సాక్షి, హైదరాబాద్: భాగ్యనగర రోడ్లపై ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను నడిపేందుకు టీఎస్‌ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. దేశంలోనే తొలిసారి ముంబైలో ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్‌లు గురువారం రోడ్డెక్కిన నేప థ్యంలో వాటిని రూపొందించిన అశోక్ లేలాండ్ అను బంధ సంస్థ స్విచ్ మొబిలిటీతోపాటు మరో 2 కంపె నీలతో ఆర్టీసీ యాజమాన్యం చర్చలు జరుపుతోంది. ఇందులో ఓ కంపెనీతో చర్చలు దాదాపు కొలిక్కి వస్తు న్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. హైదరాబాద్‌లో 20–25 ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు తిప్పాలని నిర్ణయించిన ఆర్టీసీ... ధర విషయంలో స్పష్టత రాగానే ఆర్డర్ ఇవ్వనున్నట్లు సమాచారం.
గతంలోనే టెండర్లు: హైదరాబాద్‌లో డబుల్ డెక్కర్ బస్సులను పునఃప్రారంభించే విషయమై మంత్రి కేటీఆర్ చేసిన సూచనకు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సానుకూలంగా స్పందించడంతో కొత్త డబుల్ డెక్కర్ బస్సులు కొనాలని గతేడాది నిర్ణయించారు. ఈ మేరకు టెండర్లు కూడా పిలిచారు. కానీ కొత్త బస్సులు కొనేందుకు నిధుల్లేకపోవడంతో ఆర్టీసీ చేతులెత్తేసింది.అయితే ఇది కేటీఆర్ ప్రతిపాదన కావడంతో పురపాలక శాఖ ఆర్థిక సాయం చేస్తుందన్న అంశం తెరపైకి వచ్చినా అది సాకారం కాలేదు.
ఆర్టీసీకి భారమే..:ముంబైలో ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సు ధర రూ.2 కోట్లు. రాష్ట్ర ప్రభుత్వ సాయం లేకుండా ఇంత భారీ మొత్తాన్ని ఖర్చు చేయడం ఆర్టీసీకి తలకుమించిన భారమే. మరోవైపు డబుల్ డెక్కర్ బస్సుపై రెండు షిఫ్టుల్లో కలిపి ఆరుగురు సిబ్బంది పని చేయాలి. గతంలో డబుల్ డెక్కర్ బస్సులతో తీవ్ర నష్టాలు రావడం వల్లే వాటిని తప్పించారు.
ఇప్పుడు కూడా వాటితో నష్టాలు తప్పవన్నదే ఆర్టీసీ నివేదిక చెబుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సాయంకోసం ఆర్టీసీ యత్నిస్తోంది. మరోవైపు నగరంలోని చాలా మార్గాల్లో ఫ్లైఓవర్లు ఉన్నందున డబుల్ డెక్కర్ బస్సులను తిప్పడం కూడా ఇబ్బంది కానుంది. ఈ నేపథ్యంలో త్వరలో ఓ అధికారుల బృందం ముంబై వెళ్లి అక్కడ ఫ్లైఓవర్ల సమస్యను అధిగమించి డబుల్ డెక్కర్ బస్సులను ఎలా తిప్పుతున్నారో అధ్యయనం చేయనున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment