Thermal power project
-
భూమి పాయే.. బతుకూ పోయే..
భూమితో రైతుకు విడదీయలేని బంధం. మట్టిని పెకళించి.. స్వేదం చిందించి.. సేద్యం చేసే రైతు తన భూమిని కన్నతల్లి కంటే మిన్నగా భావిస్తాడు. అటువంటి భూమిని నమ్ముకుని బతికే అన్నదాతలు తమ బిడ్డల భవిష్యత్‌ను కాంక్షించి పారిశ్రామిక అవసరాల కోసం అమ్ముకున్నారు. ఆ రోజు ప్రభుత్వం పదో పరకో ఇచ్చి కొనుగోలు చేసిన భూములను కార్పొరేట్ సంస్థకు అప్పగించింది. భూమిపోయినా.. బతుకుపోయినా.. భవిష్యత్ ఉంటుందని భావించిన రైతుల ఆశలు పదిహేడేళ్లుగా పగటి కలగా మిగిలిపోయాయి. రూ.కోట్లు పలుకుతున్న తమ భూములు కళ్ల ముందు నిర్జీవంగా పడి ఉండడం చూసి అన్నదాతలు కుమిలిపోతున్నారు. ముత్తుకూరు: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి(YS Raja sekhara Reddy) పారిశ్రామికాభివృద్ధిని కొత్త పుంతలు తొక్కించారు. వైఎస్సార్ సీఎం కాక ముందు వరకు చీకటి ఆంధ్రప్రదేశ్‌గా ఉండేది. రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలని, విద్యుత్ కోతలు, కొరత లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వ రంగంతోపాటు ప్రైవేట్ రంగంలో విద్యుత్ ప్రాజెక్ట్‌లు(Power projects) ఏర్పాటు చేయాలని యోచన చేశారు. అందులో భాగంగా ముత్తుకూరు మండలం నేలటూరులో ప్రభుత్వ రంగ జెన్కో విద్యుత్ ప్రాజెక్ట్‌లకు వైఎస్సార్ శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో కోస్టల్ ఆంధ్ర పవర్ లిమిటెడ్ పేరుతో రిలయన్స్ సంస్థ(Reliance Industries) రిలయన్స్ పవర్స్ యాజమాన్యం కృష్ణపట్నంలో 3,960 మెగావాట్ల రిలయన్స్ అ్రల్టామెగా థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందు కోసం 2007లో ప్రభుత్వం భూసేకరణ చేపట్టింది. ఎకరాకు రూ.7.70 లక్షల పరిహారం రిలయన్స్ విద్యుత్ ప్రాజెక్ట్ కోసం రైతుల నుంచి మాగాణి, మెట్ట భూములే కాకుండా దేవాలయాలు, సీజేఎఫ్ఎస్ భూములు మొత్తం 2,668 ఎకరాలు సేకరించారు. అయితే అప్పట్లో పట్టా భూములు ఎకరాకు రూ.7.70 లక్షల పరిహారంగా ఇచ్చారు. భూమి సేకరించినప్పుడు ప్రభుత్వం ఇచ్చిన పదో పరకో అప్పుడే ఖర్చయిపోయాయి. అదే భూములు కొద్ది రోజులకే రూ.కోట్లు పలికాయి. ఈ ప్రాజెక్ట్ కోసం అయ్యవారప్పకండ్రిగ, శంభునితోపు గ్రామాలను సైతం ఖాళీ చేయించి, ముత్తుకూరు సమీపంలో పునరావాస కాలనీలు ఏర్పాటు చేశారు. ముక్కారు పంటలు పండే భూములను రైతులు పారిశ్రామికాభివృద్ధి కోసం త్యాగం చేశారు. ఆ భూమి మీదనే బతికే రైతులు భూములు పోయినా.. తమ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి.. బంగారు భవిష్యత్ ఉంటుందని భావించారు. కానీ భూములు పోయి.. బతుకు పోయి.. భవిష్యత్ కానరాక రైతు కుటుంబాలు కూలీలుగా మారారు. అర్ధాంతరంగా నిలిచిపోయిన ప్రాజెక్ట్ రూ.20,000 కోట్ల అంచనాలతో ప్రాజెక్ట్ పనులు 2008లో ప్రారంభమయ్యాయి. ప్రాజెక్టు చుట్టూ ఎత్తైన గోడ నిర్మాణం పూర్తి చేశారు. ప్రత్యేక రోడ్లు నిర్మించారు. పెద్ద పెద్ద అడ్మిని్రస్టేషన్ భవనాలు నిర్మించారు. పెద్ద ఎత్తున యంత్రాలు, పరికరాలను దిగుమతి చేసుకొన్నారు. యజమాని అనిల్ అంబానీ పర్యటన కోసం హెలిప్యాడ్ కూడా ఏర్పాటు చేశారు. అ్రల్టామెగా పవర్ ప్రాజెక్ట్ నిబంధనల ప్రకారం విద్యుత్ ఉత్పత్తిలో ఆంధ్ర (ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు)కు 40 శాతం, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రకు 20 శాతం చొప్పున విద్యుత్ పంపిణీ జరగాలని ఒప్పందాలు కుదిరాయి. భూములు తిరిగి రైతులకు ఇచ్చేయాలి పశి్చమబెంగాల్ సింగూరులో ప్రాజెక్ట్ కోసం సేకరించిన భూముల్లో పరిశ్రమలు ఏర్పాటు కాకపోవడంతో అక్కడి ప్రభుత్వం గతంలో తిరిగి రైతుల పరం చేసింది. ఆ తరహాలోనే రిలయన్స్ ప్రాజెక్ట్ కోసం సేకరించిన భూముల్ని కూడా రైతులకు స్వాదీనం చేయాలని సర్వేపల్లి ఎమ్మెల్యే హోదాలో గతంలో కాకాణి గోవర్ధన్‌రెడ్డి పలుమార్లు డిమాండ్ చేశారు. స్థానిక నాయకులతో కలిసి ప్రాజెక్ట్‌ను పరిశీలించారు. చట్ట ప్రకారం రైతుల భూముల్లో ప్రాజెక్ట్ ఏర్పాటు చేయకుంటే వాటిని తిరిగి రైతుల పరం చేయాలని ఆందోళన చేశారు. కానీ దాదాపు 17 ఏళ్లు గడుస్తున్నా.. ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. తిరిగి భూములు రైతుల పరం కాలేదు. ఈ నేపథ్యంలో ఇటీవల రిలయన్స్ అధినేత అనిల్ అంబానీ కృష్ణపట్నంలోని భూములను స్వయంగా పరిశీలించారు. దీంతో స్థానికంగా ఆశలు చిగురిస్తున్నాయి. ఈ భూముల్లో కొత్త పరిశ్రమలు వస్తాయని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగు పడతాయని, గ్రామం అభివృద్ధి చెందుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.అనూహ్యంగా రైతు బతుకు తలకిందులు పనులు వేగంగా జరుగుతున్న దశలో ఎంఓయూలో చేసుకున్న ఒప్పందాలకు–వాస్తవ పరిస్థితులకు మధ్య తలెత్తిన తేడా వల్ల 2011లో అనూహ్యంగా ప్రాజెక్ట్ పనులు నిలిచిపోయాయి. ఈ పరిణామాలతో భూములిచ్చిన కృష్ణపట్నం పంచాయతీ రైతులు హతాశులయ్యారు. భూముల పరిహారంగా పుచ్చుకున్న డబ్బు కరిగిపోయింది. ప్రాజెక్టు ద్వారా ఉపాధి, ఉద్యోగావకాశాలు పొందవచ్చని భావించిన రైతులు, యువకుల ఆశలు అడియాశలయ్యాయి. సన్న, చిన్నకారు రైతులు కూలీలుగా మారారు. పునరావాస కాలనీల్లో అభివృద్ధి పడకేసింది.కృష్ణపట్నం పంచాయతీ అభివృద్ధి జరగాలి ప్రాజెక్ట్‌ల కోసం భూములు సేకరించి, కృష్ణపట్నం చుట్టూ ప్రహరీ నిర్మించారు. ప్రాజెక్ట్‌లు రాకపోవడం వల్ల అటు రైతులకు వ్యవసాయం, ఇటు యువతకు ఉద్యోగాలు కరువయ్యాయి. పేదలు ఉపాధికి దూరమయ్యారు. రిలయన్స్ కోసం సేకరించిన భూముల్లో కొత్త ప్రాజెక్ట్ ఏర్పాటు చేసి, యువతకు ఉద్యోగాలు, పేదలకు ఉపాధి కల్పించాలి. – కారంచేటి ప్రసాదశర్మ, ఎంపీటీసీ సభ్యుడు, కృష్ణపట్నం యువకులకు ఉద్యోగ కల్పన జరగాలి రిలయన్స్ థర్మల్ విద్యుత్ ప్రాజెక్ట్‌కు అనిల్ అంబానీ ఇటీవల వచ్చినట్లు తెలిసింది. ఈ ప్రాజెక్ట్ కోసం సేకరించిన భూముల్లో కాలుష్యం లేని పరిశ్రమలు ఏర్పాటు కావాలి. చదువుకున్న యువకులకు ఉద్యోగాల కల్పన జరగాలి. గ్రామం అన్ని విధాలా అభివృద్ధి జరగాలి. ప్రాజెక్ట్‌లు ఏర్పాటు కాకుంటే రైతులకు తిరిగి భూములు స్వాధీనం చేయాలి. – రాగాల వెంకటేశ్వర్లు, ఉపసర్పంచ్, కృష్ణపట్నం -
పనుల్లో నిర్లక్ష్యాన్ని ఉపేక్షించం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని, ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద నిర్మాణంలో ఉన్న యాదాద్రి థర్మల్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్‌ను శనివారం మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి సందర్శించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ విద్యుత్ ప్లాంట్‌కు సంబంధించి ఇప్పటికే రెండుసార్లు అంచనా వ్యయాలు పెంచడంతో బడ్జెట్ భారీగా పెరిగిందని, ఫలితంగా రాష్ట్ర ఖజానాకు భారంగా మారిందన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయకపోతే మోయలేని భారంగా పరిణమిస్తుందన్నారు. ప్రాజెక్టు పూర్తికి ప్రభుత్వ సహకారం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం ఉంటుందని భట్టి విక్రమార్క హామీనిచ్చారు. ప్రాజెక్టు ద్వారా స్థానికంగా ఉన్న స్కిల్డ్, అన్ స్కిల్డ్ నిరుద్యోగులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించే అంశంపై ఆలోచించాలన్నారు. బీహెచ్ఈఎల్ పేరున్న ప్రభుత్వ రంగ సంస్థ అని యాదాద్రి పనులు త్వరగా పూర్తి చేయకపోతే ఆ సంస్థకు చెడ్డపేరు వస్తుందన్న విషయాన్ని సంస్థ అధికారులు, ఇంజనీర్లు దృష్టిలో పెట్టుకోవాలన్నారు. సెప్టెంబర్ నాటికి 1,600 మెగావాట్ల విద్యుత్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో రెండు యూనిట్ల ద్వారా 1,600 మెగావాట్ల విద్యుత్ పూర్తిస్థాయిలో ఉత్పత్తి చేస్తామని అధికారులు వివరించారు. 2025 మార్చి నాటికి మొత్తం ఐదు యూనిట్ల ద్వారా నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి తెస్తామని అధికారులు మంత్రులకు చెప్పుకొచ్చారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్న నేపథ్యంలో జీరో పర్సంట్ ధూళి బయటికి వెళ్లకుండా నిర్మాణం జరుగుతుందని అధికారులు వివరించారు. అలాగే స్థానికంగా వినియోగించే నీటిని తిరిగి శుద్ధి చేసి ప్రాజెక్టు అవసరాలకే వినియోగిస్తామని తెలిపారు. రుణాలపై ఆరా.. ప్రాజెక్టు నిర్మాణానికి తీసుకున్న రుణాలు, వాటి వడ్డీ రేట్ల గురించి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధికారులను ప్రశ్నించారు. కమర్షియల్ బ్యాంకుల కన్నా ఎక్కువ వడ్డీ రేటు ఉంటే దానిని తగ్గించాలని కోరే అవకాశం ఉందని చెప్పా రు. స్థానికులకే ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా, సబ్ కాంట్రాక్టులు, ఇతర చిన్నచిన్న పనుల్లో స్థానికులకు అవకాశం కల్పించడం ద్వారా చేయూతనివ్వాలని మంత్రి కోమటిరెడ్డి అధికారులను కోరారు. ప్రస్తుతం పవర్ ప్లాంట్‌లో జరుగుతున్న అన్ని రకాల అభివృద్ధి పనులను వీడియో ప్రజెంటేషన్ రూపంలో మంత్రుల బృందానికి వివరించారు. సమావేశంలో విద్యుత్ శాఖ సీఎండీ సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీ, ట్రాన్స్‌కో డైరెక్టర్ అజయ్, పవర్ ప్లాంట్ సీఈ సమ్మయ్య పాల్గొన్నారు. -
ఎన్టీపీసీ విద్యుత్ కేంద్రంలో భారీ లోపం
సాక్షి, హైదరాబాద్: నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(ఎన్టీపీసీ) ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా రామగుండంలో 1600 (2x800) మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టులో భారీ లోపం బయటపడింది. విద్యుత్ కేంద్రంలోని 800 మెగావాట్ల తొలి యూనిట్ నిర్మాణం పూర్తయినా బాయిలర్‌లోని రీహీటర్ ట్యూబ్స్ విఫలం కావడంతో గత డిసెంబర్లో జరగాల్సిన ట్రయల్ రన్ వాయిదా పడింది. మరమ్మతుల్లో భాగంగా ఈ గొట్టాలకు లోపాలున్న చోట కట్ చేసి వెల్డింగ్ చేస్తున్నారు. ఏకంగా 7,500 చోట్ల వెల్డింగ్ చేస్తున్నారని, ఇందుకు మరో నెల రోజుల సమయం పట్టనుందని అధికార వర్గాలు తెలిపాయి. ఆలోగా మరమ్మతులు పూర్తయితే మార్చిలో తొలి యూనిట్ ద్వారా ప్రయోగాత్మకంగా విద్యుదుత్పత్తి జరిపి ట్రయల్ రన్ నిర్వహించే అవకాశాలున్నాయి. రీహీటర్ ట్యూబులే కీలకం థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో హై ప్రెషర్, ఇంటర్మీడియేటరీ ప్రెషర్, లో ప్రెషర్ టర్బైన్లు ఉంటాయి. బాయిలర్లలో వేడిచేసిన నీళ్లు ఆవిరిగా మారి 600 సెంటిగ్రేడ్ల ఉష్ణోగ్రత, భారీ పీడనంతో గొట్టాల ద్వారా ‘హైప్రెషర్ టర్బైన్’లోకి ప్రవేశించి దాన్ని తిప్పుతూ మళ్లీ వెనక్కి మళ్లుతుంది. బాయిలర్‌లోకి తిరిగి చేరే సమయానికి ఆవిరి ఉష్ణోగ్రత 300 సెంటిగ్రేడ్లకు పడిపోతుంది. రీహిటర్ ట్యూబ్స్‌లో మళ్లీ 600 సెంటిగ్రేడ్లకు వేడెక్కిన తర్వాత ‘ఇంటర్మీడియేటరీ ప్రెషర్ టర్బైన్’లోకి గొట్టాల ద్వారా ఆవిరి ప్రవేశించి దాన్నీ తిప్పుతూ చివరకు ‘లోప్రెషర్ టర్బైన్ ’లోకి చేరుతుంది. అక్కడ చల్లబడిన ఆవిరి మళ్లీ బాయిలర్‌లోకి నీళ్ల రూపంలో ప్రవేశిస్తుంది. మళ్లీ ఆవిరిగా మారి ‘హై ప్రెషర్ టర్బైన్’లోకి ప్రవేశిస్తుంది. ఈ ప్రక్రియ అంతా ఒక లూప్గా జరుగుతుంది. నీళ్లు రీసైకిల్ అవుతూ ఉంటాయి. నాసిరకం గొట్టాలతో సమస్యే ఆవిరి టర్బైన్లను తిప్పడం ద్వారా వెలువడే యాంత్రికశక్తిని ఎలక్ట్రిక్ జనరేటర్ విద్యుచ్ఛక్తిగా మార్చుతుంది. ఈ ప్రక్రియలో కీలకమైన ‘రీహీటర్ ట్యూబ్స్’లో నాణ్యత లేకుంటే అవి 600 సెంటిగ్రేడ్ల ఉష్ణోగ్రతలతోపాటు తీవ్ర పీడనాన్ని తట్టుకోవడం సాధ్యం కాదు. నాసిరకం ముడిసరుకుతో తయారైన గొట్టాలు తరచూ కోతకు గురికావడం, తుప్పుపట్టడం జరుగుతుందని నిపుణులు అంటున్నారు. దీంతో ఆవిరి ఉష్ణోగ్రతలు పడిపోయి విద్యుదుత్పత్తి నిలిచిపోతుందని చెబుతున్నారు. రీహీటర్ ట్యూబ్స్‌లో వచ్చే సమస్యలతోనే థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తికి అధిక శాతం అంతరాయాలు కలుగుతాయి. దక్షిణ కొరియా నుంచి దిగుమతి చేసుకున్న గొట్టాలను ఎన్టీపీసీ వినియోగించినా విఫలం కావడంపట్ల నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి వెల్డింగ్ చేసి మరమ్మతులు చేసినా భవిష్యత్తులో అవి మళ్లీ విఫలమయ్యే అవకాశముందని పేర్కొంటున్నారు. రీహీటర్ గొట్టాలకు లీకేజీలతో గత డిసెంబర్లో నిర్వహించాల్సిన తొలి యూనిట్ సింక్రనైజేషన్ ప్రక్రియ వాయిదా పడింది. నిర్మాణ జాప్యంతో రాష్ట్రంపై భారం తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టులోని తొలి యూనిట్ నుంచి 2020 జూన్‌లో, రెండో యూనిట్ నుంచి 2020 నవంబర్ నాటికి వాణిజ్యపరంగా విద్యుదుత్పత్తి (సీఓడీ) ప్రారంభం కావాల్సి ఉంది. కానీ నిర్మాణంలో జాప్యంతో తొలి యూనిట్ గడువును 2023 మార్చి, రెండో యూనిట్ గడువును 2023 జూలైకు ఎన్టీపీసీ పొడిగించింది. రీహీటర్ ట్యూబ్స్ విఫలం కాకుంటే గత జనవరి నాటికి తొలి యూనిట్, మార్చి నాటికి రెండో యూనిట్ అందుబాటులో కి వచ్చేదని అధికార వర్గాలు తెలిపాయి. వేసవి విద్యుత్ అవసరాల కోసం ప్రస్తుతం రాష్ట్రం ఒక్కో యూనిట్‌ను సగటున రూ.7.20 ధరకు నిత్యం రూ.60 కోట్ల విలువైన విద్యుత్‌ను ఎక్ఛ్సేంజీల నుంచి కొంటోంది. ఎన్టీపీసీ విద్యుత్ కేంద్రం సకాలంలో పూర్తై ఉంటే యూనిట్‌కు రూ. 5 ధరతో విద్యుత్ లభించేది. దీంతో అధిక ధర విద్యుత్ కొనుగోళ్ల భారం తప్పేదని, ప్రస్తుత ఫిబ్రవరిలోనే రూ.50 కోట్ల మేర ఆదా అయ్యేవని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. -
ఎన్టీపీసీ రెండవ యూనిట్లో సాంకేతిక లోపం
సాక్షి, విశాఖపట్నం: సింహాద్రి సూపర్ ధర్మల్ పవర్ ప్రాజెక్టు (ఎన్టీపీసీ)లో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా మంగళవార ప్రాజెక్టులోని రెండవ యూనిట్లో విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. దీంతో మంగళవారం మధ్యాహ్నం నుంచి అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఫలితంగా 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం సింహాద్రిలో మూడవ యూనిట్ నుంచి మాత్రమే 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. కాగా సింహాద్రిలో ఇప్పటికే ఒకటో యూనిట్, నాలుగో యూనిట్లలో సాంకేతిక కారణాలతో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోగా.. నేడు మరో యూనిట్లో సాంకేతిక లోపంతో ఉత్పత్తి నిలిచిపోయింది. దీని పునరుద్దరణకు సాంకేతిక సిబ్బంది మరమ్మత్తులు చేస్తున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. చదవండి: పరిశ్రమలకు ఊరట, ఉద్యోగులకు షాక్ -
బంగారు తెలంగాణలో సింగరేణి
-
లింకు తెగింది
► భూపాలపల్లిలో బొగ్గు ఉన్నా ► రామగుండం నుంచి రవాణా ► బొగ్గు దిగుమతిలో అడ్డదారులు ► జెన్కోకు కోట్లలో రవాణా భారం కోల్‌బెల్ట్(వరంగల్) : భూపాలపల్లి ఏరియా గనులలో ఉత్పత్తి అవుతున్న బొగ్గును సమీపంలోని కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి కోసం తీసుకోవడానికి టీఎస్ జెన్కో సింగరేణి యాజమాన్యంతో లింకేజీ కుదుర్చుంది. ఒప్పం ద నియమాలకు విరుద్ధంగా కేటీపీపీ అధికారులు వ్యవహరించడంతో జెన్కోపై సుమారు రూ.34కోట్లు అదనపు భారం పడింది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నారు. బొగ్గు, నీటి వనరులు అందుబాటులో ఉండడంతో తక్కువ ఖర్చుతో విద్యుత్ ఉత్పతి చేయవచ్చని వరంగల్ జిల్లా చెల్పూర్ సమీపంలో ప్రభుత్వ రంగంలో థర్మల్ పవర్ ప్రాజెక్టును ఏర్పాటు చేశారు. ఇందుకు భూపాపల్లి ఏరియూ గనుల నుంచి ఉత్పత్తి అరుున బొగ్గు తీసుకోవడానికి టీఎస్ జెన్కో, సింగరేణి మధ్య కోల్ లిం కేజీ ఒప్పందం జరిగింది. దాని ప్రకారం జి-11 గ్రేడ్ బొగ్గును టన్నుకు రూ.1300 చొప్పున ఇస్తున్నారు. 2015-16 ఆర్థిక సంవత్సరంలో రోజుకు సుమారు 10వేల టన్నుల చొప్పున మొత్తం 22లక్షల టన్నులు తీసుకోవాల్సి ఉంది. కేటీపీపీ ఇప్పటి వరకు 16,91,831 టన్నులు దిగుమతి చేసుకుంది. ఆర్థిక సంవత్సరం ముగి యడానికి 13 రోజులు మాత్రమే ఉంది. ఇంకా సుమారు 5లక్షల టన్నులు తీసుకోవాలి. ఏరి యాలోని గనుల వద్ద 1.1 మిలియన్ టన్నుల బొగ్గు ఉంది. అయినా కేటీపీపీ అధికారులు అదే గ్రేడ్ బొగ్గును రామగుండం ఏరియా జీడీకే-1 సీహెచ్‌పీ నుంచి 3,66,658 టన్నులు దిగుమతి చేసుకున్నారు. భూపాలపల్లి గనుల నుంచి కేటీపీపీకి 14 కిలోమీటర్ల దూరం ఉంది. ఇక్కడి నుంచి బొగ్గు దిగుమతి చేసుకుంటే రవా ణా ఖర్చు టన్నుకు రూ.5.85 పైసలు మాత్రమే అవుతుంది. జీడీకే సీహెచ్‌పీ నుంచి రైలు వ్యాగన్ల ద్వారా ఉప్పల్ వరకు రవాణా చేసిన బొగ్గు ను అక్కడ డంప్ చేసి తిరిగి రోడ్డు మార్గంలో 60కిలోమీటర్ల దూరంలోని కేటీపీపీకి తరలిం చారు. ఇలా చేయడం వల్ల లోడింగ్ అన్లోడింగ్ చార్జీలతో కలుపుకుని టన్నుకు రూ.900 చొప్పున సుమారు రూ.34కోట్ల రవాణా భారం అదనంగా పడినట్లు సమాచారం. అందుబాటులో ఉన్నా.. భూపాలపల్లిలో నిల్వలు పెరిగి పోవడంతో ఓపెన్మార్కెట్లో విక్రరుుంచడానికి మూడు నెలల క్రితం టెండర్ ద్వారా రామగుండం ఓసీపీ-3 సీహెచ్‌పీకి 3,78,229 టన్నులు రవాణా చేశారు. అదే బొగ్గు ఈ ఏడాది జనవరి 10న 4067 టన్నులు కేటీపీపీకి పంపించారు. రామగుండం, మణుగూరు నుంచి జీ-5గ్రేడ్ బొగ్గును సైతం దిగుమతి చేసుకుంటున్నారు. జీ-5 గ్రేడ్ భూపాలపల్లిలోనూ ఉత్పత్తి అవుతోంది. దగ్గరలో ఉన్న బొగ్గును తీసుకోకుండా దూర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవడాన్ని బట్టి చూస్తే బొగ్గు రవాణాలో అధికారుల తీరు స్పష్టమవుతోంది. ఇదిలా ఉండగా భూపాలపల్లి నుంచి రామగుండంకు బొగ్గు రవాణా చేసే కాంట్రాక్టర్, ఉప్పల్ నుంచి కేటీపీపీ బొగ్గు రవాణా చేసే కాంట్రాక్టర్ ఒక్కరే కావటం గమనార్హం. అంతా కుమ్మకై అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కేటీపీపీ వారే తీసుకుపోవడం లేదు ఏరియా గనుల నుంచి జి-11 గ్రేడ్ బొగ్గు రోజుకు 7వేల టన్నులు ఉత్పత్తి అవుతోంది. ఇప్పటికే 9 లక్షల టన్నులు నిల్వ ఉంది. లింకేజీ ప్రకారం కేటీపీపీకి సరఫరా చేయటానికి ఎటువంటి ఇబ్బందులు లేదు. సత్వర రవాణాకు అత్యాధునిక వేరుుంగ్ బ్రిడ్జిలతోపాటు షావల్, డంపర్, లోడర్ యంత్రాలను సైతం సమకూర్చాం. అరుునా వారు తీసుకుపోవడం లేదు. - పి.సత్తయ్య, సింగరేణి ఏరియూ జీఎం, భూపాలపలి -
దామరచర్లలో హెచ్ఆర్ఎఫ్ ధర్నా
నల్లగొండ జిల్లా దామచర్ల మండలం వీర్లపాలెం వద్ద తెలంగాణ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన భారీ థర్మల్ విద్యుత్ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ రాష్ట్ర మానవ హక్కుల వేదిక ప్రచారం ప్రారంభించింది. విద్యుత్ ప్రాజెక్టు వల్ల కలిగే అనర్థాల గురించి ప్రభావిత గ్రామాల్లోని ప్రజలకు వేదిక నాయకులు వివరిస్తున్నారు. థర్మల్‌కు ప్రత్యామ్నాయంగా సోలార్ విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వేదిక రాష్ట్ర అధ్యక్షుడు జీవన్‌కుమార్, ప్రధాన కార్యదర్శి కృష్ణ, కార్యదర్శి మోహన్ జిల్లా నాయకులు, పర్యావరణ వేత్త బాబూరావు తదితరులు పాల్గొన్నారు. -
పర్యావరణ పరిరక్షణ చట్టానికి తూట్లు
శ్రీకాకుళం అర్బన్: సంతబొమ్మాళి మండలం కాకరాపల్లి ఈస్ట్‌కోస్ట్ థర్మల్ ప్రాజెక్టు యాజమాన్యం పర్యావరణ పరిరక్షణ చట్టాన్ని ఉల్లంఘిస్తోందని కాకరాపల్లి థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు వ్యతిరేక పోరాట కమిటీ ప్రతినిధులు ధ్వజమెత్తారు. శ్రీకాకుళంలోని ఎన్జీవో కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పోరాట కమిటీ ప్రతినిధి తాండ్ర ప్రకాష్ మాట్లాడారు. కాకరాపల్లి ఈస్ట్‌కోస్ట్ థర్మల్ ప్లాంట్ యాజమాన్యం సాగిస్తున్న చట్టవిరుద్ధ నిర్మాణాలను క్రమబద్ధీకరించడానికి పర్యావరణ మంత్రిత్వశాఖ ఐదుగురితో సబ్‌కమిటీని నియమించడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. కాకరాపల్లి ఈస్ట్‌కోస్ట్ థర్మల్ ప్లాంట్ యాజమాన్యం మొదటి నుంచి అబద్దాలతో, మోసాలతో పాలకపార్టీల నాయకులను లోబరుచుకోవడం, అధికారులను లొంగదీసుకోవడం, చట్టవిరుద్ధ చర్యలను యథేచ్ఛగా సాగించడం వంటివి చేస్తోందన్నారు. పంట భూములు, చిత్తడి నేలల్లో ప్లాంట్లు కట్టరాదనే ప్రభుత్వాల జీవోలను ఉల్లంఘించిందన్నారు. పెద్ద ఎత్తన తాగునీటిని, సాగునీటిని అందిస్తూ, వేలాది మత్స్యకారుల కుటుంబాలకు జీవనోపాధి కల్పిస్తూ వస్తున్న చిత్తడి నేలల్లో బీల భూములను భంజరు భూములుగా చూపిస్తూ ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. పోరాట కమిటీ ప్రతినిధి ఎ.హన్నూరావు మాట్లాడుతూ ప్లాంట్ నిర్మాణంతో వేలాది ఎకరాల్లో ఉప్పు పండించే 10 వేల మంది రైతులు జీవనాధారం కోల్పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు.థర్మల్‌ప్లాంట్ ప్రభావం మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న తేలినీలాపురం వలస పక్షుల విడిది కేంద్రంపై పడే ప్రమాదం ఉందన్నారు. పర్యావరణ అనుమతి ఉల్లంఘనను క్రమబద్ధీకరించుకునేందుకు ఐదుగురితో సబ్‌కమిటీని రూపొందించుకుందని విమర్శించారు. ఈ కమిటీ ఈనెల 24వ తేదీ సాయంత్రం 5గంటలకు విశాఖపట్టణం చేరుకుని 25, 26 తేదీల్లో పరిశీలనకు రానున్నదని పేర్కొన్నారు. బాదిత రైతాంగం, మత్స్యకారులు, ఉప్పురైతులు, పర్యావరణకారులు, మేధావులు స్పందించి ఈ సబ్ కమిటీకి వాస్తవాలను వివరించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పోరాటకమిటీ ప్రతినిధులు ఎం.నరసింగరావు, ఎన్.వెంకటరావు, ఎన్.ఎస్.విజయ్‌కుమార్, కె .వి.జగన్నాథరావు, మార్పు మల్లేశ్వరరావు, పోరాట కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. -
మరో థర్మల్ పవర్
సాక్షి, విశాఖపట్నం: జిల్లాకు మరో థర్మల్ పవర్ ప్రాజెక్టు రానుంది. ఇప్పటికే పరవాడలో రెండు వేల మెగావాట్ల సామర్థ్యం కల ప్రాజెక్టు నడుస్తున్న నేపథ్యంలో మరో ప్రాజెక్టు దిశగా అడుగులు పడుతున్నాయి. అచ్యుతాపురం-రాంబిల్లి మండలాల మధ్య నిర్మితమయ్యే ఈ ప్రాజెక్టు ప్రతిపాదనల దశను దాటగలిగింది. అవసరమైన అనుమతులు పొందడంలో ముందడుగు వేసింది. తొలుత అభ్యంతరం వ్యక్తం చేసిన పర్యావరణ శాఖ కూడా చివరికి రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పచ్చజెండా ఊపింది. త్వరలోనే టెండర్ల ప్రక్రియ పూర్తి కానుంది. జూన్ తర్వాత నిర్మాణం ప్రారంభం కానుంది. ఈ భారీ పవర్‌ప్లాంటు పూర్తయితే 4వేల మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి రానుంది. దానిలో అధిక భాగం రాష్ట్ర ప్రయోజనాలకే వినియోగించనున్నారు. జిల్లాలోని అచ్యుతాపురం-రాంబిల్లి మండలాల మధ్య ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ నిర్మాణానికి లైన్ క్లియర్ అయ్యింది. ప్లాంట్ నిర్మాణానికి అవసరమైన పర్యావరణ అనుమతులను కేంద్రం రెండు రోజుల క్రితం మంజూరు చేసింది. మే నాటికి పర్యావరణ శాఖ అనుమతులకు సంబంధించిన పర్యావరణ ప్రభావిత నివేదికను కేంద్రానికి సమర్పించనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న విద్యుత్ ప్లాంట్లలో గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఆశించిన స్థాయిలో ఉత్పత్తి చేయడం లేదు. శ్రీశైలం, సీలేరు, నాగార్జుల సాగర్ జల విద్యుత్ కేంద్రాలు మాత్రమే విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాయి. వాటిలో సీలేరు మినహా మిగతా రెండిటి విషయంలోనూ తెలంగాణతో వివాదాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖలో ఎన్టీపీసీ ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రానికి విద్యుత్ కష్టాలు తప్పుతాయని అధికారులు భావిస్తున్నారు. ఎన్టీపీసీ భారీ ప్రాజెక్టు 4వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం నిర్మించనున్నారు. ప్రాజెక్టుకు అవసరమైన 1200 ఎకరాల భూమిని ఏపీఐఐసీ కేటాయించింది. మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.26 కోట్లు కాగా దానిలో మెయిన్ ప్టాంటు వ్యయం రూ.20వేల కోట్లు. దాని నిర్మాణానికి ఇప్పటికే టెండర్లు పిలిచారు. పర్యావరణ నివేదిక తయారువుతుండగానే ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనున్నారు. ఆ ప్రక్రియ కూడా మే నెలలో ప్రారంభించున్నారు. జూన్ నాటికి టెండర్లు, ప్రజాభిప్రాయ సేకరణ, పర్యావరణ నివేదిక పూర్తిచేసి పనులు మొదలుపెట్టనున్నారు. సెప్టెంబర్ కల్లా ప్రాజెక్టు పూర్తి చేయాలని ప్రయత్నిస్తున్నారు. సాధారణంగా ఇక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్‌లో 20 శాతం స్థానిక అవసరాలకు వినియోగించి, మిగిలినది ఇతర రాష్ట్రాలకు ఇవ్వాల్సి ఉంటుంది. స్థానిక యువకులకు,నిపుణులకు కూడా ఉ పాధి లభిం చనుంది. -
