సాక్షి, ఖమ్మం: జిల్లాలో పింఛన్ల (ఆసరా) పంపిణీ తొలిరోజు ఆందోళనలు మిన్నంటాయి. అర్హులైన తమ పేర్లు జాబితాలో లేవని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తంచేశారు. మండల కేంద్రాల్లోని ఎంపీడీఓ కార్యాలయాలకు చేరుకొని నిరసన తెలిపారు. బుధవారం ఖమ్మంరూరల్ మండలం పెద్దతండాలో కలెక్టర్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇక్కడ కూడా లబ్ధిదారులు జాబితాలో తమ పేర్లు లేవని ఆయనకు మొర పెట్టుకున్నారు.
గతంలో జాబితాలో పేరుండి పింఛన్ అందుకున్న వేలాది మంది లబ్ధిదారుల ఆశలు అడియాశలయ్యాయి. వారనుకున్నట్టే జరిగింది. రెండు నెలలుగా పింఛన్ జాబితాలో తమపేరు ఉంటుందో.. లేదోనని ఎదురుచూశారు. చివరకు జాబితాలో పేర్లు లేకపోవడంతో ఆందోళనతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో పలు మండలాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. కూసుమంచి మండలం గంగబండ తండాకు చెందిన 50 మంది లబ్ధిదారులు తమ పేర్లు జాబితాలో లేవని మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకొని ఆందోళన చేశారు.
అర్హులకు పింఛన్లు రాలేదని తిరుమలాయపాలెం మండలం కేంద్రంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో వరంగల్- ఖమ్మం రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. పెద్దతండాలో కలెక్టర్ పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి హాజరు కాగా కొంతమంది లబ్ధిదారులు తమకు పింఛన్ రాలేదని మొరపెట్టుకున్నారు. పునర్విచారణ చేసి అర్హులైన వారిని గుర్తించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
జాబితా తారుమారు..
రఘునాథపాలెం మండలంలో అసరా పథకం గందరగోళంగా మారింది. మండలంలోని కొన్ని గ్రామ పంచాయతీలకు చెందిన ఆసరా లబ్ధిదారులు తమ పంచాయతీ జాబితాకు బదులు పక్క పంచాయతీల్లో నమోదు అయ్యాయి. ఇలా చింతగుర్తి, మల్లేపల్లి, కోయచెలక, రేగులచెలక పంచాయతీల పరిధిలో ఇలాంటి అస్తవ్యస్తతే నెలకొంది. కొత్తగూడెం మున్సిపాలిటీలో అర్హులకు ఫించన్ మంజూరు కాలేదని మున్సిపల్ కౌన్సిలర్లు ఆందోళన నిర్వహించారు. 17, 18 వార్డుల కౌన్సిలర్లు దుంపల అనురాధ, దుంపల సరోజలు అర్హులకు ఫించన్లు మంజూరు చేయని పక్షంలో తమ పదవులకు రాజీనామా చేస్తామని కమిషనర్‌ను హెచ్చరించారు.
పినపాక నియోజకవర్గంలోని అన్ని మండలాల పంచాయతీ కేంద్రాల వద్దకు వృద్ధులు, వికలాంగులు, వితంతువులు చేరుకున్నారు. కార్యాలయం తెరవకముందే వారు వ్యయప్రయాసలతో అక్కడకు చేరుకున్నారు. కార్యాలయాలకు వచ్చిన అధికారినల్లా ‘నా పింఛన్ వచ్చిందా? సారూ..’ అని ప్రశ్నించారు. ‘ఇంకా రాలేదు.. ఇప్పుడే ఎందుకు వచ్చారంటూ’ అధికారుల చీదరింపులతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సత్తుపల్లి నియోజకవర్గంలో పింఛన్ల జాబితా సాయంత్రం 5 గంటలకు విడుదల చేశారు. ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పింఛన్లు అందని అర్హులతో వేంసూరు ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. కొణిజర్ల మండలంలో పలు గ్రామాల్లో పదుల సంఖ్యలో అర్హుల పేర్లు జాబితాలో లేకపోవడంతో వారంతా తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. చిన్నగోపతికి చెందిన 60 మంది అర్హులకు పించన్లు రాలేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మేమే ఇప్పించాం..
ఖమ్మం నగరంతో పాటు కొత్తగూడెం, సత్తుపల్లి పట్టణాల్లో పింఛన్ జాబితాలు ప్రకటించడంతో ‘మీమే మీకు పింఛన్ ఇప్పిస్తున్నామని’ చోటామోటా నాయకులు గల్లీలో ప్రచారం చేశారు. పలువురు అర్హులు తమపేర్లు జాబితాలో ఎందుకు లేవని వారిని నిలదీయడంతో వారికి సమాధానం చెప్పలేక జారుకున్నారు. ఖమ్మం నగరంలో పంపింగ్ వెల్ రోడ్డు, గాంధీచౌక్, రాపర్తినగర్, ఇందిరాగనర్ ప్రాంతాల్లో ఇలా అర్హులు నేతలను నిలదీశారు. దరఖాస్తు సమయంలో రాజకీయం చేసిన పార్టీలు ఇప్పుడు అర్హులు తమకు పింఛన్ రాలేదని నిలదీస్తుండడంతో మొఖం చాటేస్తుండడం గమనార్హం. ఇక కొన్ని మండలాల్లో ఇంకా పింఛన్ జాబితాలు విడుదల చేయకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.
‘ఆసరా’ ఆగమాగం
Published Thu, Dec 11 2014 4:25 AM | Last Updated on Mon, Aug 20 2018 6:02 PM
Advertisement
Advertisement