18 లక్షల ఎకరాల్లో భూమి సమస్యల పరిష్కారానికి ధరణి కమిటీ సిఫారసు
రెవెన్యూతో పాటు ఇతర శాఖల అధికారులతో కలిపి ప్రతి మండలంలో 2–3 కమిటీలు చేయాలి
అసైన్డ్, ఇనాం, భూదాన్, వక్ఫ్, దేవాదాయ, అటవీ శాఖల భూములకు ప్రత్యేక కసరత్తు చేయాలి
32 కేటగిరీల్లో 13.38 లక్షలు,ఏ కారణం లేకుండా 5 లక్షల ఎకరాలు పార్ట్–బీలో పెట్టారని వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూములను చిన్నచిన్న కారణాలు, కోర్టు కేసులు, ఆధార్‌కార్డు రికార్డుల ఆధారంగా పార్ట్–బీలో పెట్టారు. భూ రికార్డుల ప్రక్షాళన సమయంలో పార్ట్–బీలో చేరిన ఈ భూములకు ఇప్పటివరకు మోక్షం కలగలేదు. తమ పట్టా భూములను అకారణంగా పార్ట్–బీలో చేర్చారని, ఆ కేటగిరీ నుంచి విముక్తి కల్పించాలని కోరుతూ సదరు భూముల యజమానులు కాళ్లరిగేలా తిరిగినా ఫలితం లేకుండా పోయింది.
అసలు ధరణి పోర్టల్‌లోని ఏ మాడ్యూల్‌లో దరఖాస్తు చేసుకోవాలో చాలామందికి తెలియదు, తెలిసి కొందరు దరఖాస్తు చేసుకున్నా, సమస్య పరిష్కారం కాక, కొన్ని సందర్భాల్లో దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో పార్ట్–బీ భూములు రెవెన్యూ వర్గాలకు పెద్ద తలనొప్పిగా మారాయి. రాష్ట్ర వ్యాప్తంగా 18 లక్షలకు పైగా ఎకరాలు పార్ట్–బీలో ఉన్నాయని, వెంటనే సమస్యలను పరిష్కరించాలని ధరణి పోర్టల్ పునర్నిర్మాణ కమిటీ ఇచ్చిన నివేదికలో సిఫారసు చేసింది.
ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డితోపాటు మంత్రివర్గ సభ్యులందరికీ ఇచ్చిన ఈ నివేదికలో ప్రత్యేక కార్యాచరణను ప్రతిపాదించింది. ధరణి కమిటీ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో పార్ట్–బీ భూముల గురించి గణాంకాలతో సహా వివరించింది. ఏ కారణంతో ఎన్ని ఎకరాల భూమిని పార్ట్–బీలో చేర్చారో లెక్కలు వెల్లడించిన ధరణి కమిటీ ఎలాంటి కారణాలు లేకుండానే 5,07,091 ఎకరాల భూములను పార్ట్–బీలో పెట్టారని, ఈ భూముల సమస్యలను వెంటనే పరిష్కరించాలని స్పష్టం చేసింది.
కమిటీ చేసిన సిఫారసులివే
» పార్ట్–బీ భూముల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ధరణి పోర్టల్‌లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించేందుకు తహసీల్దార్ లేదా డిప్యూటీ తహసీల్దార్ లేదా రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ నేతృత్వంలో ప్రతి మండలానికి 2–3 బృందాలు ఏర్పాటు చేయాలి. ళీ ఈ బృందాల్లో రెవెన్యూ సిబ్బందితో పాటు డీఆర్‌డీఏల్లో పనిచేస్తున్న కమ్యూనిటీ సర్వేయర్లు, పారా లీగల్ కార్యకర్తలు, వ్యవసాయ విస్తరణాధికారులు, పంచాయతీ కార్యదర్శులను నియమించి శిక్షణ ఇవ్వాలి.
» అవసరమైనప్పుడు అటవీ, దేవాదాయ, వక్ఫ్ శాఖల అధికారులను కూడా చేర్చాలి. ఈ బృందాలు క్షేత్రస్థాయికి వెళ్లి అన్ని వివరాలను పరిశీలించి నివేదికలు తయారు చేయాలి. ళీ ఈ నివేదికల ప్రకారం సర్వే నంబర్ లేదా ఖాతానంబర్ వారీగా రైతులకు నోటీసులివ్వాలి.
సేత్వార్, ఖాస్రా పహాణీ, సెస్లా పహాణీ, పాత పహాణీలు, 1బీ రిజిస్టర్, ధరణి పోర్టల్‌లోని వివరాలను పరిశీలించాలి. ఆ భూములు అసైన్డ్, ఇనాం, భూ బదలాయింపు నిషేధ పట్టిక, భూదాన్, వక్ఫ్, దేవాదాయ, అటవీ భూముల జాబితాలో ఉన్నాయో లేవో పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. ళీ గ్రామాల వారీగా పార్ట్–బీ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక రెవెన్యూ సదస్సులు నిర్వహించి, అక్కడే తుది నిర్ణయం తీసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment