ఖమ్మం జెడ్పీసెంటర్: జిల్లాలో రేషన్ కార్డులకు ఆధార్ అనుసంధానాన్ని ఈ నెల 15వ తేదీలోగా పూర్తిచేయాలని పౌర సరఫరాల శాఖ డిప్యూటీ తహశీల్దారు(డీటీ)లను జాయింట్ కలెక్టర్ సురేంద్రమోహన్ ఆదేశించారు. ప్రజాపంపిణీ వ్యవస్థ పటిష్టతకు తీసుకోవాల్సిన చర్యలు, ఆధార్ అనుసంధానంపై ఆయన గురువారం కలెక్టరేట్‌లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఆయన మాట్లాడుతూ.. బోగస్ రేషన్ కార్డుల ఏరివేతలో అర్హులకు అన్యాయం జరగకుండా చూడాలన్నారు. రేషన్ కార్డులు కోల్పోయిన వారిలో అర్హులు ఉన్నట్టయితే వారి ఆధార్ కార్డును తీసుకుని కార్డును పునరుద్ధరించాలన్నారు. ప్రజాపంపిణీ వ్యవస్థ(పీడీఎస్) ద్వారా దారిద్య్ర నిర్మూలన రేఖ కిందనున్న పేద కుటుంబాలకు మాత్రమే ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకోవాలన్నారు. పీడీఎస్ లబ్ధిదారుల్లోని అనర్హుల కార్డులు రద్దు చేయాలని అన్నారు. వసతి గృహాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, మధ్యాహ్న భోజన పథకానికి నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలన్నారు. అధికారులు పంపిణీతో సరిపెట్టుకోకుండా క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయాన్ని సేకరించాలని సూచించారు.
వసతి గృహాలకు, పాఠశాలలకు రూట్ అధికారులు లేకుండా బియ్యం సరఫరా చేయవద్దని ఆదేశించారు. ఎఫ్‌సీఐ నుంచి ఎంఎల్‌ఎస్ పాయింట్లకు ఎపిక్ షాపులకు వచ్చే బియ్యం వినియోగ యోగ్యంగా లేకపోతే తిరిగి పంపించాలన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో జీసీసీ డిపోలు తెరవడం లేదంటూ తరచుగా తనకు ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ఇవి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఇక నుంచి మండల లెవెల్ స్టాక్ పాయింట్ల ఇన్‌చార్జిలకు రిలీజ్ ఆర్డర్లను కలెక్టరేట్ నుంచే ఇస్తామన్నారు. ప్రజాపంపిణీ వ్యవస్థ పటిష్టానికి శాసనసభ నియోజకవర్గం నుంచి ఒకరి చొప్పున పదిమంది జిల్లా అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమించనున్నట్టు చెప్పారు. సమావేశంలో డీఎస్‌వో గౌరీశంకర్, పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ వై.సాంబశివరావు,డీఈవో రవీంద్రనాథ్‌రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి వెంకటనర్సయ్య, ఐసీడీఎస్ పీడీ సుఖజీవన్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
రేషన్‌కు ఆధార్ అనుసంధానించాలి
Published Fri, Sep 12 2014 1:35 AM | Last Updated on Wed, Apr 3 2019 5:52 PM
Advertisement