒక నచ్చిన ప్రదేశానికి వెళ్లి కొత్త సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికే సిటీజనులు ఈ ఏడాది వేడుకలకు సైతం ‘చలో టూర్‌’ అంటూ చెక్కేస్తేన్నారు. క్రిస్‌మస్‌ సెలవులు కూడా కావడంతో వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు ఫ్లైట్‌ ఎక్కేస్తున్నారు. మరోవైపు నూతన సంవత్సర వేడుకలను విదేశాల్లో జరుపుకొనేందుకే ఎక్కువ శాతం మొగ్గు చూపుతున్నారు.

ఈసారి గోవాతో పాటు కశ్మీర్‌ను సైతం ఎంపిక చేసుకుంటున్నారు. గతంలో కంటే ప్రస్తుతం కొంత మేరకు కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొడంతో పర్యాటకుల రాకపోకలు పెరిగాయి. దీంతో సిటీ టూరిస్టులు గోవాతో పాటు కశ్మీర్‌, హిమాచల్‌ప్రదేశ్‌ తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు బారులు తీరుతున్నారు. మరోవైపు విదేశీ టూర్లలో బ్యాంకాక్‌, మలేసియా, మాల్దీవులు, సింగపూర్‌, దుబాయ్‌ తదితర దేశాలకు డిమాండ్‌ అనూహ్యంగా పెరిగింది.

వారం రోజులుగా సుమారు 20 శాతానికి పైగా విదేశీ ప్రయాణాలు పెరిగినట్లు పలు ట్రావెల్‌ ఏజెన్సీలు వెల్లడించాయి. అడ్వాన్స్‌ బుకింగ్‌లు సైతం బాగా పెరిగినట్లు థామస్‌ కుక్‌, కాక్స్‌ అండ్‌ కింగ్స్‌, తదితర సంస్థల ప్రతినిధులు పేర్కొన్నారు. నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా సుమారు లక్ష మంది ప్రయాణికులు అదనంగా బయలుదేరి వెళ్లనున్నట్లు అంచనా.

బ్యాంకాక్‌ వైపు బారులు..

● నగరం నుంచి సింగపూర్‌, మలేషియా.మాల్దీవులు, బ్యాంకాక్‌, దుబాయ్‌లకు డిమాండ్‌ అనూహ్యంగా పెరిగింది. ఈ ఐదింటిలోనూ బ్యాంకాక్‌కు వెళ్లే వాళ్లే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. దీంతో చార్జీలు బాగా పెరిగాయి. సాధారణంగా హైదరాబాద్‌ నుంచి బ్యాంకాక్‌కు వెళ్లి వచ్చేందుకు రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు ఉండే చార్జీలు ఇప్పుడు ఏకంగా రూ.60 వేల వరకు పెరిగినట్లు ట్రావెల్స్‌ ఏజెన్సీలు చెబుతున్నాయి. వారం. పది రోజుల నుంచే బ్యాంకాక్‌కు బుకింగ్‌లు బాగా పెరిగినట్లు బంజారాహిల్స్‌కు చెందిన ఒక సంస్థ ప్రతినిధి తెలిపారు. ‘కౌలాలంపూర్‌ పెట్రోనాట్స్‌ దగ్గర ఏటా నూతన సంవత్సర వేడుకలు అద్భుతంగా జరుగుతాయి. రంగరంగుల బాణాసంచా కాల్చుతారు. దీంతో ఆకాశమంతా హరివిల్లులు విరబూస్తాయి. ఆ వేడుకలను చూసేందుకు ఇంటిల్లిపాది వెళ్తున్నాం’ అని ఎల్‌బీ నగర్‌కు చెందిన సత్యవతి తెలిపారు. ఒక్కొక్కరికి రూ.70 వేల వరకు ఫ్లైట్‌ చార్జీలు అయినట్లు చెప్పారు. గతంలో మలేసియాకు వెళ్లి వచ్చేందుకు రూ.39 వేల వరకు మాత్రమే చార్జీలు ఉండేవని విస్మయం వ్యక్తం చేశారు.

● అలాగే హైదరాబాద్‌ నుంచి దుబాయ్‌కు కూడా పెద్ద సంఖ్యలోనే వెళ్తున్నారు. దుబాయ్‌కు వెళ్లి రావడానికి ఫ్లైట్‌ చార్జీలు రూ.75 వేలకు పెరిగాయి. కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లేవాళ్లు మలేసియాతో పాటు సింగపూర్‌ను కూడా ఎంపిక చేసుకుంటున్నారు. ఈ రెండు దేశాల తర్వాత మాల్దీవులకు వెళ్తున్న వారి సంఖ్య కూడా బాగానే ఉంది. ప్రత్యేకంగా నూతన సంవత్సర వేడుకల కోసమే చాలామంది మాల్దీవులకు పయనమవుతున్నారు. దుబాయ్‌లో షాపింగ్‌కు ఇది అనుకూలమైన సమయం కావడంతో ఎక్కువ మంది దుబాయ్‌కు వెళ్తున్నట్లు ఐఆర్‌సీటీసీ అధికారి ఒకరు చెప్పారు.

సోలో జర్నీయే సో బెటర్‌..

మరోవైపు హైదరాబాద్‌ నుంచి వివిధ దేశాలకు వెళ్లే ఒంటరి పర్యాటకుల సంఖ్య కూడా ఈ ఏడాది బాగా పెరిగింది. సుమారు 28 శాతం ఇలా ఒంటరిగా విదేశీ టూర్‌లకు వెళ్తున్నట్లు అంచనా. తమకు నచ్చిన పర్యాటక స్థలాల్లో ఏకాంతంగా గడపాలనే కోరిక, ఎలాంటి బాదరాబందీ లేకుండా ఎక్కడి నుంచి ఎక్కడికై నా తేలిగ్గా ప్రయాణించేందుకు అవకాశం ఉండడంతో చాలా మంది సోలో జర్నీయే సో బెటర్‌ అనుకుంటున్నారు. సోలోగా వెళ్తున్న వారిలోనూ ఎక్కువ మంది బ్యాంకాక్‌, సింగపూర్‌, దుబాయ్‌లతో పాటు శ్రీలంకకు వెళ్తున్నారు. విదేశాలతో పాటు దేశంలోని బెంగళూర్‌, గోవా, జైపూర్‌, కొచ్చిన్‌, గౌహతి, విశాఖ నగరాలకు సైతం సోలో టూరిస్టుల తాకిడి ఎక్కువగా ఉండడం గమనార్హం. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం హైదరాబాద్‌ నుంచి జాతీయ, అంతర్జాతీయ ప్రయాణాలు 20 శాతం అదనంగా పెరిగాయి. ఇందుకు దేశంలోని వివిధ నగరాల్లో ఉడాన్‌ పథకం కింద ఎయిర్‌పోర్టులు అందుబాటులోకి రావడం, విదేశీ విమాన చార్జీలు కొంతమేర తగ్గుముఖం పట్టడం పర్యాటక ప్రియులకు చక్కటి అవకాశంగా మారింది.

శివారులో హుషారుగా..

ఒకవైపు న్యూ ఇయర్‌ వేడుకలను విదేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో జరుపుకునేందుకు కొందరు నగర వాసులు ఉత్సాహం చూపిస్తుండగా.. మరికొందరు నగర శివారు ప్రాంతాల్లోని ఫాంహౌస్‌లు, రిసార్ట్‌లు, వ్యక్తిగత గృహాలను అద్దెకు తీసుకుని న్యూ ఇయర్‌ వేడుకలకు రెడీ అవుతున్నారు. పబ్‌లు, క్లబ్‌లలో కొత్త ఏడాది సెలబ్రేషన్స్‌పై పోలీసుల పరిమితుల నేపథ్యంలో వ్యక్తిగత ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గేటెడ్‌ కమ్యూనిటీలోని రెండు మూడు ఫ్యామిలీలు కలిసి కొత్త సంవత్సర వేడుకలకు ప్లాన్‌ చేస్తున్నారు. శివరాంపల్లి, శామీర్‌పేట, భువనగిరి, కొల్లూరు వంటి ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు చేరువలో ఉన్న శివారు ప్రాంతాల్లోని విల్లాలు, వ్యక్తిగత గృహాలను యజమానులు న్యూ ఇయర్‌ వేడుకల కోసం అద్దెకు ఇస్తున్నారు. దీంతో చాలా మంది ఫాంహౌస్‌లలో పార్టీలు చేసుకునేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. వీటి యజమానులు రోజుకు అద్దె రూ.5 వేలు చెబుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement