93 ఏళ్ల క్రితమే కొల్లాపూర్‌లో విమానం
పైలట్‌గా రాజా ఇనుగంటి వెంకటకృష్ణారావు
జేఆర్‌డీ టాటాతో పోటీ పడి విమానం నడిపిన ఐవీఆర్
కొల్లాపూర్: నేడు విమానాల్లో ప్రయాణించటం పెద్ద విషయమేమీ కాదు. సామాన్యులు కూడా విమాన ప్రయాణాలు చేస్తున్నారు. కానీ, ఓ వందేళ్లు వెనక్కు వెళితే? అప్పుడప్పుడే గాల్లోకి ఎగురుతున్న విమానం సాధారణ ప్రజలకు ఒక వింత. డబ్బున్నవాళ్లకు దానిని సొంతం చేసుకోవాలన్న ఆరాటం. నాడు సొంత విమానాలు కలిగి ఉండటమంటే మామూలు విషయం కాదు. కానీ, తెలంగాణలోని ఓ సంస్థానాదీశులు ఆ ఘనతను సాధించారు. జటప్రోలు (కొల్లాపూర్) సంస్థానాన్ని పాలించిన సురభి వంశస్తులు దాదాపు 93 ఏళ్ల క్రితమే సొంత విమానాల్లో తిరిగారు. పైలట్లుగా శిక్షణ పొంది లైసెన్సులూ సంపాదించారు.
ఐవీఆర్‌తో ప్రారంభం
క్రీ.శ. 6వ శతాబ్దం నుంచి కొల్లాపూర్ ప్రాంతాన్ని సురభి వంశస్తులు పరిపాలించినట్లు చరిత్ర చెబుతోంది. 1507 సంవత్సరం నుంచి వారి పాలనకు సంబంధించిన ఆధారాలున్నాయి. 1840లో తమ సంస్థానాన్ని జటప్రోలు నుంచి కొల్లాపూర్‌కు మార్చారు. 1884 నుంచి 1929 వరకు నిజాం నవాజ్‌వంత్ బహదూర్‌గా పిలిచే రాజా వెంకటలక్ష్మారావు కొల్లాపూర్‌ను పాలించారు. ఆయన తర్వాత రాణి వెంకటరత్నమ్మ రాజ్యపాలన చేపట్టారు. వెంకటలక్ష్మారావు కుమార్తె సరస్వతీ దేవిని బొబ్బిలి రాజ్యంలోని తిరుపాచారు జమీందారు ఇనుగంటి వెంకటకృష్ణారావు (ఐవీఆర్) వివాహం చేసుకున్నారు.
ఆయన విమానాలు నడపాలనే కోరికతో పైలట్‌గా శిక్షణ కూడా పొందారు. 1931 నవంబర్ 11న ఆయన ఢిల్లీలో పైలట్‌గా లైసెన్స్ తీసుకొన్నారు. తమ అల్లుడు ఐవీఆర్ కోసం సురభి రాజులు ఇద్దరు ప్రయాణించగల విమానాన్ని కొనుగోలు చేశారు. అప్పట్లో మద్రాసు ప్రావిన్సులో మాత్రమే ఒక రాజ కుటుంబానికి సొంత విమానం ఉండేది. దక్షిణ భారతదేశంలో సొంత విమానం కొనుగోలు చేసిన రెండో కుటుంబం సురభి రాజులదే. దీనికి వేంకట అనే పెట్టారు. విమానాన్ని నిలిపేందుకు కొల్లాపూర్‌లోని జఫర్ మైదానాన్ని ఎయిర్‌పోర్టుగా వినియోగించారు. హకీంపేటలో నిర్వహించిన విమానాల పోటీల్లో జేఆర్‌డీ టాటాతోపాటు ఐవీఆర్ కూడా పాల్గొన్నారు.
మద్రాసు నుంచి బెంగళూరు వరకు 1,800 అడుగుల ఎత్తులో విమానాన్ని నడిపి ఐవీఆర్ రికార్డు సృష్టించారు. ఇంతటి ప్రతిభావంతుడైన ఐవీఆర్.. దురదృష్టవశాత్తు విమాన ప్రమాదంలోనే 1935 ఆగస్టు 25న మరణించారు. ఆయన స్మారకార్థం జఫర్ మైదానం సమీపంలోనే (ఆర్‌ఐడీ బాలుర జూనియర్ కళాశాల పక్కన, వాలీ్మకి గుడి వద్ద) స్తూపం ఏర్పాటుచేశారు.
Comments
Please login to add a commentAdd a comment