చిగురిస్తున్న ‘పవర్’ ఆశలు
విద్యుత్ ప్లాంట్లకు నేడు పర్యావరణ అనుమతి! మెగావాట్‌కు 0.63 ఎకరాల భూమి.. రూ. 6.1కోట్ల ఖర్చు సాక్షి ప్రతినిధి, నల్లగొండ: నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలోని కృష్ణా నదితీరంలో నిర్మించ తలపెట్టిన థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుపై ఆశలు చిగురుస్తున్నాయి. ప్రాజెక్టుకు ప్రధాన అడ్డంకిగా భావించిన అటవీభూముల బదలాయింపు అంశం ఓ కొలిక్కి రావడం.. ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన నిధులను రుణంగా ఇచ్చేందుకు జాతీయ విద్యుత్ సంస్థలు కూడా అంగీకరించడంతో ప్రాజెక్టు పనులకు త్వరలోనే శంకుస్థాపన కూడా జరగనుందని జిల్లా యంత్రాంగం అంచనా వేస్తోంది. కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ ఈ ప్రాజెక్టుకు మంగళవారం అనుమతి ఇస్తుందన్న వార్తలు జిల్లా యంత్రాంగంలో, ఇక్కడి ప్రజల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ప్రతిపాదించి మూడు నెలలే.. వాస్తవానికి జిల్లాలోని దామరచర్ల మండలం వీర్లపాలెం, దిలావర్పూర్ అటవీ ప్రాంతంలో జెన్కో, ఎన్టీపీసీల ఆధ్వర్యంలో 6,800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం ప్రాజెక్టు నిర్మాణానికి అధికారులు అవసరమైన 8,700 ఎకరాలకు అదనంగా మరో 1,300 కలిపి మొత్తం 10 వేల ఎకరాలు సర్వే చేశారు. తగిన ప్రతిపాదనలను సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు. ఆ తర్వాత అటవీభూమికి పరిహారంగా ఇవ్వాల్సిన భూమిపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. జిల్లాలోని ప్రభుత్వ భూమిని సర్వే చేసి మొత్తం 14,500 ఎకరాలను గుర్తించింది. ఈ నివేదికను కూడా అటు రాష్ట్ర ప్రభుత్వానికి, ఇటు కేంద్ర అటవీ శాఖకు పంపింది. జిల్లాలోని 18 మండలాల్లో గుర్తించిన ఈ భూమిలో ప్రాజెక్టు నిర్మాణం కోసం తీసుకునే భూమికి పరిహారంగా అంతే భూమిని తీసుకోవచ్చని తెలిపింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ నుంచి ఆ ప్రతులు జనవరిలో బెంగళూరులోని ప్రాంతీయ కార్యాలయానికి వెళ్లాయి. అక్కడి నుంచి అధికారులు ఫిబ్రవరిలో వచ్చి జిల్లా యంత్రాంగం చూపిన భూములను పరిశీలించి తమ నివేదికను మళ్లీ కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖకు పంపారు. దీంతో అటవీభూముల బదలాయింపు ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చింది. 18 మండలాలు.. 6,300 ఎకరాలు ప్రాజెక్టు నిర్మాణానికి మొత్తం 6,300 ఎకరాలు కావాల్సి ఉంటుందని ప్రభుత్వ వర్గాలంటున్నాయి. ఈ మేరకు ఢిల్లీ నుంచి వచ్చిన విద్యుత్ అధికారులు చెప్పిన విధంగా మెగావాట్‌కు 0.67 ఎకరాల చొప్పున 6,800 మెగావాట్లకు 6,300 ఎకరాలు సరిపోతుందని అంచనా. అయితే, దామరచర్ల మండలంలో తీసుకోవాల్సిన ఈ భూమి అటవీభూమి కావడంతో దీనికి పరిహారంగా జిల్లాలోని 18 మండలాల్లో 14 వేల ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని గుర్తించారు. దేవరకొండ, చందంపేట, డిండి, మర్రిగూడ, నాంపల్లి, సంస్థాన్ నారాయణ్‌పూర్, పెదవూర, మిర్యాలగూడ, జాజిరెడ్డిగూడెం, నడిగూడెం, పెన్‌పహాడ్, తిరుమలగిరి, ఆత్మకూర్(ఎస్), సూర్యాపేట, భువనగిరి, రాజాపేట, తుర్కపల్లి, యాదగిరిగుట్ట మండలాల్లో గుర్తించిన ఈ భూముల నుంచి మొత్తం 6,300 ఎకరాలను అటవీశాఖకు బదలాయించనున్నారు. పైసలు కూడా ఇస్తామన్నారు: మరోవైపు ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన రూ.50 వేల కోట్లను సమకూర్చుకోవడంలో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ఇబ్బందులు తొలగిపోతున్నాయి. మొత్తం 6,800 మెగావాట్లకు గాను మెగావాట్‌కు రూ.6.1 కోట్ల చొప్పున మొత్తం రూ.42 వేల కోట్లు అవసరం కానున్నాయి. దీంతోపాటు 600 ఎకరాల్లో టౌన్షిప్ కూడా ఏర్పాటు చేయనున్నారు. టౌన్షిప్లో నివాస సముదాయాలతో పాటు పాఠశాల, ఆస్పత్రి తదితర మౌలిక సౌకర్యాలు కూడా కల్పించాలని డీపీఆర్‌లో పేర్కొన్నారు. ఈ టౌన్షిప్ ఏర్పాటుతోపాటు ఇతర అవసరాలకు రూ.50 వేల కోట్ల అవసరం కానున్నాయి. ఇందులో రూ.9 వేల కోట్లను ప్రాథమికంగా రుణంగా ఇచ్చేందుకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ) జెన్కోతో ఒప్పందం కూడా కుదుర్చుకుంది. మరో రూ.10 వేల కోట్లకు పైగా రుణం ఇచ్చేందుకు రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్ఈసీ) కూడా త్వరలోనే జెన్కోతో ఒప్పందం కుదుర్చుకోనుంది. ఈ నేపథ్యంలో విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన పర్యావరణ అనుమతి, నిధులు సమకూరనుండడంతో త్వరలోనే ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన జరుగుతుందని జిల్లా అధికారులు అంచనా వేస్తున్నారు. -
కృష్ణపట్నం ప్లాంటులో కార్యకలాపాలు షురూ:
థర్మల్ పవర్‌టెక్ కార్పొరేషన్ ఇండియా హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఏర్పాటు చేసిన విద్యుత్ ఉత్పత్తి ప్లాంటులో వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించినట్లు థర్మల్ పవర్‌టెక్ కార్పొరేషన్ ఇండియా (టీపీసీఐఎల్) వెల్లడించింది. 1,320 మెగావాట్ల సామర్ధ్యంతో తలపెట్టిన ఈ థర్మల్ పవర్ ప్రాజెక్టులో తొలిదశలో 660 మెగావాట్ల యూనిట్ అందుబాటులోకి వచ్చినట్లు వివరించింది. రెండో విడత కింద మరో 660 మెగావాట్ల యూనిట్ ఈ ఏడాది మూడో త్రైమాసికంలో అందుబాటులోకి రాగలదని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విద్యుత్ కొరతను పరిష్కరించేందుకు తమ ప్రాజెక్టు ఉపయోగపడగలదని టీపీసీఐఎల్ తెలిపింది. 25 సంవత్సరాల పాటు 500 మెగావాట్ల విద్యుత్ సరఫరా చేసే దిశగా ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఏ) కుదుర్చుకుంది టీపీసీఐఎల్. పర్యావరణ అనుకూల విధానాలతో విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు సూపర్‌క్రిటికల్ టెక్నాలజీని టీపీసీఐఎల్ వినియోగిస్తోంది. గాయత్రి ఎనర్జీ వెంచర్స్ (గాయత్రి ప్రాజెక్ట్స్‌లో భాగం), సింగపూర్‌కి చెందిన సెంబ్‌కార్ప్ కలిసి టీపీసీఐఎల్‌ను ఏర్పాటు చేశాయి. -
ఆర్టీపీపీలో దొంగలు పడ్డారు
ఎర్రగుంట్ల: మండల పరిధిలోని రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టులో ఉన్న వీవీరెడ్డి కాలనీలో శనివారం రాత్రి భారీ చోరీలు జరిగాయి. కాలనీలోని జీ టైప్ క్వార్టర్స్‌లో 9 ఇళ్లలో దొంగతనం జరి గింది. తాళాలు వేసిన ఇళ్లను మాత్రమే లక్ష్యంగా చేసుకుని పని కానిచ్చేశారు. కొన్ని ఇళ్లకు గడియలు కట్ చేసి, మరికొన్నింటికి చిలుకులు విరగ్గొట్టి, ఇంకొన్నింటికి తాళాలు పగుల కొట్టి బంగారు, నగదును అపహరించారు. ఆర్టీపీపీలో నిత్యం ఎస్పీఎఫ్ తిరుగుతున్నా, కట్టుదిట్టమైన భద్రత చర్యలు ఉన్నా కాలనీలోని క్వార్టర్స్‌లో భారీగా చోరీలు జరగడం ఇదే మొదటి సారి. జీ-టైప్‌లోని 103, 104, 106, 107, 110, 112, 116, 291, 314 ఇళ్లలో చోరీ చేశారు. ఇటీవల జువారిలో కాలనీలో జరిగిన మాదిరిగానే ఇక్కడ జరిగినట్టు పోలీ సులు, అధికారుల అభిప్రాయ పడుతున్నారు. సుమారు 45 తులాల బంగారు, అర్ధ కిలో వెండి చోరీ జరిగినట్లు ఎర్రగుంట్ల సీఐ పీటీ కేశవరెడ్డి తెలిపారు. జీ-టైపులోని 106 నంబరు గల ఇం టిలో సునీల్‌కుమార్‌రెడ్డి, సుమలత నివాసంటున్నారు. పని మీద సునీల్ కుమార్‌రెడ్డి తల్లితో కలసి సొంత ఊరికిపోయా రు. సుమలత తన అన్న ఇంటికి వెళ్లింది. దొంగలు పడి సుమారు 20 తులాల బంగారుతోపాటు రూ.20 వేల డబ్బులు తీసుకెళ్లినట్లు బాధితులు వాపోయారు. 107 ఇంటిలో దాస్ (జెపీఏ), ప్రభావతి నివాసంటున్నారు. శనివారం సొంత గ్రామమైన చిలంకూరుకు పోయినారు. ఈ ఇంటిలో రూ.2 వేలతో పాటు కమ్మలు దొంగిలించినట్లు వారు తెలిపారు. 110 నంబరు గల ఇల్లు కిరణ్‌కుమార్‌రెడ్డిది. ఇందులో 15 తులాలు బంగారు, అర్ధ కిలో వెండి పోయినట్లు ఆయన పేర్కొన్నారు. 104 నంబరు గల తన ఇంటిలో బంగారు హారం పోయిందని ప్రమీళ జ్వోతి తెలిపారు. 112 నంబరు గల ఇంటిలో రూ.5 వేల నగదుతోపాటు బంగారు పోయిందని పక్కీరమ్మ చెప్పారు. 103 నంబరు గల ఇంటిలో నివాసంటున్న లక్ష్మీదేవి దేవర ఉంటే ఊడగండ్లుకు పోయింది. ఈమె ఇంటిలో రెండు ఉంగరాలు, జత కమ్మలు, రెండు డాల ర్సు, రూ. 5 వేలు డబ్బులు పోయినవి. 291 నంబరు గల ఇంటిలో చిన్నమోషా నివాసంటున్నాడు. పని మీద తాడిపత్రికి పోయినాడు. ఈ ఇంటిలో సుమారు రూ45 వేలతో పాటు బంగారు పోయింది. 116 ఇంటిలో క్రిష్ణాప్రసాద్ ఉంటున్నాడు. ఈ ఇంటిలో కూడా బంగారు, డబ్బు పోయింది. 314 నంబరు గల ఇంటిలో ఎం.శంకర్ నివసిస్తున్నాడు. వీరింటిలో బంగారు పోయింది. పరిశీలించిన ఆర్టీపీపీ సీఈ, సీసీఎస్ డీఎస్పీ... ఆర్టీపీపీ సీఈ కుమార్బాబుతోపాటు కడప సీసీఎస్ డీఎస్పీ నాగేశ్వరరెడ్డి, సీఐ పీటీ కేశవరెడ్డి, సీఐ భాస్కర్‌రెడ్డి, ఎస్ఐలు హేమాద్రి, శ్రీనివాసులు చోరీలు జరిగిన ఇళ్లను పరిశీలించారు. చోరీ జరిగిన తీరును సీఐని అడిగి తెలుసుకున్నారు. ఇంటి తలుపులను ఏ విధంగా పగల కొట్టినారో పరి శీలించారు. ఇది అనుభవం గల దొంగల పని అని అభిప్రాయ పడ్డారు. అన్ని కోణా ల్లో పరిశీలిస్తామని పోలీసులు చెప్పారు. తరువాత కడప నుంచి వచ్చిన క్లూస్‌టీం సిబ్బంది 9 ఇళ్లలో పడిన వేలిముద్రలను సేకరించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ హేమాద్రి తెలిపారు. సరస్వతీ శిశు మందిరం వద్ద ఆగిన డాగ్ స్క్వాడ్ చోరీలను ఛేదించడానికి కడప నుంచి డాన్ అనే డాగ్ స్క్వాడ్‌ను పిలిపించారు. ఈ డాన్ చోరీ జరిగిన సంఘటన స్థలంలోని వస్తువుల వాసనను పట్టి నేరుగా కాలనీలోకి పోయి ఫౌంటెన్ వద్ద నుంచి పరుగులు తీసింది. కాలనీలోని పై భాగంలో ఉన్న సరస్వతీ శిశు మందిరం వద్దకు పోయి అక్కడ కలయతిరిగి ఒక చోట కూర్చుంది. -
‘పవర్’ ప్రణాళికలు
కొత్త విద్యుత్ ప్లాంట్లపై తెలంగాణ కసరత్తు.. నల్లగొండలో 6,800 మెగావాట్ల ప్లాంట్ అంచనా వ్యయం 40 వేల కోట్లు సాక్షి, హైదరాబాద్: కొత్త విద్యుత్తు ప్రాజెక్టుల స్థాపనకు తెలంగాణ ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతోంది. వీటికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇటీవలే జెన్కో అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో జెన్కో ఇంజనీరింగ్ వర్గాలు కొత్త నివేదికలు సిద్ధం చేశాయి. తాజా మార్పుల ప్రకారం నల్లగొండ జిల్లాలోనే మొత్తం 6,800 మెగావాట్ల సామర్థ్యంతో మెగా థర్మల్ ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు టీఎస్ జెన్కో చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ డి.ప్రభాకరరావు తెలిపారు. రెండు 600 మెగావాట్ల యూనిట్లు, ఏడు 800 మెగావాట్ల యూనిట్లు నెలకొల్పాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టులకు దామరచర్ల మండలంలోని వీర్లపాలెం, దిలావర్పూర్ గ్రామాల పరిధిలో మొత్తం 11 వేల ఎకరాల భూములు గుర్తించారు. ఇవన్నీ అటవీ భూములు కావటంతో ప్రత్యామ్నాయంగా అంతే మొత్తం భూములు అటవీ శాఖకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మెగా ప్రాజెక్టుల నిర్మాణానికి రూ.40 వేల కోట్లు ఖర్చవుతుందని ప్రాథమికంగా అంచనా వేసినట్లు సీఎండీ తెలిపారు. అందులో రూ.36 వేల కోట్లు ఆర్ఈసీ, పీఎఫ్సీ రుణంగా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయని.. మిగతా రూ.4,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఈక్విటీల ద్వారా లేదా ఇతరత్రా వనరుల ద్వారా సమకూర్చాల్సి ఉంటుంది. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం కేంద్రం హామీ ఇచ్చిన ఎన్టీపీసీ 4,000 మెగావాట్ల ప్రాజెక్టుకు సంబంధించి రెండు యూనిట్లు (2800 మెగావాట్లు) రామగుండంలో ప్రస్తుతమున్న ప్లాంటు పరిధిలోనే నెలకొల్పేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. -
‘థర్మల్’ తొలిదశ పూర్తి
వీర్లపాలెం ప్లాంటుపై ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక 10,656 ఎకరాల్లో సర్వే.. ప్లాంటుకు అవసరమయ్యేది 7,500 ఎకరాలే మెయిన్ ప్లాంటుకు 2,200 ఎకరాలు.. గ్రీన్‌బెల్ట్‌కు 1,000 ఎకరాలు నల్లగొండ జిల్లాలో 46 చోట్ల ప్రభుత్వ భూమి గుర్తింపు ఆ మేరకు అటవీశాఖకు బదలాయింపు రాష్ట్రవ్యాప్తంగా 10,140 మెగావాట్ల ప్లాంట్ల నిర్మాణానికి ప్రభుత్వం ప్రయత్నాలు సాక్షి ప్రతినిధి, నల్లగొండ: నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలోని వీర్లపాలెం-దిలావర్పూర్ అటవీభూముల్లో ఏర్పాటు చేయతలపెట్టిన 6,800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రాథమిక దశ పూర్తయింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి కావాల్సిన భూములను జిల్లా యంత్రాంగం సర్వే చేసి ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపింది. మొత్తం 10,656 ఎకరాల్లో సర్వే చేయగా, థర్మల్ ప్లాంటు ఏర్పాటుకు 7,500 ఎకరాలు సరిపోతుందని అధికారుల అంచనా. ఈ మేరకు అన్ని వివరాలతో కూడిన నివేదికను నల్లగొండ కలెక్టర్ టి.చిరంజీవులు ప్రభుత్వానికి పంపారు. ఇందులో జిల్లా పూర్తి సమాచారంతో పాటు జిల్లాలో ప్రాజెక్టు ఏర్పాటుకు ఉన్న సానుకూలాంశాలు, కావాల్సిన భూముల వివరాలు, అటవీభూములకు ప్రత్యామ్నాయంగా ఇవ్వాల్సిన ప్రభుత్వ భూముల వివరాలు, పునరావాసం, పరిహారం చెల్లింపు తదితర అంశాలను పొందుపర్చారు. 1,314 ఎకరాల పట్టా భూమి థర్మల్ ప్లాంటు ఏర్పాటు కోసం గత నెల 26వ తేదీ నుంచి దామరచర్ల మండలంలోని ముదిమాణిక్యం వీర్లపాలెం, తాళ్లవీరప్పగూడెం, దిలావర్పూర్, కొండ్రపోలు, నర్సాపురం, కల్లేపల్లి, తిమ్మాపురం, కొత్తపల్లి గ్రామాల్లోని 10,656 ఎకరాల్లో సర్వే నిర్వహించారు. ఇందులో 1,314 ఎకరాలు పట్టా భూమి కాగా, మిగిలినదంతా అటవీభూమే. ఈ 1,314 ఎకరాల్లో 339 మంది పట్టాదారులకు సంబంధించిన 405 ఎకరాల భూమి ఉంది. మరో 531 మందికి సంబంధించిన 909 ఎకరాల భూమికి ఆర్వోఎఫ్ఆర్ చట్టం కింద హక్కులు కల్పించాలన్న దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నా యి. ఇవి, మినహా అటవీభూమి అందుబాటులో ఉందని రెవెన్యూ యంత్రాంగం తేల్చింది. పట్టా భూములకు సంబంధించి 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని నివేదికలో వివరించారు. అటవీభూమికి ప్రత్యామ్నాయంగా ఇవ్వాల్సిన ప్రభుత్వ భూమిని కూడా గుర్తించినట్టు ఆ నివేదికలో పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 46 చోట్ల 7,100 ఎకరాలను గుర్తించామని, వీర్లపాలెం భూములను తమకు బదలాయిస్తే ఆ మేరకు ప్రభుత్వ భూమిని అటవీశాఖకు ఇస్తామని కలెక్టర్ పంపిన నివేదికలో వివరించారు. ప్రాజెక్టు కోసం తలపెట్టిన భూమికి రోడ్డు, రైలుమార్గాలు అందుబాటులో ఉన్నాయని, 30 కి.మీ.దూరంలో మిర్యాలగూడ ఉందని, రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు 200 కి.మీ. దూరంలో ఈ స్థలం ఉందని నివేదికలో వివరించారు. దీంతోపాటు ఏడాదంతా ప్రవహించే కృష్ణానది సమీపంలోనే ఉందని, వాతావరణ పరిస్థితులు పూర్తిస్థాయిలో అనుకూలంగా ఉన్నాయని ఆ నివేదికలో వివరించారు. 400 ఎకరాల్లో కాలనీ ఏర్పాటు ప్రధాన ప్లాంటు (టర్బైన్లు) నిర్మాణానికి 2,200 ఎకరాలు, బొగ్గు నిల్వ, సరఫరా ఏర్పాట్లకు 400, బూడిద, ఇతర వ్యర్థాలను వదిలేందుకు 2,000, గ్రీన్‌బెల్ట్ కింద 1,000 చొప్పున ఎకరాలు అవసరం అవుతాయని, మరో 400 ఎకరాల్లో ప్లాంటు నివాస కాలనీని ఏర్పాటు చేయవచ్చని, మరో 1,500 ఎకరాలు ప్లాంటు మౌలిక సదుపాయాల కల్పనకు ఉపయోగపడుతుందని నివేదికలో పేర్కొన్నారు. ఈ నివేదికనే సీఎం కేసీఆర్ తన తదుపరి ఢిల్లీ పర్యటనలో కేంద్రం ముందుంచుతారని తెలుస్తోంది. మరోవైపు ఈ ప్రాజెక్టును ఎన్టీపీసీ, జెన్కో సంయుక్తంగా చేపట్టాలని నిర్ణయం తీసుకున్నందున, జెన్కో సమగ్ర నివేదిక సిద్ధమవుతోందని, ఇక, ఎన్టీపీసీ బోర్డు ఢిల్లీలో సమావేశమై ప్లాంటు నిర్మాణానికి ఆమోదం తెలిపితే అనుమతుల ప్రక్రియ ప్రారంభం అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అన్నీ సవ్యంగా జరిగి అటవీభూముల బదలాయింపునకు కేంద్రం అంగీకరిస్తే... భూమిని ఏడాదిలోపు ప్రాజెక్టు నిర్మాణదారులకు అప్పగించేస్తామని, దీనిపై సీఎం కేసీఆర్ పట్టుదలతో ఉన్నారని కలెక్టర్ టి.చిరంజీవులు ‘సాక్షి’కి తెలిపారు. భూముల క్రమబద్ధీకరణతో రూ.15 వేల కోట్ల ఆదాయం పెబ్బేరు: రాష్ట్రంలోని ప్రభుత్వ భూములన్నీ క్రమబద్ధీకరించి వేలం వేస్తే సుమారు రూ.15 వేల కోట్ల ఆదాయం సమకూరే అవకాశం ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా పెబ్బేరు మండల కేంద్రంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఈ భూములను గుర్తించి ఆక్రమణలకు గురికాకుండా చూస్తామన్నారు. దీంతోపాటు కొన్ని భూములను వేలం వేసి వాటిద్వారా వచ్చే ఆదాయాన్ని రాష్ట్రాభివృద్ధికి వినియోగించుకుంటామని తెలిపారు. కొత్త రాష్ట్రం ఏర్పాటు కావడం వల్ల ఐఏఎస్‌ల కొరత ఏర్పడిందని.. వారం రోజుల్లో ఈ సమస్య పరిష్కారం అవుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని ఎంసెట్ నోటిఫికేషన్ జారీ చేశామని, కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొండి వైఖరితో ఇబ్బందులు తలెత్తుతున్నాయని రాజీవ్‌శర్మ చెప్పారు. త్వరలోనే సమస్యను అధిగమించి ఎంసెట్ నిర్వహిస్తామన్న ధీమా వ్యక్తం చేశారు. పాలమూరు ఎత్తిపోతల పథకం, ప్రాణహిత-చేవెళ్ల తదితర సాగునీటి పథకాలను వీలైనంత త్వరగా పూర్తయ్యేలా చూస్తామన్నారు. వ్యవసాయరంగంలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తామని తెలిపారు. గతంలో ఉన్న పింఛన్దారులలో అనర్హులను తొలగించడం వల్ల ఇబ్బందులు ఎదురయ్యాయని.. అర్హులైన ప్రతి ఒక్కరికీ తప్పకుండా పింఛన్ అందుతుందని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఒకేచోట ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందన్నారు. దీంతో పాలనాపరంగా సులభంగా ఉండటంతో పాటు ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. -
థర్మల్ దెబ్బ
దేవరకొండ: ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు.. ‘థర్మల్’ దెబ్బ దేవరకొండపైనే పడనుంది. దామరచర్ల మండలంలో నిర్మించతలపెట్టిన థర్మల్‌పవర్‌ప్లాంట్‌కు అవసరయ్యే 10 వేల భూములకు ప్రత్యామ్నాయంగా మరోచోట భూములిస్తేనే అటవీశాఖ నుంచి క్లియరెన్స్ వస్తుంది. అయితే మొదట నేరేడుచర్ల, మఠంపల్లి మండలాల్లో ఉన్న ప్రభుత్వ భూములను సేకరిస్తామని భావించినా, ఇప్పుడు జిల్లాయంత్రాంగం ఆ నిర్ణయాన్ని మార్చుకున్నట్టు సమాచారం. తాజాగా దేవరకొండ నియోజకవర్గపరిధిలోని ప్రభుత్వ భూములను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. థర్మల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణంపై సీఎం ప్రత్యేక దృష్టి సారించడంతో, జిల్లా అధికారులు అటవీశాఖ పరిధిలోని భూముల్లో ఆగమేఘాల మీద సర్వే చేశారు. పనిలోపనిగా శుక్రవారం దేవరకొండ రెవెన్యూ అధికారులతో పాటు జిల్లా అటవీశాఖ అధికారులు చందంపేట మండలంలో పర్యటించారు. ప్రభుత్వభూమి..పదివేల ఎకరాలు దేవరకొండ నియోజకవర్గంలోని ప్రభుత్వ భూముల వివరాలను జిల్లా అధికార యంత్రాంగం ఇప్పటికే సేకరించింది. చందంపేట మండలంలో 3700 ఎకరాలు, దేవరకొండలో 1700 ఎకరాలు, డిండిలో 3032, పీఏపల్లి మండలంలో 988 ఎకరాలు, చింతపల్లిలో సుమారు వెయ్యి ఎకరాల ప్రభుత్వ భూమిని అధికారులు గుర్తించారు. అయితే ప్రభుత్వం అటవీశాఖకు అప్పగించదలుచుకున్న 7500 ఎకరాల్లో 6500 ఎకరాలు దేవరకొండ నియోజకవర్గం నుంచే సేకరించాలని భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. చందంపేట, డిండి మండలాల పరిధిలో నల్లమల అటవీ ప్రాంతం విస్తరించి ఉండడంతో ఈ భూమి ఫారెస్ట్ ఆధీనంలోకి తీసుకోవడానికి అటవీశాఖ అధికారులు కూడా సుముఖంగా ఉన్నట్లు తెలుస్తుంది. జనంలో.... గుబులు : గతంలో పీఏపల్లి మండలం పెద్దగట్టు, చందంపేట మండలం చిత్రియాల అటవీ ప్రాంతాల్లో యురేనియం నిల్వలను కేంద్రప్రభుత్వం గుర్తించింది. అక్కడ వెలికితీసే యురేనియం నిక్షేపాలను శుద్ధి చేయడం కోసం దేవరకొండ మండలంలోని శేరిపల్లి అనువైందిగా భావించింది. అక్కడున్న 500 ఎకరాల్లో యురేనియం శుద్ధి కర్మాగారం ఏర్పాటు చేయాలనియూసీఐఎల్ భావించింది. ఇందు కోసం శేరిపల్లి ప్రాంతంలో సర్వే కూడా నిర్వహించారు. జేత్యతండా సమీపంలో అధికారుల నివాసానికి రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని ఇవ్వాల్సిందిగా, జిల్లా అధికారుల నుంచి రెవెన్యూ అధికారులకు ఆదేశాలు కూడా వచ్చాయి. ప్రస్తుతం ఈ విషయం స్తబ్దుగా ఉన్నప్పటికీ, గతంలో యురేనియం ప్లాంట్‌కు వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు జరిగాయి. ఇదే క్రమంలో చందంపేట మండలంలో ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం పనులు జరుగుతుండగా, నక్కలగండి ప్రాజెక్టు కోసం ముంపునకు గురయ్యే 3వేల ఎకరాలకు భూమిని సేకరించే పనిలో ప్రభుత్వం ఉంది. అక్కడ కేవలం 300 ఎకరాలు మాత్రమే సేకరించగా, ముంపు బాధితుల నుంచినిరసన గళం వినిపిస్తూనే ఉంది. ఇప్పటికే నాగార్జునసాగర్ ముంపునకు గురైనప్పుడు తెల్దేవర్పల్లిలో ఆవాసాలు కల్పించగా, మళ్లీ అదే ప్రాంతం నక్కలగండి ప్రాజెక్టులో ముంపునకు గురవుతుంది. వారికి ఇంకా ప్రభుత్వ భూమిని ప్రత్యామ్నాయంగా చూపించనేలేదు. నూతన భూసేకరణ చట్టం నిబంధనల ప్రకారం వారు ప్రత్యామ్నాయ ప్రభుత్వ భూములను డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో థర్మల్ పవర్ ప్లాంట్‌కు చందంపేట, డిండి ప్రభుత్వ భూములను ప్రత్యామ్నాయంగా భావించడం..అధికారగణం ఇందుకు సంబంధించిన సర్వేలు చేస్తుండడంతో ఈ ప్రాంతవాసుల్లో గుబులు మొదలయ్యింది. -
రెండో రోజు ముమ్మరంగా భూ సర్వే
దామరచర్ల : థర్మల్ పవర్ ప్రాజెక్టు భూ సర్వే శనివారం రెండో రోజు మండలంలో ముమ్మరంగా కొనసాగింది. భూ సర్వే నిమిత్తం ఏర్పాటుచేసిన 21టీములు 6 గ్రామాల్లో పర్యటించాయి. బృందం సభ్యులు ఆయా గ్రామాల్లోని భూమిని పరిశీలించారు. ప్రభుత్వ భూ మి ఎంత ఉంది, ఏయే ప్రాంతాల్లో ఉందో ఆరా తీశారు. మండలంలోని 7 గ్రామాల్లో 9వేల ఎకరాల సేకరణ లక్ష్యంగా సర్వే సాగింది. అయితే అధికారుల కోసం ఆయా గ్రామాల రైతులు పనులు మానుకొని భూముల వద్ద అందుబాటులో ఉన్నారు. అందుబాటులో లేకపోతే భూములు కోల్పోతామోనన్న బెంగతో ఉద యం 9 గంటలు మొదలుకొని సాయంత్రం 5 గంటల వరకు వేచి ఉన్నారు. వీర్లపాలెంలో అధికారులను అడ్డుకున్న గ్రామస్తులు మిర్యాలగూడ తహసీల్దార్ కృష్ణారెడ్డి బృందం మండలంలోని వీర్లపాలెం గ్రామంలో సర్వే చేసేందుకు వచ్చింది. విషయం తెలుసుకున్న సాత్‌తండా, దుబ్బతండా గిరిజనులు అధికారులను సర్వే చేయకుండా అడ్డుకున్నారు .మహిళలు వాహనాలు ముందుకు వెళ్లకుండా రోడ్డుపై బైఠాయించారు. దీంతో కృష్ణారెడ్డి రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా వారు వినలేదు. దీంతో ఫోన్ ద్వారా మిర్యాలగూడ ఆర్డీఓ కిషన్‌రావు దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. ఆర్డీఓ హుటాహుటిన వీర్లపాలానికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. లక్షల రూపాయల పెట్టుబడి పెట్టి నీటివసతి కల్పించుకుని సాగుచేసుకుంటున్న భూములు పవర్‌ప్లాంట్‌కు పోతే తమకు జీవనాధారం లేకుండా పోతుందని రైతులు.. ఆర్డీఓకు మొర పెట్టుకున్నారు. సాగుచేసిన భూములు ఫారెస్టువని, వాటికి నష్ట పరిహారం రాదని, దీంతో భూములు నమ్ముకుంటూ బతుకుతున్న కుటుంబాలు వీధిన పడతాయని విన్నవించారు. ఆర్డీఓ కిషన్‌రావు మాట్లాడుతూ రైతులు ఆందోళన చెందడంలో తప్పులేదని, ఈ విషయాలను సీఎం వచ్చిన నాడే కలెక్టర్‌కు, సీఎంకు విన్న వించామని తెలిపారు. అందుకు సీఎం సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. భూమిని నమ్ముకొని జీవించే ఏ ఒక్క కుటుంబానికీ నష్టం కలగకుండా చూస్తామని, భూమి కోల్పోయిన వారికి భూమి, లేదా నష్టపరిహారం, కుటుం బంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్తులు నిరసనను విరమించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ దుర్గెంపూడి నారాయణ రెడ్డి, గ్రామ సర్పంచ్ కోట్యానాయక్, టీఆర్ఎస్ నాయకులు చల్లా అంజిరెడ్డి, పర్ష్యానాయక్, బాలు, అనిమిరెడ్డి, లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఇదేమి న్యాయం..!
సాక్షి ప్రతినిధి, కడప: కార్మికుల కు అండగా నిలవాల్సిన అధికారపార్టీ నాయకులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. ఊరికో నిర్ణయం.. పరిశ్రమకో న్యాయం అంటూ దమననీతిని ప్రదర్శిస్తున్నారు. ఆర్టీపీపీ కార్మికుల ఆందోళనను నీరుగార్చడంలో పోట్లదుర్తి బ్రదర్స్ సఫలీకృతులయ్యారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు(ఆర్టీపీపీ)లో పనిచేస్తున్న కాంట్రాక్టుకార్మికులు ఆందోళన బాట పట్టారు. కార్మికులు ఆందోళన చేస్తుంటే బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన అధికారపార్టీ నేతలు తద్భిన్నంగా వ్యవహరిస్తున్నారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లకు అండగా నిలవాల్సింది పోయి వారి ఆందోళనను నీరుగార్చే చర్యలకు పాల్పడ్డారు. అధికారపార్టీ నేత సురేష్‌నాయుడు రాత్రికి రాత్రే వందమంది తన అనుచరులను ఆర్టీపీపీలో విధుల్లో చేర్పించారు. ఆర్టీపీపీ యాజమాన్యం, తెలుగుదేశం నేతల చర్యలకు జంకిన కొంతమంది కార్మికులు ఆందోళన విరమించి విధుల్లో చేరారు. దీంతో మిగిలిన కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 15 ఏళ్లుగా ఆర్టీపీపీ ప్లాంట్‌నే నమ్ముకుని జీవిస్తున్న తమపై ‘పిచుకమీద బ్రహ్మస్త్రం’ అన్నటుగ్లా అధికారపార్టీ నేతల శైలి ఉందని కార్మికులు ఆరోపిస్తున్నారు. తెలుగుతమ్ముళ్ల వింతధోరణి ఎదుటోళ్లపై బురద వేయడమే అధికారపార్టీ నేతలు లక్ష్యంగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఒకే నాయకుడు ఒక్కొక్క సందర్భంలో ఒక్కోరకంగా వ్యవహరిస్తున్నారు. అందుకు రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ సోదరుడు సురేష్‌నాయుడు నిదర్శనంగా నిలుస్తున్నారు. భారతి, జువారి సిమెంటు ఫ్యాక్టరీలలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు నిర్వహించిన ఆందోళనకు మద్దతు ఇచ్చిన ఆయన ఆర్టీపీపీ కార్మికులకు వ్యతిరేకంగా పావులు కదిపారు. యర్రగుంట్లలో ఒకలా, కలమల్లలో మరోలా వ్యవహరించడం ఏమాత్రం సమంజసం కాదని పలువురు పేర్కొంటున్నారు. కార్మికుల చర్యలను అణిచివేసేందుకు పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తుతో వారికి వ్యతిరేకంగా కవ్వింపు చర్యలకు పాల్పడడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. -
రూ. 39,000 కోట్లతో కొత్త కాంతులు
* ప్లాంట్ల నిర్మాణ అంచనాలతో టీ సర్కారుకు జెన్ కో నివేదిక * మణుగూరు, కొత్తగూడెంపై ప్రత్యేకంగా దృష్టి * విదేశీ బొగ్గును వినియోగించే యోచన * భూసేకరణే ప్రధాన అవరోధం * మిగతా విద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించి కొనసాగుతున్న పరిశీలన సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నిర్మించ తలపెట్టిన కొత్త థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులకు రూ.39 వేల కోట్లు ఖర్చవుతాయని జెన్కో లెక్కగట్టింది. స్థానికంగా బొగ్గు లభ్యం కాకపోతే... మొత్తం విదేశీ బొగ్గుతోనే ఈ కొత్త ప్రాజెక్టులను నిర్వహించాలని యోచిస్తోంది. అయితే ప్రాజెక్టులన్నింటికీ భూసేకరణే ప్రధాన అవరోధంగా మారనున్నట్లు భావిస్తోంది. ఈ మేరకు కొత్త ప్లాంట్లకు అంచనా వ్యయంతో పాటు యూనిట్ల నిర్మాణానికి ఎంత విస్తీర్ణంలో భూములు అవసరం? అందుబాటులో ఉన్నదెంత? అదనంగా ఏ మేరకు భూసేకరణ చేపట్టాలి? ఎంత మేరకు నీరు, బొగ్గు అవసరం? అనే వివరాలతో తాజా నివేదికను రాష్ట్ర ఇంధన శాఖకు సమర్పించింది. భారీగా నిధులు అవసరం.. జెన్కో అంచనాల ప్రకారం కొత్తగా ప్రతిపాదించిన మణుగూరు థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణం కోసం రూ.7,020 కోట్లు కావాలి. కొత్తగూడెం థర్మల్ ప్రాజెక్టులో నిర్మించనున్న ఏడో యూనిట్‌కు రూ. 5,200 కోట్లు, తర్వాత చేపట్టనున్న కాకతీయ థర్మల్ ప్లాంట్ మూడో దశ, రామగుండం, సత్తుపల్లి ప్రాజెక్టులకు రూ. 26,780 కోట్లు అవసరం. ఇక అవసరమైన భూమిని పరిశీలిస్తే... కొత్తగూడెంలో 800 మెగావాట్ల యూనిట్ నిర్మాణానికి మొత్తం 460 ఎకరాలు కావాల్సి ఉంది. ప్రస్తుతం పాల్వంచలో ఉన్న కేటీపీపీ పరిసరాల్లోనే 230 ఎకరాలు అందుబాటులో ఉంది. అదనంగా మరో 230 ఎకరాల భూమి సేకరించాలి. ఈ మేరకు ప్రతిపాదనలను జెన్కో ఇప్పటికే పాల్వంచ ఆర్డీవోకు అందజేసింది. ఈ ప్లాంటు నిర్వహణకు 25 క్యూసెక్కుల నీరు అవసరం. బూర్గంపాడు సమీపంలో గోదావరి నుంచి ప్రస్తుతమున్న 25 కిలోమీటర్ల పైపులైన్ ద్వారా ఈ నీటిని సరఫరా చేసుకునే వీలుంది. ఇక ఈ యూనిట్‌కు ఏడాదికి 4.72 మిలియన్ టన్నుల బొగ్గు అవసరం. ఎక్కువ నాణ్యత ఉండే విదేశీ బొగ్గును వాడితే.. 2.70 మిలియన్ టన్నులు సరిపోతుందని అంచనా. దేశీయంగా సరిపడేంత బొగ్గు లభ్యం కాని పక్షంలో విదేశాల నుంచి దిగుమతి చేసుకుని.. 440 కిలోమీటర్ల దూరంలోని కాకినాడ పోర్టు నుంచి రవాణా చేసుకునే వీలుందని జెన్కో నివేదికలో పొందుపరిచింది. సగం దేశీయ బొగ్గు, సగం విదేశీ బొగ్గు వినియోగించే ప్రతిపాదనలతో పాటు పూర్తిగా విదేశీ బొగ్గును వాడుకునేలా... రెండు విధాలుగా ప్రాజెక్టు రిపోర్టులను సిద్ధం చేసింది. ఇక మణుగూరు థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులో మొత్తం 1080 మెగావాట్ల ఉత్పత్తికి నాలుగు 270 మెగావాట్ల యూనిట్లను స్థాపించనున్నారు. మొత్తం 1,031 ఎకరాల భూమి అవసరమని జెన్కో గుర్తించింది. ఇటీవలే భూసేకరణకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అందుకు సంబంధించి రూ. 51 కోట్లను జెన్కో ఇప్పటికే రెవెన్యూ విభాగానికి డిపాజిట్ చేసింది. మణుగూరు ప్లాంట్‌కు 40 క్యూసెక్కుల నీరు అవసరం. ప్రాజెక్టుకు అవసరమైన 3.40 మిలియన్ టన్నుల విదేశీ బొగ్గును దిగుమతి చేసుకుని, కాకినాడ పోర్టు నుంచి 500 కిలోమీటర్లు రవాణా చేసుకోవాల్సి ఉంటుందని జెన్కో నివేదికలో పేర్కొంది. బీహెచ్ఈఎల్కు పనులు.. మణుగూరు, కొత్తగూడెం థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణాన్ని ప్రభుత్వం ఈపీసీ విధానంలో బీహెచ్ఈఎల్కు అప్పగించింది. ఒప్పందం ప్రకారం కేవలం 30 నెలల వ్యవధిలోనే మణుగూరు ప్లాంట్ నిర్మాణానికి బీహెచ్ఈఎల్ అంగీకరించింది. నిర్మాణానికి సంబంధించిన ధరలతో పాటు యంత్రాలు, ప్లాంటుకు సంబంధించిన సాంకేతిక అంశాలపై జెన్కో నియమించిన కమిటీ బీహెచ్ఈఎల్ మధ్య చర్చలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. పాల్వంచ, మణుగూరు, పినపాక మండలాల్లో భూ సేకరణ ఈ రెండు ప్రాజెక్టుల నిర్మాణానికి కీలకంగా మారనుంది. భూసేకరణ పూర్తయ్యేందుకు కనీసం ఆరు నెలల నుంచి ఏడాది పడుతుందని రెవెన్యూ యంత్రాంగం అంచనా వేస్తోంది. దీంతో జెన్కో ఆశించిన సమయంలో ఈ ప్రాజెక్టులు పూర్తవుతాయా.. లేదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. -
బొగ్గు బాగోలేదు..
ఎర్రగుంట్ల: రాయలసీమ ప్రాంతానికి వెలుగులు నింపేరాయలసీమ ధర్మల్ పవర్ ప్రాజెక్టు(ఆర్టీపీపీ) ఏపీ జెన్కో ఉన్నతాధికారులు వివక్ష చూపుతున్నారు. విద్యుత్ ఉత్పత్తికి అవసరైమన బొగ్గును సరఫరా చేయడంలో సవతి ప్రేమను చూపుతున్నారు. ప్రస్తుతం ఆర్టీపీపీకి సింగరేణి నుంచి వస్తున్న బొగ్గులో నాణ్యత లోపించింది. బొగ్గులో ఎక్కువగా రాళ్లు వస్తున్నాయి. వీటిని పగల కొట్టి బంకర్లలోకి పంపించడానికి అధికారులు నానా తంటాలు పడుతున్నారు. వస్తున్న రాళ్లను కార్మికులు సమ్మెటలతో పగలగొట్టి అందులోంచి బండరాళ్లను బయటకు తీస్తున్నారు. ఆర్టీపీపీలో 1,2,3,4,5 యూనిట్లలో 1050 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్న విషయం విధితమే. బొగ్గు కొరత కారణంగా ఉత్పత్తికి ఆటంకం కలిగే పరిస్థితులు ఏర్పడడంతో కింద పడిన బొగ్గును సైతం వాడుతున్నారు. బొగ్గు మాత్రం యూనిట్లుకు సరిపడ సరఫరా కావడంలేదు. ఆర్టీపీపీకి సింగరేణి, మణగూరు, రామగుండం మంచిర్యాల ప్రాంతాల నుంచి బొగ్గు సరఫరా అవుతోంది. సింగరేణి నుంచి ఇక్కడి స్టేజ్-1,2 ప్లాంట్లకు 38.80 లక్షల టన్నుల బొగ్గును సింగరేణి నుంచి సరఫరా చేయించే విధంగా 2012 ఏప్రిల్ 1న చేసుకున్న ఒప్పందం మేరకు 2032 సంవత్సరం వరకు సింగరేణి బొగ్గు ఆర్టీపీపీకి రావాల్సింది. కొన్ని నెలలుగా సగటున రోజుకు ఒక్క వ్యాగన్ కూడా రావడంలేదు. సింగరేణి నుంచి కృష్ణపట్నం సమీపంలోని ధర్మల్ స్టేషన్‌కు ఇబ్బందుల్లేకుండా బొగ్గు సరఫరా చేస్తున్నారు.. ఏపి జెన్కో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బొగ్గు ఆ ప్లాంట్‌కు తరలివెళుతోందని విశ్వసనీయ సమాచరం. ఒరిస్సా నుంచి వస్తున్న బొగ్గు పరిస్థితి దారుణం ఆర్టీపీపీకి ఒరిస్సాలోని మహానది నుంచి వస్తున్న వాష్డ్ బొగ్గు పరిస్థితి మరీ దారుణంగా ఉంది. నెలకు రెండు లక్షల టన్నుల బొగ్గు రావాల్సింది. నెలకు సుమారు 26 వ్యాగన్ల వరకు రావాల్సింది. ప్రస్తుతం నెలకు పది వ్యాగన్లు కూడా రాలేదు. నవంబరు నెలలో కేవలం 8 వ్యాగన్లు వచ్చాయని అధికారులు తెలిపారు. అంటే వాష్డ్ బొగ్గు ఆర్టీపీపీ ఒప్పందం ప్రకారం సక్రమంగా సరఫరా జరిగితే సమస్య తగ్గే అవకాశం ఉంది. ఆర్టీపీపీలోని ఐదు యూనిట్లు పని చేయాలంటే రోజుకు సుమారు 16వేల టన్నుల బొగ్గ్గు అవసరం. అయితే గురువారం నాటికి ఆర్టీపీపీలో స్వదే శీ బొగ్గు నిల్వలు కేవలం 62 టన్నులు మాత్రమే. విదేశీ బొగ్గు నిల్వలు నిల్. ఈ మధ్య కాలంలో సింగరేణి నుంచి వస్తున్న బొగ్గులో కూడా నాణ్యత ప్రమాణాలు క్షీణించాయి. ఎక్కువగా రాళ్లు వస్తున్నాయి. ఒప్పందం ప్రకారం గ్రేడ్-15 గల బొగ్గు రావాల్సింది. రాయలసీమ ప్రాంతంలోని విద్యుత్ ఉత్పత్తి కర్మగారంపై ఏపి జెన్కో ఉన్నతాధికారులు చిన్నచూపు చూడడంలో అంతరార్థం ఏవరికీ బోధపడడంలేదు. నాణ్యత లేని బొగ్గుతో నష్టం సింగారేణి కాలని నుంచి వస్తున్న నాణ్యత లేని బొగ్గుతో ఆర్టీపీపీ ఉత్పత్తి నష్టం కల్గుతోందని అధికారులు అంటున్నారు. ఈ బొగ్గులో రాళ్లు ఎక్కువగా వస్తున్నాయని దీనిని వాడితే యూనిట్లులో ఇబ్బందులు కలుగుతాయన్నారు. బొగ్గు కొరతతో ఒక్కొక్క యూనిట్లో 210 మెగావాట్లు బదులు ప్రస్తుతం 150లోపే విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామని అధికారులు తెలిపారు. అంతేకాక రాళ్లుతో వస్తున్న బొగ్గును బయటకు తీయడానికి ప్రత్యేక ఖర్చుతో పొక్లెయిన్లు ఏర్పాటు చేసుకుని బండ రాళ్లును బయటకు తీస్తున్నారు. దీంతో ఆర్టీపీపీకి బొగ్గు కొరతతో పాటు అదనపు ఖర్చు వస్తుందని సీఈ తెలిపారు. సింగరేణి వద్దనే బొగ్గును క్రష్ చేసి పంపించాల్సింది.. సింగరేణిని వస్తున్న బొగ్గును ముందుగా క్రషర్ ద్వారా పెద్ద బొగ్గును పిండి చేసి సరఫరా చేయూలి. అరుుతే సింగరేణి కాలనీ నేరుగా వ్యాగన్లు ద్వారా పెద్ద రాళ్ల బొగ్గును అలానే పంపిస్తున్నారు. సింగరేణి బొగ్గుతో పాటు వాష్డ్ బొగ్గు సక్రమంగా వస్తేనే ఉత్పత్తికి ఆటంకం ఉండదని అధికారులు వివరిస్తున్నారు. ఆర్టీపీపీ సీఈ ఏమంటున్నారంటే..... ఈ విషయంపై ఆర్టీపీపీ సీఈ కుమారుబాబును వివరణ కోరగాఆర్టీపీపీకి బొగ్గు కొరత చాలా ఎక్కువగా ఉంది. వాష్డు బొగ్గు ఒప్పంద ప్రకారం రాలేదు. ఒరిస్సా నుంచి నెల సుమారు 26 వ్యాగన్లు రావాల్సి ఉన్నా రాలేదు. సింగ రేణి నుంచి వస్తున్న బొగ్గులో రాళ్లు ఎక్కువగా ఉన్నాయి. వాటిని పగల కొట్టి కష్టాల నడుమ విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం లేకుండా చూస్తున్నాం. -
అర్హులందరికీ ‘ఆసరా’
