భూ భారతి బిల్లుపై చర్చలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
తెలంగాణ భూ రికార్డులను విదేశీ కంపెనీల చేతుల్లో పెట్టారు
చెప్పలేని స్థాయిలో పోర్టల్ నిర్వహణ
కంపెనీ అరాచకాలు భూ భారతి బిల్లుపై అసెంబ్లీలో జరిగిన చర్చలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
ఆ నేరాలకు శిక్ష వేయాలంటే చట్టాలన్నీ చదవాలి
ధరణి కేసీఆర్ సృష్టి కాదు.. 2010లోనే ఒడిశాలో ఈ పోర్టల్
ఆ పోర్టల్ నిర్వహించిందీ ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్ కంపెనీనే
మేం తొందరపడి చర్యలు తీసుకుంటే భూ రికార్డులన్నీ క్రాష్ అయ్యేవన్న సీఎం
తెలంగాణ రైతాంగానికి మేలు చేసేందుకే భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చినట్లు వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ‘ధరణి పోర్టల్ అద్భుతమని, అమృతమని చెప్పారు. కానీ ఆ పోర్టల్ నిర్వహించిన కంపెనీ అరాచకాలు, దుర్మార్గం, దురాగతాలు చెప్పలేని స్థాయిలో ఉన్నాయి. కాంట్రాక్టు అగ్రిమెంట్‌ను ఉల్లంఘించారు. ప్రభుత్వ ఆఫీసుల్లో ఉండి ధరణి పోర్టల్ నిర్వహించాలనే నిబంధనను పట్టించుకోలేదు. యజమానులు మారినప్పుడు ప్రభుత్వానికి ముందస్తు సమాచారం ఇవ్వాలన్న అంశాన్ని పక్కన పెట్టారు. బెంగళూరు, విజయవాడ, గుర్‌గావ్, ఈశాన్య రాష్ట్రాల్లో ఉండి తెలంగాణ భూముల క్రయ, విక్రయ లావాదేవీలు నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని భూముల వివరాలను విదేశీ కంపెనీల చేతుల్లో పెట్టారు.
రైతాంగ సంపూర్ణ సమాచారాన్ని దేశం దాటించారు. రైతుల భూమి డాక్యుమెంట్లు, ఆధార్ కార్డులు, బ్యాంకు ఖాతాలు, టెలిఫోన్ నంబర్లు దేశం దాటి వెళ్లిపోయాయి. ఇది తీవ్రమైన నేరం. దీనికి ఏ స్థాయిలో శిక్ష విధించాలో తెలియాలంటే చట్టాలన్నింటినీ చదవాల్సిన పరిస్థితి..’అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ‘విదేశాల నుంచి కూడా లావాదేవీలు నిర్వహించారేమో ఇప్పుడు పరిశీలించాలి. భూముల రిజి్రస్టేషన్లు రాత్రి 9 గంటల నుంచి ఉదయం వరకు కూడా చేశారు. ప్రజల నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఖూనీ చేసి ఆర్థిక నేరాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి..’అని ఆయన వ్యాఖ్యానించారు. శుక్రవారం శాసనసభలో భూభారతి బిల్లుపై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి మాట్లాడారు.
అన్ని పోరాటాలూ భూమి చుట్టూనే..
‘తెలంగాణలో ప్రతి సమస్య భూమితో ముడిపడి ఉంది. అన్ని పోరాటాలు భూమి చుట్టూనే పరిభ్రమించాయి. పటేల్–పటా్వరీ వ్యవస్థ రద్దుకు కూడా భూసంబంధిత ఫిర్యాదులే కారణం. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ప్రజలకు మేలు జరిగేలా పాలకులు భూమి చట్టాలను రూపొందించారు. అయితే తెలంగాణ ఏర్పాటైన తర్వాత ధరణి పేరుతో తానో అద్భుత సాంకేతిక నైపుణ్య ఆవిష్కరణ చేశానని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. 80 వేల పుస్తకాలు చదివిన అనుభవాన్ని రంగరించి తయారు చేశానని చెప్పడంతో నిజంగానే భూమి సమస్యలు పరిష్కారమవుతాయేమోనని నేను కూడా ఓ సందర్భంలో భ్రమకు లోనయ్యా.
కానీ ధరణి కేసీఆర్ సృష్టి కాదు.. 2010లోనే ఒడిశా రాష్ట్రంలో ఈ ధరణి పేరుతో భూ లావాదేవీలను నిర్వహించారు. ఆ పోర్టల్ నిర్వహించింది కూడా ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్ కంపెనీనే. తెలంగాణలోనూ ధరణి పోర్టల్ ఆ సంస్థకే ఇచ్చారు. నాలుగేళ్ల తర్వాత కాగ్ ఈ కంపెనీ నిర్వాకం బయటపెట్టింది. ఎన్‌ఐసీ లాంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను పక్కన పెట్టి, ఆ కంపెనీని తెచ్చి అద్భుతాన్ని, అమృతాన్ని సృష్టించామని కేసీఆర్ చెప్పారు. ఈ లోపభూయిష్ట సాంకేతిక నైపుణాన్ని తెలంగాణ ప్రజలపై ఎందుకు రుద్దారో తెలియాలి’అని రేవంత్ అన్నారు.
యువరాజు సన్నిహితుడి సంస్థకు భాగస్వామ్యం
‘ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్‌తోపాటు అప్పటి యువరాజుకు సన్నిహితుడైన గాదె శ్రీధర్‌రాజుకు చెందిన మరో సంస్థ ఈసెంట్రిక్, విజన్ ఇన్ఫోటెక్‌లకు సంయుక్తంగా ఈ కాంట్రాక్టు ఇచ్చారు. అప్పటికే ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్ దివాళా తీసి క్రిమినల్ కేసుల్లో ఇరుక్కుంది. కంపెనీ ప్రతినిధులు జైలుకెళ్లారు. ఆ తర్వాత టెర్రాసిస్ టెక్నాలజీ పేరుతో మరో అనుబంధ కంపెనీని తెచ్చారు. ఆ తర్వాత ఫాల్కన్ ఎస్‌జీ అనే ఫిలిప్పీన్స్ కంపెనీ, ఫాల్కన్ ఇన్వెస్ట్‌మెంట్స్ అనే సింగపూర్ కంపెనీ తెచ్చారు. ఆ కంపెనీకి గాదె శ్రీధర్‌రాజు సీఈవో అయ్యాడు.
ఆ తర్వాత స్పారో ఇన్వెస్టర్స్, గేటెవే స్కై ప్రైవేట్ లిమిటెడ్ అనే సింగపూర్ కంపెనీలు, హిల్‌బ్రూక్ ఇన్వెస్ట్‌మెంట్స్ అనే బ్రిటిష్ వర్జిన్ ఐల్యాండ్ కంపెనీ, గేట్‌వే ఫండ్ 2ఎల్‌ఎల్‌పీ అనే కెమెన్ ఐల్యాండ్స్ కంపెనీలను సృష్టించారు. అక్కడి నుంచి పెరడిమ్ ఇన్నోవేషన్స్ ఎల్‌ఎల్‌సీ, క్వాంటెల్లా ఐఎన్‌సీ అనే అమెరికా కంపెనీలను తెచ్చారు. ప్రపంచంలో జరిగే ప్రతి ఆర్థిక నేరానికి మూలం కెమెన్, బ్రిటిష్ ఐల్యాండ్స్ దేశాల్లో ఉంటుంది.
పై కంపెనీలు నిర్వహిస్తున్న వారెవరూ ఈ రాష్ట్రం కాదు కదా దేశ పౌరులు కూడా కాదు. ఈ విధంగా తెలంగాణ రైతుకు, రెవెన్యూ శాఖకు మధ్య జరిగే లావాదేవీలు, డిజిటల్ వెబ్‌సైట్ నిర్వహణ పేరుతో రాష్ట్రంలోని అన్ని భూముల వివరాలను విదేశీ కంపెనీల చేతుల్లో పెట్టారు. ప్రజల నమ్మకాన్ని వంచన చేసి, వారి భూముల వివరాలను విదేశీ కంపెనీలకు అప్పజెప్పిన వారిని ఏమనాలి?’అని సీఎం ప్రశ్నించారు.
మేం తొందరపడితే రికార్డులన్నీ ట్రాష్ అయ్యేవి..
‘మీరు అధికారంలోకి వచ్చి ఏడాది అవుతోంది కదా.. ధరణిని ఏం చేశారని మమ్మల్ని అడిగారు. మేం విచారణకు ఆదేశించకుండా మౌనంగా ఉండడానికి కారణాలున్నాయి. మేము టెరాసిస్ నుంచి భూముల నిర్వహణ బాధ్యతలు ఎన్‌ఐసీకి ఇచ్చాం. కానీ ఈ డేటా బదలాయింపునకు గాదె శ్రీధర్‌రాజు సహకరించడం లేదు. మేము తొందరపడి ఆదేశాలిస్తే ఎక్కడో విదేశాల్లో కూర్చుని ఒక్క బటన్ నొక్కితే తెలంగాణ భూ రికార్డులన్నీ క్రాష్ అయిపోయేవి. సర్వర్లు డౌన్ చేస్తే మళ్లీ రిపేర్, రీస్టోర్ చేయడానికి నెలలు పట్టొచ్చు. అందుకే ఆచితూచి వ్యవహరించాం. ధరణి నిజంగా అద్భుతమైతే కేసీఆర్ సభకు వచ్చి మమ్మల్ని అడిగి, కడిగి నిలదీయాలి కదా?’అని ముఖ్యమంత్రి అన్నారు.
ధరణి విషయంలో నిద్రలేని రాత్రులు..
‘అధికారంలోకి వస్తే ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని మేమంటే, మమ్మల్ని బంగాళాఖాతంలో వేయాలని కేసీఆర్ అన్నారు. ఎన్నికల సభల్లో ఆయన ఆవేశంగా ఎందుకు ఊగిపోతున్నారో నాకు అర్థం కాలేదు. అధికారంలోకి వచ్చాక పరిశీలిస్తే ఇదంతా తెలిసింది. ధరణిని బంగాళాఖాతంలో వేసేందుకు సంవత్సరమంతా సాంకేతిక నిపుణులు, ప్రజలు, రైతులు, రైతు సంఘాలతో చర్చలు జరిపాం. వందల సమావేశాలు పెట్టుకున్నాం. రెవెన్యూ మంత్రి పొంగులేటితో పాటు అధికారులు, నిపుణులు, ధరణి పోర్టల్ పునరి్నర్మాణ కమిటీ సభ్యులు నిద్రలేని రాత్రులు గడిపారు. అన్నీ ఆలోచించి తెలంగాణ రైతాంగానికి మేలు జరిగేలా భూభారతి చట్టాన్ని తీసుకొచ్చాం. దీన్ని సభ్యులందరూ ఆమోదించాలి.’అని సీఎం కోరారు.
Comments
Please login to add a commentAdd a comment