
సాక్షి, హైదరాబాద్: ధరణి పోర్టల్ ద్వారా రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై ఉద్యమించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ధరణి బాధితులకు అండగా ‘భూపరిరక్షణ ఉద్యమం’పేరుతో వారం రోజుల పాటు క్షేత్రస్థాయిలో ఆందోళనలు నిర్వహించనుంది. మండల కేంద్రాలను వేదికగా చేసుకుని ధరణి బాధితుల నుంచి వినతిపత్రాలను స్వీకరించనుంది. శనివారం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అధ్యక్షతన గాంధీభవన్‌లో జరిగిన ధరణి కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. ఈ సమావేశంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కన్వీనర్ షబ్బీర్ అలీ, టీపీసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జి బి.మహేశ్‌కుమార్‌గౌడ్, ఏఐసీసీ కిసాన్‌సెల్ వైస్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి, ఏఐసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రావణ్, ధరణి కమిటీ సభ్యులు అద్దంకి దయాకర్, బెల్లయ్య నాయక్, నాగరిగారి ప్రీతమ్, దయాసాగర్, రామ్మోహన్‌రెడ్డిలు పాల్గొన్నారు. సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దాసోజు శ్రావణ్ మాట్లాడారు.
బిచ్చగాళ్లను చేశారు: శ్రావణ్
ధరణి పోర్టల్ కారణంగా భూయజమానులు బిచ్చగాళ్లుగా మారారని, తమ భూ రికార్డులు పట్టుకుని తహసీల్దార్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారని శ్రావణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ధరణి పోర్టల్ సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తామని, అవసరమైతే ప్రధాని, రాష్ట్రపతిలను కలుస్తామని చెప్పారు.
పెట్టుబడిదారులకు అప్పగించే కుట్ర: దయాకర్
రాష్ట్రంలో 25 లక్షల ఎకరాల భూములను కాంగ్రెస్ పేదలకు అసైన్ చేస్తే, వాటిని అన్యాక్రాంతం చేస్తున్నారని అద్దంకి దయాకర్ విమర్శించారు. భూములను పెట్టుబడిదారులకు కట్టబెట్టాలన్న కుట్రను అడ్డుకుంటామన్నారు. తెలంగాణలో రియల్ ఎస్టేట్ మాఫియా నడుస్తోందని బెల్లయ్య నాయక్ విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment