సాక్షి, హైదరాబాద్: సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వు మండల కేంద్రానికి చెందిన ఓ రైతు కుటుంబానికి పదెకరాల భూమి ఉంది. ఆ భూమి ముగ్గురు కుటుంబ సభ్యుల పేరు మీద నమోదయింది. భూరికార్డుల ప్రక్షాళనకు ముందు ఆ ముగ్గురి పేర్ల మీద పాస్‌పుస్తకాలున్నాయి. పహాణీలో పేర్లున్నాయి. మాభూమి వెబ్‌సైట్‌లో సర్వేనంబర్‌ను చూసుకుంటే వారి పేర్ల మీదనే ఆ భూమి పదిలంగా ఉండేది... కానీ, ఇప్పుడు ఆ భూమికి పాస్‌పుస్తకాల్లేవు. ఎవరో ఫిర్యాదు చేశారని రెవెన్యూ యంత్రాంగం పాస్‌పుస్తకాలు నిలిపివేసింది. వారి భూములను పార్ట్–బీలో చేర్చి పక్కన పెట్టింది. కనీసం ఆన్‌లైన్‌లో చూసుకుందామన్నా ఇప్పుడు మా భూమి వెబ్‌సైట్ లేదు. భూరికార్డులూ అందుబాటులో లేవు.
ఇప్పుడు ఆ భూమి ఎవరి పేరు మీద ఉందో కూడా తెలియని పరిస్థితి. ఆ రైతు కుటుంబంలో ఎడతెగని ఆందోళన.. ఈ ఆందోళన ఆ ఒక్క రైతు కుటుంబానిదే కాదు.. కారణమేదైనా భూరికార్డుల ప్రక్షాళన తర్వాత తమ భూములకు పాస్‌పుస్తకాలు రాని లక్షలాది మంది రైతులది. అన్నీ సరిగానే ఉన్నా సాంకేతిక కారణాలతో పాస్‌పుస్తకాలు రాని వారు, పుస్తకాల్లో అచ్చు తప్పులు పడి మళ్లీ ప్రభుత్వానికి తమ పుస్తకాలను సరెండర్ చేసినవారు, ఎవరో, ఏదో ఫిర్యాదు చేశారని, సరైన ఆధారాలు, డాక్యుమెంట్లు లేకుండానే పార్ట్–బీలో చేర్చిన భూములకు చెందిన రైతులంతా ఇప్పుడు ఇదే ఆందోళనతో కొట్టుమిట్టాడుతుండడం గమనార్హం.
ధరణీ.. కానరాదేమీ!
భూరికార్డుల ప్రక్షాళనలో భాగంగా రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 57లక్షలకు పైగా ఖాతాల్లో 2కోట్లకు పైగా ఎకరాల భూమికి సంబంధించిన రికార్డులను సరిచేశారు. 49లక్షలకు పైగా ఖాతాలకు పాస్‌పుస్తకాలను ముద్రించారు. ఆధార్ నంబర్లు, ఫొటోలు లేవనే కారణంతో 7లక్షలకు పైగా ఖాతాలకు పుస్తకాలను అసలు ముద్రించనే లేదు. ముద్రించిన వాటిలో ప్రభుత్వ లెక్కల ప్రకారమే 7లక్షలకు పైగా పుస్తకాలను పంపిణీ చేయలేదు. కొన్ని కాలమ్‌లు రాలేదని, తప్పులు వచ్చాయంటూ నిలిపివేసిన వీటిలో దాదాపు నాలుగు లక్షల పుస్తకాలను మళ్లీ పంపిణీకి జిల్లాలకు పంపారు. అంటే, మొత్తంమీద 10లక్షలకు పైగా ఖాతాలకు పాస్‌పుస్తకాలు లేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు, ఈ ఖాతాల్లో ఉన్న భూములపై ఎవరికి హక్కులున్నాయో కూడా తెలియని పరిస్థితి.
అసలు ఆ భూములు తమ పేరు మీద వస్తాయా రావా... పాస్‌పుస్తకాలు ఇస్తారో లేదోననే ఆందోళన రైతాంగంలో నెలకొంది. ధరణి పేరు మీద పైలట్‌గా ప్రారంభమయిన 21 మండలాల్లోనూ రికార్డులు సరిగా లేకపోవడంతో రాష్ట్రమంతటా ఇదే పరిస్థితి నెలకొంది. ఇక పార్ట్–బీ పేరుతో వివాదాలున్నాయని పక్కన పెట్టిన భూములను ఇంతవరకు పరిష్కరించలేదు. ఇలా మరో 3లక్షలకు పైగా ఖాతాల్లో రైతులు అసలు తమ భూమి తమకు దక్కుతుందో లేదోననే ఆందోళనలో ఉన్నారు. పాస్ పుస్తకాలు ఇచ్చిన రైతులు కూడా తమ భూమి ఆన్‌లైన్‌లో ఎవరి పేరు మీద ఉందోననే గాభరాకు గురవుతున్నారు. కేవలం పాస్‌పుస్తకమే తమకు ఆధారంగా ఉందని, ఆన్‌లైన్ రికార్డుల్లో కూడా తమ పేర్లు చేర్చాలని వారు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో భూరికార్డుల ప్రక్షాళన వివరాలను ఆన్‌లైన్‌లో ఉంచాలని, భూమి ఎవరి పేరు మీద ఉన్నదనే ప్రస్తుత స్థితిని తెలియజేస్తూ రికార్డులు నమోదు చేయాలని, అవసరమైతే మార్పులు, చేర్పులు చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఏడాది నుంచి రికార్డుల్లేవు..
వాస్తవానికి, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు రెవెన్యూ రికార్డులు అందుబాటులో ఉండేవి కావు. రైతుల దగ్గర ఉండే పాస్‌పుస్తకాలు తప్ప భూమికి సంబంధించిన ఏ రికార్డు కావాలన్నా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరగాల్సిందే. ఆమ్యామ్యాలు సమర్పించుకోవాల్సిందే. అయితే, ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ హయాంలో నిజామాబాద్ జిల్లాలో ‘భూభారతి’పేరుతో పైలట్ ప్రాజెక్టు ప్రారంభించి రెవెన్యూ రికార్డులను కంప్యూటరీకరించే ప్రయత్నం జరిగినా అది పూర్తి కాలేదు. కానీ, భూపరిపాలన ప్రధాన కమిషనర్‌గా రేమండ్ పీటర్ బాధ్యతలు చేపట్టాక 2016లో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని భూముల వివరాలను పబ్లిక్ డొమైన్‌లో ఉంచారు. ఫలానా సర్వే నంబర్‌లో ఉన్న భూమి ఏ రైతు పేరు మీద ఉందో చూపించే విధంగా ‘మా భూమి’వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. కానీ, భూరికార్డుల ప్రక్షాళన ప్రారంభమయిన 2017, సెస్టెంబర్ 15 నుంచి ఈ వెబ్‌సైట్‌ను నిలిపివేశారు. ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో భూరికార్డుల ప్రక్షాళన వివరాలను నమోదు చేసిన అధికారులు, ఆ తర్వాత ధరణి పేరుతో కొత్త వెబ్‌సైట్ ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment