సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చే ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. ఎన్టీపీసీతో కలసి సంయుక్తంగా కేంద్రం ఈ బృహత్ కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. ఇందుకోసం రూపొందించిన ప్రత్యేక కార్యక్రమంలో ఇప్పుడు తెలంగాణ ఆర్టీసీ కూడా భాగం పంచుకోనుంది. ప్రయోగాత్మకంగా మొదటి దశలో హైదరాబాద్‌లో నడుస్తున్న 100 బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చనున్నారు. మరో 2–3 నెలల్లో ఇవి పొగలేని కాలుష్యరహిత వాహనాలుగా నగర రోడ్లపై పరుగుపెట్టనున్నాయి. మలిదశలో మరిన్ని బస్సులను కూడా మార్చనున్నారు. దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్యను పెంచే క్రమంలో కేంద్రం ఈ కార్యక్రమం చేపట్టింది.
కేంద్రం నుంచి కిట్.. ఎన్టీపీసీ నుంచి బ్యాటరీ..
కొత్త ఎలక్ట్రిక్ బస్సు కొనాలంటే రూ. కోటిన్నరకుపైగానే ఖర్చు కానుంది. అదే ఏసీ బస్సుకు రూ. 2 కోట్ల వరకు వ్యయం చేయాల్సిందే. ఇంత భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో ఆర్టీసీ వాటిని సమకూర్చుకోలేకపోతోంది. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సహకారం ఉన్న మహారాష్ట్ర, గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో అక్కడి ఆర్టీసీలు ఎలక్ట్రిక్ బస్సులు కొంటున్నాయి. ఈ నేపథ్యంలో పాత బస్సులనే ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చాలని తెలంగాణ ఆర్టీసీ గతంలో ప్రయత్నించింది.
ఇటీవల ఓ ప్రైవేటు సంస్థ ఆధ్వర్యంలో ముషీరాబాద్ డిపోలోని ఓ బస్సును మార్చి పరిశీలిస్తోంది. ఇలా మార్చడానికి కూడా దాదాపు రూ.65 లక్షల వరకు ఖర్చు కానుండటంతో ఆ ప్రక్రియ కూడా ముందుకు పడటం లేదు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆర్టీసీకి తీపికబురు అందించింది. స్వయంగా ఈ మార్పిడి ప్రక్రియ ప్రాజెక్టును అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించింది. దీంతో తెలంగాణ ఆర్టీసీ కూడా అందుకు అంగీకరిస్తూ ప్రయోగాత్మకంగా తొలిదశలో 100 బస్సులను కన్వర్ట్ చేసుకోవడానికి ముందుకొచ్చింది.
తాజా ప్రాజెక్టు ప్రకారం.. కేంద్ర ప్రభుత్వం కన్వర్షన్ కిట్ కోసం ఒక్కో బస్సుకు రూ. 20 లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తుంది. ఆ కిట్ సరఫరాకు కూడా ఏర్పాట్లు చేయనుంది. ఇక ఎన్టీపీసీ రూ. 40 లక్షల విలువైన బ్యాటరీని సరఫరా చేయనుంది. ఇందుకోసం బ్యాటరీ తయారీ కంపెనీతో అది ఒప్పందం కుదుర్చుకుంది. వెరసి ఆర్టీసీకి నయాపైసా ఖర్చు లేకుండా ఒక్కో బస్సుకు రూ.60 లక్షల విలువైన పరికరాలు అందనున్నాయి.
అద్దె వసూలు చేసుకోనున్న ఎన్టీపీసీ..
ఎలక్ట్రిక్ బస్సులుగా కన్వర్ట్ అయిన బస్సులను ఆర్టీసీనే నడపనుంది. టికెట్ల రూపంలో వచ్చే ఆదాయాన్ని ఆర్టీసీనే తీసుకోనుంది. కానీ జీసీసీ పద్ధతిలో ఆర్టీసీకి సమకూర్చే బస్సులకు కిలోమీటరుకు నిర్ధారిత మొత్తం అద్దె చెల్లిస్తున్నట్టుగా ఈ కన్వర్ట్ అయిన బస్సులకుగాను ఎన్టీపీసీకి నిర్ధారిత మొత్తాన్ని ఆర్టీసీ అద్దెగా చెల్లించాల్సి ఉంటుంది. బస్సుల చార్జింగ్ ఏర్పాట్లను ఆర్టీసీ సొంతంగా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది.
►సాధారణంగా ఒక డీజిల్ బస్సుకు కి.మీ.కు రూ. 20 వరకు నిర్వహణ ఖర్చు వస్తుంది.
►అదే బ్యాటరీ బస్సుకు ఆ ఖర్చు రూ. 6గానే ఉంటుంది. వెరసి కి.మీ.కు రూ. 14 వరకు ఆదా అవుతుంది.
►కేంద్ర ప్రాజెక్టు వల్ల ఆర్టీసీకి కన్వర్షన్ భారం లేనందున వీలైనన్ని బస్సులను ఎలక్ట్రిక్‌లోకి మార్చుకొనే వెసులుబాటు కలుగుతుంది.
►ప్రస్తుతం ఆర్టీసీలో దాదాపు 3 వేలకుపైగా అద్దె బస్సులున్నాయి. త్వరలో 300 ఎలక్ట్రిక్ బస్సులు, 10 డబుల్ డెక్కర్ బస్సులను, కొన్ని స్లీపర్ బస్సులను ఆర్టీసీ అద్దెకు తీసుకోనుంది. వాటికి చెల్లిస్తున్నట్టుగానే కన్వర్షన్ బస్సులకు కూడా అద్దె చెల్లిస్తుంది. ఇది ఆర్టీసీకి పెద్ద భారం కాబోదు.
Comments
Please login to add a commentAdd a comment