సాక్షి, ఖమ్మం: స్థానిక పోరుకు తెరలేచింది. నామినేషన్ల స్వీకరణ ఘట్టం సోమవారం నుంచి ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా 46 జెడ్పీటీసీలకుగాను కేవలం ఒక్క నామినేషన్ మాత్రమే దాఖలైంది. 640 ఎంపీటీసీలకుగాను 13 ఎంపీటీసీలకు 13 నామినేషన్లు వేశారు. పార్టీల మధ్య పొత్తులు కుదరకే ఆశావహులు నామినేషన్లు దాఖలు చేయలేదని తెలుస్తోంది.
జిల్లాలో ప్రాదేశిక ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను కలెక్టర్ శ్రీనివాసశ్రీనరేశ్ సోమవారం విడుదల చేశారు. ఆ వెంటనే నామినేషన్ల స్వీకరణకు అనుమతించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ సమయంగా ప్రకటించారు. జెడ్పీటీసీ నామినేషన్ల స్వీకరణకు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏడు కౌంటర్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. రిజర్వేషన్ల ఆధారంగా ఈ కౌంటర్లను పెట్టారు. అభ్యర్థులు నామినేషన్ వేయడానికి డిపాజిట్ డీడీలు చెల్లించడానికి మరో కౌంటర్ ఏర్పాటు చేశారు. నామినేషన్ ప్రక్రియను జాయింట్ కలెక్టర్ సురేంద్రమోహన్ పరిశీలిస్తున్నారు.
ఎంపీటీసీల నామినేషన్లకు ఆయా మండల పరిషత్ కార్యాలయాల్లో ఏర్పాట్లు చేశారు. మండలస్థాయిలో ఈ ప్రక్రియను పరిశీలించేందుకు గెజిటెడ్ స్థాయి అధికారిని నియమించారు. తొలిరోజు ముదిగొండ, భద్రాచలం, చర్ల, ఏన్కూరు, పెనుబల్లి మండలాల్లో ఒక్కో ఎంపీటీసీకి ఒక్కో నామినేషన్ చొప్పున దాఖలు అయ్యాయి. పినపాక, ఎర్రుపాలెం, చింతూరు, కొత్తగూడెం ఎంపీటీసీలకు రెండు నామినేషన్ల చొప్పున వేశారు. ఖమ్మంరూరల్ మండలం జెడ్పీటీసీకి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినిగా డి.నీలిమ నామినేషన్ వేశారు. అశ్వారావుపేట నియోజకవర్గంలో ఒక్క ఎంపీటీసీకి కూడా నామినేషన్ దాఖలుకాలేదు. జెడ్పీటీసీ నామినేషన్లు జెడ్పీలోనే వేయాలని ఆదేశాలు ఉండటంతో కార్యాలయం వద్ద భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
మూడు రోజులే గడువు..
ఈనెల 20వ తేదీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల గడువు విధించారు. కేవలం మూడురోజుల్లోనే నామినేషన్ల ప్రక్రియ పూర్తి చేయనున్నారు. మొన్నటి వరకు మున్సిపల్ ఎన్నికల పొత్తులు, నామినేషన్లపై తలమునకలైన పార్టీలు స్థానిక పొత్తులపై ఇంకా చర్చలకు దిగలేదు. మున్సిపల్ ఎన్నికల్లో ఉన్న పొత్తులే స్థానికంగా ఉంటాయని పార్టీల నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే స్థానిక పరిస్థితులను బట్టి పొత్తులు ఉండవచ్చనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
పొత్తులు కుదరకపోయినా నామినేషన్ వేసి ఆ తర్వాత పొత్తులకు దిగాలని భావిస్తున్నారు. ఎన్నికలన్నీ ఒకేసారి రావడంతో ఆశావాహులు పోటీకి సై అంటుండగా.. నేతలకు మాత్రం అభ్యర్థుల ఎంపిక తలనొప్పిగా మారింది. గత ఎన్నికల్లో నామినేషన్ల సమయం వారంరోజులు ఉండేదని ఇప్పుడు నాలుగు రోజులకు కుదించడమేంటని..ఆశావహులు ప్రశ్నిస్తున్నారు. డిపాజిట్ డబ్బులు, ఇప్పటి వరకు చెల్లించని బకాయిలతో బరిలో నిలిచే అభ్యర్థులు సతమతమవుతున్నారు. రిజర్వేషన్ అయినచోట కొందరు కులధ్రువీకరణ పత్రాలు సరి చూసుకునే పనిలో ఉన్నారు.
జెడ్పీటీసీ అభ్యర్థుల ఎంపికకు కసరత్తు
మండలస్థాయిలో ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపికను పార్టీలు మండల పార్టీ నేతలకే అప్పగించాయి. గతంలో పోటీచేసిన వారు మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సమాయత్తమవుతున్నారు. జెడ్పీ పీఠం దక్కించుకోవడమే ధ్యేయంగా అన్ని పార్టీలు ఎత్తుకుపై ఎత్తులు వేస్తున్నాయి. పొత్తులతో పోతే ఎలా ఉంటుంది..? ఒంటరిగా పోటీచేస్తే జెడ్పీ పీఠంపై జెండా ఎగురవేస్తామా..? అన్న కోణంలో పార్టీ నేతలు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. ఇదంతా ఒక ఎత్తై జెడ్పీటీసీ అభ్యర్థులపై ఎంపికపైనే మండలాలవారీగా అన్ని పార్టీలు దృష్టి పెట్టాయి. అంగ, ఆర్థిక, రాజకీయ బలం ఉన్న అభ్యర్థులనే పోటీకి దింపాలన్న యోచనలో ఉన్నాయి. అలాగైతేనే జెడ్పీ పీఠం దక్కుతుందన్న వ్యూహంలోనూ ఉన్నాయి.
ప్రాదేశిక ఎన్నికలు తొలిరోజు నామినేషన్లు
Published Tue, Mar 18 2014 2:24 AM | Last Updated on Tue, Oct 2 2018 2:53 PM
Advertisement