land records
-
రెవెన్యూ నిబంధనలపై మంత్రుల కమిటీ
సాక్షి, అమరావతి: ‘రెవెన్యూ సదస్సుల్లో ఎక్కువగా 22 ఏ, భూ సర్వే, భూ రికార్డుల సమస్యలపైనే ఫిర్యాదులు వస్తున్నాయి. వాటిని వెంటనే పరిష్కరించేందుకు, భూములకు సంబంధించి రెవెన్యూ నిబంధనల సరళతరం కోసం పరిశ్రమలు, మునిసిపల్, ఆర్థిక, రెవెన్యూ మంత్రులతో కమిటీ ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది’ అని మంత్రి పార్థసారథి తెలిపారు. గురువారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆయన మీడియాకు వివరించారు. కేబినెట్ భేటీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితితోపాటు సూపర్ సిక్స్ పథకాల అమలుపై చర్చించినట్లు తెలిపారు.రైతులకు తదుపరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రైతు భరోసా వాటాను చూశాక... రైతు భరోసాలో రాష్ట్రం వాటాపై ఆలోచన చేయాలని చర్చించినట్లు తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం లోపు ‘తల్లికి వందనం’ అమలు చేయాలని చర్చించినట్లు చెప్పారు. వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఏప్రిల్‌లో రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందించాలని, వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి మెగా డీఎస్సీతో పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు.ఈ నెల 8న విశాఖలో ప్రధాని మోదీ పర్యటనను విజయవంతం చేసేందుకు రాజకీయ కమిటీని నియమించి కూటమి నేతలంతా జన సమీకరణ చేయాలని ముఖ్యమంత్రి సూచించారన్నారు. విశాఖ పర్యటనలో ఎన్టీపీసీ ఇంటిగ్రేడెట్ గ్రీన్ హైడ్రోజన్ హబ్, కృష్ణపట్నం ఇండ్రస్టియల్ హబ్, బల్క్ డ్రగ్ పార్కు, రైల్వే జోన్ హెడ్ క్వార్టర్ భవనాలకు ప్రధాని శంకుస్థాపనలు చేస్తారని తెలిపారు.⇒ తిరుపతిలో 50 పడకల ఈఎస్ఐ ఆస్పత్రిని వంద పడకలకు అప్‌గ్రెడేషన్, 191 పోస్టుల మంజూరుకు మంత్రివర్గం ఆమోదం. ⇒ ప్రపంచ బ్యాంకు, ఏడీబీ సూచనల మేరకు రాజధానిలో మరో రూ.2,723.02 కోట్లతో రెండు ఇంజనీరింగ్ పనులు చేపట్టేందుకు సీఆర్డీఏకు అనుమతి.⇒ ఏపీ మెట్రోపాలిటన్ రీజియన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చట్ట సవరణ ముసాయిదా ఆర్డినెన్స్‌కు ఆమోదం. తద్వారా రాజధాని మాస్టర్ ప్లాన్‌తో పాటు జోనల్ డెవలప్మెంట్లో అవసరమైన మార్పులు.⇒ గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలంలో 6.35 ఎకరాల్లో 100 పడకల ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటుకు ఆమోదం. ⇒ కడపలో టీడీపీ కార్యాలయానికి గత ప్రభుత్వం రద్దు చేసిన రెండు ఎకరాలను తిరిగి కేటాయిస్తూ మంత్రివర్గం నిర్ణయం. ⇒ ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఐబీపీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం. రాష్ట్రంలో రిలయన్స్ లిమిటెడ్ నెలకొల్పే 500 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుకు వృథాగా ఉన్న ప్రభుత్వ భూమి అయితే ఎకరాకు ఏడాదికి 15 వేల చొప్పున, అదే రైతుల భూమి అయితే ఎకరాకు ఏడాదికి 30 వేల చొప్పున 15 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చేందుకు ఆమోదం.డబుల్ డెక్కర్ విధానంలో మెట్రో కారిడార్విశాఖ, విజయవాడలో చేపట్టే మెట్రో ప్రాజెక్టుల్లో డబుల్ డెక్కర్ విధానం అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. జాతీయ రహదారులు ఉన్నచోట్ల డబుల్ డెక్కర్ విధానంలో మెట్రో కారిడార్ నిర్మించాలని నిర్ణయించింది. గురువారం సచివాలయంలో మెట్రో ప్రాజెక్టుల నిధుల అంశంపై సీఎం ఎన్.చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.విశాఖలో మొదటి స్టేజ్‌లో చేపట్టే మధురవాడ నుంచి తాడిచెట్లపాలెం వరకు 15 కి.మీ, గాజువాక నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ వరకు 4 కి.మీ డబుల్ డెక్కర్ మోడల్లో మెట్రో నిర్మించాలన్న మెట్రో ఎండీ రామకృష్ణారెడ్డి ప్రతిపాదనకు సీఎం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారు. విజయవాడలో రామవరప్పాడు రింగ్ నుంచి నిడమానూరు వరకు 4.7 కి.మీ. డబుల్ డెక్కర్ విధానంలో మెట్రో నిర్మాణం చేపడతారు. అవార్డు గ్రహీతలకు సీఎం అభినందనలుక్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ప్రతిష్టాత్మకమైన ఖేల్‌రత్న అవార్డులకు ఎంపికైన క్రీడాకారులకు సీఎం చంద్రబాబు ‘ఎక్స్’లో అభినందనలు తెలిపారు. -
రైతుల సమాచారం దేశం దాటించారు: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ‘ధరణి పోర్టల్ అద్భుతమని, అమృతమని చెప్పారు. కానీ ఆ పోర్టల్ నిర్వహించిన కంపెనీ అరాచకాలు, దుర్మార్గం, దురాగతాలు చెప్పలేని స్థాయిలో ఉన్నాయి. కాంట్రాక్టు అగ్రిమెంట్‌ను ఉల్లంఘించారు. ప్రభుత్వ ఆఫీసుల్లో ఉండి ధరణి పోర్టల్ నిర్వహించాలనే నిబంధనను పట్టించుకోలేదు. యజమానులు మారినప్పుడు ప్రభుత్వానికి ముందస్తు సమాచారం ఇవ్వాలన్న అంశాన్ని పక్కన పెట్టారు. బెంగళూరు, విజయవాడ, గుర్గావ్, ఈశాన్య రాష్ట్రాల్లో ఉండి తెలంగాణ భూముల క్రయ, విక్రయ లావాదేవీలు నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని భూముల వివరాలను విదేశీ కంపెనీల చేతుల్లో పెట్టారు. రైతాంగ సంపూర్ణ సమాచారాన్ని దేశం దాటించారు. రైతుల భూమి డాక్యుమెంట్లు, ఆధార్ కార్డులు, బ్యాంకు ఖాతాలు, టెలిఫోన్ నంబర్లు దేశం దాటి వెళ్లిపోయాయి. ఇది తీవ్రమైన నేరం. దీనికి ఏ స్థాయిలో శిక్ష విధించాలో తెలియాలంటే చట్టాలన్నింటినీ చదవాల్సిన పరిస్థితి..’అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ‘విదేశాల నుంచి కూడా లావాదేవీలు నిర్వహించారేమో ఇప్పుడు పరిశీలించాలి. భూముల రిజి్రస్టేషన్లు రాత్రి 9 గంటల నుంచి ఉదయం వరకు కూడా చేశారు. ప్రజల నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఖూనీ చేసి ఆర్థిక నేరాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి..’అని ఆయన వ్యాఖ్యానించారు. శుక్రవారం శాసనసభలో భూభారతి బిల్లుపై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి మాట్లాడారు. అన్ని పోరాటాలూ భూమి చుట్టూనే.. ‘తెలంగాణలో ప్రతి సమస్య భూమితో ముడిపడి ఉంది. అన్ని పోరాటాలు భూమి చుట్టూనే పరిభ్రమించాయి. పటేల్–పటా్వరీ వ్యవస్థ రద్దుకు కూడా భూసంబంధిత ఫిర్యాదులే కారణం. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ప్రజలకు మేలు జరిగేలా పాలకులు భూమి చట్టాలను రూపొందించారు. అయితే తెలంగాణ ఏర్పాటైన తర్వాత ధరణి పేరుతో తానో అద్భుత సాంకేతిక నైపుణ్య ఆవిష్కరణ చేశానని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. 80 వేల పుస్తకాలు చదివిన అనుభవాన్ని రంగరించి తయారు చేశానని చెప్పడంతో నిజంగానే భూమి సమస్యలు పరిష్కారమవుతాయేమోనని నేను కూడా ఓ సందర్భంలో భ్రమకు లోనయ్యా. కానీ ధరణి కేసీఆర్ సృష్టి కాదు.. 2010లోనే ఒడిశా రాష్ట్రంలో ఈ ధరణి పేరుతో భూ లావాదేవీలను నిర్వహించారు. ఆ పోర్టల్ నిర్వహించింది కూడా ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ కంపెనీనే. తెలంగాణలోనూ ధరణి పోర్టల్ ఆ సంస్థకే ఇచ్చారు. నాలుగేళ్ల తర్వాత కాగ్ ఈ కంపెనీ నిర్వాకం బయటపెట్టింది. ఎన్ఐసీ లాంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను పక్కన పెట్టి, ఆ కంపెనీని తెచ్చి అద్భుతాన్ని, అమృతాన్ని సృష్టించామని కేసీఆర్ చెప్పారు. ఈ లోపభూయిష్ట సాంకేతిక నైపుణాన్ని తెలంగాణ ప్రజలపై ఎందుకు రుద్దారో తెలియాలి’అని రేవంత్ అన్నారు. యువరాజు సన్నిహితుడి సంస్థకు భాగస్వామ్యం ‘ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్‌తోపాటు అప్పటి యువరాజుకు సన్నిహితుడైన గాదె శ్రీధర్‌రాజుకు చెందిన మరో సంస్థ ఈసెంట్రిక్, విజన్ ఇన్ఫోటెక్‌లకు సంయుక్తంగా ఈ కాంట్రాక్టు ఇచ్చారు. అప్పటికే ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ దివాళా తీసి క్రిమినల్ కేసుల్లో ఇరుక్కుంది. కంపెనీ ప్రతినిధులు జైలుకెళ్లారు. ఆ తర్వాత టెర్రాసిస్ టెక్నాలజీ పేరుతో మరో అనుబంధ కంపెనీని తెచ్చారు. ఆ తర్వాత ఫాల్కన్ ఎస్జీ అనే ఫిలిప్పీన్స్ కంపెనీ, ఫాల్కన్ ఇన్వెస్ట్మెంట్స్ అనే సింగపూర్ కంపెనీ తెచ్చారు. ఆ కంపెనీకి గాదె శ్రీధర్‌రాజు సీఈవో అయ్యాడు. ఆ తర్వాత స్పారో ఇన్వెస్టర్స్, గేటెవే స్కై ప్రైవేట్ లిమిటెడ్ అనే సింగపూర్ కంపెనీలు, హిల్బ్రూక్ ఇన్వెస్ట్మెంట్స్ అనే బ్రిటిష్ వర్జిన్ ఐల్యాండ్ కంపెనీ, గేట్‌వే ఫండ్ 2ఎల్ఎల్పీ అనే కెమెన్ ఐల్యాండ్స్ కంపెనీలను సృష్టించారు. అక్కడి నుంచి పెరడిమ్ ఇన్నోవేషన్స్ ఎల్ఎల్సీ, క్వాంటెల్లా ఐఎన్‌సీ అనే అమెరికా కంపెనీలను తెచ్చారు. ప్రపంచంలో జరిగే ప్రతి ఆర్థిక నేరానికి మూలం కెమెన్, బ్రిటిష్ ఐల్యాండ్స్ దేశాల్లో ఉంటుంది. పై కంపెనీలు నిర్వహిస్తున్న వారెవరూ ఈ రాష్ట్రం కాదు కదా దేశ పౌరులు కూడా కాదు. ఈ విధంగా తెలంగాణ రైతుకు, రెవెన్యూ శాఖకు మధ్య జరిగే లావాదేవీలు, డిజిటల్ వెబ్సైట్ నిర్వహణ పేరుతో రాష్ట్రంలోని అన్ని భూముల వివరాలను విదేశీ కంపెనీల చేతుల్లో పెట్టారు. ప్రజల నమ్మకాన్ని వంచన చేసి, వారి భూముల వివరాలను విదేశీ కంపెనీలకు అప్పజెప్పిన వారిని ఏమనాలి?’అని సీఎం ప్రశ్నించారు. మేం తొందరపడితే రికార్డులన్నీ ట్రాష్ అయ్యేవి.. ‘మీరు అధికారంలోకి వచ్చి ఏడాది అవుతోంది కదా.. ధరణిని ఏం చేశారని మమ్మల్ని అడిగారు. మేం విచారణకు ఆదేశించకుండా మౌనంగా ఉండడానికి కారణాలున్నాయి. మేము టెరాసిస్ నుంచి భూముల నిర్వహణ బాధ్యతలు ఎన్ఐసీకి ఇచ్చాం. కానీ ఈ డేటా బదలాయింపునకు గాదె శ్రీధర్‌రాజు సహకరించడం లేదు. మేము తొందరపడి ఆదేశాలిస్తే ఎక్కడో విదేశాల్లో కూర్చుని ఒక్క బటన్ నొక్కితే తెలంగాణ భూ రికార్డులన్నీ క్రాష్ అయిపోయేవి. సర్వర్లు డౌన్ చేస్తే మళ్లీ రిపేర్, రీస్టోర్ చేయడానికి నెలలు పట్టొచ్చు. అందుకే ఆచితూచి వ్యవహరించాం. ధరణి నిజంగా అద్భుతమైతే కేసీఆర్ సభకు వచ్చి మమ్మల్ని అడిగి, కడిగి నిలదీయాలి కదా?’అని ముఖ్యమంత్రి అన్నారు. ధరణి విషయంలో నిద్రలేని రాత్రులు.. ‘అధికారంలోకి వస్తే ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని మేమంటే, మమ్మల్ని బంగాళాఖాతంలో వేయాలని కేసీఆర్ అన్నారు. ఎన్నికల సభల్లో ఆయన ఆవేశంగా ఎందుకు ఊగిపోతున్నారో నాకు అర్థం కాలేదు. అధికారంలోకి వచ్చాక పరిశీలిస్తే ఇదంతా తెలిసింది. ధరణిని బంగాళాఖాతంలో వేసేందుకు సంవత్సరమంతా సాంకేతిక నిపుణులు, ప్రజలు, రైతులు, రైతు సంఘాలతో చర్చలు జరిపాం. వందల సమావేశాలు పెట్టుకున్నాం. రెవెన్యూ మంత్రి పొంగులేటితో పాటు అధికారులు, నిపుణులు, ధరణి పోర్టల్ పునరి్నర్మాణ కమిటీ సభ్యులు నిద్రలేని రాత్రులు గడిపారు. అన్నీ ఆలోచించి తెలంగాణ రైతాంగానికి మేలు జరిగేలా భూభారతి చట్టాన్ని తీసుకొచ్చాం. దీన్ని సభ్యులందరూ ఆమోదించాలి.’అని సీఎం కోరారు. -
రీసర్వేతో ఎంతో మేలు
తాడేపల్లి రూరల్: భూముల రీసర్వే వల్ల రైతులకు ఎంతో మేలు జరిగిందని, రాష్ట్రంలో అన్నిచోట్లా ఈ కార్యక్రమం పూర్తయితే ఎటువంటి భూ సమస్యలు ఉండవని రైతులంతా ముక్తకంఠంతో తెలిపారు. బ్రిటిష్ కాలం నాటి భూ రికార్డులను మార్చేందుకు వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చరిత్రలో తొలిసారి భూ రీసర్వే కార్యక్రమాన్ని చేపట్టిందని, దీనివల్ల రైతులకు ఇబ్బందులు తప్పాయని కేంద్ర గ్రామీణ మంత్రిత్వ శాఖ కార్యదర్శి మనోజ్ జోషికి స్పష్టం చేశారు. రీసర్వేను పైలట్ ప్రాజెక్ట్‌గా గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చింతలపూడిలో చేపట్టగా.. దీనివల్ల రైతులకు ఏమేరకు మేలు కలిగిందనే విషయాలను తెలుసుకునేందుకు గురువారం కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ (డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాండ్ రిసోర్స్) సెక్రటరీ మనోజ్ జోషి చింతలపూడి గ్రామంలో గురువారం రైతులతో ముఖాముఖి నిర్వహించారు. సర్వేయర్ రావాలంటే ఎన్నో ఏళ్లు పట్టేది మనోజ్ జోషి రైతులను వివిధ ప్రశ్నలు అడగ్గా.. కలెక్టర్ నాగలక్ష్మి తెలుగులో అనువాదం చేశారు. గతంలో పొలం గట్ల గొడవలు, విస్తీర్ణంలో తేడాలు, సర్వే నంబర్లలో తేడాలు ఉండేవి కదా అని మనోజ్ జోషి ప్రశ్నించగా.. గతంలో సర్వేయర్ పొలానికి వచ్చి సర్వే చేయాలంటే ఏళ్ల తరబడి సమయం పట్టేదని రైతులు వివరించారు. రీసర్వేను తమ గ్రామంలోనే పైలట్ ప్రాజెక్టుగా చేపట్టగా.. సర్వేలో ఒకటి, రెండు సెంట్లు పెరగడం, తగ్గడం జరిగాయని, దానివల్ల పెద్దగా నష్టం లేదని రైతులు చెప్పారు. తమ పొలాలకు సంబంధించిన పక్కా డాక్యుమెంట్లు తమ చేతికి అందాయన్నారు. తాతతండ్రుల కాలం నుంచి వ్యవసాయం చేస్తున్నామని, కానీ.. పొలాలకు సంబంధించి ఎటువంటి పాస్‌పుస్తకాలు, డాక్యుమెంట్లు లేవని చెప్పారు. దాంతో బ్యాంకర్లు రుణాలు ఇచ్చేందుకు నిరాకరించేవారని, రీ సర్వే కార్యక్రమం పూర్తయ్యాక డాక్యుమెంట్లు అందడంతో తాము బ్యాంకుల ద్వారా రుణాలు అందుకున్నామని వివరించారు.ఇళ్లకు, స్థలాలకు సైతం దస్తావేజులొచ్చాయిగ్రామంలో ఇళ్ల సర్వే గురించి కేంద్ర గ్రామీణ మంత్రిత్వ శాఖ కార్యదర్శి మనోజ్ జోషి ప్రశ్నించగా.. తాతలు, తండ్రుల నుంచి ఆస్తి పంచుకున్నా అందరి దగ్గర ఒకే డాక్యుమెంట్ ఉండేదని గ్రామస్తులు చెప్పారు. రీసర్వే పూర్తయ్యాక ఎవరి దస్తావేజులు వారికి అందజేశారని, వాటివల్ల పిల్లల చదువులు, ఇతర అవసరాల నిమిత్తం బ్యాంకు రుణాలు పొందే అవకాశం కలిగిందని వెల్లడించారు. అనంతరం సర్వే సిబ్బంది నుంచి ఎలా సర్వే చేశారనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో చింతలపూడి గ్రామంలో మొత్తం 931 ఎకరాలకు సంబంధించి 757 మంది రైతులు, 41.93 సెంట్ల ఇళ్ల స్థలాలకు సంబంధించి 450 మంది లబ్దిదారుల భూములకు రీ సర్వే కార్యక్రమం చేపట్టారు. ప్రతి రైతుకు సంబంధించిన భూమి విస్తీర్ణం, హద్దులను నిర్ణయించి పాస్‌బుక్‌లు అందజేశామని కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. -
థర్డ్ పార్టీతో ధరణి మదింపు!
సాక్షి, హైదరాబాద్: ధరణి పోర్టల్‌ను థర్డ్ ఫార్టీతో ఆడిటింగ్ (మదింపు) చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సిఫారసు చేసింది. ఫోరెన్సిక్‌తో పాటు కమ్యూనిటీ ఆడిటింగ్ చేయించడం ద్వారా ఈ పోర్టల్‌లో భూముల రికార్డులు ఏమైనా తారుమారయ్యాయేమో గుర్తించాలని సూచించింది. ఈ పోర్టల్ ద్వారా భూముల రికార్డుల నిర్వహణ గత నాలుగేళ్లుగా ప్రైవేటు కంపెనీ చేతుల్లో ఉన్నందున అనధికారికంగా రికార్డుల మార్పు జరిగిందేమో పరిశీలించాలని ఇటీవల ప్రభుత్వానికి ఇచి్చన నివేదికలో కోరినట్టు తెలిసింది. గత ప్రభుత్వ హయాంలో అమల్లోకి వచ్చిన ఈ పోర్టల్ ద్వారా రాష్ట్రంలోని వేలాది ఎకరాల భూముల రికార్డులు మారిపోయాయని, అర్ధరాత్రి రికార్డుల మార్పిడి జరిగిందన్న రాజకీయ ఆరోపణల నేపథ్యంలో ధరణి పోర్టల్ పునరి్నర్మాణ కమిటీ చేసిన సిఫారసు ప్రాధాన్యత సంతరించుకుంది. రెండు పద్ధతుల్లోనూ చేయడం మంచిది ఆడిటింగ్‌ను రెండు పద్ధతుల్లోనూ నిర్వహించాలని కమిటీ ప్రభుత్వానికి సూచించినట్టు తెలిసింది. ఫోరెన్సిక్‌తో పాటు కమ్యూనిటీ ఆడిటింగ్ చేపట్టాలని, ఫోరెన్సిక్ ఆడిటింగ్‌లో భాగంగా ధరణి పోర్టల్‌లో రికార్డుల నమోదుతో పాటు మారి్పడి లావాదేవీలను సాఫ్ట్వేర్, సైబర్ క్రైమ్ నిపుణులతో మదింపు చేయించాలని సూచించినట్టు సమాచారం. ఇక, గ్రామాలకు వెళ్లి కమ్యూనిటీ ఆడిటింగ్ చేయాలని, ప్రతి రైతు యాజమాన్య హక్కుల రికార్డులను మాన్యువల్ పద్ధతిలో సరిచూడాలని సిఫారసు చేసింది.ఇందుకోసం మూడు, నాలుగు నెలల కార్యాచరణ రూపొందించుకోవాల్సి ఉంటుందని భూ నిపుణులు చెపుతున్నారు. కమ్యూనిటీ ఆడిటింగ్ నిర్వహించడం ద్వారా క్షేత్రస్థాయిలో రైతులు ధరణి పోర్టల్ ద్వారా ఎదుర్కొంటున్న సమస్యలు వెలుగులోకి వస్తా యని, అదే విధంగా ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న భూసమస్యల దరఖాస్తులకు కూడా పరిష్కారం లభిస్తుందని కమిటీ పేర్కొన్నట్టు తెలిసింది. భూరికార్డులు అనధికారికంగా మార్చి ఉంటే క్రిమినల్ చర్యలు తీసుకునే అవకాశముందనే కోణంలో కమిటీ ఈ ఆడిటింగ్‌లకు సిఫారసు చేసినట్టు సమాచారం. ఆ మూడు రికార్డులు చూడండి ఆడిటింగ్‌లో భాగంగా మూడు రికార్డులను పరిశీలించాలని ధరణి కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకాక ముందు భూ యాజమాన్య హక్కుల రికార్డు డేటా, 2017లో నిర్వహించిన భూరికార్డుల ప్రక్షాళన ద్వారా వచ్చిన రికార్డుల డేటా, ఆ తర్వాత ధరణి పోర్టల్‌లో నమోదు చేసిన డేటాలను పరిశీలించాలని, అప్పుడే అనధికారిక మార్పులు జరిగాయో లేదో తేలుతుందని స్పష్టం చేసినట్లు సమాచారం. ధరణి పోర్టల్ అందుబాటులోకి వచి్చన తర్వాత జరిగిన రికార్డుల మారి్పడి లావాదేవీలను కూడా పరిశీలించాల్సి ఉంటుందని, గతంలో ఏడాదికోమారు జమాబందీ ప్రక్రియ ద్వారా భూమి రికార్డులను పరిశీలించే వారని, ఇప్పుడు ఆ పద్ధతి అమల్లో లేనందున ఆడిటింగ్ నిర్వహించడం ద్వారా జమాబందీ నిర్వహించినట్టు కూడా అవుతుందని ఆ నివేదికలో కమిటీ అభిప్రాయపడ్డట్టు తెలిసింది. -
57 ఏళ్ల తర్వాత రికార్డులు కోరలేరు
సాక్షి, హైదరాబాద్: దాదాపు 57 ఏళ్ల తర్వాత భూరికార్డులు కోరలేరని మ్యుటేషన్ వివాదం అప్పీల్లో హైకోర్టు స్పష్టం చేసింది. చట్టంలో కాలవ్యవధి పేర్కొననప్పటికీ కక్షిదారులు సహేతుకమైన వ్యవధిలోనే అధికారులను సంప్రదించాలని తేల్చిచెప్పింది. 57 ఏళ్ల తర్వాత రికార్డుల్లో నమోదుకు దరఖాస్తు సమరి్పంచినందున అప్పీలుదారు సవరణకు అర్హుడు కాదని చెప్పింది. సింగిల్ జడ్జి ఆదేశాల్లో జోక్యం చేసుకోవడానికి ఎలాంటి కారణాలు కనిపించడం లేదని వ్యాఖ్యానించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాస్‌రావు ధర్మాసనం అప్పీల్‌ను కొట్టివేసింది. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కొండాయ్‌పల్లిలోని 64.30 ఎకరాల భూమి తమదేనంటూ బూరుగుపల్లికి చెందిన హనుమంతరావు హైకోర్టులో పిటిషన్ వేశారు. తన తల్లి 1963లో ఆ భూమిని కొనుగోలు చేసిందని, మ్యుటేషన్ కోసం తహసీల్దార్‌ను సంప్రదించిందన్నారు. అయితే మొత్తం భూమిలోని 4.23 ఎకరాలు ఆమె పేరు మీద లేదంటూ మ్యుటేషన్‌కు నిరాకరించారని.. ఈ క్రమంలోనే భూమి, పట్టాదార్ పాస్‌బుక్‌లో తెలంగాణ హక్కుల చట్టం–2020 అమల్లోకి వచ్చిందని చెప్పారు. అనంతరం కలెక్టర్ (ప్రత్యేక ట్రిబ్యునల్)కు అప్పీల్ చేసుకోగా.. దీన్ని కొట్టివేశారన్నారు. దీంతో హైకోర్టును ఆశ్రయించినట్లు వివరించారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి.. 1963లో భూమి కొనుగోలు చేసి 2019లో మ్యుటేషన్‌కు అధికారులను సంప్రదించడాన్ని తప్పుబట్టి పిటిషన్‌ను కొట్టివేశారు. దీనిపై హనుమంతరావు అప్పీల్ దాఖలు చేయగా.. ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. వాదనలు విని అప్పీల్‌ను కొట్టివేసింది. అయితే, అప్పీలుదారు, అతని తల్లి చట్టప్రకారం సివిల్ కోర్టును ఆశ్రయించవచ్చంటూ స్వేచ్ఛనిచి్చంది. -
ముసాయిదానే.. కొత్త చట్టం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూముల రికార్డులకు సంబంధించిన ‘రికార్డ్ ఆఫ్ రైట్స్–2024 (ఆర్వోఆర్)’ చట్టం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయానికి వచ్చింది. ఒకట్రెండు చిన్న చిన్న మార్పులు మినహా ముసాయిదా కింద రూపొందించిన అంశాలనే చట్టం రూపంలో అమల్లోకి తెచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. రెవెన్యూమంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి త్వరలోనే దీనిపై ఓ స్పష్టత ఇస్తారని.. సీఎం రేవంత్‌రెడ్డితో చర్చించాక తుది నిర్ణయం ప్రకటిస్తారని రెవెన్యూ వర్గాలు తెలిపాయి. దాంతోపాటు ఈ చట్టాన్ని వెంటనే అమల్లోకి తెచ్చేందుకు మంత్రివర్గం ఆమోదంతో ఆర్డినెన్స్ జారీ చేస్తారా? లేక అసెంబ్లీలో పెట్టిన బిల్లుపై విస్తృతంగా చర్చించి చట్టంగా చేస్తారా? అన్న దానిపై మాత్రం తర్జనభర్జన కొనసాగుతున్నట్టు వెల్లడించాయి. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఈనెల 20న జరిగే కేబినెట్ సమావేశం ముందుకు ఆర్డినెన్స్ వచ్చే అవకాశం లేదని అంటున్నాయి. అయితే కేబినెట్ ఎజెండాపై బుధవారం స్పష్టత వస్తుందని, ఎజెండాలో భూముల చట్టం ఆర్డినెన్స్ ఉంటే రూపకల్పన, జారీ ఏర్పాట్లకు సిద్ధంగానే ఉన్నామని రెవెన్యూ వర్గాలు వెల్లడించాయి. ముసాయిదా బిల్లు ఇదే.. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో భాగంగా ఈ ఏడాది ఆగస్టు 2న రాష్ట్ర ప్రభుత్వం ‘ఆర్వోఆర్–2024’ ముసాయిదాను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఆర్వోఆర్–2020 చట్టంలో పరిష్కరించలేని అనేక సమస్యలకు పరిష్కారం చూపుతూ 20 సెక్షన్లతో ఈ ముసాయిదా చట్టాన్ని రూపొందించింది. 1936, 1948, 1971, 2020 నాటి ఆర్ఓఆర్ చట్టాలను పరిశీలించి, వాటి అమలుతో చేకూరిన ఫలితాలను బేరీజు వేసి కొత్త చట్టం ముసాయిదాను తయారు చేసింది. తెలంగాణలో ఆర్వోఆర్ చట్టాల అమలు చరిత్ర, ప్రస్తుత సమస్యలు, రాబోయే అవసరాల అంచనాల ప్రకారం రూపొందించిన ఈ ముసాయిదాలో పాస్ పుస్తకాలు రాని భూముల సమస్యల పరిష్కారం, కొత్త రికార్డును ఎప్పుడైనా తయారు చేసుకునే అధికారాన్ని కల్పించడం, రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, భూఆధార్, ఆబాదీలకు ప్రత్యేక హక్కుల రికార్డు, అప్పీల్, రివిజన్ లాంటి వెసులుబాట్లు కల్పిస్తూ అనేక అంశాలను ముసాయిదాలో పొందుపరిచారు. బిల్లు పెట్టిన తర్వాత ఏం జరిగిందంటే.. తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఆర్వోఆర్ చట్టానికి రెండోసారి మార్పు జరుగుతోంది. 2020లో బీఆర్ఎస్ హయాంలో ఆర్వోఆర్–2020 చట్టం అమల్లోకి తెచ్చారు. అందులోని అనేక అంశాలకు సవరణలు, మార్పు చేర్పులతో ఆర్వోఆర్–2024ను కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ముందు పెట్టింది. ముసాయిదాపై ఈ ఏడాది ఆగస్టు 2 నుంచి 23 వరకు ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించింది. మంత్రులు, రెవెన్యూ శాఖ సీనియర్ అధికారులు, భూచట్టాల నిపుణులు, మేధావులు, సామాన్యులు.. ఇలా అన్ని వర్గాలు అభిప్రాయాలు స్వీకరించింది. ఈ వివరాలతో జిల్లాల కలెక్టర్లు నివేదికలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు. ఆ మూడు అంశాలే కీలకం ప్రజలతోపాటు భూచట్టాల నిపుణుల నుంచి వచ్చిన అనేక సూచనలు, సలహాల్లో మూడు అంశాలు కీలకమని రెవెన్యూ వర్గాలు చెప్తున్నాయి. ముఖ్యంగా రెవెన్యూ ట్రిబ్యునళ్ల ఏర్పాటు ప్రతిపాదన ముసాయిదా చట్టంలో లేదని.. భూసమస్యల పరిష్కారం కోసం ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేయాలని పలువురు సూచించారు. అయితే రెవెన్యూ ట్రిబ్యునళ్ల ఏర్పాటుకు, ఆర్ఓఆర్ చట్టానికి సంబంధం లేదని రెవెన్యూ వర్గాలు చెప్తున్నాయి. అయితే భూరికార్డుల ప్రక్షాళనలో భాగంగా పార్ట్–బీలో పెట్టిన 18లక్షల ఎకరాల భూముల సమస్యలను పరిష్కరించేందుకు ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేసే ఆలోచన ప్రభుత్వానికి కూడా ఉందని అంటున్నాయి. ఇందుకోసం ప్రత్యేక ఉత్తర్వులు ఇవ్వొచ్చని, లేదా ముసాయిదా చట్టంలోని సెక్షన్–4 ప్రకారం కూడా ఏర్పాటు చేయవచ్చని పేర్కొంటున్నాయి. ఇక అప్పీల్, రివిజన్లకు సంబంధించిన అంశంలోనూ చాలా సూచనలు వచ్చాయి. తహసీల్దార్లు, ఆర్డీవోలు చేసే రిజిస్రే్టషన్లు, మ్యుటేషన్లకు సంబంధించి వివాదాలు వస్తే అప్పీల్‌ను కలెక్టర్లు లేదా అడిషనల్ కలెక్టర్‌కు చేసుకోవాలని.. సెకండ్ అప్పీల్‌ను సీసీఎల్ఏకు, రివిజన్ కోసం ప్రభుత్వానికి లేదంటే సీసీఎల్ఏకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని చట్టంలో ప్రతిపాదించారు. అయితే ఈ అప్పీల్ అవకాశం ఆర్డీవో స్థాయిలోనూ ఉండాలని పలువురు సూచించారు. రిజిస్రే్టషన్, మ్యుటేషన్ చేసేటప్పుడు సర్వే మ్యాప్ తప్పనిసరి అని.. ప్రతి భూకమతానికి తాత్కాలిక, శాశ్వత భూఆధార్ (ప్రత్యేక గుర్తింపు సంఖ్య) ఇస్తామన్న ప్రతిపాదనలపైనా పలు సూచనలు వచ్చాయి. వీటి విషయంలో ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో తేలాల్సి ఉంది. సాదాబైనామాలకు అవకాశం ఆర్వోఆర్–2024 చట్టం అమల్లోకి వస్తే పెండింగ్‌లో ఉన్న 9.4 లక్షల సాదాబైనామా దరఖాస్తులకు మోక్షం కలగనుంది. ఈ సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారాన్ని ప్రత్యేక సెక్షన్లో ప్రతిపాదించారు. ఇక అసైన్డ్ భూముల సమస్య పరిష్కారానికి ఈ చట్టంలో ఎలాంటి ప్రస్తావన లేదనే విమర్శలున్నాయి. అయితే అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు కల్పించడానికి, ఆర్వోఆర్ చట్టానికి సంబంధం లేదని.. అసైన్డ్ భూములపై హక్కులు రావాలంటే హక్కుల బదలాయింపు నిషేధిత చట్టాన్ని (పీవోటీ) సవరించాల్సి ఉంటుందని రెవెన్యూ వర్గాలు వివరిస్తున్నాయి. మొత్తమ్మీద ముసాయిదా చట్టంలో ఒకట్రెండు అంశాల్లోనే మార్పు ఉంటుందని.. అది కూడా మార్గదర్శకాలు తయారు చేసినప్పుడు వాటిలో పొందుపరుస్తారని పేర్కొంటున్నాయి. -
ఇదో కొత్తరకం సైబర్ మోసం!
సైబర్ నేరగాళ్లు రోజురోజుకు కొత్త పద్దతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. మొబైల్ ఫోన్‌కు ఎటువంటి సమాచారం రాకుండా చేస్తూ అకౌంట్లో నుంచి డబ్బు దోచేస్తున్నారు. ఈ తరహా మోసం ఇటీవల బిహార్‌లోని పూర్నియాలో వెలుగులోకి వచ్చింది. మొబైల్ ఫోన్‌కు వన్ టైం పాస్వర్డ్ (ఓటీపీ), బ్యాంక్ నుంచి కాల్ రాకుండా, ఇలా ఎటువంటి క్లూ కూడా లేకుండా డబ్బులు దోచుకున్న ఘటనకు సంబంధించిన వీడియోను హర్యానా ఐపీఎస్ అధికారి పంకజ్ జైన్ సోషల్ మీడియలో పోస్ట్ చేశారు.No OTP,No phone call,No clue,But money was stolen from the bank account...(with the help of Registry papers)Case is of Purnia Bihar . #CyberFraud pic.twitter.com/jeVGqhMWmV— Pankaj Nain IPS (@ipspankajnain) July 11, 2024బిహార్‌లోని పూర్నియా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ‘వెబ్సైట్ నుంచి భూమి రికార్డుల పత్రాల వివరాలు సేకరించి ఆ రికార్డుల్లో ఉన్న సమాచారాన్ని బ్యాంకులో చొరబడి తారుమారు చేశారు. భూరికార్డుల్లో ఆధార్‌కార్డు, బయోమెట్రిక్‌లను తారుమారు చేసి నకిలీ వేలిముద్రలు సృష్టించారు. ఈ విధంగా మొబైల్ ఫోన్‌కు కాల్, ఓటీపీ రాకుండానే మోసానికి పాల్పడ్డారు’ పోలీసులు తెలిపారు. ఇలా మోసాలకు పాల్పడుతున్న ముఠాలో 8 మందిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. -
ఆదివారం నాడు ఆఫీసుల్లో మీకేం పనయ్యా?
జడ్చర్ల: ప్రభుత్వ కార్యాలయంలో సెలవురోజున ఏం పనులు వెలగబెడుతున్నారంటూ ఓ ఆర్ఐపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి మండిపడ్డారు. వివరాల్లోకి వెళితే...మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ తహసీల్దార్ కార్యాలయంలో ఆదివారం ఆర్ఐ వెంకట్‌రెడ్డి గిరప్పతో రెవెన్యూ రికార్డులకు సంబంధించిన నోట్స్ రాయిస్తున్నాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి వెంటనే అక్కడికి వచ్చి ఆర్ఐ వెంకట్‌రెడ్డితోపాటు రికార్డులు రాస్తున్న వ్యక్తిని పట్టుకున్నారు. తలుపులు మూసుకొని రికార్డుల ఫైల్స్ రాయడం ఏమిటని ప్రశ్నించారు. జేసీ అనుమతితో సక్సేషన్ రాస్తున్నామని ఆర్ఐ సమాధానం ఇవ్వడంతో, జేసీకి ఫోన్ కలపాలని చెప్పారు. ప్రైవేట్ వ్యక్తులను కార్యాలయంలోకి తీసుకొచ్చి రికార్డులు రాయించడం ఏమిటని నిలదీశారు. సంబంధిత ఆర్ఐపై చర్యలు తీసుకోకపోతే కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ విషయమై కలెక్టర్‌కు ఫోన్లో ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. కాగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంలో భాగంగా తాము సెలవు రోజు కూడా కార్యాలయంలో పనులు చేస్తున్నామని ఆర్ఐ వెంకట్‌రెడ్డి తెలిపారు. Jadcherla Congress MLA Anirudh Reddy caught a Revenue Inspector who was reportedly manipulating records in MRO office, on Sunday at Balanagar Mandal pic.twitter.com/xyjf3HlVSN— Naveena (@TheNaveena) June 23, 2024 -
భూ హక్కులకు భద్రత
సాక్షి, అమరావతి: భద్రమైన భూముల వ్యవస్థ, సమర్థమైన భూ పరిపాలన కోసం ఐదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం అమలుచేసిన సంస్కరణలు దేశానికే రోల్ మోడల్‌గా నిలిచాయి. భూముల సమస్యలను పరిష్కరించడంలో, భూ పరిపాలనలో రాష్ట్రం అగ్రగామిగా నిలిచింది. అనేక సంవత్సరాలుగా పేరుకుపోయిన భూ సమస్యలను పరిష్కరించడానికి ఈ ఐదేళ్లలో అనేక విప్లవాత్మకమైన చర్యలు చేపట్టింది. భూ రికార్డుల్లో అస్పష్టత, సర్వే రికార్డుల్లో సమస్యలు, వివాదాలు, వ్యాజ్యాలవల్ల స్తంభించిన భూ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి గతంలో ఏ ప్రభుత్వం తీసుకోని చర్యలను ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ సర్కారు సాహసోపేతంగా తీసుకుంది. భూములతో ముడిపడి ఉన్న చిక్కుముడుల్ని విప్పడంతో భూ యాజమాన్యం ఇప్పుడు సమర్థవంతంగా మారింది. భూ సమస్యలతో దశాబ్దాలుగా చితికిపోయిన వారు ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటున్నారు. ♦ నూతన పింఛను పథకం కింద ఉద్యోగుల పదవీ విరమణ అనంతరం ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించడానికి జీపీఎస్ (ఏపీ హామీ పింఛను పథకం) అమలుచేయడానికి ప్రభుత్వం ముందడుగు వేసింది. ఉద్యోగులకు లాభదాయకమైన, స్థిరమైన, ప్రత్యామ్నాయ పింఛను పథకంగా ఇది ఉంది. దీనిద్వారా కేంద్ర ప్రభుత్వానికి, ఇతర రాష్ట్రాలకు మా ప్రభుత్వం ప్రత్యామ్నాయ పరిష్కారాన్ని అందించింది. ♦ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రసంగిస్తూ ఏమన్నారంటే.. వందేళ్ల తర్వాత రాష్ట్రంలో ఉన్న భూములను పునఃపరిశీలన (రీసర్వే) చేయడం కోసం వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకాన్ని 2020, డిసెంబర్ 21న ప్రభుత్వం ప్రారంభించింది. కొత్తగా 11,118 గ్రామ సర్వేయర్లను నియమించడం, నిరంతరాయంగా పనిచేసే సరికొత్త జియో రిఫరెన్స్ స్టేషన్ల (సీఓఆర్ఎస్) టెక్నాలజీని ప్రవేశపెట్టడం ద్వారా రీ సర్వే అత్యంత శాస్త్రీయంగా జరుగుతోంది. ♦ ఇప్పటివరకు 17.53 లక్షల మంది రైతులకు శాశ్వత భూహక్కు పత్రాలు ఇచ్చాం. 4.80 లక్షల మ్యుటేషన్లు జరిగాయి. రీ సర్వేలో 45వేల భూ సరిహద్దు వివాదాలు పరిష్కారమయ్యాయి. ♦ 1.37 లక్షల ఎకరాల గ్రామ సర్వీస్ ఈనాం భూములను నిషేధిత జాబితా 22(ఎ) నుంచి తొలగించడం ద్వారా 1.13 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరింది. 33,428.64 ఎకరాల షరతులు గల పట్టా భూములు, 2.06 లక్షల ఎకరాల చుక్కల భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించడం ద్వారా 1.07 లక్షల మంది రైతులకు ఆ భూములపై సర్వహక్కులు ఏర్పడ్డాయి. 1982 నుంచి 2014 వరకు భూమి కొనుగోలు పథకం కింద భూములు పొందిన 22,837 ఎకరాలకు చెందిన 22,346 మంది భూమిలేని దళితుల భూములను 22 (ఎ) జాబితా నుంచి తొలగించడం ద్వారా లబ్ధిపొందారు. భూమిలేని నిరుపేదలకు 46,463 ఎకరాల డీకేటీ పట్టాలను పంపిణీ చేశాం. ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట.. ♦మా ప్రభుత్వం ఐదేళ్లలో 4.93 లక్షల కొత్త ఉద్యోగాలు కల్పించింది. వీటిలో 2,13,662 ఉద్యోగాలు శాశ్వత నియామకాలు. 2014–19 మధ్యకాలంలో ఇచ్చిన 34,108 ఉద్యోగాల కంటే ఇవి ఎన్నో రెట్లు ఎక్కువ. సుమారు 10 వేల మంది ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తున్నాం. 51,387 మంది ఆర్డీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశాం. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల కోసం ఆప్కాస్ సంస్థను ఏర్పాటుచేశాం. ♦ 27 శాతం మధ్యంతర భృతిని ఉద్యోగుల సంక్షేమానికి మంజూరు చేశాం. 11వ వేతన సవరణ సంఘం సిఫారసులను అమలుచేశాం. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచాం. ♦ ఆశ్కా వర్కర్లు, గిరిజన సామాజిక ఆరోగ్య కార్యకర్తలు, మున్సిపాల్టీల్లో పనిచేసే ఔట్సోర్సింగ్, ప్రజారోగ్య కార్మికులకు, సెర్ప్‌కి చెందిన విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లు, మెప్మాకు చెందిన రీసోర్స్ పర్సన్లు, హోమ్‌గార్డులు, మధ్యాహ్న భోజన పథకం కింద పనిచేస్తున్న సహాయకులు, అంగన్వాడీ వర్కర్లు, సహాయకులకు ప్రభుత్వం వేతనం పెంచింది. -
ఈ పాసు పుస్తకాలు అత్యంత ఆధునికం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్త డిజిటల్ భూ రికార్డుల విధానం గురించి ఏమాత్రం అవగాహనలేకుండా ప్రభుత్వంపై కొందరు ఉద్దేశపూర్వకంగా బురదజల్లడమే పనిగా పెట్టుకున్నారు. జగనన్న భూహక్కు, భూరక్ష పథకం కింద ఇచ్చిన పట్టాదారు పాసుబుక్‌లు ఎందుకు పనికిరావని.. ఇందులో రైతులకు హక్కుల్లేవని, రుణాలు రావంటూ ప్రభుత్వంపై విద్వేషం రగిలిస్తూ ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారు. కానీ, భూముల రీసర్వే తర్వాత ప్రభుత్వం జారీచేస్తున్న పట్టాదార్ పాసు పుస్తకాలు అత్యంత ఆధునికమైనవని రెవెన్యూ వర్గాలు స్పష్టంచేస్తున్నాయి. రుణాలు తీసుకోవడానికి ప్రస్తుతం ఇస్తున్న పాసు పుస్తకం (భూ హక్కు పత్రం) ఉపయోగపడదనే ప్రచారం అవగాహన రాహిత్యమేననే చెబుతున్నాయి. నిజానికి.. భూములపై యాజమాన్య హక్కును ప్రతిబింబించేది పాసు పుస్తకమే. దాన్ని చూపించి బ్యాంకుల రుణం తీసుకోవడంతోపాటు తనఖా పెట్టుకోవడం, అమ్ముకోవడం వంటివన్నీ గతంలో మాదిరిగానే ఇప్పుడు కూడా నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. రీ సర్వేకు ముందున్న పాస్ పుస్తకంలోని ఉపయోగాల కంటే ఇప్పుడిస్తున్న పాసు పుస్తకాలతో ఎక్కువ ఉపయోగాలు ఉంటాయి. ► 2016లో ఆర్ఓఆర్ చట్టాన్ని సవరించిన తర్వాత భూముల అమ్మకాలు, కొనుగోళ్లు, బహుమతి, తనఖా, లీజు వంటి లావాదేవీలను పాసు పుస్తకంలో రిజిస్ట్రేషన్ అధికారి నమోదు చేయాల్సిన అవసరంలేదు. ► రైతులు రుణాలు తీసుకోవడానికి తమ పాసు పుస్తకాలను బ్యాంకుల్లో ఇవ్వక్కర్లేదు. ► రెవెన్యూ రికార్డులు ఆన్లైన్లో ఉండటంతో పాసు పుస్తకాలను అప్డేట్ చేయాల్సిన అవసరం కూడా లేకుండాపోయింది. ► రుణం మంజూరు చేసేటప్పుడు వెబ్‌ల్యాండ్ ఎలక్ట్రానిక్ రెవెన్యూ రికార్డుల్లో రుణం గురించి నమోదుచేస్తారు. ఈ విషయం తెలుసుకోకుండా కొందరు ఇప్పుడున్న పాసు పుస్తకాల కంటే గతంలో ఇచ్చిన పాస్ పుస్తకాలే మంచివని ప్రచారం చేస్తున్నారు. ఇది సరికాదని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. ► నిజానికి.. రీసర్వే ప్రక్రియకు ముందు జారీచేసిన పాసుబుక్‌లతో పోలిస్తే ప్రస్తుత పాస్బుక్లకే విలువ ఎక్కువ. కొత్త పాసు పుస్తకంతో రుణాలు రాలేదనే ఫిర్యాదు రాలేదు.. ఇక అవాస్తవ ప్రచారం చేస్తున్న వారికి తెలియని విషయం ఏమిటంటే.. జగనన్న భూహక్కు, భూరక్ష పథకం కింద ఇచ్చిన పాసు పుస్తకం (భూహక్కు పత్రం) అత్యంత ఆధునికమైంది. ఇందులో నమోదు చేసిన వివరాలన్నీ ఆన్లైన్లోని వెబ్‌ల్యాండ్‌లో ఉన్న వివరాలే. అలాగే.. ► ఈ పాసుబుక్‌లో భూమికి సంబంధించిన జియో కోఆర్డినేటెడ్ లొకేషన్, భూ కమతం స్కెచ్, యజమాని పేరు వంటివన్నీ ఉంటాయి. డిజిటల్ యుగంలో వచ్చిన కొత్త మార్పు ఇది. ► గతంలో మాదిరిగా పాసు పుస్తకాలు అసలైనవా కాదా? అని ధృవీకరించుకోవాల్సిన అవసరంలేదు. ► పాస్ పుస్తకాల్లేవని, పోయాయని కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం కూడా లేదు. ఆన్లైన్లో నమోదైన వివరాలే పక్కాగా ఉంటాయి. ► అంతేకాక.. ఈ కొత్త పాస్ పుస్తకాలను ఫోర్జరీచేసే అవకాశం కూడా లేదు. దొంగ పాస్ పుస్తకాలను సృష్టించడం కుదరదు. ► పాస్ పుస్తకంలో ఉన్న క్యూఆర్ కోడ్ ద్వారా నకిలీవి సృష్టించడం సాధ్యంకాదు. అందువల్లే ఈ పాస్ పుస్తకంపై భౌతికంగా సంతకాలు అవసరంలేదు. ► ఇలా వివరాలన్నీ ఆన్లైన్లో ఉండడంవల్ల గతంలో మాదిరిగా పాస్ పుస్తకాలు ఒకరి పేరుతో, అడంగల్, 1బీ మరొకరి పేరు మీద ఉండే అవకాశంలేదు. ► అందుకే దీన్ని దేశంలోనే అత్యంత ఆధునికమైన భూరికార్డు విధానంగా పలు రాష్ట్రాలు అంగీకరిస్తున్నాయి. ► ఇక ఈ పాస్ పుస్తకం ద్వారా రుణం రాలేదని, రిజిస్ట్రేషన్ జరగట్లేదని ఇప్పటివరకు రాష్ట్రంలో ఒక్క ఫిర్యాదు కూడా రాలేదు. జాయింట్ పట్టాలు ఇవ్వద్దని ఆదేశాలు.. ఇక జాయింట్ పట్టాలపైనా అపోహలు నెలకొన్నాయి. ఇప్పటికే ప్రభుత్వం జాయింట్ ఎల్పీఎంలు (ల్యాండ్ పార్సిల్ మాప్) జారీ చెయ్యొద్దని స్పష్టంగా ఆదేశాలిచ్చింది. ఆధీనంలో ఉన్న భూమి ప్రకారం, దానిపై హక్కులపై ప్రకారం సబ్ డివిజన్ చేసుకోని సందర్భాల్లో జాయింట్ ఎల్పీఎంలు ఇచ్చారు. గతంలో ఉన్న జాయింట్ పట్టాలవల్ల ఏర్పడిన గొడవలనే ఇప్పుడు కొత్తగా ఏర్పడుతున్న గొడవలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటుచేసిన ధరణి వెబ్సైట్లో అనుభవదారుల హక్కులు కనపడని విధంగా ఏపీలోనూ హక్కులు కనపడడం లేదంటూ ప్రజల్లో అపోహలు పెంచే ప్రయత్నం జరుగుతోంది. రాష్ట్రంలో భూ హక్కుల రక్షణ విధానం అత్యంత ఆధునికంగా రూపొందించారు. ఈ విధానం భారతదేశంలోనే ఆదర్శంగా నిలిచింది. అందరికీ ఆమోదయోగ్యమైన విధంగా చట్టప్రకారం జరుగుతున్న రీ సర్వే ద్వారా పటిష్టమైన భూ హక్కులను రికార్డు చేసే వ్యవస్థ రాష్ట్రంలో రూపొందింది. ఈ విషయాలేవీ తెలుసుకోకుండా కేవలం రాజకీయ కోణంలో సీపీఐ నాయకుడు నారాయణ ఆరోపణలు చేయడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. -
ఏపీ వ్యాప్తంగా అందుబాటులోకి ఆటో మ్యుటేషన్
-
భూ రికార్డుల డిజిటలైజేషన్లో ఏపీ ఆదర్శం
సాక్షి, విశాఖపట్నం: భూ సంబంధిత వ్యవహారాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు అద్భుతంగా ఉన్నాయని, ఇతర రాష్ట్రాలకు ఆదర్శమని కేంద్ర గ్రామీణాభివృద్ధి, భూ వనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి అజయ్ టిర్కీ, సంయుక్త కార్యదర్శి సోన్మోని బోరా ప్రశంసించారు. డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డుల మోడ్రనైజేషన్ ప్రోగ్రాంలో భాగంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి, భూ వనరుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యాన విశాఖలోని ఓ హోటల్లో శుక్రవారం దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ సదస్సు నిర్వహించారు. దక్షిణాదిలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్ణాటకలలో ప్రస్తుతం అమలు చేస్తున్న భూ విధానాలు, రికార్డుల నవీకరణ, ఇతర ప్రక్రియల గురించి ఆయా రాష్ట్రాల ఉన్నతాధికారులు వివరించారు. దేశమంతటికీ ఒకే వేదికగా మాతృభూమి పేరుతో పైలట్ జియో పోర్టల్‌ను ఆవిష్కరించారు. అజయ్ టిర్కీ మాట్లాడుతూ సాంకేతికత సహకారంతో భూ సంబంధిత సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని చెప్పారు. అన్ని రాష్ట్రాలు భూ రికార్డులను నవీకరించి మాతృభూమి పోర్టల్‌కు అనుసంధానం చేయాలని చెప్పారు. ఇప్పటి వరకు ఉన్న అన్ని రకాల భూ రికార్డులను నవీకరించాలని, రాజ్యాంగంలో గుర్తించిన అన్ని భాషల్లోకి అనువదించాలని సూచించారు. ఇటీవల ప్రధాని మోదీ చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్‌తోపాటు అర్హత కలిగిన కొన్ని రాష్ట్రాలకు, జిల్లాలకు భూమి సమ్మాన్ ప్లాటినం సర్టిఫికెట్లను అందజేసినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రదర్శించిన ప్రజంటేషన్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధానాలను పలుమార్లు ప్రశంసించారు. ప్రధానంగా జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకంలో భాగంగా చేపడుతున్న రీ సర్వే వల్ల భవిష్యత్తులో బహుళ ప్రయోజనాలు చేకూరుతాయని టిర్కీ పేర్కొన్నారు. రీ సర్వే, ల్యాండ్ రికార్డుల నవీకరణ, మోడరన్ రికార్డు రూముల నిర్వహణ, భూ సంబంధిత రికార్డుల డిజిటలైజేషన్ ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచిందని ప్రకటించారు. సోన్మోని బోరా మాట్లాడుతూ డిజిటల్ ఇండియా ఇనిషియేటివ్ ప్రాజెక్టుల్లో భాగంగా భూ సంవాద్–6 ప్రాజెక్టు విజయవంతమయ్యేలా అందరూ చర్యలు తీసుకోవాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్న భూ సంబంధిత విధానాల గురించి ఏపీ సర్వే, ల్యాండ్ రికార్డ్స్ విభాగం కమిషనర్ సిద్ధార్థ జైన్, జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం గురించి శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లఠ్కర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి, భూ వనరుల మంత్రిత్వ శాఖ ఉన్నతా«దికారులు, ఎన్ఐసీ, ఐటీ టీం అధికారులు, విశాఖ జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున, జాయింట్ కలెక్టర్ కేఎస్ విశ్వనాథన్ తదితరులు పాల్గొన్నారు. -
81 శాతం భూరికార్డుల స్వచ్ఛీకరణ
సాక్షి, అమరావతి: భూముల రీసర్వే నేపథ్యంలో నిర్వహిస్తున్న భూ రికార్డుల స్వచ్చికరణ (ప్యూరిఫికేషన్ ఆఫ్ ల్యాండ్స్) రాష్ట్రవ్యాప్తంగా 81 శాతం పూర్తయింది. రాష్ట్రంలో వందేళ్ల తర్వాత వైఎస్సార్ జగనన్న భూరక్ష, శాశ్వత భూహక్కు పథకం పేరుతో నిర్వహిస్తున్న రీసర్వేలో రికార్డుల ప్రక్షాళన అత్యంత కీలకంగా మారింది. రీసర్వే ప్రారంభించాలంటే రికార్డులను అప్డేట్ చేయడం తప్పనిసరి. వెబ్‌ల్యాండ్ అడంగల్‌లను ఆర్ఎస్ఆర్తో పోల్చి చూడడం, అడంగల్‌లో పట్టాదారు వివరాలన్నీ సక్రమంగా ఉన్నాయో లేదో చూసి సరిచేయడం, పట్టాదారు, అనుభవదారుల వివరాల కరెక్షన్, అప్డేషన్, పట్టాదారు డేటాబేస్‌ను అప్డేట్ చేయడం వంటివన్నీ కచ్చితంగా పూర్తిచేయాల్సి ఉంది. రెవెన్యూ యంత్రాంగం ఇవన్నీ పూర్తిచేసిన తర్వాతే సర్వే బృందాలు రీసర్వే ప్రక్రియను ప్రారంభిస్తాయి. ఈ నేపథ్యంలోనే రికార్డుల స్వచ్చికరణపై ప్రత్యేకదృష్టి సారించి చేస్తున్నారు. 26 జిల్లాల్లోని 17,564 గ్రామాలను మూడు కేటగిరీలుగా విభజించి స్వచ్ఛీకరణ చేపట్టారు. ఇప్పటివరకు 14,235 గ్రామాల్లో (81 శాతం) పూర్తయింది. అల్లూరి జిల్లాలో 25 శాతం మాత్రమే అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో వందశాతం రికార్డుల స్వచ్చికరణను పూర్తిచేశారు. అనంతపురం జిల్లాలో 504 గ్రామాలకు 504, కర్నూలు జిల్లాలో 472కి 472, నంద్యాల జిల్లాలో 441కి 441 గ్రామాల్లో స్వచ్చికరణ పూర్తయింది. చిత్తూరు, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో 99 శాతం స్వచ్చికరణ పూర్తయింది. ఈ జిల్లాల్లో రెండేసి గ్రామాల్లో మాత్రమే ఇంకా పూర్తికావాల్సి ఉంది. సత్యసాయి, తూర్పుగోదావరి, ప శ్చిమగోదావరి, కృష్ణాజిల్లాల్లో 98 శాతం స్వచ్ఛీకరణ పూర్తయింది. అతి తక్కువగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 25 శాతం స్వచ్ఛీకరణనే పూర్తిచేయగలిగారు. ఆ తర్వాత విశాఖపట్నం జిల్లాలో 44 శాతం, పార్వతీపురం మన్యం జిల్లాలో 61 శాతం స్వచ్చికరణ పూర్తయింది. రెండునెలల్లో అన్ని జిల్లాల్లో వందశాతం రికార్డుల స్వచ్చికరణ పూర్తిచేసేందుకు రెవెన్యూశాఖ ప్రణాళిక రూపొందించి పనిచేస్తోంది. -
సమగ్ర భూచట్టం..రెవెన్యూ కోడ్ తేవాలంటున్న నిపుణులు!
రాష్ట్రంలో భూముల వివాదాలు, సమస్యలను పరిష్కరించడం కోసం సమగ్ర చట్టాన్ని అమల్లోకి తెచ్చే అంశం మరోమారు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో అమల్లో ఉన్న 124 భూ చట్టాలన్నింటినీ కలిపి.. రెవెన్యూ కోడ్ (ఒకే చట్టం)గా రూపొందించాలని భూచట్టాల నిపుణులు, రిటైర్డ్ రెవెన్యూ అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ పరిశీలనలో ఉన్న ఈ ప్రతిపాదనపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలని.. ఇది అమల్లోకి వస్తేనే రాష్ట్రంలోని భూముల పరిపాలన, హక్కుల కల్పన, వివాదాల పరిష్కారానికి మార్గం సుగమం అవుతుందని స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రంలో రెండేళ్ల క్రితం కొత్త రెవెన్యూ చట్టాన్ని అమల్లోకి తెచ్చినా.. దాన్ని కేవలం ఒక్క భూహక్కుల రికార్డుల చట్టం–1971ని సవరించి తెచ్చుకున్నామని గుర్తు చేస్తున్నారు. దీనితోపాటు ప్రస్తుతం అమల్లో ఉన్న అన్ని భూచట్టాలను కలిపి కొత్తగా సమగ్ర చట్టాన్ని తెస్తేనే ప్రయోజనం ఉంటుందని పేర్కొంటున్నారు. దేశవ్యాప్తంగా ‘కోడ్’ ప్రయత్నాలు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 2016లోనే రెవెన్యూ కోడ్‌ను అమల్లోకి తెచ్చారు. అది దేశంలోనే మార్గదర్శకంగా నిలిచిందని.. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర కూడా దాదాపు ఒకే తరహా చట్టంతో రెవెన్యూ పాలన చేస్తున్నాయని భూచట్టాల నిపుణులు, రిటైర్డ్ రెవెన్యూ అధికారులు చెప్తున్నారు. ఒడిశాలోనూ కొత్త సమగ్ర చట్టం కోసం ఇటీవలే మంత్రులు, సీనియర్ అధికారులతో హైపవర్ కమిటీని ఏర్పాటు చేశారని గుర్తు చేస్తున్నారు. దేశమంతా రెవెన్యూ కోడ్ వైపు ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో.. తెలంగాణలోనూ ఆ దిశలో ప్రయత్నాలు మళ్లీ ప్రారంభం కావాలని కోరుతున్నారు. ప్రస్తుతమున్న ఆర్ఓఆర్, కౌలుచట్టం, ఇనామ్‌ల రద్దు, అసైన్డ్ భూముల చట్టం వంటివన్నీ రద్దు చేసి ఒకే చట్టాన్ని తీసుకుని రావాలని ప్రభుత్వానికి పూర్తి స్థాయి నివేదిక కూడా అందించారు. రాష్ట్రం ఏర్పాటైన మొదట్లోనే.. వాస్తవానికి తెలంగాణలో సమగ్ర రెవెన్యూ చట్టాన్ని రూపొందించుకునే ప్రయత్నం రాష్ట్రం ఏర్పాటైన కొత్తలోనే మొదలైంది. నాటికి ఉన్న రెవెన్యూ చట్టాలన్నింటినీ సమీక్షించి కొత్త చట్టాన్ని రూపొందించే బాధ్యతను నల్సార్ విశ్వవిద్యాలయానికి అప్పగిస్తూ 2015లోనే రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఆ జీవో మేరకు రెవెన్యూ చట్టాలను పునఃసమీక్షించిన నల్సార్ వర్సిటీ 30 పేజీలతో కూడిన సమగ్ర భూచట్టాల ముసాయిదాను ప్రభుత్వానికి అందజేసింది. ప్రస్తుతం ఈ ముసాయిదా కూడా అందుబాటులో ఉన్న నేపథ్యంలో.. భూ వి వాదాలు తగ్గేలా, పాలన సులభతరం చేసేలా, గందరగోళానికి తావులేకుండా ఉండే సమగ్ర భూచట్టాన్నిరూపొందించాలనే డిమాండ్ వినిపిస్తోంది. హక్కుల చిక్కులు తీర్చేదిశగా.. భూచట్టాల నిపుణులు చేస్తున్న సూచనలివీ.. భూసమస్యలు పరిష్కారం కావాలంటే సర్వే తప్పనిసరి. ఒకప్పుడు సర్వేకు ఏళ్లు పట్టేది. కానీ ఇప్పుడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో చాలా తక్కువ సమయంలోనే సర్వే చేయవచ్చు. ఇందుకోసం సర్వే, హద్దుల చట్టం–1923 స్థానంలో కొత్త చట్టం తేవాలి. ఈ సర్వే పూర్తయ్యేలోపు భూలావాదేవీ జరిగిన ప్రతిసారీ సంబంధిత భూమిలో సర్వే జరగాలి. సర్వేయర్ల కొరతను నివారించేందుకు లైసెన్స్డ్ సర్వేయర్ల వ్యవస్థ ఏర్పాటు చేసి.. వారికి తగిన శిక్షణ ఇవ్వాలి. గ్రామీణాభివృద్ధి శాఖలో పనిచేస్తున్న కమ్యూనిటీ సర్వేయర్ల సేవలను వినియోగించుకోవాలి. – భూమి హక్కులకు ప్రభుత్వమే పూర్తి భరోసా ఇచ్చే టైటిల్ గ్యారెంటీ చట్టాన్ని తేవాలి. కేంద్ర ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా ఈ కొత్త చట్టం చేయాలి. – భూసంబంధిత అంశాల విషయంలో ఒకే చట్టం ఉండి.. ప్రజలకు అర్థమయ్యే విధంగా సరళంగా ఉన్నప్పుడే ప్రయోజనం ఉంటుంది. అమలు చేసే వారికీ సులభంగా ఉంటుంది. అన్ని భూచట్టాలను కలిపి రెవెన్యూ కోడ్‌గా రూపొందించాలి. – ధరణి పోర్టల్‌లో సమస్యలు పరిష్కారం కావాలంటే ఆ రికార్డులన్నింటినీ కాగితాల్లోకి ఎక్కించాలి. ప్రజల భాగస్వామ్యంతో సర్వే నంబర్ల వారీగా సమస్యలు గుర్తించి.. గ్రామంలోనే రెవెన్యూ కోర్టు పెట్టి వాటిని పరిష్కరించాలి. – భూవివాదాల పరిష్కార చట్టాన్ని తెచ్చి జిల్లాకో శాశ్వత ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలి. రిటైర్డ్ జడ్జి లేదా రెవెన్యూ నిపుణుల నేతృత్వంలో అవి పనిచేయాలి. – కౌలు రైతుల కష్టాలు తీరాలంటే కచి్చతంగా చట్టాల్లో మార్పు రావాలి. పోడు సాగు చేస్తున్న గిరిజనులకు అటవీ హక్కుల చట్టం ప్రకారం హక్కు పత్రాలు ఇవ్వాలి. – పేదలకు భూసమస్యలు, వివాదాలు వచ్చినప్పుడు వాటిని కోర్టుల్లో పరిష్కరించుకోవడంలో సాయం అందించేందుకు పారాలీగల్, కమ్యూనిటీ సర్వేయర్ల వ్యవస్థను ఏర్పాటు చేయాలి. – భూమిలేని నిరుపేద కుటుంబాలకు భూములు ఇచ్చే మార్గాలు వెతకాలి. భూవిధానం, వినియోగం ప్రజలకు మేలు కలిగేలా ఉండాలి. ఇందుకోసం భూపరిపాలనను మెరుగుపర్చాలి. భూఅకాడమీ ఏర్పాటు చేసి భూపరిపాలనలో సిబ్బంది కొరత లేకుండా నియామకాలు జరపాలి. – ఈ అన్ని చర్యలు తీసుకునేందుకు వీలుగా భూకమిషన్ను ఏర్పాటు చేయాలి. రైతులు, సామాన్య ప్రజల డిమాండ్లు ఇవీ.. – భూములను రీసర్వే చేయాలి. భూరికార్డులను సవరించి అందరికీ అందుబాటులో ఉంచాలి. – పేదలకు భూములను పంపిణీ చేయాలి. కౌలు దారులకు రుణఅర్హత కార్డులు ఇవ్వాలి. – సాదాబైనామా భూములను క్రమబదీ్ధకరించాలి. పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి. – రెవెన్యూ, అటవీ శాఖల మధ్య ఉన్న భూవివాదాలను పరిష్కరించి సాగులో ఉన్న వారికి పట్టాలివ్వాలి. ప్రతి గ్రామంలో ఒక రెవెన్యూ అధికారి ఉండాలి. – అన్యాక్రాంతమైన గిరిజన, అసైన్డ్ భూములను తిరిగి ఇప్పించాలి. మహిళలకు భూహక్కులు కలి్పంచాలి. పారాలీగల్ వ్యవస్థను బలోపేతం చేయాలి. ధరణితోపాటు ఇతర సమస్యలూ ఉన్నాయి ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితి చూస్తుంటే కేవలం ధరణి పోర్టల్‌ను సరిచేస్తే భూవివాదాలన్నీ సమసిపోతాయనే అభిప్రాయం కనిపిస్తోంది. కానీ ధరణి మాత్రమే సర్వరోగ నివారిణి కాదు. దాని చుట్టూనే చర్చ జరగడం సమంజసం కాదు. తెలంగాణ ఏర్పాటవుతున్న సమయంలోనే ‘ల్యాండ్ క్యారవాన్’ పేరుతో రాష్ట్రంలో దాదాపు మూడువేల కిలోమీటర్లు ప్రయాణించి పదివేల మందికిపైగా రైతులను, భూయజమానులను కలిసి నివేదిక రూపొందించాం. ప్రస్తుతం అమల్లో ఉన్న రెవెన్యూ చట్టాలన్నింటినీ కలిపి ఒకే చట్టం (రెవెన్యూ కోడ్)గా రూపొందించడం, భూములను రీసర్వే చేయడం, జిల్లాకో శాశ్వత ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం, టైటిల్ గ్యారెంటీ చట్టాన్ని తీసుకురావడం ఈ నివేదికలో ప్రధానమైనవి. వీటిపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. – భూమి సునీల్, భూ చట్టాల నిపుణుడు -
రీ సర్వేతో భూ సమస్యలకు చెక్
భూ రికార్డులు సరిగా లేకపోతే ఎన్ని ఇబ్బందులు వస్తాయో చూస్తున్నాం. 80–90 శాతం సివిల్ కేసులన్నీ కేవలం భూ వివాదాలవే. మనం కష్టపడి సంపాదించిన ఆస్తిని మన పిల్లలకు ఇవ్వాలనుకుంటాం. తీరా మన పిల్లలకు ఇచ్చే సమయానికి గద్దల్లా వేరెవరో తస్కరిస్తే.. ఆ బాధ ఎలా ఉంటుందో ఆలోచించడానికి కూడా కష్టంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితులను పూర్తిగా మార్చేందుకే సమగ్ర భూ సర్వే దిశగా వేగంగా అడుగులు వేశాం. తద్వారా ఎలాంటి సివిల్ వివాదాలకు, లంచాలకు, కబ్జాలకు తావు లేకుండా చేస్తాం. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: రైతుల భూ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా అలుపెరగకుండా, ఖర్చుకు వెనకాడకుండా, అత్యంత సాంకేతికంగా, శాస్త్రీయ పద్ధతిలో భూముల రీసర్వే చేపట్టామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. తద్వారా ఎన్నో సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. భూముల రీ సర్వేను 2023 డిసెంబర్ కల్లా పూర్తి చేస్తామని, సర్వే పూర్తయితే తమ భూముల విషయంలో రైతులు ధైర్యంగా ఉండవచ్చని, అక్రమాలకు అవకాశమే ఉండదని స్పష్టం చేశారు. సమస్యల శాశ్వత పరిష్కారం కోసమే వైఎస్సార్సీపీ ప్రభుత్వం పని చేస్తుందని, గత మూడున్నరేళ్ల కాలంలో విప్లవాత్మక మార్పులు ఎన్నో తీసుకొచ్చామని చెప్పారు. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు – భూ రక్ష పథకం కింద ఆధునిక డిజిటల్ రెవెన్యూ రికార్డులు సిద్ధమైన గ్రామాల్లో రైతులకు హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం ఆయన శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో చేపట్టారు. అక్కడే రెండో విడత కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రెండేళ్ల క్రితం భూముల సమగ్ర రీ సర్వే, భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం మొదలైందన్నారు. రాష్ట్రంలో 17,584 రెవెన్యూ గ్రామాలుంటే.. అందులో తొలి దశలో 2 వేల రెవెన్యూ గ్రామాల్లో సర్వే చేయడమే కాకుండా 7,92,238 మంది రైతుల భూ రికార్డులను పూర్తిగా ప్రక్షాళన చేసి, భూ హక్కు పత్రాలను అందజేసే భారీ కార్యక్రమానికి ఇక్కడ శ్రీకారం చుడుతున్నామని చెప్పారు. మరో 15 రోజుల్లో మొదటి దశలోని 2 వేల గ్రామాల రైతులందరికీ భూ హక్కు పత్రాలను అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. నరసన్నపేట బహిరంగ సభకు హాజరైన జనసందోహంలోని ఓ భాగం దశల వారీగా భూ హక్కు పత్రాలు ► 2023 ఫిబ్రవరి నాటికి రెండో దశ పూర్తి చేస్తాం. అంటే మరో నాలుగు నెలల్లో ఇంకో నాలుగు వేల గ్రామాలకు సంబంధించిన రైతులందరికీ వాళ్ల భూ హక్కు పత్రాలు వాళ్ల చేతుల్లో పెడతాం. ఆ తర్వాత మరో నాలుగు నెలల్లో మూడో దశలో ఆరు వేల గ్రామాల్లో, పట్టణాల్లో సర్వే పూర్తి చేసి, భూ యజమానులకు 2023 మే నాటికి భూ హక్కు పత్రాలు అందజేస్తాం. ► 2023 ఆగస్టు నాటికి మరో 9 వేల గ్రామాలు, పట్టణాలకు సంబంధించి సర్వే పూర్తి చేస్తాం. ఐదో దశలో మిగతా గ్రామాలు, పట్టణాలతో కలిపి మొత్తంగా 17,584 రెవెన్యూ గ్రామాల్లో, పట్టణాల్లో భూములన్నింటినీ సమగ్ర సర్వే చేసి, రికార్డులను ప్రక్షాళన చేసి.. 2023 డిసెంబర్ నాటికి భూ హక్కు పత్రాలను అందజేస్తాం. ప్రతి కమతానికి యూనిక్ నంబర్ ► ఒకసారి రాష్ట్ర వ్యాప్తంగా భూములన్నింటినీ పూర్తిగా కొలతలు వేసి అది ఎక్కడుందో.. లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ అంటే అక్షాంశాలు, రేఖాంశాలు ఆధారంగా మార్కింగ్ చేయడమే కాకుండా ప్రతి ఒక కమతానికి ఒక నిర్దిష్టమైన యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్‌ను ఈ సర్వే ద్వారా ఇస్తారు. ప్రతి కమతానికి డిజిటల్‌గా, ఫిజికల్‌గా దాన్ని నిర్ణయించి, క్యూ ఆర్ కోడ్‌తో ల్యాండ్ మ్యాపింగ్ చేస్తాం. ► ఆ భూమికి సరిహద్దు రాళ్లు కూడా పెడుతున్నాం. ఆ తర్వాత రైతుకు ప్రభుత్వ పరంగా సర్వ హక్కులతో కూడిన భూ హక్కు పత్రాలను ప్రక్షాళన చేసి వారి చేతికి ఇవ్వబోతున్నాం. దీంతో తమ భూములను ఎవరైనా ఆక్రమించుకుంటారనే భయం పూర్తిగా తొలగిపోతుంది. డూప్లికేట్ రిజిస్ట్రేషన్లు ఆగిపోతాయి. లంచాలకు అవకాశం లేకుండా పూర్తిగా ప్రక్షాళన జరుగుతుంది. ఇదంతా మహా యజ్ఞంలా సాగుతోంది. ► భూ కమతం ఒక సర్వే నంబర్ కింద ఉండి, కాలక్రమంలో విభజన జరిగినా.. మారినా కూడా సర్వే రికార్డులు అప్డేట్ కాకపోవడం వల్ల వస్తున్న వివాదాలన్నింటికి పూర్తిగా చెక్ పెట్టినట్లు అవుతుంది. జానెడు భూమిలో కూడా తప్పు జరగకుండా.. ► జానెడు భూమిలో కూడా తప్పు జరగకుండా సర్వే చేయిస్తున్నాం. 10,185 మంది గ్రామ సర్వేయర్లు (గ్రామ, వార్డు సచివాలయాల్లో కలిపి 13,849 మంది), 3,664 వార్డు ప్లానింగ్ సెక్రటరీలు, రూ.1000 కోట్ల వ్యయం, 4,500 సర్వే బృందాలు, ఎయిర్ క్రాఫ్ట్‌లు, హెలికాప్టర్లు, 80 డ్రోన్లు, 2 వేల గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్స్ అంటే జీఎన్ఎస్ఎస్ రోవర్లను వినియోగిస్తున్నాం. వీటితో పాటు ప్రత్యేకంగా 75 కంటిన్యూస్లీ ఆపరేటింగ్ రిఫరెన్స్ స్టేషన్ బేస్‌లు అంటే కోర్స్ బేస్‌లు ఏర్పాటు చేశాం. ► రాష్ట్ర వ్యాప్తంగా 17 వేలకు పైగా రెవెన్యూ గ్రామాల్లో 1.07 కోట్ల మంది రైతులు, 2.47 కోట్ల సర్వే నంబర్లకు సంబంధించి 2.26 కోట్ల ఎకరాల వ్యవసాయ భూముల్లో సర్వే జరుగుతుంది. మరో 13,371 గ్రామ కమతాల్లో 85 లక్షల ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు, 123 పట్టణ ప్రాంతాల్లో 40 లక్షల ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు సంబంధించి కూడా సర్వే జరుగుతుంది. ► సర్వే చేయడమే కాకుండా ఆ భూములకు సంబంధించిన సబ్ డివిజన్లు, మ్యుటేషన్లు, ఇతర సమస్యల పరిష్కారం, యాజమాన్య పత్రాల జారీ వంటి కార్యక్రమాలన్నీ గతంలో ఎన్నడూ, ఎక్కడా జరగని విధంగా ప్రస్తుతం మన రాష్ట్రంలో జరుగుతున్నాయి. క్రయవిక్రయాలు, రిజిస్ట్రేషన్లు అన్నీ కూడా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ సేవలు కూడా గ్రామ సచివాలయాల్లోనే జరిగేలా మార్పులు తీసుకొస్తున్నాం. ► ఇక మీదట సరిహద్దులు మార్కింగ్ చేసి, ఫీల్డ్ లైన్ దరఖాస్తులన్నీ 15 రోజుల టైమ్ ఇచ్చి కచ్చితంగా పూర్తి చేయాలి. పట్టా సబ్‌డివిజన్, మ్యుటేషన్ దరఖాస్తులన్నీ 30 రోజుల్లో పరిష్కారమయ్యేలా ఎల్‌ఓపీలు తీసుకొచ్చాం. దీనివల్ల ఎవరూ లంచాలడిగే పరిస్థితి ఉండదు. మ్యుటేషన్ సేవలను ఉచితంగా అందిస్తాం. ఇప్పటిదాకా సర్వే జరిగిందిలా.. ► 100 ఏళ్ల తర్వాత చేపట్టిన ఈ గొప్ప కార్యక్రమంలో 17వేలకు పై చిలుకు రెవెన్యూ గ్రామాలకు గాను ఇప్పటివరకు 6,819 గ్రామాల్లో 47,276 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఇప్పటికే డ్రోన్ ఫ్లయింగ్ పూర్తయ్యింది. ఈ రోజు (బుధవారం) వరకు 2 వేల గ్రామాల్లో సమగ్ర రీసర్వేతో పాటు భూ పట్టాల ప్రక్షాళన, మిగిలిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ మేరకు రైతులకు 7,92,238 భూ హక్కు పత్రాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. మరో 15 రోజుల పాటు ఈ 2 వేల గ్రామాల్లో వీటి పంపిణీ జరుగుతుంది. ► రీ సర్వే వల్ల ఈ 9 నెలల్లోనే 4 వేల గ్రామాల్లో 4.3 లక్షల సబ్ డివిజన్లు, 2 లక్షల మ్యుటేషన్లకు సంబంధించిన సమస్యలు పూర్తిగా పరిష్కారమయ్యాయి. గతంలో సంవత్సరానికి 35 వేల సబ్ డివిజన్ల దరఖాస్తులు మాత్రమే వచ్చేవి. కేవలం 21 వేలు మాత్రమే సబ్ డివిజన్ జరిగేవి. ఈ లెక్కన ఏటా 21 వేలు మాత్రమే సబ్ డివిజన్లు జరిగే పరిస్థితి నుంచి.. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా కేవలం 9 నెలల్లోనే 4.3 లక్షల సబ్ డివిజన్లు, 2 లక్షల మ్యుటేషన్లు పూర్తి చేసుకున్న మెరుగైన స్థితికి వచ్చాం. ఈ ప్రక్రియలో రూ.30 కోట్ల విలువైన సేవలను వారి చేతిలో ఉచితంగా పెట్టినట్టు అవుతోంది. ఈ మార్పులను ప్రజలు ఒక్కసారి గమనించాలి. మూడేళ్లలో ఎన్నో విప్లవాత్మక మార్పులు ► అధికారంలోకి వచ్చిన వెంటనే దాదాపు 15,004 గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేశాం. 1.3 లక్షల శాశ్వత ఉద్యోగాలు ఇచ్చాం. ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్ చొప్పున 2 లక్షల 60 వేల మందిని నియమించాం. వలంటీర్లు ప్రతి ఒక్కరినీ చేయి పట్టుకుని నడిపిస్తున్నారు. ► 13 నుంచి 26 జిల్లాలు చేశాం. కుప్పంతో సహా రాష్ట్ర వ్యాప్తంగా 25 కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేశాం. రాష్ట్రంలో ఒకే ప్రాంతంలో రాజధాని ఉండటం వల్ల జరిగే మంచికన్నా.. మూడు ప్రాంతాలు కూడా బాగుపడే విధంగా మూడు రాజధానుల్ని ఏర్పాటు చేస్తున్నాం. ► రాష్ట్రంలో కేవలం 11 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి. వీటికి అదనంగా మరో 17 మెడికల్ కాలేజీలను నిర్మిస్తున్నాం. ► గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు, పాఠశాలల్లో, హాస్టళ్లలో నాడు–నేడు, ఇంగ్లిష్ మీడియం, డిజిటల్ లైబ్రరీలు, మహిళలకు భద్రత కల్పించేలా ‘దిశ’ యాప్, దిశ పోలీస్స్టేషన్లు ఇలా ఎన్నో అమలు చేస్తున్నాం. ► ఇచ్ఛాపురం, పలాస ప్రాంతాల్లో కిడ్నీ సమస్యలతో బాధపడే ప్రజలు మన కళ్లెదుటే కన్పించేవారు. పాలకులు, వారితో పాటు దత్తపుత్రుడి వేషంలో సినిమా యాక్టరూ వచ్చేవారు. ఐదేళ్లు పరిపాలన చేశారు. అయినా ఇచ్ఛాపురం, పలాసలో ఉన్న కిడ్నీ పేషెంట్లు వారికి గుర్తుకు రాలేదు. ఆ తర్వాత మీ బిడ్డ ముఖ్యమంత్రి కాగానే ఆ ప్రాంతాల్లో రూ.765 కోట్లతో సర్ఫేస్ వాటర్ తీసుకొచ్చి, కిడ్నీ సమస్యలకు పూర్తి పరిష్కారం చూపించేలా అడుగులు వేశాడు. దాదాపు 70 శాతం పనులు పూర్తయ్యాయి. రూ.50 కోట్లతో రీసెర్చ్ ఆస్పత్రిని కడుతున్నాం. దాదాపు 90 శాతం పనులు పూర్తయ్యాయి. కిడ్నీ పేషెంట్లకు రూ.10 వేల వరకు పింఛన్ ఇస్తున్నాం. ► ఇంతకుముందు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు కేవలం 295 మాత్రమే ఉండేవి. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 11 వేలకు పైగా ఉన్న గ్రామ సచివాలయాలన్నింటినీ కూడా భూములు, ఆస్తుల అమ్మకాలు, కొనుగోళ్ల రిజిస్ట్రేషన్ కార్యాలయాలుగా మార్చే ప్రక్రియకు మన ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. రెవెన్యూ శాఖ పరంగా గ్రేడ్–3 విలేజ్ సర్వేయర్లను గ్రేడ్–2గా రీ డిజిగ్నేట్ చేయనున్నాం. ► ఈ కార్యక్రమంలో స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రులు ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజు, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్, జిల్లాలోని మిగతా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్పర్సన్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ కుటుంబంతోనే సిక్కోలు ప్రగతి శ్రీకాకుళం జిల్లాను అభివృద్ధి చేసింది వైఎస్ కుటుంబమే. అప్పట్లో వైఎస్ రాజశేఖరరెడ్డి, ఇప్పుడు సీఎం జగన్మోహన్రెడ్డి.. వందేళ్ల నుంచి ఉన్న భూ సంబంధిత సమస్యలకు రీ సర్వేతో శాశ్వత పరిష్కారం లభిస్తుంది. గత ప్రభుత్వం జిల్లాకు ఏమీ చేయలేదు. రాష్ట్ర విభజన తర్వాత 23 కేంద్ర సంస్థలు వస్తే ఒక్కటి కూడా శ్రీకాకుళంలో పెట్టలేదు. సీఎం జగన్ వంశధార రిజర్వాయర్‌కు రూ.700 కోట్ల నిధులిచ్చి, ఉద్దానం ప్రాంతంలో తాగునీరు అందించే ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. కిడ్నీ రోగులను అన్ని విధాలా ఆదుకుంటున్నారు. వంశధార ప్రాజెక్టుకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి సీఎం వైఎస్ జగన్.. ఒడిశా వెళ్లి అక్కడి సీఎంను కలిశారు. గత 15 ఏళ్లలో ఈ పని ఎవరూ చేయలేదు. తెలంగాణలో వ్యాపారాలు చేస్తూ హైదరాబాద్‌లో ఉండే చంద్రబాబుకు విశాఖ పాలన రాజధాని కావడం ఏమాత్రం ఇష్టం లేదు. ఆయన ఇక్కడకు వచ్చి అదే మాట చెబితే ప్రజలే తగిన సమాధానమిస్తారు. – ధర్మాన ప్రసాదరావు, రెవెన్యూ శాఖ మంత్రి ఆనందంగా ఉంది మా గ్రామంలో సమగ్ర భూ సర్వే పూర్తయ్యింది. ఎలాంటి ఇబ్బంది లేకుండా భూ హక్కు పత్రాలు వచ్చాయి. చాలా ఆనందంగా ఉంది. గతంలో ఎప్పుడూ మేం ఇలాంటివి చూడలేదు. ఈ సర్వేతో భూ సమస్యలన్నీ పరిష్కారమయ్యాయి. – రౌతు పోలయ్య, సంతలక్ష్మీపురం, పోలాకి మండలం నా చేతికి హక్కు పత్రం నాకు కరగాం పంచాయతీలో 40 సెంట్ల భూమి ఉంది. నోషనల్ ఖాతాలో ఉండిపోవడంతో ఇన్నాళ్లూ పాస్ బుక్ రాలేదు. ఎలాంటి హక్కులు లేకపోవడంతో చాలా ఇబ్బంది పడ్డాను. ఇప్పుడు గ్రామంలో రీ సర్వే పూర్తయింది. నోషనల్ ఖాతాల్లో ఉన్న భూమిని నా పేరున మార్చి భూ హక్కు పత్రం ఇచ్చారు. ఇది ఈ రోజు సీఎం చేతుల మీదుగా తీసుకోవడం ఆనందంగా ఉంది. – పాగోటి దమయంతి, కంబకాయ, నరసన్నపేట మండలం వేగంగా రిజిస్ట్రేషన్ నా ఇంటి స్థలాన్ని కరగాం సచివాలయంలో రిజిస్ట్రేషన్ చేయించాను. ఇతరుల వద్ద కొనుగోలు చేసిన ఈ స్థలం రిజిస్ట్రేషన్ నరసన్నపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో చేయించేందుకు ప్రయత్నించాను. అయితే గ్రామ సచివాలయంలో కూడా చేస్తారని తెలియడంతో అక్కడికే వెళ్లి చేయించుకున్నాను. వివరాలన్నీ తెలుసుకుని శ్రమ లేకుండా, అదనపు ఖర్చు లేకుండా రిజిస్ట్రేషన్ జరిగింది. ఈ పత్రాలు సీఎం చేతుల మీదుగా ఈ రోజు తీసుకున్నాను. ఆనందంగా ఉంది. – వెలమల శ్రీదేవి, నారాయణవలస, నరసన్నపేట మండలం -
ధరణిలో మరో లొల్లి!.. దశాదిశ లేని ప్రభుత్వ కసరత్తు
సాక్షి, హైదరాబాద్: ధరణిలో పొరపాటున నిషేధిత జాబితా చేర్చిన పట్టా భూములను తొలగించేందుకు భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) చేపట్టిన కసరత్తుపై విమర్శలు వస్తున్నాయి. సరైన రికార్డులు, క్షుణ్ణమైన పరిశీలన లేకుండానే నిషేధిత జాబితా నుంచి తొలగించాలని సీసీఎల్ఏ ఒత్తిళ్లు వస్తున్నాయని.. అందులో అసైన్డ్, కోర్టు కేసుల్లో ఉన్న భూములూ ఉంటున్నాయని తహసీల్దార్లు చెప్తున్నారు. అది కూడా మౌఖిక ఆదేశాలే ఇస్తున్నారని.. దీనివల్ల భవిష్యత్తులో తాము సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఎక్కువ సర్వే బైనంబర్లను నిషేధిత జాబితా నుంచి తొలగించామని చెప్పుకోవడానికి సీసీఎల్ఏ తాపత్రయ పడుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తూతూమంత్రంగా, తప్పుల తడకగా పరిష్కరించడం వల్ల సమస్య మరింత జటిలం అవుతుందనే విమర్శలు వస్తున్నాయి. రికార్డుల ప్రకారం రాష్ట్రంలో నిషేధిత భూముల సర్వే బైనంబర్లు 7లక్షల వరకు ఉన్నట్టు రెవెన్యూ వర్గాల అంచనా. అయితే ధరణి పోర్టల్‌లో నమోదు సమయంలో తప్పుల వల్ల వాటి సంఖ్య 20లక్షల వరకు చేరింది. రెండేళ్లు గడిచినా ఈ రికార్డులను సరిచేయడంలో పురోగతి లేదు. తమ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని రైతులు తహసీల్దార్, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నా ఫలితం లేదు. ఈ క్రమంలో తామే సుమోటోగా ఈ సమస్యను పరిష్కరిస్తామని సీసీఎల్ఏ ముందుకొచ్చింది. నిషేధిత జాబితా నుంచి తొలగించాలో, లేదో నిర్ణయించాలంటూ 5,14,833 సర్వే బైనంబర్లను రాష్ట్రంలోని అన్ని తహసీల్దార్ కార్యాలయాలకు పంపింది. ఇందులో 3,12,976 సర్వే బైనంబర్లను పరిశీలించిన స్థానిక రెవెన్యూ యంత్రాంగం కేవలం 85,132 (27.2 శాతం) నంబర్లలోని భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించి, 2,27,843 (72.8 శాతం) నంబర్లలోని భూమిని నిషేధిత జాబితాలో కొనసాగించాలని నిర్ణయించింది. కలెక్టర్లకు ‘హైదరాబాద్’ పిలుపు నిషేధిత జాబితాల నుంచి భూములను తొలగించే ప్రక్రియపై తుది నిర్ణయం పేరుతో కలెక్టర్లను హైదరాబాద్ రావాలని సీసీఎల్ఏ నుంచి ఆదేశాలు వెళ్లాయి. వారం రోజులుగా కలెక్టర్లతోపాటు సదరు జిల్లాలోని ఆర్డీవోలు, తహసీల్దార్లు, తహసీల్ కార్యాలయ సిబ్బంది అందుబాటులో ఉన్న రికార్డులతో సీసీఎల్ఏ కార్యాలయానికి వస్తున్నారు. ఆయా జిల్లాలకు కేటాయించిన సర్వే బైనంబర్లలో ఎన్ని పరిష్కారమయ్యాయి? పరిష్కారమైన వాటిలో ఎన్ని నంబర్లను నిషేధిత జాబితా నుంచి తొలగించారు? ఎన్ని నంబర్లను కొనసాగించారనే వివరాలను, వాటికి కారణాలను సీసీఎల్ఏ వర్గాలకు వివరిస్తున్నారు. ఎక్కువ సర్వే బైనంబర్లను నిషేధిత జాబితా నుంచి తొలగించామని చెప్పుకోవడానికి సీసీఎల్ఏ తాపత్రయ పడుతున్నట్టు సమాచారం. క్షేత్రస్థాయి యంత్రాంగం చెప్పిన కారణాలను వినకుండా.. అసైన్డ్ భూమి అయినప్పటికీ 20 ఏళ్లుగా పట్టాభూమి అని రాసి ఉందిగనుక ఆ భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించాలని ఒత్తిడి చేస్తున్నట్టు అధికారవర్గాలు చెప్తున్నాయి. కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న వాటిని కూడా నిషేధిత జాబితా నుంచి తొలగించాలని జిల్లాల యంత్రాంగంపై ఒత్తిడి తెస్తున్నట్టు పేర్కొంటున్నాయి. ఇప్పటివరకు భూపాలపల్లి, ములుగు, పెద్దపల్లి, నారాయణపేట జిల్లాలకు చెందిన కసరత్తు పూర్తికాగా.. నల్లగొండ, కరీంనగర్, మేడ్చల్, రంగారెడ్డి, జగిత్యాల, ఖమ్మం జిల్లాలకు చెందిన అధికారులు ప్రస్తుతం సీసీఎల్ఏ కార్యాలయంలో ఈ విధుల్లో నిమగ్నమయ్యారు. జిల్లాల నుంచి వస్తున్న యంత్రాంగానికి ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు హైదరాబాద్‌లోనే ఉండాలని ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. మొత్తం మీద ఇంకా నిషేధిత జాబితాలోనే కొనసాగించాలని క్షేత్రస్థాయిలో నిర్ణయించిన వాటిలో నుంచి కనీసం 30 శాతం సర్వే బైనంబర్లను తొలగించడమే లక్ష్యంగా సీసీఎల్ఏ కార్యాలయంలో కసరత్తు జరుగుతున్నట్టు తెలిసింది. అన్నీ మౌఖిక ఆదేశాలే.. వాస్తవానికి భూరికార్డులను పరిశీలించి నిర్ణయం తీసుకునే అధికారం మండల తహసీల్దార్లకు మాత్రమే ఉంటుంది. కానీ ధరణి పోర్టల్ తర్వాత జిల్లా కలెక్టర్లు భూసమస్యలను పరిష్కరిస్తున్నారు. కానీ ఆయా పరిష్కార పత్రాలపై ఉండేది తహసీల్దార్ల డిజిటల్ సంతకాలే. దీనివల్ల కలెక్టర్లు తీసుకునే నిర్ణయాలపై ఎవరైనా కోర్టులకు వెళితే తహసీల్దార్లే బాధ్యత వహించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పుడు సీసీఎల్ఏ కార్యాలయం వేదికగా జరుగుతున్న కసరత్తు మరీ ఘోరంగా ఉందని తహసీల్దార్లు వాపోతున్నారు. తమకు కేటాయించిన సర్వే బైనంబర్లలోని భూముల రికార్డులను పరిశీలించి వాటిని నిషేధిత జాబితా నుంచి తొలగించాలా, వద్దా అన్నదానిపై నిర్ణయం తీసుకుంటున్నామని.. అయితే దీనికి సంబంధించి తమకు ఎలాంటి లిఖితపూర్వక మార్గదర్శకాలు ఇవ్వలేదని చెప్తున్నారు. ఇప్పుడు సీసీఎల్ఏ కార్యాలయానికి పిలిపించి కూడా ఎలాంటి లిఖితపూర్వక ఆదేశాలు ఇవ్వకుండా.. కేవలం మౌఖికంగా ఫలానా సర్వేబై¯ð నంబర్లోని భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించాలంటూ ఆదేశాలు ఇస్తున్నారని వివరిస్తున్నారు. ఇది భవిష్యత్తులో తమ ఉద్యోగాలకు ముప్పు తెచ్చి పెడుతుందేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తొలగించారా, లేదా?.. తెలిసేదెలా? ఎవరైనా రైతుల భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించారా లేదా అన్నది సదరు రైతులకు తెలియడం లేదు. చాలా మంది రైతులకు తెలియకుండానే వారి భూములపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటోంది. అంతేగాకుండా సుమోటోగా తీసుకున్న 5 లక్షలకుపైగా సర్వే నంబర్లు మినహా ఇతర సర్వే నంబర్లలోని భూములపై ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. నిషేధిత జాబితా నుంచి తమ భూమిని తొలగించాలని రైతు దరఖాస్తు చేసుకుంటే.. ధరణి పోర్టల్‌లో ప్రాసెస్ చేసే విధానాన్ని కూడా ఇప్పుడు తొలగించారు. దీంతో తమ భూమి నిషేధిత జాబితాలో ఉందా, తొలగించారా? తమ దరఖాస్తును ఏం చేశారు? అసలు పరిష్కరిస్తారా లేదా? అన్న విషయాల్లో రైతులకు ఎలాంటి స్పష్టత లేకుండా పోవడం గమనార్హం. చదవండి: మీ వెనుక ఎవరున్నారు? -
భూ రికార్డుల స్వచ్ఛీకరణ వేగవంతం
సాక్షి, అమరావతి: భూముల రీ సర్వే నేపథ్యంలో భూ రికార్డుల స్వచ్ఛీకరణ (ప్యూరిఫికేషన్ ఆఫ్ ల్యాండ్స్) కార్యక్రమం వేగంగా జరుగుతోంది. వైఎస్సార్ జగనన్న భూరక్ష, శాశ్వత భూ హక్కు పథకం కింద వందేళ్ల తర్వాత నిర్వహిస్తున్న రీ సర్వేలో రికార్డుల స్వచ్ఛీకరణ అత్యంత కీలకం కావడంతో ప్రభుత్వం దానిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. రికార్డుల స్వచ్ఛీకరణ పూర్తయితేనే ఆయా గ్రామాల్లో రీ సర్వే ప్రక్రియ ప్రారంభమవుతుంది. అంటే రీ సర్వే ప్రారంభానికి ముందే గ్రామాల్లో భూ రికార్డులను అప్డేట్ చేయాల్సి ఉంటుంది. వెబ్‌ల్యాండ్ అడంగల్స్ను ఆర్ఎస్ఆర్తో పోల్చి చూడటం, అడంగల్‌లో పట్టాదారుని వివరాలన్నీ సక్రమంగా ఉన్నాయో లేదో చూసి సరిచేయడం వంటి పనులు పక్కాగా చేయాలి. ఈ పనిని కింది స్థాయిలో రెవెన్యూ యంత్రాంగం చేయాలి. రికార్డుల స్వచ్ఛీకరణ పూర్తయిన గ్రామాల్లోనే రీ సర్వేలో మొదట నిర్వహించే డ్రోన్ ఫ్లైయింగ్‌ను సర్వే బృందాలు చేపట్టడానికి అవకాశం ఉంటుంది. అందుకే ప్రభుత్వం రికార్డుల స్వచ్ఛీకరణపై ఫోకస్ పెట్టింది. మొత్తంగా 17,564 గ్రామాలను మూడు కేటగిరీలుగా విభజించి స్వచ్ఛీకరణ చేయిస్తున్నారు. అనంతపురంలో నూరు శాతం పూర్తి అనంతపురం జిల్లాలోని మొత్తం 504 గ్రామాల్లోనూ రికార్డుల స్వచ్ఛీకరణ పూర్తయింది. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 315 గ్రామాలకు గాను.. 314 గ్రామాల్లో స్వచ్ఛీకరణను పూర్తి చేశారు. చిత్తూరు జిల్లాలో 846 గ్రామాలకు గాను 835 గ్రామాల్లోను, సత్యసాయి జిల్లాలో 461 గ్రామాలకు గాను 455 గ్రామాల్లో స్వచ్ఛీకరణ పూర్తయింది. విశాఖ, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో స్వచ్ఛీకరణ నెమ్మదిగా జరుగుతుండటంతో వేగం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. రీ సర్వే షెడ్యూల్‌కు అనుగుణంగా భూ రికార్డుల స్వచ్ఛీకరణను పూర్తి చేసేందుకు గడువును నిర్దేశించారు. దాని ప్రకారం ఆరు రకాల సర్క్యులర్ ప్రకారం రికార్డులను అప్డేట్ చేసే పని వేగంగా జరుగుతోంది. తద్వారా రీ సర్వే కార్యక్రమాన్ని షెడ్యూల్ ప్రకారం సర్వే బృందాలు వడివడిగా నిర్వహిస్తున్నాయి. ప్రతి నెలా సమీక్ష స్వచ్ఛీకరణ ఎలా చేయాలనే దానిపై రెవెన్యూ శాఖ ఆరు సర్క్యులర్లు జారీ చేసింది. ఒక్కో సర్క్యులర్ ప్రకారం ఒక్కో దశను పూర్తి చేయాల్సి ఉంటుంది. వీటి ప్రకారం స్వచ్ఛీకరణ ఎంత మేరకు జరిగిందనే దానిపై ప్రతి నెలా కలెక్టర్లు, జేసీలతో భూ పరిపాలన ప్రధాన కమిషనర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. జిల్లాల వారీగా ఎన్ని గ్రామాల్లో ఆరు రకాల సర్క్యులర్ల ప్రకారం పని జరిగిందో పరిశీలిస్తూ తగిన సూచనలు చేస్తున్నారు. -
రైతు నిజాయితీ.. 15 గుంటలకు పట్టా పుస్తకం వచ్చినా కూడా తనకెందుకని..
పాలకుర్తి టౌన్: ఆస్తి కోసం రక్తం పంచుకుపుట్టిన అన్నదమ్ములు, అక్కాచెళ్లెళ్ల మధ్య జరుగుతున్న వివాదాలు చూస్తూనే ఉన్నాం. కన్నవారిపైనే అమానుషానికి పాల్పడుతున్న వారసుల గురించి విన్నాం. కానీ, తనది కాని భూమి తనకెందుకని ఓ యువరైతు నిజాయితీ చాటుకున్నాడు. తన పేరుపై పొరపాటున నమోదై పట్టా పుస్తకం వచ్చినా కూడా భూమిని తిరిగి ఇచ్చేశాడు. ఈ ఆసక్తికర ఘటన జనగామ జిల్లా పాలకుర్తిలో వెలుగుచూసింది. పాలకుర్తి మండల పరిధి తిరుమలగిరి గ్రామంలో పొన్నం రాజు అనే రైతు ఉన్నాడు. అదే గ్రామానికి చెందిన రైతు బక్క సోమయ్యకు చెందిన 15 గుంటల పట్టా భూమి రికార్డుల్లో తప్పిదం కారణంగా పొన్నం రాజు పేరున నమోదైంది. అయితే, ఆ భూమి తనది కాదని సోమయ్యకు చెందినదని రాజు గుర్తించాడు. మండల తహసీల్దార్ పాల్‌సింగ్ వద్దకు వెళ్లి విషయం చెప్పాడు. స్వచ్ఛందంగా తహసీల్దార్ సమక్షంలో శనివారం సోమయ్యకు పట్టా చేయించి నిజాయితీ చాటుకున్నాడు. ఉప సర్పంచ్ నాగరాజుతో పాటు గ్రామస్తులు, రెవెన్యూ అధికారులు రాజును అభినందించారు. (చదవండి: బద్రినాథ్‌యాత్రలో వరంగల్ వైద్యురాలు మృతి) -
క్యూఆర్ కోడ్‌లో భూమి
సాక్షి, అమరావతి: బ్రిటీష్ కాలం నాటి రెవెన్యూ రికార్డులను ప్రక్షాళన చేసి వివాదాలకు శాశ్వతంగా తెరదించే లక్ష్యంతో వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు– భూరక్ష పథకం ద్వారా భూముల రీ సర్వే కార్యక్రమాన్ని శరవేగంగా చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం పట్టాదారు పాస్ పుస్తకాల్లో క్యూఆర్ కోడ్ ముద్రించనుంది. దీన్ని స్కాన్ చేయడం ద్వారా భూ కమతం, విస్తీర్ణం, ఎలాంటి భూమి, మ్యాప్ తదితర వివరాలన్నీ తెలుసుకోవచ్చు. రీ సర్వేలో ఆక్షాంశాలు, రేఖాంశాలతో (జియో కో–ఆర్డినేట్స్) భూమి హద్దులను నిర్ధారిస్తున్నారు. భూమికి నలువైపులా వీటిని సూచించడం ద్వారా విస్తీర్ణాన్ని కచ్చితంగా తెలుసుకోవచ్చు. వీటి ఆధారంగా రైతుల పట్టాదార్ పాస్ పుస్తకంలో క్యూఆర్ కోడ్ ముద్రిస్తారు. ప్రస్తుతం ఒక సర్వే నంబర్‌కి ఒక ఎఫ్ఎంబీ ఉండగా, నలుగురైదుగురు భూ యజమానులుంటే ఉమ్మడిగా ఒక మ్యాప్ కేటాయిస్తున్నారు. రీ సర్వే తర్వాత ప్రతి భూమిని (సెంటు భూమి విడిగా ఉన్నా సరే) సర్వే చేసి ప్రత్యేకంగా రాళ్లు పాతుతారు. దానికి ల్యాండ్ పార్సిల్ మ్యాప్ ఇస్తారు. ఆ సర్వే నంబర్లో ఎంత మంది ఉంటే అందరి మ్యాప్‌లు విడివిడిగా పొందుపరుస్తారు. ప్రతి భూ యజమానికి తమ భూములపై ఎవరూ సవాల్ చేయడానికి వీలు లేని శాశ్వత హక్కులు లభిస్తాయి. 70 బేస్ స్టేషన్లతో కార్స్ నెట్వర్క్ జీపీఎస్ కార్స్ నెట్వర్క్ (కంటిన్యుస్లీ ఆపరేటింగ్ రిఫరెన్స్ స్టేషన్ నెట్వర్క్) ద్వారా భూములను కొలుస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 70 బేస్ స్టేషన్లు శాటిలైట్ రేడియో సిగ్నళ్లను స్వీకరించి కచ్చితమైన అక్షాంశ, రేఖాంశాలను సెంట్రల్ కంట్రోల్ స్టేషన్‌కు పంపుతాయి. కార్స్, డ్రోన్, రోవర్ సహాయంతో భూములను కచ్చితంగా కొలుస్తారు. తద్వారా ప్రతి స్థిరాస్తి కొల తలు, హద్దులు, విస్తీర్ణం, భూ కమత పటం ల్యాండ్ రిజిస్టర్లో డిజిటల్ రూపంలో నమోదవుతాయి. వీటితో మ్యాప్‌లో క్యూఆర్ కోడ్ రూపంలో పొందుపరుస్తారు. నకిలీలు, ట్యాంపరింగ్‌కు తెర ప్రతి భూమికి (ల్యాండ్ పార్సిల్) ఒక విశిష్ట సంఖ్య కేటాయించి భూమి వివరాలతోపాటు భూ యజమాని ఆధార్, మొబైల్ నంబర్, మెయిల్ ఐడీ సేకరించి భూ రికార్డులో భద్రపరుస్తారు. భూ యజమానికి తెలియకుండా రికార్డుల్లో ఎలాంటి మార్పులు చేయడానికి అవకాశం ఉండదు. డూప్లికేట్ రికార్డులు, ట్యాంపరింగ్‌కు అవకాశం ఉండదు. ఆయా భూముల క్రయ విక్రయాలు జరిగిన వెంటనే రికార్డుల్లో ఆటోమేటిక్‌గా మారిపోతాయి. తద్వారా భూ సమాచారాన్ని ఎవరైనా, ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా తెలుసుకోవచ్చు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం కంప్యూటర్ ఆధారిత భూ సమాచార వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది. దీనిద్వారా ఎవరైనా తమ భూమిని మ్యాప్‌తో సహా చూసుకోవడానికి వీలుంటుంది. సర్వేతో ఇవీ ప్రయోజనాలు.. ► ప్రతి ఆస్థికి యజమాని గుర్తింపు ► రికార్డుల్లో పదిలంగా ఆస్తి హక్కులు ► ఆ ఆస్తిని మరొకరు ఇతరులకు విక్రయించే అవకాశం ఉండదు ► పకడ్బందీగా హద్దులు, కొలతలు ► క్షేత్రస్థాయిలో భూమి ఏ ఆకారంలో ఉందో రికార్డుల్లో అలాగే ఉంటుంది ► ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా ఆస్తి వివరాలు తెలుసుకోవచ్చు ► హద్దు రాళ్లు తొలగించినా, గట్టు తెగ్గొట్టినా మీ ఆస్తి డిజిటల్ రికార్డుల్లో భద్రంగా ఉంటుంది. ► భూమికి సంబంధించిన సమగ్ర సమాచారం, సంపూర్ణ హక్కుతో ఉంటుంది. సంపూర్ణ హక్కులు, రక్షణే లక్ష్యం స్వతంత్ర భారత చరిత్రలో ఏ రాష్ట్రం చేయని విధంగా భూముల రీ సర్వే నిర్వహిస్తున్నాం. రీ సర్వేతో అస్తవ్యస్థంగా ఉన్న రికార్డుల ప్రక్షాళన జరుగుతుంది. వాస్తవంగా ఉన్న భూముల విస్తీర్ణం ప్రకారం డిజిటల్ రికార్డులు తయారవుతాయి. దళారీ వ్యవస్థకు ఆస్కారం ఉండదు. ప్రస్తుతం సర్వే నెంబర్ల వారీగా హద్దు రాళ్లు లేకపోవడంతో సరిహద్దు వివాదాలు తలెత్తుతున్నాయి. రీ సర్వేలో ప్రతి సర్వే నెంబరును ఉచితంగా సర్వే చేస్తున్నాం. వైఎస్సార్ జగనన్న హద్దురాళ్లు ఏర్పాటు చేస్తాం. ప్రతి భూమిపై సంబంధిత యజమానికి సంపూర్ణ హక్కు, రక్షణ కల్పించడమే రీ సర్వే ఉద్దేశం. – సిద్ధార్థ జైన్, కమిషనర్, సర్వే సెటిల్మెంట్, భూ రికార్డుల శాఖ -
భూ హక్కుకు.. శ్రీరామరక్ష!
సాక్షి, అమరావతి: భూముల హక్కుదారుల భద్రతే లక్ష్యంగా ప్రభుత్వం కీలక అడుగులేస్తోంది. భూమిపై కచ్చితమైన యాజమాన్య హక్కులను నిర్థారించేందుకు సరికొత్త వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తోంది. ధ్రువీకరించిన భూ యాజమాన్య హక్కుల(కన్ఫర్మ్డ్ టైటిల్ విధానం) వివరాలతో ప్రత్యేక రిజిస్టర్ల నిర్వహణకు పక్కా ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం భూ హక్కు యాజమాన్య చట్టంలో కేంద్ర ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా కీలక మార్పులు చేసింది. కొత్తగా రూపొందించిన భూ హక్కు యాజమాన్య చట్టానికి శాసనసభ ఆమోదం తెలిపింది. వివాదాల పరిష్కారానికి సరికొత్త మార్గం పలు వివాదాలతో ప్రస్తుతం భూముల యాజమాన్యం అత్యంత సంక్లిష్టంగా మారిన విషయం తెలిసిందే. వివాదాలు లేకుండా ఉన్న కచ్చితమైన భూ హక్కుదారుల వివరాలు తెలుసుకోవడం క్లిష్టంగా మారింది. కన్ఫర్మ్డ్ టైటిల్ విధానంలో ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని భూ పరిపాలన ప్రధాన కమిషనర్(సీసీఎల్ఏ) సాయిప్రసాద్ చెప్పారు. దేశంలో భూమిపై హక్కుల్ని నిర్థారించే అధికారం సివిల్ కోర్టులకు మాత్రమే ఉంది. ఒక వ్యక్తి అంతా సక్రమంగా ఉందని భావించి భూమి కొనుగోలు చేశాక, దానిపై తనకూ హక్కు ఉందని ఎవరైనా కోర్టుకు వెళితే అది వివాదంలో కూరుకుపోతోంది. అన్ని ఆధారాలు పరిశీలించి సివిల్ కోర్టు చేసిన నిర్థారణే ఇలాంటి కేసుల్లో అంతిమం. ఆ భూమిపై పలానా వ్యక్తికి మాత్రమే హక్కు ఉందని కచ్చితంగా చెప్పే వ్యవస్థ రెవెన్యూ శాఖలో లేదు. రెవెన్యూ రికార్డులు, ఆస్తుల్ని రిజిస్టర్ చేసే విధానం కూడా ఇలాంటి వివాదాలకు పరష్కారాలు సూచించేలా లేదు. వీటన్నింటికీ కన్ఫర్మ్డ్ టైటిల్ విధానం పరిష్కారం చూపనుంది. భూ యాజమాన్య హక్కుల రిజిస్టర్లు భూముల రీ సర్వే జరుగుతున్న క్రమంలో ప్రతి గ్రామంలో ధ్రువీకరించిన భూ యాజమాన్య హక్కుల రిజిస్టర్లు తయారవుతాయి. ఆ రిజిస్టర్లలో ఆ గ్రామానికి చెందిన పక్కా యాజమాన్య హక్కులున్న భూముల వివరాలుంటాయి. ఎవరైనా ఆ భూములపై వివాదాలు సృష్టించేందుకు కోర్టుకెళ్లినా.. ఈ రిజిస్టర్ల ఆధారంగా కోర్టు వాటిని కొట్టేస్తోంది. దీనివల్ల భూ యజమానులకు భద్రత ఏర్పడుతుంది. ఇందుకోసమే అనేక మార్పులతో కొత్త భూ హక్కు యాజమాన్య చట్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. దీని ప్రకారం రాష్ట్రంలో ఉన్న స్థిరాస్తుల రికార్డులను తయారు చేసి వాటిని పక్కాగా నిర్వహిస్తారు. ఈ హక్కుల రికార్డుల ఆధారంగా భూముల రిజిస్ట్రేషన్లు సక్రమంగా జరిగేందుకు వీలవుతుంది. భూములకు సంబంధించిన డిజిటల్ రికార్డులు తయారవుతాయి. ఈ రికార్డుల నిర్వహణ బాధ్యతలు చూసేందుకు కొత్తగా రాష్ట్ర స్థాయిలో భూ ప్రాధికార సంస్థను ఏర్పాటు చేయనున్నారు. దీని చైర్మన్‌గా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేదా ముఖ్య కార్యదర్శి హోదాకు తగ్గని ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శిని ప్రభుత్వం నియమిస్తుంది. ఈ సంస్థ భూమి హక్కుల రియల్ టైమ్ డేటాను తయారు చేసి వాటిని నిర్వహిస్తుంది. హామీతో కూడిన హక్కుల యాజమాన్య విధానం అమల్లోకొస్తుంది. -
4,500 గ్రామాల్లో ఎగిరిన డ్రోన్లు
సాక్షి, అమరావతి: భూముల చరిత్రను తిరగరాస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రీ సర్వే చురుగ్గా సాగుతోంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 17,460 గ్రామాల్లోని 1.22 లక్షల చదరపు కిలోమీటర్లకు గాను.. 4,547 గ్రామాల్లోని 25 వేల చదరపు కిలోమీటర్లలో డ్రోన్ సర్వే పూర్తయింది. 22.43 లక్షల ఎకరాల భూములను కొలిచారు. డ్రోన్ల ద్వారా తీసిన ఫొటోలను మెరుగు పరిచి ఇచ్చే ఓఆర్ఐ (ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజెస్)లు 2,101 గ్రామాలకు సంబంధించినవి సర్వే బృందాలకు అందాయి. ఈ బృందాలు వాటిని, క్షేత్ర స్థాయిలో భూములను పోల్చి చూస్తూ రీ సర్వే ప్రక్రియ నిర్వహిస్తున్నాయి. వాస్తవానికి ఈ జనవరి నాటికి కేవలం 1,118 గ్రామాల్లో మాత్రమే డ్రోన్ సర్వే పూర్తయింది. కరోనా కారణంగా గత సంవత్సరం సుమారు వెయ్యి గ్రామాల్లో మాత్రమే డ్రోన్ సర్వే చేయగలిగారు. కానీ ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ నిర్దేశించడం, సీఎం వైఎస్ జగన్ రీ సర్వేపై ప్రత్యేకంగా దృష్టి సారించడంతో వేగం పుంజుకుంది. ఈ నేపథ్యంలో 7 నెలల్లో 3,500 గ్రామాల్లో డ్రోన్ సర్వేను పూర్తి చేయగలిగారు. ఇంకా వేగంగా చేసేందుకు డ్రోన్ల సంఖ్యను రెట్టింపు చేస్తున్నారు. ప్రస్తుతం 20 డ్రోన్లు వినియోగిస్తుండగా, సెప్టెంబర్ నుంచి కొత్తగా మరో 20 డ్రోన్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. 18 లక్షల ఎకరాల్లో క్షేత్ర స్థాయి నిజ నిర్ధారణ ► డ్రోన్ సర్వే ద్వారా ఇచ్చిన ఓఆర్‌ఐలను సంబంధిత రైతుల సమక్షంలో భూమిపైన సరిహద్దులతో పోల్చి చూసే గ్రౌండ్ ట్రూతింగ్ (క్షేత్ర స్థాయి నిజ నిర్ధారణ) ప్రక్రియ సుమారు 1,600 గ్రామాల్లో పూర్తయింది. ఈ గ్రామాల్లో 18 లక్షలకుపైగా ఎకరాల్లో గ్రౌండ్ ట్రూతింగ్‌ను పూర్తి చేశారు. ► ఈ సంవత్సరం జనవరి నాటికి కేవలం 310 గ్రామాల్లో 2.6 లక్షల ఎకరాల్లో మాత్రమే గ్రౌండ్ ట్రూతింగ్‌ను చేయగలిగారు. కానీ ఆగస్టు నాటికి 1,600 గ్రామాల్లో 18 లక్షల ఎకరాల్లో గ్రౌండ్ ట్రూతింగ్ పూర్తయిందంటే సర్వే ఎంత వేగంగా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. 1,100 గ్రామాల్లో సరిహద్దుల నిర్ధారణ ► గ్రౌండ్ ట్రూతింగ్ తర్వాత చేపట్టే గ్రౌండ్ వాలిడేషన్ (సరిహద్దుల నిర్థారణ) 1,100 గ్రామాల్లో పూర్తయింది. 9 లక్షల ఎకరాల్లో ఈ ప్రక్రియను పూర్తి చేశారు. జనవరి నాటికి 260 గ్రామాల్లో మాత్రమే గ్రౌండ్ వాలిడేషన్ చేశారు. ఆ తర్వాత సర్వే వేగం పుంజుకోవడంతో తక్కువ సమయంలోనే 800 గ్రామాల్లో ఈ ప్రక్రియను పూర్తి చేశారు. ► మరోవైపు రీ సర్వే సుమారు వెయ్యి గ్రామాల్లో పూర్తయింది. ఈ గ్రామాల్లో సర్వే పూర్తయినట్లు 13 నోటిఫికేషన్లు కూడా జారీ చేశారు. ఈ గ్రామాల్లో 8 లక్షల ఎకరాలకు సంబంధించి సర్వే పూర్తవడంతో ఆ గ్రామాల్లో కొత్త భూ రికార్డులు అందుబాటులోకి వచ్చాయి. జనవరి నాటికి 110 గ్రామాల్లో మాత్రమే సర్వే పూర్తి కాగా, ప్రస్తుతం వెయ్యి గ్రామాల్లో పూర్తయింది. ► గ్రౌండ్ వాలిడేషన్ పూర్తయ్యాక ఇప్పటి వరకు రైతులు, భూ యజమానుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 14 వేల అభ్యంతరాలు వచ్చాయి. మొత్తం 5.50 లక్షలకుపైగా ల్యాండ్ పార్సిల్లో కేవలం 3 శాతం మాత్రమే అభ్యంతరాలు వచ్చాయి. వాటిలో 95 శాతానికిపైగా అభ్యంతరాలను మొబైల్ మెజిస్ట్రేట్ బృందాలు పరిష్కరించాయి. -
సర్వే సెటిల్మెంట్ శాఖ పునర్వ్యవస్థీకరణ
సాక్షి, అమరావతి: 50 ఏళ్ల తర్వాత రాష్ట్రంలోని సర్వే సెటిల్మెంట్, ల్యాండ్ రికార్డుల శాఖను ప్రభుత్వం పునర్వ్యస్థీకరించింది. కింది నుంచి పైస్థాయి వరకు కేడర్ పోస్టుల్ని అప్‌గ్రేడ్ చేయడంతోపాటు పలు విభాగాలకు సంబంధించి కీలకమైన మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. 1971లో సర్వే శాఖ పునర్వ్యవస్థీకరణ జరిగింది. అప్పటి నుంచి పదోన్నతుల ఛానల్ లేకపోవడంతో నియమితులైన వారంతా ఒకే కేడర్‌లో ఏళ్ల తరబడి పనిచేసి రిటైర్ అవుతున్నారు. తాజాగా.. వైఎస్ జగన్ ప్రభుత్వం దేశంలోనే మొట్టమొదటిసారిగా భూముల రీసర్వేను చేపట్టడంతో సర్వే శాఖ ప్రాధాన్యత ఒక్కసారిగా పెరిగి పని విధానం పూర్తిగా మారిపోయింది. మరోవైపు.. గ్రామ సచివాలయ వ్యవస్థలో 11,158 మంది గ్రామ సర్వేయర్లను నియమించడంతో సర్వే శాఖ మరింత క్రియాశీలకంగా మారింది. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పేరుతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్న భూముల రీ సర్వే, వాటి సేవల స్వరూపం పూర్తిగా మారిపోవడం, సర్వే అవసరాలు పెరగడం, భూసేకరణ, భూముల సబ్ డివిజన్ వంటి పనులు గతం కంటే పూర్తిగా మారిపోయిన నేపథ్యంలో సర్వే శాఖను ప్రభుత్వం ప్రక్షాళన చేసింది. పూర్తిస్థాయిలో పర్యవేక్షణ, తనిఖీ వ్యవస్థ ఉండేలా పునర్వ్యవస్థీకరించింది. పర్యవేక్షణాధికారులుగా మండల సర్వేయర్లు మండల స్థాయి నుంచి డివిజన్, డివిజన్ నుంచి జిల్లా, జిల్లా నుంచి రీజినల్ స్థాయి వరకు 410 పోస్టుల్ని అప్‌గ్రేడ్ చేశారు. ప్రస్తుతం జిల్లా స్థాయిలో అసిస్టెంట్ డైరెక్టర్ కేడర్ పోస్టు ఉండేది. దాన్ని డిప్యూటీ డైరెక్టర్ హోదాకు పెంచారు. రీజినల్ స్థాయిలో ఉన్న డిప్యూటీ డైరెక్టర్ పోస్టులను జాయింట్ డైరెక్టర్ హోదాకు పెంచారు. కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకు అన్ని పోస్టుల్ని అప్‌గ్రేడ్ చేశారు. మండల స్థాయిలో కొద్దికాలం క్రితం వరకు మండల సర్వేయర్లే ప్రారంభ ఉద్యోగులు. గ్రామ సర్వేయర్లు రావడంతో ఇప్పుడు వారు ప్రారంభ ఉద్యోగులయ్యారు. దీంతో మండల సర్వేయర్ పోస్టు పర్యవేక్షణాధికారి పోస్టుగా మారింది. గతంలో మండల సర్వేయర్లను పర్యవేక్షించేందుకు డివిజన్ స్థాయిలో ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే ఉండేవారు. ఇప్పుడు గ్రామ సర్వేయర్లందరికీ మండల సర్వేయర్ పర్యవేక్షణాధికారిగా మారారు. దీనికి అనుగుణంగా మండల సర్వేయర్ పోస్టును మండల ల్యాండ్ సర్వే అధికారిగా మార్చారు. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని సర్వేయర్లు, అధికారులకు శిక్షణ ఇచ్చేందుకు వీలుగా ఏపీ సర్వే శిక్షణ అకాడమీని ఏపీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ జియో డెశీ అండ్ జియో ఇన్ఫర్‌మ్యాటిక్స్‌గా మార్చారు. సెంట్రల్ సర్వే కార్యాలయాన్ని సెంట్రల్ సర్వే ఆఫీస్ అండ్ జియో స్పేషియల్ వింగ్‌గా మారుస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీచేశారు. -
భూ రికార్డుల ప్రక్షాళన ఎప్పుడు?
తెలంగాణతో భూమి అంశం తరతరాలుగా మమేకమైంది. వ్యవస్థ మార్పునకు, భౌగోళిక మార్పునకు ఇక్కడ భూమి కూడా కీలక కారణమైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత భూ సమస్య పరిష్కారమవుతుందేమోనని ఎనిమిదేళ్ళుగా ఎదురు చూస్తున్నా, అది ఇప్పటికీ సాకారం కావడం లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ భూముల విషయంలో సమూల ప్రక్షాళనకు కొత్త రెవెన్యూ చట్టం తీసుకురావడం, ‘ధరణి’ విధానాన్ని ప్రవేశపెట్టడం వంటి చర్యలు తీసుకున్నారు. కానీ వాటిల్లో లొసుగుల పరిష్కారానికి ప్రభుత్వం ఆసక్తి చూపకపోవడంతో సమస్యలు జటిలమవుతున్నాయి. ముఖ్యంగా ‘ధరణి పోర్టల్’లో చేతులు మారిన భూములకు సంబంధించిన పట్టాదారుల పేర్లు మారకపోవడం, మోకాపై ఉన్న వారి పేరు లేక పోవడం సమస్యలకు కారణమవుతోంది. అన్నిటికీ మించి ఎప్పటి నుండో పెండింగ్‌లో ఉన్న భూ రికార్డుల ప్రక్షాళన ప్రక్రియకు మూలమైన భూ సర్వే ఇంకా చేపట్టకపోవడంతో ఇబ్బందులు తలెత్తు తున్నాయి. ఏడాదిలో డిజిటల్ భూ సర్వే చేసి, అక్షాంశాలు, రేఖాంశాల వారీగా వివాదాలకు తావు లేకుండా భూముల గుర్తింపు చేస్తామని సీఎం ప్రకటించి ఏళ్ళు గడుస్తున్నా, అది ముందుకు సాగడం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండింటికీ విడివిడిగానే రెవెన్యూ చట్టాలు, భూ కార్డులున్నప్పటికీ ప్రత్యేక దృష్టి పెట్టలేదు. రికార్డులను సరిచేయడానికి ఉపశమన చర్యలు చేపట్టారు. భూ సమగ్ర సర్వే చేస్తే, భూముల అన్యాక్రాంతం, రికార్డులలో నెలకొన్న లొసుగులు బహిర్గతమయ్యేవి. కానీ అందుకు భిన్నంగా, ఆర్వోఆర్, అసైన్మెంట్ చట్టం, దేవాదాయ, వక్ఫ్ భూములకు కొత్త చట్టాలు వచ్చాయి. ఈ చట్టాలు ఎన్ని వచ్చినా అవి ప్రచారానికే పరిమితమైనాయి. కానీ క్షేత్రస్థాయిలో మార్పేమీ రాలేదు. 2004 సంవత్సరంలో అసెంబ్లీలో చర్చ జరిపి ఆనాటి మంత్రి కోనేరు రంగారావు నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటించి అనుభవపూర్వకంగా 104 సిఫారసులు చేసినప్పటికీ అవి బుట్టదాఖలైనాయి. ఈ రకంగా తెలంగాణ భూములు ప్రయోగశాలకు నిలయమైనాయి. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. మేధావులు, నిపుణులు, రాజకీయ పార్టీల నాయకులు భూ అంశంపైన అనేక అర్జీలిచ్చినా ప్రభుత్వం పట్టించు కోలేదు. రెవెన్యూ చట్టం అస్తవ్యస్తంగా ఉన్నదని 2020 సెప్టెంబర్ 11న కొత్త రెవెన్యూ చట్టాన్ని ఆమోదించారు. మాన్యువల్ రికార్డుల స్థానే ‘ధరణి పోర్టల్’ తేవడం ఇందులోని ముఖ్యమైన అంశం. దాని పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనాయి. ‘ధరణి పోర్టల్’ సాఫ్ట్వేర్ మాత్రమే అమలుకు తెచ్చారు. దానిని పూర్తిగా నమ్ముకుంటే రైతుల భూ రికార్డులు తారుమారై బజారులో పడతారని చెప్పినప్పటికీ పట్టించుకోలేదు. ధరణి పోర్టల్‌లో నెలకొన్న లొసుగులతో రైతులు తీవ్రమానసిక వ్యధకు గురవుతున్నారు. ప్రతి గ్రామంలో 100 నుండి 200 మంది రైతుల పైబడి భూ రికార్డులు, సర్వే నంబర్ హద్దులు అన్యాక్రాంతమై దిక్కుతోచని స్థితిలో కుమిలిపోతున్నారు. తహశీల్దార్ కార్యాలయానికి వెళ్తే... జిల్లా కలెక్టర్ దగ్గరకి వెళ్లమంటారు. వారికి సమయముండదు. రైతుల ఇక్కట్ల నేపథ్యంలో ప్రభుత్వం... సర్వే నెంబర్ వారీగా సమగ్ర భూ సర్వే (డిజిటల్) విధిగా చేపట్టాలి. సాదా బైనామాలకు ‘ధరణి పోర్టల్’లో ఆప్షన్ పెట్టాలి. అపరిష్కృతంగా ‘మీ సేవ’లో పెండింగ్ వున్న అర్జీలను వెంటనే పరిష్కరించాలి. గతంలో ‘ధరణి’ వచ్చిన తరువాత తప్పుగా నమోదైన పేర్ల స్థానంలో ఒరిజినల్ పట్టాదారుల పేర్లు నమోదు చేయాలి. (చదవండి: కాలం చెల్లిన చట్టాలు ఇంకానా?) పై అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి, సవరణలు చేస్తూ చర్యలు చేపట్టగలిగితే సమస్యలు పరిష్కారమవుతాయి. భూ రికార్డులు సరి అవుతాయి. అయితే దీనికి ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ చూపాల్సి ఉంటుంది. (చదవండి: ‘రెవెన్యూ’కు 250 ఏళ్లు) - చాడ వెంకటరెడ్డి సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి -
కాసుల కోసం భూ రికార్డులు తారుమారు
వరదయ్యపాళెం: డబ్బులకు ఆశపడి డీకేటీ పట్టాలను అక్రమంగా వేరేవాళ్ల పేర్ల మీదకు మార్చేసిన పలువురు రెవెన్యూ అధికారులపై కేసు నమోదైంది. చిత్తూరు జిల్లా వరదయ్యపాళెం మండలంలోని చిన్న పాండూరు రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 95/4, 96/1, 88/8లలో టి.వెంకటేష్ పేరిట 1.5 ఎకరాలకు, ఎం.రంగమ్మ పేరిట 1.5 ఎకరాలకు, కె.కన్నయ్య పేరిట 1.5 ఎకరాలకు 1992 ఏప్రిల్ 9న డీకేటీ పట్టాలు పంపిణీ చేశారు. అయితే అవే భూములను 2005లో అక్రమంగా పి.అమ్ములు, జి.నాగమ్మ, ఆర్.నాగమ్మల పేరిట కూడా రికార్డు చేసి.. పట్టాలిచ్చారు. అనంతర కాలంలో అపోలో టైర్ల పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు ఈ ప్రాంతంలోని 216 మంది ఎస్సీ, ఎస్టీ రైతులకు చెందిన 251.24 ఎకరాలను కేటాయించారు. పి.అమ్ములు, జి.నాగమ్మ, ఆర్.నాగమ్మలకు సి కేటగిరి కింద పరిహారం అందింది. అయితే తమకు ఏ కేటగిరి కింద రూ.6.5 లక్షల పరిహారమివ్వాలని వారు కోర్టుకు వెళ్లారు. దీన్ని విచారించిన హైకోర్టు పట్టాల మంజూరులో జరిగిన అవకతవకలను గుర్తించి.. గతేడాది కలెక్టర్‌ను విచారణకు పిలిపించింది. న్యాయస్థానం ఆదేశాలతో కలెక్టర్ క్షేత్రస్థాయిలో రికార్డులను పరిశీలించి అక్రమాలను గుర్తించారు. పి.అమ్ములు, జి.నాగమ్మ పేరిట అక్రమంగా పట్టాలిచ్చినందుకు అప్పటి ఇన్చార్జ్ తహసీల్దార్ మహదేవయ్య, ఆర్ఐ సదాశివయ్య, స్థానిక వీఆర్వో రఘునాథరెడ్డిలపై కేసు నమోదు చేశారు. రాపూరు నాగమ్మ పేరిట అక్రమంగా పట్టా ఇచ్చినందుకు అప్పటి మండల తహసీల్దార్ బాబు రాజేంద్రప్రసాద్, అప్పటి ఆర్ఐ మురళీమోహన్, ప్రస్తుత చిలమత్తూరు వీఆర్వో దొడ్డి వెంకటరమణపై కేసు నమోదైంది. -
చురుగ్గా భూ సర్వే
సాక్షి, అమరావతి: రెండో దశ సమగ్ర భూ రీ సర్వే (వైఎస్సార్ జగనన్న భూరక్ష, శాశ్వత భూ హక్కు) పనులు చురుగ్గా సాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 650 గ్రామాల్లో వచ్చే జనవరికల్లా రీ సర్వేను పూర్తి చేసే లక్ష్యంతో సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డుల శాఖాధికారులు పనిచేస్తున్నారు. 646 గ్రామాల డ్రోన్ చిత్రాలు ఇప్పటికే అధికారులకు అందాయి. వాటి ద్వారా సర్వే కొనసాగిస్తున్నారు. 92 గ్రామాల్లో ఇప్పటికే రీ సర్వే చివరి దశకు చేరుకొంది. వీటికి కొత్త సరిహద్దులు నిర్ణయిస్తూ ఇచ్చే 13 నోటిఫికేషన్లు త్వరలో జారీ చేయనున్నారు. ఈ గ్రామాల తుది భూ రికార్డులను తయారు చేస్తున్నారు. 44 గ్రామాల్లో భూ యజమానుల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు. 140 గ్రామాల్లో భూముల పట్టాదార్ పాస్ పుస్తకాలు, వెబ్‌ల్యాండ్ అడంగల్ తదితరాల పరిశీలన జరుగుతోంది. 439 గ్రామాల్లో గ్రౌండ్ ట్రూతింగ్ (క్షేత్ర స్థాయి నిజనిర్థారణ) జరుగుతోంది. డ్రోన్ చిత్రాల ఆధారంగా కొత్తగా తయారు చేసిన సరిహద్దులతో ఆ సర్వే నెంబర్ల భూమిని భూ యజమానుల సమక్షంలో కొలతలు వేస్తారు. గ్రామాల్లోని సచివాలయ సర్వేయర్లతో ఈ పని చేయిస్తున్నారు. మరో నాలుగు గ్రామాల డ్రోన్ చిత్రాలు త్వరలో అందనున్నాయి. ఇవికాకుండా 5,500 గ్రామాల్లో అడంగల్, ఆర్ఎస్ఆర్తో సరిదిద్దడం, భూయజమానుల రికార్డులతో సరిపోల్చడం వంటి పనులు జరుగుతున్నాయి. -
గడువులోగా భూసర్వే పూర్తిచేయాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జరుగుతున్న సమగ్ర భూ సర్వేను నిర్దేశించుకున్న గడువులోగా పూర్తిచేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులకు ఆదేశించారు. భూ క్రయ విక్రయాలు జరిగినప్పుడే రికార్డులను కూడా అప్డేట్ చేయాలని.. గ్రామ సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్, మ్యుటేషన్‌కు సంబంధించిన ప్రక్రియలు చేపట్టాలన్నారు. ప్రతియేటా ఒక వారంలో భూ రికార్డుల అప్డేషన్ కార్యక్రమం చేపట్టాలని ఆయన సూచించారు. అలాగే, నిషేధిత భూముల వ్యవహారాలకు చెక్ పెట్టాల్సిందేనని.. ఆ జాబితాలో చేర్చాలన్నా, తొలగించాలన్నా సరైన విధానాలు పాటించాలని, లోపాలు లేకుండా ఆధీకృత వ్యవస్థలను బలోపేతం చేయాలని కూడా ఆదేశించారు. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు–భూరక్ష పథకంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చర్చకు వచ్చిన అంశాలు.. ఎస్ఓపీలు రూపొందించండి భూముల క్రయవిక్రయాలు జరిగినప్పుడు పట్టాదారు పుస్తకానికి సంబంధించిన వివరాలు అమ్మకందారులు, కొనుగోలుదారుల రికార్డుల్లో అప్డేట్ కావాలని, అప్పుడే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయినట్లుగా భావించాలని సీఎం స్పష్టంచేశారు. దీనిపై ప్రత్యేక టీంను పెట్టి.. తగిన విధానాన్ని రూపొందించాలన్నారు. భూ రికార్డుల్లో నిపుణులైన వారిని, న్యాయపరమైన అంశాల్లో అనుభవం ఉన్నవారిని ఈ టీంలో నియమించాలన్నారు. వీరి సిఫార్సుల ఆధారంగా రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ప్రక్రియలకు సంబంధించి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్లు రూపొందించాలని సూచించారు. గ్రామ సచివాలయాల్లోనే ఈ ప్రక్రియ పూర్తయ్యేలా ఉండాలని, ప్రజలు వీటి కోసం ఆఫీసులు చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా తగిన విధానం రూపొందించాలని ఆదేశించారు. భూ సర్వేకు సాంకేతిక పరికరాలు సమకూర్చుకోవాలి భూ సర్వే త్వరితగతిన పూర్తిచేయడానికి తగినన్ని సాంకేతిక పరికరాలను సమకూర్చుకోవాలని, ఇందుకు తగినన్ని డ్రోన్లు పెట్టుకోవాలని సీఎం సూచించారు. సర్వేకు సంబంధించి డేటా భద్రతపైనా తగిన చర్యలు తీసుకోవాలని.. దీనిపై అనుభవం ఉన్న వ్యక్తులు, సంస్థలతో మాట్లాడాలని అధికారులను ఆదేశించారు. ల్యాండ్ రికార్డుల అప్డేషన్ను ఏటా ఒక వారంలో చేపట్టాలని, దీనిపై తగిన కార్యాచరణ రూపొందించాలన్నారు. భూ రికార్డుల అప్డేషన్, రిజిస్ట్రేషన్ తదితర ప్రక్రియలన్నీ అత్యంత పారదర్శకంగా ఉండాలన్నారు. మనం తీసుకొస్తున్న సంస్కరణలతో అవినీతికి ఆస్కారం ఉండకూడదని.. రైతులకు, భూ యజమానులకు మేలు చేసేలా ఉండాలని.. ఇందుకోసం సమర్థవంతమైన మార్గదర్శకాలను తయారుచేయాలని జగన్ ఆదేశించారు. నిషేధిత భూముల విషయంలో ‘అవి’ పునరావృతం కాకూడదు నిషేధిత భూముల అంశానికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో రికార్డుల్లో చోటుచేసుకున్న వ్యవహారాలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను సీఎం ఆదేశించారు. 22–ఎ (నిషేధిత భూములు) విషయానికి సంబంధించి అనేక వ్యవహారాలు బయటకొస్తున్న నేపథ్యంలో ఇలాంటి వాటికి చెక్ పెట్టాల్సిన అవసరముందన్నారు. అధికారులు సమావేశమై దీనిపై ఒక విధానం రూపొందించాలని.. ఇలాంటి పొరపాట్లు, ఉద్దేశపూర్వక చర్యలు పునరావృతం కాకుండా చూడాలని ఆయన ఆదేశించారు. తగినన్ని మార్గదర్శకాలు పటిష్టంగా రూపొందించాలని, నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించాలన్నా, ఆ జాబితాలో చేర్చాలన్నా అనుసరించాల్సిన విధానాన్ని లోపాలు లేకుండా తీసుకురావాలని సూచించారు. దీనికి సంబంధించి ఆధీకృత వ్యవస్థను కూడా బలోపేతం చేయాలని అధికారులకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి ధర్మాన కృష్ణదాస్, పురపాలక–పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమగ్ర భూ సర్వే ప్రగతి ఇలా.. సమీక్షలో అధికారులు సమగ్ర భూ సర్వే పనుల్లో జరిగిన ప్రగతిని, లక్ష్యాలను సీఎంకు వివరించారు. ఆ వివరాలు.. ► పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టిన 51 గ్రామాల్లో సర్వే పూర్తయింది. ► డిసెంబర్ 2021 నాటికి మరో 650 గ్రామాల్లో పూర్తవుతుంది. ► మండలానికి ఒక గ్రామం చొప్పున ఈ 650 గ్రామాల్లో సర్వే పూర్తిచేస్తాం. ► జూన్ 22, 2022 నాటికి 2,400 గ్రామాల్లో సర్వే పూర్తిచేస్తాం. ► ఆగస్టు 2022 నాటికి మరో 2,400 గ్రామాల్లో పూర్తవుతుంది. è మొత్తంగా ఆగస్టు 2022 నాటికి దాదాపు 5,500 గ్రామాల్లో సర్వే పూర్తవుతుంది. ► అక్టోబరు 2022 నాటికి 3 వేల గ్రామాల్లో, అదే ఏడాది డిసెంబరుకు మరో 3వేల గ్రామాల్లో.. అలాగే మార్చి 2023కల్లా మరో మూడువేల గ్రామాల్లో సర్వే పూర్తిచేస్తాం. ► ఇక జూన్, 2023 నాటికి ఇంకో 3 వేల గ్రామాలతో రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో సర్వే పూర్తిచేస్తాం. 51 గ్రామాల్లో ‘పైలెట్’ సర్వే ► అలాగే, పైలెట్ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే 51 గ్రామాల్లో 30,679 కమతాలను సర్వేచేశాం. ► 3,549 పట్టాదారుల వివరాలను అప్డేట్ చేశాం. ► రెవెన్యూ నుంచి 572, సర్వే వైపు నుంచి వచ్చిన 1,480 అభ్యర్థనలను పరిష్కరించాం. ► 235 సరిహద్దు వివాదాలను పరిష్కరించాం. ► సంబంధిత రికార్డులను అప్డేట్ చేయడమే కాకుండా వాటిని స్వచ్ఛీకరించాం. ► సర్వే అనంతరం పూర్తి వివరాలు, మ్యాపులతో కూడిన పట్టాదారు పుస్తకాన్ని రైతులకు అందిస్తున్నాం. -
Dharani Portal: ధరణిలో కాగితాలే ప్రామాణికం
సాక్షి, హైదరాబాద్: సర్వే నంబర్ తప్పులు, గల్లంతు, భూముల వర్గీక రణ, సంక్రమించిన విధానంలో జరిగిన పొరపాట్లు, విస్తీర్ణంలో హెచ్చు తగ్గులు, పేరు వివరాల్లో తప్పొప్పులు, ఆధార్ నమోదు, డిజిటల్ సంతకాలు, పెండింగ్ మ్యుటేషన్లు, సాదా బైనామాలు, నిషేధిత భూముల జాబితాలో పట్టా భూములు.. ఇవి ఇప్పుడు ధరణి పోర్టల్ ద్వారా రాష్ట్రంలోని వ్యవ సాయ భూముల విషయంలో రైతులు ఎదుర్కొం టున్న ప్రధాన సమస్యలు. కాగా ధరణి పోర్టల్‌లో ఎదురవుతున్న సమస్యల విష యమై ఆర్థిక మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం కీలకాంశాలపై దృష్టి సారించాల్సి ఉందని భూచట్టాల నిపుణులు అంటున్నారు. కంప్యూటర్ రికార్డు సరిగా ఉండాలంటే దాన్ని సరిచూసుకునే మాన్యువల్ రికార్డు (కాగిత రూపంలోని పత్రాలు) కూడా ఉం టేనే సాధ్యమవుతుందని స్పష్టం చేస్తున్నారు. కంప్యూటర్ రికార్డుకు ప్రామాణికంగా మరో రికార్డు లేకుండా ఇది సాధ్యం కాదని, 2004లో భూరికార్డుల కంప్యూటరీకరణ మొదలయినప్పటి నుంచీ ఈ విషయంలోనే సమస్యలు వస్తున్నాయని వారు పేర్కొంటున్నారు. గ్రామ పహాణీలు మాన్యువల్‌గా రాయాల్సిందే ముఖ్యంగా పాత మాన్యువల్ పహాణీలు క్షేత్రస్థాయి సమాచారానికి సరిపోలేలా లేవని నిపుణులు చెబుతున్నారు. భూరికార్డుల ప్రక్షాళన చేయకముందు సీఎం కేసీఆర్ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారని, ఒక్కసారయినా మన పహాణీని మనం రాసుకుంటేనే ఈ పీడ పోతుందని ఆయన చెప్పిన ఆ మాట అమల్లోకి రాకపోవడమే ప్రధాన సమస్యగా మారిందన్నది వారి వాదన. వారి సూచన ప్రకారం.. ప్రస్తుతం ధరణి పోర్టల్ ద్వారా రైతులు ఎదుర్కొంటున్న మెజార్టీ సమస్యలను గ్రామస్థాయిలోనే గుర్తించి పరిష్కారం కూడా చూపవచ్చు. ఇందుకోసం గ్రామ పహాణీని మాన్యువల్‌గా రాసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతమున్న పహాణీలను గ్రామసభ ముందుంచి అభ్యంతరాలు, సలహాలు, సూచనలను స్వీకరించి సవరించిన పహాణీ నకలును తయారు చేయాల్సి ఉంటుంది. ఈ నకలును కంప్యూటర్లో రికార్డు చేయాలి. అప్పుడే ఒక గ్రామంలో ఎదురయ్యే భూ సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించవచ్చు. సర్వే నంబర్ల వారీగా జరిగిన తప్పులను గుర్తించవచ్చు. ప్రతి ఎంట్రీని పరిశీలించి ఆ తప్పులకు సంబంధించిన సాక్ష్యాలను కూడా గ్రామాల్లోనే సేకరించవచ్చు. అంటే ఒక్కసారయినా మాన్యువల్‌గా పహాణీ రికార్డులను రాయాల్సిందేనన్నమాట. భూ సర్వేతోనే వివాదాలకు పరిష్కారం అలాగే కాలానుగుణంగా భూరికార్డుల సవరణలను పరిశీలించి, పరిష్కరించే ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేయాలన్నది భూచట్టాల నిపుణుల అభిప్రాయంగా కనిపిస్తోంది. అంటే ప్రతి యేటా లేదా రెండేళ్లకోసారి గ్రామాలకు వెళ్లి భూరికార్డులను పరిశీలించి సవరించిన రికార్డులకు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. అయితే మాన్యువల్ రికార్డు క్షేత్రస్థాయి కొలతలతో సరిపోలాల్సి ఉంటుంది. ఇది జరగాలంటే భూముల సర్వే ఖచ్చితంగా నిర్వహించాల్సిందేనని, భూముల సర్వేతోనే వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని నిపుణులంటున్నారు. కలెక్టర్ల టైటిళ్లకు చట్టబద్ధత ఎంత? ప్రస్తుత ధరణి వ్యవస్థ ప్రకారం సాదాబైనామాలతో సహా అన్ని రకాల భూ సంబంధిత ఫిర్యాదుల (గ్రీవెన్సులు) పరిష్కారం కలెక్టర్లే చేయాల్సి వస్తోంది. వీఆర్వో, ఎమ్మార్వో, ఆర్డీవో, జేసీలు చేసే పనులన్నింటినీ కలిపి కలెక్టర్లు చేస్తున్నారు. అయితే, ఒక్క నిషేధిత భూముల జాబితాలో ఉన్న భూముల విషయంలో తప్ప కలెక్టర్లు ఇచ్చే టైటిళ్లకు చట్టబద్ధత ఉండదని నిపుణులు వాదిస్తున్నారు. చట్టంలో లేనప్పుడు ఏ అధికారంతో కలెక్టర్లు సమస్యలు పరిష్కరిస్తున్నారని వారు ప్రశ్నిస్తున్నారు. రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్వోఆర్)–1971 ప్రకారం మ్యుటేషన్‌పై తహశీల్దార్లకు, రికార్డుల్లో తప్పుల సవరణపై ఆర్డీవోలకు, వాటిని సరిచూసేందుకు జేసీలకు అధికారముండేది. కానీ కొత్తగా తెచ్చిన రెవెన్యూ చట్టంలో మ్యుటేషన్, రిజిస్ట్రేషన్ చేసే అధికారాన్ని మాత్రమే తహశీల్దార్లకు కట్టబెట్టారు. కానీ, ఇతర ఏ అంశంలోనూ రెవెన్యూ వర్గాలకు భూ సమస్యల పరిష్కారంపై అధికారం ఇవ్వలేదు. కలెక్టర్ల అధికారాలను ప్రస్తావించలేదని నిపుణులు చెబుతున్నారు. అలాంటి సందర్భాల్లో కలెక్టర్లు ఇచ్చే టైటిల్ గ్యారంటీ కోర్టుల్లో నిలబడదన్నది వారి వాదనగా ఉంది. కలగాపులగంతోనే సమస్యల తీవ్రత వాస్తవానికి ధరణి పోర్టల్‌లో నమోదు చేసిన రికార్డులు రెవెన్యూ వర్గాల వద్ద అందుబాటులో ఉన్న మాన్యువల్ పహాణీ ఆధారంగా చేసినవి కావు. వెబ్‌ల్యాండ్, భూరికార్డుల ప్రక్షాళన యాప్, మా భూమి పోర్టల్, రిజిస్ట్రేషన్ల శాఖ వద్ద ఉన్న 22(ఏ) జాబితా, గ్రామాలకు వెళ్లినప్పుడు రెవెన్యూ వర్గాలు అరకొరగా ఇచ్చిన సమాచారాన్ని కలగాపులగం చేసి ధరణి పోర్టల్‌లో నమోదు చేయడంతో రోజురోజుకూ ఈ సమస్యల తీవ్రత పెరిగిపోతోంది. ధరణి వ్యవస్థ ఏర్పాటు మంచిదే అయినా, భూలావాదేవీలకు పారదర్శక నిర్వహణకు ఈ పోర్టల్ ఆస్కారమిచ్చేదే అయినా రోజులు గడిచే కొద్దీ సమస్యలు పెరిగిపోయేందుకు ఇదే కారణమవుతోందని నిపుణులు అంటున్నారు. ఈ సమస్య పరిష్కారం కావాలంటే మళ్లీ గ్రామాలకు వెళ్లి మాన్యువల్ పహాణీలను తయారు చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. నిపుణుల సూచనలివే. ► భూరికార్డుల ప్రక్షాళన పేరిట 2007 సెప్టెంబర్ నుంచి 100 రోజుల ప్రణాళికతో చేపట్టిన విధంగానే మరోమారు ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకుని భూసమస్యల పరిష్కారం కోసం గ్రామాలకు వెళ్లాలి. అక్కడ గ్రామ పహాణీని పరిశీలించి సవరించిన రికార్డులను ఆరా తీసి అక్కడికక్కడే సమస్యలతో పాటు వాటి పరిష్కారాలను గుర్తించాలి. సవరించిన పహాణీకి గ్రామసభ ఆమోదం పొంది దాన్ని మాన్యువల్‌గా తయారు చేయాలి. ఆ మాన్యువల్ రికార్డు ఆధారంగానే ధరణి పోర్టల్‌లో వివరాలు నమోదు చేయాలి. ► భూవివాదాల పరిష్కారానికి డివిజనల్, జిల్లా స్థాయిలో ప్రత్యేక అథారిటీలుండాలి. రెవెన్యూ కోర్టులా లేక ఇంకేదైనా పేరు పెట్టినా కనీసం జిల్లా స్థాయిలో అయినా ఈ వ్యవస్థ ఉండాల్సిందే. ► భాగ పంపకాలు లేదా భూయాజమాన్య హక్కుల వివాదాలను మాత్రమే సివిల్ కోర్టులకు పంపాలి. మిగిలిన అన్ని అంశాలను రెవెన్యూ వర్గాలు లేదా రెవెన్యూ అధికారులతో ఏర్పాటు చేసే కోర్టులే పరిష్కరించాలి. ► సాదాబైనామాల సమస్యల పరిష్కారానికి గాను కొత్త ఆర్వోఆర్ చట్టంలో సవరణలు తీసుకురావాలి. ఈ చట్టంలో సాదాబైనామాల క్రమబద్ధీకరణకు చట్టబద్దత లేదు. 9లక్షలకు పైగా ఉన్న సాదాబైనామాలను క్రమబద్ధీకరించి ఈ సమస్యను పరిష్కరించాలంటే ఆ అధికారం తహశీల్దార్లకు ఇచ్చి ఆజమాయిషీని కలెక్టర్ల పర్యవేక్షణలో ఉంచేలా చట్టాన్ని సవరించాలి. ► ధరణి పోర్టల్‌లో కనిపించే నిషేధిత భూముల జాబితాలో వివరాలు సరిగా నమోదు కాలేదు. తహశీల్దార్ దగ్గర, సబ్‌రిజిస్ట్రార్, కలెక్టర్ల వద్ద ఉండే నిషేధిత జాబితాల్లో తేడాలున్నాయి. ఈ సమస్య పరిష్కారానికి తుది జాబితాను మళ్లీ ప్రచురించాలి. కంప్యూటర్లే సరిచేస్తాయనుకోవడం తప్పు భూముల రికార్డులన్నింటినీ కంప్యూటర్లే సరిచేస్తాయనుకోవడం తప్పు. కంప్యూటర్ రికార్డులు సరిగా ఉండాలంటే మానవ ప్రమేయంతో కూడిన కాగితం రికార్డులు ఉండాల్సిందే. తప్పులున్న రికార్డులను కంప్యూటర్లో పెట్టి ఇప్పుడు సరిచేసుకుంటూ పోతామంటే ఎలా సాధ్యమవుతుంది? సరిచేసిన రికార్డులను కంప్యూటర్లో పెట్టకపోతే వాటిని అది సరిచేయదు. ఈ సమస్య పరిష్కారం కావాలంటే సరిచేసిన మంచి భూరికార్డును కంప్యూటర్లో పెట్టాలి. భూసమస్యల పరిష్కారంలో పేదలకు న్యాయ సహాయం చేసేందుకు పారాలీగల్ వ్యవస్థను పునరుద్ధరించాలి. – ఎం.సునీల్‌కుమార్, భూచట్టాల నిపుణులు చదవండి: బతుకమ్మ వేడుల్లో పాల్గొన్న గవర్నర్ తమిళిసై -
సమగ్ర భూసర్వే పైలట్ ప్రాజెక్ట్ విజయవంతం
సాక్షి, అమరావతి: అస్తవ్యస్తంగా మారిన భూముల రికార్డులను ప్రక్షాళన చేసేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర భూ సర్వే పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైంది. తొలుత 51 గ్రామాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన సర్వే దాదాపు పూర్తయింది. ఈ గ్రామాల కొత్త సర్వే రికార్డులను భూ సర్వే శాఖ త్వరలో విడుదల చేయనుంది. దీనికి ముందు సర్వే ముగింపునకు సంబంధించిన నంబర్ 13 ముసాయిదా నోటిఫికేషన్లను ముద్రించనుంది. 51 గ్రామాల రీసర్వేలో ఎదురైన సమస్యల్ని పరిష్కరించి.. తుది రికార్డులను రూపొందించామని అధికారులు తెలిపారు. తద్వారా మిగిలిన గ్రామాల్లో రీసర్వే పూర్తి చేయడానికి అనువైన పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. ప్రతి రెవెన్యూ డివిజన్లో ఒక గ్రామం పైలట్ ప్రాజెక్ట్ కోసం ప్రతి రెవెన్యూ డివిజన్లో ఒక గ్రామాన్ని ఎంపిక చేశారు. ఈ 51 గ్రామాల్లో 63,433 ఎకరాలను రీసర్వే చేశారు. సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చిన డ్రోన్ చిత్రాలు, భూ యజమానులు వాస్తవంగా చూపించిన సరిహద్దులను పోల్చి కొలతలు వేశారు. తొలుత ఆ గ్రామాల సరిహద్దులు, గ్రామ కంఠాలు, ప్రభుత్వ భూములను సర్వే చేశారు. ఆ తర్వాత పట్టా భూముల సర్వే నిర్వహించారు. కొత్తగా వచ్చిన కొలతలపై అభ్యంతరాలు వ్యక్తమైనప్పుడు జీఎన్ఎస్ఎస్ రోవర్‌తో మళ్లీ సర్వే చేశారు. ఈ గ్రామాల్లో రెవెన్యూ వ్యవహారాలకు సంబంధించి 588 వినతులు, సర్వేకి సంబంధించి 1,564 వినతులు వచ్చాయి. వాటిలో 95%కిపైగా వినతుల్ని మొబైల్ సర్వే బృందాలు పరిష్కరించాయి. రైతుల ఆమోదంతో తుది రికార్డులను రూపొందిస్తున్నారు. సాంకేతికతతో కచ్చితమైన కొలతలు ప్రస్తుతం అందుబాటులో ఉన్న భూముల రికార్డులు వందేళ్ల క్రితం బ్రిటిషర్ల హయాంలో తయారుచేసినవి. అప్పట్లో చైన్ ద్వారా కొలిచి.. భూముల హద్దులు నిర్ణయించి రికార్డులు రూపొందించారు. వాటి ఆధారంగానే ఆ భూములు ఎన్నో తరాలుగా చేతులు మారుతూ వస్తున్నాయి. వాటిని కొనుగోలు చేసి తమ పేరున రిజిస్టర్ చేయించుకున్న వ్యక్తులు అధికారికంగా కొలతలు వేయించుకోవడం అరుదుగా జరిగేది. పాత రికార్డుల్లో ఉన్న హద్దుల ఆధారంగానే రిజిస్ట్రేషన్లు జరిగేవి. దీంతో కొలతలు మారిపోయి సరిహద్దు తగాదాలు, ఇతర సమస్యలు ఏర్పడుతున్నాయి. అడంగల్‌లో పాత రికార్డుల కొలతలు, ఇప్పటి కొలతలకు చాలా తేడాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రీసర్వేలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కచ్చితమైన కొలతలతో ఈ 51 గ్రామాల్లో సరిహద్దులు నిర్ణయించారు. వాటి ఆధారంగా భూముల రిజిస్టర్లు, గ్రామ మ్యాప్‌లను రూపొందించారు. ఈ వివరాలనే అడంగల్‌లో నమోదు చేస్తారు. చివరిగా ప్రతి భూమికి సంబంధించి ఒక విశిష్ట సంఖ్యను ఇవ్వనున్నట్లు సర్వే సెటిల్మెంట్ రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ కెజియాకుమారి తెలిపారు. పైలట్ ప్రాజెక్టుతోపాటే తొలి దశలో 5,500 గ్రామాల్లో రీసర్వే ప్రక్రియను గతంలోనే ప్రారంభించారు. అందులో 2,500 గ్రామాల్లో ప్రీ డ్రోన్ కార్యకలాపాలు జరుగుతున్నాయి. మిగిలిన గ్రామాల్లో సర్వే పనుల్ని ముమ్మరం చేశారు. పైలట్ ప్రాజెక్ట్ గ్రామాల్లో విజయవంతంగా సమగ్ర సర్వే పూర్తికావడంతో రాష్ట్రవ్యాప్తంగా సర్వే ప్రక్రియ ఊపందుకుంటుందని అధికారులు చెబుతున్నారు. -
భూ రికార్డులు చూశాకే ధాన్యం కొనుగోలు
న్యూఢిల్లీ: ధాన్యానికి ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) వ్యాపారులకు కాకుండా అసలైన రైతులకే దక్కేలా కీలక నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆహార శాఖ కార్యదర్శి సుదాన్షు పాండే చెప్పారు. వచ్చే నెల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసేటప్పుడు రైతుల భూమి రికార్డులను పరిశీలించనున్నట్లు (క్రాస్‌చెక్) సుదాన్షు తెలిపారు. రాష్ట్రాల్లోని డిజిటల్ ల్యాండ్ రికార్డులను ఎఫ్‌సీఐతో అనుసంధానించినట్లు వెల్లడించారు. రైతన్నల ప్రయోజనాల కోసమే ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొస్తున్నట్లు స్పష్టం చేశారు. రైతులు వారి సొంత భూమిలో లేదా కౌలుకు తీసుకున్న భూమిలో పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం సేకరిస్తుందని అన్నారు. ఏ ప్రాంతంలో ఎంత పంట పండించారు అనేది తెలుసుకోవడంతోపాటు అసలైన రైతులకు కనీస మద్దతు ధర దక్కేలా చేయడమే భూమి రికార్డుల క్రాస్‌చెక్ ఉద్దేశమని వివరించారు. -
భూ సర్వేపై 26 నుంచి శిక్షణ
సాక్షి, అమరావతి: వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం కింద చేపట్టిన రీ సర్వే కోసం ఈ నెల 26వ తేదీ నుంచి విడతల వారీగా 1,294 మంది సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నట్టు సర్వే సెటిల్మెంట్, భూ రికార్డుల కమిషనర్ సిద్ధార్థజైన్ తెలిపారు. సహాయ విభాగ అధికారులు, గ్రామ రెవెన్యూ అధికారులు, రెవెన్యూ సహాయకులకు 15 రోజులపాటు శిక్షణ ఇస్తామని ఒక ప్రకటనలో తెలిపారు. సామర్లకోటలోని సర్వే ట్రైనింగ్ అకాడమీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రాల్లో శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు. కరోనా కారణంగా అందరికీ ఒకేసారి శిక్షణ ఇచ్చే అవకాశం లేకపోవడం వల్ల జిల్లా స్థాయిలో ప్రతి బ్యాచ్‌కు 60 మందిని ఎంపిక చేసి విడతల వారీగా శిక్షణ ఇప్పిస్తున్నట్టు తెలిపారు. శిక్షణ ముగింపులో ప్రతి బ్యాచ్‌కు సర్వే నిర్వహణ పరీక్ష మాదిరిగానే థియరీ, ప్లాటింగ్‌పై తుది పరీక్షలు నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తామన్నారు. ఈ పరీక్షలను పర్యవేక్షించడానికి సంబంధిత జాయింట్ కలెక్టర్ల ద్వారా రెవెన్యూయేతర విభాగం నుంచి పరిశీలకులను నియమిస్తామని తెలిపారు. రాష్ట్రంలో కొనసాగుతున్న భూ పునర్ వ్యవస్థీకరణ కార్యకలాపాలను దృష్టిలో ఉంచుకుని సంప్రదాయక సర్వేతో పాటు సిలబస్‌లో కొత్త విషయాలను ప్రవేశపెట్టామని తెలిపారు. ఈటీఎస్, డీజీపీఎస్, నెట్వర్క్, ఎస్ఓపీ, గ్రౌండ్ ట్రూతింగ్, ఫీచర్ ఎక్స్ట్రాక్షన్, గ్రౌండ్ ధ్రువీకరణ వంటి అధునాతన అంశాలను సిలబస్‌లో చేర్చామని వివరించారు. -
ఆధార్ నంబర్‌తో.. భూమిని కొట్టేసేందుకు కుట్ర
సాక్షి, హైదరాబాద్: భూమి ఉన్నది 20 గుంటలే... కానీ మార్కెట్లో దాని ధర కోట్లు పలుకుతోంది. ఆ భూమి యజమాని దాదాపు రెండేళ్ల క్రితం మరణించారు. సదరు యజమాని కుటుంబీకులు ఆ భూమిని తమ పేరు మీద బదలాయించుకోలేదు. దీన్ని గమనించిన కొందరు ప్రబుద్ధులు భూమిని కొట్టేసేందుకు కుట్రపన్నారు. ఒక్క ఆధార్ నంబర్‌తో అప్పనంగా భూమిని సొంతం చేసుకుందామనుకున్నారు. రెవెన్యూ అధికారుల విచారణలో అసలు విషయం తేలడంతో అడ్డంగా బుక్కయ్యారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం భానూర్ గ్రామంలో సర్వే నంబర్ 497/ఇలో 20 గుంటల భూమి ఉంది. గత ఏప్రిల్ 19న తోట హనుమంతరావు పేరుతో ధరణి పోర్టల్‌కు ఒక దరఖాస్తు వచ్చింది. ఆ భూమికి ఈకేవైసీ కోసం తన ఆధార్ నంబర్‌ను నమోదు చేయాలని ఆ దరఖాస్తులో కోరారు. దీన్ని విచారిస్తుండగానే మే 6న తోట కనకదుర్గ పేరుతో మరో దరఖాస్తు వచ్చింది. తన భర్త తోట హనుమంతరావు 2019, ఆగస్టు 9న మరణించారని, ఆయన పేరు మీద ఉన్న భూమిని తనకు వారసత్వ మార్పు చేయాలని కనకదుర్గ కోరారు. రెండు దరఖాస్తుల్లోని సర్వే నంబర్లు, ఖాతా నంబర్లు ఒకటే ఉండటంతో జూన్ 5న విచారణకు రావాలని ఇరుపార్టీలకు రెవెన్యూ అధికారులు నోటీసులు పంపారు. ధ్రువీకరణలు తీసుకుని సదరు భూమిని క్లెయిమ్ చేసుకోవాలని కోరారు. పౌరసరఫరాల డేటా బేస్‌తో.. విచారణ సమయంలో తోట హనుమంతరావు పేరు మీద దరఖాస్తు చేసుకున్న వ్యక్తి ఆ భూమికి సంబంధించిన ధ్రువీకరణలు చూపలేకపోయాడు. ఆ వ్యక్తి నమోదు చేయాలని కోరిన ఆధార్ కార్డులోని చిరునామాలో ఎంక్వైరీ చేయగా సదరు పేరున్న వ్యక్తి అక్కడ లేడని తేలింది. పౌరసరఫరాల డేటాలో వెతకగా ఆ ఆధార్ నంబర్‌తో లింక్ అయి ఉన్న రేషన్‌కార్డు దొరికింది. ఈ కార్డులో తోట హనుమంతరావు కాకుండా గుర్రం పాండు అనే పేరు వచ్చింది. ఇతనిది యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ కాగా, ఆ రేషన్‌కార్డుపై తన బయోమెట్రిక్ వివరాలను నమోదు చేసి 2020, నవంబర్‌లో రేషన్ బియ్యం తీసుకున్నాడని, ఆ తర్వాత వరుసగా అతని భార్య ఈ రేషన్ తీసుకుంటున్నట్లు వెల్లడైంది. రెవెన్యూ అధికారులు మరింత విచారించగా, గుర్రం పాండు తన ఆధార్ కార్డులోని పేరును తోట హనుమంతరావుగా 2021లో మార్చుకున్నాడని, ఆ తర్వాత అదే పేరుతో ఆ కార్డులోని నంబర్‌ను నమోదు చేసుకుని విలువైన భూమిని కొట్టేసేందుకు కుట్రపన్నాడని తేలింది. దీంతో గుర్రం పాండుపై చీటింగ్ కేసు నమోదు చేయాలని సంబంధిత తహశీల్దార్ సోమవారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రెండు దరఖాస్తులు రావడంతోనే.. వాస్తవానికి రెండు దరఖాస్తులు ఒకే సమయంలో రావడంతోనే ఇది గుర్తించగలిగాం. లేదంటే ఆధార్‌కార్డులోని పేరు, పహాణీలో పేరు చూసి ఆ దరఖాస్తును ఆమోదించడమో, తిరస్కరించడమో జరిగేది. విచారణలో తప్పని తేలడంతో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాం. ఇలాంటి వాటిపై ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎప్పటికప్పుడు తమ భూమి రికార్డులను ఆన్లైన్లో అయినా చెక్ చేసుకుంటూ ఉండాలి. –కె. మహిపాల్‌రెడ్డి, పటాన్చెరు తహశీల్దార్ -
భూ రికార్డుల స్వచ్ఛీకరణ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో భూ యాజమాన్య హక్కు పత్రాలు (ఆర్వోఆర్–అడంగల్) తప్పుల తడకగా.. అస్తవ్యస్తంగా తయారయ్యాయి. భూ రికార్డులను నవీకరించి నిర్వహించడానికి వీలుగా 2014లో అప్పటి ప్రభుత్వం ‘వెబ్‌ల్యాండ్’ కొత్త సాఫ్ట్‌వేర్‌ను ప్రవేశపెట్టింది. అది కాస్తా తప్పుల తడకగా.. లోపభూయిష్టంగా తయారైంది. ఫలితంగా భూ యజమానులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే దుస్థితి దాపురించింది. వెబ్‌ల్యాండ్ రికార్డులు సక్రమంగా లేకపోవడంవల్లే భూ వివాదాలు పెరిగి ఘర్షణలకు దారి తీస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో హత్యలకు దారి తీసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కొన్ని వివాదాల విషయంలో ఇరువర్గాలు ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతున్న దృష్టాంతాలు లక్షల్లో ఉన్నాయి. అందువల్లే భూ రికార్డులను ప్రక్షాళన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. భూములు, పట్టణ, గ్రామీణ ఆస్తులను రీసర్వే చేసి ప్రతి సబ్ డివిజన్‌కు సరిహద్దు రాళ్లు నాటాలని నిర్ణయించింది. తద్వారా ల్యాండ్ రికార్డుల స్వచ్ఛీకరణ కార్యక్రమాన్ని పక్కాగా చేపడుతోంది. ప్రైవేట్ భూములు ప్రభుత్వ ఖాతాలో.. అనేకచోట్ల ప్రైవేట్ భూములు ప్రభుత్వ ఖాతాల్లోనూ, ప్రభుత్వ భూములు ప్రైవేట్ వ్యక్తుల ఖాతాల్లోను అడంగల్‌లో నమోదై ఉన్నాయి. కొందరు కిందిస్థాయి రెవెన్యూ సిబ్బంది, రిటైర్డు ఉద్యోగులు ముడుపులు తీసుకుని తప్పుడు రికార్డులు సృష్టించారు. గత ప్రభుత్వ హయాంలో టీడీపీ నాయకులు కూడా ఈ వ్యవహారంలో కీలక భూమిక పోషించారు. ఇప్పటికీ చాలా భూములు రెవెన్యూ రికార్డుల్లో అన్ నోన్ (ఎవరివో తెలియవు) అనే ఖాతాలోనే ఉన్నాయి. తప్పుల సవరణ కోసం... 2020 జూన్ 1 నుంచి 2021 జనవరి 29వ తేదీ వరకూ 8 నెలల్లో భూ యాజమాన్య పత్రం (ఆర్వోఆర్/అడంగల్)లో తప్పుల సవరణ కోసం 4,17,650 వినతులు వచ్చాయి. వెబ్‌ల్యాండ్ ఎంత అస్తవ్యస్తంగా.. తప్పుల తడకగా ఉందనేది ఈ గణాంకాలే చెబుతున్నాయి. వాటిలో.. 2,04,577 తప్పులను అధికారులు సరిదిద్దారు. 43,047 అర్జీలు పెండింగ్‌లో ఉండగా.. 1,70,026 అర్జీలను వివిధ కారణాల వల్ల తిరస్కరించారు. అందుకే స్వచ్ఛీకరణ దశాబ్దాల తరబడి సబ్ డివిజన్ కాకపోవడం, కిందిస్థాయిలో జరిగిన అక్రమాలు వంటి కారణాల వల్ల అడంగల్‌లోనూ, వెబ్‌ల్యాండ్ అడంగల్‌లోనూ కొన్ని తప్పులు ఉన్న మాట వాస్తవమేనని రెవెన్యూ ఉన్నతాధికారి ఒకరు అంగీకరించారు. ఈ తప్పులను సరిదిద్ది ప్రక్షాళన చేయడం కోసమే ప్రభుత్వం రికార్డుల స్వచ్ఛీకరణ కార్యక్రమం చేపట్టిందని తెలిపారు. -
సాహసోపేతం.. రీసర్వే మహాయజ్ఞం
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని భూములు, స్థిరాస్తుల రీసర్వే అత్యంత క్లిష్టమైన పని. రాష్ట్రంలో 17,460 రెవెన్యూ గ్రామాలు, 47,861 ఆవాసాలు, 110 పట్టణ, నగరపాలక సంస్థల పరిధిలోని భూములు, స్థలాలు, ఇళ్లు సర్వేచేసి హద్దులు నిర్ణయించి హక్కుపత్రాలు ఇవ్వడమనేది ఆషామాషీ వ్యవహారం కాదు. అస్తవ్యస్తంగా ఉన్న భూ రికార్డులు, నకిలీ రికార్డులు వంటి ఎన్నో చిక్కుముళ్లున్నాయి. ప్రపంచంలోనే అత్యంత ఆధునిక పరిజ్ఞానం వినియోగించినా కొలతల్లో వచ్చే అతిసూక్ష్మ తేడా, వాస్తవ భూమికి, రికార్డుల్లోని గణాంకాలకు మధ్య ఉన్న భారీ తేడా, డ్యూయల్ రిజిస్ట్రేషన్లు, ట్యాంపరింగైన రికార్డులు వంటి సమస్యల్ని రీసర్వే క్రతువులో అధిగమించాల్సి ఉంటుంది. అందుకే రీసర్వేని రెవెన్యూ నిపుణులు మహాయజ్ఞంగా అభివర్నిస్తున్నారు. ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ విషయంలో దేశానికే మార్గదర్శకంగా నిలుస్తుంది. ఈ మహాక్రతువులో భాగస్వామ్యం కల్పించినందుకు వ్యక్తిగతంగా, సంస్థ తరఫున సీఎం జగన్‌కు, ఏపీ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు’ అని దేశంలోనే అతి పురాతన, ప్రపంచంలోనే అతిపెద్ద సర్వే సంస్థ.. సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ గిరీష్‌కుమార్ బహిరంగంగానే చెప్పారంటే ఈ సర్వేకి ఎంత ప్రాధాన్యం ఉందో అర్థమవుతోంది. క్లిష్టమైన సమస్యలను అధిగమించి రీసర్వే పూర్తిచేస్తే గోల్డెన్ రికార్డులు రూపుదిద్దుకుంటాయి. భూతగాదాలు, పొలం గట్ల వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. తర్వాత క్రయవిక్రయాలు, చట్టబద్ధమైన వారసత్వం ప్రకారం కేవలం మ్యుటేషన్లు చేసుకుంటూ వెళితే వచ్చే 40 నుంచి 50 ఏళ్లపాటు ఈ రికార్డులు అద్భుతంగా ఉంటాయి. ల్యాండ్ టైట్లింగ్ చట్టం ప్రకారం భూ యజమానులకు శాశ్వత భూహక్కులు కల్పించిన మొదటి రాష్ట్రంగా ఏపీ చరిత్రలో నిలుస్తుంది. రికార్డుల స్వచ్చికరణ, రీసర్వే ప్రక్రియలను అంకితభావంతో పూర్తిచేయాల్సిన గురుతర బాధ్యత రెవెన్యూ సిబ్బందిపై ఉంది. కొలతల్లో తేడాలు దుకాణానికి వెళ్లి బంగారం కొని వెంటనే పక్క షాపునకు వెళ్లి తూకం వేయిస్తే 10 నుంచి 20 మిల్లీగ్రాముల వరకు తేడా వస్తుంది. దీన్ని తప్పుగా పరిగణించడానికి వీలులేని అతిసూక్ష్మ తేడా అంటారు. తూకాల్లో లాగే భూమి కొలతల్లో కూడా అతిసూక్ష్మ తేడాలు వస్తాయి. ప్రపంచంలోనే అత్యాధునిక కార్స్ టెక్నాలజీతో సర్వేచేసినా ఇవి వస్తాయి. ఒక పాయింట్‌ను బేస్‌గా తీసుకుని కొలత వేసిన తర్వాత మరోసారి అలాగే తీసుకుని చూస్తే గరిష్టంగా ఐదు సెంటీమీటర్ల వరకు ఎక్కువ లేదా తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. దీన్నే సర్వే పరిభాషలో ప్లస్ ఆర్ మైనస్ 5 సెంటీమీటర్ల ఎర్రర్ అని అంటారు. సాధారణంగా రెండు సెంటీమీటర్లు మించి తేడా రాదు. కొన్నిచోట్ల ఐదు సెంటీమీటర్ల వరకు రావచ్చని సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ తెలిపారు. ఇది పరిగణనలోకి తీసుకోవాల్సిన దానికంటే తక్కువని అర్థం. ఇలాంటి తేడాలను కూడా అంగీకరించనివారికి వాస్తవాలు వివరించడం, ప్రత్యామ్నాయ మార్గాల్లోనూ కొలిచి చూపడం ద్వారా ఒప్పించాల్సి ఉంటుంది. తక్కెళ్లపాడులో నాలుగెకరాల తేడా కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలంలోని తక్కెళ్లపాడులో పైలెట్ ప్రాతిపదికన నిర్వహించిన రీసర్వేలో ఆర్ఎస్ఆర్కు, వాస్తవ కొలతలకు మధ్య నాలుగెకరాల తేడా వచ్చింది. తమ భూముల కొలతల విషయంలో 35 మంది అభ్యంతరాలు వ్యక్తం చేశారు. రెవెన్యూ అధికారులు వాస్తవాలు వివరించడం ద్వారా వారిని ఒప్పించారు. నేటి నుంచి అవగాహన రీసర్వేని పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రభుత్వం బ్లూప్రింట్ సిద్ధం చేసింది. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా 14 వేల మంది సర్వేయర్లను నియమించారు. వీరిలో 9,400 మందికి శిక్షణ ఇవ్వగా మిగిలిన వారికి వచ్చేనెల 26 నాటికి శిక్షణ పూర్తి చేయనున్నారు. రీసర్వేపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సోమవారం నుంచి గ్రామసభలు నిర్వహించనున్నారు. డ్రోన్ సర్వేలో తేడా వచ్చిందని యజమానులు భావిస్తే రోవర్‌తో చేస్తారు. అందులోనూ సంతృప్తి చెందకపోతే చెయిన్‌తో మాన్యువల్ విధానంలో కొలిపించి హద్దులు నిర్ణయిస్తారు. దీన్ని కూడా అంగీకరించని పక్షంలో సివిల్ ఇంజినీరింగ్ విధానంలో కొలుస్తారు. వివాదాలను పరిష్కరించేందుకు మండలానికి ఒకటి చొప్పున 660 మొబైల్ ట్రిబ్యునళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇది గొప్ప సంస్కరణ ప్రజలకు మేలు చేయాలని ఏ కీలక సంస్కరణకు శ్రీకారం చుట్టినా కొన్ని సమస్యలు వస్తాయి. రీసర్వేలోనూ ఇలాంటి సమస్యలుంటాయి. ఏయే సమస్యలు వస్తాయో లిస్టు రూపొందించుకున్నాం. ఏయే అంశాల్లో ఎలా ముందుకెళ్లాలో ఇప్పటికే నాలుగు సర్క్యులర్లు పంపించాం. మరోదాన్ని పంపనున్నాం. ప్రపంచంలోనే అత్యంత ఆధునిక విధానంలో సర్వే చేయడమే కాకుండా స్థిరాస్తుల యజమానులకు శాశ్వత హక్కులతో కూడిన డిజిటల్ కార్డులు ఇచ్చే దిశగా ప్రభుత్వం ముందుకెళుతోంది. ఇది దేశంలో ఎక్కడా లేని గొప్ప సంస్కరణ. ప్రజలపై నయాపైసా భారం పెట్టకుండా ప్రభుత్వమే భరించి సర్వే చేయడంతోపాటు శాశ్వత హక్కు పత్రాలు ఇవ్వాలని సీఎం జగన్ ఎంతో సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. దీని అమలుకు సహకరించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. – నీరబ్‌కుమార్‌ప్రసాద్, భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) -
భూ రక్షకు ఢోకా లేదిక
సమగ్ర భూ సర్వే వల్ల ప్రజలకు చాలా మేలు జరుగుతుంది. ఇది విప్లవాత్మక చర్య. ప్రజలపై నయాపైసా కూడా భారం పడదు. మొత్తం ఖర్చు ప్రభుత్వమే భరిస్తుంది. రైతుల ప్రయోజనార్థం ఈ కార్యక్రమం చేపడుతున్నాం. గత వందేళ్లలో ఎక్కడా రీసర్వే చేయలేదు. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసమే సాహసోపేతంగా ఈ నిర్ణయం తీసుకున్నాం. – సీఎం వైఎస్ జగన్ ఎన్నెన్నో ఉపయోగాలు ► ప్రస్తుతం యజమానులకు భూములపై ఊహాజనితమైన హక్కులు మాత్రమే ఉన్నాయి. రీసర్వే తర్వాత శాశ్వత హక్కులతో కూడిన (ల్యాండ్ టైటిలింగ్) కార్డు అందజేస్తారు. ఈ కార్డులో ఆధార్ తరహాలో విశేష గుర్తింపు సంఖ్య (యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్) ఉంటుంది. ► ఇందులో యజమాని పేరు, ఫొటో, క్యూ ఆర్ కోడ్ ఉంటాయి. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే ఆయా రైతులకు సంబంధించిన ఆస్తుల (భూమి) కొలతలు, సమగ్ర సమాచారం కనిపిస్తుంది. ► సర్వే పూర్తయిన తర్వాత డిజిటలైజ్డ్ కెడస్ట్రల్ మ్యాపులు రూపొందిస్తారు. గ్రామంలోని ప్రతి కమతం, భూమి వివరాలు ఈ మ్యాప్‌లో ఉంటాయి. వీటి ప్రకారం ప్రతి సర్వే నంబరుకు సర్వే రాళ్లు నాటుతారు. ► ప్రతి గ్రామ సచివాలయంలో ఆ గ్రామానికి చెందిన డిజిటలైజ్డ్ ప్రాపర్టీ (ఆస్తి), టైటిల్ రిజిస్టర్లతోపాటు వివాదాల నమోదుకూ రిజిస్టర్లు ఏర్పాటు చేస్తారు. సాక్షి, అమరావతి: వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు – భూ రక్ష పథకం విప్లవాత్మక మార్పులకు నాంది కానుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. సమగ్ర భూముల రీసర్వే పూర్తికాగానే భూ యజమానులకు శాశ్వత భూ హక్కులతో కూడిన డిజిటల్ కార్డులు ఇస్తామని ప్రకటించారు. దీంతో ఎన్నో వివాదాలకు పరిష్కారం లభిస్తుందని స్పష్టం చేశారు. భూ రికార్డులన్నీ డిజిటలైజ్ చేయడం వల్ల ట్యాంపరింగ్‌కు ఏమాత్రం అవకాశం ఉండదని.. పట్టణాలకు, నగరాలకు వెళ్లాల్సిన పని లేకుండా సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ సేవలను కూడా అందుబాటులోకి తెస్తామని తెలిపారు. ‘వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు – భూ రక్ష పథకం’పై మంగళవారం ఆయన తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. ఈ సందర్భంగా సమగ్ర భూ సర్వేను ఈ నెల 21 ప్రారంభిస్తామని సీఎం ప్రకటించారు. సర్వే సిబ్బందికి శిక్షణ కోసం తిరుపతిలో కనీసం 50 ఎకరాల విస్తీర్ణంలో కళాశాల ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సర్వే సందర్భంలోనే ఈ కాలేజీ నిర్మాణం పూర్తి చేయాలని సూచించారు. ఈ సమీక్షలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. ‘వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు – భూ రక్ష పథకం’పై మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్లకు పక్కా ఏర్పాట్లు ► ఒక గ్రామంలో సర్వే పూర్తయి కెడస్ట్రల్ మ్యాపులు సిద్ధం కాగానే అదే గ్రామ సచివాలయంలో ల్యాండ్ రిజిస్ట్రేషన్ సేవలు ప్రారంభించాలి. ఆ మేరకు గ్రామ సచివాలయాల్లో కావాల్సిన మార్పులు చేసుకోవాలి. భూ వివాదాల పరిష్కారానికి మొబైల్ ట్రైబ్యునళ్లు ఏర్పాటు చేయాలి. ఇందుకు అవసరమైన వాహనాలు, ఇతర మౌలిక ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలి. ► సర్వేలో పాల్గొనే సిబ్బందికి మంచి శిక్షణ, ఓరియెంటేష¯Œన్ ఇవ్వాలి. సర్వే పూర్తయ్యాక ఆ రికార్డులను ట్యాంపర్ చేయడానికి వీలులేని విధంగా పటిష్టమైన భద్రతా ప్రమాణాలతో డిజిటలైజ్ చేసి భద్రపరచాలి. ► ఆ మేరకు సర్వే వ్యవస్థను పటిష్టంగా, మంచి సాంకేతిక పరిజ్ఞానంతో బలోపేతం చేయాలి. భూ యజమానుల వద్ద హార్డ్ కాపీ ఉండేలా చూడాలి. 1.26 లక్షల చదరపు కిలోమీటర్ల సర్వే ► రాష్ట్రంలోని 1.26 లక్షల చదరపు కిలోమీటర్ల (1.26 కోట్ల హెక్టార్ల ) పరిధిలో ప్రతి సెంటు భూమి/స్థలం రీ సర్వే చేస్తారు. సుమారు 90 లక్షల మందికి చెందిన 2.26 కోట్ల ఎకరాలు రీసర్వేలో భాగంగా కొలుస్తారు. ► అటవీ ప్రాంతం మినహా గ్రామాలు, ఆవాసాలు, పట్టణాలు, నగరాల్లో ఈ పథకం కింద సర్వే నిర్వహిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 17,460 రెవెన్యూ గ్రామాలున్నాయి. మొదటి విడతలో 5,000, రెండో విడతలో 6,500, మూడో విడతలో 5,500 గ్రామాల్లో రీ సర్వే జరుపుతారు. ► పట్టణాలు, నగరాల్లోని 3345.93 చదరపు కిలోమీటర్ల పరిధిలో 10 లక్షల ఓపెన్న్ప్లాట్లు, 40 లక్షల అసెస్మెంట్ల పరిధిలో సర్వే చేస్తారు. సర్వే ఆఫ్ ఇండియా సాంకేతిక సహకారం ► భూముల రీ సర్వేకు కేంద్ర ప్రభుత్వ సంస్థ సర్వే ఆఫ్ ఇండియా పూర్తి స్థాయి సాంకేతిక సహకారం అందిస్తుంది. ఇందుకోసం సిబ్బందికి అవసరమైన శిక్షణ, సాంకేతిక నైపుణ్యం అందిస్తుంది. ఈ మేరకు సర్వే ఆఫ్ ఇండియాతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల తొమ్మిదో తేదీ (బుధవారం) అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కురుర్చుకోనుంది. ► ప్రతి మండలానికి ఒక డ్రోన్, డేటా ప్రాసెసింగ్, రీసర్వే బృందాలు ఉంటాయి. ఇప్పటికే 9,400 మంది సర్వేయర్లకు శిక్షణ ఇచ్చారు. మిగిలిన వారికి కూడా త్వరలో శిక్షణ పక్రియ పూర్తి చేయనున్నారు. ► ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణ దాస్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, సీసీఎల్ఏ నీరబ్ కుమార్ ప్రసాద్, సీఎం ప్రధాన సలహాదారు అజేయ కల్లం, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రజల్లో అపోహలు సృష్టించే కుట్ర ► ప్రజలకు ఇంత మేలు చేయాలని ప్రభుత్వం ఈ కార్యక్రమం ప్రారంభిస్తుంటే ప్రతిపక్షం, దానికి కొమ్ము కాసే మీడియా ప్రజల్లో అనుమానాలు రేకెత్తించడం ద్వారా దీనికి అవాంతరాలు కల్పించాలని కుట్ర పన్నింది. ఇందులో భాగంగానే దీనిపై విష ప్రచారానికి పూనుకుని తప్పుడు కథనాలు ప్రచురిస్తోంది. ► ఈ కుట్రపూరిత అసత్య వార్తలు, విష ప్రచారం పట్ల అప్రమత్తంగా ఉండాలి. అపోహలు, అనుమానాలు సృష్టిస్తున్న అంశాలను గుర్తించి ప్రజలను చైతన్య పరుస్తూ, సమగ్ర సర్వే వల్ల ప్రజలకు కలిగే ప్రయోజనాలను తెలియజేయాలి. -
ఏడు రోజుల్లోనే కొత్త పాస్ పుస్తకం : కేసీఆర్
సాక్షి, మేడ్చల్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘ధరణి’పోర్టల్ రైతు ముంగిట్లోకి వచ్చింది. సాగు భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించిన ధరణి పోర్టల్‌ను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గురువారం మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 570 (హైదరాబాద్ జిల్లా మినహా) మండలాల్లో ఈ సేవలు నేటి నుంచి రైతులకు అందనున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా జారీ చేసిన 59.46 లక్షల ఖాతాలు... 1.48 కోట్ల ఎకరాల విస్తీర్ణానికి సంబంధించి మాత్రమే రిజిస్ట్రేషన్లు జరుగనున్నాయి. పెండింగ్‌లో ఉన్న పార్ట్ బీ కేటగిరీ భూముల విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. నవంబర్ 2 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. ఆన్లైన్ విధానంలో ఒకేసారి వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు జరుగనున్నాయి. దేశానికి మార్గదర్శకం : సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్ ప్రారంచిన తర్వాత సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ధరణి పోర్టల్ దేశానికే మార్గదర్శకం అన్నారు. ఇది పూర్తి పారదర్శకంగా ఉంటుందన్నారు. ఏ దేశంలో ఉన్నా మీ భూమి వివరాలను ధరణి పోర్టల్‌లో నమోదు చేసుకోవచ్చని చెప్పారు. ధరణి పోర్టల్ ద్వారా భూములు గోల్మాల్ అయ్యే అవకాశమే లేదన్నారు. గతంలో ఢిల్లీ సెంట్రల్ రైల్వేస్టేషన్ భూములను కూడా అక్రమ రిజిస్ట్రేషన్లు చేసుకునేవారని, ధరణి పోర్టల్ ద్వారా అలాంటి అక్రమ రిజిస్ట్రేషన్లకు అడ్డుకట్టు వేశామన్నారు. ఇకపై రిజిస్ట్రేషన్ కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేదన్నారు. ఎమ్మార్వో కార్యాలయంలోనే రిజిస్ట్రేషన్లు చేసుకునే అవకాశం కల్పించామని తెలిపారు. డాక్యుమెంట్ రైటర్లను కూడా రాబోయే పది రోజుల్లో నియమిస్తామని హామీ ఇచ్చారు. ఎంత ఫీజు వసూలు చేయాలో కూడా ప్రభుత్వమే నిర్ణయిస్తుందన్నారు. 15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ పూర్తవుతుందన్నారు. కొత్త పాస్ పుస్తకం ఏడు రోజుల్లోనే ఇంటికి వస్తుందని సీఎం కేసీఆర్ చెప్పారు. -
రెవెన్యూలో నవశకం
భూ పరిపాలనలో కీలక మార్పులకు ధరణి వేదిక కానుంది. భూ రికార్డుల నిర్వహణ, ఆర్వోఆర్ (రికార్డ్స్ ఆఫ్ రైట్స్), రిజిస్ట్రేషన్ వ్యవహారాలు... భూ పరిపాలనలో ఈ మూడు ప్రధానం. ఇకపై వీటన్నింటికీ ఒకే ఒక సమాధానం ధరణి. ఈ పోర్టల్‌నే భూ హక్కుల రికార్డుగా పరిగణిస్తూ కొత్త చట్టంలో పేర్కొన్నందున ఇప్పటివరకు ఉన్న మాన్యువల్ రికార్డులు అప్రాధాన్యం కానున్నాయి. సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘ధరణి’పోర్టల్‌ను గురువారం రైతు ముంగిట్లోకి తెస్తోంది. అధికార అంచెల్లో... అధికారాల్లోనూ కోత విధిస్తూ రూపొందించిన భూ హక్కులు, పాస్ పుస్తకాల చట్టం–2020 (ఆర్వోఆర్) నేటి నుంచి మనుగడలోకి రానుంది. ఇన్నాళ్లు కొనసాగిన మాన్యువల్ రికార్డులకు ముగింపు పలుకుతూ, డిజిటల్ ఆధారిత భూ రికార్డుల నిర్వహణకు నడుం బిగించింది. అవినీతి వేళ్లూనుకున్న రెవెన్యూ శాఖను సమూలంగా సంస్కరించాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం, ఆర్వోఆర్ 1971 స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం ద్వారా రెవెన్యూలో ప్రజలకు సులభతర సేవలందించే దిశగా విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. పహాణీ, సేత్వార్ల నకలు కావాలన్నా.. పైసలిస్తే కానీ పని కాదనే ఆరోపణలకు ఫుల్స్టాప్ పెడుతూ.. ఇక రికార్డులను ఎవరైనా, ఎక్కడి నుంచైనా ఆన్లైన్లో తెలుసుకునేలా ధరణిని అందుబాటులోకి తెచ్చారు. గ్రామస్థాయిలో వీఆర్వో వ్యవస్థను రద్దు చేసిన సర్కారు.. అప్పీలేట్ ఆథారిటీని ఎత్తివేసి ఆర్డీవోలను నామ్‌కే వాస్తే గా మార్చింది. దీంతో రెవెన్యూలో ఇకపై మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలోని విభాగాలే క్రియాశీలకంగా వ్యవహరించనున్నాయి. భూ రికార్డుల నిర్వహణ కేవలం కంప్యూటర్ ఆధారిత భూ రికార్డులను మాత్రమే నిర్వహించే రెవెన్యూశాఖ... మ్యాన్యువల్ రికార్డుల నిర్వహణ నుంచి తప్పుకోనుంది. పహానీ నకలును పొందేందుకు రైతులు తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితి ఉండేది. సిబ్బంది చేతులు తడిపితే కానీ రికార్డు చేతికందేది కాదు. ఈ పరిస్థితి నుంచి రైతులకు ఊరట కలుగనుంది. ఆన్లైన్లోనే భూ రికార్డులను ఎప్పుడైనా చూసి తెలుసుకునే వీలు కలుగనుంది. ఒకే భూమికి వేర్వేరు రికార్డులు చూపుతున్న తరుణంలో ధరణితో ఈ సమస్యకు ఫుల్స్టాప్ పడనుంది. ఇకపై అది ప్రైవేటా, ప్రభుత్వ భూమా అనేది ఇట్టే తెలిసిపోనుంది. తద్వారా భూ హక్కులపై సందిగ్థతకు తెరపడనుంది. రికార్డ్స్ ఆఫ్ రైట్స్ ప్రస్తుతం భూ హక్కులు పొందినా... రికార్డులకెక్కడానికి 2 నుంచి 6 నెలల సమయం పడుతోంది. మ్యుటేషన్, పాస్ పుస్తకాల జారీలో జరిగే జాప్యానికి ‘ధరణి’తో ముగింపు పడనుంది. సాగు భూముల రిజిస్ట్రేషన్లను తహసీల్దార్లే నిర్వహిస్తుండడం.. అక్కడికక్కడే రికార్డుల అప్డేషన్, పీపీబీ జారీ, మ్యుటేషన్ ప్రక్రియ కూడా అర గంటలొనే పూర్తి కానుంది. ధరణి దేశానికే దిక్సూచిలా నిలుస్తుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రిజిస్ట్రేషన్లు రిజిస్ట్రేషన్ల నిర్వహణను ప్రభుత్వం సులభతరం చేసింది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేయడం.. రెవెన్యూ కార్యాలయాలకు డేటా అనుసంధానించకపోవడం, రికార్డుల బదలాయింపులో తీవ్ర జాప్యం జరగడం, భూ హక్కుల పరిశీలనాధికారం ఎస్ఆర్వోలకు లేకపోవడం, డబుల్ రిజిస్ట్రేషన్లు జరగడంతో భూ వివాదాలకు ఆజ్యం పోసింది. వీటిన్నింటికి మంగళం పాడేలా.. సాగు భూముల రిజిస్ట్రేషన్ల అధికారం తహసీల్దార్లకే కట్టబెట్టారు. దీంతో కేవలం డీడ్‌లే గాకుండా.. హక్కులపై కూడా వారికి సంపూర్ణమైన అవగాహన కలుగనుంది. ధరణిలో ఉన్న రికార్డుల మేరకే రిజిస్ట్రేషన్లు చేస్తున్నందున తగాదాలకు చోటుండదు. అధికారులకు పవర్‌కట్ రెవెన్యూ వ్యవహారాల్లో అధికారులకు ఎలాంటి అధికారులుండవు. తహసీల్దార్లు రిజిస్ట్రేషన్ సేవలు, నాలా అధికారాలకే పరిమితం కానుండగా.. ఆర్డీవోల పాత్ర ప్రశ్నార్థకంగా మారింది. రెవెన్యూ కోర్టుల రద్దుతో తహసీల్దార్లు, ఆర్డీవో, అదనపు కలెక్టర్ల నుంచి రెవెన్యూ అధికారాలను పూర్తిగా తొలగించిన ప్రభుత్వం... కొత్త రెవెన్యూ చట్టంలో తహసీల్దార్లకు కాస్తో కూస్తో అధికారాలు, బాధ్యతలు అప్పగించినా, ఆర్డీవో విధులను నిర్వచించలేదు. దీంతో ఆర్డీవోలు ఇకపై భూ సేకరణ, కలెక్టర్ సూచనల మేరకు అదనపు సేవలు అందించాల్సిందే. మరోవైపు క్షేత్రస్థాయిలో గ్రామ పరిపాలనాధికారుల (వీఆర్వో) వ్యవస్థ రద్దు చేసినందున వీరి సేవలను ఎక్కడ వినియోగించుకుంటారనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సివుంది. మూడుచింతలపల్లిలో ప్రారంభం సాగు భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించిన ధరణి పోర్టల్‌ను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గురువారం మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 570 (హైదరాబాద్ జిల్లా మినహా) మండలాల్లో ఈ సేవలు నేటి నుంచి రైతులకు అందనున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా జారీ చేసిన 59.46 లక్షల ఖాతాలు... 1.48 కోట్ల ఎకరాల విస్తీర్ణానికి సంబంధించి మాత్రమే రిజిస్ట్రేషన్లు జరుగనున్నాయి. పెండింగ్‌లో ఉన్న పార్ట్ బీ కేటగిరీ భూముల విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. -
‘భూ రికార్డుల స్వచ్ఛీకరణకు షెడ్యూల్ ఇవ్వండి’
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రామ, వార్డు సచివాలయాలు ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలందించేలా వాటిలో ఉన్న ఖాళీలకు సెప్టెంబరు లోగా పరీక్షలు నిర్వహించి, వెంటనే భర్తీ చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ కార్యక్రమాల మీద గ్రామ సచివాలయ ఉద్యోగులకు శిక్షణ ఇవ్వాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని పథకాలపై వారికి స్పష్టమైన అవగాహన ఉండాలన్నారు. ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందికి ఆన్లైన్ ద్వారా శిక్షణ ఇస్తున్నామని అధికారులు సీఎంకు తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో బయోమెట్రిక్ అటెండెన్స్ విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు సమావేశంలో అధికారులు, సీఎం జగన్‌కు తెలిపారు. అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో టాయిలెట్లు నిర్మించడంతో పాటు, వాటిని సక్రమంగా నిర్వహించాలన్నారు. మిగిలిపోయిన వార్డు సచివాలయ భవనాల నిర్మాణంపై దృష్టి పెట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. అదే విధంగా అర్బన్ హెల్త్ క్లినిక్స్‌పైనా శ్రద్ధ చూపాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, వాటి మార్గదర్శకాలను డిజిటల్ బోర్డుల ద్వారా గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంచాలన్నారు సీఎం జగన్. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆధార్ సెంటర్ల ఏర్పాటు చేయాలని సీఎం కోరగా, అందుకు కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరించిందని అధికారులు తెలిపారు. (కొత్తగా 2.90 లక్షల బియ్యం కార్డులు) నెల రోజుల్లో పరిష్కారం.. గ్రామ, వార్డు సచివాలయాలు ద్వారా ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చేందుకు 90 రోజుల సమయం పెట్టుకున్నామన్నారు సీఎం జగన్. ఒక నెలలో వచ్చిన దరఖాస్తులను అదే నెలలో పరిష్కరించే విధంగా యాక్షన్ ప్లాన్‌కు సన్నద్ధం కావాలన్నారు. నెల రోజుల్లో ఆయా దరఖాస్తులు పరిష్కరించి ఇంటి స్థలం పట్టా ఎక్కడ ఇవ్వాలి అనేది నిర్ణయించాలన్నారు. అవసరమైన భూమి సేకరించడం తదుపరి కార్యక్రమాలన్నీ మిగిలిన సమయంలో పూర్తి చేసుకోవాలన్నారు. ఫలితంగా 90 రోజుల్లోగా అనుకున్న సమయానికి ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వగలమని.. లేదంటే దరఖాస్తులు పేరుకుపోతాయని తెలిపారు. నిర్ణీత సమయంలో దరఖాస్తులు పరిష్కారం కాకపోతే, కారణాలు ఏమిటన్నది సీఎం కార్యాలయానికి తెలపాలన్నారు. రికార్డుల ప్రక్షాళన.. ల్యాండ్ రెవిన్యూ రికార్డుల ప్రక్షాళనకు ఒక షెడ్యూల్ ప్రకటించాలన్నారు సీఎం జగన్. ఆ షెడ్యూల్‌ను తనకు నివేదించాలని తెలిపారు. ఏ గ్రామానికి సంబంధించిన రికార్డులు అదే గ్రామంలో ఉంటే సమస్యలు తగ్గుతాయన్నారు. -
‘సర్వే’త్రా నిరీక్షణ!
