తుక్కుగూడ సభలో రాహుల్ సమక్షంలో చేరే అవకాశం
ఇల్లెందులో కాంగ్రెస్ సమావేశానికి హాజరైన తెల్లం వెంకట్రావు
ఇల్లెందు: భద్రాచలం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు తెలిసింది. ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి పలుమార్లు సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన ఆయన గత నెల 12న మణుగూరులో కాంగ్రెస్ ఆధ్వర్యాన జరిగిన సభకు సైతం హాజరయ్యారు. మంగళవారం ఇల్లెందులో జరిగిన మహబూబాబాద్ లోక్‌సభ స్థాయి కాంగ్రెస్ సమావేశంలోనూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలసి వెంకట్రావు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమైనట్లు సమాచారం. ఈ నెల 6న తుక్కుగూడలో జరిగే సభలో రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది. దీనిపై వెంకట్రావును వివరణ కోరగా త్వరలో వివరాలు వెల్లడిస్తానని చెప్పారు.
వ్యవస్థలను కేసీఆర్ నాశనం చేశారు: తుమ్మల
ఇల్లెందు సభలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ పదేళ్ల పాలనలో వ్యవస్థలన్నీ దుర్వి నియోగం చేశారని ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా గత ఎన్నికల సందర్భంగా సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారంటీలు అమలు చేసి తీరతామని, గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు కొనసాగిస్తూ కొత్తవి కూడా అమలు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో 7,145 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి ప్రతి గింజనూ కొంటామన్నారు. ఇప్పటికే 92.36 శాతం రైతుబంధు పంపిణీ పూర్తి చేశామని, పంటల బీమా పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment