
రాష్ట్రవ్యాప్తంగా భూముల సర్వే దిశగా అడుగులు
పైలట్ సర్వే కోసం ప్రభుత్వాన్ని అనుమతి
కోరిన రెవెన్యూ శాఖ.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో నిధులు కేటాయించాలని ప్రతిపాదన
150 మండలాల్లో ఒక్కో గ్రామాల్లో పైలట్ సర్వేకు నిర్ణయం
ఆధునిక పరికరాలను కొనుగోలు చేసేందుకు సర్కారు గ్రీన్‌సిగ్నల్
బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తే త్వరలోనే పైలట్ ప్రాజెక్టు ప్రారంభమయ్యే చాన్స్
సర్వే చేపడితే భూముల లెక్కలన్నీ తేలుతాయంటున్న నిపుణులు.. భూవివాదాలకూ చెక్ పడుతుందని వెల్లడి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూముల లెక్కలను పక్కాగా తేల్చేందుకు, భూవివాదాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఇందుకోసం విస్తృత స్థాయిలో భూముల సర్వే చేపట్టాలని ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చింది. 2025–26 ఆర్థిక సంవత్సర బడ్జెట్ రూపకల్పనలో భాగంగా రెవెన్యూ శాఖ పద్దుపై జరిగిన సమీక్ష సందర్భంగా ఆ శాఖ ఉన్నతాధికారులు ప్రభుత్వం ముందు భూముల సర్వే ప్రతిపాదన చేసినట్టు తెలిసింది.
రాష్ట్రంలో భూముల డిజిటల్ సర్వే(Land digital survey)కు అనుమతివ్వాలని, నిధులు కేటాయిస్తే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే 150 మండలాల్లోని ఒక్కో గ్రామంలో పైలట్ ప్రాజెక్టు(pilot survey) చేపడతామని కోరినట్టు సమాచారం. దీనిపై సానుకూలంగా స్పందించిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క... సర్వే నిర్వహణ కోసం అవసరమైన ఆధునిక సాంకేతిక పరికరాలను కొనుగోలు చేసుకోవాలని సూచించినట్టు తెలిసింది.
గత ప్రభుత్వ హయాంలో ఆలోచన చేసినా..
రాష్ట్రంలో భూముల సర్వే చేపట్టాలనే ప్రతిపాదన చాలాకాలం నుంచి ఉంది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో పలుమార్లు ఈ ప్రతిపాదన వచ్చింది. రాష్ట్ర బడ్జెట్‌లో సర్వే కోసం నిధులు కేటాయించారు. కేంద్రం నుంచి కూడా నిధులు వచ్చాయి. కానీ భూముల సర్వే ఆచరణలోకి రాలేదు. ఇటీవల భూభారతి చట్టం ద్వారా రాష్ట్రంలోని రెవెన్యూ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం పేర్కొంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో భూముల సర్వేకు మార్గం సుగమం అయినట్టేనని రెవెన్యూ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇందుకు అవసరమైన నిధులు కోరామని, ప్రభుత్వం అంగీకరిస్తే భూముల పైలట్ సర్వే ప్రారంభం అమవుతుందని ఆ శాఖ వర్గాలు చెప్తున్నాయి.
రూ.800 కోట్లపైనే అవసరం
తెలంగాణలో భూముల సర్వే కోసం రూ.800 కోట్ల నుంచి రూ.1,000 కోట్ల వరకు అవసరమని భూచట్టాల నిపుణులు చెప్తున్నారు. గతంలో అంచనా వేసినప్పుడే రాష్ట్రంలోని భూములన్నింటినీ సర్వే చేసేందుకు రూ.560 కోట్లు కావాలని తేలిందని, ప్రస్తుతం అధునాతన సాంకేతిక నైపుణ్యాలతో కచ్చితమైన సర్వే చేసేందుకు రూ.800 కోట్లు అవసరమని అంచనా వేశారు. అయితే భూముల సర్వే కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా బడ్జెట్‌లో నిధులు చూపాల్సిన అవసరం లేదని, కేంద్రానికి ప్రతిపాదనలు పంపి భూముల సర్వేకు సిద్ధమైతే కేంద్రమే పూర్తిస్థాయిలో నిధులిస్తుందని చెబుతున్నారు.
సర్వే ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం... తెలంగాణలో భూముల డిజిటల్ సర్వేను 3–6 నెలల్లో పూర్తి చేయవచ్చని, ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం ప్రకారం భూముల సర్వే పెద్ద సమస్య కాబోదని భూచట్టాల నిపుణులు పేర్కొంటున్నారు. కానీ భూముల సర్వే తర్వాత సెటిల్‌మెంట్ అవసరమని, భూమిని కొలవడమే కాకుండా ల్యాండ్ పార్శిల్ ఎవరిదో నిర్ధారణ చేయడమే అసలు సమస్య అని చెబుతున్నారు.
ఇందుకు నిధులతో పనిలేదని రాజకీయ నిబద్ధత, ప్రజల భాగస్వామ్యంతోపాటు రెవెన్యూ శాఖకు అవసరమైన సిబ్బంది కావాలని పేర్కొంటున్నారు. పదేళ్ల క్రితం గుజరాత్‌లో ప్రైవేటు సంస్థలతో భూముల సర్వే నిర్వహించినా.. ఇప్పటికీ సెటిల్‌మెంట్ సమస్యతో ఇబ్బందులు వస్తున్నాయని వివరిస్తున్నారు. అలా సర్వే పూర్తయిన తర్వాత సమస్యలు రాకుండా తెలంగాణలో కూడా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఇప్పటివరకు ఈటీఎస్ విధానంలో...
భూముల సర్వే కోసం రాష్ట్రంలో గతంలో చైన్, క్రాస్ టాప్ పద్ధతులను అనుసరించేవారు. గొలుసు పద్ధతిలో సర్వే నిర్వహించడం చాలా కష్టమన్న ఉద్దేశంతో అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానంపై దృష్టిపెట్టారు. ప్రస్తుతం రాష్ట్రంలో భూముల సర్వే కోసం ఎలక్ట్రానిక్ టోటల్ స్టేషన్ (ఈటీఎస్) పద్ధతిని ఉపయోగిస్తున్నారు. మండల సర్వేయర్లు, రెవెన్యూ శాఖ ఇదే పద్ధతిలో అవసరమైన చోట భూముల సర్వే చేస్తున్నారు.
అయితే ప్రస్తుతం గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్), డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (డీజీపీఎస్) అందుబాటులోకి వచ్చాయని.. అన్నింటికంటే ఉత్తమమైన డ్రోన్ సర్వే కూడా చేయవచ్చని.. వీటితో మైదాన ప్రాంతాల్లో 99.9 శాతం కచ్చితత్వంతో సర్వే చేయవచ్చని రెవెన్యూ వర్గాలు చెప్తున్నాయి. అత్యాధునిక ‘రియల్‌టైమ్ కైనమాటిక్’ పద్ధతిలో లైడార్ స్కానింగ్, మొబైల్ మ్యాపింగ్‌ల ద్వారా డ్రోన్ ఆధారిత ఏరియల్ సర్వే ఉత్తమమైనదని పేర్కొంటున్నాయి. అయితే రెవెన్యూ శాఖ చేసిన భూముల సర్వే ప్రతిపాదనపై ప్రభుత్వం చివరికి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది తేలాల్సి ఉంది.
ఎన్నో ప్రయోజనాలు.. కొన్ని సమస్యలు..
రాష్ట్రంలో భూముల సర్వేతో అనేక ప్రయోజనాలు చేకూరుతాయని నిపుణులు చెబుతున్నారు. తెలంగాణలో ఎప్పుడో నిజాం కాలంలో భూముల సర్వే జరిగింది. ఆ తర్వాత ఇప్పటివరకు రీసర్వే జరగలేదు. నాటి రికార్డులే ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఇప్పుడు పూర్తిస్థాయిలో భూముల సర్వే జరిగితే రికార్డులు మరింత పకడ్బందీగా రూపొందుతాయని భూచట్టాల నిపుణులు చెబుతున్నారు. భూముల సర్వేతో దాదాపు అన్ని రకాల భూవివాదాలకు చెక్ పడుతుందని, ప్రతి భూకమతం హద్దులు పక్కాగా తేలుతాయని వివరిస్తున్నారు. ప్రభుత్వ, రెవెన్యూ, అటవీ భూముల సరిహద్దులు కూడా పక్కగా గుర్తించవచ్చని అంటున్నారు.

సర్వే ద్వారా వ్యక్తులు, సంస్థల మధ్య ఉండే భూవివాదాలే కాకుండా.. ప్రభుత్వ శాఖల మధ్య ఉండే భూవివాదాలు కూడా పరిష్కారమయ్యే అవకాశాలు ఉంటాయని పేర్కొంటున్నారు. ఏ సర్వే నంబర్‌లో ఎవరికి ఎంత భూమి ఉందనే అంశం కూడా వెల్లడవుతుందని స్పష్టం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఆమోదించిన భూభారతి చట్టంలో కూడా భూముల రీసర్వేకు అవకాశం కల్పించడంతోపాటు ప్రతి భూకమతానికి పక్కాగా భూదార్ నంబర్ ఇచ్చేలా నిబంధనలు పొందుపరిచారని అధికారులు గుర్తు చేస్తున్నారు. ‘‘తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో రైతుల భూమి ఒక సర్వే నంబర్‌లో ఉంటే.. వారి రికార్డుల్లో మరో సర్వే నంబర్ నమోదైంది. ఇలాంటి సమస్యలకు కూడా భూముల సర్వేతో పరిష్కారం లభించే అవకాశం ఉంది..’’ అని రెవెన్యూ వర్గాలు అంటున్నాయి.
సిబ్బంది కొరతతో ఇబ్బంది
భూముల సర్వేలో కొన్ని సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని రెవెన్యూ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా సర్వేయర్లు, రెవెన్యూ సిబ్బంది కొరత భూముల సర్వేకు విఘాతంగా మారుతుందని.. కొన్ని సందర్భాల్లో రైతుల నుంచి కూడా ప్రతిఘటన ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని పేర్కొంటున్నాయి. భూవిస్తీర్ణంలో తేడాలు, కబ్జాలోని తేడాలను రైతులు అంగీకరించే పరిస్థితి ఉండదని.. ఇలాంటి సమస్యలకు సంబంధించి ప్రభుత్వం ముందుగానే ఓ నిర్ణయం తీసుకుంటే మంచిదని భూచట్టాల నిపుణులు సూచిస్తున్నారు. ఈ సమస్యలకు పరిష్కారం చూపి, పక్కాగా లెక్కలు తేల్చగలిగితేనే భూముల సర్వే వల్ల ప్రయోజనం ఉంటుందని పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment