సాక్షి, హైదరాబాద్: నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(ఎన్టీపీసీ) ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా రామగుండంలో 1600 (2x800) మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టులో భారీ లోపం బయటపడింది. విద్యుత్ కేంద్రంలోని 800 మెగావాట్ల తొలి యూనిట్ నిర్మాణం పూర్తయినా బాయిలర్‌లోని రీహీటర్ ట్యూబ్స్ విఫలం కావడంతో గత డిసెంబర్‌లో జరగాల్సిన ట్రయల్ రన్ వాయిదా పడింది.
మరమ్మతుల్లో భాగంగా ఈ గొట్టాలకు లోపాలున్న చోట కట్ చేసి వెల్డింగ్ చేస్తున్నారు. ఏకంగా 7,500 చోట్ల వెల్డింగ్ చేస్తున్నారని, ఇందుకు మరో నెల రోజుల సమయం పట్టనుందని అధికార వర్గాలు తెలిపాయి. ఆలోగా మరమ్మతులు పూర్తయితే మార్చిలో తొలి యూనిట్ ద్వారా ప్రయోగాత్మకంగా విద్యుదుత్పత్తి జరిపి ట్రయల్ రన్ నిర్వహించే అవకాశాలున్నాయి.
రీహీటర్ ట్యూబులే కీలకం
థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో హై ప్రెషర్, ఇంటర్మీడియేటరీ ప్రెషర్, లో ప్రెషర్ టర్బైన్లు ఉంటాయి. బాయిలర్లలో వేడిచేసిన నీళ్లు ఆవిరిగా మారి 600 సెంటిగ్రేడ్‌ల ఉష్ణోగ్రత, భారీ పీడనంతో గొట్టాల ద్వారా ‘హైప్రెషర్ టర్బైన్’లోకి ప్రవేశించి దాన్ని తిప్పుతూ మళ్లీ వెనక్కి మళ్లుతుంది. బాయిలర్‌లోకి తిరిగి చేరే సమయానికి ఆవిరి ఉష్ణోగ్రత 300 సెంటిగ్రేడ్‌లకు పడిపోతుంది.
రీహిటర్ ట్యూబ్స్‌లో మళ్లీ 600 సెంటిగ్రేడ్‌లకు వేడెక్కిన తర్వాత ‘ఇంటర్మీడియేటరీ ప్రెషర్ టర్బైన్’లోకి గొట్టాల ద్వారా ఆవిరి ప్రవేశించి దాన్నీ తిప్పుతూ చివరకు ‘లోప్రెషర్ టర్బైన్ ’లోకి చేరుతుంది. అక్కడ చల్లబడిన ఆవిరి మళ్లీ బాయిలర్‌లోకి నీళ్ల రూపంలో ప్రవేశిస్తుంది. మళ్లీ ఆవిరిగా మారి ‘హై ప్రెషర్ టర్బైన్’లోకి ప్రవేశిస్తుంది. ఈ ప్రక్రియ అంతా ఒక లూప్‌గా జరుగుతుంది. నీళ్లు రీసైకిల్ అవుతూ ఉంటాయి.
నాసిరకం గొట్టాలతో సమస్యే
ఆవిరి టర్బైన్లను తిప్పడం ద్వారా వెలువడే యాంత్రికశక్తిని ఎలక్ట్రిక్ జనరేటర్ విద్యుచ్ఛక్తిగా మార్చుతుంది. ఈ ప్రక్రియలో కీలకమైన ‘రీహీటర్ ట్యూబ్స్’లో నాణ్యత లేకుంటే అవి 600 సెంటిగ్రేడ్‌ల ఉష్ణోగ్రతలతోపాటు తీవ్ర పీడనాన్ని తట్టుకోవడం సాధ్యం కాదు. నాసిరకం ముడిసరుకుతో తయారైన గొట్టాలు తరచూ కోతకు గురికావడం, తుప్పుపట్టడం జరుగుతుందని నిపుణులు అంటున్నారు.
దీంతో ఆవిరి ఉష్ణోగ్రతలు పడిపోయి విద్యుదుత్పత్తి నిలిచిపోతుందని చెబుతున్నారు. రీహీటర్ ట్యూబ్స్‌లో వచ్చే సమస్యలతోనే థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తికి అధిక శాతం అంతరాయాలు కలుగుతాయి. దక్షిణ కొరియా నుంచి దిగుమతి చేసుకున్న గొట్టాలను ఎన్టీపీసీ వినియోగించినా విఫలం కావడంపట్ల నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి వెల్డింగ్ చేసి మరమ్మతులు చేసినా భవిష్యత్తులో అవి మళ్లీ విఫలమయ్యే అవకాశముందని పేర్కొంటున్నారు. రీహీటర్ గొట్టాలకు లీకేజీలతో గత డిసెంబర్‌లో నిర్వహించాల్సిన తొలి యూనిట్ సింక్రనైజేషన్ ప్రక్రియ వాయిదా పడింది.
నిర్మాణ జాప్యంతో రాష్ట్రంపై భారం
తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టులోని తొలి యూనిట్ నుంచి 2020 జూన్‌లో, రెండో యూనిట్ నుంచి 2020 నవంబర్ నాటికి వాణిజ్యపరంగా విద్యుదుత్పత్తి (సీఓడీ) ప్రారంభం కావాల్సి ఉంది. కానీ నిర్మాణంలో జాప్యంతో తొలి యూనిట్ గడువును 2023 మార్చి, రెండో యూనిట్ గడువును 2023 జూలైకు ఎన్టీపీసీ పొడిగించింది. రీహీటర్ ట్యూబ్స్ విఫలం కాకుంటే గత జనవరి నాటికి తొలి యూనిట్, మార్చి నాటికి రెండో యూనిట్ అందుబాటులో కి వచ్చేదని అధికార వర్గాలు తెలిపాయి.
వేసవి విద్యుత్ అవసరాల కోసం ప్రస్తుతం రాష్ట్రం ఒక్కో యూనిట్‌ను సగటున రూ.7.20 ధరకు నిత్యం రూ.60 కోట్ల విలువైన విద్యుత్‌ను ఎక్ఛ్సేంజీల నుంచి కొంటోంది. ఎన్టీపీసీ విద్యుత్ కేంద్రం సకాలంలో పూర్తై ఉంటే యూనిట్‌కు రూ. 5 ధరతో విద్యుత్ లభించేది. దీంతో అధిక ధర విద్యుత్ కొనుగోళ్ల భారం తప్పేదని, ప్రస్తుత ఫిబ్రవరిలోనే రూ.50 కోట్ల మేర ఆదా అయ్యేవని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment