కొత్తగూడెం/బయ్యారం, న్యూస్‌లైన్ : బయ్యారం మండలంలో ఉన్న ఐరన్‌ఓర్‌ను వినియోగించి జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించేందుకు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) బృందం గురువారం క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించింది. జాయింట్ కలెక్టర్ సురేంద్రమోహన్ నేతృత్వంలో సెయిల్ బృందం సభ్యులు కొత్తగూడెం, పాల్వంచ, బయ్యారం మండలాల్లోని భూములను పరిశీలించారు. తొలుత కొత్తగూడెం మండలంలోని రేగళ్ల పంచాయతీ కూనారం, పాల్వంచ మండలంలోని చంద్రాలగూడెం ప్రాంతాలలో పర్యటించారు. కిన్నెరసాని జలాశయం సమీపంలోని అటవీ ప్రాంతాన్ని పరిశీలించారు.
అనంతరం కారేగట్టు, ఉల్వనూరు, చంద్రాలగూడెం ప్రాంతాలలో పర్యటించి తొమ్మిది వేల ఎకరాల అటవీ, అసైన్డ్ భూములకు సంబంధించిన మ్యాప్‌లు పరిశీలించారు. అయితే ఇక్కడి నుంచి పాండురంగాపురం రైల్వే ట్రాక్, విద్యుదుత్పత్తి చేసే కేటీపీఎస్, భద్రాచలం గోదావరి ఎంత దూరం ఉంటాయనే వివరాలను సెయిల్ బృందం సభ్యులు స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉల్వనూరు వద్ద 21 వేల ఎకరాలు, చంద్రాలగూడెం వద్ద 8.50 వేల ఎకరాల భూములను పరిశీలించారు.
ఆ తర్వాత కొత్తగూడెం మండలం రేగళ్ల పంచాయతీ కూనారంలోని 839 ఎకరాల అంబసత్రం భూములు, 4,300 ఎకరాల అటవీశాఖ భూముల మ్యాప్‌లను తనిఖీ చేశారు. ఇక్కడి నుంచి రైల్వే ట్రాక్ 4 కి.మీ. దూరంలో ఉంటుందని, గోదావరి నది 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుందని అటవీ అధికారులు సెయిల్ బృందానికి వివరించారు. అనంతరం బయ్యారం మండలం ధర్మాపురం పరిధిలోని 4028 ఎకరాల భూములకు సంబంధించిన మ్యాప్‌లను పరిశీలించారు. ఇక్కడ ఫ్యాక్టరీ నిర్మిస్తే లభ్యమయ్యే వనరుల గురించి జేసీ సురేంద్రమోహన్ సెయిల్ బృందానికి వివరించారు. ఆ తర్వాత బయ్యారం పెద్ద చెరువును సందర్శించి నీటివనరుల గురించి చర్చించారు.
ఈ బృందంలో జేసీ వెంట సెయిల్ అధికారులు ఎ.మేథి, వి.సర్కార్, కుమార్, కె.ఎస్.సవారి, బెనర్జీ, డి.సాహు, సోమేశ్వరసింగ్, ఎ.కె.జా, డీజీఎం (ఐరన్) రాజన్‌కుమార్‌సిన్హా ఉన్నారు.
క్షేత్రస్థాయిలో.. ‘సెయిల్’ పర్యటన
Published Fri, May 23 2014 2:19 AM | Last Updated on Fri, Nov 9 2018 5:37 PM
Advertisement
Advertisement