సాక్షి ప్రతినిధి, ఖమ్మం : అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ కడవేరు సురేంద్రమోహన్ తెలిపారు. ఆహారభద్రత, ఆసరా, పెన్షన్ పథకాలలో అర్హులకు అన్యాయం జరుగకుండా క్షేత్రస్థాయిలో సూక్ష్మ పరిశీలనకు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. జిల్లాలో పరిశ్రమలను నెలకొల్పి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఆసక్తి కనబర్చే పారిశ్రామిక వేత్తలకు నిబంధనల ప్రకారం ప్రభుత్వ భూములు కేటాయించి ప్రోత్సహిస్తామన్నారు. జిల్లా అభివృద్ధి ప్రణాళికలను ప్రాధాన్యత క్రమంలో అమలు చేస్తున్న తీరును వివరించారు. బుదవారం ఆయన సాక్షి ప్రతినిధికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. జిల్లాను పారిశ్రామిక ంగా అభివృద్ధి చేసేందుకు పలు ప్రతిపాదనలు చేశామని, ఐటీ పార్క్, థర్మల్ పవర్ ప్రాజెక్టులు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణానికి చర్యలు తీసుకున్నట్లు వివరించారు. సాక్షి : ఆసరా పథకం పరిస్థితి ఏమిటి..? జేసీ : జిల్లాలో పెన్షన్ల కోసం 3,17,801 దరఖాస్తులు రాగా అందులో 3.07 లక్షల దరఖాస్తుల పరిశీలన పూర్తయింది. ఇప్పటివరకు 2,13,063 మందిని అర్హులుగా గుర్తించాం. ఇంకా 10 వేల దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి. సాక్షి : గతం కంటే పెన్షన్ లబ్ధిదారులు పెరిగారా.. తగ్గారా..? జేసీ : జిల్లాలో గతంలో 3,24,426 పెన్షన్లు ఉండగా ప్రస్తుతం అదేస్థాయిలో పెన్షన్లు రానున్నాయి. పాతవాటిలో కొందరు అనర్హులను తొలగించాం. ప్రస్తుతం కొత్తగా కొన్ని చేర్చాం. దీంతో పెన్షన్లు గతం లాగానే రానున్నాయి. సాక్షి : సీలింగ్ పేరుతో అర్హులకు అన్యాయం జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి కదా..? జేసీ : సీలింగ్ అనేది జిల్లాలో లేదు. ప్రభుత్వం కొన్ని నిబంధనలు సడలించింది. జిల్లాలో 64 శాతం ఏజెన్సీ ఏరియా ఉందని వివరించా. దీంతో అర్హులందరికీ పెన్షన్లు వచ్చేలా చర్యలు చేపడుతున్నాం. సాక్షి : జిల్లాలో కొన్ని మండలాల్లో పెన్షన్‌లో సీలింగ్ విధించాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.. నిజమేనా..? జేసీ : జిల్లాలో అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందించాలనేదే లక్ష్యం. ఎక్కడా సీలింగ్ లేదు. అర్హులందరికీ పెన్షన్లు అందించేలా బయ్యారం, గార్ల, టేకులపల్లి మండలాల అధికారులకు ఆదేశాలు జారీ చేస్తాం. సీలింగ్ వల్ల అర్హులను తొలగించినట్లు తెలిస్తే ఆర్డీఓ, తహశీల్దార్‌తో పరిశీలన చేస్తాం. సాక్షి : అర్హులకు జిల్లా అధికారిగా మీరిచ్చే సలహా ఏమిటి..? జేసీ : రాష్ట్ర అధికారులు సైతం అర్హులకు అన్యాయం చేయవద్దని చెబుతున్నారు. మేము కూడా జిల్లాలో అర్హులందరికీ న్యాయం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశాం. అర్హులను తిరస్కరించినట్లయితే మరోసారి దరఖాస్తు చేసుకోవచ్చు. సాక్షి : ఆహార భద్రత కార్డుల పరిశీలన ఎలా జరుగుతోంది..? జేసీ : జిల్లాలో ఆహర భద్రత కార్డులకు 7, 21,852 దరఖాస్తులు వచ్చాయి. వాటిలో ఇప్పటివరకు 2,98,905 దరఖాస్తుల పరిశీలన పూర్తయింది. ఫిబ్రవరిలో ఆహారభద్రతలు కార్డులు అందిస్తాం. అప్పటి వరకు రేషన్‌కార్డులకు సరుకులు పంపిణీ చేయిస్తాం. సాక్షి : గతంలో ఎన్ని బోగస్ కార్డులు ఏరివేశారు..? ఎంత ఆదా అయింది...? జేసీ : జిల్లాలో ఆధార్ సీడింగ్ వల్ల 45 వేల బోగస్ కార్డులను గుర్తించి తొలగించాం. దీంతో వెయ్యి మెట్రిక్ టన్నుల బియ్యం ఆదా అవుతుంది. హాస్టళ్లు, మధ్యాహ్న భోజన పథకానికి ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి రేషన్ సరఫరా చేస్తున్నాం. దీంతో క్వాలిటీ, క్వాంటిటీ పెరిగింది. సాక్షి : జిల్లాలో రేషన్ బియ్యం రీసైక్లింగ్ జరుగుతున్నట్లు ప్రచారం ఉంది.. ఎలా అరిక డతారు..? జేసీ : జిల్లాలో బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు పటిష్ట చర్యలు చేపడుతున్నాం. భారీ ఎత్తున 6ఏ కేసులు నమోదు చేస్తున్నాం. గత మూడునెలల్లో 800 కేసులు పెట్టాం. దీంతో అక్రమ రవాణా తగ్గుతుంది. సాక్షి : ల్యాండ్ బ్యాంక్‌కు సంబంధించిన వివరాలేమిటి..? జేసీ : జిల్లాలో 1.20 లక్షల ప్రభుత్వ భూమి ఉంది. అందులో పరిశ్రమలకు ఉపయోగకరంగా 20 వేల ఎకరాల భూమి ఉంది. సత్తుపల్లి, కొత్తగూడెం, కూసుమంచి, రఘునాథపాలెం, బయ్యారంలలో భూములు పారిశ్రామికంగా అనుకూలంగా ఉన్నాయి. అయా ప్రాంతాలలో ఉన్న ప్రభుత్వ భూములను పరిశ్రమల శాఖ ద్వారా కొందరు పారిశ్రామిక వేత్తలు పరిశీలించి పరిశ్రమల స్థాపనకు అనుగుణంగా ఉన్నాయని తేల్చారు. సాక్షి : పారిశ్రామిక అభివృద్ధికి ఎలాంటి చర్యలు చేపడుతున్నారు..? జేసీ : జిల్లాలో కొత్తగూడెం మండల పరిధిలోని చుంచుపల్లిలో ఐటీ పార్కు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. సత్తుపల్లి మండలం బుగ్గపాడులో ఫుడ్‌పార్క్ ఏర్పాటు, మణుగూరులో పవర్‌ప్లాంట్‌కు క్లియరెన్స్ వచ్చింది. అశ్వాపురం మండలం ఆమెర్ద గ్రామంలో థర్మల్ విద్యుత్ పవర్‌ప్లాంట్‌కు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. ఇక్కడ కొంత ప్రతికూల పరిస్థితులు ఉన్నట్లు హెవీవాటర్ ప్లాంట్ అధికారులు చెబుతున్నారు. దీంతో ప్రభుత్వానికి లేఖ రాశాం. సాక్షి : చెరువు శిఖం భూములకు ఎలాంటి రక్షణ చర్యలు చేపడుతున్నారు..? జేసీ : జిల్లాలో 2వేల ఎకరాల్లో చెరువులు, కుంటల భూములు ఆక్రమణల్లో ఉన్నట్లు గుర్తించాం. దీనిలో 3వేల మందికి నోటీసులు ఇచ్చేందుకు చర్యలు చేపడుతున్నాం. సాక్షి : ధాన్యం కొనుగోలుకు ఎలాంటి చర్యలు చేపట్టారు..? జేసీ : జిల్లా వ్యాప్తంగా 130 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు చేశాం. వీటిలో మూడు చోట్ల ఇప్పటికే కేంద్రాలు ప్రారంభించి 6.50 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. త్వరలో మిగతా వాటిని తెరుస్తాం. సాక్షి : రైతులకు మద్దతు ధర కల్పించేందుకు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు..? జేసీ : రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటించింది. గ్రేడ్ -ఏ రకానికి రూ.1400, సాధారణ రకం రూ.1360 చెల్లించేలా చర్యలు చేపడుతున్నాం. దళారులకు అమ్మకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అమ్మేలా రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. -
నెలలో ‘థర్మల్’ అనుమతులు రద్దు
సోంపేట : మండలంలోని బీల ప్రాంతంలో నిర్మించదలచిన థర్మల్ పవర్ ప్రాజెక్టు అనుమతులు రద్దు జీవోను నెల రోజుల్లో విడుదల చేస్తామని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పనా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శనివారం సోంపేటలో సర్పంచ్ చిత్రాడ నాగరత్నం అధ్యక్షతన నిర్వహించిన జన్మభూమిలో సభలో పలాస, ఇచ్చాపురం నియోజకవర్గ ఎమ్మెల్యేలు గౌతు శ్యామ సుందర శివాజీ, బెందాళం అశోక్‌బాబుతో కలసి ఆయన పాల్గొన్నారు. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ జిల్లాలో సుడిదోమ వల్ల వరి పంట నష్టపోయిన రైతులకు హెక్టారుకు రూ.15 వేలు అందించాలని ప్రభుత్వం నుంచి శనివారం ఆదేశాలు అందినట్టు చెప్పారు. నెలలోగా రైతులకు పరిహారం అందిస్తామన్నారు. హుదూద్ తుపాను పరిహారం చెల్లించిన అనంతరం గతేడాది పైలీన్ తుపాను నష్ట పరిహారాన్ని రైతులకు అందిస్తామన్నారు. గ్రామ పంచాయతీల అభివృద్ధికి కేంద్రం రూ.1800 కోట్లు కేటాయించిందన్నారు. రైతు, డ్వాక్రా రుణమాఫీ తప్పక అవుతుందన్నారు. సోంపేట పంచాయతీ స్థలాన్ని కేటాయిస్తే అత్యాధునిక సౌకర్యాలతో సులభ కాంప్లెక్స్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. తొలుత థర్మల్ ప్రాజెక్టు అనుమతులు రద్దు జీవో విడుదల చేయాలని మంత్రికి పర్యావరణ పరిరక్షణ సంఘం అధ్యక్ష ప్రతినిధులు వై.క్రిష్ణమూర్తి, తమ్మినేని రామారావు, మాదిన రాఘవయ్య, సనపల శ్రీరామమూర్తి తదితరులు వినతి పత్రం అందజేశారు. మంత్రి ఆలస్యంగా రావడంతో జన్మభూమి మధ్యాహ్నం 12.15 గంటలకు ప్రారంభమైంది. వృద్ధులకు పడిగాపులు తప్పలేదు. పలాస ఎమ్మేల్యే శివాజి తన అసహానాన్ని వెళ్లగక్కారు. ఆర్డీవో ఎం.వెంకటేశ్వరరావు, ఎంపీపీ చిత్రాడ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ సూరాడ చంద్రమోహన్, ప్రత్యేకాధికారి కె.ప్రసాద్, తహశీల్దార్ ఆర్.గోపాలరత్నం, ఎంపీడీవో ఎం.వి.సువర్ణరాజు తదితరులు పాల్గొన్నారు. -
లక్ష్యానికి దూరంలో భూగర్భ గనులు
అత్యాధునిక యంత్రాలు ఉన్నా ఫలితం శూన్యం ఉత్పత్తి భారమంతా ఓపెన్‌కాస్టు గనులపైనే కొత్తగూడెం(ఖమ్మం) : అత్యాధునిక యంత్రాలు సమకూర్చినా నిర్ధేశించిన లక్ష్యాలను అందుకోవడంలో భూగ ర్భ గనులు ఇంకా వెనుకబాటులోనే ఉన్నాయి. ఇప్పటికే విద్యుత్‌లోటును ఎదుర్కొంటున్న తె లంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పాటు చేసే థర్మల్ పవర్‌ప్రాజెక్టులకు విద్యుత్ ఉత్పత్తిపై సింగరేణిపైనే ఎక్కువగా ఆధారపడింది. ఈ నేపథ్యం లో వాటి అవసరాల మేరకు బొగ్గు ఉత్పత్తి చే యాల్సిన బాధ్యత సింగరేణి సంస్థపై పడింది. ప్రపంచ వ్యాప్తంగా బొగ్గు గనుల్లో వినియోగి స్తున్న అత్యాధునిక యంత్రాలను మన గనుల్లో వినియోగిస్తునప్పటికీ ఆశించిన ఫలితాలు రావడంలేదు. ఇందుకు యంత్రాలను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోలేక పోవడం.. అధికారుల అవగాహనా రాహిత్యం, నిర్లక్ష్యం కారణంగా చెప్పుకోవచ్చు. సంస్థ వ్యాప్తంగా 34 భూగర్భ గనులు, 15 ఓపెన్‌కాస్టు ప్రాజెక్టులు ఉన్నాయి. భూగర్భ గనులు నిర్ధేశించిన లక్ష్యంలో కనీసం 70 శాతం కూడా చేరుకోలేక పోతున్నాయి. దీంతో ఆ భారమంతా ఓపెన్‌కాస్టు గనులపై పడుతోంది. ప్రతి ఏటా భూగర్భ గనుల ఉత్పత్తి లోటును ఓసీలే పూడ్చుతున్నాయి. యంత్రం వినియోగంలో విఫలం ప్రస్తుతం రెండు భూగర్భ గనుల్లో అత్యంత ఆధునికమైన కంటిన్యూయస్ మైనర్లు పనిచేస్తున్నాయి. మిగతా వాటిలో 147 ఎల్‌హెచ్‌డీ యంత్రాలు, 240 ఎస్డీఎల్ యంత్రాలను వినియోగిస్తున్నారు. వీటితోపాటు రోడ్‌హెడర్, లాంగ్వాల్ యంత్రాలను ఉత్పత్తిలో వాడుతున్నారు. యంత్రాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవడంలో అధికారులు విఫలం అవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. విదేశాలలో ఒక్కో యంత్రాన్ని రోజుకు కనీసం 16 గంటల పాటు వినియోగిస్తుండగా ఇక్కడ మాత్రం షిఫ్టుకు కేవలం నాలుగు గంటలు మాత్రమే పని తీసుకోవడంతో లక్ష్యం చేరుకోవడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు. గతేడాదికంటే తగ్గిన ఉత్పత్తి ఇప్పటి వరకు సింగరేణి వ్యాప్తంగా ఉన్న 34 భూగర్భ గనుల్లో 8.07 మిలియన్ టన్నుల బబొఉత్పత్తి చేయాల్సి ఉండగా కేవలం 5.35 మిలియన్ టన్నులు మాత్రమే వెలికితీశారు. ఇదే సమయానికి గత ఏడాది 5.81 మిలియన్ టన్నులు వెలికితీశారు. ఈ పరిస్థితి రెండేళ్లుగా కొనసాగుతోంది. ఇటీవల సింగరేణి బోర్డు సమావేశంలో సైతం ప్రధానంగా భూగర్భ గనుల్లో ఉత్పత్తిని పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపైనే చర్చించినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా భూగర్బ గనులను గాడిలో పెడితేనే ఉత్పత్తి లక్ష్యసాధన సులభమవుతుందని అధికారులు చర్చించుకుంటున్నారు. -
ఆర్టీపీపీ.. ఉత్పత్తి అరకొర
ఎర్రగుంట్ల : వైఎస్ఆర్ జిల్లాలోని రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు (ఆర్టీపీపీ) లో బొగ్గు కొరత కారణ ంగా ఉత్పత్తి 40 శాతానికి పడిపోయింది. చేసేదేమీ లేకపోవడంతో ఓవ్‌రాలింగ్ పేరుతో అధికారులు ఓక్కోసారి ఒక్కో యూనిట్‌ను నిలుపుదల చేస్తున్నారు. కొద్ది రోజులు కిందట 20వేల టన్నుల వరకు బొగ్గు నిల్వ ఉండేది. అది ప్రస్తుతం ఐదువేల టన్నుల కు పడిపోయింది. రాష్ట్రాల విభజన జరగడంతో రాయలసీమ ధర్మల్ పవర్ ప్రాజెక్టుకు తరచు బొగ్గు గండం ఏర్పడుతోంది. దీంతో అన్ని యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి స్తంభించే స్థాయికి ఆర్టీపీపీ చేరుకుంటోంది. ఆర్టీపీపీలో 1,2,3,4,5 యూనిట్లులో 1050 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉంది. బొగ్గు కొరత వల్ల యూనిట్లు ఒకదాని తర్వాత ఒకటి ఓవ్‌రాలింగ్ పేరుతో నిలుపుదల చేస్తున్నారు. 15 రోజుల కిందట 1వ యూనిట్‌ను ఓవ్‌రాలింగ్ పనులు నిమిత్తం నిలుపుదల చేశారు. ఈ యూనిట్‌ను గురువారం సర్వీసులోకి తీసుకున్నారు. ఇంతలో మరో యూనిట్‌ను ఓవ్‌రాలింగ్ పనులు కోసం నిలుపుదల చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారని సమాచరం. దీన్ని బట్టి చూస్తే బొగ్గు కొరత ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది. మిగిలిన యూనిట్లలో కూడా కేవలం 150 చొప్పున 600 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి అవుతోంది. -
దినదిన గండం
సాక్షి ప్రతినిధి, కడప: రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు(ఆర్టీపీపీ)లో బొగ్గు సంక్షోభం తీవ్రతరమైంది. ఏడాదిగా ఇదే పరిస్థితి ఉన్నా కోల్ ఇండియా నుంచి ఆశించిన ఫలితం లేదు. సింగరేణి కాలరీస్ సవతి ప్రేమ చూపుతోంది. వెరసి ఆర్టీపీపీ పరిస్థితి దినదిన గండం నూరేళ్ల ఆయుష్షు అన్నట్లుగా తయారైంది. 1050 మెగా యూనిట్ల సామర్థ్యం స్థానంలో కేవలం 360 మెగా యూనిట్ల ఉత్పత్తితో సరిపెట్టుకోవాల్సిన దుస్థితి నెలకొంది. కాంతులు వెదజల్లాల్సిన చోట మబ్బులు కమ్ముకుంటున్నాయి. రాయలసీమ ప్రాంతానికి తలమానికంగా నిలుస్తున్న ఆర్టీపీపీలో ఉత్పత్తికి తగ్గట్టు బొగ్గు సరఫరా లేదు. సింగరేణి కాలరీస్ యాజమాన్యం నిరంకుశ వైఖరి కారణంగా రెండు యూనిట్లను నిలిపివేయాల్సి వచ్చింది. పరిస్థితి ఏడాదిగా ఇలాగే ఉన్నా జెన్కో యంత్రాంగం చోద్యం చూస్తోందని కార్మికులు ఆరోపిస్తున్నారు. ఆర్టీపీపీ ఐదు యూనిట్లలో 1050 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉన్నా, అవసరం మేరకు బొగ్గు నిల్వలు లేని కారణంగా గణనీయంగా విద్యుత్ ఉత్పత్తి పడిపోయింది. ఐదు యూనిట్ల పూర్తి సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి సాధించాలంటే 15 వేల టన్నుల బొగ్గు అవసరం. ప్రస్తుతం బొగ్గులేని కారణంగా 2, 3 యూనిట్లను నిలిపివేయాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక రేక్ బొగ్గు మాత్రమే ఆదివారం సాయంత్రం చేరినట్లు సమాచారం. ప్రస్తుతం 1, 4, 5 యూనిట్లు మాత్రమే రన్నింగ్‌లో ఉన్నాయి. అది కూడా అతి తక్కువ సామర్థ్యంలో నడుస్తున్నాయి. ఏ కారణంతోనైనా ప్రతిరోజు బొగ్గు రేక్‌లు రాకపోతే ఆర్టీపీపీలో ఆ కాస్త ఉత్పత్తి సైతం సాధ్యం కాదని నిపుణులు చెబుతున్నారు. ఆర్టీపీపీకి బొగ్గు గండం ఏర్పడి దాదాపు ఏడాదిగా ఇదే పరిస్థితి ఉన్నా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడంలో జెన్కో యంత్రాంగం విఫలమైందనే ఆరోపణలున్నాయి. సింగరేణి నిర్లక్ష్యంపై చర్యలేవి? సింగరేణి కాలరీస్ యాజమాన్యం నుంచి 2030 వరకూ రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టుకు బొగ్గు సరఫరా చేయాలనే ఒప్పందం ఉంది. రాష్ట్ర విభజన నాటినుంచి ఇప్పటి వరకూ అక్కడి నుంచి మోతాదు మేరకు సరఫరా లేకుండా పోయిందని ఆర్టీపీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. జెన్కోకు ఉన్న ఒప్పందం ప్రకారం ఆర్టీపీపీకి ప్రతి ఏడాది 38.8 లక్షల టన్నులు బొగ్గు సరఫరా చేయాల్సి ఉంది. ప్రతి నెల సుమారు లక్షల టన్నులు పైబడి కోత విధిస్తున్నారు. ఇప్పుడా పరిస్థితి మరింత అధికమైనట్లు సమాచారం. రాయలసీమకు విద్యుత్ కాంతులు వెదజల్లే ఆర్టీపీపీ సైతం అంధకారంతో మగ్గాల్సిన రోజులు దాపురించాయి. గత నెలరోజులుగా ఆర్టీపీపీలో 1050 మెగావాట్ల పూర్తి సామర్థ్యం మేరకు విద్యుత్ ఉత్పత్తి కావడంలేదు. ఆదివారం కేవలం 360 మెగావాట్లతో సరిపెట్టుకోవాల్సిన దుస్థితి నెలకొంది. గత కొంతకాలంగా ఇలాంటి పరిస్థితి ఉన్నప్పటికీ, ఒప్పందం మేరకు బొగ్గు సరఫరా చేయాలని సింగరేణి యాజమాన్యంపై జెన్కో ఉన్నతాధికారులు ఒత్తిడి తేవడంలో విఫలమయ్యారనే విమర్శలున్నాయి. పతిరోజు ఐదు రేక్‌లు బొగ్గు ఆర్టీపీపీకి దిగుమతి కావాల్సి ఉంది. అంటే ప్రతిరోజు 18వేల టన్నులు సరఫరా కావాలి. అయితే ప్రస్తుతం రెండు రేక్‌లు మాత్రమే సరఫరా అవుతోంది. అది కాస్తా ఆదివారం ఒక్క రేక్తోనే సరిపెట్టారు. ఇంతటి విపత్కర పరిస్థితులు మునుపెన్నడూ ఎదుర్కోలేదని ఆర్టీపీపీ అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. ఆర్టీపీపీలో బొగ్గు కొరత గత కొన్ని నెలలుగా పట్టిపీడిస్తున్నా ప్రభుత్వం ఏమాత్రం శ్రద్ధ చూపలేదు. దీంతో ఆర్టీపీపీ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. కేంద్ర ప్రభుత్వం స్పందిస్తేనే.... ఆర్టీపీపీకి బొగ్గుకొరత విషయంలో కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటే తప్పా, బొగ్గు దిగుమతిలో మార్పు కనిపించే అవకాశం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. కోల్ ఇండియా స్పందిస్తేనే థర్మల్ పవర్ ప్లాంట్ల మనుగడ సాధ్యమవుతుందని నిపుణులు వివరిస్తున్నారు. జలవిద్యుత్ ఉత్పత్తికి క్లిష ్టపరిస్థితులు ఉన్నప్పటికీ, జెన్కో ద్వారా ఉన్న అవకాశాన్ని సైతం వినియోగించుకోలేని దుస్థితి ఆంధ్రప్రదేశ్‌కు నెలకొంది. ఈ పరిస్థితులనుంచి గట్టెక్కాలంటే అవసరమైన బొగ్గు నిల్వలు అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు స్పందించడం అవసరం. -
‘పవర్’ వరం...!
నవరాష్ట్రంలో ఏర్పడిన టీఆర్ఎస్ ప్రభుత్వం పాలమూరుకు తొలి కేటాయింపు చేసింది. రాజధానిలో నిర్వహించిన విద్యుత్తు సమీక్షలో జిల్లాకు వేయి మెగావాట్ల థర్మల్ విద్యుత్తు కేంద్రం ఏర్పాటుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తన తొలి వరంగా ప్రకటించారు. అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. అదీ ప్రాజెక్టుల కేంద్రంగా పరిఢవిల్లుతున్న గద్వాలకు కేటాయించడం మరో విశేషంగా చెప్పుకోవచ్చు. గద్వాల, న్యూస్‌లైన్ : సాగునీటి ప్రాజెక్టుల కేంద్రంగా ఖ్యాతిగాంచిన గద్వాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం మేరకు గురువారం భారీ థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు పచ్చజెండా ఊగింది. జూరాల ప్రాజెక్టు వద్ద, లోయర్ జూరాల వద్ద జెన్కో ఆధ్వర్యంలో దాదాపు 500 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులు పూర్తయి విద్యుత్‌ను అందిస్తున్నాయి. ఈ ప్రాంతంలో ఉన్న వాతావరణం, రేడియేషన్ ఆధారంగా ఇక్కడ సౌర విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేస్తే విజయవంతమవుతాయన్న లక్ష్యంతో జూరాల ప్రాజెక్టు వద్ద ఒక మెగావాట్ సౌర విద్యుత్ కేంద్రాన్ని జెన్కో ఏర్పాటు చేసింది. ఇది జయప్రదం కావడంతో గట్టు మండలంలో ఎన్ఆర్ఐలు దాదాపు వంద మెగావాట్ల సామర్థ్యంతో ప్రైవేటు సౌర విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే భూములను సేకరించారు. జెన్కో ఆధ్వర్యంలోనే గట్టు మండలంలో ఉన్న ప్రభుత్వ భూముల్లో వేయి మెగావాట్ల సౌర విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు గత మార్చినెలలో జెన్కో ఎంఓయూను కుదుర్చుకుంది. దీంతో గట్టు ప్రాంతంలో సౌర విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు మార్గం సుగమమైంది. గద్వాల మీదుగా రాయచూర్‌కు రైల్వే బ్రాడ్‌గేజ్‌లైన్ ప్రారంభం కావడంతో గద్వాల జంక్షన్‌గా అవతరించింది. ధరూరు మీదుగా వెళ్తున్న ఈ లైన్‌ద్వారా సింగరేణి, షిప్‌యార్డుల నుంచి బొగ్గును ఈ ప్రాంతానికి తీసుకొచ్చేందుకు అవకాశం ఏర్పడింది. జూరాల రిజర్వాయర్ నుంచి థర్మల్ విద్యుత్ కేంద్రానికి కావల్సిన నీటిని సరఫరా చేసే అవకాశం ఉండటంతో ఇక్కడ వేయి మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రానికి గతంలోనే ప్రతిపాదించారు. అప్పటి మంత్రి డీకే అరుణ కూడా వేయి మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఇలా పెండింగ్‌లో ఉన్న థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో మార్గం సుగమమైంది. రీఆర్గనైజేషన్ బిల్లులోనే భారీ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటు అవసరమని పేర్కొన్నారు. విద్యుత్తు లోటును భర్తీ చేసేందుకే.. తెలంగాణలో ఉన్న విద్యుత్ లోటును భర్తీ చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యుత్ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో భూపాలపల్లి గద్వాల వద్ద విద్యుదుత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు అధికారులను ఆదేశించారు. గద్వాల వద్ద ఏర్పాటయ్యే థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ప్రభుత్వమే సొంత నిధులతో నిర్మిస్తుందని సీఎం పేర్కొన్నారు. ఈ కేంద్రానికి సింగరేణితో పాటు, విదేశాల నుంచి బొగ్గును దిగుమతి చేసుకునే ఏర్పాట్లు చేయాలని సీఎం అదేశించినట్లు అధికారుల ద్వారా తెలిసింది. దీంతో గద్వాల ప్రాంతం విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులు, సాగునీటి ప్రాజెక్టులతో జిల్లాలోనే ప్రాజెక్టుల కేంద్రంగా నిలవబోతోంది. -
విద్యుత్‌కు రూ.32 వేల కోట్లు
సాక్షి, చెన్నై: రాష్ట్రంలో మరో నాలుగు థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. రూ.32 వేల కోట్లతో అంచనా వ్యయం రూపొందించారు. త్వరలో అధికారిక ప్రకటనతో ఈ పనులు ఆరంభం కానున్నాయి. రాష్ట్రంలో ఆదివారం నుంచి అమల్లోకి వచ్చిన కోతల రహిత నిరంతర విద్యుత్ సరఫరా సాధ్యమయ్యేనా? అన్న ప్రశ్న బయలుదేరింది. రాష్ట్రంలో రోజురోజుకూ విద్యుత్ వాడకం పెరుగుతుండడంతో అందుకు తగ్గట్టుగా ఉత్పత్తిని వేగవంతం చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అన్నాడీఎంకే సర్కారు అధికారంలోకి వచ్చాక మూడు కొత్త ప్రాజెక్టుల ద్వారా విద్యుత్ ఉత్పత్తి ఆరంభం అయింది. థర్మల్ విద్యుత్ ద్వారా ఫలాలు దక్కుతుంటే, వర్షాభావ పరిస్థితులతో జలవిద్యుత్ నిరాశ పరిచింది. పవన విద్యుత్ గాలుల ప్రభావం మేరకు అటూ ఇటూ ఊగిసలాడుతోంది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం థర్మల్ విద్యుత్ కేంద్రాల మీద దృష్టి కేంద్రీకరించింది. ఇటీవల కేంద్రంతో కలసి ఉడన్కుడిలో థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని నెలకొల్పే పనిలో పడింది. వెయ్యి మెగావాట్ల ఉత్పత్తి లక్ష్యంగా ఇక్కడ రెండు యూనిట్ల ఏర్పాటు పనులు వేగవంతం అయ్యాయి. మరికొన్ని నెలల్లో ఈ కేంద్రాల నుంచి ఫలాలు దక్కనున్నాయి. కొత్త ప్రాజెక్టులు: ఉడన్ కుడి పనులు ముగిసిన తర్వాత రాష్ట్రంలో కొత్తగా నాలుగు ప్రాజెక్టులకు ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల నాటికి మరో ఐదు వేల మెగావాట్ల ఉత్పత్తి లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నది. రూ.32 వేల కోట్లు ఇందుకు అంచనాగా రూపొందించారు. ఉత్తర చెన్నైలో రెండు యూనిట్లతో ఓ ప్రాజెక్టు ఏర్పాటు చేయనున్నారు. ఒక్కొక్కటి 660 మెగావాట్ల ఉత్పత్తి లక్ష్యంగా ఈ కేంద్రం పనిచేయనున్నది. రామనాథపురం ఉప్పడంలో 800 మెగావాట్ల ఉత్పత్తి లక్ష్యంగా ఓ థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుకు, తూత్తుకుడిలో వెయ్యి మెగావాట్ల లక్ష్యంగా రెండు ప్రాజెక్టులకు కసరత్తు చేస్తున్నారు. మరో ప్రాజెక్టుకు సైతం చర్యలు తీసుకున్నారని, అయితే, అది ఎక్కడ ఏర్పాటు చేయాలన్న దానిమీద స్థల పరిశీలనలో నిమగ్నమయ్యారంటూ విద్యుత్ బోర్డు వర్గాలు పేర్కొంటున్నాయి. నిరంతర విద్యుత్ సాధ్యమా?: రాష్ట్రంలో కోతల రహితంగా నిరంతర విద్యుత్ సరఫరా సాధ్యమయ్యేనా అన్న ప్రశ్న బయలుదేరింది. ఆదివారం నుంచి ఎలాంటి కోతలు, ఆంక్షలు లేకుండా విద్యుత్ సరఫరా చేసే పనిలో రాష్ట్ర ప్రభుత్వం నిమగ్నం అయింది. రాష్ట్రంలో కోటి 41 లక్షల 42 వేల ఇంటి కనెక్షన్లు, 19 లక్షల 11 వేల వ్యవసాయ పంప్ సెట్, 26 లక్షల 32 వేల వాణిజ్య సంస్థలకు, ఐదు లక్షల తొమ్మిది వేల పరిశ్రమలకు కనెక్షన్లు, 20 లక్షల ఎనిమిది వేల అదనపు కనెక్షన్లు ఉన్నాయి. ఈ వినియోగ దారులకు ఒక రోజుకు 12,500 మెగావాట్లు విద్యుత్ అవసరం. అరుుతే విద్యుత్ ఉత్పత్తితో పనిలేదని, ఇక నిరంతర విద్యుత్ తమ లక్ష్యం అంటూ గత నెల సీఎం జయలలిత ప్రకటించారు. జూన్ ఒకటో తేదీ నుంచి విద్యుత్ కోతలకు మంగళం పాడుతున్నామని, పరిశ్రమలు, వాణిజ్య సంస్థలకు అమల్లో ఉన్న అన్ని రకాల ఆంక్షలను ఎత్తి వేస్తున్నామని జయలలిత స్పష్టం చేశారు. ఆ మేరకు ఆదివారం నుంచి అన్ని రకాల ఆంక్షలు రద్దు అయ్యాయి. తొలి రోజు ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా చేయడంలో సఫలీకృతులయ్యారు. అయితే, ఇదే, సరఫరా మిగిలిన అన్ని రోజులు చేయగలరా? అన్న ప్రశ్న ప్రజల్లో బయలు దేరింది. సీఎం జయలలిత ఒత్తిడి మేరకు అధికారులు చేయగలమని భరోసా ఇస్తున్నా, విద్యుత్ కేంద్రాల్లో ఏదేని సాంకేతిక సమస్యలు తలెత్తిన పక్షంలో పరిస్థితి తారుమారయ్యే అవకాశం ఉంటుంది. -
కోత కోస్తున్నారు..
వారం రోజులుగా తీవ్ర స్థాయిలో ఉష్ణోగ్రత నమోదవుతోంది. అదే క్రమంలో అప్రకటిత విద్యుత్ కోతలు పెరగడంతో ప్రజలు నానాకష్టాలు పడున్నారు.చంటి బిడ్డల నుంచి వృద్ధుల వరకు ఉక్కపోతతో విలవిలలాడుతున్నారు. సాగునీరందక రైతులు, పనులు జరగక చిరువ్యాపారులు, కార్మికులు నష్టపోతున్నారు. జనం ఏమైపోతేనేం అనే ధోరణిలో అధికారులు ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ పేరుతో ఎడాపెడా విద్యుత్ కోతలు విధిస్తూ నరకం చూపిస్తున్నారు. నెల్లూరు(హరనాథపురం), న్యూస్‌లైన్: థర్మల్ పవర్ ప్రాజెక్ట్‌ల్లో ఉత్పత్తి మందగిం చిందనే సాకుతో అధికారులు కరెంట్ కోతలను పెంచేశారు. ప్రస్తుతం నెల్లూరు నగరంలో ఉదయం 8 నుంచి 10 గంటల వర కు, మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు, రాత్రి 8.45 నుంచి 9.45 గంటల వరకు కోత విధిస్తున్నారు. మున్సిపాలిటీల్లో ఉదయం 6 నుంచి 9 గంటల వరకు, మధ్యాహ్నం 12 నుంచి 3 వరకు, మండల కేంద్రాలు, సబ్‌స్టేషన్ హెడ్‌క్వార్టర్స్ పరిధిలో ఉదయం 6 నుంచి 9 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 6 గంట ల వరకు కోతలు అమలవుతున్నాయి. ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్, సాంకేతిక కారణాలు, ట్రాన్స్ఫార్మర్ మరమ్మతులు, ఫీజులు నిలబడటం లేదనే సాకులతో పేరుతో అదనంగా మరికొన్ని గంటల పాటు కోత పెడుతున్నారు. రోగుల కష్టాలు ఇష్టానుసారంగా కోతలు విధిస్తుండడంతో జిల్లాలోని ప్రభుత్వ వైద్యశాలల్లో చికిత్సపొందుతున్న రోగులు అల్లాడిపోతున్నారు. నెల్లూరులోని పెద్దాస్పత్రి, రేబాల ఆస్పత్రి, కావలి, గూడూరు ప్రభుత్వాస్పత్రులతో పాటు పలుచోట్ల విద్యుత్ కోతల సమయంలో జనరేట ర్లు వినియోగించడం లేదు. ఓ వైపు ఫ్యాన్లు, లైట్లు పనిచేయకపోవడం, మరోవైపు దోమల బెడదతో రోగులతో పాటు వారి సహాయకులు పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు. శస్త్రచిక్సితల సమయంలో విద్యుత్ సరఫరా నిలిచి పోతుండడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో స్కానింగ్, ఎక్స్‌రేలు తీసి ప్రత్యేక వైద్యసేవలు చేసేందుకు కూడా వీలులేని పరిస్థితి నెలకొంది. గ్రామీణ ప్రాంతా ల్లో తాగునీటి పథకాలు పనిచేయక తాగునీటి సమస్య తీవ్రమవుతోంది. చిన్నపరిశ్రమల కుదేలు జెరాక్సు షాపులు, జ్యూస్సెంటర్లు, పిండి మిల్లులు, వెల్డింగ్ షాపులు, ఆటోనగర్‌లోని వర్కుషాపుల్లో పనులు స్తంభిస్తున్నాయి. పనులు సాఫీగా సాగకపోతుండడంతో రోజువారి కూలీపై పనిచేసే వారు పస్తులుంటున్నారు. వడ్డీలకు తెచ్చి వ్యాపారాలు చేసుకుంటున్న వారు ఏమి చేయాలో తెలియక దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. పెరుగుతున్న చోరీలు రాత్రి వేళలో విధిస్తున్న విద్యుత్‌కోతలతో చోరీలు పెరుగుతున్నాయి. నెల్లూరులో రాత్రి 8.45 నుంచి 9.45 గంటల వరకు విద్యుత్ కోత అమలవుతున్నా ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ పేరుతో మిగిలిన ఏ సమయాల్లో కోత విధిస్తారో తెలియని పరిస్థితి. ఇదే అదునుగా దొంగలు రెచ్చిపోతున్నారు. వీధుల్లో వెళుతున్న వారి మెడల్లో నగలను తెంచుకెళుతున్నారు. ఇటీవల నెల్లూరులోని బాలాజీనగర్‌లో ఓ మహిళ మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లారు. ఇక శివారు ప్రాంతాల ప్రజలైతే చీకటి పడిన తర్వాత బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కనీసం రాత్రి వేళలో అయినా విద్యుత్ సరఫరాను సక్రమంగా చేయాలని కోరుతున్నారు. -
ఆర్టీపీపీకి బొగ్గు గండం..
ఎర్రగుంట్ల,న్యూస్‌లైన్ : ఎర్రగుంట్ల మండలంలో ఉన్న రాయలసీమ ధర్మల్ పవర్ ప్రాజెక్టు(ఆర్టీపీపీ)కు బొగ్గు గండం ఏర్పడింది. ఏరోజు బొగ్గు రేక్స్ వ్యాగన్లు రాకపోయినా విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడనుంది. మూడు నెలలుగా ఆర్టీపీపీలో బొగ్గు సమస్య ఉంది. ఏ రోజుకు ఆరోజు సరిపడు బొగ్గు వస్తోంది. ప్రస్తుతం ఆర్టీపీపీలో 5వేల టన్నుల బొగ్గు నిల్వలు మాత్రమే ఉన్నాయి. ఆర్టీపీపీలోని 1,2,3,4,5 యూనిట్లలో పూర్తి సామర్థ్యం తీయడానికి రోజుకు సుమారు 15వేల టన్నుల నుంచి 16500 టన్నుల బొగ్గు అవసరం ఉందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం బొగ్గు కొరతగా ఉన్నా వస్తున్న బొగ్గును నిలువచేయకుండానే వాడుకుంటూ 1050 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని తీస్తున్నారు. ఈ విషయంపై ఆర్టీపీపీ సీఈ కుమార్‌బాబును న్యూస్‌లైన్ వివరణ కోరగా ప్రస్తుతం ఆర్టీపీపీలో 5వేల టన్నుల బొగ్గుల నిల్వలు మాత్రమే ఉన్నాయని అన్నారు. రోజూ బొగ్గు వ్యాగన్లు వస్తున్నాయని అన్నారు. సోమవారం ఐదు రేక్స్‌ల బొగ్గు వచ్చిందన్నారు. ఒక వేళ బొగ్గు రాక పోతే యూనిట్లను నడపలేమని ఆయన స్పష్టం చేశారు. -
మహబూబ్‌నగర్ జిల్లాలో థర్మల్ ప్లాంటు!
సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లాలోని ధరూర్, గట్టు మండలాల్లో థర్మల్ విద్యుత్ ప్లాంటు ఏర్పాటుకు సీఎం సానుకూలంగా స్పందించినట్టు మంత్రి డీకే అరుణ మంగళవారం తెలిపారు. 4 వేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన ప్లాంటు ఏర్పాటుకు ప్రతిపాదనలను సీఎంకు సమర్పించినట్టు ఆమె పేర్కొన్నారు. ప్లాంటుకు అవసరమైన నీటికోసం జూరాల ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌ను వినియోగించుకోవచ్చన్నారు. ప్రాజెక్టు ఏర్పాటుతో జిల్లాలోని ఎత్తిపోతల పథకాలతోపాటు, విద్యుత్ అవసరాలు తీరుతాయన్నారు. -
4,5 యూనిట్లు పునరుద్ధరణ
ఎర్రగుంట్ల,న్యూస్‌లైన్ : రాయలసీమ ధర్మల్ పవర్ ప్రాజెక్టు (ఆర్టీపీపీ)లోని 4,5 యూనిట్లు సర్వీసులోకి వచ్చినట్లు సీఈ కుమార్‌బాబు శుక్రవారం తెలిపారు. సమైక్యాంధ్ర కోసం చేస్తున్న సమ్మెను తాత్కాలికంగా విరమించిన ఉద్యోగులు, ఇంజనీర్లు విధులకు హాజరై యూనిట్లను సర్వీసులోకి తెచ్చే ప్రయత్నాలు చేశారన్నారు. దీంతో శుక్రవారం 4,5 యూనిట్లు సర్వీసులోకి రాగా రెండవ యూనిట్‌ను కూడా లైటప్ చేశామన్నారు. ఏ క్షణంలోనైనా రెండవ యూనిట్కూడా సర్వీసులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. మిగిలిన 1,3 యూనిట్లలో మరమ్మతులు జరుగుతున్నాయని, శనివారం సాయంత్రానికి ఈ యూనిట్లు కూడా సర్వీసులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం డిమాండ్ లేని కారణంగా 4,5 యూనిట్లలో పూర్తి సామర్థ్యం మేరకు విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం లేదన్నారు. ఒక్కొక్క యూనిట్లో 210 మెగావాట్ల ఉత్పత్తికిగాను 150 మెగావాట్ల విద్యుత్‌ను మాత్రమే ఉత్పత్తి చేస్తున్నామన్నారు. -
కారుచీకట్లు
విద్యుత్ ఉద్యోగుల సమ్మెతో జిల్లాలో అంధకారం అలుముకుంది. ఉదయం నుంచి రాత్రి వరకు ప్రజలు అల్లాడిపోయారు. కేంద్ర కేబినెట్ తెలంగాణ నోట్‌కు ఆమోదం తెలిపిన తర్వాత ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసే దిశగా సమైక్యవాదులు అడుగు ముందుకేశారు. విద్యుత్ సరఫరా నిలిపివేసి నిరసన తెలపడంతో ప్రజలకు తీవ్ర అసౌకర్యం తప్పలేదు. తెలంగాణ అంశంపై కేంద్రం వైఖరిలో వచ్చిన మార్పును బట్టే ఉద్యమ స్వరూపం కూడా మారు సాక్షి, కడప: సమైక్య ఉద్యమం ఆదివారం జిల్లాను అంధకారంలోకి నెట్టింది. విద్యుత్ ఉద్యోగులు నిరవధిక సమ్మెలోకి వెళ్లడంతో ఆదివారం ఉదయం 10.45 గంటల నుంచి జిల్లావ్యాప్తంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో పట్టణ ప్రాంతాలతో పాటు పల్లె జనాలు కూడా తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నారు. ఆర్టీపీపీలో పూర్తిగా నిలిచిపోయిన విద్యుదుత్పత్తి: ఆర్టీపీపీ(రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు)లోని ఉద్యోగులు, కార్మికులు మొత్తం కలిపి 2,700మంది సమ్మెలోకి వెళ్లడంతో 5 యూనిట్లలోని 1050 మెగావాట్ల విద్యుత్ నిలిచిపోయింది. దీంతో పాటు శ్రీశైలం నుంచి వచ్చే సరఫరాను కూడా గ్రిడ్‌కు అనుసంధానం చేయకపోవడంతో జిల్లాలో ఆదివారం ఉదయం 10.45 గంటలకు కరెంటు సరఫరా నిలిచిపోయింది. దీంతో జిల్లా ప్రజలు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కనీసం చేతిపంపు నీటి కోసం తిరిగినా నగరంలో ఎక్కడా చేతిపంపులు కనిపించలేదు. కొంతమంది ఇరుగుపొరుగు ఇళ్లలోని నీటితో సర్దుకుంటే, మరికొందరు ఇంట్లో నిల్వచేసుకున్న కార్పొరేషన్ నీటినే సేవించాల్సి వచ్చింది. కనీస అవసరాలకు కూడా నీరు దొరక్క చాలామంది తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఆదివారం రాత్రి 7 గంటలకు కరెంటు వస్తుందనే ప్రచారంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఒకదశలో పూర్తిగా రాదని తెలియడంతో తీవ్ర ఆందోళన చెందారు. రాత్రి వేళలో కరెంట్ లేక దోమల బెడదతో అల్లాడారు. ఫ్యాన్లు లేక చిన్నపిల్లలు, వృద్ధులు మరింత ఇబ్బంది పడ్డారు. ఇదే పరిస్థితి దాదాపు అన్ని పట్టణప్రాంతాల్లోనూ సంభవించింది. పల్లెల్లో కూడా కరెంటు సమస్యలు స్పష్టంగా కన్పించాయి. ఎట్టకేలకు రాత్రి 7.45 గంటల ప్రాంతంలో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. దసరాపై కరెంటు ప్రభావం దసరా ఉత్సవాలపై కరెంటుకోత ప్రభావం పడింది. శనివారం రాత్రి నుంచి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు మొదలయ్యాయి. ప్రొద్దుటూరు అమ్మవారిశాల, శివాలయంతో పాటు కడపలోని విజయదుర్గాదేవి, అమ్మవారిశాల,మైదుకూరు, రాజంపేట, రైల్వేకోడూరు, రాజంపేటలోని అమ్మవారి ఆలయాలు శనివారం విద్యుత్‌దీప కాంతులతో వెలుగులీనాయి. అయితే ఆదివారం కరెంటుకోతతో ఆలయాల్లో చిమ్మచీకట్లు కమ్మాయి. కొన్నిచోట్ల జనరేటర్లను ఉపయోగించి సమస్యను అధిగమించారు. అమ్మవారి దర్శనార్థం వచ్చిన భక్తులు కూడా కరెంటు సరఫరా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కరెంటు నిలిపేయడం సరికాదు: థామస్, ఇంజనీర్, కడప సమైక్య ఉద్యమానికి అన్ని వర్గాల ప్రజలు సహకరించారు. బంద్‌లతో పాటు అన్ని నిరసన కార్యక్రమాలకు సహకరించారు. చివరకు ప్రభుత్వ పాఠశాలలు మూసి ప్రైవేటు పాఠశాలలు తెరిచినా ఉద్యమం కోసం సహించారు. కానీ చివరకు కరెంటును తొలగించడం దారుణం. చిన్నపిల్లలు, వృద్ధులు అందరూ ఇబ్బంది పడారు. వెంటనే కరెంటును సరఫరా చేయాలి. వెంటనే కరెంటు సరఫరా చేయాలి: ప్రసన్నకుమారి, విద్యార్థిని, కడప సమైక్య ఉద్యమం తప్పుదారి పడుతోంది. కరెంటు తీసేయడం దారుణం. పగలంటే సరే. రాత్రి పూట కరెంటు తీసేస్తే దొంగతనాలు జరిగే ప్రమాదముంది. తాగునీటితో పాటు రాత్రి పూట నిద్రపోవాలన్నా కష్టంగానే ఉంది. కరెంటు నిలిపేయడం సరైన చర్యకాదు. వెంటనే కరెంటు సరఫరా చేయాలి.