ఇల్లెందు, న్యూస్‌లైన్: జిల్లాలో 30వేల కోట్ల రూపాయల వ్యయంతో ఉక్కు పరిశ్రమ (స్టీల్ ప్లాంట్) ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని జాయింట్ కలెక్టర్ (జేసీ) సురేంద్రమోహన్ తెలిపారు. ఈ పరిశ్రమ ఏర్పాటు కోసం స్థలాలను పరిశీలిస్తున్నట్టు చెప్పారు. ఆయన గురువారం కొత్తగూడెం, ఇల్లెందు, బయ్యారం మండలాల్లో పర్యటించారు. అనంతరం, ఇల్లెందులోని సింగరేణి గెస్ట్‌హౌస్‌లో విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు అనువైన ప్రాంతాలను పరిశీలించేందుకు న్యూఢిల్లీ నుంచి తొమ్మిదిమందితో కూడిన స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా(సెయిల్) బృందాన్ని కేంద్ర ప్రభుత్వం పంపిందని అన్నారు. బయ్యారం మండలంలోని ధర్మాపురం (నామాలపాడు), పాల్వంచ మండలంలోని మూడు ప్రాంతాలను, కొత్తగూడెం మండలంలో ఒక ప్రాంతాన్ని ఈ బృందం పరిశీలించిందన్నారు.
ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు 2500 ఎకరాలు... టౌన్‌షిప్ కోసం మరో 500 ఎకరాల స్థలం అవసరమవుతుందని జేసీ తెలిపారు. ప్లాంట్ ఏర్పాటుకు 1.5 టీఎంసీ నీరు కావాల్సుంటుందని చెప్పారు. దీని కోసం కిన్నెరసాని, గోదావరి, బయ్యారం పెద్ద చెరువులను సెయిల్ బృందానికి చూపినట్టు చెప్పారు. ఉక్కు పరిశ్రమకు అవసరమైన సున్నపు రాయిని మన పక్కనున్న నల్గొండ జిల్లా నుంచి తెప్పించవచ్చని అన్నారు. స్టీల్ ప్లాంట్ నిర్మాణంపై మైనింగ్, రెవిన్యూ, ఇరిగేషన్, సింగరేణి, పొల్యుషన్ కంట్రోల్ బోర్డ్, ఫారెస్ట్, జెన్‌కో అధికారులతో బుధవారం ఖమ్మంలో చర్చించినట్టు చెప్పారు. సెయిల్ బృందం సర్వే అనంతరం నివేదికను డిల్లీకి పంపిస్తామన్నారు. ఆ తర్వాత, ప్లాంటు నిర్మాణ ప్రదేశంపై స్పష్టత వస్తుందన్నారు.
ఉక్కు పరిశ్రమకు కేంద్రం ఆమోదం
Published Fri, May 23 2014 2:34 AM | Last Updated on Fri, Nov 9 2018 5:37 PM
Advertisement
Advertisement