సాక్షి, హైదరాబాద్: ముంబై తరహాలో హైదరాబాద్ రోడ్లపైనా త్వరలోనే ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు పరుగులు పెట్టనున్నాయి. నగరంలోని పలు రూట్లలో 10 విద్యుత్ డబుల్ డెక్కర్ బస్సులను తిప్పాలని టీఎస్‌ఆర్టీసీ నిర్ణయించింది. అయితే ఒక్కో ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ ఖరీదు రూ. 2.25 కోట్ల వరకు ఉండటం.. అంత ఖర్చును భరించే ఆర్థిక పరిస్థితి సంస్థకు లేకపోవడంతో అద్దె ప్రాతిపదికన వాటిని ఆర్టీసీ ప్రవేశపెట్టనుంది.
ఇందుకోసం 4–5 రోజుల్లో టెండర్ నోటిఫికేషన్ జారీ చేయనుంది. క్రాస్ కాస్ట్ విధానంలో ఈ బస్సులు నడిపేందుకు ఆసక్తి ఉన్న కంపెనీలు ముందుకు రావాలని టెండర్ నోటిఫికేషన్‌లో కోరనుంది. అద్దె పద్ధతిలో బస్సులు నిర్వహించే సంస్థతో టెండర్ దక్కించుకున్న సంస్థ ఒప్పందం కుదుర్చుకొని ఆర్టీసీకి బస్సులు సరఫరా చేయాల్సి ఉంటుంది. ప్రతి కిలోమీటర్ చొప్పున నిర్ధారిత అద్దెను ఆర్టీసీ ఆ సంస్థకు చెల్లించనుంది.
ప్రభుత్వ ఆర్థిక సాయం లేనందున..
ముంబైలోని బృహన్‌ముంబై విద్యుత్ సరఫరా, రవాణా (బెస్ట్) సంస్థ దేశంలోనే తొలిసారి విద్యుత్‌తో నడిచే డబుల్ డెక్కర్ బస్సులను ప్రవేశపెట్టనుంది. అశోక్ లేలాండ్ అనుబంధ సంస్థ స్విచ్ మొబిలిటీ ద్వారా దశలవారీగా సుమారు 400 ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు కొనుగోలు చేయనుంది. ఇప్పటికే తయారీ సంస్థ నుంచి ఓ బస్సును అందుకుంది. మహారాష్ట్ర ప్రభుత్వం ఈ బస్సుల కొనుగోలుకు ‘బెస్ట్’కు భారీగా ఆర్థిక చేయూత అందించడంతో సొంతంగా ఆ బస్సులను కొనుగోలు చేస్తోంది.
కానీ రాష్ట్రంలో కొత్త బస్సుల కొనుగోలుకు ప్రభుత్వం కొత్తగా ఆర్థిక సాయం ఏదీ ప్రకటించనందున అద్దె ప్రాతిపదికపై వాటిని కొనాలని ఆర్టీసీ నిర్ణయించింది. గతంలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, నగరంలో మళ్లీ డబుల్ డెక్కర్ బస్సులను ప్రవేశపెట్టే అంశాన్ని ప్రస్తావించడంతో ఆర్టీసీ సిద్ధపడ్డ విషయం తెలిసిందే. అప్పట్లో సాధారణ డబుల్ డెక్కర్ బస్సుల కొనుగోలుకు టెండర్లు పిలవగా అశోక్ లేలాండ్ కాంట్రాక్టు దక్కించుకుంది.
కానీ నిధుల సమస్యతో దాన్ని రద్దు చేశారు. అప్పట్లో పురపాలక శాఖ నుంచి ఆర్టీసీకి రూ. 9 కోట్లు విడుదల చేయబోతున్నారన్న అంశం కూడా తెరపైకి వచ్చినా ఆ నిధులు అందలేదని తెలిసింది. దీంతో దేశంలోనే తొలిసారి అద్దెకు డబుల్ డెక్కర్ బస్సులు తీసుకునే సంస్థగా నిలిచిపోనుంది.
3 రూట్లలో బస్సులు!
పటాన్‌చెరు–కోఠి (218), జీడిమెట్ల–సీబీఎస్ (9ఎక్స్), అఫ్జల్‌గంజ్–మెహిదీపట్నం (118) రూట్లలో డబుల్ డెక్కర్ బస్సులు తిప్పొచ్చని ఆర్టీసీ అధికారులు అధ్యయనంలో తేల్చారు. ఇప్పుడు తీసుకొనే 10 బస్సులను ఈ రూట్లలోనే తిప్పుతారని చెబుతున్నారు. ఫ్లైఓవర్ల సమస్య లేని రూట్లు అయినందున వాటిని ఎంపిక చేసినట్లు పేర్కొంటున్నారు. కానీ మెహిదీపట్నం మార్గంలో ఎన్‌ఎండీసీ వద్ద భారీ ఫుట్‌ఓవర్ బ్రిడ్జి ఉండటంతో ఆ సమస్యను అధికారులు ఎలా అధిగమిస్తారో చూడాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment