surendra mohan
-
శ్వేత పత్రం కాదు..నల్ల పత్రం
విశాఖపట్నం: ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావుపై ఏపీ బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి సురేంద్ర మోహన్ మండిపడ్డారు. విలేకరులతో మాట్లాడుతూ..మంత్రి గంటా విడుదల చేసిన శ్వేత ప్రతం అంతా తప్పుల తడక అని విమర్శించారు. అది శ్వేత పత్రం కాదు..నల్ల పత్రం అని దుయ్యబట్టారు. అందులో ఉన్నదంతా బూతేనని మండిపడ్డారు. పెట్రోలియం విశ్వవిద్యాలం కోసం సబ్బవరం భూవివాదాన్ని పరిష్కరించలేని చేతగాని మంత్రి గంటా శ్రీనివాసరావని ధ్వజమెత్తారు. కేంద్ర విద్యాసంస్థలపై మాట్లాడే హక్కు గంటాకు లేదన్నారు. ఐఐఎంకు సంబంధించి ప్రారంభోత్సవంలో హడావుడిగా బోర్డు తగిలించి ప్రభుత్వానికి చూపించేశారని విమర్శించారు. అక్కడ కరెంటు, వాటర్ ఇవ్వకుండా నిర్మాణం ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆరు నెలల్లో 33 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు..అందులో 70 శాతం గంటా వియ్యంకుడు పి. నారాయణకు చెందిన నారాయణ కాలేజీల్లోనే జరిగాయని..దీనికి సంబంధించి ఏమి చర్యలు తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ, ఉపాధ్యాయులు, అధ్యాపకుల పోస్టులు భర్తీ చేయకుండా ఇతర పార్టీలపై ఆరోపణలు చేయడం అర్ధరహితమన్నారు. కేంద్ర విద్యాసంస్థలపై విడుదల చేసిన శ్వేతపత్రం వెనక్కి తీసుకోవాలని హితవు పలికారు. -
ఒక్క రోజే 1301 నామినేషన్లు
మొత్తం సంఖ్య 1,402 సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికలకు శనివారం భారీ ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. శనివారం మంచిరోజు కావడంతో 1301 మంది నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎన్నికల అధికారి డా.బి.జనార్దన్‌రెడ్డి తెలిపారు. అడిషనల్ కమిషనర్ (ఎన్నికలు) సురేంద్ర మోహన్‌తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇప్పటి వరకు మొత్తం 1,402 నామినేషన్లు దాఖలయ్యాయి. వాటిలో బీఎస్పీ-24, బీజేపీ-120, సీపీఐ-17, సీపీఎం-15, కాంగ్రెస్-242, ఎంఐఎం-33, టీఆర్ఎస్-357, టీడీపీ-257, లోక్‌సత్తా-15, ఎన్నికల సంఘం వద్ద పేర్లు నమోదైన ఇతర పార్టీలు-20, ఇండిపెండెంట్లు-302 నామినేషన్లు దాఖలు చేసినట్లు తెలిపారు. 21 లోగా బీ ఫారం.. వివిధ పార్టీల తరఫున పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ల ఉపసంహరణ గడువు 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటల్లోగా భీ ఫారాలు అందజేయవ చ్చని జనార్దన్‌రెడ్డి తెలిపారు. ఈసారి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నోటా ఆప్షన్ ఉండేదీ, లేనిదీ రెండు రోజుల్లో ఎన్నికల సంఘం నిర్ణయిస్తుందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
ఎన్ఎల్సీ రికార్డు
సాక్షి, చెన్నై : కేంద్ర ప్రభుత్వ రంగం సంస్థ ఎన్ఎల్సీ 2014-15 ఆర్థిక సంవత్సరంలో సాధించిన ఘనతను వివరిస్తూ శనివారం స్థానికంగా మీడియాతో సురేంద్ర మోహన్ మాట్లాడారు. ఎన్ఎల్సీ నెలకొల్పి 59 ఏళ్లు అవుతోందని, ఈ కాలంలో సాధించిన రాబడిని తిరగ రాస్తూ సరికొత్త రికార్డును గత ఆర్థిక సంవత్సరం సృష్టించామన్నారు. నేల బొగ్గు ఉత్పత్తిలో ప్రభుత్వం నిర్ణయించిన టార్గెట్‌ను అధిగమించామని ధీమా వ్యక్తం చేశారు. ఎన్ఎల్సీలోని అన్ని సొరంగాల నుంచి గత సంవత్సరం 15 కోట్ల 92 లక్షల98 వేల గణమీటర్ల బొగ్గును తొలగించామన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన టార్గెట్ కన్నా 2.77 శాతం ఎక్కువగా పేర్కొన్నారు. నేల బొగ్గు తవ్వకాల్లో 3.68 శాతం పెరిగిందన్నారు. రెండు కోట్ల 65 లక్షల 43 వేల టన్నుల మేరకు నేల బొగ్గు తవ్వకాలు జరిగాయన్నారు. థర్మల్ విద్యుత్ ఉత్పత్తిలోనూ పై చేయిగా నిలిచామన్నారు. 1972 కోట్ల 91 లక్షల 21 వేల యూనిట్లను ఉత్పత్తి చేశామన్నారు. తొలి యూనిట్ ద్వారా 338 కోట్ల 50 లక్షల 40 వేల యూనిట్లు ఉత్పత్తి అయిందని వివరించారు. ఇందులో 310 కోట్ల 72 లక్షల 80 వేల యూనిట్ల విద్యుత్‌ను ఎగుమతి చేయడం జరిగిందని తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం ఎన్ఎల్సీలో *6087 కోట్ల 68 లక్షల మేరకు వర్తకం జరిగిందని, తద్వారా *2383.33 కోట్ల మేరకు ఆదాయం వచ్చిందన్నారు. పన్నులు చెల్లించిన తర్వాత నికర లాభం *1579 కోట్ల 68 లక్షలు వచ్చిందని, గతంలో ఏ సంవత్సరం సాధించనంతగా లాభాన్ని ఆర్జించడం జరిగిందని పేర్కొంటూ, ఇది ఎన్ఎల్సీ చరిత్రలో రికార్డుగా ప్రకటించారు. రానున్న రాజుల్లో ఎన్ఎల్సీ మరిన్ని ప్రాజెక్టుల దిశగా ముందుకు సాగుతుందన్నారు. జయం కొండాంలో ఐదు వందల మెగావాట్లతో కూడిన విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు చర్యలు చేపట్టామన్నారు. మరో 1250 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. ఇందులో ఐదు వందలు చొప్పున రెండు విద్యుత్ ప్రాజెక్టులను తమిళనాడు విద్యుత్ బోర్డుతో కలసి చేపట్టేందుకు కార్యచరణ సాగుతోందని పేర్కొన్నారు. -
సురేంద్ర మోహన్‌పై కేసు నమోదు
ఏలూరు : భార్యకు విడాకులు ఇవ్వకుండానే రెండోపెళ్లికి సిద్ధపడిన సురేంద్ర మోహన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. భార్య ఉమా మహేశ్వరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సురేంద్ర మోహన్‌పై 494, రెడ్ విత్ 511, 506(2) సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన లంకా సురేంద్ర మోహన్ శుక్రవారం ద్వారకా తిరుమలలో విశాఖ జిల్లా నర్సీపట్నంకు చెందిన ఓ యువతిని బంధుమిత్రుల సమక్షంలో వివాహం చేసుకుంటున్న సమయంలో ఉమామహేశ్వరి అక్కడ వచ్చి ఆ పెళ్లిని ఆపిన విషయం తెలిసిందే. -
'ఆపండి అనే లోపే పెళ్లి అయిపోయింది..!
-
'ఆపండి అనే లోపే పెళ్లి అయిపోయింది..!
ఏలూరు: చాలా సినిమాల్లో సరిగ్గా తాళి కట్టే సమయంలో.. సీన్ చాలా స్లో మోషన్ గా ఉంటుంది. థియేటర్ సీట్లలో కూర్చున్నవారంతా కాస్తంత ఆసక్తిగా సీట్లలోంచి కొంచెం లేస్తున్నట్లుగా మెడలు ముందుకుసాచి పెట్టి చూస్తుంటారు.. ఒక సస్పెన్స్ మ్యూజిక్ వినిపిస్తుంటుంది. సరిగ్గా వరుడు తాళి కట్టే సమయానికి.. ఆగండి అని ఒక డైలాగ్ వినిపిస్తుంది. దీంతో అయ్యో అంటూ ఊసురుమంటాం. సరిగ్గా అలాంటి డైలాగే వినిపించింది. కానీ, కాస్తంతా ఆలస్యంగా రావడంతో ఇక్కడ మాత్రం పెళ్లి జరిగిపోయింది. పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో శుక్రవారం రాజమండ్రికి చెందిన సురేంద్ర మోహన్ అనే వ్యక్తి భార్యకు తెలియకుండా మరో పెళ్లి సిద్ధమయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న మొదటి భార్య ఉమా మహేశ్వరి కళ్యాణ మండపం వచ్చేసరికి మరో అమ్మాయి మెడలో తాళి కట్టేశాడు. ఆగ్రహానికి గురైన ఆమె తాను బతికి ఉండగానే, విడాకులు తీసుకోకుండా మరో పెళ్లికి ఎలా సిద్ధమయ్యావంటూ సురేంద్రను నిలదీసింది. సురేంద్రతో తనకు పదేళ్ల క్రితమే పెళ్లి అయిందని,వివాహ సమయంలో రూ.కోటి తీసుకున్నట్లు చెప్పింది. తమకు ఆరేళ్ల పాప కూడా ఉందని ఆమె తెలిపింది. దీంతో సురేంద్ర పెళ్లి మండపం నుంచి వెళ్లిపోయాడు. కాగా అసలు పెళ్లి జరగలేదని పోలీసులు చెప్తున్నారు. ఉమా మహేశ్వరి ఫిర్యాదు ఇచ్చిందని, దానిపై దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు. ఇదిలా ఉండగా, భార్యభర్తల మధ్య విబేధాలు ఉన్నట్లు తెలుస్తోంది. దాంతో వీరిద్దరూ గత కొంతకాలంగా వేర్వేరుగా ఉంటున్నారు. అయితే భర్త వేధింపులు తట్టుకోలేక ఉమా మహేశ్వరి ఫిర్యాదుతో సురేంద్ర మోహన్‌పై హైదరాబాద్ పోలీసులు 498 కేసు కూడా నమోదు చేశారు. ఉమా మహేశ్వరి స్వస్థలం విశాఖపట్నం. -
అర్హులందరికీ ‘ఆసరా’
సాక్షి ప్రతినిధి, ఖమ్మం : అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ కడవేరు సురేంద్రమోహన్ తెలిపారు. ఆహారభద్రత, ఆసరా, పెన్షన్ పథకాలలో అర్హులకు అన్యాయం జరుగకుండా క్షేత్రస్థాయిలో సూక్ష్మ పరిశీలనకు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. జిల్లాలో పరిశ్రమలను నెలకొల్పి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఆసక్తి కనబర్చే పారిశ్రామిక వేత్తలకు నిబంధనల ప్రకారం ప్రభుత్వ భూములు కేటాయించి ప్రోత్సహిస్తామన్నారు. జిల్లా అభివృద్ధి ప్రణాళికలను ప్రాధాన్యత క్రమంలో అమలు చేస్తున్న తీరును వివరించారు. బుదవారం ఆయన సాక్షి ప్రతినిధికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. జిల్లాను పారిశ్రామిక ంగా అభివృద్ధి చేసేందుకు పలు ప్రతిపాదనలు చేశామని, ఐటీ పార్క్, థర్మల్ పవర్ ప్రాజెక్టులు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణానికి చర్యలు తీసుకున్నట్లు వివరించారు. సాక్షి : ఆసరా పథకం పరిస్థితి ఏమిటి..? జేసీ : జిల్లాలో పెన్షన్ల కోసం 3,17,801 దరఖాస్తులు రాగా అందులో 3.07 లక్షల దరఖాస్తుల పరిశీలన పూర్తయింది. ఇప్పటివరకు 2,13,063 మందిని అర్హులుగా గుర్తించాం. ఇంకా 10 వేల దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి. సాక్షి : గతం కంటే పెన్షన్ లబ్ధిదారులు పెరిగారా.. తగ్గారా..? జేసీ : జిల్లాలో గతంలో 3,24,426 పెన్షన్లు ఉండగా ప్రస్తుతం అదేస్థాయిలో పెన్షన్లు రానున్నాయి. పాతవాటిలో కొందరు అనర్హులను తొలగించాం. ప్రస్తుతం కొత్తగా కొన్ని చేర్చాం. దీంతో పెన్షన్లు గతం లాగానే రానున్నాయి. సాక్షి : సీలింగ్ పేరుతో అర్హులకు అన్యాయం జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి కదా..? జేసీ : సీలింగ్ అనేది జిల్లాలో లేదు. ప్రభుత్వం కొన్ని నిబంధనలు సడలించింది. జిల్లాలో 64 శాతం ఏజెన్సీ ఏరియా ఉందని వివరించా. దీంతో అర్హులందరికీ పెన్షన్లు వచ్చేలా చర్యలు చేపడుతున్నాం. సాక్షి : జిల్లాలో కొన్ని మండలాల్లో పెన్షన్‌లో సీలింగ్ విధించాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.. నిజమేనా..? జేసీ : జిల్లాలో అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందించాలనేదే లక్ష్యం. ఎక్కడా సీలింగ్ లేదు. అర్హులందరికీ పెన్షన్లు అందించేలా బయ్యారం, గార్ల, టేకులపల్లి మండలాల అధికారులకు ఆదేశాలు జారీ చేస్తాం. సీలింగ్ వల్ల అర్హులను తొలగించినట్లు తెలిస్తే ఆర్డీఓ, తహశీల్దార్‌తో పరిశీలన చేస్తాం. సాక్షి : అర్హులకు జిల్లా అధికారిగా మీరిచ్చే సలహా ఏమిటి..? జేసీ : రాష్ట్ర అధికారులు సైతం అర్హులకు అన్యాయం చేయవద్దని చెబుతున్నారు. మేము కూడా జిల్లాలో అర్హులందరికీ న్యాయం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశాం. అర్హులను తిరస్కరించినట్లయితే మరోసారి దరఖాస్తు చేసుకోవచ్చు. సాక్షి : ఆహార భద్రత కార్డుల పరిశీలన ఎలా జరుగుతోంది..? జేసీ : జిల్లాలో ఆహర భద్రత కార్డులకు 7, 21,852 దరఖాస్తులు వచ్చాయి. వాటిలో ఇప్పటివరకు 2,98,905 దరఖాస్తుల పరిశీలన పూర్తయింది. ఫిబ్రవరిలో ఆహారభద్రతలు కార్డులు అందిస్తాం. అప్పటి వరకు రేషన్‌కార్డులకు సరుకులు పంపిణీ చేయిస్తాం. సాక్షి : గతంలో ఎన్ని బోగస్ కార్డులు ఏరివేశారు..? ఎంత ఆదా అయింది...? జేసీ : జిల్లాలో ఆధార్ సీడింగ్ వల్ల 45 వేల బోగస్ కార్డులను గుర్తించి తొలగించాం. దీంతో వెయ్యి మెట్రిక్ టన్నుల బియ్యం ఆదా అవుతుంది. హాస్టళ్లు, మధ్యాహ్న భోజన పథకానికి ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి రేషన్ సరఫరా చేస్తున్నాం. దీంతో క్వాలిటీ, క్వాంటిటీ పెరిగింది. సాక్షి : జిల్లాలో రేషన్ బియ్యం రీసైక్లింగ్ జరుగుతున్నట్లు ప్రచారం ఉంది.. ఎలా అరిక డతారు..? జేసీ : జిల్లాలో బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు పటిష్ట చర్యలు చేపడుతున్నాం. భారీ ఎత్తున 6ఏ కేసులు నమోదు చేస్తున్నాం. గత మూడునెలల్లో 800 కేసులు పెట్టాం. దీంతో అక్రమ రవాణా తగ్గుతుంది. సాక్షి : ల్యాండ్ బ్యాంక్‌కు సంబంధించిన వివరాలేమిటి..? జేసీ : జిల్లాలో 1.20 లక్షల ప్రభుత్వ భూమి ఉంది. అందులో పరిశ్రమలకు ఉపయోగకరంగా 20 వేల ఎకరాల భూమి ఉంది. సత్తుపల్లి, కొత్తగూడెం, కూసుమంచి, రఘునాథపాలెం, బయ్యారంలలో భూములు పారిశ్రామికంగా అనుకూలంగా ఉన్నాయి. అయా ప్రాంతాలలో ఉన్న ప్రభుత్వ భూములను పరిశ్రమల శాఖ ద్వారా కొందరు పారిశ్రామిక వేత్తలు పరిశీలించి పరిశ్రమల స్థాపనకు అనుగుణంగా ఉన్నాయని తేల్చారు. సాక్షి : పారిశ్రామిక అభివృద్ధికి ఎలాంటి చర్యలు చేపడుతున్నారు..? జేసీ : జిల్లాలో కొత్తగూడెం మండల పరిధిలోని చుంచుపల్లిలో ఐటీ పార్కు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. సత్తుపల్లి మండలం బుగ్గపాడులో ఫుడ్‌పార్క్ ఏర్పాటు, మణుగూరులో పవర్‌ప్లాంట్‌కు క్లియరెన్స్ వచ్చింది. అశ్వాపురం మండలం ఆమెర్ద గ్రామంలో థర్మల్ విద్యుత్ పవర్‌ప్లాంట్‌కు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. ఇక్కడ కొంత ప్రతికూల పరిస్థితులు ఉన్నట్లు హెవీవాటర్ ప్లాంట్ అధికారులు చెబుతున్నారు. దీంతో ప్రభుత్వానికి లేఖ రాశాం. సాక్షి : చెరువు శిఖం భూములకు ఎలాంటి రక్షణ చర్యలు చేపడుతున్నారు..? జేసీ : జిల్లాలో 2వేల ఎకరాల్లో చెరువులు, కుంటల భూములు ఆక్రమణల్లో ఉన్నట్లు గుర్తించాం. దీనిలో 3వేల మందికి నోటీసులు ఇచ్చేందుకు చర్యలు చేపడుతున్నాం. సాక్షి : ధాన్యం కొనుగోలుకు ఎలాంటి చర్యలు చేపట్టారు..? జేసీ : జిల్లా వ్యాప్తంగా 130 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు చేశాం. వీటిలో మూడు చోట్ల ఇప్పటికే కేంద్రాలు ప్రారంభించి 6.50 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. త్వరలో మిగతా వాటిని తెరుస్తాం. సాక్షి : రైతులకు మద్దతు ధర కల్పించేందుకు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు..? జేసీ : రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటించింది. గ్రేడ్ -ఏ రకానికి రూ.1400, సాధారణ రకం రూ.1360 చెల్లించేలా చర్యలు చేపడుతున్నాం. దళారులకు అమ్మకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అమ్మేలా రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. -
కోర్టు కేసుల్లో నిర్లక్ష్యం వహించొద్దు
ఖమ్మం జెడ్పీసెంటర్:వివిధ కోర్టుల్లో ఉన్న కేసుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత అధికారులే బాధ్యత వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కడవేరు సురేంద్రమోహన్ హెచ్చరించారు. పెండింగ్ కేసుల్లో కౌంటర్ దాఖలు చేసి సత్వర పరిష్కారానికి కృషిచేయాలని చెప్పారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు జేసీ బాబూరావుతో కలిసి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 1063 కోర్టు కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటికి కౌంటర్ పిల్ దాఖలు చేయడంతోపాటు ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఏజేసీకి సూచించారు. ఎవరైనా అధికారులు స్పందించకుంటే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. గ్రీవెన్స్ ఫిర్యాదులను పరిష్కరించేందుకు ప్రాధాన్యమివ్వాలన్నారు. మండలస్థాయిలో జరిగే గ్రీవెన్స్‌కు అధికారులందరూ హాజరుకావాలని ఆదేశించారు. మైనార్టీల స్థితిగతులను, పింఛన్లు అందుతున్న తీరును తెలుసుకోవాలని మెనార్టీ శాఖ అధికారిని ఆదేశించారు. జిల్లాలో ప్రత్యేకంగా ఈ కార్యక్రమం చేపట్టాలని సూచించారు. గ్రీవెన్స్‌లో వచ్చిన సమస్యల్లో కొన్ని కంటి చూపు సరిగ్గా లేకపోవడంతో ఆధార్ కార్డు రావడం లేదని, ఆధార్ లేదని పింఛను ఇవ్వడం లేదని, తనకు పింఛను ఇప్పించాలని కూసుమంచి మండలం గైగోళ్ళపల్లికి చెందిన కదరమ్మ అనే వృద్ధురాలు వేడుకోగా.. పింఛను మంజూరు చేయూలని డీఆర్డీఏ పీడీని జేసీ ఆదేశించారు. తిరుమలాయపాలెం మండలంకేంద్రంలోని ఎస్టీ హాస్టల్లో మృతి చెందిన బాణోత్ శిల్ప కుటుంబాన్ని ఆదుకోవాలని ఎల్‌హెచ్‌పీఎస్ నాయకులు లక్ష్మణ్, బాణోత్ భద్రునాయక్ కోరారు. పాల్వంచకు చెందిన యడ్లపల్లి ఉపేందర్‌రావు తమకు చెందిన భూమి కేటీపీఎస్ నిర్మాణం కోసం తీసుకున్నారని ల్యాండ్ లూజర్ కింద తన సోదరుడికి ఉద్యోగం ఇచ్చారని, అప్పటి ఒప్పందం ప్రకారం తనకు ఇస్తానన్న ల్యాండ్ ఇవ్వడంలేదని జేసీకి ఫిర్యాదు చేశారు. దళితుల భూ పంపిణీకి తాము భూములు విక్రరుుస్తామని, వాల్యుషన్ వేసి ధర నిర్ణయించాలని మధిరకు చెందిన రైతులు విన్నవించారు. -
రైతులకు ఆన్లైన్లో ‘ఈ పేమెంట్’
ఖమ్మం వ్యవసాయ : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన రైతులకు చెక్కుల చెల్లింపుల్లో జరుగుతున్న జాప్యాన్ని నివారించేందుకు రాష్ట్రంలోనే తొలిసారిగా ఆన్లైన్ ఈ పేమెంట్ విధానాన్ని జిల్లాలో అమలు చేస్తున్నట్లు జేసీ సురేంద్రమోహన్ తెలిపారు. ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించిన రైతులకు ‘ఆన్లైన్ ఈ పేమెంట్’ ద్వారా సత్వరమే చెల్లింపులు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విధానాన్ని ఖమ్మం లోని యాక్సిస్ బ్యాంకులో మంగళవారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐదుగురు రైతులకు రూ.12.66లక్షలను వారి ఖాతాల్లో జమ చేశారు. అనంతరం సంబంధిత బ్యాంకు మేనేజర్లు, రైతులతో నేరుగా ఫోన్లో మాట్లాడి నగదు జమ వివరాలు అడిగి తెలుసుకున్నారు. చర్లకు చెందిన ఎం.రామరాజుకు డీసీసీబీలోని అతని ఖాతాకు రూ.3,82,976లను, సత్యనారాయణపురం గ్రామానికి చెందిన పి.చిట్టివెంకటరాజుకు అతని ఎస్బీహెచ్ ఖాతాకు రూ.2.72 లక్షలను, అదే గ్రామానికి చెందిన డి.వీరభద్రరాజుకు చెందిన ఎస్బీహెచ్ ఖాతాకు రూ.2.44 లక్షలు, బి.నర్సింహరాజుకు సంబంధించిన ఎస్బీహెచ్ ఖాతాకు రూ.85,952, డి.శ్రీధర్ ఎస్బీహెచ్ ఖాతాకు రూ.2,81,248లను ఆన్లైన్ విధానం ద్వారా చెల్లించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్న కనీస మద్దతు ధరను పొందేందుకు రైతులు తమ ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలని, పైకం చెల్లింపుల్లో జాప్యాన్ని, దళారుల సమస్యను నివారించేందుకు ఆన్లైన్ ఈ పేమెంట్ విధానాన్ని ప్రయోగాత్మకంగా జిల్లాలో ప్రారంభించారని అన్నారు. గత సంవత్సరం 30వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించగా, ఈ ఏడాది దానికి మూడో వంతు 90వేల నుంచి లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించేందుకు లక్ష్యం నిర్ధేశించామని అన్నారు. జిల్లాస్థాయిలో వ్యవసాయ, మార్కెటింగ్, ఐకేపీ, పౌర సరఫరాల శాఖల సమన్వయంతో పెద్ద ఎత్తున ధాన్యం సేకరణకు కలిసి కట్టుగా పనిచేస్తున్నట్లు తెలిపారు. వరి పండించే రైతులందరికీ ఆన్లైన్ ఈ పేమెంట్ విధానంపై అవగాహన కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ వైవీ.సాంబశివరావు, జిల్లా పౌర సరఫరాల అధికారి గౌరీశంకర్, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులకు వీబీ.భాస్కర్‌రావు, లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాసరావు, మార్కెటింగ్ శాఖ ఇన్చార్జ్ సహాయ సంచాలకులు ఎంఏ.అలీమ్, ఇన్ఫర్మేషన్ సెంటర్ జిల్లా అధికారి శ్రీనివాస్, యాక్సిస్ బ్యాంక్ చీఫ్ మేనేజర్ గురునాధం, మేనేజర్లు రాఘవరెడ్డి, శివతేజ, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. -
ఇక ధనధాన్యం
ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లకు రంగం సిద్ధమైంది. నవంబర్ మొదటి వారం నుంచి జిల్లాలో ధాన్యం కొనుగోలు చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లూ చేశారు. జిల్లాలోని 39 మండలాల్లో 160 కొనుగోలు కేంద్రాలను నెలకొల్పారు. వీటిద్వారా లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకు తగిన ఏర్పాట్లు..మార్గదర్శకాలను జేసీ సురేంద్రమోహన్ నిర్దేశించారు. ఖమ్మం జెడ్పీసెంటర్: ఖరీఫ్ ధాన్యం కొనుగోలుకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. జాయింట్ కలెక్టర్ సురేంద్రమోహన్ దీనికి తగిన మార్గదర్శకాలను సిద్ధం చేశారు. జిల్లాలో 39 మండలాల్లో 160 కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయనున్నారు. దీనిలో 70 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, 90 ఇందిరా కాంతి పథం (ఐకేపీ) కేంద్రాలున్నాయి. జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్లో మొత్తం ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని వ్యవసాయశాఖ లెక్కలు చెబుతున్నాయి. ఈ ఏడాది ప్రభుత్వం అత్యధికంగా ధాన్యం కొనుగోలు చేసేందుకు చర్యలు చేపట్టింది. డీఆర్డీఏ ఐకేపీ, పీఏసీఎస్‌ల ద్వారా ఈ ఏడాది లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా అధికారులు నిర్ణయించారు. గత ఏడాది 39 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు. లెవీ విధానంలో 25 శాతం మాత్రమే మిల్లర్లకు కేటాయించడంతో వారు ముందుకొచ్చే పరిస్థితి లేదు. ప్రజా పంపిణీ అవసరాల దృష్ట్యా అధికంగా ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయించారు. మొదటి వారంలో... నవంబర్ మొదటివారంలో ధాన్యం కొనుగోలుకు శ్రీకారం చుడతారు. వ్యవసాయశాఖ నివేదికల ఆధారంగా తొలుత భద్రాచలం డివిజన్లో ఖరీఫ్ ధాన్యం చేతికి వస్తుంది కాబట్టి ఈ మేరకు ప్రణాళికలు రచించారు. ఇప్పటికే పలుమార్లు ఆయా శాఖల అధికారులతో జేసీ సమీక్షలు నిర్వహించి ఎలాంటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నవంబర్ మొదటివారంలో చర్ల, వెంకటాపురం, సత్యనారాయణపురం, వాజేడు, టీ.కొత్తగూడెం, భద్రాచలంతో పాటు మొత్తం 15 కేంద్రాల్లో కొనుగోళ్లు ప్రారంభించనున్నారు. పంటచేతికి వచ్చే తీరును బట్టి మిగిలిన కేంద్రాలను ప్రారంభిస్తారు. ఇప్పటికే కొనుగోలుకు కావాల్సిన యంత్రాలను సమకూర్చారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు చేర్చడానికి రెవెన్యూ డివిజన్‌కు ఒక కాంట్రాక్టర్‌ను నియమించారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు 60 మిల్లులకు ధాన్యం తరలించాలని నిర్ణయించారు. గతంలో మిల్లర్లు ప్రభుత్వానికి చెల్లించాల్సిన లెవీ ఇవ్వడంలో అనేక ఉదంతాలు చోటుచేసుకున్నాయి. మిల్లర్ల ఆర్థిక స్థితిగతులు, మిల్లు సామర్థ్యం, గడువులోగా లెవీ బియ్యం అందించే చర్యలను పరిశీలించి సర్టిఫికెట్లు ఇచ్చేందుకు సివిల్ సప్లయీస్ డీటీలను నియమించారు. మద్దతు ధర రైతులకు మద్దతు ధర కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం జిల్లా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో రైతాంగానికి పలు సూచనలూ చేసింది. గ్రామాల్లో రైతులను చైతన్యవంతం చేసేందుకు, మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు నిర్దేశించిన ప్రమాణాలను కరపత్రాల ద్వారా ప్రచారం చేస్తున్నారు. తేమ లేకుండా కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకురావాలని రైతులకు సూచిస్తున్నారు. ఎలాంటి ఇబ్బంది కలిగినా అధికారులకు సమాచారం అందించాలని ఫోన్ నంబర్లను సైతం కరపత్రాల్లో ముద్రించారు. నిబంధనలు ఇలా... వంగడము పొడవు, వెడల్పు నిష్పత్తుల ఆధారంగా సాధారణ రకం, గ్రేడ్ ‘ఏ’ రకంగా నిర్ణయిస్తారు. సాధారణ రకం ధర రూ.1, 360, గ్రేడ్ ఏ రకానికి రూ.1,400లుగా నిర్ణయించారు. ఇసుక, మట్టి, రాళ్ళు ఒక శాతం, తాలు, తుప్పరకు ఒక శాతం, చెడిపోయినవి, రంగు మారినవి, మొలకెత్తినవి, పురుగు పట్టినవి ఐదు శాతం, పాలు పోసుకోనివి, కుచించుకున్నవి, ముడుచుకున్న ధాన్యానికి మూడు శాతం, తక్కువ గ్రేడ్ -7 శాతం, తేమ -17 శాతానికి మించకుండా ఉన్నవి మాత్రమే కొనుగోలు చేయాలని పేర్కొన్నారు. ఆన్లైన్లో నగదు పంపిణీ కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేసిన ధాన్యానికి 48 గంటలలో నగదు చెల్లించేలా అధికారులు చర్యలు చేపడతున్నారు. ఈ మేరక ఇప్పటి కే ఆదేశాలు జారీ చేశారు. ఆన్లైన్లో యాక్సెస్ బ్యాంకు ద్వారా నగదు చెల్లింపులు జరిగేలా చర్యలు చేపట్టారు. రైతులకు ఏ బ్యాంకులో ఖాతా ఉన్నా యాక్సెస్ బ్యాంకు ద్వారా రైతుల బ్యాంక్ అకౌంట్లో నగదు జమ చేస్తారు. కొనుగోళ్లకు అన్ని చర్యలు చేపట్టాం: సాంబశివరావు, డీఎం సివిల్ సప్లైస్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేం దుకు అన్ని ఏర్పాట్లు చేశాం. వ్యవసాయశాఖ సూచనల మేరకు నవంబర్ మొదటి వారంలో పంటచేతికి వస్తుందని భావిస్తున్నాం. దీని ప్రకా రం ఇప్పటికే జేసీ సురేంద్రమోహన్ ఆదేశాల మేర కు అన్ని శాఖలు ఏర్పాట్లు పూర్తి చేశాయి. లక్ష టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. దీనికి 25 లక్షల గన్నీ బ్యాగ్‌లు అవసరం ఉంటాయి. ఇప్పటికే 10లక్షల సంచులు వచ్చాయి. 15వ తేదీ నాటికి మిగిలినవి వస్తాయి. -
రేషన్‌కు ఆధార్ అనుసంధానించాలి
ఖమ్మం జెడ్పీసెంటర్: జిల్లాలో రేషన్ కార్డులకు ఆధార్ అనుసంధానాన్ని ఈ నెల 15వ తేదీలోగా పూర్తిచేయాలని పౌర సరఫరాల శాఖ డిప్యూటీ తహశీల్దారు(డీటీ)లను జాయింట్ కలెక్టర్ సురేంద్రమోహన్ ఆదేశించారు. ప్రజాపంపిణీ వ్యవస్థ పటిష్టతకు తీసుకోవాల్సిన చర్యలు, ఆధార్ అనుసంధానంపై ఆయన గురువారం కలెక్టరేట్లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. బోగస్ రేషన్ కార్డుల ఏరివేతలో అర్హులకు అన్యాయం జరగకుండా చూడాలన్నారు. రేషన్ కార్డులు కోల్పోయిన వారిలో అర్హులు ఉన్నట్టయితే వారి ఆధార్ కార్డును తీసుకుని కార్డును పునరుద్ధరించాలన్నారు. ప్రజాపంపిణీ వ్యవస్థ(పీడీఎస్) ద్వారా దారిద్య్ర నిర్మూలన రేఖ కిందనున్న పేద కుటుంబాలకు మాత్రమే ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకోవాలన్నారు. పీడీఎస్ లబ్ధిదారుల్లోని అనర్హుల కార్డులు రద్దు చేయాలని అన్నారు. వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాలు, మధ్యాహ్న భోజన పథకానికి నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలన్నారు. అధికారులు పంపిణీతో సరిపెట్టుకోకుండా క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయాన్ని సేకరించాలని సూచించారు. వసతి గృహాలకు, పాఠశాలలకు రూట్ అధికారులు లేకుండా బియ్యం సరఫరా చేయవద్దని ఆదేశించారు. ఎఫ్‌సీఐ నుంచి ఎంఎల్ఎస్ పాయింట్లకు ఎపిక్ షాపులకు వచ్చే బియ్యం వినియోగ యోగ్యంగా లేకపోతే తిరిగి పంపించాలన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో జీసీసీ డిపోలు తెరవడం లేదంటూ తరచుగా తనకు ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ఇవి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఇక నుంచి మండల లెవెల్ స్టాక్ పాయింట్ల ఇన్చార్జిలకు రిలీజ్ ఆర్డర్లను కలెక్టరేట్ నుంచే ఇస్తామన్నారు. ప్రజాపంపిణీ వ్యవస్థ పటిష్టానికి శాసనసభ నియోజకవర్గం నుంచి ఒకరి చొప్పున పదిమంది జిల్లా అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమించనున్నట్టు చెప్పారు. సమావేశంలో డీఎస్వో గౌరీశంకర్, పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ వై.సాంబశివరావు,డీఈవో రవీంద్రనాథ్‌రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి వెంకటనర్సయ్య, ఐసీడీఎస్ పీడీ సుఖజీవన్‌బాబు తదితరులు పాల్గొన్నారు. -
రుణ మాఫీ హామీని బేషరతుగా అమలుచేయాలి
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: లక్ష రూపాయల రుణ మాఫీని బేషషరతుగా అమలుచేయాలని కోరుతూ జాయింట్ కలెక్టర్ కడవేరు సురేంద్రమోహన్‌కు రైతు సంఘాల నాయకులు శనివారం ఖమ్మంలో వినతిపత్రం ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే లక్ష రూపాయల వరకు వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తామని, ఈ ఫైలు పైనే తొలి సంతకం చేస్తానని ఇచ్చిన హామీని కేసీఆర్ విస్మరించారని అన్నారు. రుణ హామీకి సీఎం షరతులు విధించడంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, ఇప్పటికే నలుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. రుణ మాఫీ హామీని బేషరతుగా అమలు చేయకపోతే రైతుల పరిస్థితి దయనీయంగా మారుతుందని, వారు నిరాశ, నిస్పృహతో అఘాయిత్యానికి దిగే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు నున్నా నాగేశ్వరరావు, ఎం.సుధాకర్, కొర్లకుంట గోవర్ధన్, అడపా రామకోటయ్య, తాతా భాస్కర్‌రావు, మలీదు నాగేశ్వరరావు, పోటు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
ఉక్కు పరిశ్రమకు కేంద్రం ఆమోదం
ఇల్లెందు, న్యూస్‌లైన్: జిల్లాలో 30వేల కోట్ల రూపాయల వ్యయంతో ఉక్కు పరిశ్రమ (స్టీల్ ప్లాంట్) ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని జాయింట్ కలెక్టర్ (జేసీ) సురేంద్రమోహన్ తెలిపారు. ఈ పరిశ్రమ ఏర్పాటు కోసం స్థలాలను పరిశీలిస్తున్నట్టు చెప్పారు. ఆయన గురువారం కొత్తగూడెం, ఇల్లెందు, బయ్యారం మండలాల్లో పర్యటించారు. అనంతరం, ఇల్లెందులోని సింగరేణి గెస్ట్‌హౌస్‌లో విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు అనువైన ప్రాంతాలను పరిశీలించేందుకు న్యూఢిల్లీ నుంచి తొమ్మిదిమందితో కూడిన స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా(సెయిల్) బృందాన్ని కేంద్ర ప్రభుత్వం పంపిందని అన్నారు. బయ్యారం మండలంలోని ధర్మాపురం (నామాలపాడు), పాల్వంచ మండలంలోని మూడు ప్రాంతాలను, కొత్తగూడెం మండలంలో ఒక ప్రాంతాన్ని ఈ బృందం పరిశీలించిందన్నారు. ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు 2500 ఎకరాలు... టౌన్షిప్ కోసం మరో 500 ఎకరాల స్థలం అవసరమవుతుందని జేసీ తెలిపారు. ప్లాంట్ ఏర్పాటుకు 1.5 టీఎంసీ నీరు కావాల్సుంటుందని చెప్పారు. దీని కోసం కిన్నెరసాని, గోదావరి, బయ్యారం పెద్ద చెరువులను సెయిల్ బృందానికి చూపినట్టు చెప్పారు. ఉక్కు పరిశ్రమకు అవసరమైన సున్నపు రాయిని మన పక్కనున్న నల్గొండ జిల్లా నుంచి తెప్పించవచ్చని అన్నారు. స్టీల్ ప్లాంట్ నిర్మాణంపై మైనింగ్, రెవిన్యూ, ఇరిగేషన్, సింగరేణి, పొల్యుషన్ కంట్రోల్ బోర్డ్, ఫారెస్ట్, జెన్కో అధికారులతో బుధవారం ఖమ్మంలో చర్చించినట్టు చెప్పారు. సెయిల్ బృందం సర్వే అనంతరం నివేదికను డిల్లీకి పంపిస్తామన్నారు. ఆ తర్వాత, ప్లాంటు నిర్మాణ ప్రదేశంపై స్పష్టత వస్తుందన్నారు. -
క్షేత్రస్థాయిలో.. ‘సెయిల్’ పర్యటన
కొత్తగూడెం/బయ్యారం, న్యూస్‌లైన్ : బయ్యారం మండలంలో ఉన్న ఐరన్‌ఓర్‌ను వినియోగించి జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించేందుకు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) బృందం గురువారం క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించింది. జాయింట్ కలెక్టర్ సురేంద్రమోహన్ నేతృత్వంలో సెయిల్ బృందం సభ్యులు కొత్తగూడెం, పాల్వంచ, బయ్యారం మండలాల్లోని భూములను పరిశీలించారు. తొలుత కొత్తగూడెం మండలంలోని రేగళ్ల పంచాయతీ కూనారం, పాల్వంచ మండలంలోని చంద్రాలగూడెం ప్రాంతాలలో పర్యటించారు. కిన్నెరసాని జలాశయం సమీపంలోని అటవీ ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం కారేగట్టు, ఉల్వనూరు, చంద్రాలగూడెం ప్రాంతాలలో పర్యటించి తొమ్మిది వేల ఎకరాల అటవీ, అసైన్డ్ భూములకు సంబంధించిన మ్యాప్‌లు పరిశీలించారు. అయితే ఇక్కడి నుంచి పాండురంగాపురం రైల్వే ట్రాక్, విద్యుదుత్పత్తి చేసే కేటీపీఎస్, భద్రాచలం గోదావరి ఎంత దూరం ఉంటాయనే వివరాలను సెయిల్ బృందం సభ్యులు స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉల్వనూరు వద్ద 21 వేల ఎకరాలు, చంద్రాలగూడెం వద్ద 8.50 వేల ఎకరాల భూములను పరిశీలించారు. ఆ తర్వాత కొత్తగూడెం మండలం రేగళ్ల పంచాయతీ కూనారంలోని 839 ఎకరాల అంబసత్రం భూములు, 4,300 ఎకరాల అటవీశాఖ భూముల మ్యాప్‌లను తనిఖీ చేశారు. ఇక్కడి నుంచి రైల్వే ట్రాక్ 4 కి.మీ. దూరంలో ఉంటుందని, గోదావరి నది 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుందని అటవీ అధికారులు సెయిల్ బృందానికి వివరించారు. అనంతరం బయ్యారం మండలం ధర్మాపురం పరిధిలోని 4028 ఎకరాల భూములకు సంబంధించిన మ్యాప్‌లను పరిశీలించారు. ఇక్కడ ఫ్యాక్టరీ నిర్మిస్తే లభ్యమయ్యే వనరుల గురించి జేసీ సురేంద్రమోహన్ సెయిల్ బృందానికి వివరించారు. ఆ తర్వాత బయ్యారం పెద్ద చెరువును సందర్శించి నీటివనరుల గురించి చర్చించారు. ఈ బృందంలో జేసీ వెంట సెయిల్ అధికారులు ఎ.మేథి, వి.సర్కార్, కుమార్, కె.ఎస్.సవారి, బెనర్జీ, డి.సాహు, సోమేశ్వరసింగ్, ఎ.కె.జా, డీజీఎం (ఐరన్) రాజన్కుమార్సిన్హా ఉన్నారు. -
‘ఉక్కు’ సంకల్పంతో..
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు అనువైన పరిస్థితులను అన్వేషించేందుకు సెయిల్ బృందం( స్టీల్ఆధారిటీఆఫ్ ఇండియా) బుధవారం ఇక్కడకు వచ్చింది. తొమ్మిది మందితో కూడిన ఈ బృందం జాయింట్ కలెక్టర్ సురేంద్రమోహన్‌తో కలెక్టరేట్లో సమావేశం అయింది. స్టీల్ ప్యాక్టరీ ఏర్పాటుకు అవసరమైన భూములు, వనరులు, ఖనిజ నిక్షేపాలు, నీరు, విద్యుత్, రవాణా తదితర వసతులు, పర్యావరణ పరిరక్షణ, పరిశ్రమ ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలను కూలంకషంగా చర్చించింది. జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయనుండటం గర్వకారణమని జాయింట్ కలెక్టర్ సురేంద్రమోహన్ వ్యాఖ్యానించారు. అధికారులందరూ ఈ బృందానికి అవసరమైన సమాచారాన్ని వెంటనే అందించాలని ఆదేశించారు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే... ‘ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు 2,500 ఎకరాల స్థలం అవసరం. దీనికి బయ్యారం, కొత్తగూడెం మండలం కూనారం చుట్టుపక్కల భూములను పరిశీలించాం. బయ్యారం మండలం ధర్మాపురంలోని 452 సర్వేనంబర్‌లో నాలుగు వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దీనిలో రెండువేల ఎకరాలు అసైన్డ్ భూమి. పాల్వంచ మండలం ఉల్వనూరులో 318 సర్వే నెంబర్లో 21,960 ఎకరాల భూమి ఉంది. దీనిలో ఐదువేల ఎకరాలు అసైన్డ్ భూమి. మిగిలింది రిజర్వ్ ఫారెస్ట్ భూమి. కొత్తగూడెం మండలం కూనారంలో4,300 ఎకరాల ప్రభుత్వ భూమి 3/3 సర్వే నంబర్లో ఉంది. పాల్వంచ మండలం కారేగట్టు అనే గ్రామంలో 38 సర్వేలో 9,111 ఎకరాలు,చంచులగూడెంలో 95/1 సర్వే నంబర్లో 9,680 ఎకరాల భూమి ఉంది. క్షేత్రస్థాయిలో పర్యటించి అనువైన వాటిని ఎంపిక చేయాల్సి ఉంది. ఇనుప ఖనిజం నిక్షేపాలు జిల్లాలో బయ్యారం, గార్ల, నేలకొండపల్లి మండలాల్లో అపారంగా ఉన్నాయి. ఈ ఇనుప ఖనిజాలు హెమటైట్ క్వార్ట్లైట్స్తో కలిసి ఉన్నాయి. ఈప్రాంతంలో ఎర్ర నేలలు ఉన్నాయి. బయ్యారానికి 20 కిలోమీటర్ల దూరంలోని మాధారంలో డోలమైట్ యూనిట్ ఉంది. 90 కిలోమీటర్ల దూరంలో నల్లగొండ జిల్లాలో సున్నపురాయి అపారంగా ఉంది.’ అని జేసీ వివరించారు. బయ్యారంలో మండలంలో 230 హెక్టార్లలో ఒక చోట, 318 హెక్టార్లలో మరో చోట ఇనుప ఖనిజం ఉందని ఏపీఎండీసీ పీఓ శివకుమార్ పేర్కొన్నారు. సెయిల్‌బృందం మాటల్లో... ఉక్కు పరిశ్రమ నెలకొల్పుటకు ఇనుపఖనిజం, మాగ్నైట్, హెమటైట్ ఖనిజాలు అవసరమని సెయిల్ బృందం తెలిపింది. సున్నపురాయి వంటి ముడిసరుకు పక్కజిల్లాల నుంచి తెచ్చుకోవచ్చు అంది. ఇల్లెందు మండలం కాంచనపల్లిలో బొగ్గుగనులు పుష్కలంగా ఉన్నాయని సింగరేణి కాలరీస్ జనరల్ మేనేజర్ జీవీ రెడ్డి తెలిపారు. ఉక్కుపరిశ్రమకు రోజుకు 49 క్యూసెక్కుల నీరు అవసరమని జేసీ తెలిపారు. ఈ నీటిని బయ్యారం పెదచెరువు, మున్నేరు, కిన్నెరసాని, గోదావరి నుంచి తరలించవచ్చన్నారు. 550 మెగావాట్ల విద్యుత్ అవసరమని, దీనికి 220 కేవీ సబ్స్టేషన్లు ఏర్పాటు చేయాలన్నారు. కాలుష్య నియంత్రణబోర్డు పరిమితులకు లోబడి వ్యవహరించాలని జేసీ సూచించారు. ఈ సమావేశంలో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అధికారులు ఎ. మేథీ, లే అవుట్ డెప్యూటీ జనరల్ మేనేజర్ బి.సర్కార్, డీఎం కుమార్, సీనియర్ మేనేజర్ కేఎస్ సవారి, అసిస్టెంట్ మేనేజర్ బెనర్జీ, డి.సాహూ, డీజీఎం సోమేశ్వర్సింగ్, ఏకే జా, డీజీఎం (ఐరన్) రాజన్‌కుమార్ సిన్హా, జిల్లా పరిశ్రమలశాఖ మేనేజర్ శ్రీనివాస్‌నాయక్, మైనింగ్ ఏడీ వెంకటరెడ్డి, ట్రాన్స్‌కో ఎస్ఈ తిరుమలరావు పాల్గొన్నారు. నేటి పర్యటన ఇలా.... స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు గురువారం జిల్లాలో క్షేత్ర పర్యటన చేస్తారు. ఉదయం కిన్నెరసాని, పాల్వంచ, కొత్తగూడెం, బయ్యారం తదితర ప్రాంత్లాలో పర్యటించి వనరులు, పరిశ్రమ ఏర్పాటుకు అనువైన ప్రదేశాలను పరిశీలిస్తారు. -
ఆప్షన్ తెలంగాణే !
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: జిల్లాలో పనిచేస్తున్న అఖిల భారత సర్వీసులకు చెందిన అధికారుల్లో ఎక్కువ మంది ‘తెలంగాణ’ కేడర్‌నే ఎంచుకున్నట్టు సమాచారం. రాష్ట్ర విభజన నేపథ్యంలో అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లోని ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, ఐఎఫ్ఎస్లను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు పంపకం చేసే ప్రక్రియలో భాగంగా తమ ప్రాధాన్యతను తెలియజేస్తూ వారు ప్రభుత్వానికి సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. జిల్లాలో ఉన్న ఇద్దరు ఐపీఎస్ అధికారులు తెలంగాణ కేడర్లోనే పనిచేస్తామని సాధారణ పరిపాలనా విభాగానికి సమచారం అందించారు. జిల్లా పోలీస్ బాస్ ఎ.వి.రంగనాథ్, ఏఎస్పీ ప్రకాశ్‌రెడ్డి ఇద్దరూ తెలంగాణ కేడర్‌నే ఎంచుకున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇక ఐఏఎస్‌ల విషయానికి వ స్తే జాయింట్ కలెక్టర్ సురేంద్రమోహన్‌ది నల్లగొండ జిల్లా. ఆయన విద్యాభ్యాసమంతా ఇక్కడే జరిగింది. ఈ పరిస్థితిలో ఆయన కూడా తన ఆప్షన్ తెలంగాణే అని, ఇక్కడే పనిచేస్తానని ప్రభుత్వానికి తెలియజేసినట్టు సమాచారం. కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేశ్ ఏ కేడర్‌ను ఎంచుకున్నారనే విషయంలో కొంత స్పష్టత రావాల్సి ఉంది. ఐటీడీఏ పీవో దివ్య తమిళనాడుకు చెందిన అధికారిణి కాగా, కలెక్టర్ ముల్కీ నిబంధనల ప్రకారం తెలంగాణకే చెందుతారని అధికారవర్గాలు అంటున్నాయి. ఇక ఐఎఫ్ఎస్ అధికారులుగా ఉన్న కన్జర్వేటర్ ఆనందమోహన్ ఏ కేడర్‌ను ఎంచుకున్నారనేది తెలియాల్సి ఉంది. డీఎఫ్‌వోగా ఉన్న ప్రసాద్ మాత్రం తాను తెలంగాణ కేడర్లోనే పనిచేస్తానని తన ప్రాధాన్యతను ప్రభుత్వానికి తెలియజేశారని సమాచారం. వీరందరినీ తమ ఆప్షన్ తెలియజేయాలని కోరుతూ ప్రభుత్వం ఈనెల 9న సమాచారం పంపి, 16 వరకు గడువిచ్చింది. ఈ గడువులో అధికారులంతా తమ ఆప్షన్‌ను తెలియజేశారు. అయితే, తమ ప్రాధాన్యతను అయితే అడిగారు కానీ... దాని ప్రకారమే పంపకాలు చేస్తారా అనేది అర్థం కావడం లేదని అధికారులంటున్నారు. లాటరీ ద్వారా ఆలిండియా అధికారులను పంపకం చేస్తారని కొందరు చెపుతున్నారని, అలాంటి పరిస్థితుల్లో తమను ప్రాధాన్యం ఎందుకు అడిగారో అర్థం కావడం లేదని వారంటున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో పుట్టి ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు ఎంపికయిన ‘ఇన్సైడర్స్’కి ఆప్షన్ ఏమీ లేదని, వారు పుట్టిన జిల్లా ఎక్కడ ఉంటే ఆ కేడర్ కిందకు తీసుకుంటారనే చర్చ కూడా జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో వేరే రాష్ట్రానికి చెందిన ఐటీడీఏ పీవో దివ్య కేడర్ ఎంపిక చేయడంలో ఏం జరుగుతుందనేది తెలియాల్సి ఉంది. ఆమె మాత్రం తెలంగాణ కేడర్లోనే ఉండేందుకు ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం. అయితే, ఆలిండియా సర్వీసు అధికారుల పంపకానికి సంబంధించిన మార్గదర్శకాలు ఇంకా విడుదల కాలేదని, ఆ మార్గదర్శకాలు ఎలా ఉంటాయో చూస్తేనే కానీ తాము ఏ కేడర్ కిందకు వస్తామో స్పష్టత రాదని కొందరు అధికారులు చెపుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిర్దేశించిన అపాయింటెడ్ డే దగ్గర పడుతున్న నేపథ్యంలో జిల్లాకు చెందిన ఆలిండియా సర్వీసు అధికారులు ఏ కేడర్ కిందకు వస్తారో... ఎవరిని ఏ రాష్ట్రానికి పంపుతారో వేచిచూడాల్సిందే. -
ఓటరు కార్డు లేకున్నా.. ఓటు వేయవచ్చు
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: అర్హులైన ప్రతీ ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రత్యే కార్యక్రమం చేపడుతున్నట్లు జేసీ కడవేరు సురేంద్రమోహన్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతీ ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రచారం చేస్తున్నామని, ఓటర్లను చైతన్య పరిచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశామని అన్నారు. పోలింగ్ రోజు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరుగంటల వరకు ఓటు హక్కు వినియోగించుకునేలా ఆటోల ద్వారా ప్రచారం చేపడుతున్నామని అన్నారు. ఎన్నికల సంఘం మంజూరు చేసిన ఓటరు గుర్తింపు కార్డు లేకపోయినా ఓటరు జాబితాలో పేరుంటే వారందరు ఓటు వేసేందుకు వీలుగా తగిన ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. వారు ఓటు వేసేందుకు 13 రకాల గుర్తింపు కార్డులను ఎంపిక చేశారని, వీటిల్లో ఏ ఒక్కటి ఉన్నా ఓటు హక్కు వినియోగించుకోవచ్చని అన్నారు. ఈ కార్డులు, ధ్రువపత్రాలు 2009 ఫిబ్రవరి 28వ తేదీ నాటికి నిర్ధారించి జారీ చేసినవై ఉండాలని పేర్కొన్నారు. ఓటు హక్కు ఉండి కార్డు లేనివారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ఎన్నికల సంఘం గుర్తించి కార్డుల వివరాలిలా ఉన్నాయి. డ్రైవింగ్ లెసైన్స్ పాస్‌పోర్టు ఇన్‌కం ట్యాక్స్ గుర్తింపు ఉద్యోగులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్, లోకల్‌బాడీలు, పబ్లిక్‌లిమిటెడ్ కంపెనీలు జారీ చేసిన ఫొటో గుర్తింపు కార్డులు పబ్లిక్ సెక్టార్ బ్యాంక్‌లు, పోస్టాఫీస్ జారీ చేసిన ఫొటోలతో ఉన్న పాస్‌పుస్తకాలు, కిసాన్పాస్ పుస్తకాలు ఫొటోలతో కూడిన భూమి పట్టాలు, రిజిస్ట్రేషన్ పత్రాల వంటి ఆస్తి డాక్యుమెంట్లు సంబంధిత అధికారులు జారీ చేసిన ఎస్సీ, బీసీ, ఓబీసీ సర్టిఫికెట్లు ఫొటోలతో జారీ అయిన మాజీ సైనికుల పింఛన్ పుస్తకాలు, పెన్షన్ డాక్యుమెంట్ ఆర్డర్, ఎక్స్ సర్వీస్ మెన్విడో, డిపెండెంట్ సర్టిఫికెట్, వృద్ధాప్యపు, వితంతు పింఛన్ ఆర్డర్ స్వాతంత్య్ర సమరయోధుల ఫొటోలతో కూడిన గుర్తింపుకార్డులు ఆయుధలెసైన్స్ ఫొటోలతో ఉన్న వికలాంగుల సర్టిఫికెట్ జాతీయ ఉపాధి హామీ పథకం కింద జారీ చేసిన ఫొటోగురింపుకార్డు మినిస్ట్రీ ఆఫ్ లేబర్ స్కీం కింద జారీ చేసిన ఫొటోతో కూడిన ఆరోగ్య బీమా పథకం స్మార్టు కార్డులు అనుమతించనున్నారు. -
ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించాలి
ఖమ్మం కలెక్టరేట్,న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికలను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు రిటర్నింగ్ అధికారులు ప్రధాన భూమిక పొషించాలని ఎన్నికల పరిశీలకులు జశ్వంత్‌సింగ్, ఆశిష్‌కుమార్‌ఘోష్‌అన్నారు. బుధవారం సాయంత్రం సార్వత్రిక ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్ చాంబర్లో కలెక్టర్ శ్రీనివాసశ్రీనరేష్‌తో కలసి రిటర్నింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలోని 2291 పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలన్నారు. నియోజకవర్గ పరిధిలో ఈవీఎంలను తప్పనిసరిగా పరిశీలించి, పోలింగ్‌కు సిద్ధం చేసుకోవాలని చెప్పారు. సున్నిత,అతిసున్నిత ప్రాంతాలపై ప్రత్యేకదృష్టి సారించి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎన్నికల ఫిర్యాదులు స్వీకరించేందుకు రిటర్నింగ్ అధికారులు తమ సెల్ నంబర్లు పత్రికలు, టీవీ చానల్స్ ద్వారా ప్రకటించాలన్నారు. పోలింగ్ మెటీరియల్ స్వీకరణ, అప్పగింతకు ఏర్పాటు చేసే రిసెప్షన్ కేంద్రాల వద్ద మైక్రో అబ్జర్వర్ల డైరీల స్వీకరణకు అదనంగా కౌంటర్ ఏర్పాటు చేయాలని చెప్పారు. రెండు గంటలకోసారి నివేదిక పంపాలి పోలింగ్‌శాతాన్ని ప్రతి రెండు గంటలకు పంపి నివేదికలను సకాలంలో పంపాలని పరిశీలకులు ఆదేశించారు. పోలింగ్ఏజెంట్ల నియామకాల ప్రక్రియను సకాలంలో పూర్తిచేసి నియామక పత్రాలను అందించాలని ఎన్నికల పరిశీలకులు, రిటర్నింగ్ అధికారులకు సూచించారు. ప్రతి పోలింగ్‌కేంద్రంలో లైటింగ్ ఏర్పాట్లు తప్పనిసరిగా ఉండాలన్నారు. పోలింగ్ రోజున సెక్టోరియల్ అధికారులు తమ సెక్టోరల్ పరిధిలో మాత్రమే ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో సత్వరమే స్పందించాలని వారు సూచించారు. జిల్లా కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ మాట్లాడుతూ స్ట్రాంగ్ రూమ్‌ల ఏర్పాట్లను ముందుగానే సరి చూసుకోవాలన్నారు. ప్రతి మండలానికి సంబంధించి ఒక ప్రాంతంలో మోడల్ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని రిటర్నింగ్ అధికారులకు సూచించారు. జిల్లాలో ఓటరు స్లిప్‌ల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. చనిపోయిన, వలస వెళ్లిన, స్థానికంగా లేని వారి జాబితాను పోలింగ్ కేంద్రాల వారీగా సిద్ధం చేసి ఈ నెల 26వ తేదీలోగా సమర్పించాలని సూచించారు. జిల్లాలో 757 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించామని, ఆ ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మోడల్ కోడ్ ఆఫ్ కాండాక్ట్‌ను అతిక్రమించిన వారిపై నిబంధనల మేరకు సత్వరమే చర్యలు తీసుకోవాలని నోడల్ అధికారికి సూచించారు. మోడల్ కోడ్ ఆఫ్ కాండాక్ట్ టీమ్‌లు గ్రామాలలో పర్యటించాలని చెప్పారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ సురేంద్రమోహన్, ఐటీడీఏ పీవో దివ్య, నియోజకవర్గాల అధికారులు, నోడల్ అధికారులు పాల్గొన్నారు. -
36 అసెంబ్లీ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణ
ఖమ్మం కలెక్టరేట్,న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల స్క్రూటినీ ప్రక్రియ గురువారం ముగిసింది. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీనివాసశ్రీనరేష్, పార్లమెంట్ ఎన్నికల పరిశీలకులు జస్వంత్‌సింగ్, జిల్లా జాయింట్ కలెక్టర్ సురేంద్రమోహన్ పార్లమెంటు అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన చేపట్టారు. ఖమ్మం పార్లమెంట్ స్థానానికి మొత్తం 27 నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఇందులో ఒక్కటి కూడా తిరస్కరణకు గురికాలేదు. నామినేషన్ పత్రాలను పరిశీలించిన కలెక్టర్ అన్నీ సక్రమంగా ఉన్నాయని, ఆమోదించినట్లు ప్రకటించారు. కాగా, పది అసెంబ్లీ స్థానాలకు మొత్తం 232 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో 36 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురికాగా 196 మంది నామినేషన్లు ఆమోదించారు. ఉపసంహరణల అనంతరం చివరకు ఎంతమంది బరిలో ఉంటారో తేలనుంది. ఓటరు జాబితాలో క్రమ సంఖ్య తప్పుగా ఉండడం, ప్రతిపాదించే వారు లేకపోవడం, పార్టీల తరఫున బీ-ఫాంలు లేక, అసలు అభ్యర్థికి డమ్మీగా వేయడం, అఫిడెవిట్లు లేక, వయస్సు నిండకపోవడం, బలపరిచే వారు లేక...ఇలా పలుకారణాలతో పరిశీలన అనంతరం అధికారులు నా మినేషన్లు తిరస్కరించారు. ఎక్కువగా కొత్తగూడెంలో 8మంది, పాలేరు నియోజకవర్గంలో ఏడుగురు అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యా యి. నియోజకవర్గాల వారీగా తి రస్కరణకు గురైన అభ్యర్థుల వివరాలు.... పినపాక : బాణోతు శోభ (టీఆర్ఎల్డీ), తెల్లం నర్సింహారావు (స్వతంత్ర), బండారు రాజీవ్‌గాంధీ (స్వతంత్ర). ఇల్లెందు : చుంచు నాగేశ్వరరావు (టీఆర్ఎస్), బాణోతు హరిసింగ్ (టీడీపీ), ఊకే ప్రభాకర్ (టీడీపీ), లావుడ్యా నాగేశ్వర్రావు (పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా), శ్రీకాంత్ కొమరం (స్వతంత్ర), నునావత్ హనుమంతు (స్వతంత్ర). పాలేరు : రాంరెడ్డి గోపాల్‌రెడ్డి (కాంగ్రెస్), బత్తుల లెనిన్ (సీపీఎం), బాణోతు వెంకన్ననాయక్ (స్వతంత్ర), నునావత్ బాణ్యానాయక్ (స్వతంత్ర), గట్టుమల్ల శంకర్ (స్వతంత్ర), బెరైడ్డిభువన(స్వతంత్ర), తేజావత్ బాబు( స్వతంత్ర), వైరా:భూక్యా వీరప్రసాద్ (స్వతంత్ర), ధరావత్ కాన్షిరాం (స్వతంత్ర),మూడు రవి(సీపీఐ),ఎ.నాగునాయక్( స్వతంత్ర), బాణోత్ దేవులా (టీడీపీ). ఖమ్మం: షేక్ మదార్సాహేబ్ (టీడీపీ), షేక్ పాషా (జై సమైకాంధ్ర),బండారు అంజన్‌రాజు( స్వతంత్ర) ,నల్లమోతు శ్రావణ్‌కుమార్( స్వతంత్ర). కొత్తగూడెం: మహ్మద్ అబ్దుల్ మజీద్(బీజేపీ), మళోత్ రాందాస్(టీడీపీ), కోనేరు పూర్ణచందర్రావు(టీడీపీ),తాండ్ర రవీందర్(బీఎస్పీ) ,షేక్ సాబీర్‌పాషా( సీపీఐ), గుగులోత్ రాజేష్ ( స్వతంత్ర ), వనమా వెంకటేశ్వరరావు(స్వతంత్ర) ,ఊదరా పూర్ణచందర్రావు(స్వతంత్ర). మధిర : దారేల్లి అశోక్ (వైఎస్ఆర్సీపీ) భద్రాచలం: సరియం కోటేశ్వరరావు(సీపీఎం). అశ్వారరావుపేట: వగ్గెల హేమంత్‌కుమార్ (కాంగ్రెస్) సత్తుపల్లి: తుమ్మలరాజేష్కుమార్ (జై సమైక్యాంధ్ర) -
ప్రాదేశిక ఎన్నికలు తొలిరోజు నామినేషన్లు
సాక్షి, ఖమ్మం: స్థానిక పోరుకు తెరలేచింది. నామినేషన్ల స్వీకరణ ఘట్టం సోమవారం నుంచి ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా 46 జెడ్పీటీసీలకుగాను కేవలం ఒక్క నామినేషన్ మాత్రమే దాఖలైంది. 640 ఎంపీటీసీలకుగాను 13 ఎంపీటీసీలకు 13 నామినేషన్లు వేశారు. పార్టీల మధ్య పొత్తులు కుదరకే ఆశావహులు నామినేషన్లు దాఖలు చేయలేదని తెలుస్తోంది. జిల్లాలో ప్రాదేశిక ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను కలెక్టర్ శ్రీనివాసశ్రీనరేశ్ సోమవారం విడుదల చేశారు. ఆ వెంటనే నామినేషన్ల స్వీకరణకు అనుమతించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ సమయంగా ప్రకటించారు. జెడ్పీటీసీ నామినేషన్ల స్వీకరణకు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏడు కౌంటర్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. రిజర్వేషన్ల ఆధారంగా ఈ కౌంటర్లను పెట్టారు. అభ్యర్థులు నామినేషన్ వేయడానికి డిపాజిట్ డీడీలు చెల్లించడానికి మరో కౌంటర్ ఏర్పాటు చేశారు. నామినేషన్ ప్రక్రియను జాయింట్ కలెక్టర్ సురేంద్రమోహన్ పరిశీలిస్తున్నారు. ఎంపీటీసీల నామినేషన్లకు ఆయా మండల పరిషత్ కార్యాలయాల్లో ఏర్పాట్లు చేశారు. మండలస్థాయిలో ఈ ప్రక్రియను పరిశీలించేందుకు గెజిటెడ్ స్థాయి అధికారిని నియమించారు. తొలిరోజు ముదిగొండ, భద్రాచలం, చర్ల, ఏన్కూరు, పెనుబల్లి మండలాల్లో ఒక్కో ఎంపీటీసీకి ఒక్కో నామినేషన్ చొప్పున దాఖలు అయ్యాయి. పినపాక, ఎర్రుపాలెం, చింతూరు, కొత్తగూడెం ఎంపీటీసీలకు రెండు నామినేషన్ల చొప్పున వేశారు. ఖమ్మంరూరల్ మండలం జెడ్పీటీసీకి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినిగా డి.నీలిమ నామినేషన్ వేశారు. అశ్వారావుపేట నియోజకవర్గంలో ఒక్క ఎంపీటీసీకి కూడా నామినేషన్ దాఖలుకాలేదు. జెడ్పీటీసీ నామినేషన్లు జెడ్పీలోనే వేయాలని ఆదేశాలు ఉండటంతో కార్యాలయం వద్ద భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మూడు రోజులే గడువు.. ఈనెల 20వ తేదీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల గడువు విధించారు. కేవలం మూడురోజుల్లోనే నామినేషన్ల ప్రక్రియ పూర్తి చేయనున్నారు. మొన్నటి వరకు మున్సిపల్ ఎన్నికల పొత్తులు, నామినేషన్లపై తలమునకలైన పార్టీలు స్థానిక పొత్తులపై ఇంకా చర్చలకు దిగలేదు. మున్సిపల్ ఎన్నికల్లో ఉన్న పొత్తులే స్థానికంగా ఉంటాయని పార్టీల నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే స్థానిక పరిస్థితులను బట్టి పొత్తులు ఉండవచ్చనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. పొత్తులు కుదరకపోయినా నామినేషన్ వేసి ఆ తర్వాత పొత్తులకు దిగాలని భావిస్తున్నారు. ఎన్నికలన్నీ ఒకేసారి రావడంతో ఆశావాహులు పోటీకి సై అంటుండగా.. నేతలకు మాత్రం అభ్యర్థుల ఎంపిక తలనొప్పిగా మారింది. గత ఎన్నికల్లో నామినేషన్ల సమయం వారంరోజులు ఉండేదని ఇప్పుడు నాలుగు రోజులకు కుదించడమేంటని..ఆశావహులు ప్రశ్నిస్తున్నారు. డిపాజిట్ డబ్బులు, ఇప్పటి వరకు చెల్లించని బకాయిలతో బరిలో నిలిచే అభ్యర్థులు సతమతమవుతున్నారు. రిజర్వేషన్ అయినచోట కొందరు కులధ్రువీకరణ పత్రాలు సరి చూసుకునే పనిలో ఉన్నారు. జెడ్పీటీసీ అభ్యర్థుల ఎంపికకు కసరత్తు మండలస్థాయిలో ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపికను పార్టీలు మండల పార్టీ నేతలకే అప్పగించాయి. గతంలో పోటీచేసిన వారు మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సమాయత్తమవుతున్నారు. జెడ్పీ పీఠం దక్కించుకోవడమే ధ్యేయంగా అన్ని పార్టీలు ఎత్తుకుపై ఎత్తులు వేస్తున్నాయి. పొత్తులతో పోతే ఎలా ఉంటుంది..? ఒంటరిగా పోటీచేస్తే జెడ్పీ పీఠంపై జెండా ఎగురవేస్తామా..? అన్న కోణంలో పార్టీ నేతలు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. ఇదంతా ఒక ఎత్తై జెడ్పీటీసీ అభ్యర్థులపై ఎంపికపైనే మండలాలవారీగా అన్ని పార్టీలు దృష్టి పెట్టాయి. అంగ, ఆర్థిక, రాజకీయ బలం ఉన్న అభ్యర్థులనే పోటీకి దింపాలన్న యోచనలో ఉన్నాయి. అలాగైతేనే జెడ్పీ పీఠం దక్కుతుందన్న వ్యూహంలోనూ ఉన్నాయి. -
భూ సమస్యల పరిష్కారంలో...రాజకీయ పార్టీల పాత్ర కీలకం
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: భూ సంబంధ సమస్యల పరిష్కారంలో రాజకీయ పార్టీల పాత్ర కీలకమైందని కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ అన్నారు. వచ్చే నెల 10 నుంచి 25వ తేదీ వరకు జరిగే మూడోవిడత రెవెన్యూ సదస్సుల సందర్భంగా శనివారం కలెక్టరేట్లోని ప్రజ్ఞ మందిరంలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. భూసమస్యల పరిష్కారానికి ఎస్సీ, ఎస్టీ వాడలలో రెవెన్యూ గ్రామానికొక సదస్సు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. రెవెన్యూ వ్యవస్థకు కీలకమైన వీఆర్ఓ కార్యాలయాలను పటిష్టపరుస్తున్నట్లు చెప్పారు. అందులో భాగంగా జిల్లాలో 1242 రెవెన్యూ గ్రామాలుంటే 935చోట్ల రెవెన్యూ కార్యాలయాలు ఏర్పాటు చేశామన్నారు. మిగిలిన 307 గ్రామాల్లో కంపెనీల సామాజిక బాధ్యత నిధుల నుంచి కార్యాలయ సొంత భవనాలు నిర్మించనున్నట్టు చెప్పారు. 2005 నుంచి ఇప్పటివరకు ఏడు విడతలుగా పంపిణీ చేసిన భూముల స్థితిగతులను పరిశీలిస్తామన్నారు. అసైన్మెంట్ భూములను కొనుగోలు చేసిన వారిపై పీఓటీ చట్టం కింద కేసులు పెట్టనున్నట్టు తెలిపారు. ఇ-పాస్ బుక్‌ల జారీకిగాను ఖమ్మం జిల్లాను పెలైట్ ప్రాజెక్టుగా ప్రభుత్వ ఎంపిక చేసినట్టు తెలిపారు. మూడోవిడత రెవెన్యూ సదస్సులలో ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. ఈ నెలాఖరు వరకు రెవెన్యూ, ఐకేపీ బృందాలు గ్రామాలలో పర్యటిస్తాయన్నారు. నిరుపేద ఎస్సీలకు భూముల కొనుగోలు కింద యూనిట్‌కు ఐదులక్షల రూపాయల చొప్పున 100 యూనిట్ల కేటాయింపునకు లబ్ధిదారులను గుర్తించనున్నట్టు చెప్పారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ సురేంద్రమోహన్, అడిషనల్ జాయింట్ కలెక్టర్ కె.బాబూరావు, డీఆర్ఓ శివశ్రీనివాస్, సర్వే అండ్ ల్యాండ్స్ ఏడీ అశోక్, ఐకేపీ లీగల్ కో-ఆర్డినేటర్ ఎ.శ్రీకాంత్, రాజకీయ పార్టీల ప్రతినిధులు భాగం హేమంతరావు(సీపీఐ), ఎన్.వెంకయ్య(కాంగ్రెస్), ఎం.నాగేశ్వరరావు, తాతా భాస్కర్‌రావు(సీపీఎం), కె.రంగారెడ్డి(న్యూడెమోక్రసీ), ఎల్.పుల్లారావు(లోక్‌సత్తా), ఎన్.వెంకటేశ్వరరావు(టీడీపీ), హెచ్.వెంకటేశ్వరరావు(వైఎస్ఆర్ సీపీ), దాసు మహారాజు, కె.కృష్ణ(బీఎస్పీ) తదితరులు పాల్గొన్నారు. -
పంటనష్టం సర్వేకు చర్యలు...
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లాలో ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు దెబ్బతిన్న పంటల నష్టాన్ని అంచనా వేయాలని రెవెన్యూ, వ్యవసాయాధికారులను ఆదేశించినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ కె.సురేంద్రమోహన్ తెలిపారు. ఈ విషయంపై శనివారం ఆయన ‘న్యూస్‌లైన్’కు ఇంటర్వ్యూ ఇచ్చారు. జిల్లాలో కురుస్తున్న వర్షాల వల్ల పత్తి, మొక్కజొన్న, వరి పంటలు దెబ్బతిన్నాయని, రైతులను ఆదుకునేందుకు వ్యవసాయాధికారులు సోమవారం నుంచి క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టం అంచనాలను రూపొందించాలని ఆదేశించినట్లు తెలిపారు. న్యూస్‌లైన్: జిల్లాలో ఏయే పంటలు అత్యధికంగా దెబ్బతిన్నాయి? జేసీ: జిల్లాలో పత్తి, మొక్కజొన్న, వరి, వేరుశనగ పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయాధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. 75వేల ఎకరాల్లో పత్తి, 4వేల ఎకరాల్లో మొక్కజొన్న, 800 ఎకరాల్లో వరి, 250 ఎకరాల్లో వేరుశనగకు నష్టం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. న్యూస్‌లైన్: పంట నష్టాన్ని ఎలా గుర్తిస్తున్నారు..? జేసీ: జిల్లాలో పత్తి రెండోసారి తీసే దశలో ఉన్న సమయంలో ఎక్కువ రోజులు వర్షం కురవడంతో ఫంగస్ వచ్చి పూర్తిగా దెబ్బతిన్నది. ఇన్సూరెన్స్ చేసుకున్న రైతులకు వ్యవసాయ, రెవెన్యూ అధికారులు కలిసి పంట నష్టం అంచనాలను రూపొందించనున్నారు. ఆ నివేదికల ద్వారా పరిహారం అందేలా చర్యలు చేపడతాం. అలాగే ఇన్సూరెన్స్ లేని రైతులకు కూడా ప్రకృతి వైపరీత్యాల విభాగం నుంచి వ్యవసాయ కమిషనర్‌కు ప్రతిపాదనలు పంపి ఇన్సూరెన్స్ చెల్లించేలా చర్యలు చేపడతాం. న్యూస్‌లైన్: వరదలపై ముందస్తుగా ఏం చర్యలు తీసుకున్నారు..? జేసీ: ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎలాంటి నష్టం కలగకుండా ఉండేందుకు అన్ని శాఖల అధికారులను ముందస్తుగా అప్రమత్తం చేశాం. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు మండలస్థాయిలో తహశీల్దార్, వీఆర్వోలు మండల కేంద్రాల్లో ఉండేలా ఆదేశాలు జారీ చేశాం. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలిగినా స్పందించి తగు చర్యలు తీసుకోవాలని సూచించాం. న్యూస్‌లైన్: వరదలపై ఎక్కడెక్కడ కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు.? జేసీ: వర్షాల కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలిగినా సమాచారం అందించేందుకు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో కంట్రోల్‌రూమ్‌ను ఏర్పాటు చేశాం. ప్రజలకు ఎలాంటి సహాయం కావాలన్నా, ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తినా జిల్లా అధికారులకు వివరించేలా ప్రత్యేక బృందాలను నియమించాం. 24 గంటలు అందుబాటులో ఉండేలా అధికారులను నియమించాం. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలిగినా కంట్రోల్‌రూమ్ నెంబర్ 08742-231600కు ఫోన్ చేయాలి. న్యూస్‌లైన్: రైతులకు అధికంగా పంట నష్టం జరగడానికి కారణమేంటి? జేసీ: సాధారణంగా 46 మండలాల్లో 944 మిల్లీమీటర్ల వర్షపాతం పడాలి. అయితే 8,566 మిల్లీమీటర్ల వర్షపాతం పడటం వల్ల అత్యధికంగా పంట నష్టం జరిగింది. ఐదు రోజులుగా వర్షం పడటం వల్ల పత్తి పూర్తిగా దెబ్బతిన్నది. న్యూస్‌లైన్: ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారా? జేసీ: జిల్లాలో నవంబర్ మొదటి వారంలో భద్రాచలం డివిజన్లో ధాన్యం చేతికి అందుతుంది. ధాన్యం కొనుగోలులో గతంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈ సారి పటిష్ట చర్యలు చేపట్టాం. ఆర్డీఓ, తహశీల్దార్లను ఇందులో భాగస్వాములను చేసి అన్ని పరికరాలు, గోడౌన్స్, టార్పాలిన్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నాం. న్యూస్‌లైన్: పత్తి కొనుగోలుకు సీసీఐ కేంద్రాలను ఎందుకు ఏర్పాటు చేయలేదు? జేసీ: జిల్లాలో రైతులకు మేలు చేసేందుకు సీసీఐని ఈసారి ముందస్తుగా అనుమతించలేదు. 12శాతం తేమ ఉంటే సీసీఐ నిబంధనల ప్రకారం పత్తిని కొనుగోలు చేయరు. రైతుల శ్రేయస్సు కోసం సీసీఐని అనుమతించకుండా మార్కెట్ కమిటీల ద్వారానే రైతులకు లబ్ధి చేకూర్చేలా చర్యలు చేపడుతున్నాం న్యూస్‌లైన్: భూ పంపిణీకి ఎలాంటి చర్యలు చేపట్టారు? జేసీ: జిల్లాలో 7వ విడత భూ పంపిణీకి 14,280 ఎకరాలు పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లుచేశాం. ప్రభుత్వ భూములను సర్వే చేసి అసైన్మెంట్ కమిటీ అప్రూవల్ కూడా తీసుకున్నాం. ఈసారి నూతనంగా సీసీఎల్ఏ నుంచి ప్రత్యేకంగా సెక్యూరిటీ ప్రింటింగ్‌తో కూడిన పత్రాలను ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. న్యూస్‌లైన్: రెండో విడత రచ్చబండలో లబ్ధిదారులకు రేషన్‌కార్డులు ఎందుకు ఇవ్వలేదు? జేసీ: రెండో విడత రచ్చబండలో దరఖాస్తు చేసుకున్న 34వేల మంది లబ్ధిదారులకు మూడో విడత ప్రారంభంలో రేషన్‌కార్డులను అందించేందుకు చర్యలు చేపడుతున్నాం. న్యూస్‌లైన్: జిల్లాలో ప్రభుత్వ భూముల రక్షణకు ఎలాంటి చర్యలు చేపట్టారు? జేసీ: జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో ఉన్న ప్రభుత్వ భూములు కబ్జా కాకుండా ఉండేందుకు చర్యలు చేపట్టారు. మొదటి విడతగా విలువైన భూములు 200 ఎకరాలను గుర్తించాం. వాటికి రక్షణ చర్యలు చేపట్టేందుకు రూ.3కోట్లు ఖర్చు అవుతుందని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. ప్రభుత్వం రూ70 లక్షలు మంజూరు చేసింది. వీటిని ఖమ్మం, కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లెందు కేంద్రాల్లో ప్రభుత్వ భూములకు ప్రహరీలు, ఫెన్సింగ్ ను ఏర్పాటు చేస్తున్నాం. న్యూస్‌లైన్: నగదు బదిలీ పథకం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు కదా? జేసీ: గ్యాస్‌కు నగదు బదిలీ పథకాన్ని నవంబర్ నుంచి అమలుచేయాలని ప్రభుత్వం సూచించింది. అయితే ఇప్పటి వరకు ఆధార్ అనుసంధానం జరిగిన లబ్ధిదారులు గ్యాస్ తీసుకునే సమయంలో రూ.1090 చెల్లించి తీసుకుంటున్నారు. మొదటిసారి ఆయా బ్యాంక్ అకౌంట్లలో రూ.435 వస్తాయి. రెండు, మూడు రోజుల అనంతరం రూ.621 జమ అవుతుంది. రెండో సారి గ్యాస్ తీసుకున్న తర్వాత రూ.621 మాత్రమే జమ అవుతుంది. నగదు బదిలీ వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు.