భూ సమస్యలకు పరిష్కారం చూపుతున్న భూన్యాయ శిబిరాలు
హైదరాబాద్ శివార్లలోని యాచారం మండలంలో లీఫ్స్ సంస్థ అధ్యయనం
10 గ్రామాల్లో విస్తృత స్థాయిలో భూన్యాయ శిబిరాలు
రెండు దశల్లో ప్రక్రియ.. 2,200 భూ సంబంధిత సమస్య గుర్తింపు
ఎక్కువ సమస్యలు అసైన్డ్ భూములకు సంబంధించినవే..
ఆ తర్వాత సర్వే నంబర్ మిస్సింగ్‌లు, సేత్వార్ పొరపాట్లు
ఈ లెక్కన రాష్ట్రవ్యాప్తంగా 22 లక్షల వరకు భూసమస్యలు ఉంటాయని అంచనా
క్షేత్రస్థాయిలో ప్రత్యేక డ్రైవ్‌లు చేపడితే పరిష్కారాలు సులువే..
రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనలో యాచారం పైలట్ ప్రాజెక్టు
త్వరలోనే రెవెన్యూ మంత్రికి నివేదిక ఇవ్వనున్న ‘లీఫ్స్’ సంస్థ
మేకల కల్యాణ్ చక్రవర్తి
రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని మంథన్ గౌరెల్లి గ్రామానికి చెందిన రమావత్ జగ్నాకు మూడెకరాల 26 గుంటల భూమి ఉంది. భూరికార్డుల ప్రక్షాళన తర్వాత వచ్చిన కొత్త పాస్‌బుక్‌లో రెండెకరాల 29 గుంటల విస్తీర్ణమే నమోదైంది. అంటే నికరంగా 37 గుంటలు తగ్గింది. కరెంటోతు జకాలి అనే మహిళకు ఎకరం 23 గుంటల భూమి ఉంటే.. కొత్త పాస్‌బుక్‌లో 20 గుంటలే నమోదైంది. ఇదే గ్రామానికి చెందిన నేనావత్ రాముకు చెందిన రెండెకరాల 3 గుంటల పొలాన్ని వివాదాస్పద భూమి అంటూ పార్ట్–బీలో పెట్టారు. కొత్త పాస్‌బుక్ ఇవ్వలేదు. ఇక గనమోని మల్లయ్యకు ఉన్న రెండెకరాల 14 గుంటల పట్టా భూమికి ఎమ్మార్వో ప్రొసీడింగ్స్ నంబర్ కూడా ఇచ్చారు. కానీ కొత్త పాస్‌బుక్ రాలేదు.
..‘లీగల్ ఎంపవర్‌మెంట్ అండ్ అసిస్టెన్స్ ఫర్ ఫార్మర్స్ (లీఫ్స్)’ స్వచ్ఛంద సంస్థ మంథన్ గౌరెల్లి గ్రామంలో నిర్వహించిన భూన్యాయ శిబిరానికి వచ్చిన రైతుల్లో ఓ నలుగురి సమస్యలివి. వారు తమ భూములకు సంబంధించిన ఆధారాలతో సహా వచ్చి మరీ గోడు వెళ్లబోసుకున్నారు. ఈ నలుగురనే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 22 లక్షల మంది రైతులు ధరణి పోర్టల్‌తో తిప్పలు పడుతున్నారు. భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపడుతున్నా.. ఎప్పుడూ లక్షన్నర నుంచి 2 లక్షల వరకు దరఖాస్తులు ధరణి పోర్టల్‌లో పెండింగ్‌లో కనిపిస్తున్నాయి. ప్రత్యేకంగా డ్రైవ్‌లు చేపట్టినా, అధికార వికేంద్రీకరణ జరిగినా ఈ దరఖాస్తులకు సంతృప్తస్థాయిలో పరిష్కారం లభించే అవకాశం కనిపించట్లేదు. ఈ నేపథ్యంలోనే ‘లీఫ్స్’ అనే స్వచ్ఛంద సంస్థ యాచారం మండలంలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన భూన్యాయ శిబిరాలు.. ధరణి సమస్యల గుర్తింపు, పరిష్కారానికి మార్గం చూపిస్తున్నాయి.
సమస్యలెలా తెలుసుకున్నారంటే..?
ఆయా గ్రామాల్లో భూన్యాయ శిబిరం ఏర్పాటుకు ముందే ప్రజలకు చాటింపు వేయించారు. శిబిరానికి వచ్చి భూసంబంధిత సమస్యలపై దరఖాస్తులు ఇవ్వా లని సూచించారు. శిబిరం జరిగిన రోజు న ‘భూమి సమస్యల వివరాలు’ పేరిట ప్రత్యేక ఫార్మాట్‌లో రూపొందించిన దరఖాస్తుల ద్వారా వివరాలు తీసుకున్నారు. భూయజమాని వ్యక్తిగత వివరాలు, భూమి ఖాతా నంబర్, పాసుపుస్తకం ఉందా లేదా? సర్వే నంబర్, సబ్ డివిజన్ నంబర్, విస్తీర్ణం, భూమి స్వభావం, భూమి సంక్రమించిన విధానం, ఏ విధమైన భూసమస్య ఉందనే వివరాలు అందులో ఉన్నాయి.
ప్రతి సమస్యకు ఒక కోడ్ ఇచ్చి ఆ కోడ్ ప్రకారం దరఖాస్తులను పూర్తి చేయించి.. సంబంధిత డాక్యుమెంట్ల జిరాక్స్‌లు తీసుకుని ఫైల్ చేశారు. రెండో దశలో.. ఆ దరఖాస్తులను పరిశీలించి, ఏ సమస్యలు ఎన్ని వచ్చాయి? పరిష్కారానికి అవసరమైన ఇతర డాక్యుమెంట్లు ఏవి అనే స్పష్టతకు వచ్చారు. ఈ వివరాలను రైతులకు చెప్పి అవసరమైన అన్ని డాక్యుమెంట్లు తీసుకున్నారు. ఈ ఏడాది జనవరి 14న యాచారం మండలంలోని మంథన్ గౌరెల్లి గ్రామంలో ప్రారంభమైన భూన్యాయ శిబిరాలు.. ఈ నెల 8న అదే గ్రామంలో ముగిశాయి. మొత్తం 10 గ్రామాల్లో కలిపి 2,200 దరఖాస్తులు వచ్చాయి.
ఎక్కువగా ఏ సమస్యలు వచ్చాయంటే!
భూన్యాయ శిబిరాల్లో వచ్చిన దరఖాస్తులను బట్టి చూస్తే.. యాచారం మండలంలోని 10 గ్రామాల్లో ఎక్కువగా అసైన్డ్ భూముల సమస్యలు ఉన్నాయి. అసైన్డ్ భూములు మ్యుటేషన్ కావడం లేదని, కొత్త పాస్‌పుస్తకాలు రాలేదని, వచ్చిన పుస్తకాల్లో విస్తీర్ణం తగ్గిందని దరఖాస్తులు వచ్చాయి. తర్వాత అత్యధికంగా నిషేధిత జాబితాలో పట్టా భూములను చేర్చిన సమస్య కనిపించింది.
ఇక సర్వే నంబర్లు మిస్సింగ్, సేత్వార్ సరిపోలకపోవడం వంటివాటితోపాటు పార్ట్–బీ కింద (కొత్త పాస్‌పుస్తకాలు రాని పట్టా భూములు) సమస్యల దరఖాస్తులు వచ్చాయి. నిజానికి రాష్ట్రవ్యాప్తంగా పార్ట్–బీలో చేర్చిన 18 లక్షల ఎకరాల భూముల్లో.. సుమారు 5 లక్షల ఎకరాలను ఎందుకు చేర్చారో కూడా తెలియదని రెవెన్యూ నిపుణులు చెప్తున్నారు. ఆధార్ నంబర్ ఇవ్వలేదని 4 లక్షల ఎకరాలను ఈ జాబితాలో చర్చగా.. మొత్తంగా ఆధార్ సంబంధిత అంశాల ప్రాతిపదికన 6 లక్షల ఎకరాల విషయంలో ఇబ్బందులు వచ్చాయి.
తర్వాతి దశలో ఏం చేస్తారు?
‘లీఫ్స్’ సంస్థ ఆధ్వర్యంలో రెండు దశల్లో దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన పూర్తయిన నేపథ్యంలో.. మిగతా పని అంతా రెవెన్యూ అధికారులు చేయాల్సి ఉంటుంది. అధికారులు గ్రామాల వారీగా భూరికార్డులను (సేత్వార్, పహాణీ, 1–బీ, ఇతర రికార్డులు) పరిశీలించి ఎక్కడ పొరపాటు జరిగిందనే విషయాన్ని ప్రస్తావిస్తూ రిపోర్టు తయారు చేయాలి. తహసీల్దార్ స్థాయిలో జరిగే ఈ మూడో దశ పూర్తయ్యాక.. చివరిగా నాలుగో దశలో సమస్యకు పరిష్కారం చూపాల్సి ఉంటుందని లీఫ్స్ ప్రతినిధి ఎం.సునీల్‌కుమార్ వెల్లడించారు. ఈ పద్ధతిని రాష్ట్రమంతటా అమలు చేయడం ద్వారా భూసమస్యలకు పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు.
రెవెన్యూ మంత్రికి నివేదిక!
ఈ యాచారం పైలట్ ప్రాజెక్టు అధ్యయనం రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందని సమాచారం. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కూడా యాచారం మండలంలో జరిగిన భూన్యాయ శిబిరాల వివరాలను తెలుసుకున్నారని తెలిసింది. లీఫ్స్ సంస్థ ఈ అధ్యయనానికి సంబంధించిన నివేదికను త్వరలోనే రెవెన్యూ మంత్రికి అందజేయనున్నట్టు సమాచారం.
ప్రభుత్వం ఏం చేయాలి?
వాస్తవానికి, రాష్ట్రంలోని వ్యవసాయ భూసమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ధరణి పోర్టల్‌కు గత నాలుగేళ్లలో వచ్చిన దరఖాస్తుల సంఖ్య 16 లక్షలు. అందులో 8లక్షలకు పైగా దరఖాస్తులను రెవెన్యూ వర్గాలు తిరస్కరించి ఉంటాయని అంచనా. ఇప్పుడు యాచారం మండలంలోని 10 గ్రామాల్లో వచ్చిన దరఖాస్తులను బట్టి రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో సగటున 200 భూసమస్యలు ఉన్నాయని.. 11 వేల రెవెన్యూ గ్రామాల్లో కలిపి 22 లక్షల సమస్యలు ఉంటాయని అంచనా వేశారు. ఇప్పుడీ సమస్యలన్నింటినీ ధరణి పోర్టల్ ద్వారా పరిష్కరించడం ఎలా సాధ్యమనే ప్రశ్న తలెత్తుతోంది.
పరిష్కరించడమంటే దరఖాస్తులను తిరస్కరించడం కాదని.. కచ్చితమైన రికార్డు, వివరణలతో తగిన పరిష్కారం చూపాలని రెవెన్యూ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. 2011లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రెవెన్యూ సదస్సులను నిర్వహించినప్పుడు భూసమస్యలపై 21 లక్షల దరఖాస్తులు వచ్చాయని.. అందులో 8లక్షలు పరిష్కారం అయ్యాయని చెప్తున్నారు. రెవెన్యూ యంత్రాంగం క్షేత్రస్థాయిలో గ్రామాలకు వెళ్లినప్పుడే భూసమస్యల పరిష్కారానికి మార్గం ఏర్పడుతుందని.. ఇందుకు యాచారం మండలంలో చేపట్టిన అధ్యయనం దోహదపడుతుందని అంటున్నారు.
గత 20 ఏళ్లుగా ప్రభుత్వాలు చేసిందేమిటి?
భూసమస్యల పరిష్కారం కోసం గత 20 ఏళ్లుగా అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. 2006లో ఉమ్మడి రాష్ట్రంలోని వ్యవసాయ భూముల పాస్‌బుక్‌లకు యూనిక్ కోడ్ ఇచ్చారు. ఇందుకోసం ఏడాది వరకు సమయం పట్టింది. 2007–2011 మధ్య మండలానికి మూడు గ్రామాల చొప్పున దత్తత తీసుకుని... పారాలీగల్ కార్యకర్తల ద్వారా ప్రతి గ్రామంలో 15 రోజుల పాటు భూసమస్యల గుర్తింపు, పరిష్కరం ప్రక్రియ చేపట్టారు. 2009–10లో కేవలం ఎస్సీ, ఎస్టీలకు ఉన్న భూముల పరిశీలన జరిగింది.
అప్పుడే 5 లక్షల వరకు భూసమస్యలు ఉన్నట్టు గుర్తించారు. 2011–12 మధ్య రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఆ సదస్సుల్లో మొత్తం 21 లక్షల దరఖాస్తులురాగా.. 8 లక్షల సమస్యలను పరిష్కరించారు. ఇక తెలంగాణ ఏర్పాటయ్యాక 2017 డిసెంబర్‌లో రాష్ట్రవ్యాప్తంగా భూరికార్డుల ప్రక్షాళన జరిగింది. రైతులకు తెలంగాణ ప్రభుత్వం పేరుతో కొత్త పాస్‌పుస్తకాలు ఇచ్చారు. అనంతరం ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం ఆ పోర్టల్ ద్వారానే భూసమస్యలపై ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment