సాక్షి ప్రతినిధి, ఖమ్మం : అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ కడవేరు సురేంద్రమోహన్ తెలిపారు. ఆహారభద్రత, ఆసరా, పెన్షన్ పథకాలలో అర్హులకు అన్యాయం జరుగకుండా క్షేత్రస్థాయిలో సూక్ష్మ పరిశీలనకు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. జిల్లాలో పరిశ్రమలను నెలకొల్పి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఆసక్తి కనబర్చే పారిశ్రామిక వేత్తలకు నిబంధనల ప్రకారం ప్రభుత్వ భూములు కేటాయించి ప్రోత్సహిస్తామన్నారు. జిల్లా అభివృద్ధి ప్రణాళికలను ప్రాధాన్యత క్రమంలో అమలు చేస్తున్న తీరును వివరించారు. బుదవారం ఆయన సాక్షి ప్రతినిధికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. జిల్లాను పారిశ్రామిక ంగా అభివృద్ధి చేసేందుకు పలు ప్రతిపాదనలు చేశామని, ఐటీ పార్క్, థర్మల్ పవర్ ప్రాజెక్టులు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణానికి చర్యలు తీసుకున్నట్లు వివరించారు.
సాక్షి : ఆసరా పథకం పరిస్థితి ఏమిటి..?
జేసీ : జిల్లాలో పెన్షన్‌ల కోసం 3,17,801 దరఖాస్తులు రాగా అందులో 3.07 లక్షల దరఖాస్తుల పరిశీలన పూర్తయింది. ఇప్పటివరకు 2,13,063 మందిని అర్హులుగా గుర్తించాం. ఇంకా 10 వేల దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి.
సాక్షి : గతం కంటే పెన్షన్ లబ్ధిదారులు పెరిగారా.. తగ్గారా..?
జేసీ : జిల్లాలో గతంలో 3,24,426 పెన్షన్లు ఉండగా ప్రస్తుతం అదేస్థాయిలో పెన్షన్‌లు రానున్నాయి. పాతవాటిలో కొందరు అనర్హులను తొలగించాం. ప్రస్తుతం కొత్తగా కొన్ని చేర్చాం. దీంతో పెన్షన్‌లు గతం లాగానే రానున్నాయి.
సాక్షి : సీలింగ్ పేరుతో అర్హులకు అన్యాయం జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి కదా..?
జేసీ : సీలింగ్ అనేది జిల్లాలో లేదు. ప్రభుత్వం కొన్ని నిబంధనలు సడలించింది. జిల్లాలో 64 శాతం ఏజెన్సీ ఏరియా ఉందని వివరించా. దీంతో అర్హులందరికీ పెన్షన్లు వచ్చేలా చర్యలు చేపడుతున్నాం.
సాక్షి : జిల్లాలో కొన్ని మండలాల్లో పెన్షన్‌లో సీలింగ్ విధించాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.. నిజమేనా..?
జేసీ : జిల్లాలో అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందించాలనేదే లక్ష్యం. ఎక్కడా సీలింగ్ లేదు. అర్హులందరికీ పెన్షన్‌లు అందించేలా బయ్యారం, గార్ల, టేకులపల్లి మండలాల అధికారులకు ఆదేశాలు జారీ చేస్తాం. సీలింగ్ వల్ల అర్హులను తొలగించినట్లు తెలిస్తే ఆర్డీఓ, తహశీల్దార్‌తో పరిశీలన చేస్తాం.
సాక్షి : అర్హులకు జిల్లా అధికారిగా మీరిచ్చే సలహా ఏమిటి..?
జేసీ : రాష్ట్ర అధికారులు సైతం అర్హులకు అన్యాయం చేయవద్దని చెబుతున్నారు. మేము కూడా జిల్లాలో అర్హులందరికీ న్యాయం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశాం. అర్హులను తిరస్కరించినట్లయితే మరోసారి దరఖాస్తు చేసుకోవచ్చు.
సాక్షి : ఆహార భద్రత కార్డుల పరిశీలన ఎలా జరుగుతోంది..?
జేసీ : జిల్లాలో ఆహర భద్రత కార్డులకు 7, 21,852 దరఖాస్తులు వచ్చాయి. వాటిలో ఇప్పటివరకు 2,98,905 దరఖాస్తుల పరిశీలన పూర్తయింది. ఫిబ్రవరిలో ఆహారభద్రతలు కార్డులు అందిస్తాం. అప్పటి వరకు రేషన్‌కార్డులకు సరుకులు పంపిణీ చేయిస్తాం.
సాక్షి : గతంలో ఎన్ని బోగస్ కార్డులు ఏరివేశారు..? ఎంత ఆదా అయింది...?
జేసీ : జిల్లాలో ఆధార్ సీడింగ్ వల్ల 45 వేల బోగస్ కార్డులను గుర్తించి తొలగించాం. దీంతో వెయ్యి మెట్రిక్ టన్నుల బియ్యం ఆదా అవుతుంది. హాస్టళ్లు, మధ్యాహ్న భోజన పథకానికి ఎంఎల్‌ఎస్ పాయింట్ల నుంచి రేషన్ సరఫరా చేస్తున్నాం. దీంతో క్వాలిటీ, క్వాంటిటీ పెరిగింది.
సాక్షి : జిల్లాలో రేషన్ బియ్యం రీసైక్లింగ్ జరుగుతున్నట్లు ప్రచారం ఉంది.. ఎలా అరిక డతారు..?
జేసీ : జిల్లాలో బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు పటిష్ట చర్యలు చేపడుతున్నాం. భారీ ఎత్తున 6ఏ కేసులు నమోదు చేస్తున్నాం. గత మూడునెలల్లో 800 కేసులు పెట్టాం. దీంతో అక్రమ రవాణా తగ్గుతుంది.
సాక్షి : ల్యాండ్ బ్యాంక్‌కు సంబంధించిన వివరాలేమిటి..?
జేసీ : జిల్లాలో 1.20 లక్షల ప్రభుత్వ భూమి ఉంది. అందులో పరిశ్రమలకు ఉపయోగకరంగా 20 వేల ఎకరాల భూమి ఉంది. సత్తుపల్లి, కొత్తగూడెం, కూసుమంచి, రఘునాథపాలెం, బయ్యారంలలో భూములు పారిశ్రామికంగా అనుకూలంగా ఉన్నాయి. అయా ప్రాంతాలలో ఉన్న ప్రభుత్వ భూములను పరిశ్రమల శాఖ ద్వారా కొందరు పారిశ్రామిక వేత్తలు పరిశీలించి పరిశ్రమల స్థాపనకు అనుగుణంగా ఉన్నాయని తేల్చారు.
సాక్షి : పారిశ్రామిక అభివృద్ధికి ఎలాంటి చర్యలు చేపడుతున్నారు..?
జేసీ : జిల్లాలో కొత్తగూడెం మండల పరిధిలోని చుంచుపల్లిలో ఐటీ పార్కు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. సత్తుపల్లి మండలం బుగ్గపాడులో ఫుడ్‌పార్క్ ఏర్పాటు, మణుగూరులో పవర్‌ప్లాంట్‌కు క్లియరెన్స్ వచ్చింది. అశ్వాపురం మండలం ఆమెర్ద గ్రామంలో థర్మల్ విద్యుత్ పవర్‌ప్లాంట్‌కు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. ఇక్కడ కొంత ప్రతికూల పరిస్థితులు ఉన్నట్లు హెవీవాటర్ ప్లాంట్ అధికారులు చెబుతున్నారు. దీంతో ప్రభుత్వానికి లేఖ రాశాం.
సాక్షి : చెరువు శిఖం భూములకు ఎలాంటి రక్షణ చర్యలు చేపడుతున్నారు..?
జేసీ : జిల్లాలో 2వేల ఎకరాల్లో చెరువులు, కుంటల భూములు ఆక్రమణల్లో ఉన్నట్లు గుర్తించాం. దీనిలో 3వేల మందికి నోటీసులు ఇచ్చేందుకు చర్యలు చేపడుతున్నాం.
సాక్షి : ధాన్యం కొనుగోలుకు ఎలాంటి చర్యలు చేపట్టారు..?
జేసీ : జిల్లా వ్యాప్తంగా 130 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు చేశాం. వీటిలో మూడు చోట్ల ఇప్పటికే కేంద్రాలు ప్రారంభించి 6.50 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. త్వరలో మిగతా వాటిని తెరుస్తాం.
సాక్షి : రైతులకు మద్దతు ధర కల్పించేందుకు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు..?
జేసీ : రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటించింది. గ్రేడ్ -ఏ రకానికి రూ.1400, సాధారణ రకం రూ.1360 చెల్లించేలా చర్యలు చేపడుతున్నాం. దళారులకు అమ్మకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అమ్మేలా రైతులకు అవగాహన కల్పిస్తున్నాం.
అర్హులందరికీ ‘ఆసరా’
Published Thu, Nov 20 2014 2:58 AM | Last Updated on Thu, Oct 4 2018 5:10 PM
Advertisement