థర్మల్ పవర్ ప్రాజెక్టు భూ సర్వే శనివారం రెండో రోజు మండలంలో ముమ్మరంగా కొనసాగింది. భూ సర్వే నిమిత్తం ఏర్పాటుచేసిన 21టీములు
దామరచర్ల : థర్మల్ పవర్ ప్రాజెక్టు భూ సర్వే శనివారం రెండో రోజు మండలంలో ముమ్మరంగా కొనసాగింది. భూ సర్వే నిమిత్తం ఏర్పాటుచేసిన 21టీములు 6 గ్రామాల్లో పర్యటించాయి. బృందం సభ్యులు ఆయా గ్రామాల్లోని భూమిని పరిశీలించారు. ప్రభుత్వ భూ మి ఎంత ఉంది, ఏయే ప్రాంతాల్లో ఉందో ఆరా తీశారు. మండలంలోని 7 గ్రామాల్లో 9వేల ఎకరాల సేకరణ లక్ష్యంగా సర్వే సాగింది. అయితే అధికారుల కోసం ఆయా గ్రామాల రైతులు పనులు మానుకొని భూముల వద్ద అందుబాటులో ఉన్నారు. అందుబాటులో లేకపోతే భూములు కోల్పోతామోనన్న బెంగతో ఉద యం 9 గంటలు మొదలుకొని సాయంత్రం 5 గంటల వరకు వేచి ఉన్నారు.
వీర్లపాలెంలో అధికారులను అడ్డుకున్న గ్రామస్తులు
మిర్యాలగూడ తహసీల్దార్ కృష్ణారెడ్డి బృందం మండలంలోని వీర్లపాలెం గ్రామంలో సర్వే చేసేందుకు వచ్చింది. విషయం తెలుసుకున్న సాత్‌తండా, దుబ్బతండా గిరిజనులు అధికారులను సర్వే చేయకుండా అడ్డుకున్నారు .మహిళలు వాహనాలు ముందుకు వెళ్లకుండా రోడ్డుపై బైఠాయించారు. దీంతో కృష్ణారెడ్డి రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా వారు వినలేదు. దీంతో ఫోన్ ద్వారా మిర్యాలగూడ ఆర్డీఓ కిషన్‌రావు దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. ఆర్డీఓ హుటాహుటిన వీర్లపాలానికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. లక్షల రూపాయల పెట్టుబడి పెట్టి నీటివసతి కల్పించుకుని సాగుచేసుకుంటున్న భూములు పవర్‌ప్లాంట్‌కు పోతే తమకు జీవనాధారం లేకుండా పోతుందని రైతులు.. ఆర్డీఓకు మొర పెట్టుకున్నారు.
సాగుచేసిన భూములు ఫారెస్టువని, వాటికి నష్ట పరిహారం రాదని, దీంతో భూములు నమ్ముకుంటూ బతుకుతున్న కుటుంబాలు వీధిన పడతాయని విన్నవించారు. ఆర్డీఓ కిషన్‌రావు మాట్లాడుతూ రైతులు ఆందోళన చెందడంలో తప్పులేదని, ఈ విషయాలను సీఎం వచ్చిన నాడే కలెక్టర్‌కు, సీఎంకు విన్న వించామని తెలిపారు. అందుకు సీఎం సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. భూమిని నమ్ముకొని జీవించే ఏ ఒక్క కుటుంబానికీ నష్టం కలగకుండా చూస్తామని, భూమి కోల్పోయిన వారికి భూమి, లేదా నష్టపరిహారం, కుటుం బంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్తులు నిరసనను విరమించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ దుర్గెంపూడి నారాయణ రెడ్డి, గ్రామ సర్పంచ్ కోట్యానాయక్, టీఆర్‌ఎస్ నాయకులు చల్లా అంజిరెడ్డి, పర్ష్యానాయక్, బాలు, అనిమిరెడ్డి, లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.