సాక్షి, హైదరాబాద్: గట్టు తగవుల గుట్టు విప్పాలన్నా... భూవివాదాలకు తెరదించాలన్నా.. శిఖం పంచాయితీలకు ఫుల్స్టాప్ పెట్టాలన్నా... ఆక్రమణల నిగ్గు తేల్చాలన్నా... భూసేకరణ చేపట్టాలన్నా... అన్నింటికీ సర్వరోగ నివారిణి భూసర్వేనే. కానీ, రాష్ట్రంలో సర్వేత్రా సర్వేయర్ల కొరత పీడిస్తోంది. భూముల కొలతల చిక్కులకు శాశ్వత పరిష్కారం చూపే సర్వే వ్యవస్థే పరోక్షంగా భూవివాదాలకు కారణమవుతోందన్న విమర్శలున్నాయి. సర్వే ప్రక్రియ పూర్తి చేస్తే కొలిక్కి వచ్చే వివాదాలు కూడా సుదీర్ఘకాలం పెండింగ్‌లో ఉంటున్నాయి. భూసర్వే, రికార్డుల (సర్వే, ల్యాండ్ రికార్డ్స్) అనే ఈ కీలక విభాగాన్ని పాలకులు గాలికి వదిలేశారని రైతులు విమర్శిస్తున్నారు. సర్వేయర్ల భర్తీ, అవసరమైన సామగ్రి, సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చడం వంటి అంశాలను ప్రభుత్వాలు ఏళ్లుగా పట్టించుకోవడంలేదని విచారం వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా రైతుగానీ, పరిశ్రమల స్థాపనకుగానీ భూసర్వే చేయించుకోవడం గగనమైపోయింది. చాలాచోట్ల సర్వేయర్లు దొరకడంలేదు, దొరికినా.. వారి గొంతెమ్మ కోర్కెలు తీరిస్తేగానీ భూముల సర్వే జరిగే పరిస్థితి లేకుండాపోయింది. సగం పోస్టులు ఖాళీ..! రాష్ట్రవ్యాప్తంగా సగటున మూడు మండలాలకు ఒక సర్వేయర్ ఉన్నారు. అంటే... సర్వేయర్ల కొరత ఎంత తీవ్రంగా ఉందో దీనిని బట్టి అర్థమవుతోంది. ఇక మండలానికి ఇద్దరు చొప్పున ఉండాల్సిన చైన్మెన్ల జాడేలేదు. 35 ఏళ్ల క్రితం ఉన్న ఉద్యోగుల నిష్పత్తినే ఇంకా కొనసాగిస్తుండటం, ఆ పోస్టుల్లోనూ భారీగా ఖాళీలు ఉండటం భూముల సర్వేపై తీవ్ర ప్రభావం చూపుతోంది. 1985లో మండల వ్యవస్థ పురుడుపోసుకోవడంతో అప్పటివరకు తాలూకాకు కొనసాగిన ఒక సర్వేయర్‌ను కాస్త మండల పరిధిలో చేర్చారు. ఒక మండల విధులేగాకుండా పాత తాలూకా పరిధిలోని అన్ని మండలాల బాధ్యతలను ఆ సర్వేయర్‌కే అప్పగించారు. అదే స్థితిని నేటికీ కొనసాగిస్తుండటంతో భూముల సర్వేలో ఎడతెగని జాప్యం ఏర్పడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ కేటగిరీల్లో 1,697 పోస్టులుండగా ఇందులో 965 మందే పనిచేస్తున్నారు. మిగతా 732 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏడాది క్రితం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 253 మంది ఎంపిక కాగా, ఇందులో 130 మంది ఇతర ఉద్యోగాలకు వెళ్లిపోయారు. అప్పట్లో వివాదాలు.. విధులు తక్కువే నాలుగైదు దశాబ్దాల క్రితం వరకు భూవివాదాల సంఖ్య అంతంత మాత్రమే. దీంతో భూముల సర్వేలో పెద్దగా తలనొప్పులుండేవికావు. కాలక్రమేణా భూముల విలువలు అమాంతం పెరిగిపోవడంతో సర్వేయర్లపై కూడా పనిభారం పెరిగింది. గజం జాగాకు కూడా పోటీపడటం.. భూ ఆక్రమణలు, దాయాదుల మధ్య వివాదాలు, సరిహద్దు తగాదాలు, సర్వేనంబర్ ఒకచోట భూమి మరోచోట ఉండటం, భూముల పంపకంలో తేడాలతో ఒక్కసారిగా భూముల సర్వేకు డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలోనే భూముల వాటా లెక్క తేల్చాలని, సరిహద్దులు గుర్తించాలని, హద్దురాళ్లు ఏర్పాటు చేయాలని భూరికార్డుల సర్వే విభాగాన్ని ఆశ్రయించేవారి సంఖ్య కూడా పెరుగుతూ వచ్చింది. జిల్లాల పునర్విభజన జరిగినా, కొత్త జిల్లాలకు అనుగుణంగా సిబ్బందిని ప్రభుత్వం కేటాయించనేలేదు. పాత జిల్లాల సిబ్బందినే సర్దుబాటు చేసింది. కొత్త జిల్లా కేంద్రాల ఏర్పాటుతో ఆయా ప్రాంతాల్లోనూ భూముల విలువ విపరీతంగా పెరిగింది. గతంలో ఉన్న సమస్యలకు ఇవి కూడా జత కలిశాయి. నాలుగోవంతు మండలాల్లో కొరత ఒక మండలాన్ని పరిశీలిస్తే సగటున సర్వేయర్, ఇద్దరు చైన్మన్లు ఉండాలి. కానీ, రాష్ట్రంలో నాలుగోవంతు మండలాల్లో సర్వేయర్ల కొరత ఉంది. దీంతో ఆయా మండల సర్వేయర్లకే అదనపు బాధ్యతలు అప్పగించడం, ఒక్కో సర్వేయర్ పరిధిలో మూడు, నాలుగు మండలాలు ఉండటంతో సర్వే దరఖాస్తులను పరిశీలించడానికి కూడా సమయం సరిపోవడం లేదు. సర్వేయర్‌ను ఫీల్డ్‌కు తీసుకొచ్చి సర్వే చేయించుకోవడానికి రైతులు ఏళ్ల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి దాపురించింది. ‘మూలిగే నక్కపై తాటిపండు పడిన’చందంగా.. ప్రభుత్వం సాగునీటి, ఫార్మా, పవర్ ప్రాజెక్టుల భూసేకరణకు ఈ సర్వేయర్లను మళ్లించడంతో సమస్య మరింత జటిలమైంది. రహదారుల విస్తరణ, వక్ఫ్, దేవాదాయ, అటవీ, భూదాన్ తదితర కేటగిరీ వారీగా భూముల సర్వే చేపట్టడం కూడా సర్వే సిబ్బందిపై అదనపు భారంగా మారింది. ప్రభుత్వ ప్రాధాన్యత సర్వేలను మొదటగా చేపట్టాల్సి రావడంతో రైతుల భూసర్వేలను పక్కనపెట్టాల్సి వస్తోంది. క్రమపద్ధతిలో దరఖాస్తులను పరిశీలించి సర్వే నిర్వహించాల్సిన సర్వేయర్లు కొందరు ఇవేవీ పట్టించుకోకుండా పలుకుబడి కలిగిన మోతుబరులు, చేయి తడిపేవారికి సంబంధించిన సర్వేలను ముందు కానిచ్చేస్తున్నారు. ఏమీ ఇచ్చుకోలేని చిన్న, సన్నకారు రైతన్నలు నెలల తరబడి తిరిగితే తప్ప సర్వే చేయించుకోలేకపోతున్నారు. సర్వే నిమిత్తం భూమి వద్దకు రావాలంటే సదరు సర్వేయర్‌కు వాహన సౌకర్యం, గొలుసు ఇతరత్రా సేవలను రైతులే సమకూర్చాల్సి వస్తోంది. -
సర్వే రాళ్ల ఖర్చు కూడా సర్కారుదే
-
భూముల సమగ్ర సర్వే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అస్తవ్యస్తంగా ఉన్న రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన, భూ వివాదాలు, పొలం గట్ల సమస్యలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా భూముల సమగ్ర రీసర్వే ప్రాజెక్టును వీలైనంత త్వరగా ప్రారంభించి వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలోని 17,000 రెవెన్యూ గ్రామాల్లో 3.32 కోట్ల ఎకరాల భూమిని పూర్తిగా రీసర్వే చేసి ప్రతి సర్వే నంబరుకు పక్కాగా సరిహద్దు రాళ్లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. రీసర్వే కోసం రైతులపై నయాపైసా కూడా భారం మోపవద్దని, దీనికోసం అయ్యే మొత్తం ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని సీఎం స్పష్టం చేశారు. సర్వే నంబర్లవారీగా నాటే నంబరు రాళ్ల ఖర్చును కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. భూముల సమగ్ర రీసర్వేపై తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ సోమవారం సమీక్షించారు. నాలుగు దశల్లో రీ సర్వే పూర్తి చేద్దామని రెవెన్యూ అధికారులు ప్రతిపాదించగా ప్రజాప్రయోజనాల రీత్యా ఇది చాలా ముఖ్యమైన, అత్యవసరమైన ప్రాజెక్టు కాబట్టి మూడు విడతలకు కుదించి త్వరగా పూర్తి చేద్దామని సీఎం పేర్కొన్నారు. సుదీర్ఘంగా సాగిన తన పాదయాత్రలో భూ వివాదాలకు సంబంధించి ప్రజల నుంచి పలు ఫిర్యాదులు అందాయని సీఎం గుర్తు చేసుకున్నారు. మొదటి విడత కింద 3,000 రెవెన్యూ గ్రామాల్లో రీసర్వే చేపట్టనున్నారు. రెండు, మూడు విడతల్లో 7 వేల చొప్పున రెవెన్యూ గ్రామాల్లో సర్వే నిర్వహిస్తారు. సమగ్ర రీసర్వే ప్రాజెక్టు చేపట్టాలని నిర్ణయం తీసుకోవడానికి కారణాలు, దీనివల్లే ఒనగూరే ప్రయోజనాలు, రాష్ట్రంలో భూ రికార్డుల పరిస్థితి తదితర అంశాలపై సమావేశంలో సుదీర్ఘ చర్చ సాగింది. ఇందులో ముఖ్యాంశాలు ఇవీ... స్వాతంత్రానికి పూర్వం సర్వే,.. ► 1900 – 1920 మధ్య బ్రిటీష్ హయాంలో దేశంలో భూములను సర్వే చేసి రీసర్వే సెటిల్మెంట్ రిజిస్టర్ (ఆర్ఎస్ఆర్) రూపొందించారు. తర్వాత భూముల క్రయ విక్రయాలు, వారసత్వ మార్పులు లక్షల సంఖ్యలో జరిగినా సరిగా నమోదు కాలేదు. కొందరు రికార్డులను ట్యాంపరింగ్ కూడా చేశారు. ► తప్పుల తడకలుగా ఉన్న రికార్డుల ప్రక్షాళన/ స్వచ్ఛీకరణ, భూముల సరిహద్దు వివాదాల పరిష్కారానికి రీసర్వే తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. ► రాష్ట్రంలో వాస్తవంగా ఉన్న భూమికి, రెవెన్యూ రికార్డుల్లో గణాంకాలకూ మధ్య భారీ వ్యత్యాసం ఉంది. రెవెన్యూ శాఖ అత్యంత ప్రామాణికంగా పరిగణించే రీసర్వే సెటిల్మెంట్ రిజిష్టర్ (ఆర్ఎస్ఆర్), భూ అనుభవ రిజిష్టర్ (అడంగల్) మధ్య కూడా చాలా తేడా ఉంది. భూకమతాలు, సబ్డివిజన్ల మధ్య కూడా వ్యత్యాసం ఉంది. ► ఈ సమస్యలన్నిటినీ పరిష్కరించి రికార్డులను ప్రక్షాళన చేయటం కోసం రాష్ట్రంలో భూములన్నీ సమగ్రంగా రీ సర్వే చేసి భూ యజమానులందరికీ శాశ్వత హక్కులు కల్పిస్తామని వైఎస్సార్ సీపీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొంది. ఈ హామీ అమలులో భాగంగా శాశ్వత భూ హక్కుల చట్టాన్ని తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం రీ సర్వేకు ప్రణాళిక రూపొందించింది. భూముల సమగ్ర రీసర్వేపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోర్టు కేసుల్లో 60 శాతానికిపైగా భూ వివాదాలే ► భూ రికార్డులు అస్తవ్యస్తంగా మారడం, సరిహద్దులు చెరిగిపోవడంవల్ల భూ వివాదాలు భారీగా పెరిగాయి. కోర్టు కేసుల్లో 60 శాతానికిపైగా భూవివాదాలకు సంబంధించినవే ఉన్నాయి. ► ముఖ్యమంత్రి, రెవెన్యూ అధికారులు ప్రతివారం నిర్వహించే స్పందన ఫిర్యాదుల్లో అత్యధికం భూ, సర్వే సమస్యలకు సంబంధించినవే ఉంటున్నాయి. ► ప్రతి 30 ఏళ్లకు రీసర్వే చేసి సర్వే సెటిల్మెంట్ – ల్యాండ్ రికార్డులు స్వచ్ఛీకరించాల్సి ఉన్నా భారీ ఖర్చుతో కూడిన వ్యవహారం కావడంతో ఏ ప్రభుత్వం కూడా ఇందుకు సాహసించలేదు. దీనివల్ల వివాదాలు జటిలమై సివిల్ వివాదాలు కాస్తా క్రిమినల్ కేసులుగా మారుతున్నాయి. ► వాస్తవంగా ఉన్న భూమికి, రికార్డుల్లో ఉన్న దానికి మధ్య తేడాలను పక్కాగా గుర్తించి వాస్తవ విస్తీర్ణానికి అనుగుణంగా రికార్డులను సరిచేయకుంటే వివాదాలు ఇంకా పెరుగుతాయి. అందువల్ల రీసర్వే తప్పనిసరని పేర్కొంటూ ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. ► సమావేశంలో ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజేయ కల్లం, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి, సర్వే, ల్యాండ్ రికార్డ్స్ ఇన్‌ఛార్జి కమిషనర్ సిద్ధార్థ జైన్, రాష్ట్ర భూ పరిపాలన సంయుక్త కమిషనర్ చెరుకూరు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ‘కార్స్’ టెక్నాలజీని వినియోగిస్తున్న తొలి రాష్ట్రం ఏపీ... ► ఇప్పటికే ఉన్న సుమారు 2,200 మంది సర్వేయర్లతోపాటు కొత్తగా నియమించిన 11,158 మంది గ్రామ సర్వేయర్లకు అధునాతన ‘‘కంటిన్యూస్లీ ఆపరేటింగ్ రిఫరెన్స్ స్టేషన్ (కార్స్)’’ టెక్నాలజీపై ప్రభుత్వం శిక్షణ కూడా ఇప్పించింది. ► ఇప్పటివరకు మలేషియా, సింగపూర్, అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లో మాత్రమే ఈ టెక్నాలజీని వినియోగించారు. ► మన దేశంలో ఈ టెక్నాలజీని వినియోగిస్తున్న తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కావడం గమనార్హం. ► రాష్ట్రంలోని మొత్తం 17,000 రెవెన్యూ గ్రామాల్లో 3.32 కోట్ల ఎకరాల భూమిని కచ్చితంగా కొలతలు వేసి సర్వే నంబర్ల వారీగా నంబరు రాళ్లు పాతుతారు. ఈ వివరాలను డిజిటలైజ్ చేసి భద్రపరుస్తారు. దీంతో ట్యాంపరింగ్ చేయడానికి వీలుకాదు. ► కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలో 25 గ్రామాల పరిధిలోని 66,761 ఎకరాల రీసర్వే పైలెట్ ప్రాజెక్టు పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. దీన్ని పరిశీలించి రాష్ట్రమంతా అమలు చేస్తారు. ► భూముల అమ్మకాలు, కొనుగోళ్ల రిజిస్ట్రేషన్ల ప్రకారం నిర్దిష్ట సమయంలో మ్యుటేషన్ చేస్తారు. దీంతో ఎప్పటికప్పుడు రికార్డులు అప్డేట్ అవుతుంటాయి. ► గ్రామ సచివాలయాలవారీగా భూముల సమగ్ర రీసర్వే ప్రక్రియ అమలు చేస్తారు. ► సర్వే సందర్భంగా వివాదాలు తలెత్తితే పరిష్కరించేందుకు డిప్యూటీ కలెక్టర్లతో మొబైల్ కోర్టులు ఏర్పాటు చేస్తారు. డిజిటల్ రికార్డులు.... ► రికార్డుల స్వచ్ఛీకరణ/ ప్రక్షాళన సర్వే వివరాలు ఎప్పటికప్పుడు డిజిటల్ పద్ధతిలో భద్రపరిచే ఏర్పాటు చేస్తారు. ► డేటాను తారుమారు చేయడానికి వీల్లేని విధంగా మూడు నాలుగు చోట్ల భద్రపరిచే వ్యవస్థ ఏర్పాటు చేస్తారు. ► భూముల క్రయ విక్రయ రిజిస్ట్రేషన్లు జరిగిన వెంటనే నిర్దిష్ట సమయంలో ఆటో మ్యుటేషన్ (రెవెన్యూ రికార్డుల్లో మార్పులు) చేస్తారు. -
రీసర్వేతో భూవివాదాలకు చరమగీతం
సాక్షి, అమరావతి: భూవివాదాలకు ఏమాత్రం ఆస్కారంలేని విధంగా రెవెన్యూ సంస్కరణల అమలు దిశగా సర్కారు చర్యలు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా పూర్తిస్థాయిలో భూ రికార్డుల ప్రక్షాళన (స్వచ్ఛీకరణ)కు శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ప్రతి రెవెన్యూ గ్రామానికి ముగ్గురితో బృందాలను నియమించింది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత దోషరహిత రికార్డుల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర రీసర్వేని చేపట్టనుంది. 120 ఏళ్ల క్రితం బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో దేశవ్యాప్తంగా భూములను సర్వే చేసి రీసర్వే రిజిష్టర్ (ఆర్ఎస్ఆర్) తయారు చేశారు. నేటికీ ఇదే ప్రామాణికంగా ఉంది. ప్రతి 30 ఏళ్లకు రీసర్వే చేయాల్సి ఉన్నప్పటికీ గత పాలకులు పట్టించుకోలేదు. లెక్కలేనన్ని మార్పులు చేర్పులు తరాలు మారడం, కుటుంబాలు విడిపోవడం తదితర కారణాలతో భూములు చేతులు మారడంవల్ల గత 120 ఏళ్లలో భూముల పరంగా చెప్పలేనన్ని మార్పులు జరిగాయి. ప్రభుత్వ భూములకు దరఖాస్తు పట్టాలు (డీకేటీలు) ఇవ్వడంవల్ల సబ్డివిజన్లు/ సర్వేనంబర్లు పెరిగిపోయాయి. భూమి హద్దుల విషయంలోనూ వివాదాలు పెరిగాయి. చాలాచోట్ల ప్రభుత్వ భూములు ఆక్రమణలపాలయ్యాయి. వాస్తవంగా ఉన్న భూమికీ, రెవెన్యూ రికార్డుల్లో ఉన్న దానికీ మధ్య లక్షల ఎకరాల తేడా ఏర్పడింది. భూరికార్డులు సక్రమంగా లేనందున సివిల్ కేసుల్లో భూ వివాదాలకు సంబంధించినవే 60 శాతంపైగా ఉన్నాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు. రికార్డుల స్వచ్ఛీకరణ, భూముల రీసర్వే, శాశ్వత భూ హక్కుల కల్పనే ఇలాంటి సమస్యలకు ఏకైక పరిష్కార మార్గమని నిపుణులు చెప్పడంతో జగన్ సర్కారు ఈ చర్యలకు సాహసోపోత నిర్ణయాలు తీసుకుంది. జగ్గయ్యపేటలో బేస్ స్టేషన్, రీసర్వే 18న ప్రారంభం రాష్ట్ర వ్యాప్తంగా భూములను సమగ్ర రీసర్వే చేయాలని నిర్ణయించిన జగన్ సర్కారు కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలో పైలట్ ప్రాజెక్టుకు ఈనెల 18న (మంగళవారం) శ్రీకారం చుట్టనుంది. ఆరోజు ఉదయం 11 గంటలకు జగ్గయ్యపేటలో బేస్ స్టేషన్‌ను ప్రారంభించి తక్కెళ్లపాడులో రీసర్వే పైలట్ ప్రాజెక్టును ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రారంభిస్తారు. తదుపరి మండలంలోని 25 గ్రామాల్లోగల 66,761 ఎకరాల భూముల్లో రీసర్వే పూర్తి చేస్తారు. ఇక్కడ వచ్చే అనుభవాలతో అవసరమైన మార్పులతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం త్వరితగతిన ప్రక్రియను చేపట్టనుంది. రైతులపై నయాపైసా భారం లేదు: ఉప ముఖ్యమంత్రి బోస్ ప్రస్తుతం ఎవరైనా రైతు తన భూమిని సర్వే చేయించుకోవాలంటే మీసేవలో రుసుం చెల్లించాలి. అయితే భూముల సమగ్ర రీసర్వే ప్రాజెక్టుకు రూ.2000 కోట్ల వ్యయం అవుతున్నా రైతులపై నయాపైసా కూడా భారం మోపకుండా మొత్తం ప్రభుత్వమే భరించాలని సీఎం జగన్ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు. అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా దేశాల్లో వినియోగించిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో సమగ్ర రీ సర్వేకు వినియోగిస్తున్నట్టు బోస్ ‘సాక్షి’కి తెలిపారు. 2022 మార్చి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా సర్వే పూర్తి చేసి పటిష్టమైన నూతన రెవెన్యూ రికార్డులు రూపొందిస్తామన్నారు. -
భూ రికార్డుల తారుమారుపై ప్రత్యేక సిట్
-
రైతుల భూములకు పూర్తి భద్రత
నెల్లూరు (అర్బన్): రాష్ట్రంలో భూ రికార్డులను ల్యాండ్ ప్యూరిఫికేషన్ (భూ రికార్డుల ప్రక్షాళన) చేసి వెబ్ ల్యాండ్ రికార్డుల్లో నమోదు చేయనున్నామని ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ శాఖ) పిల్లి సుభాష్‌చంద్రబోస్ చెప్పారు. శనివారం గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరకువాడ శ్రీరంగనాథరాజుతో కలిసి నెల్లూరు జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. అత్యాధునిక సాంకేతికతతో వెబ్ ల్యాండ్ ప్రక్రియ జరుగుతోందన్నారు. దీనివల్ల రైతుల భూముల రికార్డులు పక్కాగా ఉంటాయని తెలిపారు. జూలై నుంచి మూడు నెలల పాటు భూములకు సంబంధించి ఆడిట్ నిర్వహిస్తామన్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆంధ్రప్రదేశ్‌లో భూ రైతు యాజమాన్య హక్కు చట్టాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తెస్తున్నారన్నారు. తద్వారా రైతుల భూమికి పూర్తి భద్రత కలుగుతుందని చెప్పారు. ఇంటి స్థలాలు కోరుతూ 28 లక్షల దరఖాస్తులు గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో ఇళ్ల స్థలాల కోసం సుమారు 28 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 12 లక్షల ఇళ్లు మంజూరు చేయనుందని చెప్పారు. దరఖాస్తు చేసుకున్న పేదలందరికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో ఇళ్ల నిర్మాణం, ఇంటి స్థలం ఇస్తామని చెప్పారు. జల వనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ మాట్లాడుతూ చుక్కల భూములు, సీజేఎఫ్ఎస్ డీ ఫాం పట్టా భూముల్లో నివాసముంటున్న వారి పేరిట సంబంధిత భూములను క్రమబద్ధీకరించాలని ఉప ముఖ్యమంత్రిని కోరారు. సమావేశంలో ఎంపీలు ఆదాల ప్రభాకర్‌రెడ్డి, బల్లి దుర్గాప్రసాద్, ఎమ్మెల్యేలు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య, వరప్రసాద్, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్ కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. -
త్వరలో పట్టాదారు కార్డులు
సాక్షి, అమరావతి: నకిలీ పట్టాదారు పాసు పుస్తకాలకు చెక్ పెట్టేందుకు ప్రతి రైతు/భూ యజమానికి ఏటీఎం కార్డు తరహాలో పట్టాదారు కార్డులు అందజేయాలని రెవెన్యూ శాఖ సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ ప్రతిపాదిత కార్డు పాన్‌కార్డు పరిమాణంలో ఉండి.. దానిపై భూ యజమాని పేరు, చిరునామా ఉంటుంది. చిన్న డిజిటల్ చిప్ అమర్చడం వల్ల కార్డును స్వైప్/స్కాన్ చేస్తే సదరు రైతుకు ఏ గ్రామం/పట్టణంలోని ఏయే సర్వే నంబర్లలో ఎంత భూముందో కనిపిస్తుంది. భద్రత ప్రమాణాలతో కూడిన పట్టాదారు కార్డు ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో ఇది ఎలా ఉండాలి? ఒక్కో దానికి ఎంత ఖర్చవుతుంది? అనే అంశాలపై రెండు సంస్థలతో సంప్రదింపులు జరిపారు. పారదర్శకంగా టెండర్లు నిర్వహించి తక్కువ ధరకు పొందేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. నకిలీలకు అడ్డుకట్ట వేసేలా రెవెన్యూ శాఖలో భూ రికార్డులు తప్పుల తడకలుగా ఉన్నందున ప్రక్షాళన చేయాలని రెవెన్యూ శాఖ ఇప్పటికే మార్గదర్శకాలిచ్చింది. వచ్చే ఏడాది మే నెలాఖరుకి రికార్డుల్ని పూర్తిగా స్వచ్ఛీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది పూర్తైన వెంటనే పట్టాదారు పాసు పుస్తకం స్థానంలో కార్డులు ఇస్తారు. నకిలీలకు, ట్యాంపరింగ్‌కు అవకాశం లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్డులు ఇవ్వాలని నిర్ణయించామని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ‘సాక్షి’కి తెలిపారు. -
స్వామి భూములు స్వాహా
సాక్షి, ఒంగోలు : ప్రతిష్టాత్మక ఆలయాలకు జిల్లా పెట్టింది పేరు. చారిత్రత విశేషాలకు, మహిమలకు నిలయమైన భైరవ కోన, త్రిపురాంతకంలోని త్రిపురాంతకేశ్వర ఆలయాలు, సింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి ఆలయం నుంచి మాలకొండ, మిట్టపాలెం, మార్కాపురం చెన్నకేశవుడు.. ఇలా అనేక మహిమాన్విత దేవాలయాలు ప్రకాశం జిల్లాలో కొలువై ఉన్నాయి. దాదాపు 150కి పైగా ఆలయాలు దేవదాయ శాఖ పరిధిలో ఉన్నాయి. ప్రతి ఆలయానికి ఎంతో కొంత భూమిని ఆలయ ఉద్ధరణ కోసం, పూజాదికాల నిర్వహణ కోసం పెద్దలు బహూకరించారు. నిత్య ధూప దీప నైవేద్యాల కోసం ఈ భూమిని కేటాయించారు. ఇలా జిల్లాలో అన్ని ఆలయాలకు దాదాపు 30 వేల ఎకరాలకు పైచిలుకు భూమి ఉంది. ఈ భూమిని వేలం పాటల ద్వారా కౌలుకు ఇస్తూ..దాని మీద వచ్చే ఆదాయంతో పలు ఆలయాల్లో ధూప దీప నైవేద్యాలకు వినియోగిస్తున్నారు. అయితే, ఈ భూముల కేటాయింపు వ్యవహారం, వేలం, కౌలు వసూలు తదితరాల విషయంలో పారదర్శకత కొరవడుతోంది. ఇదిలావుంటే ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులతోనే అనేక దేవాలయాల్లో పూజాదికాలు నిర్వహిస్తున్నారు. కానీ, ఎప్పటికప్పుడు సంబంధిత దేవదాయ శాఖాధికారులు ఆలయాలకు ఉన్న భూమి వివరాల విషయంలో పారదర్శకత పాటించడం లేదు. దీంతో అనేక చోట్ల దేవదాయ భూమి ఇతర ఆక్రమణదారుల ఆధీనంలోకి వెళుతోంది. 20 వేల ఎకరాల పైనే.. దేవదాయ శాఖ పరిధిలో భూ రికార్డుల నిర్వహణ పదేళ్లుగా మందగించింది. జిల్లాలో రెగ్యులర్ అసిస్టెంట్ కమిషనర్ల నియామకం జరగకపోవం, ఎఫ్ఏసీలు జిల్లాలో ఒకటి రెండు రోజులు మాత్రమే ఉండటం. దేవదాయ శాఖ మీద ఒకరిద్దరి ఆ«ధిపత్యమే కొనసాగటం దరిమిలా దేవదాయ భూముల లెక్కల నిర్ధారణ మీద ప్రత్యేకంగా చర్యలు చేపట్టలేదు. దీంతో ఏళ్ల తరబడి ఒకే వ్యక్తుల చేతుల్లో దేవదాయ శాఖ భూమి నిలిచి ఉండటంతో అనేకచోట్ల కొందరు అక్రమార్కులు దేవదాయ భూమిపై కన్నేశారు. దరిమిలా జిల్లాలో 20 వేల ఎకరాలపైనే దేవదాయ శాఖ భూమి ఆక్రమణదారుల చెరలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆన్‌లైన్‌కు నోచుకోని వైనం: దేవదాయ శాఖకు చెందిన భూములు ఆన్లైన్ చేసే వ్యవహారంలో జిల్లాకు వస్తున్న అధికారులు ఆసక్తి చూపటం లేదు. దీంతో పలుచోట్ల ఆలయ అభివృద్ధి కమిటీల చేతుల్లో భూములు బందీ అయిపోయాయి. దీంతో ఆలయాలకు రావాల్సిన ఆదాయానికి భారీ ఎత్తున గండి పడుతోంది. మండలం వారీగా దేవదాయ శాఖ పరిధిలోని ఆలయాలు, ఆలయాల వారీగా ఉన్న భూమి, ఏయే ఆలయాల ఆధీనంలోని భూమి ఆన్లైన్ చేశారు అనే విషయం మీద దేవదాయ శాఖ అధికారుల వద్ద సరైప సమాచారం లేదు. అదేవిధంగా ఏయే ఆలయాలకు చెందిన ఎంతెంత భూమి సాగులో ఉంది, సాగుకు గాను చెల్లిస్తున్న కౌలు తదితరాల మీద కూడా రికార్డుల నిర్వహణ లోపభూయిష్టంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక కొన్నిచోట్ల దేవదాయ శాఖ భూములు ఆన్లైన్ చేసేందుకు రెవెన్యూ అధికారులు కూడా ముందుకు రావటం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రైతు భరోసాతో కదులుతున్న తీగ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కౌలు రైతుల సంక్షేమం కోసం ‘రైతు భరోసా’ పథకాన్ని ప్రవేశపెట్టింది. తద్వారా కౌలు రైతులకు ఆర్ధిక సాయం అందించేందుకు చర్యలు చేపడుతుండగా, జిల్లాలో ఏయే భూములు, ఎవరెవరి భూములు ఎంతెంత కౌలులో ఉన్నాయనే విషయం మీద అధికారుల వద్ద సరైన సమాచారం లేకపోవటంతో ఈ వ్యవహారం వెలుగులోకి వస్తోంది. ఈ క్రమంలో తక్షణం దేవదాయ శాఖ ఆధీనంలోని భూమి వివరాలు, ఏయే ఆలయాల భూమి ఎవరెవరి వద్ద కౌలులో ఉందనే వివరాలను ప్రకటించాలని పలు ఆలయాల ధర్మకర్తలు కోరుతున్నారు. -
రెవెన్యూ భూములు గందరగోళం
జిల్లా రెవెన్యూ రికార్డులు గందరగోళంగా తయారయ్యాయి. ఉన్న భూమిని లేనట్లు, లేని భూమి ఉన్నట్లు ఇష్టారీతిన రికార్డులను మార్చివేశారు. ఒకటి కాదు రెండు కాదు వేలాది ఎకరాల భూములకు సంబంధించిన రికార్డులు తారుమారయ్యాయి. దీంతో జిల్లాలో రికార్డుల ప్రకారం ఉండాల్సిన భూమి కంటే దాదాపు 49,352.16 ఎకరాల భూమిని అధికంగా వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేశారు. రికార్డుల్లో లేని ఈ భూమి ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కాని పరిస్థితి. సాక్షి, కందుకూరు(ప్రకాశం) : జిల్లాలో భూముల లెక్కలకు మదర్ రికార్డు అయిన ఆర్ఎస్ఆర్ రికార్డుకు, ఆన్లైన్లో నమోదు చేసిన భూములకు ఎక్కడా పొంతన ఉండడం లేదు. జిల్లాలోని 56 మండలాల్లో ఇదే పరిస్థితి. ఒక్క మండలానికి సంబంధించిన రికార్డు కూడా సక్రమంగా లేదు. కొన్ని మండలాల్లో భూములు అధికంగా ఉంటే మరికొన్ని మండలాల్లో రికార్డు కంటే భూములు తక్కువగా ఉన్నాయి. దీంతో రికార్డు ప్రక్షాళన కార్యక్రమానికి కలెక్టర్ పోల భాస్కర్ లింగసముద్రం మండలం నుంచి శ్రీకారం చుట్టారు. అయితే ఇది ఎంత వరకు విజయవంతం అవుతుందో వేచిచూడాల్సిందే. ► ఆర్ఎస్ఆర్ రికార్డు ప్రకారం ఉండాల్సిన భూమి: 32,90,765.40 ఎకరాలు ► వెబ్‌ల్యాండ్‌లో నమోదు నమోదు చేసిన భూమి: 33,40,117.56 ఎకరాలు ఆర్ఎస్ఆర్ ప్రకారం 32,90,765.40 లక్షల ఎకరాల భూమి: ఆర్ఎస్ఆర్ రికార్డు ప్రకారం జిల్లాలో అన్ని రకాల భూములు కలుపుకుని 32,90,765.40 లక్షల ఎకరాల భూమి ఉంది. అయితే ప్రస్తుతం వెబ్‌ల్యాండ్ ప్రకారం 33,40,117.56 లక్షల ఎకరాలున్నాయి. వెబ్‌ల్యాండ్ ప్రకారం జిల్లాలో ప్రభుత్వ భూమి 11,99,686.63 లక్షల ఎకరాలు, ప్రైవేట్ భూమి 20,91,689.45 లక్షల ఎకరాలున్నాయి. అలాగే ఇనామ్ భూములు 25,886.61 ఎకరాలు, 22854.22 ఎకరాల ఇతర భూములున్నాయి. మొత్తం మీద ఆర్ఎస్ఆర్ రికార్డుకి, వెబ్‌ల్యాండ్‌లో నమోదైన భూములకు మధ్య తేడా 49,352.16 ఎకరాలు అధికంగా ఉంది. ఇంత పెద్ద మొత్తంలో లేని భూమిని ఉన్నట్లు చూపించారు. 40 మండలాల రికార్డుల్లో భూములు అధికంగా నమోదు కాగా, మిగిలిన 16 మండలాల రికార్డుల్లో ఉన్న భూమి కంటే తక్కువగా వెబ్‌ల్యాండ్‌లో నమోదైంది. ఆర్ఎస్ఆర్ రికార్డు కంటే అధికంగా భూమి నమోదైన మండలాల జాబితాలో మర్రిపూడి మండలం మొదటి స్థానంలో ఉంది. 33,315.33 ఎకరాల భూమి అధికంగా నమోదైంది. తరువాత స్థానంలో దర్శి 25225.58 ఎకరాలు, కొనకనమిట్ల 24716.61 ఎకరాలు అధికంగా నమోదు చేశారు. ఇక భూములు తక్కువగా నమోదు చేసిన మండలాల్లో కురిచేడు మండలం మొదటి స్థానంలో ఉంది. ఈ మండలంలో వెబ్‌ల్యాండ్ ప్రకారం .. మొత్తం భూములు 730002.89 ఎకరాలు ఉంటే, ఆర్ఎస్ఆర్ ప్రకారం 1,45,650.43 ఎకరాల భూములున్నాయి. అంటే దాదాపు 72,647.54 ఎకరాల భూములు తక్కువగా నమోదు చేశారు. అంటే ఇక్కడ ఆన్లైన్ సమస్యలు అధికంగా ఉన్నాయని అర్థమవుతోంది. తరువాత స్థానంలో బేస్తవారిపేట మండలంలో 41,225.16 ఎకరాలు, హనుమంతునిపాడు 18,365.64 ఎకరాల భూములు తక్కువగా నమోదు చేశారు. అలాగే ఆర్ఎస్ఆర్ రికార్డుకు, వెబ్‌ల్యాండ్‌కు దాదాపుగా సమానంగా ఉన్న మండలాలు కూడా ఉన్నాయి. వీటిలో సంతనూతలపాడు 0.48 సెంట్లు, కొరిశపాడు 6.94 ఎకరాలు తక్కువగా ఉంటే, సింగరాయకొండ 26.52 ఎకరాల భూములు అధికంగా ఉన్నాయి. ఈ మూడు మండలాలు మినహా మిగిలిన అన్ని మండలాల రికార్డులు భారీ స్థాయిలో మార్ఫింగ్‌కు గురయ్యాయి. వందల ఎకరాల భూముల వివరాలు తారుమారయ్యాయి. లింగసముద్రంతో ప్రక్షాళన ప్రారంభం: ప్రభుత్వ రెవెన్యూ రికార్డు ప్రక్షాళన కార్యక్రమాన్ని ప్రారంభించిన నేపథ్యంలో కలెక్టర్ పోల భాస్కర్ ప్రత్యేక శ్రద్ధతో కందుకూరు నియోజకవర్గంలోని లింగసముద్రం మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి భూముల రీ సర్వే ప్రారంభించారు. దాదాపు 70 మంది రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో బృందాలుగా ఏర్పడి రికార్డులను తనిఖీ చేస్తున్నారు. ఈ పరిశీలనలో అనేక అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రభుత్వ భూముల ఆక్రమణలు, నకిలీ పాస్‌పుస్తకాలతో బ్యాంకు లోన్లు పొందిన సంఘటనలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. దీంతో తమ బండారం బయటపడుతుండడంతో కొందరు అక్రమార్కులు ఏకంగా తహసీల్దార్‌నే చంపుతామని బెదిరింపులకు దిగడం గమనార్హం. అయితే ఇప్పటి వరకు కేవలం 50 శాతం సర్వే మాత్రమే అధికారులు అక్కడ పూర్తి చేయగలిగారు. అక్రమాలైతే వెలుగులోకి వస్తున్నాయి గానీ వాటిపై చర్యలు ఎంత వరకు ఉంటాయనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను వెనక్కి తీసుకుంటారా లేదా బ్యాంకుల్లో రుణాలు పొందిన వారిపై చర్యలు ఉంటాయా ఉండవా అనేది చూడాలి. ప్రస్తుతం ఈ రికార్డులను మార్పుచేయడం అంత సులభరమైన ప్రక్రియేమీ కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. క్షేత్రస్థాయి సిబ్బందిదే కీలక పాత్ర: ఇలా రికార్డులు తారుమారు కావడంలో క్షేత్ర స్థాయిలో పనిచేసే రెవెన్యూ అధికారులతే కీలక పాత్ర అని తెలుస్తోంది. ప్రధానంగా ఆన్లైన్ ప్రక్రియను అడ్డంపెట్టుకుని అక్రమాలకు పాల్ప డుతున్నట్లు రెవెన్యూ ఉన్నతాధికారులు గుర్తిస్తున్నారు. కొందరు రైతులకు ఉన్న భూమి కంటే ఆన్లైన్లో అధికంగా నమోదు చేయడం, అడంగల్, 1బి వంటి రికార్డులను మార్చడం, పాస్‌పుస్తకాల్లో అధికంగా భూములు నమోదు చేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. దీని వల్లే రికార్డుల కంటే అధికంగా భూములు నమోదవుతున్నాయి. ఇలా బ్యాంకుల్లో రుణాలు పొందడం ఇంకా మోసం. ఇలా కొంత కాలంగా రెవెన్యూ అధికారుల లీలలకు అడ్డూఅదుపు లేకుండా పోవడంతో రికార్డులు మొత్తం గందరగోళంగా తయారయ్యాయి. దీంతో భూ సమస్యలు అధికంగా నమోదవుతున్నాయి. ప్రతి సోమవారం జరిగే స్పందన కార్యక్రమానికి వచ్చే అర్జీల్లో 90 శాతం భూములకు సంబంధించిన సమస్యలే ఉండడం గమనార్హం. సంవత్సరాలు, నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా సమస్య పరిష్కారం కాదు. ఎందుకంటే రికార్డులు సక్రమంగా లేకపోవడమే. ప్రస్తుతం ప్రభుత్వం ఈ రికార్డులను సరిచేసే కార్యక్రమాన్ని ప్రారంభించడం పట్ల అభినందనలు వ్యక్తమవుతున్నాయి. -
మ్యుటేషన్.. నో టెన్షన్
రెవెన్యూ శాఖలో వేళ్లూనుకునిపోయిన అవినీతి, గత ప్రభుత్వం చేపట్టిన భూరికార్డుల సంస్కరణలు భూ యజమానుల హక్కులు.. చిక్కులుగా మారాయి. మ్యుటేషన్ (హక్కుల మార్పుల) కోసం చేసుకున్న చేసుకున్న దరఖాస్తులు కొన్నేళ్లుగా రెవెన్యూ కార్యాలయాల్లో కుప్పలు తెప్పలుగా పడిపోయి ఉన్నాయి. సిటిజన్ చార్ట్ ప్రకారం నిర్దేశిత సమయంలో దరఖాస్తులను పరిష్కరించాల్సిన రెవెన్యూ శాఖ హక్కుల పత్రాలు పరిశీలన చేయకుండా విచ్చలవిడిగా తిరస్కరించేశారు. అమ్యామ్యాలు సమర్పించిన వారివి మాత్రం పరిష్కరించారు. ఇంకా జిల్లా వ్యాప్తంగా 6 వేలకు పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితికి చెక్ పెట్టి భూ సమస్యలను సమూలంగా పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. పైలెట్ ప్రాజెక్ట్‌గా జిల్లాలో మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకుని భూ రికార్డుల ప్రక్షాళన చేపట్టనుంది. అనంతరం జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామ రికార్డులను స్వచ్ఛీకరించే ప్రణాళిక రూపొందించనుంది. సాక్షి, నెల్లూరు: జిల్లాలో భూమి రికార్డులు అస్తవ్యస్తంగా మారాయి. గత ప్రభుత్వ హయాంలో రెవెన్యూ రికార్డుల నవీకరణ పేరుతో భూములను ఇష్టానుసారంగా సబ్డివిజన్ల ప్రక్రియ చేపట్టారు. ఇలా సబ్ డివిజన్ జరిగిన భూములు తాత్కాలిక ఖాతాల్లో ఉండిపోయాయి. ఇలాంటి ఖాతాలను శాశ్వత ఖాతాలుగా మార్పుకునేందుకు యాజమానులు ఇచ్చిన వినతులు బుట్టదాఖలు అయ్యాయి. ఈ క్రమంలో దశాబ్దాలుగా యజమానుల పేరుతో ఉన్న భూముల విస్తీర్ణాలు మరొకరి ఖాతాల్లో నమోదైపోయాయి. పట్టాదారు పాస్ పుస్తకాలు మాత్రం యజమానుల దగ్గర ఉన్నా.. ఆన్లైన్ అడంగళ్‌లో మాత్రం భూములు కనిపించకపోవడం, అధిక విస్తీర్ణం ఉండడం ఇలా లోపాలు తలెత్తాయి. వీటితో పాటు కొత్తగా భూములు కొనుగోలు చేసిన, వారసత్వంగా వచ్చిన భూములకు మ్యుటేషన్ల ప్రక్రియ సాగడం లేదు. యజమానులకు తలనొప్పిగా మ్యుటేషన్ సాగుభూమి కొన్నామనే సంతోషం కొనుగోలు దారులకు దక్కాలంటే అంతా ఆషామాషీ కాదు. ఆ భూమి వారు పేరున మారాలంటే (మ్యుటేషన్) మాటల్లో అయ్యే పనికాదు. ఓ సర్వే నంబర్లో భూమి వివాదంలో ఉంటే.. ఆ పరిధిలోని అందరి భూములూ వివాదం జాబితాలోకి చేరిపోతాయి. ఫలితంగా వారికి మీ సేవ కేంద్రాల్లో అడంగళ్, 1బీ పత్రాలు రావటం లేదు. సంవత్సరం కిందట పత్రాల్లో మీ భూమి పూర్తి వివరాలుంటాయి. ఇప్పుడొకసారి పరిశీలిస్తే కొంత భూమి తగ్గిపోతుంది. అదేమని అధికారులను ప్రశ్నిస్తే దరఖాస్తు చేయండి సర్వే చేసి మార్పులు చేర్పులు చేస్తామంటారు. ఈ ప్రక్రియకు రోజులు.. నెలలు సంవత్సరాలు పట్టుతోంది. ఫలితంగా పంట రుణాలు అందక.. అప్పుల ఊబిలో రైతులు నలిగిపోతున్నారు. మ్యుటేషన్ ప్రక్రియ ఇలా.. రైతుల భూములకు సంబంధించి రికార్డుల్లో పేర్లు మార్పులు, చేర్పులు చేయాలంటే మీ–సేవలో దరఖాస్తు చేసుకోవాలి. నిబంధనల పేరుతో 30 రోజుల పాటు జాప్యం జరుగుతున్నందున రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. నెల రోజులు దాటిన మ్యుటేషన్ కాకపోవడంతో అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు. పంట రుణాలను పొందడానికి వీలు పడటం లేదు. భూముల క్రయ విక్రయాలు జరిగినా తర్వాత ఆ భూమి పేరు మారకపోతే రుణాలను పొందే అవకాశం ఉండడం లేదు. గతంలో దరఖాస్తు చేసినా.. మ్యుటేషన్ ప్రక్రియను మీ–సేవలో దరఖాస్తు చేసిన తర్వాత ఫారం–8 డ్రాప్ట్, నోటీసు వస్తుంది. 15 రోజుల తర్వాత దీనిపై విచారణ చేస్తారు. ఆ తర్వాత విచారణలో ఎలాంటి అభ్యంతరాలు లేవని వీఆర్వో, ఆర్ఐ, డీటీలు పేర్కొంటే తహసీల్దార్‌కు వెళుతుంది. అక్కడ సంతకం అయిన తర్వాత కంప్యూటరీకరణకు చేరుతుంది. ఆన్లైన్లో నవీకరించిన తర్వాత తహసీల్దార్ డిజిటల్ సంతకం చేస్తారు. ఆ తర్వాత ఆన్లైన్ పేరు మారినట్లు కనిపిస్తుంది. ఈ ప్రక్రియకు మొత్తం 30 రోజుల సమయం పడుతుంది. 30 రోజుల్లోగా పూర్తికాకపోతే ఆటో మ్యుటేషన్‌లోకి వెళుతుంది. సాంకేతికంగా ఎలాంటి సమస్యలు లేకపోతే కంప్యూటరే మ్యుటేషన్ చేస్తుంది. అయితే ఈ లోపే ఏదొక కారణంతో ఆటో మ్యుటేషన్‌కు వెళ్లకుండా అధికారులు చేస్తున్నారనేది ఆరోపణ. ఇక అక్రమాలకు అడ్డుకట్ట.. తాజాగా నూతన సర్కార్ ఏపీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్–2019ని తీసుకొచ్చింది. 1937 తర్వాత భూముల రీ సర్వే జరగలేదు. కొత్త చట్టం ద్వారా రీ సర్వే చేయాలన్నది ప్రభుత్వ సంకల్పం. భ యజమానులకు కొనుగోలు చేసిన వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా రికార్డులను పకడ్బందీగా ఉంచేందుకు చట్టం ఉపకరిస్తుంది. అన్నీ ఉన్నా చాలా మంది భూమిపై పూర్తి స్థాయిలో హక్కులు పొందలేక పోతున్నారు. న్యాయస్థానాలు ప్రాథమిక ఆధారాలుగా మాత్రమే గుర్తిస్తున్నాయి. భూ వివాదాలు ఏర్పడితే పరిష్కారం లభించడంతో జాప్యం జరుగుతోంది. భూమి హక్కు నిరూపించుకోవాలంటే పట్టాదారు పాసుపుస్తకం ఉండాలి. 1బీ అడంగళ్‌లో పేరు నమోదు ఉండాలి. ఆ రికార్డుల్లోని వివరాలు వందల సంవత్సరాల కిందట తయారైన ఆర్ఎస్ఆర్లోని వివరాలకు ఆ తర్వాత రుపొందించిన అడంగళ్‌కు అనుసంధానం కుదరాలి. లింక్ డాక్యుమెంట్లు ఉండాలి. ఇలాంటి ఆధారాలున్నా హక్కులు నిరూపణ కష్టంగా మారింది. కొత్త చట్టం ద్వారా ఒకే రికార్డు భూ యజమాన్య హక్కుల నిరూపణకు సరిపోతుంది. రికార్డుల్లో ఉన్న వివరాలకు ప్రభుత్వం హామీ ఇస్తుంది. దీనినే టైటిల్ గ్యారెంటీగా పేర్కొంటున్నారు. ఈ ప్రక్రియ చేపట్టడానికి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. రెండు నెలల్లో భూముల రికార్డుల ప్రక్షాళనను లోప రహితంగా చేసి యజమానులకు భరోసా కల్పించే దిశగా చర్యలు చేపట్టింది. అందులో భాగాంగా జిల్లాలో ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసి పైలెట్ ప్రాజెక్ట్‌గా భూరికార్డులు ప్రక్షాళన, రీ సర్వే ప్రక్రియ చేపట్టనుంది. ఇది పూర్తయితే జిల్లా వ్యాప్తంగా అన్ని రెవెన్యూ గ్రామాల్లో ఈ ప్రక్రియ చేపడుతుంది. భూ యజమానుల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. భూ హక్కుల రిజిస్ట్రేషన్‌కు ప్రత్యేక వ్యవస్థ చట్టం అమల్లోకి వచ్చిన మరుక్షణమే భూ యజమానులకు భద్రత కల్పించే వ్యవస్థను తీసుకు రానున్నారు. భూ హక్కులను రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ప్రత్యేక రిజిస్ట్రేషన్ వ్యవస్థ ఏర్పడుతుంది. భూమి ఏ విధంగా సంక్రమించినా కార్యాలయంలో నమోదు చేసుకోవాలి. కోర్టు వివాదాలు ఉన్నా, భూసేకరణ జరిగినా, ప్రభుత్వమే భూ లావాదేవీలు జరిపినా, భూమి కుదువ పెట్టినా, పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చినా రిజిస్ట్రేషన్ ఆఫీసుకు తెలపాల్సి ఉంటుంది. దేశంలోనే తొలిసారిగా ఈ చట్టం మన రాష్ట్రంలో అమల్లోకి రాబోతుంది. టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారిని నియమిస్తారు. ల్యాండ్ టైట్లింగ్ ట్రిబ్యునల్ ఏర్పడుతుంది. రాష్ట్ర స్థాయిలో అప్పీలేట్ ట్రిబ్యునల్ న్యాయమూర్తి నేతృత్వంలో పని చేస్తుంది. రెండేళ్లుగా తిరుగుతున్నాను డీసీపల్లి రెవెన్యూ పరిధిలో 0.77 సెంట్లు భూమి నా తండ్రి పేరుతో ఉంది. ఆ భూమిని తల్లి దండ్రులు, సోదరులు కలిసి నా పేరుతో రాసిచ్చారు. రెండేళ్ల క్రితమే స్థానిక వీఆర్ఓను కలిసి పూర్తి ఆధారాలు సమర్పించా. మీ సేవలో కూడా దరఖాస్తు చేసుకున్నా. రెండేళ్లు గడిచినా కూడా మ్యుటేషన్ జరగలేదు. వీఆర్ఓకు అడంగళ్ మార్పు కోసం డబ్బులు కూడా ఇచ్చుకున్నా ఫలితం లేదు. – పోలిచర్ల కవిత, డీసీపల్లి, మర్రిపాడు మండలం మా హక్కు కలిగి అధీనంలో ఉన్న భూముల్లో ఇతరుల పేర్లు మా హక్కు అధీనంలో ఉన్న భూములను ఆన్లైన్ అడంగళ్‌లో మాత్రం ఇతరుల పేర్లు ఉన్నాయి. ఏడాది కాలంగా తహసీల్దారు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా అడంగళ్‌లో పేరు మాత్రం మారలేదు. ఆ భూమి మాదేనంటూ అన్ని ఆధారాలు చూపించినా కూడా అధికారుల్లో స్పందన లేదు. పాత చట్టాలు తీసేసి కొత్త చట్టం రావాలి. మాలాంటి పేదలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా మా భూములు అడంగళ్‌లో మా పేర్లు ఉండేలా చేయాలి. – ఏసిపోగు వెంగయ్య, బోయలచిరివెళ్ల, ఆత్మకూరు మండలం -
రెండు నెలల్లో రికార్డుల ప్రక్షాళన
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో తప్పుల తడకలుగా ఉన్న భూ రికార్డులను రెండు నెలల్లో పూర్తిగా ప్రక్షాళన చేయాలని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆదేశించారు. సచివాలయంలోని తన చాంబర్ నుంచి బుధవారం జాయింట్ కలెక్టర్లు, రెవెన్యూ అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అర్హులందరికీ ఉగాది రోజున నివాస స్థల పట్టాల పంపిణీ, భూముల సమగ్ర రీసర్వే అనేవి సీఎం వైఎస్ జగన్ అత్యంత ప్రాధాన్యమైన పథకాలని ఉప ముఖ్యమంత్రి వివరించారు. భూముల రీసర్వే చేయడానికి ముందే భూ రికార్డులను పూర్తిగా అప్డేట్ చేయాల్సి ఉంటుందన్నారు. రీసర్వే సెటిల్మెంట్ రిజిస్టర్ (ఆర్ఎస్ఆర్), వెబ్‌ల్యాండ్ మధ్య భూముల విస్తీర్ణంలో భారీ తేడా ఉందని, చాలా చోట్ల చనిపోయిన వారి పేర్లతోనే భూములు ఉన్నాయని వివరించారు. కొన్నిచోట్ల వాస్తవ విస్తీర్ణానికి, రికార్డుల్లో ఉన్న గణాంకాలకు పోలిక లేదన్నారు. రీసర్వే చేయాలంటే వీటన్నింటినీ ముందుగా సరిదిద్దాల్సి ఉంటుందని తెలిపారు. రికార్డుల స్వచ్చికరణకు మార్గదర్శకాలతో (ఫార్మట్‌తో సహా) రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం నడుచుకోవాలని సూచించారు. ఇందుకోసం ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టి నెల రోజుల్లో ప్రక్రియను పూర్తిచేసి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 8 మండలాలకు ఒకటి చొప్పున ఆధునిక స్టోరేజీ గదుల నిర్మాణాన్ని సెప్టెంబర్ 15 కల్లా పూర్తి చేయాలని ఆదేశించారు. రికార్డులు స్వచ్ఛీకరించేప్పుడు తప్పులు, పొరపాట్లకు ఆస్కారం లేకుండా క్షేత్రస్థాయిలో ఒకటికి రెండుసార్లు చెక్ చేసి కచ్చితంగా నిర్ధారించుకున్న తర్వాతే మార్పులు చేయాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ మన్మోహన్సింగ్, సీసీఎల్ఏ కార్యదర్శి చక్రవర్తి ఆదేశించారు. -
‘ప్రక్షాళన’ ఏది?
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ–రికార్డుల ప్రక్షాళనలో భారీగా అవకతవకలు చోటుచేసుకుంటుంటే ఎందుకు ప్రేక్షక పాత్ర వహించారని ముఖ్యమంత్రి కేసీఆర్.. జిల్లాల కలెక్టర్లపై మండిపడ్డారు. క్షేత్ర స్థాయిలో వీఆర్ఓలు, తహసీల్దార్లు అక్రమాలకు పాల్పడుతుంటే మీరెందుకు చర్యలు తీసుకోలేకపోయారని కలెక్టర్లను సూటిగా ప్రశ్నించారు. పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన చిన్న జిల్లాలపైనా కలెక్టర్లు పట్టు సాధించలేకపోతే ఎలాగంటూ కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. భూ ప్రక్షాళనపై కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులొస్తున్నా.. మీరేం చేస్తున్నారంటూ కలెక్టర్లకు క్లాస్ పీకారు. మంగళవారం ప్రగతి భవన్లో జిల్లా కలెక్టర్లతో సుదీర్ఘంగా సమావేశమైన సీఎం.. కొత్త రెవెన్యూ చట్టం తయారీపై సలహాలను స్వీకరించడంతో పాటు కొత్త పంచాయతీరాజ్, మునిసిపల్ చట్టాల అమలుపై సమీక్ష నిర్వహించారు. ఉదయం 11.45 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు దాదాపు 8 గంటలకు పైగా జరిగిన ఈ సమావేశంలో కేసీఆర్ పలుమార్లు కలెక్టర్ల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. క్షేత్రస్థాయి అధికారుల పనితీరుపై కలెక్టర్ల పర్యవేక్షణ లోపించిందని, పంచాయతీరాజ్ చట్టం తీసుకొచ్చి 50 రోజులైనా అమలు చేయడంలో ఎలాంటి ప్రగతీ లేదని సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ సమావేశానికి సంబంధించి సీఎంవో ఎలాంటి ప్రకటనా జారీ చేయలేదు. వీఆర్ఓ, తహసీల్దార్ల అధికారాలకు చెక్ గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్వో), తహసీల్దార్ల అధికారాలకు కత్తెర పడడం ఖాయంగా కనబడుతోంది. పట్టాదారు పాస్ పుస్తకాలు, మ్యుటేషన్లు, విరాసత్ వంటి అవసరాల కోసం వచ్చే రైతులు, సామాన్య ప్రజలను.. క్షేత్ర స్థాయిలో వీఆర్ఓలు, తహసీల్దార్లు లంచాల కోసం తీవ్ర వేధింపులకు గురిచేయడం నిత్యకృత్యంగామారిన నేపథ్యంలో ప్రభుత్వం తీవ్ర నిర్ణయానికి సిద్ధమైనట్లు తెలిసింది. కొత్త రెవెన్యూ చట్టం లక్ష్యాలు, ప్రాధాన్యతపై సీఎం కేసీఆర్.. కలెక్టర్లసమావేశంలో వివరిస్తున్న సందర్భంగా ఈ అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. గ్రామ రెవెన్యూ రికార్డుల సంరక్షకులుగా ఉండాల్సిన వీఆర్వోలే వాటిని తారుమారు చేసి ఒకరి భూములను మరొకరికి కట్టబెట్టుతున్న వైనంపై ఆయనఆగ్రహం వ్యక్తం చేశారు. భూ–రికార్డుల పరిరక్షణతో పాటు భూములకు సంబంధించిన అన్ని రకాల బాధ్యతల నుంచి వీఆర్ఓలను తప్పించాలనే నిర్ణయానికి సీఎం వచ్చినట్లు సమాచారం. కొత్త రెవెన్యూ చట్టం వచ్చాక వీఆర్ఓలు భూమియేతర వ్యవహారాలకే పరిమితం కానున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక, కుల, ఆదాయ తదితర ధ్రువీకరణ పత్రాల జారీకి విచారణ జరిపే బాధ్యతలను మాత్రమే వీఆర్వోలకు కట్టబెట్టాలని సర్కారు యోచిస్తోంది. తహశీల్దార్ల అధికారాలకు సైతం ప్రభుత్వం కోత పెట్టి జాయింట్ కలెక్టర్లకు కీలక అధికారాలను అప్పగించాలని భావిస్తున్నట్లు తెలిసింది. మంగళవారం ప్రగతిభవన్లోముఖ్యమంత్రి కేసీఆర్‌తో జరిగిన సమావేశానికి హాజరైన కలెక్టర్లు, అధికారులు సెప్టెంబర్ 10న మళ్లీ పిలుస్తా కొత్త పంచాయతీరాజ్, మునిసిపల్ చట్టాలు, హరితహారం కార్యక్రమం అమలు పురోగతిని సమీక్షించేందుకు సెప్టెంబర్ 10న జిల్లా కలెక్టర్లతో మరోసారి సమావేశం నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు తెలిసింది. ఆలోగా మంచి పురోగతి సాధించి రావాలని కలెక్టర్లకు ఆదేశించినట్లు సమాచారం. నేడు కోమటిబండకు సీఎం,కలెక్టర్లు సాక్షి, హైదరాబాద్: గజ్వేల్ నియోజకవర్గంలోని కోమటిబండను సీఎం కేసీఆర్‌తోపాటుగా అన్ని జిల్లాల కలెక్టర్లు సందర్శిస్తున్నారు. క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా సీఎం నియోజకవర్గంలో గజ్వేల్‌లో హరితహారం కింద చేపట్టిన కార్యక్రమాలను జిల్లాల కలెక్టర్లు, ఇతర శాఖల అధికారులతో కలిసి సీఎం పరిశీలిస్తారు. బుధవారం ఉదయం హైదరాబాద్ నుంచి అధికారుల బృందం బయలుదేరి గజ్వేల్ నియోజకవర్గంలోని కోమటిబండ సహా వివిధ ప్రాంతాల్లో పర్యటించనుంది. మధ్యాహ్నం అక్కడే భోజనం చేసి సాయంత్రానికి ఈ బృందం నగరానికి చేరుకుంటుందని అధికారవర్గాలు వెల్లడించాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 60రోజుల పచ్చదనం, పరిశుభ్రత కార్యాచరణ ప్రణాళిక అమలులో భాగంగా హరితహారం కింద సీఎం నియోజకవర్గంలో అమలుచేసిన కార్యక్రమాలు, సాధించిన ఫలితాలను గురించి ఈ పర్యటనలో వివరిస్తారు. గజ్వేల్‌లో గత మూడు, నాలుగేళ్లలో సహజ అడవి పునరుద్ధరణ (అటవీ భూముల సంరక్షణ) చర్యలు విజయవంతమైన సంగతి తెలిసిందే. ఈ నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని గ్రామాల్లో హరితహారం కింద చేపట్టిన కార్యక్రమాలు సత్ఫలితాలు ఇవ్వడం, దాదాపు మూడేళ్ల క్రితం కోమటిబండ వద్ద మిషన్ భగీరథ ప్రాజెక్టుకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేసినపుడు ‘అవెన్యూ ప్లాంటేషన్’కింద రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలు ఏపుగా పెరగడంతో వాటిని ఈ బృందం పరిశీలించనుంది. గతంలోనూ సీఎం సూచనల మేరకు కలెక్టర్ల బృందం కోమటిబండను సందర్శించి అక్కడ హరితహారం, ఇతర కార్యక్రమాలను పరిశీలించి వచ్చిన సంగతి విదితమే. ఇక సత్వర రెవెన్యూ సేవలు కొత్త రెవెన్యూ చట్టం రూపకల్పనలో భాగంగా అంశాలవారీగా కలెక్టర్ల నుంచి అభిప్రాయాలు, సలహాలను సీఎం స్వీకరించారు. అవినీతి లేకుండా రెవెన్యూ వ్యవహారాలు ఎలా నడపాలి? రైతులకు సత్వర సేవలు ఎలా అందించాలి? భూ రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత 24 గంటల్లోపే రైతు ఇంటికి పాస్‌బుక్ వెళ్లాలంటే ఏం చేద్దాం? అన్న అంశాలపై కలెక్టర్ల అభిప్రాయాలను సేకరించారు. ఈ క్రమంలో రెవెన్యూకు సంబంధించిన అంశాలపై కలెక్టర్ల చేతికి ప్రశ్నావళిని ఇచ్చి సమాధానాలను రాబట్టుకున్నట్లు తెలిసింది. -
ప్రక్షాళన 'సాగు'తోంది!
సాక్షి, హైదరాబాద్: రెండేళ్ల క్రితం మొదలైన భూ రికార్డుల ప్రక్షాళన ఇంకా కొలిక్కిరాలేదు. ఇది నిరంతర ప్రక్రియే అయినా.. పాత సమస్యలను అధిగమించడంలో రెవెన్యూ యంత్రాంగం చతికిలపడింది. ఇప్పటికీ 94 శాతం మాత్రమే రికార్డుల నవీకరణ జరిగింది. పార్ట్–బీ కేటగిరీలో చేర్చిన ఖాతాలను పరిష్కరించేలా ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయకపోవడంతో 3.73 లక్షల ఖాతాలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 61,13,916 ఖాతాలుండగా.. వివాదరహిత భూములుగా గుర్తించిన 57,69,933 ఖాతాలకు సంబంధించి డిజిటల్ సంతకాలు జరిగాయి. ఇందులో ఆదిలాబాద్, జగిత్యాల, కరీంనగర్, వరంగల్ (పట్టణ) జిల్లాలు ముందంజలో ఉన్నాయి. ఈ జిల్లాల పరిధిలో క్లియర్ ఖాతాలుగా తేల్చిన వాటిలో ఏకంగా 98% మేర డిజిటల్ సంతకాలు పూర్తయ్యాయి. రికార్డుల ప్రక్షాళనలో వికారాబాద్, ములుగు, మేడ్చల్ జిల్లాలు బాగా వెనుకబడ్డాయి. ఈ జిల్లాల్లో కేవలం 90 శాతం మాత్రమే డిజిటల్ సంతకాలయ్యాయి. దీంతో ఈ జిల్లాల్లోని రైతాంగం పట్టాదార్ పాస్ పుస్తకాల కోసం తహసీల్దార్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తోంది. ఆధార్ వివరాలివ్వని 1.74 లక్షల మంది పాస్ పుస్తకాల జారీకి తప్పనిసరిగా భావించే ఆధార్ వివరాలను సమర్పించకపోవడంతో 1.74 లక్షల పట్టాదార్లకు పాస్‌బుక్కులు జారీకాలేదు. అలాగే ఆధార్ సంఖ్యను ఇచ్చినా కూడా 1.69 లక్షల ఖాతాలకు డిజిటల్ సంతకాలు పెండింగ్‌లో ఉండడంతో ఆధార్ ఇవ్వని/ఇచ్చిన 3.43 లక్షల ఖాతాల పాస్ పుస్తకాలు పెండింగ్‌లో ఉన్నాయి. మరోవైపు మ్యుటేషన్లు, పౌతీ, నోషనల్ ఖాతాలు పెండింగ్, ఖాతాల సవరణల పెండింగ్‌లో ఉండడం కూడా పాస్ పుస్తకాల జారీ ఆలస్యం కావడానికి కారణంగా రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. కొలిక్కిరాని పార్ట్–బీ వ్యవహారం.. భూ యాజమాన్య హక్కులపై స్పష్టతనివ్వకపోవడంతో లక్షలాది మంది రైతులు ఆందోళనకు గురవుతున్నారు. పార్ట్–బీ జాబితాలో చేర్చిన భూముల వ్యవహారం తేల్చకపోవడంతో రెవెన్యూ అధికారుల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ కేటగిరీ భూములపై మార్గదర్శకాలు జారీ చేయకపోవడంతో ఎడతెగని జాప్యం జరుగుతోంది. గత రెండేళ్లుగా పాస్ పుస్తకాల కోసం ఎదురుచూస్తున్న రైతాంగం పెదవి విరుస్తోంది. తొలి విడతలో వివాదరహిత భూములకు మాత్రమే పాస్ పుస్తకాలను జారీ చేసిన సర్కారు.. పార్ట్–బీ కేటగిరీలో ప్రభుత్వ భూములు/ఆస్తులు, అటవీ భూములు, దేవాదాయ తదితర భూములతోపాటు, వ్యవసాయేతర భూములను చేర్చింది. భూవిస్తీర్ణంలో తేడా, కోర్టు కేసులు, కుటుంబసభ్యుల భూపంపకాల్లో విస్తీర్ణంలో వ్యత్యాసం, అసైన్డ్ చేసిన భూమికి, క్షేత్రస్థాయిలో ఉన్న భూమికి తేడా, ఫారెస్టు, రెవెన్యూ శాఖల మధ్య తగాదా, ఫారెస్టు, పట్టా భూముల మధ్య వివాదస్పదమైన వాటిని కూడా పార్ట్–బీలో నమోదు చేసింది. వీటిని సత్వరమే సవరించి పరిష్కారమార్గం చూపాల్సిన ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయకపోవడం.. పెట్టుబడి సాయం అందించాలనే తొందరలో ఈ కేటగిరీ భూముల జోలికి వెళ్లలేదు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఇంకా 3,73,051 ఖాతాలకు మోక్షం కలగలేదు. ఈ ఖాతాలకు సంబంధించిన రైతులు ప్రతిరోజు కలెక్టరేట్, రెవెన్యూ కార్యాలయాల చుట్టూ చక్కర్లు కొడుతూనే ఉన్నారు. -
కొత్త పట్టా పుస్తకాలెప్పుడో!
సాక్షి, ఆదిలాబాద్: భూరికార్డుల ప్రక్షాళన జరిగి దాదాపు మూడేళ్లు గడుస్తుంది. అయినా ఇంత వరకు వివాదాస్పదంగా ఉన్న భూ సమస్యలను పరిష్కరించడంతో అధికారులు శ్రద్ధ చూపడం లేదు. సర్వే సమయంలో ఎలాంటి సమస్యలు లేని భూములను పార్ట్–ఏలో చేర్చి కొత్త పట్టాపాసు పుస్తకాలు అందించారు. వివాదాలు ఉన్న భూములను పార్ట్–బిలో చేర్చి ఇంత వరకు కొత్త పట్టా పాసుపుస్తకాలు అందజేయలేదు. దీంతో గత రెండున్నరేళ్లుగా రైతులు కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేదు. తహసీల్దార్ కార్యాలయం, కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరిగినా.. ఫలితం మాత్రం కనిపించడం లేదు. మూడు ఎకరాలకుపైనే.. భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమంలో భాగంగా భూ వివరాలను పరిశీలించిన అధికారులు సర్వే లో వివాదాలు ఉన్న భూములను పార్ట్–బీలో చే ర్చారు. రెవెన్యూ రికార్డుల శుద్ధీకరణ జరిగి ఇరవై నెలలు గడుస్తున్నా..పార్ట్–బీ భూములకు ఇంత వరకు పూర్తిస్థాయి పరిష్కారం లభించడం లేదు. దీంతో ఆ భూములు కలిగిన పట్టాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నియోజకవర్గంలో 5400 ఎకరాలపైగా భూములను పార్ట్–బీలో చేర్చగా, గతేడాది నుంచి ఇప్పటి వరకు 2 వేల ఎకరాల భూములకు మాత్రమే పరిష్కర మార్గం చూ పారు. మిగతా 3,400 ఎకరాలకు మోక్షం కలగలేదు. పార్ట్–బీలోని భూములన్నింటీకి పరిష్కారం లభిస్తుందని రైతులు ఆశించినా ప్రభుత్వం వివిధ కారణాలతో పక్కన పెడుతూ వస్తోంది. గత ఎనిమిది నెలలుగా వరుస ఎన్నికల నేపథ్యం లో పార్ట్–బీ భూ సమస్యల జోలికి అధికారులు వెళ్లలేదు. మోక్షం లభించేనా? నియోజకవర్గంలో జైనథ్, బేల, ఆదిలాబాద్ రూరల్, అర్బన్, మావల మండలాలున్నాయి. ఈ మండలాల పరిధిలోని సుమారు 3400 ఎకరాలకుపైగా భూములు పార్ట్–బీలో పెండింగ్‌లో ఉం ది. వీటకి పూర్తిస్థాయి పరిష్కరం లభించే అవకాశం కనిపించడం లేదు. కోర్టుకేసులు, కుటుంబ వివాదాలు ఉన్న భూములను అధికారులు పక్కనపెట్టగా, చిన్న చిన్న సమస్యలున్న భూములను మాత్రమే పరిశీలన చేసి పరిష్కరిస్తున్నారు. దీంతో అసలు సమస్య ఉన్న భూములు పెండింగ్‌లో నే ఉన్నాయి. అయితే కొన్ని భూములకు చిన్న స మస్యలు ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోవ డం లేదని, కలెక్టర్ ఆదేశాలను సైతం బేఖాతరు చేయడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెవెన్యూ అధికారులు ఓసారి దృష్టి సారిస్తే.. భూ సమస్యలు పరిష్కారం అవుతాయని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. పార్ట్–బీలోని కొన్ని భూములపై రెవెన్యూ, సివిల్ కోర్టు కేసులు, సరిహద్దు గుర్తింపు సమస్యలున్నాయి. పాసు పుస్తకం ఇవ్వాలి నా పేరు మీద వ్యవసాయ భూమి ఉంది. పాత పట్టా పాస్‌బుక్‌లు ఉన్నాయి. కానీ కొత్త పట్టా పాసు పుస్తకాలు ఇంత వరకు ఇవ్వలేదు. చాలాసార్లు అధికారులను అడిగినా.. ఇంత వరకు జారీ చేయలేదు. దీంతో రైతుబంధు, ప్రభుత్వ రాయితీలకు దూరమవుతున్నాం – ప్రసాద్, ఖానాపూర్, ఆదిలాబాద్ -
కరుణించని ‘ధరణి’
సాక్షి, హైదరాబాద్: ‘ధరణి’ వెబ్సైట్ రైతులకు చుక్కలు చూపుతోంది. ఏడాదికాలంగా మండల కార్యాలయాల చుట్టూ ప్రదిక్షణలు చేస్తున్నా.. పాస్ పుస్తకాలు అందక రైతులు గగ్గోలు పెడుతున్నారు. రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన అనంతరం భూ రికార్డుల సమగ్ర నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ధరణి వెబ్‌సైట్‌ను ప్రవేశపెట్టింది. రెవెన్యూ రికార్డులన్నింటినీ ఆన్లైన్లోనే అప్డేట్ చేసేలా ఈ సాఫ్ట్వేర్ అందుబాటులోకి తెచ్చింది. ఈ సాఫ్ట్‌వేర్‌తో అడుగడుగునా అవాంతరాలే ఎదురవుతున్నాయి. రికార్డుల సవరణకు ఎడిట్ ఆప్షన్ ఇవ్వకపోవడంతో ప్రతి పనికి కాళ్లరిగేలా తిరిగాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. కరెక్షన్, ఎడిట్ ఆప్షన్‌ను తహసీల్దార్లకు ఇవ్వకుండా ఆర్డీవో, జేసీల అనుమతి తీసుకున్నాకే లాగిన్ కావాల్సిరావడంతో కాలయాపన జరుగుతోంది. ముఖ్యంగా ధరణి రాకతో రికార్డులను సవరించే బాధ్యత నుంచి తహసీల్దార్లను ప్రభుత్వం తప్పించింది. చిన్న సవరణలకు కూడా వెసులుబాటు ఇవ్వకపోవడం.. మండల కార్యాలయాల చుట్టూ రైతులు తిరుగుతుండటం వారిని ఇరకాటంలో పడేస్తోంది. పగటి పూట బంద్.. 2017లో భూరికార్డుల ప్రక్షాళనతో రెవెన్యూ వ్యవస్థలో సరికొత్త విప్లవానికి కేసీఆర్ సర్కారు నాంది పలికింది. అంగుళం భూమికి సైతం హక్కుదారెవరనేది తేల్చేలా భూ రికార్డుల సమగ్ర నిర్వహణకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ధరణి వెబ్సైట్ ప్రవేశపెట్టింది. ఈ పోర్టల్ కార్యరూపం దాల్చిన తర్వాత రోజుకో కొత్త సాంకేతిక సమస్యలు పుట్టుకురావడం రెవెన్యూ అధికారులకు తలనొప్పి తెప్పిస్తోంది. ధరణి పగటి పూట మొరాయిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో రికార్డులను ఆన్లైన్లో నమోదు చేస్తుండటంతో సర్వర్ డౌన్ అవుతోంది. దీంతో పగలు సాఫ్ట్వేర్ పడకేస్తుండటంతో, రాత్రి వేళల్లో పనులు చేయాల్సివస్తోంది. కొత్త సాఫ్ట్వేర్ అందుబాటులోకి తెచ్చే ముందు.. సాంకేతిక సమస్యలను సరిచూసుకోవాల్సివుంటుంది. కానీ, ధరణిని కార్యరూపంలోకి తెచ్చిన తర్వాత లోపాలను సరిదిద్దుతుండడం వల్ల రైతులకు నిరీక్షణ తప్పట్లేదు. ఇవీ సాంకేతిక సమస్యలు.. ►ఒకే సేల్‌డీడ్‌పై ఇద్దరు వ్యక్తులు కొనుగోలు చేసిన భూమికి సంబంధించి మ్యూటేషన్ చేయించుకునేందుకు గతంలో మీ–సేవలో దరఖాస్తు చేసుకుంటే సరిపోయేది. ఇప్పుడలా చేస్తే దరఖాస్తు తిరస్కరణకు గురవుతోంది. ఇరువురు వేర్వేరు దరఖాసులు చేసుకోవాల్సి వస్తోంది. ఈ నిబంధన తెలియక మ్యూటేషన్లు, పాస్ పుస్తకాల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ►సర్వే నంబర్ల పునరుద్ధరణ ఆప్షన్ తహసీల్దార్‌కు లేదు. రివోక్ ఆప్షన్‌కు జేసీకి నివేదించాల్సి వస్తోంది. ►పూర్తయిన మ్యూటేషన్లకు కేవైసీ తప్పనిసరిగా మారింది. పట్టాదారు విధిగా బయోమెట్రిక్ ద్వారా వేలిముద్రలు అందించాలి. కొందరి వేలిముద్రలు అరిగిపోతే డిజిటల్ సంతకం చేయడం కుదరట్లేదు. దీంతో మ్యూటేషన్లు నిలిచిపోతున్నాయి. ►భూ ప్రక్షాళన సమయంలో కాస్రా పహణీ విస్తీర్ణంతో సరిపోలకపోయినా హడావుడిగా వివరాలు నమోదు చేయడం ప్రస్తుతం సమస్యగా మారింది. తాజాగా ఆ వివరాలు కాస్రాతో సరిపోలని కారణంగా మ్యూటేషన్లు కావట్లేదు. ►సర్వర్ పగటిపూట పనిచేయట్లేదు. ►ఒక పట్టాదారు ఒకే సమయంలో ముగ్గురికి భూమిని విక్రయిస్తే, ఆ భూమికి సంబంధించి మ్యూటేషన్లు ఒకేసారి చేయడం వీలు కావట్లేదు. ఒకరికి పూర్తయిన తర్వాతే మరొకరివి చేయాల్సి వస్తోంది. దీంతో ఒక్కో దరఖాస్తు మధ్య కనీసం 20 రోజుల సమయం పడుతోంది. ►భూ రికార్డుల ప్రక్షాళన సమయంలో ఆధార్ వివరాలను సమర్పించని రైతుల ఆధార్ నంబర్ ఇప్పుడు నమోదు చేయాలంటే ఆర్డీవో అనుమతి తీసుకోవాల్సివస్తోంది. ఏడాదిగా చక్కర్లు నాకు ఐదెకరాల భూమి ఉంది. రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన అనంతరం జారీ చేసిన పాస్ బుక్కులో మూడెకరాలు మాత్రమే నమోదు చేశారు. మిగిలిన రెండెకరాలు నమోదు చేయించుకునేందుకు ఏడాదిగా తిరుగుతున్నా.. సర్వర్ డౌన్, ఆన్లైన్ పనిచేయట్లేదని చెబుతున్నారు. – జంగారెడ్డి, అగర్మియాగూడ, కందుకూరు మండలం, రంగారెడ్డిజిల్లా. చెప్పులరిగేలా తిరుగుతున్నా.. మొండిగౌరెల్లి గ్రామంలో 2017లో సర్వేనంబరు 106, 109లో 3–16 ఎకరాల భూమిని కొనుగోలు చేశాను. ఈ భూమి ఆన్లైన్లో నమోదు కోసం నాలుగు నెలలుగా తహసీల్దార్ కార్యాలయం చుట్టు తిరుగుతున్నా. తహశీల్దార్‌ను కలసి భూ రికార్డులు సమర్పించా. కానీ నేటికి ఆన్లైన్లో నమోదు కాకపోగా.. తనకు భూమి అమ్మిన రైతుకే పట్టాదారు పాసుపుస్తకం వచ్చింది. రైతుబంధు సాయం కూడా అతడికే ఇస్తున్నారు. – కొలను రమాదేవి, మొండిగౌరెల్లి, యాచారం మండలం, రంగారెడ్డి జిల్లా -
సంకటంలో ‘భూ బాబులు’
సాక్షి, హైదరాబాద్: పట్టాదారు పాస్‌పుస్తకాల జారీకి రాష్ట్ర ప్రభుత్వం ఆధార్ మెలిక పెట్టడం బడాబాబులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇబ్బడిముబ్బడిగా భూములు కొనుగోలు చేసినవారిని ఈ నిర్ణయం ఇరకాటంలోకి నెట్టింది. ఆధార్ నంబర్‌ను ఇస్తే ఎక్కడ తమ భూముల చిట్టా బయటపడుతుందోననే ఆందోళన వారిలో నెలకొంది. భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా వివాదరహిత భూములకు ప్రభుత్వం కొత్త పాస్ పుస్తకాలను పంపిణీ చేసింది. క్షేత్రస్థాయిలో రికార్డులను పరిశీలించి సదరు రైతులకు పాస్‌బుక్కులను అందజేసింది. అయితే, వీటి ముద్రణ సమయంలోనే పట్టాదారు ఆధార్ నంబర్‌ను సేకరించాలని ప్రభుత్వం నిర్దేశించింది. ఆధార్ సమాచారం ఇవ్వకపోతే పాస్‌బుక్కును ఇవ్వకూడదని స్పష్టం చేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా లెక్కతేల్చిన 4,56,155 మందిలో ఆధార్ నంబర్‌ను సమర్పించిన 1,88,994 మందికి పాస్‌పుస్తకాలను ప్రభుత్వం పంపిణీ చేసింది. ఆధార్ నంబర్ ఇవ్వని 2,67,161 మంది పట్టాదార్ల పాస్ బుక్కులను పెండింగ్‌లో పెట్టింది. భూ రికార్డులు సవ్యంగానే ఉన్నప్పటికీ, ఆధార్ నంబర్ ఇవ్వని కారణంగానే వీటిని పక్కనపెట్టింది. పార్ట్–బీలో 69 లక్షల ఎకరాలు భూ రికార్డుల ప్రక్షాళనలో వ్యవసాయ, వ్యవసాయేతర భూములను వేర్వేరుగా వర్గీకరించిన సర్కారు.. వ్యవసాయేతర, అభ్యంతరకర భూములను పార్ట్–బీ కేటగిరీగా పరిగణించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పార్ట్–బీ కింద 69,85,478 ఎకరాలున్నట్లు లెక్క తేల్చింది. ఇందులో ప్రభుత్వ భూములు ముఖ్యంగా అటవీ, నాలా, ప్రభుత్వ ఆస్తులు కూడా ఉన్నాయి. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా 1.59 కోట్ల ఎకరాల విస్తీర్ణంలో వ్యవసాయ భూములుండగా.. ఇందులో 1.53 కోట్ల ఎకరాల విస్తీర్ణంలోని భూములకు పాస్‌పుస్తకాలను ముద్రించి పంపించినట్లు రెవెన్యూశాఖ గణాంకాలు చెబుతున్నాయి. కాగా, క్లియర్ టైటిల్‌గా తేల్చినప్పటికీ ఇంకా 5,72,498 ఎకరాల విస్తీర్ణానికి సంబంధించిన డిజిటల్ సంతకాలు నమోదు చేయకపోవడంతో పాస్‌పుస్తకాల ముద్రణకు పంపలేదని స్పష్టమవుతోంది. మరోవైపు ప్రవాస భారతీయులకు పాస్ పుస్తకాలు అందుకోవడం తలనొప్పిగా మారింది. అక్కడే స్థిరపడ్డవారు ఇక్కడ ఆధార్ కార్డు తీసుకోవడం చట్టరీత్యానేరం. ఒకవేళ తీసుకున్నట్లు తెలిస్తే.. ఆదేశ పౌరసత్వం కూడా రద్దు కావడమేగాకుండా కఠిన శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పాస్ బుక్కుకు విధిగా ఆధార్‌ను జోడించాలనే నిబంధన విధించడం వారికి చిక్కుముడిగా మారింది. ఈ వ్యవహారంపై స్పష్టత కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాసినా ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం గమనార్హం. గుట్టు బయట పడుతుందనే? ప్రతి క్రయ విక్రయానికి ప్రభుత్వం ఆధార్‌ను తప్పనిసరి చేసింది. దీంతో ఎక్కడ భూమి కొనుగోలు చేసినా క్షణాల్లో తెలిసిపోతుంది. అలాగే రెవెన్యూ రికార్డుల నవీకరణ సమయంలో సేకరించే ఆధార్‌తో తమ భూ చరిత్ర తెలిసిపోతుందని గుబులు బడాబాబుల్లో కనిపిస్తోంది. ఆధార్ వివరాలను ఇవ్వండి మహాప్రభో అని రెవెన్యూ యంత్రాంగం చెబుతున్నా వారు పెడచెవిన పెడుతున్నారు. ముఖ్యంగా వందలాది ఎకరాలు కొనుగోలు చేసిన పెద్దలు.. సీలింగ్ యాక్ట్ పరిధిలోకి వస్తామనే భయంతో వివరాలు ఇచ్చేందుకు జంకుతున్నట్లు తెలుస్తోంది. రెవెన్యూ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు నాందిపలుకుతూ 2017లో రాష్ట్ర ప్రభుత్వం భూరికార్డుల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. మొత్తం 10,823 గ్రామాల్లో 2.38 కోట్ల ఎకరాల భూముల రికార్డులను పరిశీలించి.. 2.28 కోట్ల ఎకరాల భూములు వివాదరహితంగా తేల్చింది. 9.92 లక్షల ఎకరాల మేర భూముల విషయంలో అభ్యంతరాలు వ్యక్తం కావడంతో.. వాటిని వివాదాస్పద భూముల జాబితా (పార్ట్–బీ)లో చేర్చింది. ఈ క్రమంలోనే సర్వే నంబర్ల వారీగా రికార్డులను రూపొందించింది. 1,86,84,158 సర్వేనంబర్లలోని భూములు క్లియర్‌గా గుర్తించిన సర్కారు.. 9,13,656 సర్వేనంబర్ల పరిధిలోని భూములను వివాదాస్పదంగా పరిగణించింది. -
చెప్పిందొకటి.. చేసిందొకటి..!
సాక్షి, హైదరాబాద్: భూరికార్డుల ప్రక్షాళనలో రెవెన్యూ అధికారులు అత్యుత్సాహంతో ఆది లోనే తప్పటడుగు వేసినట్లు ఆలస్యంగా నిర్ధారణ అవుతోంది. రికార్డుల పరిశీలన, సవరణల్లో భాగంగా సీఎం కేసీఆర్ చేసిన సూచనలకు భిన్నంగా రెవెన్యూ అధికారులు వ్యవహరించిన తీరు అనర్థాలకు కారణమైందని చర్చ జరుగుతోంది. భూరికార్డులన్నింటినీ పరిశీలిం చి మాన్యువల్ (చేతిరాత) పహాణీలు తయారు చేయాలని, ఆ ప్రక్రియ పూర్తయ్యాక ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఆన్లైన్లో నమోదు చేసి సమీకృత విధానాన్ని తీసుకొద్దామని సీఎం కేసీఆర్ చెప్పగా.. రెవెన్యూ యంత్రాంగం మ్యాన్యువల్ (కొన్నిచోట్ల), ఆన్లైన్ ప్రక్రియలను సమాంతరంగా చేపట్టిన కారణంగానే సమస్యలు వస్తున్నాయని ఉన్నతస్థాయి వర్గాలు చెబుతున్నా యి. ఆన్లైన్ చేసే క్రమంలో కూడా ఎడాపెడా నమోదు చేయడం, ఎడిట్ ఆప్షన్ కూడా లేని ప్రత్యేక పోర్టల్‌లో వీటిని నమోదు చేయడంతో పాటు మాన్యువల్ పహాణీల తయారీ ప్రక్రియ ఇప్పటివరకు పూర్తిస్థాయిలో చేయకపోవడంతో భూరికార్డుల ప్రక్షాళనలో దొర్లిన పొరపాట్లను సవరించడం కష్టసాధ్యంగా మారింది. సీఎం చెప్పారిలా.. రెవెన్యూ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు నాందిపలకాలని సీఎం కేసీఆర్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముందుగా రెవెన్యూ శాఖలో సంస్కరణలపై ఉన్నతాధికారులతో కమిటీ వేశారు. ఈ కమిటీలో చర్చించి భూ రికార్డుల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. రికార్డుల ప్రక్షాళనలో అనుసరించాల్సిన విధివిధానాలపై సీఎం కేసీఆర్ స్పష్టతనిచ్చారు. క్షేత్రస్థాయిలో రికార్డులను పరిశీలించి వాటిని మాన్యువల్ పహాణీలో నమోదు చేయాలని సూచించారు. ఈ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత ఆ రికార్డును ఆన్లైన్లో పొందుపరుద్దామని స్పష్టం చేశారు. దీనికి అనుగుణంగా రికార్డుల అప్డేషన్కు అనుగుణంగా కొత్త సాఫ్ట్వేర్ అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. ఆ తర్వాత మరోసారి భూ రికార్డుల్లో మార్పులు, చేర్పులు చేసే అవకాశముండదని స్పష్టం చేశారు. ఈ రికార్డులను బ్యాంకులు, రిజిస్ట్రేషన్ల శాఖతో అనుసంధానం చేస్తామని తెలిపారు. అధికారులు చేశారిలా.. సీఎం చెప్పినట్లు కాకుండా భూ రికార్డులను ఏకంగా మాన్యువల్‌తో పాటు ఆన్లైన్లో రెవెన్యూ అ«ధికారులు నమోదు చేశారు. ప్రభుత్వ పెద్దలతో చర్చించకుండానే అప్పటివరకు ఉన్న వెబ్‌ల్యాండ్ స్థానంలో ‘టీ–ల్యాండ్’పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చారు. రికార్డుల ప్రక్షాళన పురోగతిని తెలుసుకుంటామనే పేరుతో ఎప్పటికప్పుడు సరిచేసిన రికార్డులను ఆ పోర్టల్‌లో నమోదు చేసి లెక్కలు ప్రభుత్వానికి చూపెట్టారు. పోనీ అదైనా సంపూర్ణంగా ఉందంటే అదీ లేదు. ఈ పోర్టల్ కూడా సాంకేతికంగా సరిగా లేకపోవడంతో ఆదిలోనే ఆనేక అవాంతరాలు ఎదురయ్యాయి. దీనికితోడు పనిభారం, రైతుబంధు పంపిణీ పేరిట గడువు నిర్దేశించడం, గ్రామ స్థాయిలోని వీఆర్వోలకు ఈ పోర్టల్‌పై సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడంతో తప్పులు దొర్లాయి. ఈ తప్పులను సరిదిద్దు కోవడానికి ఎడిట్ ఆప్షన్ లేకుండా పోర్టల్‌ను రూపొందించారు. దీంతో భూ రికార్డుల ప్రక్షాళన గందరగోళంగా మారింది. పాత రికార్డులను యథాతథంగా రికార్డులకెక్కించిన రెవెన్యూగణం.. వాటిని మొదట మాన్యువల్ పహాణీలో నమోదు చేయాలనే అంశాన్ని పక్కనపెట్టింది. కొన్నిచోట్ల మాన్యువల్ పహాణీలు పూర్తి చేసినా చాలా గ్రామాల్లో సాఫ్ట్‌వేర్‌లో అప్డేషన్ అనంతరం మాన్యువల్ పహాణీలు రూపొందించారు. సాఫ్ట్వేర్ ఇవ్వలేదు కదా! భూ రికార్డుల ప్రక్షాళనపై ఉన్నతాధికారులతో సీఎం ప్రత్యేకంగా భేటీ అయిన సమావేశంలో ‘టీ–ల్యాండ్’ప్రస్తావన వచ్చింది. ఈ ల్యాండ్ ఎక్కడిది.. ఇంకా సాఫ్ట్వేర్ ఇవ్వలేదు కదా అని సీఎం అనడంతో నాలుక్కరుచుకున్న ఉన్నతాధికారులు.. అది సాఫ్ట్వేర్ కాదని, రికార్డులను కంప్యూటరీకరిస్తున్నామని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత టీ–ల్యాండ్ స్థానంలోనే ‘ధరణి’వెబ్‌సైట్‌ను రెవెన్యూ శాఖ అందుబాటులోకి తెచ్చింది. అయితే భూ రికార్డుల అప్డేషన్ సమయంలో దొర్లిన తప్పులు సవరించేందుకు ఎడిట్ ఆప్షన్ ఇవ్వకపోవడం, కొన్ని కేసులు ఆర్డీవో, జేసీలు మాత్రమే పరిష్కరించే వీలుండటంతో తీవ్ర కాలయాపన జరిగింది. ఇది కాస్తా ప్రజల్లో అనేక అపోహలకు దారితీసింది. రెవెన్యూ విభాగం ప్రతిష్ట మసకబారింది. రికార్డుల ప్రక్షాళనలో ఉన్నతాధికారులు సరైన మార్గదర్శకాలు జారీ చేయకపోవడం, కిందిస్థాయి సిబ్బందికి సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడం ఈ సమస్యలకు దారితీసింది. -
రెవెన్యూ ఉద్యోగులు అధైర్యపడొద్దు
సాక్షి, హైదరాబాద్: రెవెన్యూ వ్యవస్థను రద్దు చేస్తారని.. ఇతర శాఖల్లో విలీనం చేస్తారని జరుగుతున్న ప్రచారం కేవలం అపోహ మాత్రమేన ని తెలంగాణ డిప్యూటీ కలెక్టర్ల సంఘం (టీడీసీఏ) అధ్యక్షుడు వి.లచ్చిరెడ్డి, తెలంగాణ తహసీల్దార్ల సంఘం(టీజీటీఏ) అధ్యక్షుడు కె.గౌతమ్‌కుమార్ పేర్కొన్నారు. రెవెన్యూ ఉద్యోగులు అధైర్యపడవద్దని చెప్పారు. బుధవారం హైదరాబాద్‌లోని టీజీటీఏ కేంద్ర కార్యాలయంలో ‘రెవెన్యూ ఉద్యోగుల రౌండ్‌టేబుల్ సమావేశం’జరిగింది. ఇందులో లచ్చిరెడ్డి, గౌతమ్‌కుమార్ మాట్లాడారు. ఇటీవల పత్రికలు, సామాజిక మాధ్యమాల్లో రెవెన్యూ వ్యవస్థను రద్దు చేస్తున్నారని, ఇతర శాఖల్లో విలీనం చేస్తున్నారని వస్తున్న వార్తలను ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రచారంతో రెవెన్యూ ఉద్యోగుల్లో అభద్రతాభావం, ఆందోళన నెలకొన్నాయన్నారు. ఇప్పటివరకు శాఖను రద్దు చేస్తున్నామని, విలీనం చేస్తున్నామని కానీ ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదన్నది గుర్తుంచుకోవాలన్నారు. ఉద్యోగులెవరూ ఆందోళనకు గురికావొద్దని చెప్పారు. కొత్త చట్టంతో పటిష్టం చేయాలి ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న కొత్త రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తున్నట్లు లచ్చిరెడ్డి, గౌతమ్‌కుమార్ స్పష్టం చేశారు. రెవెన్యూ వ్యవస్థను మరింత బలోపేతం చేసే విధంగా ఈ చట్టం ఉండాలన్నారు. పాలనాపరమైన సంస్కరణలు తీసుకొచ్చి శాఖను మరింత పటిష్టం చేయాలని తాము చాలా రోజులుగా కోరుతున్న విషయాన్ని గుర్తు చేశారు. కొత్త చట్టం, సంస్కరణల రూపకల్పనలో రెవెన్యూ ఉద్యోగులను భాగస్వాములను చేయాలని కోరారు. క్షేత్రస్థాయిలో పనిచేసే రెవెన్యూ ఉద్యోగులకు వాస్తవ పరిస్థితులపై అవగాహన ఉంటుందని, కాబట్టి ఉద్యోగుల అభిప్రాయాలను, సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. భూసమస్యల్లేని గ్రామాలుగా ప్రకటించాలి ఏడాదిన్నరగా భూ రికార్డుల ప్రక్షాళన ఉద్యోగులంతా తీరిక లేకుండా పనిచేశారని, అయినా కొన్ని చోట్ల తలెత్తిన సమస్యల వల్ల రెవెన్యూ శాఖపై నిందలు పడ్డాయని వారు చెప్పారు. ఈ చెడ్డపేరు తొలగించుకునేందుకు ముందడుగు వేయాల్సిన బాధ్యత ఉద్యోగులపై ఉందన్నారు. భూ రికార్డుల ప్రక్షాళనలో మిగిలి ఉన్న సమస్యలను పరిష్కరించే దిశగా ఉద్యోగులు పనిచేయాలని కోరారు. భూ సమస్యలు పరిష్కరించి రెవెన్యూ వివాదాలు లేని గ్రామాలుగా ప్రకటించాలని సూచించారు. భూ చట్టాల నిపుణుడు ఎం.సునీల్‌కుమార్, మా రెవెన్యూ ఎంప్లాయీస్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు లక్ష్మయ్య మాట్లాడుతూ.. రెవెన్యూ శాఖను మరింత పటిష్టం చేయాలని వారు పేర్కొన్నారు. సమావేశంలో రెవెన్యూ అధికారుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు రవినాయక్, చిన్నరాజు, గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఈశ్వర్, రాములు, డిప్యూటీ కలెక్టర్ల సంఘం ప్రతినిధి రాజాగౌడ్, టీజీటీఏ ప్రధాన కార్యదర్శి ఏ.వెంకట భాస్కర్, అసోసియేట్ అధ్యక్షుడు పూల్‌సింగ్ చౌహాన్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. -
పార్ట్ B ఓ ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: వివాదాస్పద భూముల పరిష్కారంపై కొత్త మెలిక పడింది. భూరికార్డుల ప్రక్షాళనలో భాగంగా పార్ట్–బీలో చేర్చిన ఈ భూరికార్డులను వారంలో క్లియర్ చేసి అర్హులైన రైతులకు పాసు పుస్తకాలు అందజేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించినా ఈ ప్రక్రియ సజావుగా జరిగేటట్లు లేదు. పార్ట్–బీ భూములపై గతంలో విచారణ జరిపిన తహసీల్దార్లు అసెంబ్లీ ఎన్నికల సమయంలో వేరే మండలాలకు బదిలీ అయ్యారు. అయితే, ఈ భూములపై మళ్లీ విచారణ జరిపితేనే నిర్ధారిస్తామని కొత్త తహసీల్దార్లు మెలిక పెడుతున్నారు. అయితే, లోక్‌సభ ఎన్నికల పని ప్రారంభం కావడంతో తహసీల్దార్ల బదిలీలపై సస్పెన్స్ నెలకొంది. పెండింగ్‌లో 12.71 లక్షల ఎకరాలు రాష్ట్రవ్యాప్తంగా గత ఏడాది సెప్టెంబర్ నుంచి ప్రారంభమైన భూరికార్డుల ప్రక్షాళనలో భాగంగా మొత్తం 2.38 కోట్ల ఎకరాలకు సంబంధించిన దస్త్రాలను పరిశీలించి 2.25 కోట్ల ఎకరాల రికార్డులను రెవెన్యూ యంత్రాంగం సరిచేసింది. వివాదాస్పద భూములు, అటవీ, దేవాదాయ, కోర్టు కేసులు, అన్నదమ్ముల పంచాయితీలు, సరిహద్దు వివాదాలు, సివిల్ తగాదాలు, నిషేధిత జాబితా(22ఏ)లో ఉన్న 12.71 లక్షల ఎకరాల భూములను పార్ట్–బీలో చేర్చింది. ఇందులో కొన్ని సర్వే చేయాల్సి రావడం, మరికొన్ని తీవ్ర వివాదాల్లో ఉండటంతో ఎన్నికలకు ముందు తహసీల్దార్లు పకడ్బందీగా విచారణ జరిపారు. దరఖాస్తులను పరిశీలించి స్పాట్ వెరిఫికేషన్ చేయడంతోపాటు పంచనామాలు నిర్వహించారు. అన్నదమ్ముల మధ్య పంచాయితీలున్న భూముల్లో ఇరుపక్షాలను పిలిపించి విచారించారు. అటవీ, దేవాదాయ శాఖలతో లింకు ఉన్న భూముల విషయంలో ఆయా శాఖల నుంచి సర్వే నంబర్లవారీగా నివేదికలు తెప్పించుకున్నారు. అయితే, ఈ నివేదికలకు, రెవెన్యూ రికార్డులకు సరిపోలకపోవడంతో ఆ భూములను సర్వే చేయాలని నిర్ణయించారు. ఈ అంశాలన్నింటి నేపథ్యంలో పార్ట్–బీ భూములను సజావుగా పార్ట్–ఏలో చేర్చాలంటే గతంలో ఆయా భూములపై విచారణ జరిపిన తహసీల్దార్లు ఉంటేనే మంచిదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎన్నికల పనులు షురూ.. ఎన్నికల ముందు వేరే స్థానాలకు బదిలీ చేసిన తహసీల్దార్లను పాత స్థానాలకు బదిలీ చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తహసీల్దార్లకు ఎన్నికల పని ప్రారంభమైంది. లోక్‌సభ ఎన్నికల కోసం పోలింగ్స్టేషన్లను హేతుబద్ధీకరించాలని, గ్రామీణ ప్రాంతాల్లో 1,100, పట్టణ ప్రాంతాల్లో 1,300 ఓట్ల కన్నా ఎక్కువ ఉన్న చోట్ల కొత్త పోలింగ్స్టేషన్లను గుర్తించాలని సోమవారమే కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఉత్తర్వులు వచ్చాయి. దీనికితోడు ఈ నెల 26న ఓటర్ల జాబితా ముసాయిదా ప్రకటన వెలువడనుంది. అనంతరం అభ్యంతరాలు, క్లెయిమ్‌లు, తొలగింపు, నమోదు ప్రక్రియను ఫిబ్రవరి 22 వరకు చేపట్టి తుది జాబితా ప్రకటిస్తారు. ఈలోపు లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ కూడా వచ్చే అవకాశాలున్నాయి. ఇప్పుడు తహసీల్దార్లను పాత స్థానాలకు బదిలీ చేసినా మళ్లీ లోక్‌సభ ఎన్నికల సమయంలో బదిలీలు అనివార్యమవుతాయి. ఈ నేపథ్యంలో పార్ట్–బీలో చేర్చిన భూములను సరిదిద్దే ప్రక్రియలో తప్పుదొర్లే అవకాశం తోపాటు జాప్యం జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. బదిలీలు చేయాలి ఎన్నికల సందర్భంలో తహసీల్దార్లను సుదూర ప్రాంతాలకు బదిలీ చేశారు. అప్పటి నుంచి కుటుంబాలకు దూరంగా ఉండి తహసీల్దార్లు విధులు నిర్వహించాల్సి వస్తోంది. ఇప్పుడు మళ్లీ లోక్‌సభ ఎన్నికల పేరుతో తహసీల్దార్ల బదిలీలను నిలిపివేయడం వారి మానసిక ఆందోళనకు కారణమవుతోంది. ప్రభుత్వం సహృదయంతో స్పందించి తహసీల్దార్లను ఎన్నికల ముందున్న స్థానాలకు బదిలీ చేయాలి. – వంగా రవీందర్‌రెడ్డి, అధ్యక్షుడు, తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్. -
17 లక్షల ఎకరాలు.. రూ.500 కోట్లు
సాక్షి, హైదరాబాద్: భూరికార్డుల ప్రక్షాళన అనంతరం వివాదాలున్నాయంటూ పార్ట్–బీలో చేర్చిన భూముల లెక్కలు ఎప్పుడు తేలుతాయో అంతుపట్టడం లేదు. గతేడాది సెప్టెంబర్‌లో ప్రారంభమైన భూరికార్డుల ప్రక్షాళన అనంతరం రాష్ట్రంలో 2.3 కోట్లకు పైగా ఎకరాల్లోని భూముల్లో ఉన్న 1.42 కోట్ల ఎకరాలకు పైగా వ్యవసాయ భూమికి గాను ఏటా పెట్టుబడి సాయం కింద ఎకరాలకు రూ.8 వేలను ప్రభుత్వం అందిస్తుండగా, వివాదాస్పద భూములను పక్కన పెట్టారు. రాష్ట్రంలో తొలిసారి ఈ ఏడాది మేలో రైతుబంధు కింద నగదు సాయమందగా, 5 నెలలైనప్పటికీ వివిధ పని ఒత్తిడుల కారణంగా రెవెన్యూ యంత్రాంగం ఈ భూముల లెక్కలను తేల్చలేకపోయింది. దీంతో ఈ భూముల్లో సాగు చేస్తున్న ప్రస్తుత రైతులకు ఏటా రూ.500 కోట్లపైగానే పెట్టుబడి సాయం నిలిచిపోతోంది. కొత్త ప్రభుత్వం కొలువుదీరాకే..: వివాదాస్పద భూములను పరిష్కరించే ప్రక్రియ ప్రారంభం కాకముందే ఎన్నికలు రావడంతో రెవెన్యూ యంత్రాంగం అంతా ఇప్పుడు అటువైపు దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాతే వివాదాస్పద భూముల లెక్కలు తేలుతాయని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. దీంతో పెట్టుబడి సాయం కింద ఆ భూములకు నగదు అందాలంటే ఎన్నికలైపోయేంతవరకు ఎదురుచూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. -
‘మా భూమి’ ఏమైపోయిందో!
సాక్షి, హైదరాబాద్: సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వు మండల కేంద్రానికి చెందిన ఓ రైతు కుటుంబానికి పదెకరాల భూమి ఉంది. ఆ భూమి ముగ్గురు కుటుంబ సభ్యుల పేరు మీద నమోదయింది. భూరికార్డుల ప్రక్షాళనకు ముందు ఆ ముగ్గురి పేర్ల మీద పాస్‌పుస్తకాలున్నాయి. పహాణీలో పేర్లున్నాయి. మాభూమి వెబ్సైట్లో సర్వేనంబర్‌ను చూసుకుంటే వారి పేర్ల మీదనే ఆ భూమి పదిలంగా ఉండేది... కానీ, ఇప్పుడు ఆ భూమికి పాస్పుస్తకాల్లేవు. ఎవరో ఫిర్యాదు చేశారని రెవెన్యూ యంత్రాంగం పాస్‌పుస్తకాలు నిలిపివేసింది. వారి భూములను పార్ట్–బీలో చేర్చి పక్కన పెట్టింది. కనీసం ఆన్లైన్లో చూసుకుందామన్నా ఇప్పుడు మా భూమి వెబ్సైట్ లేదు. భూరికార్డులూ అందుబాటులో లేవు. ఇప్పుడు ఆ భూమి ఎవరి పేరు మీద ఉందో కూడా తెలియని పరిస్థితి. ఆ రైతు కుటుంబంలో ఎడతెగని ఆందోళన.. ఈ ఆందోళన ఆ ఒక్క రైతు కుటుంబానిదే కాదు.. కారణమేదైనా భూరికార్డుల ప్రక్షాళన తర్వాత తమ భూములకు పాస్‌పుస్తకాలు రాని లక్షలాది మంది రైతులది. అన్నీ సరిగానే ఉన్నా సాంకేతిక కారణాలతో పాస్‌పుస్తకాలు రాని వారు, పుస్తకాల్లో అచ్చు తప్పులు పడి మళ్లీ ప్రభుత్వానికి తమ పుస్తకాలను సరెండర్ చేసినవారు, ఎవరో, ఏదో ఫిర్యాదు చేశారని, సరైన ఆధారాలు, డాక్యుమెంట్లు లేకుండానే పార్ట్–బీలో చేర్చిన భూములకు చెందిన రైతులంతా ఇప్పుడు ఇదే ఆందోళనతో కొట్టుమిట్టాడుతుండడం గమనార్హం. ధరణీ.. కానరాదేమీ! భూరికార్డుల ప్రక్షాళనలో భాగంగా రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 57లక్షలకు పైగా ఖాతాల్లో 2కోట్లకు పైగా ఎకరాల భూమికి సంబంధించిన రికార్డులను సరిచేశారు. 49లక్షలకు పైగా ఖాతాలకు పాస్‌పుస్తకాలను ముద్రించారు. ఆధార్ నంబర్లు, ఫొటోలు లేవనే కారణంతో 7లక్షలకు పైగా ఖాతాలకు పుస్తకాలను అసలు ముద్రించనే లేదు. ముద్రించిన వాటిలో ప్రభుత్వ లెక్కల ప్రకారమే 7లక్షలకు పైగా పుస్తకాలను పంపిణీ చేయలేదు. కొన్ని కాలమ్‌లు రాలేదని, తప్పులు వచ్చాయంటూ నిలిపివేసిన వీటిలో దాదాపు నాలుగు లక్షల పుస్తకాలను మళ్లీ పంపిణీకి జిల్లాలకు పంపారు. అంటే, మొత్తంమీద 10లక్షలకు పైగా ఖాతాలకు పాస్‌పుస్తకాలు లేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు, ఈ ఖాతాల్లో ఉన్న భూములపై ఎవరికి హక్కులున్నాయో కూడా తెలియని పరిస్థితి. అసలు ఆ భూములు తమ పేరు మీద వస్తాయా రావా... పాస్‌పుస్తకాలు ఇస్తారో లేదోననే ఆందోళన రైతాంగంలో నెలకొంది. ధరణి పేరు మీద పైలట్‌గా ప్రారంభమయిన 21 మండలాల్లోనూ రికార్డులు సరిగా లేకపోవడంతో రాష్ట్రమంతటా ఇదే పరిస్థితి నెలకొంది. ఇక పార్ట్–బీ పేరుతో వివాదాలున్నాయని పక్కన పెట్టిన భూములను ఇంతవరకు పరిష్కరించలేదు. ఇలా మరో 3లక్షలకు పైగా ఖాతాల్లో రైతులు అసలు తమ భూమి తమకు దక్కుతుందో లేదోననే ఆందోళనలో ఉన్నారు. పాస్ పుస్తకాలు ఇచ్చిన రైతులు కూడా తమ భూమి ఆన్లైన్లో ఎవరి పేరు మీద ఉందోననే గాభరాకు గురవుతున్నారు. కేవలం పాస్పుస్తకమే తమకు ఆధారంగా ఉందని, ఆన్లైన్ రికార్డుల్లో కూడా తమ పేర్లు చేర్చాలని వారు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో భూరికార్డుల ప్రక్షాళన వివరాలను ఆన్లైన్లో ఉంచాలని, భూమి ఎవరి పేరు మీద ఉన్నదనే ప్రస్తుత స్థితిని తెలియజేస్తూ రికార్డులు నమోదు చేయాలని, అవసరమైతే మార్పులు, చేర్పులు చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఏడాది నుంచి రికార్డుల్లేవు.. వాస్తవానికి, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు రెవెన్యూ రికార్డులు అందుబాటులో ఉండేవి కావు. రైతుల దగ్గర ఉండే పాస్‌పుస్తకాలు తప్ప భూమికి సంబంధించిన ఏ రికార్డు కావాలన్నా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరగాల్సిందే. ఆమ్యామ్యాలు సమర్పించుకోవాల్సిందే. అయితే, ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ హయాంలో నిజామాబాద్ జిల్లాలో ‘భూభారతి’పేరుతో పైలట్ ప్రాజెక్టు ప్రారంభించి రెవెన్యూ రికార్డులను కంప్యూటరీకరించే ప్రయత్నం జరిగినా అది పూర్తి కాలేదు. కానీ, భూపరిపాలన ప్రధాన కమిషనర్‌గా రేమండ్ పీటర్ బాధ్యతలు చేపట్టాక 2016లో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని భూముల వివరాలను పబ్లిక్ డొమైన్లో ఉంచారు. ఫలానా సర్వే నంబర్లో ఉన్న భూమి ఏ రైతు పేరు మీద ఉందో చూపించే విధంగా ‘మా భూమి’వెబ్సైట్లో పొందుపరిచారు. కానీ, భూరికార్డుల ప్రక్షాళన ప్రారంభమయిన 2017, సెస్టెంబర్ 15 నుంచి ఈ వెబ్‌సైట్‌ను నిలిపివేశారు. ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో భూరికార్డుల ప్రక్షాళన వివరాలను నమోదు చేసిన అధికారులు, ఆ తర్వాత ధరణి పేరుతో కొత్త వెబ్సైట్ ప్రారంభించారు. -
చుక్కలు చూపుతున్న ‘ధరణి’!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని భూ రికార్డుల సమగ్ర నిర్వహణకు రూపొందించిన ‘ధరణి’వెబ్సైట్ రెవెన్యూ సిబ్బందికి చుక్కలు చూపెడుతోంది. పాస్ పుస్తకాల జారీలో జరిగిన తప్పుల సవరణకు వెబ్సైట్ సహకరించడం లేదని రెవెన్యూ సిబ్బంది వాపోతున్నారు. ఖాతా నంబర్లు, సర్వే నంబర్లు ధరణి పోర్టల్‌లో కనపడటం లేదని, అవసరం లేని వాటికి పాస్ పుస్తకాలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. ఒక్క ఖాతాను నమోదు చేసేందుకు నాలుగు దశల్లో బయోమెట్రిక్ ఇవ్వాల్సి వస్తుండటంతో చాలా సమయం వృథా అవుతోందని పేర్కొంటున్నారు. గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చోవాల్సి వస్తోందని, దీనివల్ల ఇతర రెవెన్యూ పనులు పెండింగ్‌లో పడిపోతున్నాయని వారంటున్నారు. దీంతో భూ రికార్డుల సవరణ పనులు ముందుకు సాగడం లేదని వాపోతున్నారు. ఈనెల మొదట్లోనే ఈ విషయాలన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చామని, ధరణి పోర్టల్‌లో మార్పులు చేయాలని కోరినా ఉన్నతాధికారులు పట్టించుకోలేదని అంటున్నారు. దీంతో పాస్ పుస్తకాల్లో తప్పుల సవరణ ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు ధరణి వెబ్సైట్ ద్వారా ఎదురవుతున్న ఇబ్బందులివే: - తప్పులు సరిచేయడం కోసం కొన్ని సర్వే నంబర్లను వెబ్సైట్లో నమోదు చేసినా అవి కనిపించడం లేదు. - ప్రతి రైతు ఖాతాపై డిజిటల్ సంతకం చేయాలంటే ఆ రైతు ఆధార్ నంబర్ తప్పనిసరి. ఆధార్ నంబర్లు గతంలో ఇవ్వని వారు, ఫొటోలు లేని రైతులు వారి ఆధార్ నంబర్లు, ఫొటోలు మీ సేవా కేంద్రాల్లో అప్లోడ్ చేయించినా ధరణి పోర్టల్‌లో కనిపించడం లేదు. దీంతో డిజిటల్ సంతకాలు ఆగిపోతున్నాయి. - ప్రతి ఎంట్రీకి తహసీల్దార్లు రెండుసార్లు బయోమెట్రిక్ ఇవ్వాల్సి వస్తోంది. ఎంట్రీకి ముందు, తర్వాత నిర్ధారణ కోసం రెండుసార్లు బయోమెట్రిక్ ఇస్తున్నారు. ప్రతి ఎంట్రీకి డేటాఎంట్రీ ఆపరేటర్, సీనియర్ అసిస్టెంట్, నాయిబ్ తహసీల్దార్, తహసీల్దార్ డిజిటల్ సంతకాలు చేయాలి. ఇన్నిసార్లు బయోమెట్రిక్ అవసరం లేదని రెవెన్యూ సిబ్బంది అంటున్నారు. ఖాతాను నిర్ధారించే సమయంలో వీఆర్వో, తహసీల్దార్ బయోమెట్రిక్ ఇస్తే సరిపోతుందన్నది వారి అభిప్రాయం. - ఒక పట్టాదారుకు ఒక ఖాతాలో రెండు సర్వే నంబర్లు ఉండి.. అందులో ఒక సర్వే నంబర్లో ఇంటి స్థలం, మరో సర్వే నంబర్లో వ్యవసాయ భూమి ఉంటే ఒక సర్వే నంబర్‌కు మాత్రమే పట్టాదారు పాసు పుస్తకం అవసరమవుతుంది. కానీ డిజిటల్ సంతకం కోసం ఆ ఖాతా నంబర్‌ను నమోదు చేస్తే రెండు సర్వే నంబర్లు కనిపిస్తున్నాయి. రెవెన్యూ సిబ్బంది బయోమెట్రిక్ ఇచ్చిన వెంటనే ఇంటి స్థలం ఉన్న సర్వే నంబర్‌కు కూడా డ్రాఫ్ట్ పాస్ పుస్తకం కనిపిస్తోంది. దీంతో తహసీల్దార్లు ఆ రైతు ఖాతాపై డిజిటల్ సంతకం చేయలేకపోతున్నారు. - ధరణి వెబ్సైట్ ద్వారా భూముల మ్యుటేషన్ అవకాశం కూడా కల్పించారు. అయితే ఒక భూమిపై ఎక్కువ కొనుగోలు లావాదేవీలు జరిగినప్పుడు కేవలం మొదట రిజిస్ట్రేషన్ జరిగిన కొనుగోలు లావాదేవీలో ఉన్న వ్యక్తి పేరు మాత్రమే కనిపిస్తోంది. ఆ తర్వాత లావాదేవీల వివరాలు కనిపించడం లేదు. - ధరణి పోర్టల్ నెట్వర్క్, సర్వర్ కూడా చాలా తక్కువ వేగంతో పనిచేస్తున్నాయి. తహసీల్దార్ కార్యాలయాల్లోని ఇంటర్నెట్ కూడా సరిగా పనిచేయడం లేదు. దీంతో సకాలంలో డేటా ఎంట్రీ కావడం లేదు. - డిజిటల్ సంతకం చేసే ప్రక్రియ కూడా నత్తనడకన సాగుతోంది. సాంకేతిక కారణాల వల్ల డిజిటల్ సంతకం చేసే క్రమంలో అనేక తప్పులు వస్తున్నాయి. డేటా ఎంట్రీ ఆపరేటర్ రైతుల ఖాతా నంబర్లను నమోదు చేసిన క్రమంలో ఏదైనా తప్పులు వస్తే వాటిని సరిచేసే అవకాశం సీనియర్ అసిస్టెంట్లు, నాయిబ్ తహసీల్దార్లకు ఇవ్వాలని రెవెన్యూ సిబ్బంది కోరుతున్నారు. - మిగిలిన సర్వే నంబర్లు నమోదు చేసే అవకాశం ధరణి పోర్టల్‌లో కల్పించారు. అయితే ఒక సర్వే నంబర్లో మిగిలి పోయిన సబ్ సర్వే నంబర్లను నమోదు చేసేందుకు ప్రాథమిక సర్వే నంబర్ కనిపించడం లేదు. - డిజిటల్ సంతకం చేసేందుకు ఒక ఖాతాలోని అన్ని సర్వే నంబర్లు కనిపిస్తున్నాయి. అదే ఖాతాలోని ఇంటి స్థలాలు, వివాదాస్పద భూములు, అమ్ముకున్న భూముల వివరాలు కూడా కనిపిస్తున్నాయి. -
ధరణి వెబ్సైట్ నిర్వహణపై ఆరోపణలు
-
బోనస్.. వాపస్..!
సాక్షి, హైదరాబాద్: భూ రికార్డుల ప్రక్షాళన కథ అడ్డం తిరిగింది. ప్రక్షాళన దశలో అభినందనలు పొందిన ఈ ప్రక్రియ.. పాస్ పుస్తకాల పంపిణీ సమయానికి నిందారోపణలకు దారితీయడం తహసీల్దార్లకు రుచించడం లేదు. పాస్ పుస్తకాల్లో పెద్ద ఎత్తున వచ్చిన తప్పులకు తమను బాధ్యులుగా చేయడాన్ని నిరసిస్తూ ప్రభుత్వం తమకు బోనస్‌గా ఇచ్చిన నెల మూల వేతనాన్ని తిరిగి ఇచ్చివేయాలని తహసీల్దార్ల సంఘం నిర్ణయించింది. పాస్ పుస్తకాల్లో వచ్చిన తప్పుల బాధ్యతను తమపై రుద్దుతున్నందుకు నిరసనగానే ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించింది. ఈ విషయంలో ఉన్నతాధికారులు తమపై కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని, పాస్ పుస్తకాల ముద్రణలో అసలేం జరిగిందన్న విషయాన్ని ముఖ్యమంత్రితోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలసి వివరిస్తామని వారు చెబుతున్నారు. ధరణి వెబ్సైట్ లోపభూయిష్టం భూ రికార్డులను సమగ్రంగా నమోదు చేసేందుకు రూపొందిస్తున్న ధరణి వెబ్సైట్ కూడా లోపభూయిష్టంగా ఉందని తహసీల్దార్లు ఆరోపిస్తున్నారు. ధరణి వెబ్సైట్ అందుబాటులోకి రానందున తప్పులు సరిచేసే అవకాశం అమల్లోకి రాలేదని, వెబ్సైట్లో ఇచ్చిన ఆప్షన్లు కూడా లోపభూయిష్టంగా ఉన్నాయని వారంటున్నారు. -
అవకతవకలకు పాల్పడిన నలుగురిపై కేసు
కట్టంగూర్ (నకిరేకల్) : భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా మండలంలోని అయిటిపాముల గ్రామంలో ఆన్లైన్ ఎంట్రీలో అవకతవకలకు పాల్పడిన నలుగురిపై కట్టంగూర్ పీఎస్‌లో కేసు నమోదైంది. బుధవారం స్థానిక పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్ఐ రంజిత్ వివరాలు వెల్లడించారు. మార్చి 26, 2018న తహసీల్దార్ తిరందాసు వెంకటేశం ఆన్లైన్ ఎంట్రీలో కంప్యూటర్ ఆపరేటర్ విజయ్ అవకతవకలకు పాల్పడినట్లు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేయగా కొత్త విజయ్ ద్వారా ఆన్లైన్ పాస్వర్డ్ తెలుసుకున్న అయిటిపాముల వీఆర్ఏ కొండ్ర చిన యాదయ్య రసూల్‌గూడేనికి చెందిన ముక్కెర సైదులు అలియాస్ ప్రభుకు తెలిపాడు. దీంతో సైదులు తన తండ్రి, తాతల పేర్ల మీద ఉన్న భూమి ఆన్లైన్లో రాలేదని, ఎలాగైనా ఆన్లైన్లో ఎంట్రీ చేయాలని అయిటిపాముల సర్పంచ్ భర్త పెద్ది సుక్కయ్యకు పాస్వర్డ్ చెప్పాడు. దీంతో సైదులుకు చెందిన సెల్ఫోన్లో సైదులు తండ్రి పేరుతో పాటు మరికొందరికి చెందిన భూముల సర్వే నంబర్లు ఆన్లైన్ ఎంట్రీ చేశారు. బుధవారం ముక్కెర సైదులు, వీఆర్ఏ కోండ్ర చినయాదయ్యను అరెస్ట్ చేసి కోర్టుకు పంపారు. కాగా పెద్ది సుక్కయ్య, కొత్త విజయ్‌లు పరారీలో ఉన్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. -
ఓసారి భూ.. రికార్డులు తిరగేస్తే..
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో భూ రికార్డుల నవీకరణను ప్రభుత్వం చేపడుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సంస్థానంలో రెవెన్యూ శాఖ ఏర్పాటు ఎలా జరిగింది ? నిజాం కాలం నాటి భూ రికార్డులు నేటికీ ఎలా ఆధారమయ్యాయి? అప్పటి భూముల స్థితిగతులు, రికార్డులు, పన్ను వసూలు ఎలా ఉండేవి తదితర వివరాలను ఓ సారి చూద్దామా.. సాలార్ జంగ్ హయాంలో రెవెన్యూ వ్యవస్థ .. ప్రధానమంత్రి సాలార్ జంగ్ నేతృత్వంలో రెవెన్యూ బోర్డును 1864లో ఏర్పాటు చేశారు. అప్పటికే దే«శవ్యాప్తంగా షేర్షా సూరి ఏర్పాటు చేసిన రెవెన్యూ వ్యవస్థ కొనసాగేది. నిజాం పాలనలో ప్రధాన ఆదాయ వనరు భూమి శిస్తు వసూలు. అప్పటికే భూ రికార్డులు అస్తవ్యస్తంగా ఉన్నాయి. దీంతో తొలిసారి 1864– 1880 మధ్య కాలంలో భూములను గొలుసుల ద్వారా కొలిచి గుంటలుగా లెక్కగట్టి ఎకరాలుగా నిర్ధారణ చేశారు. ఇలా భూముల సర్వే, భూ రికార్డుల పునర్వ్యవస్థీకరణ, రెవెన్యూ రికార్డుల క్రమబద్ధీకరణ జరిగింది. హైదరాబాద్ స్టేట్‌లో తొలి భూముల సర్వే 1940–1950 మధ్య కాలంలో మహారాష్ట్ర బ్రాహ్మణులతో ప్రతి గ్రామంలో రైత్వారీ పట్టా భూములు, ప్రభుత్వ భూముల సర్వేను నిర్వహించారు. ఈ సర్వేలో భూముల కొలతలు, హద్దులు, యాజమాన్యపు హక్కులు సరిచేసి వసూల్ బాకీ, సేత్వార్ రికార్డులను తయారు చేశారు. ఈ రికార్డుల్లో సర్వే నంబర్ విస్తీర్ణం, పట్టాదారుడి వివరాలు, యోగ్యమైన భూమి... పూట్ కరాబ్ (వ్యవసాయానికి పనికిరాని భూమి), ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటల వివరాలు నమోదు చేశారు. వసూలు బాకీ రికార్డు పాత సర్వే నంబర్, పాత విస్తీర్ణం, కొత్త సర్వే నంబర్, కొత్త విస్తీర్ణం నమోదు చేసి దీని ఆధారంగా వసూలు బాకీ రికార్డులు రూపొందించారు. సర్వే నంబర్ వారీగా నిర్ణీత విస్తీర్ణంతో హద్దు రాళ్లు పాతి, టిప్పన్ ఆధారంగా సేత్వార్ రికార్డు తయారు చేశారు. వసూల్ బాకీ, సేత్వార్ ఆధారంగా 1953–56 వరకు మూడేళ్లకు ఒకే కాస్రా పహాణీ రాశారు. భూ రికార్డుల ప్రక్షాళన ఎందుకంటే... 62 ఏళ్లుగా రెవెన్యూ రికార్డుల్లో ఎన్నో మార్పులు జరిగాయి. (ఉదాహరణకు పట్టాదారు చనిపోవడం, భూముల క్రయ విక్రయాలు, వంశపారంపర్యంగా వారసుల పేర మార్పిడి). సేత్వార్ ప్రకారం సర్వే నంబర్ నిర్ణీత విస్తీర్ణంలో మార్పులు చేర్పులు, పట్టాదారుల, కబ్జాదారుల పేర్లు, యాజమాన్యపు ఆధారాలు, సంబంధం లేని వ్యక్తుల పేర్లు పహాణీలోని తప్పుగా నమోదు చేయడంతో రికార్డుల ప్రక్షాళన అనివార్యమైంది. కాస్రా పహాణీ రికార్డు రైతులకు రుణాలు, ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం విషయంలో అనేక సమస్యలు ఎదురయ్యాయి. గతంలో ఉన్న రికార్డుల ఆధారంగానే భూముల దగ్గరకు వెళ్లి సేత్వార్ ప్రకారం సర్వే నంబర్ విస్తీర్ణం ఉందా లేదా చూసి, ఆ భూమి పట్టాదారుడు, అనుభవదారుడు పేరిట సరికొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేస్తున్నారు. మారిన భూమి శిస్తు వసూలు విధానం గతంలో ప్రతి వ్యవసాయ భూమికి నీటి వనరుల పారకం ఆధారంగా శిస్తులు జమాబందీలో నిర్ణయించి వసూలు చేసేవారు. దీనికి అదనంగా మెట్ట పంటలకు లోకల్ సెస్ పేరుతో శిస్తు ఉండేది. ప్రస్తుత విధానంలో ప్రభుత్వ నీటి వనరుల ద్వారా పారకం ఉన్న మాగాణి, మెట్ట భూములకు నీటి పన్ను మాత్రమే వసూలు చేస్తున్నారు. పాత భూమి శిస్తు విధానంలో పహాణీలో పట్టాదారు, కబ్జాదారుడి వివరాలు సరిగా నమోదయ్యేవి. ప్రస్తుత విధానంలో కేవలం నీటి పన్ను (వాటర్ సెస్ ) చెల్లించే వారి పేర్లు మాత్రమే నమోదు చేస్తున్నారు. ఇతర వ్యవసాయ భూముల పట్టాదారు, కబ్జాదారు, ఇతర వనరులతో సేద్యం చేసిన భూముల వివరాలు పహాణీల్లో సరిగా నమోదు కావడం లేదు. రాగితో తయారు చేసిన భూ రికార్డు రెవెన్యూ సంవత్సరం ఎప్పటి నుంచి అంటే.... ఇప్పటికీ ఫసలీ సంవత్సరం ప్రకారం జూన్ మొదటి తేదీ నుంచి మే చివరి తేదీ వరకు రెవెన్యూ వ్యవస్థ కొనసాగుతోంది. వర్షాకాలం మొదటి పంట(ఆది) జూన్ నుంచి నవంబర్ వరకు, రెండో పంట (తాబి) డిసెంబర్ నుంచి మే వరకు. దీని ఆధారంగానే నేటికీ భూమి శిస్తులు వసూలు చేస్తున్నారు. -
తెలుగులోనూ ‘ధరణి’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూరికార్డుల సమీకృత నిర్వహణ కోసం రూపొందిస్తోన్న ‘ధరణి’వెబ్‌సైట్‌ను తెలుగు భాషలో అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాల్లోని రైతాంగానికి సంబంధించిన భూముల వివరాలన్నింటినీ పొందుపరిచే ఈ వెబ్‌సైట్‌ను అందరికీ అర్థమయ్యేలా తొలిసారి మాతృభాషలో రూపొందిస్తున్నారు. డాటా మొత్తాన్ని తెలుగులోనే అందుబాటులో ఉంచనున్నారు. తెలుగుతో పాటు ఇంగ్లీషులో కూడా ఈ వెబ్సైట్ రూపొందిస్తున్నారు. జిల్లాకో మండలంలో.. కాగా, ధరణి వెబ్‌సైట్‌ను ఈనెల 19 నుంచి జిల్లాకో మండలంలో ప్రారంభించాలని రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు. గుడిహత్నూర (ఆదిలాబాద్), పాల్వంచ రూరల్ (భద్రాద్రి కొత్తగూడెం), రాయికల్ (జగిత్యాల), రఘునాథపల్లి (జనగామ), మొగుళ్లపల్లి (భూపాలపల్లి), ఐజ (గద్వాల), యెల్లారెడ్డి (కామారెడ్డి), మానకొండూరు (కరీంనగర్), ముదిగొండ (ఖమ్మం), ఆసిఫాబాద్ (కొమురం భీం), కేసముద్రం (మహబూబాబాద్), దేవరకద్ర (మహబూబ్‌నగర్), నెన్నెల్ (మంచిర్యాల), రామాయంపేట (మెదక్), మేడిపల్లి (మేడ్చల్), బిజినేపల్లి (నాగర్‌కర్నూలు), కట్టంగూరు (నల్లగొండ), నిర్మల్ రూరల్ (నిర్మల్), బాల్కొండ (నిజామాబాద్), అంతర్గాం (పెద్దపల్లి), ఇల్లంతుకుంట (రాజన్న సిరిసిల్ల), శేరిలింగంపల్లి (రంగారెడ్డి), రామచంద్రాపురం (సంగారెడ్డి), చేర్యాల (సిద్దిపేట), చివ్వెంల (సూర్యాపేట), నవాబ్‌పేట (వికారాబాద్), పెబ్బేర్ (వనపర్తి), హసన్‌పర్తి (వరంగల్ అర్బన్), నర్సంపేట (వరంగల్ రూరల్), తుర్కపల్లి (యాదాద్రి) మండలాల్లో ఈ వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తేనున్నారు. అదే రోజు నుంచి తహశీల్దార్లకు భూముల రిజిస్ట్రేషన్ బాధ్యతలు కూడా అప్పగించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. అయితే, ఈ బాధ్యతల అమలును పైలట్ ప్రాజెక్టు తరహాలో పరిశీలించాలా లేక రాష్ట్రంలోని అన్ని మండలాల్లో (సబ్రిజిస్ట్రార్లు లేని మండలాలు) ఒకేసారి అప్పగించాలా అన్నదానిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అన్ని సేవలతో అనుసంధానం ధరణి వెబ్‌సైట్‌తో రాష్ట్రంలోని వ్యవసాయ భూముల సమగ్ర సమాచారం అందుబాటులోకి రానుంది. గ్రామాలు, మండలాలు, జిల్లాల వారీగా రైతుల సర్వే నంబర్లతో సహా భూముల వివరాలను ఈ వెబ్సైట్లో పొందుపరుస్తున్నారు. ఫలానా భూమిపై జరిగిన లావాదేవీలకు సంబంధించిన వివరాలు క్షణాల్లో అప్డేట్ అయ్యే లా సాఫ్ట్వేర్ రూపొందిస్తున్నారు. ముఖ్యం గా కోర్‌బ్యాంకింగ్, రిజిస్ట్రేషన్, సర్వే సెటిల్మెంట్ తదితర వివరాలన్నింటినీ అందు బాటులోకి తెస్తున్నారు. బ్యాంకర్లు ఆన్లైన్లోనే రైతుల భూముల వివరాలు చూసు కుని రుణాలు ఇచ్చే వెసులుబాటు కల్పిం చేలా డేటా రూపొందిస్తున్నారు. ఈ వెబ్‌సైట్‌ను ప్రయోగాత్మకంగా ఈనెల 8వ తేదీ నుంచి రాష్ట్రంలోని ఐదు మండలాల్లో అమల్లోకి తెస్తున్నారు. జగదేవ్‌పూర్ (సిద్దిపేట), ఘట్కేసర్ (మేడ్చల్), కొత్తూరు (రంగారెడ్డి), సదాశివపేట (కామారెడ్డి), కూసుమంచి (ఖమ్మం) మండలాలకు సంబంధించిన అన్ని భూముల వివరాలు ఆ రోజునుంచి ధరణి వెబ్సైట్లో అందుబాటులోకి రానున్నాయి. -
నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
సాక్షి, మెదక్ : నిర్ణీత గడువులోగా భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం పూర్తి చేయకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ధర్మారెడ్డి అధికారులను హెచ్చరించారు. శనివారం ఆయన కలెక్టరెట్లోని సమావేశ మందిరంలో భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమంపై ఆర్డీఓలు, తహసీల్దార్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమం విజయవంతం చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు. కార్యక్రమం చేపట్టి ఆరు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ పూర్తిస్థాయిలో జరగడం లేదన్నారు. ఈ పనితీరుతో తహసీల్దార్లు ఏ స్థాయిలో విధులు నిర్వర్తిస్తున్నారో తెలుస్తుందన్నారు. “డిజిటల్ సంతకాలు పూర్తయిన తర్వాత కూడా తప్పులు సరిచేస్తామంటే ఎలా ? అని మండిపడ్డారు. సంతకాలు చేసేటప్పుడు సరిచేసుకోవాలని తెలియదా? అని ప్రశ్నించారు. ఒకరిద్దరి అజాగ్రత్త వల్ల అందరికి సమస్యలు ఎదురవుతాయని, చివరకు ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందన్నారు. మండలం మొత్తంలో వంద సర్వే నంబర్లలో సమస్యలు ఉంటాయని, వాటినికూడా గుర్తించి పరిష్కరించకపోతే ఎలా? అన్నారు. భుజరంపేట గ్రామంలో సుమారు వెయ్యి ఎకరాలు పార్ట్–బీలో పెట్టారని అక్కడ 150 ఎకరాలు మాత్రమే అసైన్డ్ భూమి ఉంటే మొత్తం పార్ట్–బీలో ఎందుకు పెట్టారని సంబంధిత తహసీల్దార్‌ను ప్రశ్నించారు. సమయం పూర్తి కాగానే ఇంటికి వెళ్దాం అనే ధోరణి మార్చుకొని అందుబాటులో ఉండి కార్యక్రమం పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో జేసీ నగేశ్, డీఆర్ఓ రాములు, ఆర్డీఓలు నగేష్, మధు, తహసీల్దార్లు పాల్గొన్నారు. -
మూడు దశల్లో ‘పెట్టుబడి’ సాయం!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో రైతులకు పెట్టుబడి సాయాన్ని మూడు దశల్లో అందజేయాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. రెవెన్యూ శాఖ చేపట్టిన భూప్రక్షాళన రికార్డుల డిజిటలైజేషన్ ప్రక్రియ జాప్యం అవుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. డిజిటలైజేషన్ అవుతున్న భూముల వివరాలను ఎప్పటికప్పుడు తీసుకుని ఆ మేరకు రైతులకు పెట్టుబడి చెక్కులను పంపిణీ చేస్తామని పేర్కొంటున్నాయి. వచ్చే నెల 19న చెక్కుల పంపిణీ ప్రక్రియను మొదలుపెట్టి.. 45 రోజుల్లో రైతులందరికీ పంపిణీ చేస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే ఒక్కో దశలో కచ్చితంగా ఇంత మందికి పంపిణీ చేయాలన్నట్టుగా కాకుండా.. వీలైనంత మంది రైతులకు ఇస్తూ, మూడు దశల్లో మొత్తం పంపిణీ పూర్తి చేస్తామని వెల్లడిస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి, బ్యాంకులకు కూడా నిధుల సమస్య, కరెన్సీ కొరత వంటివి తలెత్తకుండా ఉంటుందని పేర్కొంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 70 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం చెక్కులు అందజేయాల్సి ఉండగా.. ఆరు బ్యాంకులకు ఈ బాధ్యతను అప్పగించారు. అందులో ఒక్క ఎస్బీఐ ద్వారానే 18 లక్షల మందికి చెక్కుల పంపిణీ జరగనుంది. మిగతా ఐదు బ్యాంకులు మిగతా రైతులకు చెక్కులు పంపిణీ చేస్తాయి. రికార్డుల డిజిటలైజేషన్ పూర్తయిన భూముల వివరాలను, రైతుల సమాచారాన్ని వ్యవసాయ శాఖ ఎప్పటికప్పుడు బ్యాంకులకు అందజేస్తుంది. ఆ ప్రకారం చెక్కులను ముద్రించి జిల్లాలకు పంపిస్తారు. ఖరీఫ్‌లోనే రూ.6,600 కోట్లు.. రాష్ట్రంలో రైతులకు పెట్టుబడి సాయం పథకాన్ని వచ్చే ఖరీఫ్ నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద రైతులకు ఎకరాకు ఖరీఫ్‌లో రూ.4 వేలు, రబీలో రూ.4 వేల చొప్పున అందజేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 1.65 కోట్ల ఎకరాలకు సంబంధించి సాయం పంపిణీ చేయాల్సి ఉంటుందని అంచనా. ఇందుకోసం ఖరీఫ్ సీజన్లోనే రూ.6,600 కోట్లు చెల్లించాల్సి ఉంది. మొత్తంగా రెండు సీజన్లకు కలిపి పెట్టుబడి పథకానికి రూ.12 వేల కోట్లను బడ్జెట్లో కేటాయించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. రైతులకు బ్యాంకు ఖాతా తప్పనిసరి పెట్టుబడి పథకం కింద రైతులకు ‘ఆర్డర్ చెక్కులు’జారీ చేయనున్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో జారీ చేసే ఈ ఆర్డర్ చెక్కులను ఏ బ్యాంకులోనైనా, ఏ బ్రాంచీలోనైనా నగదుగా మార్చుకోవడానికి వీలుంటుందని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. అయితే సంబంధిత రైతుకు ఏదో ఒక బ్యాంకులో తప్పనిసరిగా ఖాతా ఉండాలి. చెక్కును క్లియర్ చేసేటప్పుడు బ్యాంకులు సదరు రైతుకు ఖాతా ఉందో లేదో పరిశీలిస్తాయి. సంబంధిత రైతే ‘పెట్టుబడి’చెక్కును క్లియర్ చేసుకుంటున్నాడో లేదో గమనించడానికి.. దుర్వినియోగం కాకుండా నియంత్రించడానికి ఈ నిబంధన పెట్టినట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి. రైతులెవరికైనా బ్యాంకు ఖాతా లేకుంటే వెంటనే తెరవాలని సూచిస్తున్నాయి. -
రెవెన్యూ ఉద్యోగులకు కేసీఆర్ గిఫ్ట్
సాక్షి, హైదరాబాద్: భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన రెవెన్యూ శాఖ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు బంపర్ బొనాంజా ప్రకటించారు. వారికి ప్రోత్సాహకంగా ఒక నెల మూల వేతనాన్ని ఇవ్వాలని ఆయన నిర్ణయించారు. భూ రికార్డుల ప్రక్షాళనలో ప్రత్యక్షంగా పాల్గొన్న 10,809 మంది రెవెన్యూ ఉద్యోగులు, 24,410 మంది విఏఓలు, 530 మంది సర్వే విభాగం ఉద్యోగులు కలిపి మొత్తం 35,749 మందికి ఒక నెల మూల వేతనాన్ని బోనస్‌గా ఇవ్వాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం, కొత్త పాసు పుస్తకాల పంపిణీపై ప్రగతిభవన్ లో శనివారం సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ‘దేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం వంద రోజుల వ్యవధిలోనే రెవెన్యూ ఉద్యోగులు రేయింబవళ్లు పనిచేసి భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.’ అని అభినందించారు. ‘దాదాపు 80 ఏళ్లుగా భూరికార్డుల నిర్వహణ సరిగా లేదు. క్రయవిక్రయాలు, యాజమాన్యంలో వచ్చిన మార్పులను ఎప్పటికప్పుడు నమోదు చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం వహించారు. భూరికార్డులు గందరగోళంగా మారిన పరిస్థితుల్లో పెట్టుబడి సాయం పథకం అమలు చేసేందుకు ఏ భూమికి ఎవరు యజమానో ఖచ్చితంగా తేలాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. దీంతో భూ రికార్డులను సరిచేసి, పూర్తి పారదర్శకంగా పథకం అమలు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా కేవలం వంద రోజుల్లోనే రెవెన్యూ అధికారులు, ఉద్యోగులు గ్రామాల్లో తిరిగి, రైతులతో మాట్లాడి భూమి యాజమాన్య హక్కులపై స్పష్టత తెచ్చారు. సొంత భూములున్న రైతులతో పాటు, అసైన్డ్ దారులన కూడా ఓ కొలిక్కి తెచ్చారు. రాష్ట్రంలో పంచిన 22.5 లక్షల ఎకరాల భూమికి గాను 20లక్షల ఎకరాల విషయంలో స్పష్టత వచ్చింది. రెండున్నర లక్షల ఎకరాల విషయంలో స్పష్టత కోసం అధికారులు ప్రయత్నిస్తున్నారు. కోర్టు కేసుల్లో ఉన్న భూములు, అటవీ–రెవెన్యూ శాఖల మధ్య వివాదంలో ఉన్న భూములు మినహాయిస్తే మిగతా భూములు కూడా క్లియర్ అయ్యాయి. ఇది సాధారణ విషయం కాదు. దేశంలో ఎవరూ సాధించని ఘనత రెవెన్యూ ఉద్యోగులు సాధించారు. వారికి ప్రోత్సాహకరంగా ఉండేందుకు ఒక నెల మూల వేతనాన్ని అదనంగా అందిస్తాం’ అని సీఎం ప్రకటించారు. -
మరోసారి భూ రికార్డుల వడపోత
సాక్షి, హైదరాబాద్: భూ రికార్డుల ప్రక్షాళన గణాంకాలను ప్రభుత్వం మరో సారి వడపోస్తోంది. రైతులకు పాసు పుస్తకాలు జారీ చేసేందుకు గాను ప్రామాణికంగా ఉండేలా రాష్ట్రంలోని భూముల వివరాలను మరోసారి ఆన్లైన్లో నమోదు చేస్తోంది. ఇందుకోసం ల్యాండ్ రికార్డ్స్ అప్‌గ్రెడేషన్ ప్రోగ్రామ్ (ఎల్‌ఆర్‌యూపీ) వెబ్సైట్లోనే కొత్త విభాగంలో భూముల వివరాలను ప్రత్యేకంగా గుర్తిస్తోంది. వ్యవసాయ, వ్యవసాయేతర భూముల వివరాలను గ్రామాల వారీగా ఈ కొత్త మాడ్యుల్లో నమోదు చేయాలని, వారంలోగా ఈ పనిని పూర్తి చేయాలని రెవెన్యూ ఉన్నతాధికారుల నుంచి అన్ని జిల్లాలకు ఆదేశాలు వెళ్లాయి. స్పష్టతకోసం మరోసారి.. భూ రికార్డుల ప్రక్షాళనలో రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో సర్వే నంబర్ల వారీగా రికార్డుల పరిశీలన, తప్పొప్పుల సవరణ జరిగాయి. ఈ వివరాలన్నింటినీ క్షేత్రస్థాయి రెవెన్యూ యంత్రాంగం ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేస్తోంది. ఇందులో భూములను రెండు కేటగిరీలుగా విభజించి 24 కాలమ్‌ల ఫార్మాట్లో వివరాలు పొందుపరుస్తోంది. ఈ రెండు కేటగిరీల్లో ఒకటి ఎలాంటి వివాదాలు లేని భూములు కాగా, మరోటి వివాదాల్లో ఉన్న భూములు. ఈ 24 కాలమ్‌ల ఫార్మాట్లో కూడా ప్రభుత్వం అసైన్‌చేసిన భూములు, భూసేకరణ జరిపిన భూములు, అటవీ, వాటర్ బాడీస్, కోర్టు కేసుల్లో ఉన్న భూములు, రోడ్లు, ప్రభుత్వ కార్యాలయ భవనాలున్న భూములు, వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలోని భూములు, వక్ఫ్, దేవాదాయ, సాదా బైనామాలు... ఇలా పలు రకాలుగా నమోదు చేస్తున్నారు. వీటితో పాటు ప్రత్యేకంగా మళ్లీ వ్యవసాయేతర భూములను కూడా పొందుపరుస్తున్నారు. ఇన్నిరకాల భూముల నేపథ్యంలో వ్యవసాయ, వ్యవసాయేతర భూముల వివరాలను ఎల్‌ఆర్‌యూపీ ద్వారా గుర్తించి పాసు బుక్కులు జారీ చేయడం కొంత ఇబ్బందిగా ఉండే అవకాశాలున్నాయి. దీంతో మరోసారి స్పష్టంగా భూముల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని రాష్ట్రంలోని అన్ని జిల్లాల అధికారులకు ఆదేశాలిచ్చినట్టు రెవెన్యూ ఉన్నతాధికారులు చెబుతున్నా రు. కేవలం వ్యవసాయ, వ్యవసాయే తర కేటగిరీల్లో రాష్ట్రంలోని అన్ని రకాల భూముల వివరాలను నమోదు చేయిస్తున్నామని, తద్వారా వ్యవసా య భూములకు పాసు పుస్తకాల జారీ ప్రక్రియ సులభమవుతుందని వారంటున్నారు. ఇటీవల జరిగిన ఓ వీడియో కాన్ఫరెన్స్‌లో ఇచ్చిన ఆదేశాల మేరకు గురువారం నుంచే కొత్త మాడ్యూల్లో భూముల వివరాల నమోదు ప్రక్రియ ప్రారంభమయినట్టు సమాచారం. మరోసారి ఆన్లైన్లో నమోదు చేసే కార్యక్రమం మరోవారం రోజుల్లో ముగుస్తుందని, ఈ వివరాలనే పాసు పుస్తకాల జారీకి ప్రామాణికంగా తీసుకుంటామని రెవెన్యూ అధికారులు చెపుతుండడం గమనార్హం. -
‘ధరణి’కి స్పందనేదీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని భూరికార్డుల నిర్వహణ కోసం ప్రభుత్వం రూపొందించిన ‘ధరణి’ వెబ్సైట్ డిజైన్ టెండర్లకు స్పందన కరువయింది. ఈనెల 29న టెండర్ దాఖలు గడువు ముగియగా, కేవలం రెండంటే రెండు బిడ్లే వచ్చినట్టు సమాచారం. అందులోనూ ఓ సంస్థ టెండర్ నిబంధనలకు అనుగుణంగా లేకపోవడంతో ఇప్పుడు రేసులో ఒకే సంస్థ మిగిలింది. ఈ వెబ్సైట్ సాఫ్ట్వేర్ తయారీకోసం మైక్రోసాఫ్ట్, విప్రోలాంటి ప్రతిష్టాత్మక సంస్థలు ముందుకు వస్తాయని ప్రభుత్వం భావించినా అనుభవలేమి కారణంగా ఆయా సంస్థలు బిడ్ దాఖలు చేయలేదు. దీంతో వచ్చిన ఒక్క కంపెనీకి టెండర్ కట్టబెట్టాలా.. లేదా రద్దు చేసి మళ్లీ నిబంధనలు మార్చి టెండర్ పిలవాలా అనే విషయంలో రెవెన్యూ వర్గాలు ఏమీ తేల్చుకోలేకపోతున్నాయి. అయితే, ఈ విషయంపై తుది నిర్ణయాన్ని సీఎం కేసీఆర్‌కు వదిలేసినట్టు సమాచారం. క్లిష్ట నిబంధనలే కారణమా? : ‘ధరణి’వెబ్సైట్ డిజైన్ టెండర్లకుగాను ప్రభుత్వం చాలా నిబంధనలు విధించింది. ఈ వెబ్సైట్ ద్వారా బహుళ ప్రయోజనార్థ భూరికార్డుల నిర్వహణ ఉండాలనే ఆలోచనతో వాటిని రూపొందించారు. దాదాపు రూ.200 కోట్లకు పైగా అంచనాతో రూపొందించే ఈ సాఫ్ట్వేర్ ద్వారా రాష్ట్రంలోని దాదాపు 4కోట్ల సర్వే నంబర్లలోని భూముల వివరాలు పొందుపరచాల్సి ఉంది. మొదటి దశలో మ్యుటేషన్ సర్వీసులు, రెండో దశలో సర్వీసుల ఇంటిగ్రేషన్, మూడో దశలో జీఐఎస్, నాలుగో దశలో బ్లాక్ చెయిన్ విధానాలను అమల్లోకి తేవాల్సి ఉంటుందని నిబంధనల్లో పేర్కొన్నారు. రాష్ట్రంలోని 600 రెవెన్యూ కార్యాలయాల్లో 600 మంది సాంకేతిక నిపుణులను కూడా ఈ సంస్థే సమకూర్చాలని నిబంధన విధించారు. పట్టణ ప్రాంతాల్లోని రికార్డులు కూడా నిర్వహించాలని, భూముల్లో వేసిన పంటల వివరాలతో పాటు కోర్‌బ్యాంకింగ్ సదుపాయం ఉండేలా సాఫ్ట్వేర్ తయారు చేయాలని పేర్కొన్నారు.భూరికార్డుల నిర్వహణకోసం ఉద్దేశించిన ఇలాంటి ప్రాజెక్టును చేసిన అనుభవం ఉండాలనే నిబంధన కారణంగానే బిడ్ దాఖలు చేయడంలో కొన్ని సంస్థలు వెనుకడుగు వేసినట్టు సమాచారం. ఇప్పుడేం చేయాలి..? : ప్రాజెక్టుకు టెండర్ల దశలోనే నిరాశ ఎదురవడంతో ఇప్పుడేం చేయాలన్న దానిపై రెవెన్యూ వర్గాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. బెంగళూరుతో పాటు ఇతర దేశాల్లో భూములకు సంబంధించిన కార్యకలాపాలు నిర్వహించిన సంస్థ ఒకటి టెండర్లలో పాల్గొన్న నేపథ్యంలో ఆ సంస్థ టెక్నికల్ ప్రజెంటేషన్లను పరిశీలిస్తున్న రెవెన్యూ యంత్రాంగం వచ్చిన ఒక్క సంస్థకే టెండర్ ఇవ్వాలా... లేదా మరోసారి టెండర్లు పిలవాలా అన్న సందిగ్ధంలో ఉంది. -
నింగి నుంచి భూమి సర్వే..
మహబూబ్‌నగర్/మహబూబ్‌నగర్ న్యూటౌన్: ప్రతీ సోమవారం కలెక్టరేట్లలో జరిగే ప్రజావాణితో పాటు సర్వే ల్యాండ్ రికార్డుల కార్యాలయాలకు పదుల సంఖ్యలో ఫిర్యాదులు వస్తుంటాయి. తమ భూమి సర్వే చేసి హద్దులు నిర్ధారించాలని ఆ ఫిర్యాదుల్లో పలువురు కోరుతుంటారు. శాశ్వత పరిష్కారం కోసం వీరందరూ ఎదురుచూస్తున్నా ఫలితం ఉండడం లేదు. ఈక్రమంలో నాలుగు నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ రికార్డుల ప్యూరిఫికేషన్‌కు చర్యలు చేపట్టింది. అయితే, రికార్డుల వరకే పరిమితం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా జియోగ్రాఫిక్ ఇన్ఫర్మాటిక్ సిస్టమ్(జీఐఎస్) సర్వే నిర్వహించాలని యోచిస్తోంది. ఇటీవల రాష్ట్ర స్థాయిలో ఉన్నత స్థాయి అధికారుల సమీక్షలో రికార్డుల ప్యూరిఫికేషన్ సర్వే సందర్భంగా క్షేత్ర స్థాయిలో ఎదురైన సమస్యలు, వాటిని అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ క్రమంలోనే జీఐఎస్ ద్వారా భూముల సర్వే చేపడితే ఎలా ఉంటుందనే సాధ్యాసాధ్యాలపై కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చించి సిద్ధంగా ఉండాలని అధికారులకు సూత్రప్రాయంగా నిర్దేశించినట్లు తెలిసింది. రెవెన్యూ శాఖ ప్రక్షాళన రెవెన్యూ శాఖను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా ఇప్పటికే భూముల లెక్క తేల్చడంతో పాటు రికార్డుల ప్యూరిఫికేషన్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సందర్భంగా క్షేత్ర స్థాయిలో రికార్డులకు, క్షేత్ర స్థాయికి తేడాలు ఉన్నట్లు అధికారులు గమనించారు. భూప్రక్షాళన కార్యక్రమం ద్వారా ఆశించిన ఫలితాలు రావాలంటే మరిన్ని చర్యలు అవసరమని భావించిన ప్రభుత్వం జీఐఎస్ ల్యాండ్ సర్వే చేపట్టాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. తద్వారా భూరికార్డులు, హద్దుల విషయంలో పూర్తి పారదర్శకత తీసుకురావాలని యోచిస్తున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇదీ మేలు జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టం(జీఐఎస్) ద్వారా భూముల సర్వే చేపడితే భూయాజమానులకు మేలు జరగడంతో పాటు రికార్డుల నిర్వహణ సైతం పారదర్శకమవుతుంది. సర్వే నంబర్ల వారీగా నిర్ణయించే హద్దుల మేరకు వాస్తవంగా భూమి విస్తీర్ణం, నక్షాలు రూపొందిస్తారు. పట్టాదారుల విస్తీర్ణం తేల్చి తర్వాత హద్దులు నిర్ణయిస్తారు. వీఆర్వో, సర్వేయర్లు ఇచ్చే రిపోర్టు ఆధారంగా రిజిస్ట్రేషన్ చేస్తారు. వీఆర్వో, సర్వేయర్ల రిపోర్టును తప్పని సరిచేయడంతో పాటు కొనుగోలు చేసిన భూమికి పక్కా కొలతలు నిర్ణయిస్తారు. దీని ప్రకారం రిజిస్ట్రేషన్, ముటేషన్ రికార్డుల్లో నమోదు చేయడం ద్వారా భవిష్యత్‌లో కొలతలకు సంబంధించి ఇబ్బందులు ఉండవు. అలాగే, ఎవరైనా భూమి కొలతల సమస్యతో అధికారుల వద్దకు వస్తే పరిష్కరించడం సులువవుతుంది. సర్వే నంబర్ల జియో ట్యాగింగ్ జీఐఎస్ సర్వే ద్వారా భూకొలతలు చేపట్టాక కర్ణాటక తరహాలో సర్వే నంబర్ల వారీగా హద్దులు నిర్ణయించి సర్వే నంబర్లను జియో ట్యాగింగ్ చేస్తారు. వచ్చే నెలలో జరగనున్న ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఆలోచన మేరకు జీఐఎస్ ల్యాండ్ సర్వే నిర్వహిస్తే భూప్రక్షాళన ఆశయం నెరవేరడమే కాకుండా భూ యాజమానులకు కొలతలు, హద్దులు, రికార్డుల పరంగా ఇబ్బందులు తొలగిపోయే అవకాశముంది. ఇందులో భాగంగా సర్వే నంబర్లను జియో ట్యాగింగ్ చేస్తే ఎప్పటికప్పుడు ప్రభుత్వ పర్యవేక్షణ ఉంటుంది. గతంలో ప్రభుత్వ భవనాల నిర్మాణానికి స్థలాలు కేటాయించాలని తహసీల్దార్లకు సూచిస్తే కొన్ని మండలాల్లో ప్రభుత్వ భూములు లేవని చెప్పడం, భూములు ఉన్నట్లు రికార్డులు చెబుతుండడం ఇబ్బందులు తెచ్చిపెట్టాయి. అదే సర్వే నంబర్లను జియో ట్యాగింగ్ చేస్తే వాస్తవంగా ఎంత భూమి అందుబాటులో ఉందో తెలిసిపోనుంది. త్వరలో సర్వే మహబూబ్‌నగర్ జిల్లాలోని తహసీల్దార్లతో ఈనెల 17న కలెక్టర్ రొనాల్డ్‌రోస్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన సమావేశంలో చర్చకొచ్చిన అంశాలను వివరించారు. క్షేత్ర స్థాయిలో ఎదురవుతున్న హద్దుల సమస్యను అన్ని జిల్లాల అధికారులు సమావేశం దృష్టికి తెచ్చారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జీఐఎస్ సర్వే నిర్వహించి భూప్రక్షాళన ఫలితాలను ప్రజలకు అందించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోందని చెప్పారు. -
భూమి @ కొత్త సాఫ్ట్వేర్!
సాక్షి, హైదరాబాద్: భూరికార్డుల ప్రక్షాళన అనంతరం సరిచేసిన రికార్డులను ఆన్లైన్లో నిక్షిప్తం చేసేందుకు ప్రభుత్వం కొత్త సాఫ్ట్వేర్ తయారు చేస్తోంది. భవిష్యత్తులో భూముల క్రయ, విక్రయ లావాదేవీలను పారదర్శకంగా జరిపేం దుకు వీలుగా వెబ్‌ల్యాండ్ స్థానంలో ఈ సాఫ్ట్‌వేర్‌తో కూడిన పోర్టల్‌ను అందుబాటులోకి తేవా లని నిర్ణయించింది. ఇందుకు సీఎం కార్యాలయ అధికారులు ఇటీవల పలు జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో సమావేశం నిర్వహించి ఆమోదముద్ర వేసినట్లు సమాచారం. వారం రోజుల్లో పోర్టల్ తయారీకి సాఫ్ట్వేర్ సంస్థల నుంచి టెండర్లు పిలవాలని, 2 నెలల్లో అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. వెబ్‌ల్యాండ్.. ఇక పాత ముచ్చటే ప్రస్తుతం రాష్ట్రంలోని భూముల వివరాలన్నీ వెబ్‌ల్యాండ్ అనే పోర్టల్‌లో నిక్షిప్తం చేశారు. ఈ డేటా ఆధారంగానే భూముల మ్యుటేషన్లు, రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఈ సాఫ్ట్వేర్ వల్ల మ్యుటేషన్ ప్రక్రియకు ఎక్కువ సమయం పడుతోంది. దీంతో వెబ్‌ల్యాండ్ స్థానంలో కొత్త సాఫ్ట్‌వేర్‌తో కూడిన పోర్టల్‌ను తయారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల సీఎం కార్యాలయంలో సీనియర్ అధికారి టి.నర్సింగరావు నేతృత్వంలో ఐఏఎస్ అధికారులు స్మితా సబర్వాల్, వాకాటి కరుణతో పాటు రంగారెడ్డి, సిద్దిపేట జిల్లా కలెక్టర్లు రఘునందన్‌రావు, వెంకట్రామిరెడ్డి, నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల జాయింట్ కలెక్టర్లు సి.నారాయణరెడ్డి, జి.రవితో సమావేశం నిర్వహించారు. అనుభవం ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీలకు ఈ పోర్ట ల్ తయారీ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు. మైక్రోసాఫ్ట్, ఒరాకిల్లాంటి కంపెనీలే టెండర్లలో పాల్గొనేలా నిబంధనలు రూపొందించారు. దీనినే భవిష్యత్తులో భూరికార్డుల నిర్వహణకు ఉపయోగించనున్నారు. బ్యాంకులకు, జనబాహుళ్యానికి కూడా ఈ పోర్టల్‌ను రెవెన్యూ వ్యవహారాలను పర్యవేక్షించే తహశీల్దార్ కార్యాలయాలతో పాటు రిజిస్ట్రేషన్ ఆఫీసులు, జాతీయ బ్యాం కులకు కూడా అనుసంధానం చేయనున్నారు. పంట రుణాలిచ్చే విషయంలో బ్యాంకులకు ఈ పోర్టల్‌లోని డేటానే ఆధారమయ్యేలా తయారు చేయనున్నారు. మ్యుటేషన్ ప్రక్రియ నిర్ణీత గడువులో ముగిసేలా పోర్టల్‌ను రూపొందించడంతో పాటు జన బాహుళ్యానికి కూడా సులువుగా రికార్డుల వివరాలు అందుబాటులోకి వచ్చేలా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించనున్నారు. ఇప్పటికే దాదాపు భూరికార్డుల ప్రక్షాళన పూర్తి కాగా, ఈ వివరాలను ఎల్‌ఆర్‌యూపీ వెబ్సైట్లో నమోదు చేస్తున్నారు. ఇందులోని వివరాలను కొత్త పోర్టల్‌లోకి మార్చనున్నారు. ఈ పోర్టల్ తయారీకి కనీసం మరో 2 నెలల సమయం పట్టనున్న నేపథ్యంలో జనవరి 26 నుంచి చేపట్టనున్న కొత్త పాస్ పుస్తకాల జారీకి మాత్రం ఎల్‌ఆర్‌యూపీలో నమోదైన డేటానే ప్రామాణికంగా తీసుకోవాలని నిర్ణయించారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న ఎకరానికి రూ.8 వేల పెట్టుబడి సాయాన్ని కొత్త పోర్టల్‌లోని డేటా ఆధారంగానే అందించే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. -
తెరపడని భూబాగోతం
ఆ భూమి మార్కెట్ విలువ కోటి రూపాయలు ఉన్నప్పటికీ కూడా, రాష్ట్ర ఖజానాకు మేలు చేకూర్చే క్రమంలో వారు చేస్తున్న సేవకు గాను, దానిని పది లక్షల రూపాయలకీ, ఇంకా వీలైతే ఒక లక్ష రూపాయలకే బహుమానంగా దఖలు పరుస్తారు. ఈ భూమిని తీసుకున్నవారు అక్కడ పరిశ్రమను స్థాపించేందుకు పెట్టుబడులు కావలసివస్తాయి. ఆ పెట్టుబడులకు అవసరమైన వనరులను సేకరించేందుకు వీలుగా, ఆ భూమినే తాకట్టు పెట్టే అధికారం కూడా కోరతారు (ఆ విన్నపాన్ని ప్రభుత్వం తప్పనిసరిగా మన్నిస్తుంది కూడా). ఏదైనా ఒక సహజ వనరు ఉంటే, దానిని కొంతకాలంగా రాజకీయ పెద్దలు తమ స్వప్రయోజనాల కోసం అనుభవిస్తూ ఉన్నారంటే, అది ప్రభుత్వ ఆస్తి అయి ఉంటుంది. రాజకీయ పలుకుబడి పుష్కలంగా ఉండడంతో పాటు, తగిన సమయం కోసం వేచి ఉండే ఓపిక దండిగా ఉన్నా కూడా ఆ భూమిని చక్కగా అలాంటి వ్యక్తులు సొంతం చేసుకోవచ్చు. వెలకట్టలేని ఆ భూమి క్షణాలలో అలాంటివారికి చట్టబద్ధమైన పద్ధతిలో కేటాయించే సౌకర్యం కూడా ఉంటుంది. ఒకవేళ ప్రభుత్వాలు మారిపోయినా ఇలాంటి వ్యవహారాలకు వచ్చిన ఢోకా ఏమీ ఉండదు. ఎందుకంటే మళ్లీ ఆ వంచక పాత పాత్రలే చక్రం తిప్పుతూ ఉంటాయి. రెవెన్యూ దస్త్రాలను భద్రపరచడంలో మనకున్న పద్ధతి, ఇలాంటి వాటిని చూసీచూడనట్టు వదిలేసే అధికారులు వెరసి అలాంటి భూములకు సంబంధించిన అక్రమాలు అనంతంగా కొనసాగడానికి విరివిగా అవకాశం కల్పిస్తున్నాయి. దీనికి ఉన్న పద్ధతి కూడా చాలా సులభమైనదే. ఒక దొంగ సంస్థను ఏర్పాటు చేసి, వాళ్లు కోరుకున్న మొత్తం భూమి కోసం ప్రభుత్వాన్ని అంటకాగుతారు. ఈ ప్రక్రియ మొత్తం మరింత తేలికగా సాగడానికి చార్టర్డ్ అకౌంటెంట్లు ఎలాగూ ఉంటారు. ఆ పారిశ్రామికవేత్తలు స్థాపించబోయే సంస్థతో జరగబోతున్న ‘ఉద్యోగావకాశాల కల్పన’ గురించీ, ఇబ్బడిముబ్బడిగా ‘ఖజానా నిండడం’ గురించీ ఘనంగా నివేదికలు రూపొందించి పెడతారు. ఇంకా ‘గుర్తిం చిన’ భూములను నామమాత్రపు ధరలకి పరిశ్రమలు స్థాపించబోతున్న ఆ సంస్థకు ధారాదత్తం చేయడం ఎంత సబబో కూడా సీఏలు నివేదిస్తారు. భూదానం ఆ భూమి మార్కెట్ విలువ కోటి రూపాయలు ఉన్నప్పటికీ కూడా, రాష్ట్ర ఖజానాకు మేలు చేకూర్చే క్రమంలో వారు చేస్తున్న సేవకు గాను, దానిని పది లక్షల రూపాయలకీ, ఇంకా వీలైతే ఒక లక్ష రూపాయలకే బహుమానంగా దఖలు పరుస్తారు. ఈ భూమిని తీసుకున్నవారు అక్కడ పరిశ్రమను స్థాపించేందుకు పెట్టుబడులు కావలసివస్తాయి. ఆ పెట్టుబడులకు అవసరమైన వనరులను సేకరించేందుకు వీలుగా, ఆ భూమినే తాకట్టు పెట్టే అధికారం కూడా కోరతారు (ఆ విన్నపాన్ని ప్రభుత్వం తప్పనిసరిగా మన్నిస్తుంది కూడా). అంటే ఆ భూమిని తాకట్టు పెట్టి ఆర్థిక సంస్థల ద్వారా పెట్టుబడిని సేకరిస్తారు. ఇందుకు సంబంధించి వారికి అనుమతి అంటూ లభిస్తే అప్పటి మార్కెట్ ధరకు ఆ భూమిని తాకట్టు పెడతారు. కాబట్టి ఐదు కోట్లు చెల్లిస్తే , మార్కెట్ ధర ప్రకారం రూ. 50 కోట్లు విలువ చేసే భూమి ప్రభుత్వం నుంచి వారికి దక్కుతుంది. అసలు విషయం అది కాదు. సంస్థలే కాదు, ఆ భూమిని తాకట్టు పెట్టడం ద్వారా వ్యక్తిగతంగా కూడా రూ. 50 కోట్ల రూపాయలు ఆర్థిక సంస్థల నుంచి రుణంగా పొందవచ్చు. లంచాల కోసం, అధికారులకు చెల్లించడం కోసం, రాజకీయ నాయకులకు ఇవ్వవలసింది ఇచ్చుకోవడానికీ పది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా తెలివైన ఆ పారిశ్రామికవేత్తకి ఇంకా చాలా డబ్బు మిగులుతుంది. ఒకవేళ తీసుకున్న రుణం తిరిగి చెల్లించలేకపోతే, తనఖాలో ఉన్న భూమిని బ్యాంకు అమ్ముతుంది. నిజానికి వసూలు చేసుకోలేని రుణాలంటూ ఏమీ ఉండవు. ఏదిఏమైనా అంతిమంగా నష్టపోయేది ఎవరంటే, ప్రభుత్వమే. ఎందుకంటే యాభయ్ కోట్ల రూపాయల విలువైన భూమి చేజారిపోయింది. ఇంకా, అక్కడ పరిశ్రమ అంటూ ఏదీ కూడా కని పించదు. చురుకైన పారిశ్రామికవేత్తలు ప్రభుత్వ భూముల విషయంలో చేసే అవినీతిలో ఇది ముఖ్యమైన చర్య. భూపరిపాలన శాఖ ప్రధాన కమిషనర్‌గా ఉన్నప్పుడు నేనొక విశ్వ ప్రయత్నం చేశాను. ఒక విఫలయత్నం భూములను పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం కేటాయించినప్పుడు వారు ఎంత ధర చెల్లించారో, ఆర్థిక సంస్థలకు అంతకు మించిన ధరతో తాకట్టు పెట్టరాదన్న నిబంధన ఒకటి తీసుకురావాలని గట్టిగా ప్రయత్నించి విఫలమయ్యాను. భూప రిపాలన కమిషనర్‌గా ఉన్నప్పుడు, ఆఖరికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలో కూడా ఈ ప్రయత్నం చేసినా కూడా సాగలేదు. ఇలాంటి భూముల కేటాయింపులలో అధికారులకు ఉండే పరస్పర ప్రయోజనాలు ఎలాంటివంటే, అవి కదపడానికి సాధ్యం కానంత లోతుగా ఉంటాయి. అసలు భూ కేటాయింపు విషయాలన్నీ మంత్రిమండలి దగ్గరకు వెళతాయి. ఎందుకంటే భూ కేటాయింపులు చేసేది మంత్రివర్గమే. అయితే నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే భూకేటాయింపును రద్దు చేసే అవకాశం, అధికారం ఉంది. భూ కేటాయింపు నిర్ణయం తిరిగి మంత్రిమండలి ముందుకు వెళితే అది పరిష్కారం కావడానికి చాలా సమయం అవసరం. కాబట్టి నేను భూ కేటా యింపు రద్దు అధికారాన్ని కలెక్టర్లకు బదలాయించాను. అందుకే నిబంధనలకు విరుద్ధంగా ఏం జరిగినా కలెక్టర్లు వెంటనే భూకేటాయింపును రద్దు చేస్తారు. ఇలాంటి భూముల విషయంలో జరిగే మరో రకం అవినీతి కూడా ఉంటుంది. స్థానిక రెవెన్యూ యంత్రాంగం సాయంతో ఆ భూములను కొంతకాలం తరువాత ప్రైవేటు భూములుగా రాయించుకుంటారు. ఈ ప్రక్రియకి చాలా సమయం పడుతుంది. కాబట్టి దండిగా సహనం ఉండాలి. పలు స్థాయిల న్యాయస్థానాలలో వ్యాజ్యాలు నడపాలి. పలు స్థాయిలలో ప్రభుత్వ శాఖలను మేనేజ్ చేయాలి. ఇలాంటి విన్యాసాలు చేయడంలో ఆరితేరిన వృత్తి నిపుణులు కూడా ఉన్నారు. ఎవరు అధికారంలో ఉన్నారు, ఎవరి ప్రభుత్వం ఉన్నది అనే అంశంతో వారికి పనిలేదు. ఆ ప్రక్రియ మొత్తం సక్రమంగా పూర్తి చేయించి, భూమిని వారు విజయవంతంగా సొంతం చేయిస్తారు. రాజ కీయ నేతలతో వారికి ఉండే అవినాభావ సంబంధాలు అంత పటిష్టంగా ఉంటాయి. అంతేకాదు, అవి విశాఖపట్నంలో దసపల్లా హిల్స్ భూములు కావచ్చు, హైదరాబాద్‌లోని మియాపూర్‌లోని భూములైనా కావచ్చు. ప్రభుత్వ భూముల మీద టైటిల్ డీడ్స్‌ను సంపాదించడంలో వీరిని ఏ శక్తీ ఆపలేదు. అందుకు ఎంతకాలమైనా పట్టవచ్చు. అంతదాకా వారు ఓపికగా వేచి ఉంటారు. చేతికి ఎముకలేని రీతిలో ఖర్చు పెడతారు. మధ్యలో కొరకరాని కొయ్య అనిపించే అధికారి ఎవరైనా వస్తే, అతడు వెళ్లిపోయే దాకా కూడా వేచి ఉండగలరు. లేకపోతే ఏదో మతలబు చేసి ఆయన్ని అక్కడ నుంచి వెళ్లిపోయేటట్టు చేస్తారు. సక్రమంగా లేని భూదస్త్రాలు భూదస్త్రాల నిర్వహణ సరిగా లేకుంటే, అది కూడా ఆ ‘నిపుణుల’కు అవకాశం కల్పిస్తూ ఉంటుంది. ఇలాంటి వాతావరణంలో అనుకూలురైన రెవెన్యూ అధికారులు, సేవాభావం మెండుగా ఉన్న రాజకీయ నేతల సాయం కూడా అందుతుంది. ల్యాండ్ రెవెన్యూ కమిషనర్ కార్యాలయంలో అప్పీళ్ల కమిషనర్ అనే పేరుతో ఒక ఉద్యోగం ఉంది. అత్యంత అవినీతిపరుడు, అలాంటి ఉద్యోగం కోసం అర్రులు చాచేవారినే చూసి ఆ ఉద్యోగంలో నియమిస్తారు. భూ వివాదాలకు సంబంధించిన అన్ని అప్పీళ్లను ఆయనే విని, పరిష్కరిస్తాడు. కానీ నిజం చెప్పాలంటే, ఇప్పటికే ప్రభుత్వానికి చెందిన విలువైన భూములన్నింటికీ రెక్కలు వచ్చాయి. మిగిలినవి కూడా మాయం కావడానికి కొద్ది సమయం మాత్రమే చాలు. ఇలాంటి పరిస్థితులలో మిగిలిన ఆ భూములను బహిరంగ వేలం పాటతో అమ్మివేయాలని ప్రతిపాదించడమే మంచిది. ఆ డబ్బుతో ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలి. ప్రభుత్వానికి అవసరమైనప్పుడు భూములను కొనడానికి, అంటే ప్రభుత్వం తన భూములను అట్టే పెట్టుకోలేనప్పుడు, ఈ నిధి ఉపయోగపడుతుంది. ఇంకా చెప్పాలంటే తన భూములను రక్షించుకోవాలన్న అభిప్రాయం, రక్షించుకునే శక్తి లేనప్పుడు తనకు అవసరమైన భూములను సమకూర్చుకోవడానికి ఆ నిధి ఉపయోగపడుతుందన్నమాట. ఐవైఆర్ కృష్ణారావు వ్యాసకర్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి -
తప్పుల పుట్ట.. భూ రికార్డుల చిట్టా
సాక్షి, హైదరాబాద్ ఒకటి కాదు.. రెండు కాదు... ఏకంగా 74 లక్షల తప్పులు. ఏళ్ల తరబడి దిద్దుబాటుకు నోచుకోని భూ రికార్డుల్లో ఉన్న లోపాలు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళనలో వెలుగులోకి వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1.7 కోట్ల సర్వే నంబర్లలో 2.4 కోట్ల ఎకరాల భూ విస్తీర్ణం ఉంటే అందులో దాదాపు మూడో వంతు.. అంటే 74 లక్షల ఎకరాలకు సంబంధించిన రికార్డుల్లో తప్పులు నమోదయ్యాయనే గణాంకాలు ఇన్నాళ్లూ తప్పులతడకగా సాగిన రెవెన్యూ వ్యవహా రాలను ఎత్తిపొడుస్తున్నాయి. చిన్నదైనా, పెద్దదైనా తప్పులను సరిచేయకపోవడం, దశాబ్దాల తరబడి ఆ తప్పులు అలాగే కొనసాగడం రెవెన్యూ యంత్రాంగం నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. లక్షల ఎకరాల రికార్డుల్లో తప్పులు గత ఏడాది సెప్టెంబర్ 15 నుంచి రాష్ట్ర ప్రభుత్వం భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని చేపట్టింది. ఎప్పుడో నిజాం కాలంలో సరిచేసిన రికార్డులను పూర్తిగా సవరించి రైతులకు పెట్టుబడి సాయం అందిస్తామంటూ ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రక్రియలో మొదటి నుంచీ విస్మయకర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. డిసెంబర్ 31, 2017 నాటికే ఈ ప్రక్షాళన కార్యక్రమం గడువు అధికారికంగా ముగిసినా అక్కడక్కడా ఇంకా జరుగుతూనే ఉంది. అయితే, సోమవారం వరకు అందిన లెక్కల ప్రకారం మొత్తం 74,42,910 ఎకరాల రికార్డుల్లో తప్పులున్నాయని తేలింది. ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో అయితే ఈ తప్పులు లక్షల సంఖ్యలో నమోదయ్యాయి. నిజామాబాద్ జిల్లాలో 9,44,290 ఎకరాల భూ విస్తీర్ణం ఉంటే అది కాస్తా భూ రికార్డుల ప్రక్షాళన తర్వాత ఏకంగా 13,86,943 ఎకరాలకు పెరిగింది. ఇందులో 8,09,827 ఎకరాల రికార్డుల్లో తప్పులు నమోదయ్యాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, మేడ్చల్–మల్కాజ్గిరి మినహా అన్ని జిల్లాల్లో లక్ష ఎకరాలకు పైగానే తప్పులు కనిపించాయి. ఖమ్మం, కామారెడ్డి జిల్లాల్లో ఇలా నమోదయిన తప్పుల సంఖ్య 5 లక్షలు దాటింది. మంచిర్యాలలో 4.38 లక్షలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 3.46 లక్షల ఎకరాల రికార్డుల్లో తప్పులు నమోదయ్యాయని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. మిగిలిన అన్ని జిల్లాల్లోనూ పరిశీలిస్తే అత్యల్పంగా మేడ్చల్– మల్కాజిగిరి జిల్లా రికార్డుల్లో తప్పులు తక్కువగా ఉన్నాయని తేలింది. ఇక్కడ మొత్తం భూ విస్తీర్ణం 2,63,582 ఎకరాలుంటే, రికార్డుల పరిశీలన తర్వాత అది 2,92,788 ఎకరాలకు చేరగా, అందులో 2,75,171 ఎకరాల రికార్డులు సరిగా ఉన్నాయని తేలింది. అంటే ఆ జిల్లాలో కేవలం 17,617 ఎకరాల రికార్డుల్లోనే తప్పులు తేలాయి. అందులోనూ 10,935 ఎకరాల రికార్డులను సరిచేయగా, ఇంకా 6,681 ఎకరాల రికార్డులను సరిచేయాల్సి ఉంది. ఇలా లక్షల సంఖ్యలో నమోదయిన తప్పుల్లో ఇప్పటివరకు 66,52,986 ఎకరాల విస్తీర్ణంలోని రికార్డులను సరిచేశారు. మరో 28 లక్షల ఎకరాల్లో రికార్డులను సరిచేసే ప్రక్రియలో రెవెన్యూ యంత్రాంగం నిమగ్నమై ఉంది. మరో వారం ఆగితేనే... వాస్తవానికి, గత ఏడాది డిసెంబర్ 31తోనే భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం ముగియాల్సి ఉన్నా ఇప్పటి వరకు 22 జిల్లాల్లోనే ఈ ప్రక్రియ పూర్తయిందని గణాంకాలు చెబుతున్నాయి. సంగారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్ రూరల్, పెద్దపల్లి, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో కొంత మేర పూర్తి కావాల్సి ఉంది. మిగిలిన అన్ని జిల్లాల్లో పాత సేత్వార్లు, ఖాస్రా పహాణీలలో ఉన్న సర్వే నంబర్ల కన్నా ఎక్కువ సర్వే నంబర్లలోనే పరిశీలన పూర్తయింది. ఈ ఎనిమిది జిల్లాల్లోనూ నేడో, రేపో ప్రక్రియ పూర్తి కానుంది. అయితే, తప్పులను సరిచేయడంతో పాటు అన్లైన్ రికార్డులను కేటగిరీల వారీగా తయారు చేసేందుకు మరో వారంరోజులు పడుతుందని అధికారులంటున్నారు. ఈ వారం ఆగితేనే రాష్ట్రంలోని భూ కమతాలకు సంబంధించిన పక్కా లెక్కలు తేలుతాయని వారంటున్నారు. -
కొత్త జిల్లాల కుదింపు ఆలోచనే లేదు
సాక్షి, హైదరాబాద్: కొత్తగా ఏర్పడ్డ జిల్లాలను కుదించే ఆలోచనేదీ ప్రభుత్వానికి లేదని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ స్పష్టం చేశారు. ఇప్పటికే కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్ భవనాలకు సైతం శంకుస్థాపన చేసిన దృష్ట్యా, కొత్త జిల్లాల కుదింపు సమస్యే లేదని పేర్కొన్నారు. ఇప్పటికే ఉన్న 31 జిల్లాలు యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు. జిల్లాలను కుదిస్తారంటూ వచ్చిన వార్తల్లో ఏమాత్రం నిజం లేదన్నారు. శుక్రవారం సచివాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఇక రాష్ట్రంలో ఇప్పటికే 92 శాతం భూరికార్డుల ప్రక్షాళన పూర్తయిందని తెలిపారు. మొత్తం 568 మండలాల్లోని 10,806 గ్రామాల్లో భూరికార్డుల ప్రక్షాళన ప్రారంభించగా, 10,443 గ్రామాల్లో పూర్తయిందని వెల్లడించారు. ఇప్పటివరకు 2,13,18,724 ఎకరాల భూరికార్డులు పరిశీలించి 1,97,10,172 ఎకరాల రికార్డులను సవరించినట్లు తెలిపారు. -
‘ప్రక్షాళన’ మలిదశ షురూ!
సాక్షి, హైదరాబాద్: భూరికార్డుల ప్రక్షాళనలో మలిదశ ప్రక్రియ మొదలైంది. దాదాపు 100 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా భూముల రికార్డులను పరిశీలించిన రెవెన్యూ యంత్రాంగం.. జిల్లాలవారీగా రెండోసారి గ్రామసభలను ప్రారంభించింది. ఇప్పటివరకు సరిచేసిన భూరికార్డులతో కూడిన పహాణీలను ఈ గ్రామసభల్లో ప్రదర్శించి.. అభ్యంతరాలేమైనా ఉంటే స్వీకరిస్తారు. అవసరమైతే రికార్డులను సరిచేసి, పూర్తి స్థాయి గ్రామ పహాణీలను సిద్ధం చేస్తారు. వాటిని ఆన్లైన్లో నమోదు చేస్తారు. ఆన్లైన్ పహాణీ ఆధారంగానే వచ్చే ఖరీఫ్ నుంచి రైతులకు పెట్టుబడి సాయం అందజేయనున్నారు. సెప్టెంబర్ 15వ తేదీన ప్రారంభమైన భూరికార్డుల ప్రక్షాళనలో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని సర్వే నంబర్ల పరిధి లోని భూముల రికార్డులను 1బీ కాపీల ఆధారంగా పరిశీలించారు. రాష్ట్రంలోని మొత్తం 1.7 కోట్ల సర్వే నంబర్లలో 2.4 కోట్ల ఎకరాల భూములకు సంబంధించిన రికార్డుల పరిశీలన పూర్తయింది. పలు తప్పులను సరిచేశారు. వారసుల పేరిట రికార్డులు మార్చారు. సర్వేనంబర్ల వారీగా ఉన్న భూముల విస్తీర్ణాన్ని సరిపోల్చి.. రైతులకిచ్చిన సబ్‌డివిజన్ సర్వే నంబర్లలోని భూముల విస్తీర్ణాన్ని సరిచేశారు. దీంతోపాటు క్లరికల్ తప్పిదాలు, పేర్లలో మార్పులు వంటి సవరణలు చేశారు. కొత్త పహాణీలను పకడ్బందీగా రూపొందించాలన్న ఆలోచనతో అన్ని జిల్లాల్లో గ్రామాలు, సర్వే నంబర్ల వారీగా కచ్చితంగా మాన్యువల్ పహాణీలు రాయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈనెల 31లోపు భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని అధికారికంగా పూర్తి చేయాల్సి ఉన్నందున.. మాన్యువల్ పహాణీలు తయారు కాకపోయినా ఎల్‌ఆర్‌యూపీ రికార్డుల ఆధారంగా సాఫ్ట్‌కాపీలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. కాపీలను మూడు సెట్లు తీసుకుని.. వీఆర్వో, తహసీల్దార్, కలెక్టర్ కార్యాలయాల్లో భద్రపరచాలని ఉన్నతాధికారులు నిర్దేశించారు. -
జగిత్యాల, రంగారెడ్డి టాప్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమం చివరి అంకానికి చేరుకుంది. షెడ్యూల్ ప్రకారం ఈనెల 31 నాటికి మొత్తం ప్రక్రియ పూర్తికావాల్సి ఉండగా... ఇప్పటివరకు 30 జిల్లాల పరిధిలో 85 శాతం రికార్డులను సరిచేశారు. సర్వే నంబర్ల వారీగా చూస్తే... 10,873 రెవెన్యూ గ్రామాల్లో 1.78 కోట్ల సర్వే నంబర్లు ఉండగా... శనివారం నాటికి 1.69 కోట్ల సర్వే నంబర్ల రికార్డులను రెవెన్యూ యంత్రాంగం పరిశీలించింది. మిగతా 10 లక్షల సర్వే నంబర్లలోని రికార్డుల పరిశీలన, తప్పుల సవరణ ఈ నెలాఖరు నాటికి పూర్తి కానుంది. మరో 15 శాతంలో 5–6 శాతం రికార్డుల్లోని తప్పులను సవరించే అవకాశముందని.. ఇవన్నీ పోగా మిగిలే 9–10 శాతం రికార్డులను.. మరికొంత పరిశీలన, ఇతర ప్రక్రియల అనంతరం సరిచేసే అవకాశముందని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. 99 శాతంతో రికార్డు భూరికార్డుల ప్రక్షాళనలో జగిత్యాల, రంగారెడ్డి జిల్లాలు ముందంజలో ఉన్నాయి. జగిత్యాలలో అత్యధికంగా 99.52 శాతం రికార్డులను సవరించగా, రంగారెడ్డి జిల్లాలో 99.14 శాతం పూర్తయింది. మిగతా జిల్లాల్లో యాదాద్రి భువనగిరి, వరంగల్ అర్బన్, మేడ్చల్, సిద్దిపేట, నల్లగొండ, పెద్దపల్లి, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో కూడా 90శాతంపైగా రికార్డుల ప్రక్షాళన పూర్తయింది. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రక్షాళన మందకొడిగా సాగుతోంది. జిల్లాలోని 2.93 లక్షల సర్వే నంబర్లకు 1.80 లక్షల సర్వే నంబర్లలో మాత్రమే పరిశీలన పూర్తికాగా.. ఇందులో 88,360 సర్వే నంబర్ల రికార్డులే సరిగా ఉన్నాయి. వీటితోపాటు మరో 1,155 సర్వే నంబర్ల రికార్డులను సరిచేశారు. మొత్తం మీద రాష్ట్రవ్యాప్తంగా 85 శాతం రికార్డుల సవరణ పూర్తికాగా.. 20 జిల్లాల్లో 80 కన్నా ఎక్కువగా భూరికార్డులను సవరించారు. ‘మాన్యువల్’తో జాప్యం! భూరికార్డుల ప్రక్షాళన అనంతరం పహాణీ లను మాన్యువల్‌గా తయారు చేయాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చిన నేపథ్యంలో.. రికార్డుల పరిశీలన పూర్తయిన మండలాలు, గ్రామాల్లోని రెవెన్యూ సిబ్బంది ఆ పనిలో నిమగ్నమయ్యారు. ప్రతి సర్వే నంబర్‌కు సంబంధించిన పహాణీని మాన్యువల్‌గా రాయాల్సి వస్తుండడం వీఆర్వోలకు ఇబ్బందికరంగా మారింది. అంతేగాకుండా ఈ మాన్యువల్ పహాణీల్లో తప్పులు సరిచేసి, అనంతరం ఆన్లైన్లో నమోదు చేయనున్నారు. ఈ నమోదు ప్రక్రియకు నెల రోజులు పట్టే అవకాశముందని రెవెన్యూ వర్గాలు పేర్కొంటున్నాయి. -
‘నకిలీ’లపై క్రిమినల్ కేసులు!
సాక్షి, హైదరాబాద్: భూరికార్డుల ప్రక్షాళనలో భాగంగా వెలుగులోకి వస్తున్న సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. నకిలీ పాసు పుస్తకాలు సృష్టించి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటున్న, ఇతర ప్రయోజనాలు పొందుతున్నవారిపై కఠిన చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయాలని, బ్యాంకుల సిఫార్సు ఆధారంగా చర్యలు చేపట్టాలని యోచిస్తోంది. ఇక ప్రభుత్వం అసైన్ చేసిన భూముల్లో లబ్ధిదారులు కాకుండా.. వేరేవారు కబ్జాలో ఉంటే ఏం చేయాలన్న దానిపై ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చింది. కానీ దీనిపై మంత్రివర్గ ఉప సంఘం నివేదిక కోసం ఎదురుచూస్తోంది. నివేదిక అందగానే కబ్జాలో ఉన్నవారి సామాజిక, ఆర్థిక పరిస్థితులను బట్టి వారికి మళ్లీ అసైన్ చేయా లని భావిస్తోంది. ఇందుకోసం అవసరమైతే అసైన్డ్ భూముల చట్టంలో సవరణలు చేయనుంది. రుణాలు కడుతున్నారా..? భూరికార్డుల ప్రక్షాళన సందర్భంగా బయటపడుతున్న నకిలీ పాస్ పుస్తకాల వ్యవహారంపై కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. భూమి లేకుండానే పాస్ పుస్తకాలు సృష్టించి వందల కోట్ల రూపాయలను బ్యాంకుల నుంచి రుణంగా తీసుకున్నట్లుగా ప్రక్షాళన సందర్భంగా బయటపడింది. ముఖ్యంగా నల్లగొండ, కరీంనగర్, వరంగల్, మహబూబ్‌నగర్ తదితర జిల్లాల్లో వేల ఎకరా ల భూముల పేరిట నకిలీ పాస్ పుస్తకాలు సృష్టించినట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో వీటితో తీసుకున్న బ్యాంకు రుణా లను తిరిగి తీర్చేస్తున్నారా అన్న కోణంలో పరిశీలన జరపనుంది. ఇలా రుణాలు తీసుకున్న వారు చెల్లించని పక్షంలో బ్యాంకుల సిఫారసు మేరకు క్రిమినల్ కేసులు నమోదు చేయాలని భావిస్తోంది. రికార్డుల ప్రక్షాళన పూర్తయ్యాక ఈ అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నట్లు రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. మళ్లీ తెరపైకి జీవో నం 59 గతంలో దరఖాస్తులు స్వీకరించిన భూముల క్రమబద్ధీకరణకు గడువు ముగిసిన నేపథ్యంలో.. ఆ దరఖాస్తుల పరిష్కారానికి మరో అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాస్తవానికి 125 గజాలకుపైగా ప్రభుత్వ భూముల్లో కబ్జాలుంటే వాటిని మార్కెట్ ధరతో క్రమబద్ధీకరించాలని 2014 డిసెంబర్లో జీవో నం 59 ద్వారా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో హైదరాబాద్‌తో పాటు ఇతర జిల్లాల్లో కూడా దరఖాస్తులు వచ్చాయి. వాటిని పరిశీలించిన ప్రభుత్వం.. అసైన్డ్ భూముల్లో కబ్జాల క్రమబద్ధీకరణ కోసం వచ్చిన దరఖాస్తులను తిరస్కరించింది. ప్రభుత్వ భూముల్లో కబ్జాలకు మాత్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అయితే ప్రాంతాన్ని బట్టి మార్కెట్ ధర ఎక్కువగా ఉండటంతో నాలుగు విడతల్లో సొమ్ము చెల్లించే అవకాశం కల్పించింది. కానీ నిర్దేశిత గడువులోపు 1, 2 వాయిదాలు చెల్లించిన కొందరు.. మిగతా మొత్తాన్ని చెల్లించలేకపోయారు. దాంతో వారికి ఆ భూములను క్రమబద్ధీకరించలేదు, చెల్లించిన మొత్తాన్ని తిరిగి ఇచ్చేయలేదు. ఈ నేపథ్యంలో జీవో నం 59కి అనుగుణంగా అనుమతి పొంది పాక్షిక చెల్లింపులు చేసిన దరఖాస్తులకు మరో అవకాశం ఇవ్వాలని.. మిగతా సొమ్మును మరో ఏడాదిలోపు చెల్లించే వెసులుబాటు కల్పించాలని సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు త్వరలోనే ఉత్తర్వులు వెలువడనున్నాయి. ప్రభుత్వ భూముల్లో కబ్జాలుంటే.. భూరికార్డుల ప్రక్షాళనలో వెలుగులోకి వస్తున్న మరో అంశం ప్రభుత్వ భూముల కబ్జా. రికార్డులు సరిగా లేకపోవడం, ప్రభుత్వ భూములపై పర్యవేక్షణ లేకపోవడం, కొందరు అక్రమార్కులు రెవెన్యూ వర్గాలతో చేతులు కలపడం వంటి కారణాలతో వేల ఎకరాల ప్రభుత్వ భూములు కబ్జా అయినట్లు ప్రక్షాళనలో వెల్లడైంది. ఇలాంటి కబ్జాల్లో ఉన్న నివాసస్థలాలను వారి సామాజిక, ఆర్థిక హోదాను బట్టి వారికే కేటాయించే అవకాశాలు కూడా ఉన్నాయని రెవెన్యూ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే మండల, జిల్లా కేంద్రాలకు సమీపంలో ఉన్న ప్రభుత్వ స్థలాల్లో ఉన్న కబ్జాలను మాత్రం క్రమబద్ధీకరించ కూడదని ప్రభుత్వం భావిస్తోంది. విలువైన ఆ భూములను ప్రజావసరాలకు వినియోగించుకోవాలని.. పరిశ్రమలు, రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థలు, ఇతర సమూహాల చేతుల్లో ఉన్న భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించింది. -
420 మంది రైతులు..1,156 ఎకరాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం మొత్తం మీద సగటున గ్రామానికి 420 మంది రైతులు, 1,156 ఎకరాల సాగు భూమి ఉన్నట్లు తేలింది. రైతు సమగ్ర సర్వే ఆధారంగా తాజాగా రూపొందించిన నివేదిక వివరాలను వ్యవసాయశాఖ వెల్లడించింది. ఏఈవోల సహకారంతో మొత్తం 10,733 రెవెన్యూ గ్రామాల్లో రైతు సమగ్ర సర్వే చేసిన సంగతి తెలిసిందే. నివేదిక ప్రకారం రాష్ట్రంలోని సగం గ్రామాలు వెయ్యి ఎకరాలలోపు సాగుభూమి కలిగి ఉన్నాయి. ఇందులో 500 ఎకరాలలోపు గ్రామాలు 3,161 ఉండగా, సగటున గ్రామానికి 149 మంది రైతులున్నారు. ఈ విభాగంలో సగటున ఒక్కో గ్రామంలో 323 ఎకరాలున్నట్లు తేలింది. రాష్ట్రంలోని 30 శాతం గ్రామాల్లో 500 ఎకరాల్లోపే సాగు భూమి ఉన్నట్లు వ్యవసాయ శాఖ గుర్తించింది. అలాగే 501–1000 ఎకరాల వరకు ఉన్న గ్రామాలు 2,820 ఉండగా... ఈ విభాగంలో సగటున ఒక్కో గ్రామంలో 283 మంది రైతులు, 695 ఎకరాల సాగు భూమి ఉన్నట్లు తేలింది. అలాగే 5,981 గ్రామాలు వెయ్యి ఎకరాలలోపే సాగు విస్తీర్ణాన్ని కలిగి ఉన్నాయి. అలాగే 1001 నుంచి 2 వేల ఎకరాల వరకు సాగుభూమి ఉన్న గ్రామలు 3,101 ఉండగా, వీటిలో 16.50 లక్షల మంది రైతులు మొత్తం 43.94 లక్షల ఎకరాల భూమి కలిగి ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు. 4,501–5,000 ఎకరాలున్న గ్రామాలు 62 మాత్రమే ఉన్నాయి. 5వేల ఎకరాల పైగా ఉన్న గ్రామాలు 106 వరకున్నాయి. తగ్గిన రైతుల సంఖ్య...: రైతు సమగ్ర సర్వే ప్రకారం రైతుల సంఖ్య 45.10 లక్షలుకాగా వారి వద్ద 1.24 కోట్ల ఎకరాల సాగు భూమి ఉన్నట్లు తేలింది. అయితే వ్యవసాయశాఖ వద్ద ఇప్పటివరకు ఉన్న రికార్డుల ప్రకారం రైతుల సంఖ్య 55 లక్షలు ఉండగా, రైతు సమగ్ర సర్వేలో మాత్రం ఆ సంఖ్య 45 లక్షలకు పడిపోవడంపై గందరగోళం నెలకొంది. 10 లక్షల మంది రైతులు ఎలా తగ్గారో అంతుబట్టడంలేదు. భూ పత్రాలలో పేరు మార్పిడి జరగకపోవడంతో కొత్తగా వచ్చే వారి పేర్లు నమోదు కాలేదని అధికారులు చెబుతున్నారు. భూ రికార్డుల ప్రక్షాళన తరువాత సాగుభూమి, రైతుల సంఖ్యపై స్పష్టత వస్తుందని అంటున్నారు. -
భూమి పెరుగుతోంది!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూముల విస్తీర్ణం పెరిగిపోతోంది.. రికార్డుల్లో ఉన్న భూమి కంటే ఎక్కువగా ఉంటోంది.. భూములు పెరగడమే మిటి అనుకుంటున్నారా.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూరికార్డుల ప్రక్షాళన సందర్భంగా... ఇప్పటివరకు ఆన్లైన్ రికార్డుల్లో నమోదుకాని భూముల వివరాలు వెల్లడవుతున్నాయి. దాంతో రికార్డుల్లో ఉన్నదానికంటే ఎక్కువగా భూవిస్తీర్ణం నమోదవుతోంది. ఒక్క వరంగల్ అర్బన్ జిల్లాలోనే దాదాపు 10 వేల ఎకరాలకుపైగా భూమి అదనంగా గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఇదే తరహా పరిస్థితి ఉందని.. మొత్తంగా రికార్డుల ప్రక్షాళన పూర్తయ్యే నాటికి ఏడెనిమిది లక్షల ఎకరాల మేర అదనంగా భూములు నమోదుకావచ్చని రెవెన్యూ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆన్లైన్ పహాణీల్లో లేవు.. రాష్ట్రంలో హైదరాబాద్ మినహా మిగతా జిల్లాల్లో ఈ ఏడాది సెప్టెంబర్ 15 నుంచి భూరికార్డుల ప్రక్షాళన ప్రారంభమైంది. ఇప్పటివరకు ఒక్క వరంగల్ అర్బన్ జిల్లాలో ప్రక్రియ పూర్తయింది. అయితే ఈ జిల్లాలో రికార్డుల్లో ఉన్న భూమి కన్నా ఎక్కువ భూమి లెక్కతేలింది. ఇక్కడ 2,77,004 సర్వే నంబర్ల పరిధిలో 2,98,600 ఎకరాల భూములు ఉన్నాయని ప్రభుత్వ ఆన్లైన్ పహాణీలు చెబుతున్నాయి. రెవెన్యూ యంత్రాంగం ఆ రికార్డుల ప్రకారమే.. జిల్లాలోని 124 గ్రామాల రైతులకు 1బీ నోటీసులిచ్చి రికార్డులను పరిశీలించింది. అయితే పరిశీలన పూర్తయ్యాక చూస్తే జిల్లాలో 2,81,248 సర్వే నంబర్లు ఉన్నాయని, మొత్తం భూవిస్తీర్ణం 3,09,325 ఎకరాలని తేలింది. అంటే 10 వేల ఎకరాలకుపైగా భూములు అదనంగా తేలాయి. వరంగల్ అర్బన్‌లో ప్రక్రియ పూర్తి వరంగల్ అర్బన్ జిల్లాలో భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమం పూర్తయింది. ఆ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న దాదాపు మూడు లక్షల ఎకరాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. అయితే రాష్ట్రంలోనే అత్యధికంగా వివాదాలున్న భూములు ఈ జిల్లాలోనే తేలడంతో.. ఇప్పుడు వాటిని సరిచేసి నమోదు చేసే పనిలో పడ్డారు. భూరికార్డుల ప్రక్షాళన అనంతరం ఇక్కడ ఎలాంటి పొరపాట్లు లేని భూములు 1,72,281 ఎకరాలుగా.. రికార్డులు సరిచేయాల్సినవి 1,37,043 ఎకరాలుగా తేల్చారు. సరిచేయాల్సిన వాటిలోనూ 90 శాతాన్ని సులువుగానే పరిష్కరించవచ్చని.. అసైన్డ్, కోర్టు కేసులు, సాదాబైనామా కేసులు మాత్రం పెండింగ్‌లో పడే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. అసలీ భూమి ఎక్కడిది? ప్రభుత్వ ఆన్లైన్ రికార్డుల్లో లేకుండా అదనంగా వచ్చిన భూమి ఎక్కడిదనే కోణంలో అధికారులు పరిశీలించి.. ఆ భూముల డేటా ప్రభుత్వ వర్గాల వద్ద లేదని గుర్తించారు. రెవెన్యూ అధికారులు భూరికార్డుల పరిశీలన కోసం గ్రామాలకు వెళ్లినప్పుడు.. కొందరు రైతులు వచ్చి తమ భూమి నోటీసులు ఇవ్వలేదంటూ రికార్డులు (పాస్‌బుక్‌లు, ఇతర డాక్యుమెంట్లు) చూపించడంతో రెవెన్యూ అధి కారులు కంగుతినాల్సి వచ్చింది. అయితే ఆ రికార్డులను రెవెన్యూ వర్గాల వద్ద ఉన్న సేత్వార్, ఖాస్రా పహాణీల ఆధారంగా పరిశీలిస్తే.. వాస్తవంగానే ఆ భూమి ఉందని, కానీ ఆన్లైన్ రికార్డుల్లోకి ఎక్కలేదని తేలింది. దీంతో మళ్లీ ఆ రైతులకు నోటీసులిచ్చి వాటిని ఆన్లైన్లో నమోదు చేశామని అధికారులు చెబుతున్నారు. భూరికార్డుల నిర్వహణ వ్యవస్థ (ఎల్‌ఆర్‌ఎంఎస్) నుంచి వెబ్‌ల్యాండ్ పోర్టల్‌కు రాష్ట్రంలోని భూముల డేటా మారినప్పుడు కొన్ని సర్వే నంబర్లను చేర్చలేదని వారు పేర్కొంటున్నారు. కొన్ని భూములకు సంబంధించి వివాదాలు ఉండటంతో ఆన్లైన్ పహాణీల్లో నమోదు చేయకుండా వదిలేశారని.. ఇప్పుడా రైతుల భూములను అధికారికంగా రికార్డుల్లో నమోదు చేస్తున్నామని చెబుతున్నారు. ఇప్పటివరకు జరిగిన ‘ప్రక్షాళన’ గణాంకాలు రాష్ట్రంలోని మొత్తం సర్వే నంబర్లు 1,78,59,552 (2,40,68,290 ఎకరాలు) పరిశీలన పూర్తయినవి 1,00,83,799 (1,36,43,419 ఎకరాలు) అన్ని అంశాలు సరిగా ఉన్నవి 70,52,345 (88,34,422 ఎకరాలు) సరిచేయాల్సినవి 30,31,454 (48,08,997 ఎకరాలు) వ్యవసాయేతర భూములుగా తేలినవి 2,29,642 (3,12,500 ఎకరాలు) -
మిగిలింది కోటి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూరికార్డుల ప్రక్షాళన క్రమంగా ఊపందుకుంటోంది. మొత్తం 1.78 కోట్లకుపైగా సర్వే నంబర్లలోని 2.4 కోట్ల ఎకరాల భూములకుగాను... 55 రోజుల తర్వాత 78 లక్షల సర్వే నంబర్లలోని కోటి ఎకరాల భూరికార్డుల పరిశీలన పూర్తయింది. డిసెంబర్ 31 నాటికి మరో కోటి సర్వే నంబర్లలోని 1.4 కోట్ల ఎకరాల భూరికార్డులను పరిశీలించాల్సి ఉంది. ఇక ఇప్పటివరకు పరిశీలన పూర్తయిన కోటి ఎకరాల భూములకుగాను.. దాదాపు 35శాతం వరకు తప్పులను గుర్తించారు. ఇందులో 25 శాతం మేర సరిచేసేందుకు వీలైనవి. మిగతా 10 శాతం భూముల విషయంలో సంక్లిష్టత ఉందని.. వాటికి కొత్త సంవత్సరంలోనే పరిష్కారం లభిస్తుందని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. పెండింగ్ పడేది తక్కువే.. ప్రక్షాళనలో భాగంగా ఎలాంటి వివాదాలు లేకుండా వంద శాతం పరిష్కారమైన భూముల వివరాలను కేటగిరీ–ఏలో, అప్పటికప్పుడు పరిష్కారం కాని వాటిని కేటగిరీ–బీలో నమోదు చేస్తున్నారు. సరిచేయగలిగిన తప్పులను పరిష్కరించి కేటగిరీ–ఏలోకి మార్చుతున్నారు. ఇప్పటివరకు 78,57,855 సర్వే నంబర్లలోని 1,04,40,763 ఎకరాల విస్తీర్ణంలో రికార్డులను పరిశీలించగా.. 24,22,706 సర్వే నంబర్లలోని 36,96,147 ఎకరాల విస్తీర్ణంలో సవరణలు నమోదయ్యాయి. ఇందులో వెంటనే సరిచేయగలిగిన తప్పులను పరిష్కరిస్తూ వస్తున్నారు. మొత్తంగా భూరికార్డుల ప్రక్షాళన పూర్తయ్యేనాటికి 90 శాతం రికార్డులు సరిచేస్తామని.. మిగతా 10 శాతం రికార్డులను కొత్త సంవత్సరంలో అవసరమైతే సర్వే చేసి సరిచేయాల్సి ఉంటుందని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. వెనుకబడిన ఐదు జిల్లాలు. భూరికార్డుల ప్రక్షాళన ఐదు జిల్లాల్లో ఆశించిన స్థాయిలో జరగడం లేదు. అందులో గద్వాల (25.3), భూపాలపల్లి (23.9), కొత్తగూడెం (32.3), వనపర్తి (35.8), సంగారెడ్డి (30.3) శాతం ప్రక్షాళనతో వెనుకంజలో ఉన్నాయి. వరంగల్ అర్బన్ జిల్లాలో ఏకంగా 97.4 శాతం ప్రక్షాళన పూర్తయింది. కానీ ఈ జిల్లాలోనే అత్యధికంగా సవరణలు నమోదవుతున్నాయి.