కరుణించని ‘ధరణి’ | state government has introduced the Dharani website for comprehensive records of land records | Sakshi
Sakshi News home page

కరుణించని ‘ధరణి’

Published Fri, May 24 2019 5:43 AM | Last Updated on Fri, May 24 2019 5:43 AM

state government has introduced the Dharani website for comprehensive records of land records - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘ధరణి’ వెబ్‌సైట్‌ రైతులకు చుక్కలు చూపుతోంది. ఏడాదికాలంగా మండల కార్యాలయాల చుట్టూ ప్రదిక్షణలు చేస్తున్నా.. పాస్‌ పుస్తకాలు అందక రైతులు గగ్గోలు పెడుతున్నారు. రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన అనంతరం భూ రికార్డుల సమగ్ర నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ధరణి వెబ్‌సైట్‌ను ప్రవేశపెట్టింది. రెవెన్యూ రికార్డులన్నింటినీ ఆన్‌లైన్‌లోనే అప్‌డేట్‌ చేసేలా ఈ సాఫ్ట్‌వేర్‌ అందుబాటులోకి తెచ్చింది. ఈ సాఫ్ట్‌వేర్‌తో అడుగడుగునా అవాంతరాలే ఎదురవుతున్నాయి.

రికార్డుల సవరణకు ఎడిట్‌ ఆప్షన్‌ ఇవ్వకపోవడంతో ప్రతి పనికి కాళ్లరిగేలా తిరిగాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. కరెక్షన్, ఎడిట్‌ ఆప్షన్‌ను తహసీల్దార్లకు ఇవ్వకుండా ఆర్డీవో, జేసీల అనుమతి తీసుకున్నాకే లాగిన్‌ కావాల్సిరావడంతో కాలయాపన జరుగుతోంది. ముఖ్యంగా ధరణి రాకతో రికార్డులను సవరించే బాధ్యత నుంచి తహసీల్దార్లను ప్రభుత్వం తప్పించింది. చిన్న సవరణలకు కూడా వెసులుబాటు ఇవ్వకపోవడం.. మండల కార్యాలయాల చుట్టూ రైతులు తిరుగుతుండటం వారిని ఇరకాటంలో పడేస్తోంది.

పగటి పూట బంద్‌..
2017లో భూరికార్డుల ప్రక్షాళనతో రెవెన్యూ వ్యవస్థలో సరికొత్త విప్లవానికి కేసీఆర్‌ సర్కారు నాంది పలికింది. అంగుళం భూమికి సైతం హక్కుదారెవరనేది తేల్చేలా భూ రికార్డుల సమగ్ర నిర్వహణకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ధరణి వెబ్‌సైట్‌ ప్రవేశపెట్టింది. ఈ పోర్టల్‌ కార్యరూపం దాల్చిన తర్వాత రోజుకో కొత్త సాంకేతిక సమస్యలు పుట్టుకురావడం రెవెన్యూ అధికారులకు తలనొప్పి తెప్పిస్తోంది. ధరణి పగటి పూట మొరాయిస్తోంది.

రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో రికార్డులను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తుండటంతో సర్వర్‌ డౌన్‌ అవుతోంది. దీంతో పగలు సాఫ్ట్‌వేర్‌ పడకేస్తుండటంతో, రాత్రి వేళల్లో పనులు చేయాల్సివస్తోంది. కొత్త సాఫ్ట్‌వేర్‌ అందుబాటులోకి తెచ్చే ముందు.. సాంకేతిక సమస్యలను సరిచూసుకోవాల్సివుంటుంది. కానీ, ధరణిని కార్యరూపంలోకి తెచ్చిన తర్వాత లోపాలను సరిదిద్దుతుండడం వల్ల రైతులకు నిరీక్షణ తప్పట్లేదు.

ఇవీ సాంకేతిక సమస్యలు..
►ఒకే సేల్‌డీడ్‌పై ఇద్దరు వ్యక్తులు కొనుగోలు చేసిన భూమికి సంబంధించి మ్యూటేషన్‌ చేయించుకునేందుకు గతంలో మీ–సేవలో దరఖాస్తు చేసుకుంటే సరిపోయేది. ఇప్పుడలా చేస్తే దరఖాస్తు తిరస్కరణకు గురవుతోంది. ఇరువురు వేర్వేరు దరఖాసులు చేసుకోవాల్సి వస్తోంది. ఈ నిబంధన తెలియక మ్యూటేషన్లు, పాస్‌ పుస్తకాల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.
►సర్వే నంబర్ల పునరుద్ధరణ ఆప్షన్‌ తహసీల్దార్‌కు లేదు. రివోక్‌ ఆప్షన్‌కు జేసీకి నివేదించాల్సి వస్తోంది.
►పూర్తయిన మ్యూటేషన్లకు కేవైసీ తప్పనిసరిగా మారింది. పట్టాదారు విధిగా బయోమెట్రిక్‌ ద్వారా వేలిముద్రలు అందించాలి. కొందరి వేలిముద్రలు అరిగిపోతే డిజిటల్‌ సంతకం చేయడం కుదరట్లేదు. దీంతో మ్యూటేషన్లు నిలిచిపోతున్నాయి.
►భూ ప్రక్షాళన సమయంలో కాస్రా పహణీ విస్తీర్ణంతో సరిపోలకపోయినా హడావుడిగా వివరాలు నమోదు చేయడం ప్రస్తుతం సమస్యగా మారింది. తాజాగా ఆ వివరాలు కాస్రాతో సరిపోలని కారణంగా మ్యూటేషన్లు కావట్లేదు.
►సర్వర్‌ పగటిపూట పనిచేయట్లేదు.
►ఒక పట్టాదారు ఒకే సమయంలో ముగ్గురికి భూమిని విక్రయిస్తే, ఆ భూమికి సంబంధించి మ్యూటేషన్లు ఒకేసారి చేయడం వీలు కావట్లేదు. ఒకరికి పూర్తయిన తర్వాతే మరొకరివి చేయాల్సి వస్తోంది. దీంతో ఒక్కో దరఖాస్తు మధ్య కనీసం 20 రోజుల సమయం పడుతోంది.
►భూ రికార్డుల ప్రక్షాళన సమయంలో ఆధార్‌ వివరాలను సమర్పించని రైతుల ఆధార్‌ నంబర్‌ ఇప్పుడు నమోదు చేయాలంటే ఆర్డీవో అనుమతి తీసుకోవాల్సివస్తోంది.

ఏడాదిగా చక్కర్లు
నాకు ఐదెకరాల భూమి ఉంది. రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన అనంతరం జారీ చేసిన పాస్‌ బుక్కులో మూడెకరాలు మాత్రమే నమోదు చేశారు. మిగిలిన రెండెకరాలు నమోదు చేయించుకునేందుకు ఏడాదిగా తిరుగుతున్నా.. సర్వర్‌ డౌన్, ఆన్‌లైన్‌ పనిచేయట్లేదని చెబుతున్నారు.
– జంగారెడ్డి, అగర్‌మియాగూడ,
కందుకూరు మండలం, రంగారెడ్డిజిల్లా
.

చెప్పులరిగేలా తిరుగుతున్నా..
మొండిగౌరెల్లి గ్రామంలో 2017లో సర్వేనంబరు 106, 109లో 3–16 ఎకరాల భూమిని కొనుగోలు చేశాను. ఈ భూమి ఆన్‌లైన్‌లో నమోదు కోసం నాలుగు నెలలుగా తహసీల్దార్‌ కార్యాలయం చుట్టు తిరుగుతున్నా. తహశీల్దార్‌ను కలసి భూ రికార్డులు సమర్పించా. కానీ నేటికి ఆన్‌లైన్‌లో నమోదు కాకపోగా.. తనకు భూమి అమ్మిన రైతుకే పట్టాదారు పాసుపుస్తకం వచ్చింది. రైతుబంధు సాయం కూడా అతడికే ఇస్తున్నారు.
కొలను రమాదేవి, మొండిగౌరెల్లి,
యాచారం మండలం, రంగారెడ్డి జిల్లా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement