భూమి లేదు.. ఉన్నా హక్కుల్లేవు! | 56 percent of rural families in Telangana do not have land | Sakshi
Sakshi News home page

భూమి లేదు.. ఉన్నా హక్కుల్లేవు!

Oct 14 2024 4:31 AM | Updated on Oct 14 2024 4:31 AM

56 percent of rural families in Telangana do not have land

రాష్ట్రంలో 56 శాతం గ్రామీణ కుటుంబాలకు భూమి లేదు 

50 శాతం భూ యజమానులకు సమగ్ర హక్కులు లేవు

80 ఏళ్లుగా భూముల సర్వే లేదు.. కోర్టుల్లో 66 శాతం సివిల్‌ కేసులే..

రెవెన్యూ కోర్టుల్లో ఇప్పటికీ 25 వేలకుపైగా కేసులు పెండింగ్‌ 

అటవీ, రెవెన్యూ శాఖల మధ్య 4 లక్షల ఎకరాల భూములపై వివాదాలు 

10 లక్షల మంది కౌలు రైతులకు ఎలాంటి ప్రయోజనాలూ కలగడం లేదు 

వీటన్నింటినీ పరిష్కరించేలా రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయాలి 

54 అంశాలతో, మూడు విభాగాల్లో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన ధరణి పోర్టల్‌ పునర్నిర్మాణ కమిటీ

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో భూముల సమస్యలు పేరుకుపోతున్నాయని, వాటి పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని ధరణి పోర్టల్‌ పునర్నిర్మాణ కమిటీ స్పష్టం చేసింది. ఇందుకోసం కొత్త చట్టాలను, విధానాలను రూపొందించుకోవడంతోపాటు కొన్నిరకాల సంస్కరణలు, మరికొన్ని కొత్త పద్ధతులను అవలంబించాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి 54 అంశాలతో కూడిన నివేదికను అందజేసింది. అందులో పలు ఆసక్తికర అంశాలను కూడా వెల్లడించింది.

రాష్ట్రంలోని 56శాతం గ్రామీణ కుటుంబాలకు భూమి లేదని కమిటీ తమ నివేదికలో తెలిపింది. భూములున్న రైతాంగం కూడా హక్కుల కోసం ఇబ్బందులు పడాల్సి వస్తోందని పేర్కొంది. రాష్ట్రంలోని 50శాతం మంది పట్టాదారులకు భూముల విషయంలో పలు సమస్యలు ఉన్నాయని.. వారికి సమగ్ర హక్కుల కల్పన ఇంకా పూర్తికాలేదని వెల్లడించింది. ఎప్పుడో నిజాం కాలంలో చేసిన భూముల సర్వే తర్వాత తెలంగాణలో సర్వేనే జరగలేదని, వెంటనే భూముల డిజిటల్‌ సర్వేకు పూనుకోవాలని సిఫార్సు చేసింది. 

కోర్టు కేసుల్లో భూములు నలిగిపోతున్నాయని, దశాబ్దాల తరబడి కోర్టుల చుట్టూ హక్కుల కోసం తిరగాల్సి వస్తోందని తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలోని కోర్టు­ల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల్లో 66శాతం సివిల్‌ కేసు­లే ఉన్నాయని.. ఇందులో భూవివాదాలే ఎక్కువగా ఉన్నాయని స్పష్టం చేసింది. ఇక రెవెన్యూ కోర్టులను రద్దు చేసే నాటికి వాటిలో 25వేల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, అవి ఇంతవరకు పరిష్కారానికి నోచుకోలేదని తెలిపింది. 

అటవీ, రెవెన్యూ శాఖల మధ్య 4 లక్షల ఎకరాల భూముల విషయంలో వివా­దాలు ఉన్నాయని.. అటవీ శాఖ చెప్తున్న దానికి, ధరణిలో నమోదు చేసిన భూములకు 23.72 లక్షల ఎకరాల తేడా ఉందని వెల్లడించింది. వక్ఫ్, దేవాదాయ భూముల వివరాల్లో కూడా పొంతన లేదని తెలిపింది. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించి రాష్ట్రంలో టైటిల్‌ గ్యారంటీ చట్టాన్ని అమల్లోకి తేవాలని సిఫార్సు చేసింది. క్షేత్రస్థాయిలో గ్రీవెన్స్‌ వ్యవస్థ ఉండాలని.. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో రెవెన్యూ ట్రిబ్యునళ్లు ఏర్పాటు చేయాలని సూచించింది. 

పహాణీలను డిజిటలైజ్‌ చేయాలని, గ్రామా­నికో రెవెన్యూ నిర్వాహకుడిని ఏర్పాటు చేయాలని కోరింది. అయితే, తమ సిఫారసులన్నీ ఏకకాలంలో అమలు చేయడం సాధ్యం కాదని.. అందుకే మూడు విభాగాల్లో ప్రతిపాదిస్తున్నామని తెలిపింది. అందులో కొన్ని తక్షణమే చేపట్టాల్సి ఉండగా, మరికొన్ని స్వల్పకాలిక, ఇంకొన్ని దీర్ఘకాలిక వ్యూహా­లు, ప్రణాళికలతో పరిష్కరించుకోవాల్సి ఉంటుందని నివేదికలో ధరణి కమిటీ స్పష్టం చేసింది. 

ధరణి పోర్టల్‌ పునర్నిర్మాణ కమిటీ ఇచ్చిన నివేదికలోని ముఖ్య సిఫారసులివీ.. 
గ్రామస్థాయిలోనే ల్యాండ్‌ గ్రీవెన్స్‌ వ్యవస్థ ఉండాలి. కమ్యూనిటీ పారాలీగల్‌ కార్యక్రమాన్ని పునరుద్ధరించాలి. 
రాష్ట్ర, జిల్లా స్థాయిలలో ట్రిబ్యునళ్లు ఏర్పాటు చేయాలి. కలెక్టరేట్లు, ఐటీడీఏలు, సీసీఎల్‌ఏలో లీగల్‌ సెల్స్‌ ఏర్పాటు చేయాలి. 
ఆర్‌వోఆర్‌ కొత్త చట్టం తీసుకురావాలి. సాదాబైనామాల సమస్యను పరిష్కరించాలి. గ్రామీణ నివాస ప్రాంతాల (ఆబాదీ)ను సర్వే చేయాలి.  

– రాష్ట్రంలోని అన్ని భూములను రీసర్వే చేసి శాశ్వత భూఆధార్‌ ఇవ్వాలి. టైటిల్‌ గ్యారంటీ చట్టాన్ని అమల్లోకి తేవాలి. 
– అసైన్డ్‌ భూములన్నింటికీ పట్టాదారు పాసుపుస్తకాలు, టైటిల్‌ డీడ్స్‌ మంజూరు చేసి యాజమాన్య హక్కులు కల్పించాలి. సీలింగ్‌ భూములకు కూడా హక్కులివ్వాలి. 
– ఇనాం భూములకు ఆక్యుపేషన్‌ రైట్స్‌ సర్టిఫికెట్‌ (ఓఆర్‌సీ) ఇవ్వాలి. ఆ ఓఆర్‌ఎసీ వివరాలను ధరణి పోర్టల్‌లో నమోదు చేయాలి. 

– అటవీ, రెవెన్యూ శాఖల మధ్య ఉన్న భూముల సమస్యల పరిష్కారానికి జాయింట్‌ సర్వే చేపట్టాలి. అటవీ భూముల వివరాలను ధరణి పోర్టల్‌లో మరోమారు నమోదు చేయాలి. 
– భూదాన బోర్డును ఏర్పాటు చేయాలి. భూదాన భూముల వివరాలను ధరణి పోర్టల్‌లో నమోదు చేయాలి. దేవాదాయ, వక్ఫ్‌ భూములను కూడా ధరణిలో పొందుపర్చాలి. 
– నిషేధిత భూముల జాబితా (22ఏ)ను సవరించాలి. అప్‌డేట్‌ చేయాలి. భూసేకరణ జరిగిన భూములను పట్టాదారు ఖాతాల నుంచి తొలగించాలి.  

– రాష్ట్రంలోని అన్ని భూచట్టాల స్థానంలో రెవెన్యూ కోడ్‌ (ఒకే చట్టం) అమల్లోకి తేవాలి. నల్సార్‌ న్యాయ వర్సిటీలోని ల్యాండ్‌ రైట్స్‌ సెంటర్‌ను అభివృద్ధి చేయాలి. 
– భూసంస్కరణల విషయంలో ప్రభుత్వానికి సహాయకారిగా ఉండేందుకు ‘ఇన్నోవేషన్స్‌ అండ్‌ లీగల్‌ సపోర్ట్‌ సెల్‌’ను ఏర్పాటు చేయాలి.  
– తహసీల్దార్‌ స్థాయిలో ల్యాండ్‌ సపోర్ట్‌ సెల్స్‌ ఏర్పాటు చేయాలి. గ్రామానికో భూమి నిర్వహణ అధికారిని నియమించాలి. 
– రెవెన్యూ సిబ్బంది సామర్థ్యాలు, పనితీరును మెరుగుపర్చేలా ఎప్పటికప్పుడు శిక్షణ ఇవ్వడం కోసం ల్యాండ్‌ అకాడమీని ఏర్పాటు చేయాలి. కొత్త ల్యాండ్‌ పాలసీ రూపొందించాలి. 

– కోనేరు రంగారావు, గిర్‌గ్లానీ కమిటీలతోపాటు ‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్, కేంద్ర ప్రభుత్వ’ సలహాలను పరిగణనలోకి తీసుకోవాలి. ల్యాండ్‌ గవర్నెన్స్‌ అసెస్‌మెంట్‌ రిపోర్టు తయారు చేయాలి. 
– ధరణి పోర్టల్‌ను ప్రభుత్వ ఏజెన్సీకి అప్పగించాలి. గతంలో జరిగిన ధరణి లావాదేవీలపై థర్డ్‌ పార్టీ ఆడిట్‌ చేయించాలి. 
– ధరణి పోర్టల్‌లో ఉన్న అన్ని మాడ్యూళ్ల స్థానంలో ఒక్కటే మాడ్యూల్‌ ఉంచాలి. పార్ట్‌–బీ భూముల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలి. సేత్వార్, ఖాస్రా, సెస్లా, పాత పహాణీలను డిజిటలైజ్‌ చేయాలి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement