pass books
-
‘పోడు’ పట్టాదారుల్లో అనర్హులెందరు?
సాక్షి, హైదరాబాద్: పోడుభూముల్లో సాగు చేసు కుంటున్న గిరిజనులకు పట్టా పుస్తకాల పంపిణీ ప్రక్రియ దాదాపుగా పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా 1,51,146 మంది పోడు రైతులను ఖరారు చేసిన రాష్ట్ర ప్రభుత్వం... గత నెల 27 నుంచి పట్టా పుస్తకా ల పంపిణీని ప్రారంభించింది. ఇందులో భాగంగా శనివారం సాయంత్రానికి 1,46,183 మంది పోడు రైతులకు పట్టా పుస్తకాలు పంపిణీ చేశారు. అంటే 96.71 శాతం విజయవంతంగా పూర్తి చేశారు. మరో 4,963 మందికి ఒకట్రెండు రోజుల్లో పంపిణీ చేసేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. అయితే ఇప్పటివరకు పట్టాపుస్తకాలు పొందిన వారిలో పలు వురు అనర్హులు ఉన్నారనే ఆరోపణలు వెల్లువెత్తు తున్నాయి. అటవీభూమిపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్న వారికే పోడు పట్టాకు అర్హతగా ప్రభు త్వం ప్రాథమిక నిబంధనను పెట్టింది. అయితే పట్టాలు పొందిన వారిలో పలువురు అటవీ భూమి సాగుపైనే కాకుండా ఇతరత్రా వ్యాపకాలున్నాయంటూ క్షేత్రస్థాయిలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులకు ఫిర్యాదులు వస్తున్నాయి. వీటిపై విచారణ చేపట్టాలని గిరిజన సంక్షేమ శాఖ నిర్ణయించింది. పునఃపరిశీలన రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లో పోడు భూముల సాగుకు సంబంధించిన దరఖాస్తులు వచ్చాయి. వీటి పరిశీలనకు గ్రామ, మండల, డివిజన్, జిల్లా స్థాయిలో నాలుగు అంచెల్లో దరఖాస్తులను పరిశీలించి అర్హతలను ఖరారు చేశారు. ఎనిమిది నెలలపాటు ఈ ప్రక్రియ కొనసాగింది. దరఖాస్తు పరిశీలన సమయంలో అర్జీదారుడు గిరిజనుడా? కాదా? అనే అంశాన్ని పరిశీలించిన అధికారులు... సదరు అర్జీదారుడు ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నాడా? ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడా? లేక అటవీభూమిని మాత్రమే సాగు చేసుకుని జీవనం సాగిస్తున్నాడా? అనే కోణంలో పరిశీలన చేయలేదు. దీంతో పోడు అర్హుల్లో పలువురు ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు, వ్యాపారులు ఉన్నట్లు వెలుగు చూస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పంపిణీ చేసిన దరఖాస్తులను, పట్టా పుస్తకాలు పొందిన వారి వివరాలను పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ఈమేరకు సంబంధిత 26 జిల్లాల కలెక్టర్లను పునఃపరిశీలించాలని ఆదేశించింది. మరోవైపు నిర్మల్, మహబూబాబాద్ జిల్లాల్లో ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న వారికి పట్టాలు దక్కినట్లు వార్తలు రావడంతో గిరిజన సంక్షేమ శాఖ ఆ రెండు జిల్లాల కలెక్టర్లకు ప్రత్యేకంగా విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని గిరిజన శాఖ పేర్కొంది. 9 జిల్లాల్లో పూర్తి భద్రాద్రి కొత్తగుడెం, నిర్మల్, ములుగు, రాజన్న సిరిసిల్ల, వనపర్తి, హనుమకొండ, జగిత్యాల, పెద్దపల్లి, నారాయణపేట్ జిల్లాల్లో వందశాతం లక్ష్యం పూర్తయింది. మిగతా జిల్లాల్లో లక్ష్యసాధన దాదాపు పూర్తయింది. సూర్యాపేట జిల్లాలో మొత్తం 84 మంది అర్హులు, మహబూబ్‌నగర్ జిల్లాలో 19 మంది అర్హులు ఉండగా... ఒక్కరికీ పట్టా ఇవ్వకపోవడం గమనార్హం. -
నేనే వీఆర్వో.. నేనే ఎమ్మార్వో..
కనిగిరి రూరల్: ‘‘నేనే వీఆర్వో.. నేనే ఎమ్మార్వో’’ అన్నట్లు జగన్నాథం సురేష్ అనే యువకుడు ఇష్టారాజ్యంగా భారీ అక్రమాలకు పాల్పడ్డాడు. నియోజకవర్గంలోని కనిగిరి, హెచ్‌ఎంపాడు, పీసీపల్లి తదితర మండలాలకు చెందిన సుమారు 12 మందికి దొంగ ఇళ్ల పట్టాలు, అసైన్డ్ భూముల డీకే పట్టాలు, పాస్ పుస్తకాలు తయారు చేసి ఇచ్చి సుమారు రూ.అర కోటి పైగా స్వాహా చేసినట్లు తెలుస్తోంది. ఇందులో మరో ఇద్దరు కూడా ఉన్నట్లు తెలుస్తుండగా, కొందరూ రెవెన్యూ అధికారుల పాత్రకూడా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. వెలుగు చూసింది ఇలా.. లింగసముద్రం మండలానికి చెందిన జగన్నాథం సురేష్ కొంత కాలంగా కనిగిరి ప్రాంతంలో ఉంటున్నాడు. గతంలో ఉన్న తహసీల్దార్‌కు ఇతను వాహన డ్రైవర్‌గా కూడా పనిచేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇతను అక్రమాలకు పాల్పడ్డాడు. సురేష్, పొదిలికి చెందిన అతని స్నేహితుడు మర్రిబోయిన రమణయ్య కలిసి పట్టణంలోని సూరా పాపిరెడ్డి కాలనీలో తమకు పట్టాలు ఉన్నాయని పట్టణానికి చెందిన సుధాకర్‌కు చెప్పారు. అతను అతని స్నేహితుడైన బాషాకు చెప్పాడు. వీరిద్దరూ కలిసి పట్టణంలోని చింతపాలేనికి చెందిన కొండారెడ్డికి రూ.1.50 లక్షలకు అమ్మించారు. రమణయ్య అమ్మిన పట్టాను కొనుగోలుదారుడు ఆన్లైన్ చేసేందుకు తహసీల్దార్ కార్యాలయంలో చూపించుకున్నాడు. ప్రభుత్వ ఆన్లైన్, లిఖిత పూర్వక రికార్డుల్లో రమణయ్య పేరు లేదు. దీంతో బాధితుడు కొండారెడ్డి తనకు ఆ ఇంటి స్థలం వద్దని, అది దొంగపట్టా అని చెబుతూ తన డబ్బులు తిరిగి ఇవ్వాలని దాన్ని అమ్మించిన బాషా, సుధాకర్‌లను కోరాడు. దీంతో వీరిద్దరు సురేష్, రమణయ్యలకు చెప్పారు. వారు డబ్బులు తిరిగి ఇవ్వకుండా, సమాధానం చెప్పకుండా తప్పించుకుని తిరుగుతున్నారు. సుమారు 6 నెలల నుంచి కనిపించకుండా తిరుగుతున్నారు. ఈక్రమంలో మంగళవారం అర్బన్ కాలనీలో మరొకరి దొంగపట్టాలు అమ్మేందుకు సురేష్, రమణయ్యలు వచ్చినట్లు బాధితులు తెలుసుకున్నారు. సుధాకర్, బాషా మరికొందరు వెళ్లి సురేష్, రమణయ్యలను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఎస్పీకి ఫిర్యాదు: అయితే అప్పటికే కనిగిరి మండలం చల్లగిరిగిలకు చెందిన వంగేపురం కోటమ్మ.. తనకు అసైన్డ్ భూమి 3 ఎకరాలు ఇప్పిస్తానని చెప్పి రూ.1.50 లక్షల డబ్బులు సురేష్ అనే అతను తీసుకుని మోసం చేశాడని, ఏడాది నుంచి నగదు ఇవ్వకుండా కనిపించడం లేదని ఎస్పీ మలికా గర్గ్‌కు స్పందనలో ఫిర్యాదు చేసింది. దీంతో స్థానిక పోలీసులకు ఎస్పీ ఆఫీసు నుంచి రిఫర్ చేశారు. ఈమేరకు కనిగిరి పోలీసులు సురేష్ కోసం గాలిస్తున్నారు. ఇంతలో సురేష్ దొరకడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసున్నారు. పట్టాలపై సంతకాలన్నీ గత తహసీల్దార్, ప్రస్తుత ఆర్డీఓ పేరుతోనే.. అయితే ఈ దొంగపట్టాలన్నీ గతంలో కనిగిరిలో పనిచేసిన తహసీల్దార్, ప్రస్తుత కనిగిరి ఆర్డీఓ అజయ్‌కుమార్ పేరుతో ఉన్నాయి. దీంతో నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. సురేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలియడంలో బాధితులు ఒక్కొక్కరుగా పోలీస్ స్టేషన్‌కు చేరుతున్నారు. అసైన్డ్ భూములు ఇప్పిస్తానని రూ.3 లక్షలు స్వాహా... వాగుపల్లి గ్రామ సమీపంలో ప్రభుత్వ అసైన్డ్ భూములు పెట్టిస్తానని చెప్పి ఐదుగురి దగ్గర సురేష్ రెండు దఫాలుగా రూ.3 లక్షలు తీసుకున్నాడు. మొదట రూ.1.50 లక్షలు తీసుకుని భూమి డీకే పట్టాలు ఇచ్చాడు. ఆ తర్వాత రూ.1.50 లక్షలు తీసుకుని పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చాడు. ఆ తర్వాత ఆన్లైన్ పూర్తయ్యాక మరో రూ.3 లక్షలు ఇవ్వాలని తెలిపాడు. కానీ ఏడాది నుంచి కనిపించడం లేదు. ఫోన్ కూడా ఎత్తడం లేదు. దీంతో ఆ పట్టాలను, పాస్ పుస్తకాలను తహసీల్దార్ కార్యాలయంలో తీసుకెళ్లి చూపించగా, అవి దొంగవిగా చెప్పారు. కనీసం మ్యాన్యువల్ బుక్‌లో కూడా లేవని తేల్చారు. ఈమేరకు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు వాగుపల్లికి చెందిన బాధితుడు వెంకటరెడ్డి తెలిపాడు. చిన ఇర్లపాడులో.. . అలాగే చిన ఇర్లపాడులో డీకే పట్టాలు పెడతామని చెప్పి ఆంధోని, రూత్, బ్రహ్మారెడ్డి, జయపాల్‌తో పాటు తన దగ్గర రూ.3 లక్షలు డబ్బులు తీసుకుని దొంగపట్టాలు ఇచ్చాడని ముద్దా బాబు అనే వ్యక్తి తెలిపాడు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే నెల్లూరు జిల్లాకు చెందిన మరొకరి దగ్గర రూ.5 లక్షల డబ్బులు తీసుకుని దొంగ ఇంటి పట్టాలు ఇచ్చి మోసం చేసినట్లు బాధి తులు తెలిపారు. ఇలా అనేక మంది బాధితులు ఉన్నట్లు సమాచారం. బాధితుడు వాగుపల్లికి చెందిన మూలే వెంకటరెడ్డి ఫిర్యాదు మేరకు ఫోర్జరీ సంతకాలతో దొంగపట్టాలు, పాస్ పుస్తకాలు ఇచ్చిన నెల్లూరు జిల్లా లింగసముద్రంకు చెందిన సురేష్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై దాసరి ప్రసాద్ తెలిపారు. విచారణకు ఆదేశించా.. నా పేరుతో సంతకం పెట్టి కొందరు దొంగ పట్టాలు, పాస్ పుస్తకాలు తయారు చేసినట్లు నా దృష్టికి వచ్చింది. దీనిపై తక్షణ విచారణ జరిపి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను ఆదేశించాను. అలాగే ఫోర్జరీ సంతకాలు, దొంగ స్టాంప్‌లతో పట్టాలు తయారు చేసిన వ్యక్తిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేస్తాను. – టీ అజయ్‌కుమార్, కనిగిరి ఆర్డీవో -
ఇప్పటి వరకు రైతుబంధు రాలేదా?.. వారిందరికీ గుడ్‌న్యూస్
సాక్షి, హైదరాబాద్: కొత్తగా పట్టాదార్ పాస్ బుక్ వచ్చిన రైతులకు ఈ వానాకాలం సీజన్లో రైతుబంధుకు అవకాశం కల్పించారు. జూన్ 16 నాటికి పాస్ బుక్ వచ్చిన ప్రతీ రైతుకు రైతుబంధు పెట్టుబడి సాయాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పథకం కింద సాయం పొందడానికి కొత్త పట్టాదారు పాస్ బుక్, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా పుస్తకం జిరాక్సు కాపీలను స్థానిక ఏఈవోలకు అందజేయాల్సి ఉంటుంది. బుధవారం నుంచే ఏఈవోలకు రైతుబంధు పోర్టల్‌లో ఎడిట్ ఆప్షన్ అందుబాటులోకి తెచ్చారు. సీసీఎల్ఏ డేటా ఆధారంగా రైతులను గుర్తిస్తారు. రైతు పట్టాదారు పాస్‌బుక్ వివరాలను రైతుబంధు పోర్టల్‌లో అప్లోడ్ చేస్తారు. రాష్ట్రంలో సీసీఎల్ఏలో నమోదైన పట్టాదారు పాసు పుస్తకాలు కలిగిన 68.94 లక్షలకు పైగా రైతులు రైతుబంధుకు అర్హులుగా ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా కొత్త లబ్ధిదారుల నమోదుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. దీంతో ఈనెల 26 నుంచే రైతుబంధు పెట్టుబడి సాయం పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇది కూడా చదవండి: 15,660 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు 117 బ్లాకులు.. -
రైతుబంధు వచ్చేదెప్పుడో? లక్షన్నర మంది రైతుల నిరీక్షణ
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్రంలో గతేడాది జూలై నుంచి ఇప్పటివరకు కొత్తగా పట్టాదారు పాస్‌పుస్తకాలు పొంది రైతుబంధు కోసం దరఖాస్తు చేసుకున్న దాదాపు లక్షన్నర మంది రైతులందరిదీ ఇదే బాధ. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు ఆన్లైన్లో నమోదు కాకపోవడమే ఇందుకు కారణం. ప్రభుత్వం ఈ యాసంగి సీజన్లో పెట్టుబడి సాయం అందించే క్రమంలో రైతుబంధు పథకానికి 2022 డిసెంబర్ 20 నాటికి కొత్తగా పాస్ పుస్తకాలు లభించిన వారు దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించింది. జిల్లాల్లో వ్యవసాయ అధికారులు కూడా స్థానికంగా ప్రకటనలు జారీ చేశారు. జనవరి 7 వరకు గడువు ఇచ్చారు. దీంతో హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, కామారెడ్డి మినహా మిగతా 28 జిల్లాల్లో 1,40,668 మంది రైతులు రైతుబంధు కోసం దరఖాస్తు చేసుకొని ఎదురుచూస్తున్నారు. నిలిచిన లాగిన్ సౌకర్యం.. గత వానాకాలం సీజన్లో జూన్ 28 నుంచి పెట్టుబడి సాయం అందించారు. జూన్ 20 వరకు పాస్‌పుస్తకాలు కలిగిన లేదా రిజిస్ట్రేషన్లు అయిన రైతుల వివరాలు ఆన్లైన్లో నమోదు చేసి ప్రభుత్వం సాయం అందించింది. జూలై 20 తరువాత కొనుగోలు చేసిన లేదా వారసత్వం కింద రిజిస్ట్రేషన్లు చేయించుకున్న వారికి యాసంగి పెట్టుబడి కోసం రైతుబంధుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. మరోవైపు ధరణి సమస్యలతో నిషేధిత జాబితాలో పడిన భూముల సమస్యలకు ఇటీవల పరిష్కారం లభించింది. అలాంటి వారికి పాస్ పుస్తకాలు వచ్చాయి. వారంతా మండల స్థాయిలో రైతుబంధుకు దరఖాస్తు చేసుకున్నారు. వారి వివరాలను ఏవో, ఏఈవోలు రైతుబంధు పోర్టల్‌లో నమోదు చేయాల్సి ఉంది. అయితే అప్పటి నుంచి ఇప్పటివరకు ఆ పోర్టల్‌లో అధికారులకు ప్రభుత్వం లాగిన్ అవకాశం ఇవ్వలేదు. దీంతో దరఖాస్తుదారుల వివరాలను వారు ఆన్లైన్లో నమోదు చేయలేదు. ఫలితంగా ఆయా రైతులకు యాసంగి పెట్టుబడి సాయం అందలేదని అధికారులు చెబుతున్నారు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మల్లంపల్లి గ్రామానికి చెందిన ఈమె పేరు కాలం రజిత. ఇటీవలే 2.16 ఎకరాలకు పాసు పుస్తకం వచ్చింది. నవంబర్ 16నే రైతుబంధు కోసం దరఖాస్తు చేసుకున్నా ఇప్పటికీ రాలేదు. దీంతో పెట్టుబడి కోసం ఎకరానికి రూ. 20 వేలు అప్పు చేయాల్సి వచ్చింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గోపాలరావుపల్లెకు చెందిన ఈయన కడారి శ్రీనివాస్‌రెడ్డి. అదే మండలంలోని వెంకటాపూర్ శివారులో 6 నెలల కిందట 3 ఎకరాల భూమి కొన్నారు. పాస్ బుక్ వచ్చింది. రైతుబంధుకు దరఖాస్తు చేసుకున్నా రాలేదు. ఈమె నల్లగొండ జిల్లా పెద్ద వూర మండలం చింతపల్లికి చెందిన కట్టెబోయిన విష్ణుప్రియ. తన తండ్రి నుంచి వారసత్వంగా వచ్చి న ఆరెకరాల భూమికి ఆగస్టులో పాసుపుస్తకం వచ్చింది. యాసంగి రైతుబంధు సహా యం కోసం ప్రభుత్వం అవకాశం ఇవ్వడంతో దరఖాస్తు చేసుకుంది. అయినా రైతుబంధు మంజూరు కాలేదు. దీంతో పెట్టుబడి కోసం అప్పు చేయాల్సి వచ్చింది. -
కేసీఆర్ రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేశారు
సాక్షి, సిద్ధిపేట : భారీ వర్షాలకు ఇళ్లు నేలమట్టమై ఆశ్రయం లేని 500కు పైగా కుటుంబాలకు మంత్రి హరీష్‌రావు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేశారు. సిద్ధిపేట కొండా భూదేవి గార్డెన్లో వర్షాల కారణంగా ఇళ్లు నేలకొరిగాయి. దీంతో ఒక్కొక్క కుటుంబానికి రూ.3200 చొప్పున్న చెక్కులను అందజేశారు. అంతేకాకుండా 220 మందికి కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్‌కి సంబంధించిన 2 కోట్ల 19 లక్షల 50 వేల రూపాయల చెక్కును మంత్రి హరీష్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ రెవెన్యూ శాఖలో ఇబ్బందులు ఉండకూడదని రెవెన్యూ ప్రక్షాళన చేయించారని తెలిపారు. ప్రతి ఒక్క రైతుకు 5 వేల రూపాయల రైతుబంధు ఇస్తున్నామని, పేర్కొన్నారు. (గ్రేటర్లో ఆర్టీసీ బస్సులను నడపండి) 'పేదింటి ఆడ పిల్లల పెళ్లిలకు లక్షా 116 వేల రూపాయల సాయాన్ని అందిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో తప్పా దేశంలో ఏ రాష్ట్ర సీఎం ఇవ్వడం లేదు, బీజేపి, కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో కూడా ఇవ్వడం లేదు. ఈ ఏడాది వానాకాలం వానాలు అధికంగా పడ్డాయి. వారం రోజుల్లోపు నియోజకవర్గంలో ఏదైనా గ్రామం ముందుకొస్తే సీడ్ విలేజ్ గా మార్చేందుకు కృషి చేస్తా. విత్తనోత్పత్తి కేంద్రంగా సిద్ధిపేట జిల్లాను మార్చుకుందాం. విత్తనోత్పత్తి వల్ల అధిక లాభాలున్నాయి. వారంలోపు విత్తనోత్పత్తి కోసం రైతులు ముందుకు వస్తే మీకు తోడ్పాటు అందిస్తా.జిల్లాలో పామాయిల్ ఉత్పత్తికి అనుకూలమని ఢీల్లీ నుంచి ఆమోదం వచ్చింది..జిల్లాలో 48 వేల ఎకరాలకు ఫామ్ ఆయిల్ తోటలకు అనుమతి వచ్చిందని' మంత్రి హరీష్ వెల్లడించారు. (తెలంగాణకు కేంద్రం అన్యాయం చేస్తోంది) -
ఆర్వోఎఫ్ఆర్ పట్టాలపై సీఎం జగన్ సమీక్ష
సాక్షి, తాడేపల్లి : ఆర్వోఎఫ్ఆర్ (రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్) పట్టాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. సోమవారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, పుష్పశ్రీవాణి, ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ కాంతిలాల్ దండే, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ అధికారులకు పలు సూచనలు చేశారు. వ్యవసాయం చేసుకునే గిరిజనులకు జీవనోపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆర్వోఎఫ్ఆర్ పట్టా ఉన్న వారికి రైతు భరోసా అమలు చేస్తున్నామని సీఎం జగన్ ప్రకటించారు. (చదవండి : రైతుల కోసం జగన్ సర్కార్ మరో ముందడుగు) అటవీ భూములపై గిరిజనులకు హక్కులు కల్పించడం ద్వారా పెట్టుబడి సాయం పొందడానికి అవకాశం కల్పించినట్లవుతుందన్నారు. అటవీ భూములపై హక్కులు కల్పించే అంశంలో అవినీతి ఉండకూడదని అధికారులకు సూచించారు. అధికారులు మానవత్వంతో పని చేయాలని, గిరిజనులు ఆదాయం పొందడానికి అవకాశాలు కల్పించాలన్నారు. గిరిజనులకు దారి చూపించేలా అధికారులు వ్యవహరించాలని కోరారు. ప్రతి ఆర్వోఎఫ్ఆర్ పట్టాను ఆధార్‌లో లింక్ చేయాలని సూచించారు. అదివాసీ దినోత్సవం నాటికి గిరిజనులకు అటవీ భూములపై హక్కులు కల్పించేలా చూడాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. -
త్వరలోనే పాసుపుస్తకాలు
సాక్షి, హైదరాబాద్: దేవాలయ భూములకు పాసుపుస్తకాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. దేవాదాయ శాఖ అధికారులు గుర్తించిన భూములకు ఆయా దేవాలయాల మీదే పాసుపుస్తకాలివ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం ఈ మేరకు సమీకృత భూరికార్డుల నిర్వహణ (ఐఎల్‌ఎంఆర్‌ఎస్) వెబ్సైట్లో ఆ భూములకు డిజిటల్ సంతకాలు చేసే అధికారాన్ని తహసీల్దార్లకు అప్పగించింది. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్లు మ్యాపింగ్ చేసిన సర్వే నంబర్లకు తహసీల్దార్ల లాగిన్ల ద్వారా డిజిటల్ సంతకాలు చేయాలని, ఈ సంతకాలు పూర్తయిన భూములకు పట్టాదారు పాసుపుస్తకం కమ్ టైటిల్‌డీడ్ ఇస్తామని సీసీఎల్ఏ ప్రాజెక్టు డైరెక్టర్ కార్యాలయం క్షేత్రస్థాయి రెవెన్యూ వర్గాలకు సమాచారం పంపింది. దేవాదాయ భూములకు పాసు పుస్తకాలివ్వడంతో పాటు ప్రక్షాళనలో భాగంగా పెండింగ్‌లో ఉన్న పలు అంశాలను కూడా పరిష్కరించే విధంగా అదనపు ఆప్షన్లు ఇచి్చంది. దీంతో పెండింగ్ సమస్యలకు పరిష్కా రం లభిస్తుందని రెవెన్యూ వర్గాలంటున్నాయి. -
11వేల ఎకరాలకు అక్రమ పట్టాలు: పరారీలో అధికారులు
సాక్షి, చందంపేట: చందంపేట మండలంలో గతంలో అక్రమంగా పట్టాలు చేసిన అధికారుల వ్యవహారంపై ఏసీబీ విచారణకు పూనుకుంది. ఈ నేపథ్యంలో చందంపేట రెవెన్యూ కార్యాలయంపై ఏసీబీ నిఘా పెట్టింది. దీంతో రైతు బంధు, రైతు బీమా.. వచ్చేస్తోంది.. కేవలం రూ.20వేలే..రండి బాబు రండి అంటూ అక్రమ పట్టాలు ఇచ్చిన రెవెన్యూ అధికారుల్లో గుబులు మొదలైంది. ఒకటి కాదు..రెండు కాదు సుమారు 11వేల ఎకరాలకు అక్రమ పట్టాలు ఇచ్చిన అధికారులపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. గతంలో కేవలం సస్పెండ్ అయిన అధికారులపై ఇప్పుడు క్రిమినల్ కేసులు పెడుతున్నారు. అయితే వారంతా ప్రభుత్వ ఉద్యోగులు కావడంతో ఆయా సెక్షన్ల కింద బెయిల్ రాకపోవడంతో భయాందోళన చెందుతున్నారు. చందంపేట మండలంలో 2018–19 సంవత్సరంలో విధులు నిర్వహించిన తహసీల్దార్ చాంద్‌పాషా, శ్రీనివాస్‌శంకర్, యూసుఫ్, ఇన్చార్జ్ తహసీల్దార్ రవీందర్‌రాజు, వీఆర్వోలు నాగలక్ష్మి, అంజయ్య, యాదయ్య, జూనియర్ అసిస్టెంట్ శ్రీనులపై ఇప్పటికే సెక్షన్ 409, 419, 420, 464, 465, 468, 34ఐపీసీ సెక్షన్ల కింద చందంపేట పోలీసులు కేసులు నమోదు చేశారు. ఏసీబీ విచారణ.. చందంపేట మండలంలో కొంతమంది రాజకీయ నాయకులు పేరున్న నేతలతో కలిసి రెవెన్యూ అధికారులు చేతులు కలిపారని, సుమారు 11వేల ఎకరాలు భూములు లేకున్నా నూతన పట్టాదారు పాస్‌పుస్తకాలు అందజేశారని విచారణలో తేలడంతో వారిపై సస్పెన్షన్ వేటు పడగా క్రిమినల్ కేసులు కూడా నమోదు చేశారు. ఇప్పటికే కలెక్టరేట్ నుంచి అధికారులు పలు రికార్డులను పరిశీలించారు. ఏసీబీ అధికారులు కూడా రెవెన్యూ అధికారుల నుంచి నూతనంగా పంపిణీ చేయబోయే పట్టాదారు పాస్‌పుస్తకాలను స్వాధీనం చేసుకోగా, అక్రమ పట్టాలను ఆన్లైన్ నుంచి తొలగిస్తున్నారు. ఏసీబీ అధికారులు ఇప్పటికే రెవెన్యూ అధికారులను పూర్తి నివేదికలను అందించాలని మూడు రోజుల క్రితం విచారించినట్లు తెలుస్తోంది. మంగళవారం హైదరాబాద్ ఏసీబీ కార్యాలయానికి హాజరు కావాలని వ్యవసాయ అధికారులకు కూడా నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. -
పాసు పుస్తకాలు ఇవ్వాల్సిందే !
సాక్షి, నిజామాబాద్ అర్బన్ : రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా అర్హులైన వారందరికీ పట్టాదారు పాసు పుస్తకాలు అందజేయాలని ఇదివరకే చాలా సార్లు చెప్పాను. అయినా తీరు మార్చుకోవడం లేదు. మండలాల్లో సమస్యలు పరిష్కరించడం లేదని రైతులు జిల్లా కేంద్రానికి వచ్చి మొర పెట్టుకుంటున్నారు. మండలాల్లో మీరేం చేస్తున్నట్లు..? అంటూ జిల్లా కలెక్టర్ రామ్మోహన్రావు తహసీల్దార్లపై సీరియస్ అయ్యారు. మంగళవారం ప్రగతిభవన్‌లో తహసీల్దార్లతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... రైతుల రికార్డులు ఇంకా సరిచేయకపోవడం వల్ల ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని, ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో జిల్లా నలు మూలల నుంచి రైతులు వ్యయ ప్రయాసలతో జిల్లా కేంద్రానికి వచ్చి విన్నపాలు అందజేస్తున్నారని తెలిపారు. మండల స్థాయిలో పరిష్కరించడం లేదన్నారు. కోర్టు స్టే ఇచ్చినవి అనర్హత కేసులు తప్ప మిగతా అన్నింటినీ వెంటనే పరిష్కరించాలని ఇప్పటికే పలుసార్లు వీడియో కాన్ఫరెన్స్‌లో ద్వారా స్వయంగా అలాగే మండలాలను తనిఖీ చేసిన సందర్భంగా ఆదేశాలు జారీ చేసినా కూడా నిర్లక్ష్యంగా ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటగిరిల వారీగా అర్హత గల వారందరికీ పట్టా పాసు పుస్తకాలు సత్వరమే అందజేయాలని, లేని పక్షంలో ఉపేక్షించేది లేదన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం నిర్ణయం తీసుకుని అవసరమైతే క్షేత్రస్థాయిలో పర్యటించి అర్హత గలవారిని గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు. -
పాస్‌బుక్ కావాలంటే ‘రెవెన్యూ’ ఇచ్చుకోవాల్సిందే!
శ్రీకాళహస్తి మండలం చుక్కలనిడిగల్లుకు చెందిన గురవమ్మకు నలుగురు కుమారులు. వృద్ధురాలు కావడంతో తనపేరున ఉన్న ఎకరం పొలాన్ని కుమారులకు భాగపరిష్కారం చేయాలని భావించారు. పాసుపుస్తకాల కోసం ఇప్పటికే రెండు దఫాలు మీ–సేవలో ఆన్లైన్ చేశారు. సంబంధిత దరఖాస్తులను ఓ రెవెన్యూ ఉద్యోగికి ఇవ్వగా ఆయన వాటిని అప్రూవల్ చేయడానికి రూ.8 వేల వరకు డిమాండ్ చేశాడు. అంత మొత్తం ఇచ్చుకోలేకపోవడంతో ఫైలు పెండింగ్‌లో పడింది. ఆ ఉద్యోగిని ఒత్తిడి చేయగా తన పైఅధికారితో మాట్లాడుకోమని ఉచిత సలహా ఇచ్చాడు. రెండు వారాల నుంచి తిరుగుతున్నా ఆయన కూడా కరుణించడంలేదు. అడిగిన మొత్తం ఇవ్వకపోవడంతో కష్టమని చిర్రుబుర్రులాడినట్లు బాధితురాలు కన్నీళ్లు పెట్టుకున్నారు. తల్లిదండ్రుల పేరున ఉన్న భూమిని భాగపరిష్కారం చేయడానికి రిజిస్ట్రేషన్ అవసరం లేదని కొందరు రెవెన్యూ అధికారులు చెప్పడం కొసమెరుపు. సాక్షి, చిత్తూరు : పట్టాదారు పాసుపుస్తకాల కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న రైతులు ప్రతి మండలంలో వందలాది మంది ఉన్నారు. పట్టాదారు పాసుపుస్తకం కోసం మీ సేవలో దరఖాస్తు చేసుకున్నా సకాలంలో చేతికందడం లేదు. దీంతో రెవెన్యూ సిబ్బంది, అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వస్తోంది. ప్రతి పట్టాదారు పుస్తకానికి రూ.2 వేల నుంచి రూ.10 వేల వరకు రెవెన్యూ అధికారులకు ముట్టజెప్పుకోవాల్సిన దుస్థితి. అంతపెద్ద మొత్తంలో నగదు ఇచ్చుకోలేని రైతులకు పక్కాగా రిజిస్ట్రేషన్ పత్రాలు ఉన్నా పట్టాదారు పుస్తకాలను పొందలేక అవస్థలు పడుతున్నారు. రెవెన్యూలో కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకు మామూళ్లు ఇవ్వందే ఫైళ్లు కదలడం లేదు. వీఆర్ఓ నుంచి తహసీల్దారు వరకు ఆమోదం పొందాల్సి ఉన్నందున అవినీతి తారస్థాయికి చేరుకుంది. జిల్లాలో మొత్తం 6.48 లక్షల మంది రైతులు ఉండగా, రైతు కుటుంబాలు దాదాపు 3.80 లక్షల మేరకు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా భూ విస్తీర్ణంలో మొత్తం 5.40 లక్షల మేరకు సర్వే నంబర్లు ఉన్నాయి. వాటిలో సబ్ డివిజన్లు దాదాపు 7.20 లక్షల మేరకు ఉన్నాయి. వీటిలో వ్యవసాయ భూములకు సంబంధించి 4.30 లక్షల మేరకు రైతులు పట్టాదారు పాసుపుస్తకాలు కలిగి ఉన్నారు. వెబ్‌ల్యాండ్‌లో మాత్రం 5.48 లక్షల మేరకు 1బీ ఖాతాలు ఉన్నాయి. ఇందులో దాదాపు 40 శాతం మేరకు 1బీల్లో సర్వే నంబర్ల తప్పులు, విస్తీర్ణంలో వ్యత్యాసాలు ఉన్నాయి. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రిజిస్ట్రేషన్ దస్తావేజులతో పనిలేకుండానే, కేవలం 1బీల ఆధారంగా భూముల రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించింది. దీన్ని ఆసరాగా తీసుకున్న కొందరు స్వార్థపరులు, టీడీపీ నాయకులు వెబ్‌ల్యాండ్‌లో ఇష్టానుసారంగా సర్వే నంబర్లను నమోదు చేసుకున్నారు. అదేగాక 1బీ ఆధారంగా ఏకంగా ఆ భూములను విక్రయించేశారు. దీంతో వెబ్‌ల్యాండ్‌లోని భూముల వివరాలు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. చేయి తడపాల్సిందే.. వెబ్‌ల్యాండ్‌లో చోటుచేసుకున్న అవకతవకలను సరిదిద్దుకోవాలన్నా, పట్టాదారు పాసుపుస్తకాలు పొందాలన్నా రెవెన్యూ సిబ్బందికి లంచం ఇచ్చుకోవాల్సిందే. గత ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న తప్పులను సరిచేసుకోవాలంటే భూముల హక్కుదారులకు తిప్పలు తప్పడం లేదు. మీసేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకున్న 40 రోజుల్లో రెవెన్యూ అధికారులు సమస్యను పరిష్కరించాల్సి ఉంది. అయితే గడువు పూర్తయినా రెవెన్యూ సిబ్బంది, అధికా రులు పనులు చేయడం లేదు. దీనిపై రైతులు రెవెన్యూ కార్యాలయానికి వెళ్లి అధికారులు, సిబ్బందిని కలిస్తే, ఒక్కో సర్వే నంబరుకు రూ.2వేల నుంచి రూ.10 వేల వరకు ఇస్తేగాని పనులు చేయడానికి ససేమిరా అంటున్నారు. అదేగాక విలువైన భూములకు సంబంధించి సర్వే నంబరుకు ఒక్కింటికి రూ.5 వేల నుంచి రూ.20 వేల వరకు ఇస్తేనే సమస్యను పరిష్కరి స్తున్నారు. ఇక కొందరు రైతులు ఉమ్మడి కుటుంబం నుంచి భూములను భాగ పరి ష్కారం చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకున్నా పట్టాదారు పాసుపుస్తకం కోసం అవస్థలు తప్పడం లేదు. మీసేవ కేంద్రం ద్వారా దరఖాస్తు చేసుకున్నా రెవెన్యూ సిబ్బందికి ఒక్కో పట్టాదారు పుస్తకానికి రూ.5 వేల నుంచి రూ.20 వేల వరకు ముట్టజెప్పుకోవాల్సిందే. ఒకవేళ విలువైన భూములైతే రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు సమర్పించాల్సిందే. ఇంటి యజమాని మరణిస్తే, ఆయనకు సంబం ధించిన పట్టాదారు పాసుపుస్తకంలో సంబంధీకుల పేరుకు మార్పు చేయాలంటే ఒక్కో పుస్తకానికి రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు సమర్పించుకోవాల్సిందే. కోర్టులు ఆదేశించినా.. తగాదాలు ఉన్న భూములకు సంబంధించి కోర్టులు తీర్పులిచ్చినా పట్టాదారు పుస్తకాలు పొందలేక రైతులు అవస్థలు పడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో నెలకొన్న వెబ్‌ల్యాండ్‌లో అక్రమాల కారణంగా పలువురు రైతులు కోర్టులను ఆశ్రయించాల్సి వచ్చింది. కొందరు స్వార్థపరులు తమకు భూములు లేకున్నా, ఇతరుల భూములను రెవెన్యూ సిబ్బంది సహకారంతో Ððð బ్ల్యాండ్లో నమోదు చేయించుకున్న దాఖలాలు కోకొల్లలు. దీంతో రిజిస్టర్ దస్తావేజులు ఉన్న భూ యజమానులు ప్రశ్నిస్తే ఆక్రమణదారులు ఏకంగా 1బీ మేరకు అన్‌రిజిస్టర్ డాక్యుమెంట్లు సృష్టించి ఏకంగా కోర్టులను ఆశ్రయించారు. దీంతో అసలైన భూ యజమానులు ఆర్డీఓ, జేసీ కోర్టులను ఆశ్రయించి నకిలీ పట్టాదారు పుస్తకాలను రద్దుచేస్తూ తీర్పులను తెచ్చుకుంటున్నారు. ఈ తీర్పుల మేరకు రెవెన్యూ సిబ్బంది భూ యజమానులకు పట్టాదారు పాసుపుస్తకం ఇవ్వాలన్నా ముడుపులు ఇచ్చుకోవాల్సిన దుస్థితి. ఒక్కో పట్టాదారు పాసుపుస్తకానికి రూ.10 వేల నుంచి రూ.20 వేలు ఇవ్వాల్సిందే. లేదంటే ఇచ్చిన తీర్పులపై కూడా పలు సాకులు చెప్పుకుంటూ కాలం గడిపేస్తున్నారు. ఎవరైనా గట్టిగా నిలదీస్తే ఏకంగా వారి ప్రత్యర్థులను రెవెన్యూ కోర్టులు ఇచ్చిన తీర్పుపై మరో ఉన్నత కోర్టును ఆశ్రయించేలా సలహాలు ఇచ్చి ఇబ్బందులకు గురిచేస్తున్నారు. -
డబ్బులు తీసుకున్నారు.. పుస్తకాలివ్వలేదు..
తల్లాడ: పట్టాదారు పాసు పుస్తకాలకు చలాన తీయాలని రైతుల వద్దనుంచి పెద్ద మొత్తంలో రెవెన్యూ సిబ్బంది డబ్బులు తీసుకొని పాసు పుస్తకాలివ్వకుండా తాత్సారం చేస్తున్నారని ఆరోపిస్తూ తహసీల్దార్ కార్యాలయం వద్ద శుక్రవారం రైతులు ధర్నా నిర్వహించారు. ఇక్కడి ఆర్ఐలు ప్రసన్న, శ్రీనివాస్‌లు బదిలీ అయ్యారు. విషయం తెలుసుకున్న తల్లాడ, అన్నారుగూడెం, మల్లారం, కుర్నవల్లి, మిట్టపల్లి, బిల్లుపాడు, గోపాలపేట, కొత్త వెంకటగిరి, బాలపేట, నూతనకల్, పినపాక గ్రామాలకు చెందిన రైతులు తహసీల్‌కు చేరుకున్నారు. కార్యాలయానికి తహసీల్దార్ డీఎస్.వెంకన్న, ఆర్ఐలు ప్రసన్న, శ్రీనివాస్‌లు రాక పోవటంతో.. రైతులు ఆందోళనకు దిగారు. వచ్చే వరకు కదలబోమని భీష్మించారు. అన్నారుగూడెం వీఆర్ఓ నాగేశ్వర్రావు కార్యాలయానికి రాగా రైతులు ఆయన్ను చుట్టుముట్టి ఆర్ఐల గదిలో ఉంచి తలుపులు వేసి నిర్బంధించారు. చలాన పేరుతో డబ్బులు తీసుకొని పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వకుండా కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నట్లు వాపోయారు. తహసీల్దార్‌కుకు రైతులు ఫోన్ చేయగా.. తాను ఖమ్మంలో మీటింగులో ఉన్నానని, సమస్యను పరిష్కరిస్తామని, ఆందోళన చేయవద్దని చెప్పారు. దీంతో రైతులు ఇద్దరు ఆర్ఐలు, వీఆర్ఓలపై తల్లాడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇది సివిల్ మ్యాటర్ అని కలెక్టర్, ఆర్డీఓలకు ఫిర్యాదు చేసుకోవాలని ఎస్.ఐ. వరాల శ్రీనివాస్ సూచించారు. దీంతో కొందరు రైతులు కల్లూరు ఆర్డీఓ శివాజీకీ ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. ఎకరానికి రూ.5 వేల నుంచి 25 వేల వరకు వసూళ్లు తల్లాడ రెవెన్యూ సిబ్బంది పట్టాదారు పాసు పుస్తకాల్లో రైతుల పేర్లు నమోదు చేసేందకు, 1బీ ఖాతాలో పేరు చేర్చేందుకు ఎకరానికి రూ.5 వేల నుంచి రూ.25 వేల వరకు చలానా పేరుతో వసూలు చేసినట్లు రైతులు పేర్కొన్నారు. గత మూడేళ్లలో లక్షలాది రూపాయలు మామూళ్లు తీసుకొని పాసు పుస్తకాలివ్వకుండా తిప్పుకుంటున్నారని ఆరోపించారు. ఆర్ఐలు ఇద్దరు బదిలీ అవ్వటం వల్ల ఇప్పుడు తమ భూములు ఎవరు ఆన్లైన్ చేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. వీఆర్ఓలు, ఆర్‌ఐలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
గళమెత్తారు..
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ప్రజా సమస్యలపై జెడ్పీటీసీ సభ్యులు గళమెత్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిషత్ చివరి సర్వసభ్య సమావేశంలో తీరొక్క సమస్యలపై ప్రశ్నించారు. ప్రధానంగా జిల్లాలోని పలువురు రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు అందలేదని, దీంతో వారు రైతుబంధు పథకం ద్వారా లబ్ధి పొందలేకపోతున్నారని, దీనిపై రెవెన్యూ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సభ్యులు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. అలాగే మత్స్య సహకార సంఘాలకు కట్టిన భవనాలకు సంబంధించిన నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. శనివారం జరిగిన జిల్లా పరిషత్ సాధారణ చివరి సర్వసభ్య సమావేశానికి జెడ్పీ చైర్మన్ బరపటి వాసుదేవరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయం, మార్కెటింగ్, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం, వైద్య, ఆరోగ్యం తదితర అంశాలపై చర్చ సాగింది. జిల్లాలో రైతుల వెతలను పట్టించుకునే వారే కరువయ్యారని, రెవెన్యూపరమైన పనులు సామాన్యులకు అందుబాటులోకి రాని పరిస్థితి నెలకొందని, జిల్లాలో రెవెన్యూ వ్యవస్థ బాగుచేయలేనంతగా దెబ్బతిన్నదని, దీనిపై ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కో ఆప్షన్ సభ్యుడు జియావుద్దీన్ పేర్కొన్నారు. అనేక మండలాల్లో రైతులకు ఇంకా పట్టాదారు పాస్ పుస్తకాలు చేరనేలేదని, సాంకేతిక అంశాలను తప్పులుగా భూతద్దంలో చూపుతూ రైతులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన రైతుబంధు ఆర్థిక సహాయాన్ని అధికారులు అడ్డుకుంటున్నారని, పట్టాదారు పాస్ పుస్తకాల్లో ఉన్న లోపాలను, సాంకేతిక తప్పిదాలను సరి చేయాల్సిన క్షేత్రస్థాయి సిబ్బంది అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సభ్యులు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. అలాగే మత్స్య సహకార సంఘాలకు కట్టిన భవనాలకు సంబంధించిన నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. శనివారం జరిగిన జిల్లా పరిషత్ సాధారణ చివరి సర్వసభ్య సమావేశానికి జెడ్పీ చైర్మన్ బరపటి వాసుదేవరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయం, మార్కెటింగ్, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం, వైద్య, ఆరోగ్యం తదితర అంశాలపై చర్చ సాగింది. జిల్లాలో రైతుల వెతలను పట్టించుకునే వారే కరువయ్యారని, రెవెన్యూపరమైన పనులు సామాన్యులకు అందుబాటులో రాని పరిస్థితి నెలకొందని, జిల్లాలో రెవెన్యూ వ్యవస్థ బాగుచేయలేనంతగా దెబ్బతిన్నదని, దీనిపై ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కో ఆప్షన్ సభ్యుడు జియావుద్దీన్ పేర్కొన్నారు. అనేక మండలాల్లో రైతులకు ఇంకా పట్టాదారు పాస్ పుస్తకాలు చేరనేలేదని, సాంకేతిక అంశాలను తప్పులుగా భూతద్దంలో చూపుతూ రైతులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన రైతుబంధు ఆర్థిక సహాయాన్ని అధికారులు అడ్డుకుంటున్నారని, పట్టాదారు పాస్ పుస్తకాల్లో ఉన్న లోపాలను, సాంకేతిక తప్పిదాలను సరి చేయాల్సిన క్షేత్రస్థాయి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. బోనకల్, ఏన్కూరు జెడ్పీటీసీ సభ్యులు సైతం ఇదే అంశంపై ప్రభుత్వ విధానాలను నిలదీశారు. ఐదేళ్ల తమ పదవీ కాలంలో ప్రజలకు ఎంతో సేవ చేయాలని భావించామని, నిధుల కొరత కారణంగా అనేక పనులు చేయకుండానే పదవీ కాలాన్ని ముగించాల్సి వస్తోందని పలువురు జెడ్పీటీసీలు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలోని కౌలు రైతులకు భూమి కార్డులు ఇవ్వాలని, వారికి రైతుబంధు వర్తించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై జేసీ అనురాగ్ జయంతి మాట్లాడుతూ రైతుబంధు, ఆర్ఓఆర్, పట్టాదారు పాస్ పుస్తకాల జారీలో ఎదురవుతున్న ఇబ్బందిని, రైతులకు జరుగుతున్న అసౌకర్యంపై తక్షణమే చర్యలు తీసుకుంటామని, ఇప్పటికే దీనిని అత్యంత ప్రాధాన్యం కలిగిన అంశంగా జిల్లా అధికార యంత్రాంగం భావించి అనేక చోట్ల గ్రామసభలు నిర్వహించి.. ఈ తరహా ఇబ్బందులను తొలగించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. అలాగే ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి రైతులకు డబ్బులు చెల్లించే ప్రక్రియను మరింత వేగవంతం చేస్తామని, అందరికీ డబ్బులు అందేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. సభ్యులు ప్రస్తావించిన ప్రతి అంశాన్ని శాఖలవారీగా సమీక్షించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. వ్యవసాయ శాఖకు సంబంధించి రైతులకు నాణ్యమైన విత్తనాలను సరఫరా చేయాలని పలువురు జెడ్పీటీసీ సభ్యులు డిమాండ్ చేశారు. మత్స్య శాఖ నిధులతో పలుచోట్ల సంఘ భవనాలు నిర్మిస్తే.. ఇప్పుడు డబ్బులు లేవని ఇబ్బంది పెడుతున్నారని, అప్పుడున్న నిధులు వెనక్కిపోవడానికి బాధ్యులు ఎవరో తేల్చాలని, ఏళ్ల తరబడి నిర్మించిన భవనాలకు డబ్బులు ఇవ్వకపోతే కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకోవడం మినహా మరో మార్గం లేదని బోనకల్ జెడ్పీటీసీ సభ్యుడు తీవ్రస్థాయిలో ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై డిప్యూటీ సీఈఓ అప్పారావు స్పందిస్తూ.. ఈ నిధులకు సంబంధించి ప్రభుత్వానికి తక్షణమే లేఖ రాయడంతోపాటు నిధుల లభ్యతపై పూర్తిస్థాయి దృష్టి సారిస్తామని చెప్పారు. ప్రభుత్వ పర్యవేక్షణ అనేక అంశాల్లో కరువవడంతో రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారని, తాలిపేరులో చేప పిల్లలు వేస్తామని అధికారులు మాకు సమాచారం ఇచ్చారని, నాలుగు లారీల్లో చేప పిల్లలు వస్తున్నాయని వేసేందుకు ఆహ్వానించారని.. తీరా తాము అక్కడికి వెళ్లేసరికి లారీలు, చేప పిల్లలు లేవని, ఇదేమిటని పరిశీలిస్తే.. తాలిపేరు చెరువులో చేప పిల్లలను వదిలేశామని చెబుతున్నారని, ఆ ప్రాంతంలో లారీ టైర్ల అచ్చులు సైతం పడకుండా అన్ని లారీలు ఎలా వచ్చాయో ఇప్పటికీ అర్థం కావడం లేదని దుమ్ముగూడెం జెడ్పీటీసీ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై అధికారులు దృష్టి సారించాలన్నారు. ఏన్కూరు జెడ్పీటీసీ సభ్యురాలు మాట్లాడుతూ ఏన్కూరు వ్యవసాయ మార్కెట్లో దళారుల దందా రాజ్యమేలుతోందని, రైతుకు తీవ్రస్థాయిలో అన్యాయం జరుగుతోందని, ఇదేమిటని ప్రజాప్రతినిధులు, పాత్రికేయులు ప్రశ్నిస్తే.. వారిని లోబరుచుకోవడానికి దళారులు ప్రయత్నిస్తున్నారని, దీనిపై అధికారులు దృష్టి సారించకపోతే రైతు అన్యాయమైపోతాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇల్లందు జెడ్పీటీసీ చండ్ర అరుణ మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు అందించే రైతుబంధు డబ్బులను కొన్ని బ్యాంకులు పాత బాకీల కింద జమ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని, ఇది తీవ్రవైన విషయంగా ప్రభుత్వం పరిగణించాలని, రైతుకు పెట్టుబడి సహాయంగా ఇచ్చే నగదును పాత అప్పుల కింద బ్యాంకు అధికారులు జమ చేసుకునే పద్ధతికి అధికారులు చెక్ పెట్టకపోతే రైతుబంధు పథకం నిర్వీర్యమయ్యే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి పలు ఉదాహరణలను వివరించారు. సమావేశానికి అధ్యక్షత వహించిన జెడ్పీ చైర్మన్ బరపటి వాసుదేవరావు మాట్లాడుతూ గత ఐదేళ్లలో కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. సీఎం కేసీఆర్, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇతర ప్రజాప్రతినిధుల సహకారంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ తదితర పథకాలను అర్హులైన పేదలకు అందించడంలో ప్రజాప్రతినిధులంతా పాలుపంచుకున్నారని అన్నారు. సమావేశంలో జెడ్పీ కోఆప్షన్ సభ్యులు మహ్మద్ మౌలాన, జియావుద్దీన్, ఉమ్మడి జిల్లాలోని జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు. -
కరుణించని ‘ధరణి’
సాక్షి, హైదరాబాద్: ‘ధరణి’ వెబ్సైట్ రైతులకు చుక్కలు చూపుతోంది. ఏడాదికాలంగా మండల కార్యాలయాల చుట్టూ ప్రదిక్షణలు చేస్తున్నా.. పాస్ పుస్తకాలు అందక రైతులు గగ్గోలు పెడుతున్నారు. రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన అనంతరం భూ రికార్డుల సమగ్ర నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ధరణి వెబ్‌సైట్‌ను ప్రవేశపెట్టింది. రెవెన్యూ రికార్డులన్నింటినీ ఆన్లైన్లోనే అప్డేట్ చేసేలా ఈ సాఫ్ట్వేర్ అందుబాటులోకి తెచ్చింది. ఈ సాఫ్ట్‌వేర్‌తో అడుగడుగునా అవాంతరాలే ఎదురవుతున్నాయి. రికార్డుల సవరణకు ఎడిట్ ఆప్షన్ ఇవ్వకపోవడంతో ప్రతి పనికి కాళ్లరిగేలా తిరిగాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. కరెక్షన్, ఎడిట్ ఆప్షన్‌ను తహసీల్దార్లకు ఇవ్వకుండా ఆర్డీవో, జేసీల అనుమతి తీసుకున్నాకే లాగిన్ కావాల్సిరావడంతో కాలయాపన జరుగుతోంది. ముఖ్యంగా ధరణి రాకతో రికార్డులను సవరించే బాధ్యత నుంచి తహసీల్దార్లను ప్రభుత్వం తప్పించింది. చిన్న సవరణలకు కూడా వెసులుబాటు ఇవ్వకపోవడం.. మండల కార్యాలయాల చుట్టూ రైతులు తిరుగుతుండటం వారిని ఇరకాటంలో పడేస్తోంది. పగటి పూట బంద్.. 2017లో భూరికార్డుల ప్రక్షాళనతో రెవెన్యూ వ్యవస్థలో సరికొత్త విప్లవానికి కేసీఆర్ సర్కారు నాంది పలికింది. అంగుళం భూమికి సైతం హక్కుదారెవరనేది తేల్చేలా భూ రికార్డుల సమగ్ర నిర్వహణకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ధరణి వెబ్సైట్ ప్రవేశపెట్టింది. ఈ పోర్టల్ కార్యరూపం దాల్చిన తర్వాత రోజుకో కొత్త సాంకేతిక సమస్యలు పుట్టుకురావడం రెవెన్యూ అధికారులకు తలనొప్పి తెప్పిస్తోంది. ధరణి పగటి పూట మొరాయిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో రికార్డులను ఆన్లైన్లో నమోదు చేస్తుండటంతో సర్వర్ డౌన్ అవుతోంది. దీంతో పగలు సాఫ్ట్వేర్ పడకేస్తుండటంతో, రాత్రి వేళల్లో పనులు చేయాల్సివస్తోంది. కొత్త సాఫ్ట్వేర్ అందుబాటులోకి తెచ్చే ముందు.. సాంకేతిక సమస్యలను సరిచూసుకోవాల్సివుంటుంది. కానీ, ధరణిని కార్యరూపంలోకి తెచ్చిన తర్వాత లోపాలను సరిదిద్దుతుండడం వల్ల రైతులకు నిరీక్షణ తప్పట్లేదు. ఇవీ సాంకేతిక సమస్యలు.. ►ఒకే సేల్‌డీడ్‌పై ఇద్దరు వ్యక్తులు కొనుగోలు చేసిన భూమికి సంబంధించి మ్యూటేషన్ చేయించుకునేందుకు గతంలో మీ–సేవలో దరఖాస్తు చేసుకుంటే సరిపోయేది. ఇప్పుడలా చేస్తే దరఖాస్తు తిరస్కరణకు గురవుతోంది. ఇరువురు వేర్వేరు దరఖాసులు చేసుకోవాల్సి వస్తోంది. ఈ నిబంధన తెలియక మ్యూటేషన్లు, పాస్ పుస్తకాల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ►సర్వే నంబర్ల పునరుద్ధరణ ఆప్షన్ తహసీల్దార్‌కు లేదు. రివోక్ ఆప్షన్‌కు జేసీకి నివేదించాల్సి వస్తోంది. ►పూర్తయిన మ్యూటేషన్లకు కేవైసీ తప్పనిసరిగా మారింది. పట్టాదారు విధిగా బయోమెట్రిక్ ద్వారా వేలిముద్రలు అందించాలి. కొందరి వేలిముద్రలు అరిగిపోతే డిజిటల్ సంతకం చేయడం కుదరట్లేదు. దీంతో మ్యూటేషన్లు నిలిచిపోతున్నాయి. ►భూ ప్రక్షాళన సమయంలో కాస్రా పహణీ విస్తీర్ణంతో సరిపోలకపోయినా హడావుడిగా వివరాలు నమోదు చేయడం ప్రస్తుతం సమస్యగా మారింది. తాజాగా ఆ వివరాలు కాస్రాతో సరిపోలని కారణంగా మ్యూటేషన్లు కావట్లేదు. ►సర్వర్ పగటిపూట పనిచేయట్లేదు. ►ఒక పట్టాదారు ఒకే సమయంలో ముగ్గురికి భూమిని విక్రయిస్తే, ఆ భూమికి సంబంధించి మ్యూటేషన్లు ఒకేసారి చేయడం వీలు కావట్లేదు. ఒకరికి పూర్తయిన తర్వాతే మరొకరివి చేయాల్సి వస్తోంది. దీంతో ఒక్కో దరఖాస్తు మధ్య కనీసం 20 రోజుల సమయం పడుతోంది. ►భూ రికార్డుల ప్రక్షాళన సమయంలో ఆధార్ వివరాలను సమర్పించని రైతుల ఆధార్ నంబర్ ఇప్పుడు నమోదు చేయాలంటే ఆర్డీవో అనుమతి తీసుకోవాల్సివస్తోంది. ఏడాదిగా చక్కర్లు నాకు ఐదెకరాల భూమి ఉంది. రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన అనంతరం జారీ చేసిన పాస్ బుక్కులో మూడెకరాలు మాత్రమే నమోదు చేశారు. మిగిలిన రెండెకరాలు నమోదు చేయించుకునేందుకు ఏడాదిగా తిరుగుతున్నా.. సర్వర్ డౌన్, ఆన్లైన్ పనిచేయట్లేదని చెబుతున్నారు. – జంగారెడ్డి, అగర్మియాగూడ, కందుకూరు మండలం, రంగారెడ్డిజిల్లా. చెప్పులరిగేలా తిరుగుతున్నా.. మొండిగౌరెల్లి గ్రామంలో 2017లో సర్వేనంబరు 106, 109లో 3–16 ఎకరాల భూమిని కొనుగోలు చేశాను. ఈ భూమి ఆన్లైన్లో నమోదు కోసం నాలుగు నెలలుగా తహసీల్దార్ కార్యాలయం చుట్టు తిరుగుతున్నా. తహశీల్దార్‌ను కలసి భూ రికార్డులు సమర్పించా. కానీ నేటికి ఆన్లైన్లో నమోదు కాకపోగా.. తనకు భూమి అమ్మిన రైతుకే పట్టాదారు పాసుపుస్తకం వచ్చింది. రైతుబంధు సాయం కూడా అతడికే ఇస్తున్నారు. – కొలను రమాదేవి, మొండిగౌరెల్లి, యాచారం మండలం, రంగారెడ్డి జిల్లా -
సంకటంలో ‘భూ బాబులు’
సాక్షి, హైదరాబాద్: పట్టాదారు పాస్‌పుస్తకాల జారీకి రాష్ట్ర ప్రభుత్వం ఆధార్ మెలిక పెట్టడం బడాబాబులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇబ్బడిముబ్బడిగా భూములు కొనుగోలు చేసినవారిని ఈ నిర్ణయం ఇరకాటంలోకి నెట్టింది. ఆధార్ నంబర్‌ను ఇస్తే ఎక్కడ తమ భూముల చిట్టా బయటపడుతుందోననే ఆందోళన వారిలో నెలకొంది. భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా వివాదరహిత భూములకు ప్రభుత్వం కొత్త పాస్ పుస్తకాలను పంపిణీ చేసింది. క్షేత్రస్థాయిలో రికార్డులను పరిశీలించి సదరు రైతులకు పాస్‌బుక్కులను అందజేసింది. అయితే, వీటి ముద్రణ సమయంలోనే పట్టాదారు ఆధార్ నంబర్‌ను సేకరించాలని ప్రభుత్వం నిర్దేశించింది. ఆధార్ సమాచారం ఇవ్వకపోతే పాస్‌బుక్కును ఇవ్వకూడదని స్పష్టం చేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా లెక్కతేల్చిన 4,56,155 మందిలో ఆధార్ నంబర్‌ను సమర్పించిన 1,88,994 మందికి పాస్‌పుస్తకాలను ప్రభుత్వం పంపిణీ చేసింది. ఆధార్ నంబర్ ఇవ్వని 2,67,161 మంది పట్టాదార్ల పాస్ బుక్కులను పెండింగ్‌లో పెట్టింది. భూ రికార్డులు సవ్యంగానే ఉన్నప్పటికీ, ఆధార్ నంబర్ ఇవ్వని కారణంగానే వీటిని పక్కనపెట్టింది. పార్ట్–బీలో 69 లక్షల ఎకరాలు భూ రికార్డుల ప్రక్షాళనలో వ్యవసాయ, వ్యవసాయేతర భూములను వేర్వేరుగా వర్గీకరించిన సర్కారు.. వ్యవసాయేతర, అభ్యంతరకర భూములను పార్ట్–బీ కేటగిరీగా పరిగణించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పార్ట్–బీ కింద 69,85,478 ఎకరాలున్నట్లు లెక్క తేల్చింది. ఇందులో ప్రభుత్వ భూములు ముఖ్యంగా అటవీ, నాలా, ప్రభుత్వ ఆస్తులు కూడా ఉన్నాయి. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా 1.59 కోట్ల ఎకరాల విస్తీర్ణంలో వ్యవసాయ భూములుండగా.. ఇందులో 1.53 కోట్ల ఎకరాల విస్తీర్ణంలోని భూములకు పాస్‌పుస్తకాలను ముద్రించి పంపించినట్లు రెవెన్యూశాఖ గణాంకాలు చెబుతున్నాయి. కాగా, క్లియర్ టైటిల్‌గా తేల్చినప్పటికీ ఇంకా 5,72,498 ఎకరాల విస్తీర్ణానికి సంబంధించిన డిజిటల్ సంతకాలు నమోదు చేయకపోవడంతో పాస్‌పుస్తకాల ముద్రణకు పంపలేదని స్పష్టమవుతోంది. మరోవైపు ప్రవాస భారతీయులకు పాస్ పుస్తకాలు అందుకోవడం తలనొప్పిగా మారింది. అక్కడే స్థిరపడ్డవారు ఇక్కడ ఆధార్ కార్డు తీసుకోవడం చట్టరీత్యానేరం. ఒకవేళ తీసుకున్నట్లు తెలిస్తే.. ఆదేశ పౌరసత్వం కూడా రద్దు కావడమేగాకుండా కఠిన శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పాస్ బుక్కుకు విధిగా ఆధార్‌ను జోడించాలనే నిబంధన విధించడం వారికి చిక్కుముడిగా మారింది. ఈ వ్యవహారంపై స్పష్టత కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాసినా ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం గమనార్హం. గుట్టు బయట పడుతుందనే? ప్రతి క్రయ విక్రయానికి ప్రభుత్వం ఆధార్‌ను తప్పనిసరి చేసింది. దీంతో ఎక్కడ భూమి కొనుగోలు చేసినా క్షణాల్లో తెలిసిపోతుంది. అలాగే రెవెన్యూ రికార్డుల నవీకరణ సమయంలో సేకరించే ఆధార్‌తో తమ భూ చరిత్ర తెలిసిపోతుందని గుబులు బడాబాబుల్లో కనిపిస్తోంది. ఆధార్ వివరాలను ఇవ్వండి మహాప్రభో అని రెవెన్యూ యంత్రాంగం చెబుతున్నా వారు పెడచెవిన పెడుతున్నారు. ముఖ్యంగా వందలాది ఎకరాలు కొనుగోలు చేసిన పెద్దలు.. సీలింగ్ యాక్ట్ పరిధిలోకి వస్తామనే భయంతో వివరాలు ఇచ్చేందుకు జంకుతున్నట్లు తెలుస్తోంది. రెవెన్యూ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు నాందిపలుకుతూ 2017లో రాష్ట్ర ప్రభుత్వం భూరికార్డుల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. మొత్తం 10,823 గ్రామాల్లో 2.38 కోట్ల ఎకరాల భూముల రికార్డులను పరిశీలించి.. 2.28 కోట్ల ఎకరాల భూములు వివాదరహితంగా తేల్చింది. 9.92 లక్షల ఎకరాల మేర భూముల విషయంలో అభ్యంతరాలు వ్యక్తం కావడంతో.. వాటిని వివాదాస్పద భూముల జాబితా (పార్ట్–బీ)లో చేర్చింది. ఈ క్రమంలోనే సర్వే నంబర్ల వారీగా రికార్డులను రూపొందించింది. 1,86,84,158 సర్వేనంబర్లలోని భూములు క్లియర్‌గా గుర్తించిన సర్కారు.. 9,13,656 సర్వేనంబర్ల పరిధిలోని భూములను వివాదాస్పదంగా పరిగణించింది. -
ఆ చేత్తో ఇచ్చి.. ఈ చేత్తో లాక్కున్నారు
పెద్దపల్లి: ‘స్వాతంత్య్ర పోరాటం చేసిన నా భర్త వెంకటయ్యకు ప్రభుత్వం ఎనిమిది ఎకరాల భూమిని ఇచ్చింది. ఆ భూమిని ఎనిమిదేళ్లు సాగు చేసుకున్నం.. పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వమంటే రామగుండం రెవెన్యూ అధికారులు అప్పు డు రూ.10 వేల లంచం అడిగిండ్రు. లంచం ఇవ్వలేక పట్టాదారు పాసుపుస్తకం తీసుకోలేదు. 30 ఏళ్ల క్రితం ప్రభుత్వం ఇచ్చిన భూమిని ప్రాజెక్టు పేరిట తీసుకున్నరు’ అని స్వాతం త్య్ర సమరయోధుడు వెంకటయ్య భార్య, మావోయిస్టు అగ్రనేతలు కిషన్‌జీ, వేణు తల్లి మల్లోజుల మధురమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో గురువారం విలేకరుల సమావేశంలో ఆమె తన గోడు వెల్లబోసుకుంది. రజాకార్లతో పోరాడిన తన భర్తను ప్రభుత్వం స్వాతంత్య్ర సమరయోధుడిగా గుర్తించి రామగుండం మండలం ఎల్లంపల్లిలో ఎనిమిది ఎకరాల భూమి ఇచ్చిందన్నారు. అయితే కొంతమంది రెవెన్యూ అధికారులు లంచం అడిగినందుకు ఆగ్రహంతో పాసు పుస్తకం తీసుకోలేదని తెలిపారు. సర్వే నంబర్ 126లోని ఎనిమిది ఎకరాల భూమి ఎల్లంపల్లి ప్రాజెక్టులో మునిగిపోయిందని అధికారులు చేతులెత్తేశారని చెప్పారు. ఈ విషయమై పలుమార్లు స్థానిక అధికారులను కలిస్తే ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని దాటవేస్తున్నారని తెలిపారు. భూమికి ప్రతిఫలంగా మరోచోట భూమిని కేటాయించాలని వేడుకుంది. -
భూమి దక్కకపోతే చచ్చిపోవాలనుకున్న..!
సాక్షి,బెల్లంపల్లి: ‘‘మాకున్న గా ఏడెకరాల భూమిని నమ్ముకుని బతుకుతున్నం. గా భూమి దప్ప మాకింకేదిక్కులేదు. ఎలాంటి ఆస్తిపాస్తులు సుత లేవ్. మా అయ్య కాపాడుకుంట అచ్చిన భూమి నాగ్గాక్కుండ పోయినంక ఇక బతుకుడెందుకు..? నా భూమి నాకు పట్టా కాకపోతే చచ్చిపోవాలని అనుకున్న..’’ ఇదీ నెన్నెల మండలం నందులపల్లి గ్రామానికి చెందిన బాధిత రైతు కొండపల్లి శంకరయ్య ఆవేదన. యాభై ఏళ్ల నుంచి సాగు చేసుకుంటున్న భూమిని రెవెన్యూ అధికారులు మామూళ్లకు కక్కుర్తిపడి మరో వ్యక్తి పేరిట పట్టా చేయడంతో శంకరయ్య పది నెలల నుంచి పడిన బాధ వర్ణణాతీతం. వివరాలిలా ఉన్నాయి.. కొండపల్లి మల్లయ్యకు కూతురు, కుమారుడు శంకరయ్య ఉన్నారు. కూతురికి పెళ్లి చేసి అత్తారింటికి పంపించాడు. శంకరయ్యకు కూడా పెళ్లి చేయడంతో ఆయనకు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. ముప్పై ఏళ్ల క్రితం శంకరయ్య తండ్రి మల్ల య్య చనిపోయాడు. ఆయన మరణాంతరం నందులపల్లి గ్రామ శివారు సర్వేనంబర్ 271/ఏలో 7.01 ఎకరాల భూమి వారసత్వంగా శంకరయ్య పేరిట 20 ఏళ్ల క్రితం పట్టా అయింది. ఆ భూమిలో నుంచి రెండు ఎకరాల్లో పత్తి పంట, మిగతా 5 ఎకరాల్లో వరి సాగు చేసుకుంటూ శంకరయ్య కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం డబ్బులు తనకు కూడా వస్తాయని ఎంతగానో ఆశపడ్డాడు. కానీ ఆ పథకం కింద నయాపైసా చేతికి అందలేదు. భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా అందరి మాదిరిగా పట్టాదారు పాసు పుస్తకం కూడా రాలేదు. దీంతో ఆందోళనకు గురైన శంకరయ్య పలుమార్లు రెవెన్యూ ఇన్స్పెక్టర్ పెద్దిరాజు, గ్రామ వీఆర్వో కరుణాకర్‌ను కలిసి పాసుపుస్తకం ఇప్పించాలని ప్రాధేయపడ్డాడు. ఎప్పుడు కలిసి అడిగినా ధరణి వెబ్సైట్ పని చేయడం లేదని, ఆన్లైన్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయని నిరక్షరాస్యుడైన శంకరయ్యకు ఇన్నాళ్లూ రెవెన్యూ ఉద్యోగులు నమ్మబలుకుతూ వచ్చారు. తహసీల్దార్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణ.. పట్టాదారు పాసు పుస్తకం కోసం రెవెన్యూ అధికారుల చుట్టూ శంకరయ్య ఎంతగా తిరిగాడో లెక్కలేదు. భూ ప్రక్షాళన కార్యక్రమం ఆరంభమైనప్పటి నుంచి తహసీల్దార్ కార్యాలయం చుట్టూ వందకు పైబడి సార్లు చెప్పులరిగేలా తిరిగాడు. అంతకుమించి ఆర్ఐ, వీఆర్వో చుట్టూ రోజు గుడికి వెళ్లి దేవుడిని దర్శించుకున్నట్లుగానే తహసీల్ కార్యాలయం చుట్టు ప్రదక్షిణ చేశాడు. ఏ ఒక్కనాడూ ఆ అధికారులు కరుణించిన పాపాన పోలేదు. కనీసం ఆన్లైన్లో పట్టాదారు పేరు మార్పిడి చేసి, శంకరయ్య పేరున పట్టాదారు పాసు పుస్తకం మంజూరు చేసి, చేసిన తప్పును సరిదిద్దుకోలేకపోయారు. పైగా అమాయకుడైన శంకరయ్యను ఎప్పటికప్పుడు తిప్పించుకుని ఎంతో వేదన కలిగించారు. కాసులకు ఆశపడి ఏకంగా మరొకరి పేరుమీద భూమిపట్టా చేసి ఆ పేద కుటుంబానికి ప్రత్యక్ష నరకం చూపించారు. బాధపడని రోజు లేదు..! భూప్రక్షాళన కార్యక్రమం అయిపోయినప్పటి నుంచి పాసు పుస్తకం, రైతుబంధు చెక్కు కోసం శంకరయ్య దిగులు ప్రారంభమైంది. భూమి తన వద్దే ఉన్నా.. ఆ భూమిని తానే సాగు చేసుకుంటున్నా ఎందువల్ల పట్టా పాసు పుస్తకం, రైతుబంధు చెక్కు ఇవ్వడం లేదో రోజు ఇంట్లో భార్యాబిడ్డలతో కుమిలిపోయే వాడు. ఎప్పుడిస్తారో అని రోజు పడిగాపులు కాసేవాడు. ఆ దిగులుతో అన్నం ముద్ద నోట్లోకెళ్లేది కాదు. భార్య, కొడుకులు ఎంత ధైర్యం చెప్పినా ప్రయోజనం లేకపోయింది. ఆయనను చూసీ ఆ ఇల్లాలు, కొడుకులు కూడా సరిగా అన్నం తినని రోజులు కోకోల్లలు. ఆ తీరుగా భూమి పట్టా రాకుండా ఆ బాధిత కుటుంబం బాధ పడని రోజంటూ లేకుండా పోయింది. చివరికి శంకరయ్య పెద్ద కొడుకు శరత్ ఓ ఆలోచన చేసి ఫేస్బుక్లో ‘మన వ్యవసాయం–మన పంటలు’ గ్రూపులో తన తాత మల్లయ్య పేరిట పట్టాదారు పాసు పుస్తకం, రైతుబంధు చెక్కు అందించని తీరును వీడియో లైవ్‌గా పోస్టు చేశాడు. ఆ పోస్టు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యంత్రి కేసీఆర్ కంట పడడం, ఆ సమస్య ఏంటో పరిశీలించాలని కలెక్టర్ భారతీ హోళీకేరీని ఆదేశించడంతో శంకరయ్య సమస్య వెలుగు చూసింది. సీఎం కేసీఆర్ ఫోన్ చేసి నేరుగా శరత్‌తో మాట్లాడడం, ఆడియో వైరల్ కావడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కేసీఆర్ ఆదేశాలతో కలెక్టర్ విచారణలో రెవెన్యూ అధికారులు లీలలు ఒక్కసారిగా బయట పడ్డాయి. చివరికి కలెక్టర్ విచారణ జరిపి బాధిత రైతు పేరిట పట్టాదారు పాసుపుస్తకం ఆన్లైన్లో మార్చారు. మొదటి విడత రైతుబంధు చెక్కు అందజేసి రెండో విడతకు సంబంధించి బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని అధికారులు చెప్పారు. అక్రమాలకు పాల్పడిన ఆర్ఐ, వీఆర్వోలను సస్పెండ్ చేయడంతో కథ సుఖాంతమైంది. -
పాసుబుక్కు ఇవ్వడంలేదని టవరెక్కిన రైతు
గన్నేరువరం(మానకొండూర్): అధికారులు వెంట నే తమ భూ సమస్యను పరిష్కరించాలని కోరు తూ మండలంలోని ఖాసీంపేట గ్రామానికి చెంది న జేరిపోతుల చొక్కాయ్య మంగళవారం సెల్‌టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. గ్రామంలోని 276 సర్వేనంబర్‌లో ఎకరం భూమి తన తండ్రి మొండ య్య ద్వారా వారసత్వంగా వస్తుందని తెలిపాడు. దీనికి సంబంధించి పాసుబుక్కును అధికారులు ఇవ్వడంలేదని ఆరోపించాడు. దీంతో రైతుబంధు, రైతుబీమా వర్తించడం లేదని, సమస్య పరిష్కారం కోసం టవర్‌ఎక్కాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు. విషయం తెలిసి చొక్కాయ్య భార్య లత పిల్లలతో సెల్‌టవర్ వద్దకు చేరుకుంది. తమ భూమి నుంచి వరదకాల్వ వెళ్తోందని, భూముల కోల్పోతున్న రైతుల జాబితాలో తమపేరు ఉందని తెలిపింది. ఈ ఏడాది పంటలను సైతం సాగుచేసినట్లు పేర్కొంది. పాసు బుక్కు ఇవ్వడంలో అధికారులు తిరకాసు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నా రు. ఈ భూమిపై గ్రామానికి చెందిన ఒక రైతు కోర్టుకు వెళ్లాడంతో వివాదం కొనసాగుతోందని, కోర్టు పరిధిలో ఉన్నందున్న జోక్యం చేసుకోలేమని రెవెన్యూ అధికారులు తెలిపారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారించడానికి కృషి చేస్తానని ఎస్సై వంశీకృష్ణ హామీ ఇవ్వడంతో చొక్కాయ్య సెల్ టవర్ దిగివచ్చాడు. తహసీల్దార్ కార్యాలయానికి తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇచ్చారు. -
రుణాలు అందేనా?!
సాక్షి, మెదక్: పంట రుణాల కోసం రైతులు పడుతున్న తిప్పలు అన్నీ ఇన్నీ కావు. వ్యవసాయ రుణాలు పొందాలంటే రైతులు పట్టాదారు పాసు పుస్తకాలు బ్యాంకులో తనఖా(కుదువ) పెట్టాల్సిందే. తనఖా పెట్టినా రైతులకు సకాలంలో రుణాలు అందని పరిస్థితి ఉంది. మరోవైపు పంటల సాగు పెట్టుబడి ఏటా పెరుగుతూనే ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆర్బీఐ రైతులకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. ఆర్బీఐ గురువారం ప్రకటించిన పరపతి విధానంలో పూచీకత్తు లేకుండా పొందే పంట రుణ పరిమితిని రూ.1.60 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం రైతులకు మేలు చేయనుంది. ఇకపై రైతులు తనఖా పెట్టకుండానే రూ.1.60 లక్షల వరకు రుణాలు పొందవచ్చు. రాబోయే ఖరీఫ్ సీజన్ నుంచి ఇది అమలు కానుంది. దీంతో జిల్లాలోని సన్న, చిన్నకారు రైతులకు ఎంతో మేలు జరగనుంది. మెదక్ జిల్లాలో 2.50 లక్షలకు పైగా రైతులు ఉన్నారు. వీరిలో ప్రతీ ఏడాది 1.50 లక్షల మంది రైతులు వేర్వేరు బ్యాంకుల్లో వ్యవసాయ పంట రుణాలు తీసుకుంటున్నారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌ను పరిగణలోకి తీసుకుని పంటల వారిగా రైతులకు బ్యాంకర్లు రుణాలు అందిస్తుంటారు. రైతులు పంట రుణాలు పొందాలంటే తప్పనిసరిగా తమ భూములకు సంబంధించిన పట్టాదారు పాసుపుస్తకాలు బ్యాంకుల వద్ద తనఖా పెట్టాల్సిందే. ఎలాంటి పూచీకత్తు లేకుండా రైతులకు రూ. లక్షలోపు రుణాలు ఇవ్వాలని నిబంధన ఉంది. అయినప్పటికీ చాలా చోట్ల బ్యాంకర్లు తప్పనిసరిగా తనఖా పెట్టుకుంటున్నారు. అయితే తాజాగా ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంతో ఎలాంటి తనఖా లేకుండా రైతులు రూ.1.60 లక్షల వరకు రుణాలు పొందవచ్చు. రుణ పరిమితి పెరగడం వల్ల రైతులు పంటల సాగుకు అవసరమైన డబ్బుల కోసం ఇకపై ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే రైతు బంధు పథకం ద్వారా ఎకరాకు రూ.8 వేల ఆర్థిక సహాయం అందజేస్తోంది. ఎకరాకు ఇచ్చే ఆర్థిక సహాయం రూ.10వేలకు పెంచనుంది. దీంతో రైతులకు మేలు జరగనుంది. దీనికితోడు ఇటీవల కేంద్ర ప్రభుత్వం 5 ఎకరాలలోపు భూమి ఉన్న రైతులకు రూ.6 ఆర్థిక సహాయ అందజేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో రైతులకు పెట్టుబడి కష్టాలు తీరనున్నాయి. బ్యాంకర్ల తీరు మారేనా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు ఆర్బీఐ రైతులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంది. అయితే బ్యాంకర్ల తీరు మాత్రం రైతులకు ఏమాత్రం మింగుడుపడని విధంగా ఉంది. ప్రతీ ఏటా బ్యాంకర్లు పంట రుణాల లక్ష్యం పెట్టుకున్నప్పటికీ రెండేళ్లుగా లక్ష్యం మేరకు రుణాలు ఇవ్వడం లేదు. ఈ ఏడాది ఖరీఫ్‌లో రైతులకు రూ.720 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా రూ.450 కోట్ల రుణాలు మాత్రమే పంపిణీ చేశారు. రబీలో రూ.480 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించగా డిసెంబర్ వరకు రూ.60 కోట్ల రుణాలు ఇచ్చారు. రైతులకు రుణాల మంజూరులో బ్యాంకర్లు ఆశించిన స్థాయిలో స్పందించడం లేదు. తనఖా లేకుండా రుణాలు ఇచ్చే మొత్తాన్ని రూ.1.60 లక్షలకు పెంచిన నేపథ్యంలో రుణాల మంజూరులో బ్యాంకర్ల వైఖరి మారుతుందో లేదో వేచి చూడాలి. ఆర్బీఐ నిర్ణయంతో రైతులకు మేలు : పరశురాం నాయక్ తనఖా లేకుండా ఇచ్చే పంట రుణాల పరిమితిని ఆర్బీఐ రూ.1.60 లక్షలకు పెంచుతూ తీసుకున్న నిర్ణయం రైతులకు మేలు చేస్తుందని జిల్లా వ్యవసాయశాఖ అధికారి పరశురాం నాయక్ తెలిపారు. తనఖా లేకుండా పంట రుణాలు ఇవ్వడం వల్ల రైతులకు పెట్టుబడి కష్టాలు తీరుతాయన్నారు. ఆర్బీఐ ఉత్తర్వుల మేరకు జిల్లాలోని బ్యాంకర్లు రైతులకు రుణాలు ఇచ్చి అన్నదాతలకు అండగా నిలవాలని కోరారు. -
వృద్ధ దంపతుల వినూత్న నిరసన
భూపాలపల్లి: ‘‘పట్టాదారు పాసుపుస్తకాలు ఇచ్చేం దుకు తహసీల్దార్ లంచం అడుగుతున్నాడు.. వయోభారంతో ఏ పనీ చేయలేని స్థితిలో ఉన్నాం.. మా దగ్గర డబ్బులు లేవు.. లంచం కోసం బిచ్చం వేయం డి’’అంటూ ఓ వృద్ధ దంపతులు శుక్రవారం భూపాలపల్లిలో వినూత్న నిరసన తెలిపారు. చేతిలో ఫ్లెక్సీ.. మెడలో ప్లకార్డులు వేసుకొని భిక్షాటన చేయడం చర్చనీయాంశమైంది. విషయం తెలుసుకున్న కలెక్టర్ స్పందించి.. వృద్ధ దంపతులకు న్యాయం చేయాలని ఆర్డీఓను ఆదేశించారు. భూపాలపల్లి మండలం ఆజంనగర్‌కి చెందిన మాంతు బసవయ్య, లక్ష్మి దంపతులకు గ్రామ శివారులోని 50 సర్వే నంబర్లో 1.19 ఎకరాలు, 601లో ఎకరం, 622/42లో ఎకరం, 622/52/అ లో 31 గుంటల వ్యవసాయ భూమి ఉంది. ప్రభుత్వం భూ రికార్డుల ప్రక్షాళన చేపట్టిన నాటి నుంచి పట్టాదారు పాసుపుస్తకాల కోసం వారు భూపాలపల్లి తహసీల్దార్ కార్యాలయం చుట్టూ కాలి కి బలపం కట్టుకొని తిరుగుతున్నా రెవెన్యూ అధికారులు మాత్రం పుస్తకాలు ఇచ్చేందుకు నిరాకరిం చారు. దీంతో చేసేది లేక వృద్ధ దంపతులు శుక్రవారం భిక్షాటన ప్రారంభించారు. పట్టాదారు పుస్తకాలు ఇచ్చేందుకు తహసీల్దార్ సత్యనారాయణస్వామి డబ్బులు అడుగుతున్నాడని, తమ దగ్గర లేవని, ముసలివాళ్లం అయినందున ఆదుకోవాలని కోరుతూ పట్టణ ప్రధాన రహదారిలోని వ్యాపారుల వద్ద భిక్షాటన చేశారు. చేతిలో ఫ్లెక్సీ.. మెడలో ప్లకార్డు ప్రదర్శిస్తూ ప్రతి దుకాణ యజమాని వద్ద అడుక్కోవడం అక్కడున్న వారిని కదిలించింది. భూమిని ఎప్పుడో అమ్ముకున్నారు బసవయ్య, లక్ష్మి తమకున్న వ్యవసాయ భూమిని ఎప్పుడో అమ్ముకున్నారని భూపాలపల్లి తహసీల్దార్ నారాయణస్వామి అన్నారు. ఆ భూమికి సంబంధించిన కేసు ప్రస్తుతం హైకోర్టులో పెండింగ్‌లో ఉందని చెప్పారు. గ్రామంలో విచారణ చేపట్టగా 15 ఏళ్లుగా కానుగంటి కొమురయ్యనే భూమిని సాగు చేసుకుం టున్నాడని తేలిందన్నారు. దీంతో పాసుబుక్కును ఇవ్వకుండా నిలిపివేశామని తెలిపారు. ఎట్టకేలకు పట్టా.. సోషల్ మీడియాలో ఈ వ్యవహారం వైరల్ కావడంతో కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు స్పందించారు. ఆ వృద్ధ దంపతులకు పట్టాదారు పాసుపుస్తకాలు అందివ్వాలని భూపాలపల్లి ఆర్డీఓ వెంకటాచారిని ఆదేశించారు. వృద్ధ దంపతులను తన కార్యాలయానికి పిలిపించుకున్న ఆర్డీఓ.. భూరికార్డులను పరిశీలించారు. అదే సమయంలో భూమిని కొనుగోలు చేశానని చెబుతున్న కానుగంటి కొమురయ్య రావడంతో ఈ భూమి నీకు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. బసవయ్య, లక్ష్మిల భూమిని 1981లో తంశెట్టి బానమ్మ కొనుగోలు చేసిం దని, ఆమె నుంచి 1989లో తన తండ్రి కానుగంటి మొండయ్య కొనుగోలు చేశాడని, అప్ప టి నుంచి తామే కాస్తులో ఉన్నామని చెప్పాడు. 2004లో ఆర్ఓఆర్ పట్టా చేయించుకొని పట్టాబుక్కు తీసుకున్నట్లు చెప్పాడు. ఆ భూమి తమదేనని బసవయ్య, లక్ష్మి 2011 నుంచి గొడవ చేస్తుండటంతో కోర్టును ఆశ్రయించానని, కేసు నడుస్తున్న క్రమంలోనే 2015లో పహాణీ నుంచి తన పేరును అకారణంగా తొలగించారన్నాడు. దీంతో ఆర్డీఓ సదరు భూమికి సంబంధించి పట్టాదారు పాసుపుస్తకాలను బసవయ్య, లక్ష్మీలకు అందజేశారు. నిజంగా భూమి కొనుగోలు చేసి ఉంటే, అన్ని డాక్యుమెంట్స్‌తో తనకు అప్పీల్ చేసుకోవాలని కొమురయ్యకు సూచించారు. -
రైతుబంధు 25 శాతమే!
మోర్తాడ్ (బాల్కొండ): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకం కింద రబీ సీజనుకు గాను రైతులకు పెట్టుబడి సహాయం నాలుగు విడతల్లో విడుదలైంది. జిల్లాలోని రైతులకు ఇప్పటికి రూ.42 కోట్ల, 40 లక్షల, 62 వేల, 310 అందింది. 25 శాతం సొమ్ము విడుదల కాగా మరి కొద్ది రోజుల్లో మిగిలిన 75 శాతం సొమ్ము కూడా రైతుల ఖాతాలకు చేరనుందని అధికార వర్గాలు తెలిపాయి. ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చిన కారణంగా రబీ పెట్టుబడి సహాయం చెక్కుల రూపంలో పంపిణీకి ఎన్నికల కమిషన్ అభ్యంతరం తెలిపింది. అయితే రైతుల ఖాతాలకు నగదు బదిలీ ద్వారా పెట్టుబడి సహాయం అందించవచ్చని కమిషన్ సూచించడంతో రైతుల ఖాతాల నంబర్లు, ఇతర వివరాలను సేకరించే పనిలో వ్యవసాయ శాఖ అధికారులు నిమగ్నం అయ్యారు. ఖరీఫ్ సీజనుకు గాను జిల్లాలోని 2 లక్షల, 271 మంది రైతులకు రూ.204.44 కోట్ల నిధులు మంజూరు అయ్యాయి. ఇందులో 5,518 మంది రైతులు మరణించినట్లు వ్యవసాయ శాఖ గుర్తించింది. మరణించిన రైతులను మినహాయించి ఇతర రైతులకు మాత్రమే రబీ సీజను పెట్టుబడి సహాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరణించిన రైతులను మినహాయిస్తే జిల్లాలో 1,94,753 మంది రైతులకు పెట్టుబడి సహాయం అందించాల్సి ఉంది. ఇప్పటి వరకు సేకరించిన రైతుల వివరాలను ఆన్లైన్లో ఏఈవోలు నమోదు చేయగా వ్యవసాయాధికారులు ఆమోదం తెలిపి పెట్టుబడి సహాయం సొమ్ము రైతుల ఖాతాలకు బదిలీ కోసం వ్యవసాయ శాఖ కమిషనరేట్‌కు పంపించారు. వ్యవసాయ శాఖ కమిషనరేట్ అధికారులు బ్యాంకులలో ఉన్న నిధుల ఆధారంగా రైతులకు దశల వారీగా నగదు బదిలీకి చర్యలు తీసుకుంటున్నారు. క్షేత్ర స్థాయిలో రైతుల నుంచి ఆధార్ నంబర్, పట్టా పాసు పుస్తకం జిరాక్సు, బ్యాంకు ఖాతా వివరాలను వ్యవసాయ విస్తీర్ణ అధికారులు ఇంకా సేకరిస్తున్నారు. రైతుల నుంచి సేకరించిన వివరాలను ఏఈవోలు తమకు గతంలో ప్రభుత్వం జారీ చేసిన ట్యాబ్‌లలో అప్లోడ్ చేస్తున్నారు. ఆన్లైన్లో రైతుల వివరాలు నమోదు కావడం, వ్యవసాయ శాఖ తమ వద్ద ఉన్న నిధులను దశల వారీగా రైతుల ఖాతాల్లోకి జమ చేసే ప్రక్రియ ఇంకా కొనసాగుతుందని జిల్లా వ్యవసాయాధికారి మేకల గోవింద్ తెలిపారు. ఖరీఫ్ పెట్టుబడి సహాయం అందుకున్న ప్రతి రైతుకు రబీ పెట్టుబడి సహాయం అందుతుందని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. -
తహసీల్దార్ కార్యాలయం.. సేవలు అస్తవ్యస్తం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం తలమంచి గ్రామానికి చెందిన ఓ రైతు పట్టాదారు పాస్ పుస్తకం కోసం అధికారుల చుట్టూ నాలుగు నెలలపాటు తిరిగాడు. అడిగిన మొత్తం సమర్పించుకున్నా తర్వాతే పాస్ పుస్తకం ఇచ్చారు. అందులో సదరు రైతు ఫొటో స్థానంలో మరొకరి ఫొటో అచ్చయ్యింది. అది సరి చేయాలంటే తాము అడిగినంత సొమ్ము మళ్లీ ఇవ్వాల్సిందేనని అధికారులు తేల్చిచెప్పేశారు. అనంతపురం జిల్లా కంబదూరు మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన సురేశ్‌కు నెల క్రితం వివాహమైంది. చంద్రన్న పెళ్లికానుక అందాలంటే కుల ధ్రువీకరణ పత్రం సమర్పించాలి. దానికోసం రెవెన్యూ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. నిత్యం తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. కారణం అధికారులు అడిగినంత ముట్టజెప్పే స్తోమత అతడికి లేకపోవడమే. పశ్చిమ గోదావరి జిల్లా వెంకటాయపాలెం గ్రామానికి చెందని మేకా సూర్యచంద్రం రేషన్ కార్డులో తప్పులున్నాయి. అందులో మార్పుల కోసం మూడేళ్లుగా తహసీల్దార్ ఆఫీసు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడు. సర్వర్లు పనిచేయడం లేదని, కంప్యూటర్ ఆపరేటర్ లేరని అక్కడి సిబ్బంది చెబుతున్నారు. ఎప్పుడు వెళ్లినా ఇదే సమాధానం వస్తోంది. పని మాత్రం పూర్తి కావడం లేదు. ప్రజల వద్దకే పరిపాలన అన్న నినాదం వట్టి మాటగానే మిగిలిపోతోంది. ఏ చిన్న ధ్రువీకరణ పత్రం కావాలన్నా మండల కేంద్రాలకు పరుగులు తీయాల్సి వస్తోంది. అక్కడైనా ముడుపులు ఇస్తే తప్ప దరఖాస్తులు ముందుకు కదలడం లేదు. రాష్ట్రంలో తహసీల్దార్ (ఎంఆర్వో) కార్యాలయాల్లో అవినీతి మూడు పువ్వులు ఆరు కాయలుగా, నిక్షేపంగా వర్థిల్లుతోంది. కుల, ఆదాయ, జనన, మరణ ధ్రువపత్రాలు, ఫ్యామిలీ మెంబర్, రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులు, పట్టాదారు పాస్ పుస్తకాలు, అడంగల్.. ఏది కావాలన్నా పైసలిస్తేనే పని అంటూ తేల్చిచెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలు తహసీల్దార్ కార్యాలయాల్లో సాక్షి’ ‘తాజాగా ‘ఆఫీసు విజిట్’ చేయగా నివ్వెరపోయే నిజాలు వెలుగు చూశాయి. అంతులేని కాలయాపన: తహసీల్దార్ కార్యాలయాల్లో ఫలానా ధ్రువపత్రాలను ఫలానా గడువులోగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్దేశించింది. కానీ, ఇదెక్కడా అమలు కావడం లేదు. అధికారులు ఉద్దేశపూర్వకంగానే కాలయాపన చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న తర్వాత ధ్రువపత్రాల కోసం నెలల తరబడి ఎంఆర్వో ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వస్తోంది. దరఖాస్తు చేసుకున్నాక 28 రోజుల్లోగా పట్దాదారు పాసు పుస్తకం ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. కానీ, మూడు, నాలుగు నెలలైనా పాస్ పుస్తకాలు రైతుల చేతికి అందడం లేదు. కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రాన్ని (ఫ్యామిలీ సర్టిఫికెట్) 15 రోజుల్లోగా ఇవ్వాలి. కానీ, మూడు నెలలకు పైగా సమయం తీసుకుంటున్నారు. పాముకాటు వల్ల, ప్రమాదవశాత్తు మరణించిన వారి కుటుంబాలకు ధ్రువీకరణ పత్రాన్ని 15 రోజుల్లోగా ఇవ్వాలి. కానీ, నెల నుంచి 45 రోజుల సమయం పడుతోంది. మిగతా సర్టిఫికెట్లదీ ఇదే పరిస్థితి. జనం వ్యయ ప్రయాసలు భరించి, ధ్రువపత్రాల కోసం పడిగాపులు కాస్తున్నారు. వేధిస్తున్న సిబ్బంది కొరత: రాష్ట్రంలో తహసీల్దార్లు, ఇతర రెవెన్యూ సిబ్బందిలో 60 శాతం మంది సమయ పాలన పాటించడం లేదు. బయోమెట్రిక్ హాజరు విధానం తప్పనిసరి కాకపోవడంతో తహసీల్దార్లు విధులకు తరచూ డుమ్మా కొడుతున్నారు. ఎంఆర్వో కార్యాలయాల్లో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ప్రతి మండలానికి ఒక తహసీల్దార్, ఇద్దరు రెవెన్యూ ఇన్స్పెక్టర్లు (ఆర్ఐ), ఒక జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, డిప్యూటీ తహసీల్దార్ ఉండాలి. కానీ, చాలా మండలాల్లో ఒక్కొక్క ఆర్ఐ మాత్రమే ఉన్నారు. కొన్ని మండలాలకు ఒక్క ఆర్ఐ కూడా లేరు. ప్రభుత్వం నాలుగున్నరేళ్లుగా ఖాళీల భర్తీపై దృష్టి పెట్టలేదు. కొన్నిచోట్ల ఎంఆర్వో కార్యాలయాల్లో సరిపడా కంప్యూటర్లు లేవు. దీనివల్ల ప్రజలకు రెవెన్యూ సేవలు అందని ద్రాక్షగానే మిగిలిపోతున్నాయి. అర్జీల తిరస్కరణ: తహసీల్దార్ ఆఫీసుల్లో లంచాలు ఇచ్చిన వారి దరఖాస్తులను మాత్రమే పరిష్కరిస్తున్నారు. ఇవ్వకపోతే రకరకాల కొర్రీలతో అర్జీలను పక్కన పడేస్తున్నారు. 60 శాతానికి పైగా దరఖాస్తులకు మోక్షం లభించడం లేదు. కర్నూలు, అనంతపురం, గుంటూరు, నెల్లూరు, కృష్ణా, ప్రకాశం, తూర్పు గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ తదితర జిల్లాల్లో అర్జీలుకొండల్లా పేరుకుపోతున్నాయి. భూములకు సంబంధించి అన్ని పత్రాలూ సక్రమంగా ఉన్నా, రెవెన్యూ అధికారులు ఏదో ఒక సాకుతో ప్రజలను ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. ప్రతి పనికీ ఓ రేటు తహసీల్దార్ కార్యాలయాల్లో అవినీతి వ్యవస్థీకృతంగా మారిపోయింది. పేరుకే ఆన్లైన్.. జరిగేదంతా ఆఫ్‌లైన్‌లోనే. ఏ పని కావాలన్నా డబ్బులు ముట్టజెప్పాల్సిందే. ప్రతి పనికీ ఓ ధర నిర్ణయించి, పక్కాగా వసూలు చేస్తున్నారు. ఇందులో పై స్థాయి నుంచి కింది స్థాయి దాకా ఎవరి వాటా వారికి చేరుతోంది. లంచం ఇస్తేనే దరఖాస్తుకు మోక్షం లభిస్తుంది, లేకపోతే దానిపై ఇక ఆశలు వదులుకోవాల్సిందే. ఏ పనికి ఎంత వసూలు చేస్తున్నారంటే.. ఆరు నెలలైనా రేషన్ కార్డు రాలేదు ‘‘రేషన్ కార్డు కోసం జన్మభూమిలో అర్జీ ఇచ్చా. తహసీల్దార్ ఆఫీస్లోఅడిగితే మీ–సేవ కేంద్రానికి వెళ్లమన్నారు. అక్కడ మళ్లీ దరఖాస్తు చేసి తహసీల్దార్ ఆఫీసు చుట్టూ ఆరు నెలలుగా తిరుగుతున్నా. అర్జీలు, ఆటో చార్జీలకు ఇప్పటిదాకా రూ.500 ఖర్చయ్యింది. రేషన్ కార్డు మాత్రం రాలేదు’’– దేవి, పలమనేరు, చిత్తూరు జిల్లా డబ్బులిస్తేనే పని పూర్తవుతుందట! ‘‘పట్టాదారు పుస్తకాల కోసం మూడుసార్లు మీ–సేవ కేంద్రంలో దరఖాస్తు చేశా. అధికారులు మూడుసార్లు దరఖాస్తును తిరస్కరించారు. డబ్బులిస్తే పని అయిపోతుందని తహసీల్దార్ కార్యాలయంలో అంటున్నారు’’ – కెల్ల సింహాద్రమ్మ, రైతు, కెల్ల, గుర్ల మండలం, విజయనగరం జిల్లా ఎకరం పొలం కాజేశారయ్యా... ‘‘మాది సొలస గ్రామం. గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 198లో 3.53 ఎకరాల పొలం ఉంది. మా మామగారైన మల్లారెడ్డి నుంచి నా భర్త రోశిరెడ్డికి అనువంశికంగా ఈ పొలం సంక్రమించింది. నా భర్త అనుమతితో ఆయన సోదరుడు పెద వెంకటేశ్వరరెడ్డి ఈ భూమిని కౌలుకు తీసుకున్నాడు. అందులో ఎకరం భూమి వెంకటేశ్వరరెడ్డిదే అంటూ 2016 మార్చిలో అధికారులు అడంగల్, 1బీ సృష్టించారు. 2017లో రెవెన్యూ అధికారులు ఇచ్చిన అడంగల్, 1బీలను ఆధారంగా చేసుకుని వెంకటేశ్వర రెడ్డి తన కుమారుడి పేరున ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేయించాడు. అదే ఏడాది నా భర్త మృతి చెందాడు. పొలం బాకీ విషయంలో ఈసీ తీయిస్తే మాకున్న 3.53 ఎకరాల్లో ఒక ఎకరం తగ్గినట్లు తెలిసింది. వెంటనే రెవెన్యూ అధికారులను కలిశాం. పొరపాటు జరిగి ఉంటుందని, మారుస్తామని చెప్పారు. సొసైటీలో తనఖా పెట్టి వ్యవసాయ రుణాన్ని తీసుకొని ఉన్నాం. రుణం ఉన్న పొలం నా భర్త రోశిరెడ్డి సంతకం లేకుండా వేరొకరికి ఎలా సంక్రమిస్తుంది? మాకు న్యాయం చేయాలంటూ ఏడాదిన్నర కాలంగా రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నా.. ’ – సామ్రాజ్యం, సొలస, గుంటూరు జిల్లా -
పట్టాలియ్యకుంటే ఓట్లేయం!
జగదేవ్‌పూర్ (గజ్వేల్): గ్రామంలో తమ భూముల సమస్యను పరిష్కరించి పట్టా, పాస్ పుస్తకాలు ఇవ్వకుంటే ఎన్నికలు బహిష్కరిస్తామని సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలంలోని కొత్తపేట రైతులు ప్రతి జ్ఞ చేశారు. ఏళ్ల నుంచి ఉన్న ఈ సమస్య భూ రికార్డు ల ప్రక్షాళనలోనూ పరిష్కారం కాకపోవడంతో రైతుబంధు, బీమా పథకాలు అమలవడం లేదని, అందు కే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. దశాబ్దాల నుంచి భూ సమస్య ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. సీఎం కేసీఆర్ వ్యవసా య క్షేత్రానికి కూతవేటు దూరంలో ఉన్న తమ భూ సమస్యలను అధికారులు పరిష్కరించడంలో విఫలమయ్యారన్నారు. ఎన్నికల ప్రచారానికి వచ్చే నాయకులను తమ గ్రామంలోకి రానివ్వబోమని తెలిపారు. ఇదీ సమస్య... పూర్వం గ్రామంలో పన్నిలాల్ అనే వ్యక్తికి అప్పటి జాగీదార్లు సుమారు 735 ఎకరాల భూమి ఇచ్చారు. కొన్నేళ్ల పాటు అతనే ఆ భూమి సాగు చేసుకుంటూ వచ్చాడు. అనంతరం గ్రామానికి చెందిన రైతులకు కౌలుకు ఇచ్చారు. దశాబ్దాల పాటు వారే సాగు చేసుకుంటూ కాస్తులో ఉన్నారు. రక్షిత కౌలుదారు చట్టం ప్రకారం తమ పేర్ల మీద భూమిని ఇనాంగా ఇచ్చినట్లు రైతులు తెలిపారు. 1978లో సీలింగ్ చట్టం కింద భూములను ప్రభుత్వానికి అప్పగించినట్లు పేర్కొ న్నారు. 1994లో అప్పటి ప్రభుత్వం (ఓఆర్సీ)ను అమలు చేస్తూ ఇనాం పట్టా కింద రైతులకు పట్టాలు అందించినట్లు చెప్పారు. 2006లో అప్పటి ప్రభుత్వం గ్రామంలో భూములను సర్వే చేయించి పట్టాలు ఉన్న భూములను ప్రభుత్వ భూములుగా రికార్డుల్లో నమోదు చేయించిందని వాపోయారు. అప్పటి నుంచి సమస్య అపరిష్కృతంగానే మిగిలిపోయిందన్నారు. విషయాన్ని పలుమార్లు కలెక్టర్లు, అధికారుల దృష్టికి తీసుకుపోయామని, ఇటీవల మంత్రి హరీశ్‌రావుకు చెప్పినా పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు భూ రికార్డుల్లో సమస్యలు ఉండటంతో వారు రైతుబంధు పథకానికి నోచుకోవడం లేదు. ఇటీవల భూ రికార్డుల ప్రక్షాళన సమయంలో అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కరం కాలేదని పేర్కొన్నారు. -
‘మా భూమి’ ఏమైపోయిందో!
సాక్షి, హైదరాబాద్: సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వు మండల కేంద్రానికి చెందిన ఓ రైతు కుటుంబానికి పదెకరాల భూమి ఉంది. ఆ భూమి ముగ్గురు కుటుంబ సభ్యుల పేరు మీద నమోదయింది. భూరికార్డుల ప్రక్షాళనకు ముందు ఆ ముగ్గురి పేర్ల మీద పాస్‌పుస్తకాలున్నాయి. పహాణీలో పేర్లున్నాయి. మాభూమి వెబ్సైట్లో సర్వేనంబర్‌ను చూసుకుంటే వారి పేర్ల మీదనే ఆ భూమి పదిలంగా ఉండేది... కానీ, ఇప్పుడు ఆ భూమికి పాస్పుస్తకాల్లేవు. ఎవరో ఫిర్యాదు చేశారని రెవెన్యూ యంత్రాంగం పాస్‌పుస్తకాలు నిలిపివేసింది. వారి భూములను పార్ట్–బీలో చేర్చి పక్కన పెట్టింది. కనీసం ఆన్లైన్లో చూసుకుందామన్నా ఇప్పుడు మా భూమి వెబ్సైట్ లేదు. భూరికార్డులూ అందుబాటులో లేవు. ఇప్పుడు ఆ భూమి ఎవరి పేరు మీద ఉందో కూడా తెలియని పరిస్థితి. ఆ రైతు కుటుంబంలో ఎడతెగని ఆందోళన.. ఈ ఆందోళన ఆ ఒక్క రైతు కుటుంబానిదే కాదు.. కారణమేదైనా భూరికార్డుల ప్రక్షాళన తర్వాత తమ భూములకు పాస్‌పుస్తకాలు రాని లక్షలాది మంది రైతులది. అన్నీ సరిగానే ఉన్నా సాంకేతిక కారణాలతో పాస్‌పుస్తకాలు రాని వారు, పుస్తకాల్లో అచ్చు తప్పులు పడి మళ్లీ ప్రభుత్వానికి తమ పుస్తకాలను సరెండర్ చేసినవారు, ఎవరో, ఏదో ఫిర్యాదు చేశారని, సరైన ఆధారాలు, డాక్యుమెంట్లు లేకుండానే పార్ట్–బీలో చేర్చిన భూములకు చెందిన రైతులంతా ఇప్పుడు ఇదే ఆందోళనతో కొట్టుమిట్టాడుతుండడం గమనార్హం. ధరణీ.. కానరాదేమీ! భూరికార్డుల ప్రక్షాళనలో భాగంగా రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 57లక్షలకు పైగా ఖాతాల్లో 2కోట్లకు పైగా ఎకరాల భూమికి సంబంధించిన రికార్డులను సరిచేశారు. 49లక్షలకు పైగా ఖాతాలకు పాస్‌పుస్తకాలను ముద్రించారు. ఆధార్ నంబర్లు, ఫొటోలు లేవనే కారణంతో 7లక్షలకు పైగా ఖాతాలకు పుస్తకాలను అసలు ముద్రించనే లేదు. ముద్రించిన వాటిలో ప్రభుత్వ లెక్కల ప్రకారమే 7లక్షలకు పైగా పుస్తకాలను పంపిణీ చేయలేదు. కొన్ని కాలమ్‌లు రాలేదని, తప్పులు వచ్చాయంటూ నిలిపివేసిన వీటిలో దాదాపు నాలుగు లక్షల పుస్తకాలను మళ్లీ పంపిణీకి జిల్లాలకు పంపారు. అంటే, మొత్తంమీద 10లక్షలకు పైగా ఖాతాలకు పాస్‌పుస్తకాలు లేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు, ఈ ఖాతాల్లో ఉన్న భూములపై ఎవరికి హక్కులున్నాయో కూడా తెలియని పరిస్థితి. అసలు ఆ భూములు తమ పేరు మీద వస్తాయా రావా... పాస్‌పుస్తకాలు ఇస్తారో లేదోననే ఆందోళన రైతాంగంలో నెలకొంది. ధరణి పేరు మీద పైలట్‌గా ప్రారంభమయిన 21 మండలాల్లోనూ రికార్డులు సరిగా లేకపోవడంతో రాష్ట్రమంతటా ఇదే పరిస్థితి నెలకొంది. ఇక పార్ట్–బీ పేరుతో వివాదాలున్నాయని పక్కన పెట్టిన భూములను ఇంతవరకు పరిష్కరించలేదు. ఇలా మరో 3లక్షలకు పైగా ఖాతాల్లో రైతులు అసలు తమ భూమి తమకు దక్కుతుందో లేదోననే ఆందోళనలో ఉన్నారు. పాస్ పుస్తకాలు ఇచ్చిన రైతులు కూడా తమ భూమి ఆన్లైన్లో ఎవరి పేరు మీద ఉందోననే గాభరాకు గురవుతున్నారు. కేవలం పాస్పుస్తకమే తమకు ఆధారంగా ఉందని, ఆన్లైన్ రికార్డుల్లో కూడా తమ పేర్లు చేర్చాలని వారు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో భూరికార్డుల ప్రక్షాళన వివరాలను ఆన్లైన్లో ఉంచాలని, భూమి ఎవరి పేరు మీద ఉన్నదనే ప్రస్తుత స్థితిని తెలియజేస్తూ రికార్డులు నమోదు చేయాలని, అవసరమైతే మార్పులు, చేర్పులు చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఏడాది నుంచి రికార్డుల్లేవు.. వాస్తవానికి, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు రెవెన్యూ రికార్డులు అందుబాటులో ఉండేవి కావు. రైతుల దగ్గర ఉండే పాస్‌పుస్తకాలు తప్ప భూమికి సంబంధించిన ఏ రికార్డు కావాలన్నా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరగాల్సిందే. ఆమ్యామ్యాలు సమర్పించుకోవాల్సిందే. అయితే, ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ హయాంలో నిజామాబాద్ జిల్లాలో ‘భూభారతి’పేరుతో పైలట్ ప్రాజెక్టు ప్రారంభించి రెవెన్యూ రికార్డులను కంప్యూటరీకరించే ప్రయత్నం జరిగినా అది పూర్తి కాలేదు. కానీ, భూపరిపాలన ప్రధాన కమిషనర్‌గా రేమండ్ పీటర్ బాధ్యతలు చేపట్టాక 2016లో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని భూముల వివరాలను పబ్లిక్ డొమైన్లో ఉంచారు. ఫలానా సర్వే నంబర్లో ఉన్న భూమి ఏ రైతు పేరు మీద ఉందో చూపించే విధంగా ‘మా భూమి’వెబ్సైట్లో పొందుపరిచారు. కానీ, భూరికార్డుల ప్రక్షాళన ప్రారంభమయిన 2017, సెస్టెంబర్ 15 నుంచి ఈ వెబ్‌సైట్‌ను నిలిపివేశారు. ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో భూరికార్డుల ప్రక్షాళన వివరాలను నమోదు చేసిన అధికారులు, ఆ తర్వాత ధరణి పేరుతో కొత్త వెబ్సైట్ ప్రారంభించారు. -
ప్రభుత్వంతో యుద్ధం చేస్తాం
సాక్షి, మహబూబాబాద్: భూరికార్డుల ప్రక్షాళనలో జరిగిన తప్పులను సరిదిద్ది, వాస్తవ సాగుదారులకు పాస్‌పుస్తకాలు వచ్చేదాకా పోరాటం చేస్తామని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. మానుకోట, జనగామలో సోమవారం నిర్వహించిన రైతు దీక్షల్లో ఆయన మాట్లాడారు. రైతుల సమస్యలు పరిష్కరించకుంటే సెప్టెంబర్‌లో ప్రభుత్వంతో యుద్ధం చేస్తామని స్పష్టం చేశారు. భూప్రక్షాళనలో భూమి ఎక్కువ వస్తే.. సరిచేయాల్సింది పోయి రైతుల నుంచి లాక్కోవడం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. కౌలు రైతులపై సీఎం చేసిన వ్యాఖ్యలు గర్హనీయమని పేర్కొన్నారు. నిరుద్యోగులు, రైతులు ప్రభుత్వంపై పోరాడాలని పిలుపునిచ్చారు. భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమంలో తప్పులు దొర్లాయని, నిజమైన రైతులకు అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. తెలంగాణ జనసమితి ప్రత్యక్షంగా రైతుల అభిప్రాయాలను సేకరించిందన్నారు. పేరు, విస్తీర్ణం, కులం, సర్వే నంబర్లలో 9,11,241 తప్పులు జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. జూన్ 20 వరకు తప్పులు సరిదిద్దుతామని సీఎం చెప్పారని, జూలై 30 వరకైనా రైతులకు పాస్‌పుస్తకాలు ఇస్తారా అని అడిగారు. ఆగస్టులో ప్రభుత్వ పెద్దలను కలసి సమస్యలను వివరిస్తామన్నారు. ప్రజా ఉద్యమాల్లో ఉన్నవారికే టికెట్లు సాక్షి, కొత్తగూడెం: అన్ని అసెంబ్లీ స్థానాల్లో బరిలోకి దిగుతామని, ప్రజా ఉద్యమాల్లో ఉన్న వారికే టికెట్లు ఇస్తామని టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ ఎం.కోదండరాం అన్నారు. కొత్తగూడెంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజకీయాలు ప్రజా సమస్యలకు కేంద్ర బిందువుగా ఉండాలని సూచించారు. -
కొత్త పాస్ బుక్కులొచ్చాయ్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రైతులకు పాస్ పుస్తకాల పంపిణీలో మరో దశ మొదలైంది. తొలిదశలో పంపిణీ చేసిన పాస్ పుస్తకాల్లో వచ్చిన తప్పులను సవరించారు. అనంతరం ముద్రించిన 70 వేల పాస్‌పుస్తకాలు పంపిణీకి సిద్ధమయ్యాయి. తప్పులను సరిచేసిన ఈ పుస్తకాల ముద్రణ బుధవారం రాత్రి పూర్తి కాగా, గురువారం ఉదయం నుంచే ఉన్నతాధికారులు జిల్లాలకు పంపారు. వెంటనే వీటి పంపిణీ చేపట్టాలంటూ భూపరిపాలన ప్రధాన కమిషనరేట్ (సీసీఎల్ఏ) డైరెక్టర్ వాకాటి కరుణ అన్ని జిల్లాల కలెక్టర్లకు మార్గదర్శకాలు పంపారు. ఆపసోపాల నడుమ.. రాష్ట్రంలో మొత్తం 50 లక్షలకు పైగా ఖాతాలకు పాస్‌పుస్తకాల ముద్రణ అవసరమని రెవెన్యూ యంత్రాం గం నిర్ధారించింది. అందులో అన్ని వివరాలు అందిన 48 లక్షలకు పైగా పుస్తకాలను ముద్రించింది. వీటిలో దాదాపు 7 లక్షల పుస్తకాల్లో తప్పులు దొర్లినట్లు గుర్తించింది. ముందే గుర్తించిన 4 లక్షలకు పైగా పుస్తకాలను పంపిణీ చేయకుండానే నిలిపేయగా, మరో 3 లక్షల పుస్తకాల్లో తప్పులు వచ్చినట్లు పంపిణీ తర్వాత గుర్తించారు. తమ వివరాల్లో తప్పులు వచ్చాయన్న రైతుల ఫిర్యాదుతో ధరణి వెబ్సైట్ ద్వారా రెవెన్యూ యంత్రాంగం సరిచేసే పనిలో పడింది. అయితే ధరణి వెబ్సైట్లో సాంకేతిక సమస్యలతో తప్పులు సరిచేసేందుకు 2 నెలలుగా రెవెన్యూ యంత్రాంగం ఆపసోపాలు పడుతోంది. లక్ష వరకు పాస్‌పుస్తకాల్లోని తప్పులను నిర్ధారించిన ఫార్మాట్లో సరిచేశారు. గత నెల 20న ఈ పుస్తకాలను తిరిగి ముద్రించే పని ప్రారంభమైంది. బుధవారం నాటికి 70 వేల పుస్తకాలు సీసీఎల్ఏకు అందాయి. తప్పులు చూశాకే పంపిణీ.. మొదటి విడతలో భాగంగా వచ్చిన పుస్తకాలు వచ్చి నట్లు అందజేశారు. అయితే వాటిలో తప్పులు వచ్చినట్లు పంపిణీ తర్వాత గుర్తించారు. దీంతో ఈ పొరపాటు మళ్లీ జరగకుండా పాస్‌పుస్తకాల పంపిణీకి మార్గదర్శకాలు తయారు చేశారు. ఈ పుస్తకాలను మళ్లీ కలెక్టర్లు సరిచూడాలని, ఎలాంటి తప్పుల్లేవని నిర్ధారించుకున్నాకే రైతులకు ఇవ్వాలని డైరెక్టర్ కరుణ ఆదేశించారు. ఒకవేళ మళ్లీ తప్పులుంటే ‘ఎర్రర్.. రీప్రింట్’అనే ప్రొఫార్మాలో తిరిగి పంపాలని వెల్లడించారు. అలాగే రైతు పాత పుస్తకం తిరిగి ఇచ్చిన తర్వాతే కొత్త పుస్తకం ఇవ్వాలని పేర్కొన్నారు. -
చుక్కలు చూపుతున్న ‘ధరణి’!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని భూ రికార్డుల సమగ్ర నిర్వహణకు రూపొందించిన ‘ధరణి’వెబ్సైట్ రెవెన్యూ సిబ్బందికి చుక్కలు చూపెడుతోంది. పాస్ పుస్తకాల జారీలో జరిగిన తప్పుల సవరణకు వెబ్సైట్ సహకరించడం లేదని రెవెన్యూ సిబ్బంది వాపోతున్నారు. ఖాతా నంబర్లు, సర్వే నంబర్లు ధరణి పోర్టల్‌లో కనపడటం లేదని, అవసరం లేని వాటికి పాస్ పుస్తకాలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. ఒక్క ఖాతాను నమోదు చేసేందుకు నాలుగు దశల్లో బయోమెట్రిక్ ఇవ్వాల్సి వస్తుండటంతో చాలా సమయం వృథా అవుతోందని పేర్కొంటున్నారు. గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చోవాల్సి వస్తోందని, దీనివల్ల ఇతర రెవెన్యూ పనులు పెండింగ్‌లో పడిపోతున్నాయని వారంటున్నారు. దీంతో భూ రికార్డుల సవరణ పనులు ముందుకు సాగడం లేదని వాపోతున్నారు. ఈనెల మొదట్లోనే ఈ విషయాలన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చామని, ధరణి పోర్టల్‌లో మార్పులు చేయాలని కోరినా ఉన్నతాధికారులు పట్టించుకోలేదని అంటున్నారు. దీంతో పాస్ పుస్తకాల్లో తప్పుల సవరణ ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు ధరణి వెబ్సైట్ ద్వారా ఎదురవుతున్న ఇబ్బందులివే: - తప్పులు సరిచేయడం కోసం కొన్ని సర్వే నంబర్లను వెబ్సైట్లో నమోదు చేసినా అవి కనిపించడం లేదు. - ప్రతి రైతు ఖాతాపై డిజిటల్ సంతకం చేయాలంటే ఆ రైతు ఆధార్ నంబర్ తప్పనిసరి. ఆధార్ నంబర్లు గతంలో ఇవ్వని వారు, ఫొటోలు లేని రైతులు వారి ఆధార్ నంబర్లు, ఫొటోలు మీ సేవా కేంద్రాల్లో అప్లోడ్ చేయించినా ధరణి పోర్టల్‌లో కనిపించడం లేదు. దీంతో డిజిటల్ సంతకాలు ఆగిపోతున్నాయి. - ప్రతి ఎంట్రీకి తహసీల్దార్లు రెండుసార్లు బయోమెట్రిక్ ఇవ్వాల్సి వస్తోంది. ఎంట్రీకి ముందు, తర్వాత నిర్ధారణ కోసం రెండుసార్లు బయోమెట్రిక్ ఇస్తున్నారు. ప్రతి ఎంట్రీకి డేటాఎంట్రీ ఆపరేటర్, సీనియర్ అసిస్టెంట్, నాయిబ్ తహసీల్దార్, తహసీల్దార్ డిజిటల్ సంతకాలు చేయాలి. ఇన్నిసార్లు బయోమెట్రిక్ అవసరం లేదని రెవెన్యూ సిబ్బంది అంటున్నారు. ఖాతాను నిర్ధారించే సమయంలో వీఆర్వో, తహసీల్దార్ బయోమెట్రిక్ ఇస్తే సరిపోతుందన్నది వారి అభిప్రాయం. - ఒక పట్టాదారుకు ఒక ఖాతాలో రెండు సర్వే నంబర్లు ఉండి.. అందులో ఒక సర్వే నంబర్లో ఇంటి స్థలం, మరో సర్వే నంబర్లో వ్యవసాయ భూమి ఉంటే ఒక సర్వే నంబర్‌కు మాత్రమే పట్టాదారు పాసు పుస్తకం అవసరమవుతుంది. కానీ డిజిటల్ సంతకం కోసం ఆ ఖాతా నంబర్‌ను నమోదు చేస్తే రెండు సర్వే నంబర్లు కనిపిస్తున్నాయి. రెవెన్యూ సిబ్బంది బయోమెట్రిక్ ఇచ్చిన వెంటనే ఇంటి స్థలం ఉన్న సర్వే నంబర్‌కు కూడా డ్రాఫ్ట్ పాస్ పుస్తకం కనిపిస్తోంది. దీంతో తహసీల్దార్లు ఆ రైతు ఖాతాపై డిజిటల్ సంతకం చేయలేకపోతున్నారు. - ధరణి వెబ్సైట్ ద్వారా భూముల మ్యుటేషన్ అవకాశం కూడా కల్పించారు. అయితే ఒక భూమిపై ఎక్కువ కొనుగోలు లావాదేవీలు జరిగినప్పుడు కేవలం మొదట రిజిస్ట్రేషన్ జరిగిన కొనుగోలు లావాదేవీలో ఉన్న వ్యక్తి పేరు మాత్రమే కనిపిస్తోంది. ఆ తర్వాత లావాదేవీల వివరాలు కనిపించడం లేదు. - ధరణి పోర్టల్ నెట్వర్క్, సర్వర్ కూడా చాలా తక్కువ వేగంతో పనిచేస్తున్నాయి. తహసీల్దార్ కార్యాలయాల్లోని ఇంటర్నెట్ కూడా సరిగా పనిచేయడం లేదు. దీంతో సకాలంలో డేటా ఎంట్రీ కావడం లేదు. - డిజిటల్ సంతకం చేసే ప్రక్రియ కూడా నత్తనడకన సాగుతోంది. సాంకేతిక కారణాల వల్ల డిజిటల్ సంతకం చేసే క్రమంలో అనేక తప్పులు వస్తున్నాయి. డేటా ఎంట్రీ ఆపరేటర్ రైతుల ఖాతా నంబర్లను నమోదు చేసిన క్రమంలో ఏదైనా తప్పులు వస్తే వాటిని సరిచేసే అవకాశం సీనియర్ అసిస్టెంట్లు, నాయిబ్ తహసీల్దార్లకు ఇవ్వాలని రెవెన్యూ సిబ్బంది కోరుతున్నారు. - మిగిలిన సర్వే నంబర్లు నమోదు చేసే అవకాశం ధరణి పోర్టల్‌లో కల్పించారు. అయితే ఒక సర్వే నంబర్లో మిగిలి పోయిన సబ్ సర్వే నంబర్లను నమోదు చేసేందుకు ప్రాథమిక సర్వే నంబర్ కనిపించడం లేదు. - డిజిటల్ సంతకం చేసేందుకు ఒక ఖాతాలోని అన్ని సర్వే నంబర్లు కనిపిస్తున్నాయి. అదే ఖాతాలోని ఇంటి స్థలాలు, వివాదాస్పద భూములు, అమ్ముకున్న భూముల వివరాలు కూడా కనిపిస్తున్నాయి. -
అర్చకులకే ‘దేవాలయ’ పాస్ పుస్తకాలు
సాక్షి, హైదరాబాద్: దేవాలయాల భూములకు సంబంధించిన పాస్ పుస్తకాలను తమకే ఇవ్వా లని అర్చకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు ప్రోత్సాహకం కూడా వారికే ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం సచివాలయంలో రెవెన్యూశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజేశ్వర్ తివారీ, దేవాదాయ శాఖ కమిషనర్ శివశంకర్‌ను కలిసి వారి సమస్యలను విన్నవించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల అర్చకుల పేర్ల పహాణీలో అనుభవదారు పేర్లు తొలగించడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. -
అన్యాయమయ్యా..!
కొనకనమిట్ల: చేయి తడిపితే చాలు ఎవరి పొలాలకు ఇంకెవరి పేరుతో అయినా పాస్‌పుస్తకాలు పుడతాయి. ఆ వెంటనే ఆన్లైన్లో కూడా నమోదవుతాయి. రెవెన్యూ సిబ్బంది చేస్తున్న మాయాజాలాన్ని ఆలస్యంగా గ్రహిస్తున్న అసలు భూ యజమానులు బోరుమంటున్నారు. తమ పొలాలు ఎవరి పేరుతో ఆన్‌లైన్‌లోకి ఎక్కుతున్నాయోనని ఆందోళన చెందుతున్నారు. తాజాగా కొనకనమిట్ల మండలం వాగుమడుగు పంచాయతీ బోడపాడు, వద్దిమడుగు గ్రామాలకు చెందిన పలువురు రైతులు తమ పొలాలను మరొకరి పేరిట ఆన్లైన్ చేశారంటూ సోమవారం విలేకరుల ఎదుట వాపోయారు. కొనకనమిట్ల మండలం బోడపాడు గ్రామానికి చెందిన భూదాల కొండయ్య పేరు మీద సర్వే నంబరు 26–1లో 4.27 ఎకరాల భూమి ఉంది. మూడేళ్ల క్రితం కొండయ్య మృతి చెందాడు. అతడి పేరున ఉన్న భూమిని తన పేరున మార్చాలని భార్య కొండమ్మ తహసీల్దార్ కార్యాలయ అధికారులను వేడుకుంది. ఏడాదిగా తిరుగుతున్నా పట్టించుకోలేదు సరి కదా అప్పటి వరకు కొండయ్య పేరున ఉన్న భూమిలో రెండెకరాలను వాగుమడుగు గ్రామానికి చెందిన కదమ బ్రహ్మేశ్వరరావు పేరున పాసుపుస్తకం ఇచ్చి ఆన్లైన్ కూడా చేశారు. మిగతా భూమిని ఇతరుల కింద చూపటం జరిగింది. ఇది అన్యాయమయ్యా అని తహసీల్దార్ జ్వాలా నరసింహం, ఆర్ఐ పుల్లారెడ్డి, వీఆర్ఓ పిచ్చిరెడ్డిలను అడిగితే కన్నెత్తి చూడటం లేదని ఇంతటి దుర్మార్గపు పని చేశారని కొండమ్మ ఆవేదన వెలెబుచ్చింది. అధికారుల నుంచి సమాధానం కరువు బోడపాడు గ్రామానికి చెందిన చిరుగూరి మోషేకు సర్వే నంబరు 20–4లో 1–96 ఎకరాలు, 20–5లో 1–53 ఎకరాలు వెరసి 3–49 ఎకరాల భూమి ఉంది. దానికి పాసు పుస్తకం కూడా ఉంది. అయితే రెవెన్యూ అధికారులు సదరు భూమిని సాదం బాలకృష్ణ పేరున పాసు పుస్తకం ఇచ్చి ఆన్లైన్ కూడా చేసారు. దీని మీద గొడవలు జరిగాయని ఇదేం పనంటూ రెవెన్యూ అధికారులను అడిగితే సమాధానం చెప్పటం లేదని మోషే వాపోయాడు. అంబాపురంలో భూ మాయ.. వాగుమడుగు పంచాయతీ అంబాపురం రెవెన్యూ ఇలాకలో మాన్యం భూమి సర్వే నంబరు 229–2లో 6–10 ఎకరాల భూమిని వద్దిమడుగు గ్రామానికి చెందిన ఆళ్లచెరువు శ్రీను, మూర్తెయ్య, బట్టు పెదకృష్ణయ్య, చినకృష్ణయ్యలు వారి పూర్వికుల నుంచి ఉన్న భూమిలో బోర్లు వేసుకొని పంటలు సాగు చేసుకుంటున్నారు. ఈ భూమి మాన్యం భూమిగా ఉంటడంతో రెవెన్యూ అధికారులు , పలువురు మధ్యవర్తులు ద్వారా రూ. సుమారు రూ.15 లక్షల వరకు తీసుకొని ఆ భూమిని అంబాపురం గ్రామానికి చెందిన కందుకూరు రాజయ్య పేరున పాసు పుస్తకం ఇచ్చారు. అదే భూమిని రాజయ్య వేరొకరికి అమ్మకం పెట్టాడు. ఇదంతా తెలుసుకున్న బాధితులు ఏడాదిగా కార్యాలయం చుట్టూ తిరిగి జరిగిన మోసాన్ని రెవెన్యూ అధికారులను అడిగితే పట్టించుకోవటం లేదని భాధితులు వాపోయారు. డబ్బులకు అమ్ముడుపోయిన అధికారులు మండలంలో ఒకరి భూమిని మరొకరికి పాసు పుస్తకాలు పుట్టిస్తూ అవినీతికి పాల్పడుతున్నారని భాదితలు ఆరోపించారు. మేమే కాదు మాలాంటి బాధితులు మండలంలో ఇంకా ఉన్నారని తెలిపారు. జిల్లా ఉన్నతాధికారులకు తమ సమస్య విన్నవించామని, తమ భూములను తమకు దక్కేలా చూడాలని లేదంటే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. సీబీఐతో విచారణ చేయించాలి.. మండల రెవెన్యూ కార్యాలయంలో అవినీతి పెచ్చు మీరింది. సీబీఐ చేత విచారణ చేపడితే వారి బాగోతాలు బయట పడతాయి. వాగుమడుగు, అంబాపురం, కాట్రగుంట, తువ్వపాడు, నాగంపల్లి, బచ్చలకూరపాడు, వద్దిమడుగు, వాగుమడుగు గ్రామాల్లో భూముల రికార్డులు తారుమారవుతున్నాయి. వీటన్నింటికి కారణం ప్రస్తుత రెవెన్యూ అధికారుల పనితీరే. డబ్బులకు అమ్ముడు పోయిన అధికారులు పేదల భూములను తారు మారు చేస్తూ వారికి అన్యాయం చేస్తున్నారు. వాగుమడుగులో పశువుల మేత, కొండ పోరంబోకుల భూములు సుమారు 500 ఎకరాలకు పైగా ఉంది. ఆ భూమిపై రెవెన్యూ అధికా రుల కన్న పడింది. దానిని మాయ చేసేస్తారు. ఈ భూ మాయపై త్వరలో ధర్నా చేస్తాం. – పి.జయదేవకుమార్, జడ్పీటీసీ మాజీ సభ్యుడు -
సారూ.. మా మొర ఆలకించరు
సాక్షి, నాగర్ కర్నూలు : జిల్లాలోని కోడేర్ మండలంలోని తహసీల్దార్ కార్యాలయానికి గత వారం రోజులుగా అధికారులెవరూ అటువైపు కన్నెత్తి చూడట్లేదు. ఈ చర్యలతో ఆగ్రహించిన రైతులు కార్యాలయానికి తాళాలు వేసి తమ నిరసనను తెలియజేశారు. అధికారులు మమ్మల్ని మనుషులుగా కాకుండా, మా పట్ల హేళనగా చూస్తున్నారని రైతులు ఆవేదన చెందారు. కొత్తగా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రైతుబంధు పథకానికి సంబంధించి మాకు ఎటువంటి చెక్కులు అందట్లేదని, చెక్కులు ఇవ్వకున్నా పరవాలేదు కనీసం మా భూముల పట్టాదారు పాస్ పుస్తకాలు అయినా మాకు ఇవ్వాలని రైతులు అధికారులను వేడుకుంటున్నారు. -
బోనస్.. వాపస్..!
సాక్షి, హైదరాబాద్: భూ రికార్డుల ప్రక్షాళన కథ అడ్డం తిరిగింది. ప్రక్షాళన దశలో అభినందనలు పొందిన ఈ ప్రక్రియ.. పాస్ పుస్తకాల పంపిణీ సమయానికి నిందారోపణలకు దారితీయడం తహసీల్దార్లకు రుచించడం లేదు. పాస్ పుస్తకాల్లో పెద్ద ఎత్తున వచ్చిన తప్పులకు తమను బాధ్యులుగా చేయడాన్ని నిరసిస్తూ ప్రభుత్వం తమకు బోనస్‌గా ఇచ్చిన నెల మూల వేతనాన్ని తిరిగి ఇచ్చివేయాలని తహసీల్దార్ల సంఘం నిర్ణయించింది. పాస్ పుస్తకాల్లో వచ్చిన తప్పుల బాధ్యతను తమపై రుద్దుతున్నందుకు నిరసనగానే ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించింది. ఈ విషయంలో ఉన్నతాధికారులు తమపై కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని, పాస్ పుస్తకాల ముద్రణలో అసలేం జరిగిందన్న విషయాన్ని ముఖ్యమంత్రితోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలసి వివరిస్తామని వారు చెబుతున్నారు. ధరణి వెబ్సైట్ లోపభూయిష్టం భూ రికార్డులను సమగ్రంగా నమోదు చేసేందుకు రూపొందిస్తున్న ధరణి వెబ్సైట్ కూడా లోపభూయిష్టంగా ఉందని తహసీల్దార్లు ఆరోపిస్తున్నారు. ధరణి వెబ్సైట్ అందుబాటులోకి రానందున తప్పులు సరిచేసే అవకాశం అమల్లోకి రాలేదని, వెబ్సైట్లో ఇచ్చిన ఆప్షన్లు కూడా లోపభూయిష్టంగా ఉన్నాయని వారంటున్నారు. -
పంచని పుస్తకాల్లో తప్పులెన్నో!
సాక్షి, హైదరాబాద్: కొత్త పాస్ పుస్తకాల పంపిణీ తప్పుల తడకని తేలిపోయింది. ముద్రణ సమయంలోనే 3 లక్షల పాస్ పుస్తకాల్లో తప్పులున్నాయని గుర్తించిన రెవెన్యూ యంత్రాంగం.. వాటిని పంపిణీ చేయకుండా నిలిపివేయడమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. పేరు తప్పుల నుంచి ఆధార్ నంబర్ల వరకు, విస్తీర్ణంతోపాటు ఫొటోలు కూడా తప్పులు రావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఈ పుస్తకాలను పంపిణీ చేయలేదు. ఇది ఒక ఎత్తయితే పంపిణీ చేసిన పుస్తకాల్లో కూడా అదే స్థాయిలో తప్పులు వస్తుండటం మరింత గందరగోళానికి దారితీస్తోంది. అయితే పాస్ పుస్తకాల్లో తప్పులకు క్షేత్రస్థాయిలో జరిగిన నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది. అడ్డగోలుగా రికార్డులు సరిచేయడం, ఎలాంటి పరిశీలన లేకుండా ఇష్టారాజ్యంగా పాస్ పుస్తకాల వివరాలను ముద్రణకు పంపడమే ఇంతటి గందరగోళానికి కారణమైందని రెవెన్యూ ఉన్నతాధికారులు నిర్ధారించుకున్నారు. దీంతో ఇప్పుడు ఆ పుస్తకాలన్నింటినీ మళ్లీ ముద్రించేందుకు సిద్ధమయ్యారు. 14 రకాల తప్పులు పంపిణీ చేయకుండా నిలిపివేసిన పుస్తకాల్లో మొత్తం 14 రకాల తప్పులున్నాయని అధికారులు గుర్తించారు. ఇందులో రైతుకు అత్యంత కీలకమైన భూమి విస్తీర్ణం నమోదులోనే ఎక్కువ పుస్తకాల్లో తప్పులు వచ్చాయి. మొత్తం 93 వేల పుస్తకాల్లో రైతుకు ఉన్న భూమి కన్నా ఎక్కువో, తక్కువో నమోదయ్యాయి. వీటికితోడు పట్టాదారుకు బదులు వేరొకరి ఫొటో ఉన్న 37 వేలకు పైగా పుస్తకాలను అధికారులు గుర్తించారు. వాటిని నిలిపివేశారు. చనిపోయిన వారి పేర్ల మీద, పాత పట్టాదారుల పేర్లతో, ఆధార్ తప్పులతో, పట్టాదారు పేరు, తండ్రి పేర్లలో తప్పులతో వేల సంఖ్యలో పుస్తకాలను ముద్రించారు. నాలా భూములకు, ప్రభుత్వ భూములకు కూడా పాస్ పుస్తకాలను సిద్ధం చేశారు. ఒక్కో రైతుకు ఒక ఖాతా ఉండాల్సి ఉండగా, ఒకే ఖాతా నంబర్‌ను ఇద్దరు, ముగ్గురు రైతులకు వచ్చేలా దాదాపు 34 వేల పుస్తకాలు ముద్రించారంటే రెవెన్యూ యంత్రాంగం నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. సర్వే నంబర్లలో తప్పులు, అసైన్డ్ భూములకు, అటవీ శాఖతో వివాదాలున్న భూములకు కూడా పాస్ పుస్తకాలు ముద్రించడం గమనార్హం. పంపిణీ చేసిన వాటిలోనూ.. పంపిణీ చేసిన 39 లక్షల పుస్తకాల్లోనూ అదే స్థాయిలో తప్పులు రావడం రైతాంగాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. భూ విస్తీర్ణం, పట్టాదారు పేర్లు, ఫొటోలు, ఆధార్ నంబర్లలో వచ్చిన తప్పులును రైతులను మానసిక ఆందోళనకు గురిచేస్తున్నాయి. తమకున్న భూమి మొత్తం పుస్తకాల్లో రాకపోవడంతో ఉన్న భూమి ఎటుపోతుందోననే భయం వారిలో వ్యక్తమవుతోంది. చాలా పుస్తకాల్లో కొనుగోలు చేసిన భూములు కూడా ఆనువంశికంగా వచ్చినట్లు నమోదైంది. ఇవి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తెచ్చిపెడతాయోననే సందేహాలు క్షేత్రస్థాయిలో వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఈ తప్పులను సరిచేయాల్సిన రెవెన్యూ యంత్రాంగం ఇంకా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే ఆరోపణలున్నాయి. ‘తప్పులను రికార్డు చేసి వెళ్లిపోండి.. మేం కొత్త పుస్తకాలకు పంపిస్తాం. కానీ అవి ఎప్పుడు వస్తాయో చెప్పలేం’అంటూ క్షేత్రస్థాయి రెవెన్యూ సిబ్బంది చెబుతున్న మాటలు రైతులను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. అవినీతి ఆరోపణలు కూడా పాస్‌పుస్తకాల పంపిణీపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయని క్షేత్రస్థాయి పరిస్థితులు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం చొరవ తీసుకుని నిశిత దృష్టితో ఈ అంశాన్ని పరిష్కరించాలని రైతు సంఘాలు కోరుతున్నాయి. విషయం సీఎం దృష్టికి ఇటీవల జరిగిన కలెక్టర్ల సమావేశంలో రాష్ట్రంలో అసలు ఎన్ని కొత్త పాస్‌పుస్తకాలను ముద్రించారు? అందులో పంపిణీ చేసినవి ఎన్ని? పంపిణీ చేయకుండా నిలిపివేసినవి ఎన్ని? పంపిణీ ఎందుకు చేయలేదనే వివరాలను జిల్లాల వారీ గణాంకాలతో రెవెన్యూ ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 49.94 లక్షల కొత్త పాస్ పుస్తకాలను ముద్రించామని, అందులో 39.47 లక్షల పుస్తకాలను ఈనెల 23 నాటికి పంపిణీ చేశామని, 3.07 లక్షల పుస్తకాల్లో తప్పులున్నందున వాటిని నిలిపివేశామని తెలిపారు. పంపిణీ చేసిన పాస్ పుస్తకాల్లోనూ పెద్ద సంఖ్యలో తప్పులు వచ్చాయన్న సమాచారంతో సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సరిచేయాలని ఆదేశించారు. -
జూన్ 20కల్లా చెక్కుల పంపిణీ పూర్తవ్వాలి: సీఎస్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జూన్ 20కల్లా పట్టాదారు పాస్‌పుస్తకాలు, రైతుబంధు చెక్కుల పంపిణీ పూర్తి కావాలని సీఎస్ ఎస్కే జోషి స్పెషలాఫీసర్లను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో సీఎస్.. పాస్‌బుక్కులు, చెక్కుల పంపిణీ పర్యవేక్షణకు నియమించిన స్పెషలాఫీసర్లతో సమావేశమయ్యారు. జిల్లాల్లో పర్యటించి పాస్‌పుస్తకాలు, చెక్కుల పంపిణీ సజావుగా జరిగేలా చూడాలని.. ఈ మేరకు కలెక్టర్లకు మార్గనిర్దేశనం చేయాలని సూచించారు. మండల అధికారుల టీంలు ప్రతీ గ్రామంలో పర్యటించేలా చూడాలని చెప్పారు. పాస్‌పుస్తకాల్లోని తప్పులపై దృష్టి సారించి, వాటిని సరిదిద్దేందుకు దృష్టి సారించాలన్నారు. మంత్రులతో సమన్వయం చేసుకొని స్పెషల్ డ్రైవ్ తరహాలో చేపట్టాలన్నారు. ఇప్పటివరకు దాదాపు 40 లక్షల పాస్‌పుస్తకాలు పంపిణీ చేశామని.. మిగిలిన వాటి పంపిణీకి చర్యలు తీసుకోవాలన్నారు. ఆధార్ అనుసంధానించిన ఖాతాలకు డిజిటల్ సిగ్నేచర్లను సత్వరం పూర్తి చేయాలన్నారు. సమావేశంలో స్పెషలాఫీసర్లు అజయ్ మిశ్రా, చిత్రా రామచంద్రన్, అధర్ సిన్హా, సునీల్ శర్మ, రామకృష్ణారావు, సోమేశ్ కు మార్, వికాస్‌రాజ్, జయేశ్‌రంజన్, శివశంకర్, శశాంక్ గోయల్ తదితరులు పాల్గొన్నారు. -
‘స్పెషల్’ డ్రైవ్
సాక్షిప్రతినిధి, కరీంనగర్ : భూరికార్డుల ప్రక్షాళన, పాస్‌పుస్తకాలు, చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేసేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. భూప్రక్షాళన, పాసుబుక్కులు, చెక్కుల్లో చోటు చేసుకున్న తప్పులతో పంపిణీలో జాప్యం జరుగుతున్న విషయమై సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్షించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ఈ కార్యక్రమాలను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేందుకు దిశానిర్దేశనం కూడా చేశారు. ఇందుకోసం నాలుగు జిల్లాలకు సీనియర్ ఐఏఎస్ అధికారులకు ప్రత్యేక అధికారులుగా బాధ్యతలు అప్పగించారు. కరీంనగర్ జిల్లాకు స్మితాసబర్వాల్, పెద్దపల్లికి శ్రీధర్, రాజన్న సిరిసిల్లకు సునీల్‌శర్మ, జగిత్యాలకు సందీప్‌కుమార్ సుల్తానియాలను నియమించారు. జూన్ 20 వరకు పూర్తయ్యేలా స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని సూచించడంతో అధికారులు ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. పాసుబక్కులు, చెక్కుల పంపిణీ వేగవంతం.. జిల్లా అధికారులతో సమీక్షలు.. శుక్రవారం నుంచి వచ్చే నెల 20 వరకు ప్రత్యేక అధికారులు, జిల్లా యంత్రాంగంతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఇదేపని మీద ఉండాలని సీఎం స్పష్టం చేయడంతో ప్రజాప్రతినిధులు సైతం పల్లెబాట పడుతున్నారు. భూ రికార్డులను సక్రమంగా నిర్వహించడంలో అధికారులు, సిబ్బంది సరిగా వ్యవహరించేలా చూడటంతోపాటు విదేశాలలో ఉన్న ఎన్నారైలకు పాస్‌పుస్తకాలు ఇవ్వడానికి ప్రత్యేక విధానంపైనా కసరత్తు చేస్తున్నారు. కొత్త పట్టాదార్ పాస్‌పుస్తకాలు, రైతుబంధు చెక్కుల పంపిణీ కార్యక్రమంపై ప్రత్యేక అధికారులు శుక్రవారం నుంచి ఆయా జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సమీక్షలు జరపనున్నారు. జిల్లాల వారీగా ఇప్పటివరకు ఎన్ని పాస్‌పుస్తకాలు పంపిణీ చేశారు? ఎంతమందికి చెక్కులిచ్చారు? మిగతావారికి ఏ కారణంతో పంపిణీ చేయలేదు? తదితరాలపై అధికారులను అడిగి తెలుసుకొన్నారు. పాస్‌పుస్తకాలు, చెక్కుల పంపిణీ వందశాతం పూర్తయ్యే బాధ్యతను కలెక్టర్లతోపాటు మంత్రులు స్వీకరించాలన్న ఆదేశంతో శుక్రవారం మంత్రి ఈటల రాజేందర్ కరీంనగర్ కలెక్టరేట్లో ఉమ్మడి జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఏయే జిల్లాలో ఏ మేరకు పంపిణీ.. పట్టాదారు పాసుపుస్తకాలతోపాటు రైతుబంధు చెక్కుల పంపిణీని ఈనెల 10 సీఎం కేసీఆర్ హుజూరాబాద్ మండలం శాలపల్లి–ఇందిరానగర్లలో ప్రారంభించారు. అప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం అమల్లోకి రాగా.. ఇప్పటివరకు పట్టాదారు పాసు పుస్తకాలు, రైతు బంధు చెక్కుల పంపిణీ వివరాలు ఇలా ఉన్నాయి.కరీంనగర్ జిల్లాలో చెక్కుల సంఖ్య 1,46,027, చెక్కుల విలువ రూ.124,58,85,100. ఇప్పటివరకు 98,275 చెక్కులను పంపిణీ చేశారు. వీటి విలువ రూ.89,07,77,740 కాగా 54,735 చెక్కులను డ్రా చేసుకోగా రూ.53,99,06,050 నగదును పొందారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొత్తం రైతుల సంఖ్య 1,04,636, చెక్కుల సంఖ్య 1,05,357, చెక్కుల విలువ రూ.97,43,95,470. ఇప్పటివరకు 81,648 మంది రైతులకు 82,111 చెక్కులను పంపిణీ చేశారు. వీటి విలువ రూ.79,99,34,900 కాగా 44,766 మంది రైతులు 45,028 చెక్కులను డ్రా చేసుకున్నారు. రూ.44,68,32,850 నగదును పొందారు. జగిత్యాల జిల్లాలో రైతుల సంఖ్య 2,05,555. చెక్కుల సంఖ్య 2,06,639, చెక్కుల విలువ రూ. 168,72,52,240. ఇప్పటివరకు 1,51,288 మంది రైతులకు 1,51,964 చెక్కులను పంపిణీ చేశారు. వీటి విలువ రూ. 133,96,89,250 కాగా 92,568 మంది రైతులు 93,119 చెక్కులు డ్రా చేసుకోగా రూ.88,12,40,790 నగదు పొందారు. పెద్దపల్లి జిల్లాలో మొత్తం రైతుల సంఖ్య 67,328, చెక్కుల సంఖ్య 67,556, చెక్కు ల విలువ రూ.54,94,000,00. ఇప్పటివరకు 51,024 మంది రైతులకు 51,127 చెక్కులను పంపిణీ చేశారు. వీటి విలువ రూ.43,74,000,00 కాగా 16,429 మం ది రైతులు 16,467 చెక్కులు డ్రా చేసుకున్నారు. రూ.15,75,000,00 నగదు పొందారు. -
డెడ్ లైన్.. జూన్ 2
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రతి ఒక్క రైతుకూ జూన్ 2లోగా కొత్త పట్టాదారు పుస్తకం, రైతుబంధు చెక్కులు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. సాంకేతిక కారణాల వల్ల కొన్ని చోట్ల కొద్దిమందికి పట్టాదారు పాస్ పుస్తకాలు, చెక్కులు అందలేదని ప్రభుత్వానికి సమాచారం అందినట్లు చెప్పారు. గ్రామాల్లో పంపిణీ చేసిన సందర్భంలో హాజరు కాలేకపోయిన వారు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి బుక్కులు, చెక్కులు తీసుకోవాలని పేర్కొ న్నారు. పాస్బుక్కుల పంపిణీ, రైతుబంధుపై ప్రగతిభవన్‌లో మంగళవారం ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు జరిగిన కార్యక్రమాన్ని సమీక్షించడంతోపాటు మిగిలిన వారికి పాస్ పుస్తకాలు, చెక్కులు అందించడానికి అవసరమైన వ్యూహం ఖరారు చేసేందుకు మంత్రులు, కలెక్టర్లతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. బుధవారం మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రగతిభవన్‌లో ఈ సమావేశం జరగనుంది. ‘‘ఆధార్ కార్డు అనుసంధానం కాకపోవడంతోపాటు మరికొన్ని కారణాల వల్ల కొన్ని చోట్ల రైతులకు పాస్‌పుస్తకాలు అందలేదు. చెక్కులు చేతికి రాలేదు. కొన్నిచోట్ల రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. భూరికార్డులు సరిచేసే కార్యక్రమాన్ని కొన్నిచోట్ల సరిగా నిర్వహించలేదని తెలుస్తోంది. ప్రభుత్వం రైతుల కోసం ఇంత చిత్తశుద్ధితో పనిచేస్తున్నా అధికారులు కొన్నిచోట్ల అందుకు అనుగుణంగా విధులు నిర్వహించకపోవడం అసంతృప్తి కలిగిస్తోంది. ఇప్పటికైనా యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగాలి. ప్రతీ ఒక్క రైతుకు పట్టాదారు పాస్ పుస్తకాలు, చెక్కులు పంపిణీ చేయాలి. జూన్ 2 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ విధానం అమల్లోకి వస్తుంది. అప్పటికల్లా అందరి వద్ద కొత్త పాస్ పుస్తకాలుండాలి. రికార్డులన్నీ అప్డేట్ అయి ఉండాలి’’ అని ముఖ్యమంత్రి ఆదేశించారు. అసెంబ్లీ స్పీకర్ ఎస్.మధుసూదనాచారి, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, హరీశ్‌రావు, లక్ష్మారెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ఎంపీలు సంతోష్ కుమార్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎండీసీ చైర్మన్ శేరి సుభాష్‌రెడ్డి, సీనియర్ అధికారులు ఎస్.నర్సింగ్‌రావు, రామకృష్ణారావు, రాజేశ్వర్ తివారీ, శాంతకుమారి, వికాస్ రాజ్, జగన్మోహన్, వెంకట్రామ్రెడ్డి, సందీప్ సుల్తానియా, భూపాల్‌రెడ్డి సమావేశంలో పాల్గొన్నారు. రైతుబంధుకు గొప్ప స్పందన దేశంలో మరే ప్రభుత్వ కార్యక్రమానికి రానంత గొప్ప స్పందన రైతుబంధుకు వచ్చిందనిసీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించి నూటికి నూరు శాతం కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని పిలుపునిచ్చారు. ‘‘రికార్డు సమయంలో భూ రికార్డుల ప్రక్షాళన చేసి, రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు అందించడం సాధారణ విషయం కాదు. ప్రభుత్వం ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతోంది. ఎన్నో పథకాలు తెస్తుంది. కానీ పంట పెట్టుబడి పథకానికి వచ్చినంత గొప్ప స్పందన మరే కార్యక్రమానికి రాలేదు. ఆఫీసుల చుట్టూ తిరగకుండా, ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా భూమి రికార్డులు సరిచేసి కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వడం, పెట్టుబడి సాయం అందివ్వడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. రైతుల సంక్షేమానికి మించిన ప్రాధాన్యం ప్రభుత్వానికి మరొకటి లేదు. అందుకే వ్యవసాయ రంగానికి ఎక్కువ నిధులిస్తున్నాం. రైతులకు మేలు చేయగలిగితేనే సాధించిన తెలంగాణకు సార్థకత. రూ.12 వేల కోట్లతో రైతుబంధు కార్యక్రమం అమలు చేస్తుంటే చాలా మంది భయపడ్డారు. కానీ రైతులకు నేరుగా మేలు చేసే కార్యక్రమం కాబట్టి మొండి పట్టుదలతో ముందుకుపోయాం. పంట పెట్టుబడికి ప్రభుత్వం అందించిన సాయం చేతికందిన తర్వాత రైతుల్లో చెప్పలేని ఆనందం, అప్పుల బాధ తప్పిందనే ఊరట కనిపిస్తోంది’’ అని సీఎం అన్నారు. కలెక్టర్లతో నేడు అత్యవసర సమీక్ష జూన్ 2 నాటికి పాస్ పుస్తకాలు, చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ముగించేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులు, కలెక్టర్లతో బుధవారం మధ్యాహ్నం సమావేశం కానున్నారు. జిల్లాల వారీగా ఇప్పటివరకు ఎంత మంది రైతులకు పాస్ పుస్తకాలు, చెక్కులు అందించారు? ఇంకా ఎన్ని మిగిలాయి? ఎందుకు మిగిలాయి? వారికి బుక్కులు, చెక్కులు ఎప్పుడిస్తారు? అసలు ఏ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి? తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తారు. తక్షణ వ్యూహంతో పాటు రైతులకు జీవిత బీమా పథకం, కంటి వెలుగు, రాష్ట్ర అవతరణ వేడుకలు, పంచాయతీ రాజ్ ఎన్నికల ఏర్పాట్లు తదితర అంశాలపైనా ఈ భేటీలో చర్చిస్తారు. సీఎంకు స్పీకర్ అభినందనలు రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు, చెక్కులు అందించినందుకు అసెంబ్లీ స్పీకర్ మధుసూధనాచారి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమం రైతుల్లో ఎంతో ఆనందం నింపిందని, గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొందని స్పీకర్ అన్నారు. ప్రగతి భవన్‌కు వచ్చి సీఎంకు పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలిపారు. విజయవంతంగా రైతుబంధు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డిలను సీఎం అభినందించారు. తెలంగాణలో వ్యవసాయాభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించడంతోపాటు చెక్కుల పంపిణీకి భారీగా కసరత్తు చేసిన వ్యవసాయాధికారులను కూడా అభినందించారు. వ్యవసాయ శాఖ కమిషనర్ జగన్మోహన్, హర్టికల్చర్ కమిషనర్ వెంకట్రామ్రెడ్డి, వివిధ జిల్లాలకు చెందిన వ్యవసాయాధికారులు సీఎంను కలిశారు. -
రైతుల నోళ్లు కొట్టి..తమ్ముళ్ల పేర్లు దాచిపెట్టి
చేతనైతే పేదలను ఆదుకోవాల్సిన రెవెన్యూ అధికారులు నిరంకుశత్వంగా వ్యవహరిస్తున్నారు. పెద్దలు రూ.కోట్ల ప్రభుత్వ భూములు కబ్జా చేస్తున్నా కళ్లప్పగించి చూసే వీళ్లు పేద రైతుల పేరిట పట్టాలు, పాస్‌బుక్‌లు ఉన్నా.. అవి ప్రభుత్వ భూములంటూ నిషేధాజ్ఞలు విధించారు. ఇదే భూములకు సంబంధించి కొందరు టీడీపీ నేతల పేర్లు ఉండటంతో రాత్రికి రాత్రే నోటీసు బోర్డుల్లో నుంచి ఆ పేర్లు తొలగించారంటే రెవెన్యూ అధికారులు ఎవరికి కోసం పని చేస్తున్నారో అర్థమవుతోంది. తమ తాతల కాలం నాటి నుంచి సాగు చేసుకుంటున్న భూముల్లో అడుగుపెట్టొద్దంటూ నిషేధాజ్ఞలు విధించడంపై హక్కుదారులు కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు. గూడూరు: గూడూరు మండలంలోని కొండాగుంట, వెంకటేశుపల్లి, తిమ్మసముద్రం, కాండ్రా గ్రామాలకు చెందిన 77 మంది రైతులు సర్వే నంబరు 140 నుంచి 417/2 వరకూ 225.57 ఎకరాల భూములను తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్నారు. మొదట్లో ఈ భూములు వెంకటగిరి సంస్థానానికి చెందినవి కాగా, ఆయా గ్రామాలకు చెందిన రైతులు తాతల కాలం నుంచి ఆ భూముల్లో పంటలు పండించుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి రెవెన్యూ మంత్రిగా ఉన్న సమయంలో ఆ భూములు సాగు చేసుకుంటున్న వారికి పట్టాలిచ్చారు. దీంతో ఆ భూములను సాగు చేసుకునే రైతుల పేరిట పట్టాదారు పాసు పుస్తకాలు, టెన్ వన్ అడంగళ్, వన్ బీలు కూడా ఉన్నాయి. ఆ భూముల్లో అప్పులు చేసి బోర్లు వేసుకుని నిమ్మ, యూకలిప్టస్ సాగు చేసుకుంటున్నారు. ఆ భూములను బ్యాంక్‌ల్లో తనఖా పెట్టి రుణాలు కూడా పొందారు. అయితే ఈ 225.57 ఎకరాల భూములు ప్రభుత్వ భూమిగా నిర్ధారిస్తూ ఆ భూమిలోకి అనుమతుల్లేకుండా ప్రవేశించిన వారు చట్టరీత్యా శిక్షార్హులంటూ ఇటీవల తహసీల్దార్ హెచ్చరిక నోటీసు బోర్టులు ఏర్పాటు చేశారు. అధికార పార్టీ కుట్ర దశాబ్దాలుగా సర్వహక్కులు కలిగి రైతులు వ్యవసాయం చేసుకుంటున్న భూములు హఠాత్తుగా ప్రభుత్వ భూములని చెబుతూ రెవెన్యూ అధికారులు నోటీసు బోర్డులు పెడుతూ నిషేధాజ్ఞలు విధించడం వెనుక అధికార పార్టీ కుట్ర ఉన్నట్లు తెలుస్తోంది. ఈ భూములను సాగు చేసుకుంటున్న వారిలో అత్యధికులు వైఎస్సార్సీపీ అభిమానులు ఉన్నారు. ఈ భూములను వారి చేతుల్లో తప్పించి, టీడీపీ నేతల పేరిట బదలాయించుకునే యత్నంగా రైతులు ఆరోపిస్తున్నారు. ఇవి ప్రభుత్వ భూములని ఎవరో ఓ వ్యక్తి లోకాయుక్తకు ఫిర్యాదు చేశారని, వారి ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నామని రెవెన్యూ అధికారులు చెప్పడం అర్థరహితంగా ఉంది. ఇవి గతంలో ప్రభుత్వ భూములే అయితే అయి ఉండొచ్చు. కానీ వీటికి రెవెన్యూ అధికారులే పట్టాలు, పట్టాదారు పుస్తకాలు ఇచ్చి ఉండటం, రెవెన్యూ రికార్డుల్లో సైతం రైతుల పేర్లే ఉన్నా.. ఇవి ప్రభుత్వ భూములని ఎలా చెబుతారంటూ రైతులు ప్రశ్నిస్తే పొంతన లేని సమాధానాలు చెబుతున్నారు. అధికార పార్టీలోని ముఖ్య ప్రజాప్రతినిధి ఒత్తిడితోనే రెవెన్యూ అధికారులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. రెవెన్యూ అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తూ రైతుల నోళ్లు కొట్టి.. తమ్ముళ్లకు దాసోహం అవుతున్నారు. టీడీపీ నేతల పేర్ల తొలగింపు ఇవి ప్రభుత్వ భూములని రెవెన్యూ అధికారులు నోటీసు బోర్డులు పెట్టి, నిషేధాజ్ఞలు విధించిన తర్వాత అందులో టీడీపీ నేతల పేర్లు కూడా ఉన్నాయి. ఇవి తెలిసిన తర్వాత రాత్రికి రాత్రే ఆ టీడీపీ నేతల అధీనంలో ఉన్న 31.13 ఎకరాలకు సంబంధించి భూములను తప్పించి, 194.44 ఎకరాల్లో నిషేధాజ్ఞలు విధించారు. మొన్నా..మొన్నటి వరకు ఈ భూములకు సంబంధించి ‘మీ భూమి’ ఆన్లైన్ రెవెన్యూ రికార్డుల్లో అడంగళ్, వన్–బీ వివరాలు కూడా రాకుండా బ్లాక చేశారు. గతంలో ఇదే భూములకు సంబంధించి రెవెన్యూ అధికారులు నోటీసులు ఇవ్వడంతో నాలుగు గ్రామాలకు చెందిన రైతులు తమకు ఉన్న హక్కు ప్రతాల వివరాలతో తహసీల్దార్ కార్యాలయంలో వివరణ పత్రాలు అందజేశారు. అయితే ఇప్పుడు టీడీపీ నేతలకు సంబంధించిన భూములను మినహాయించడంపై రైతులు ప్రశ్నిస్తే.. వారు రికార్డులు అందజేశారు, మీరు ఇవ్వలేదంటూ రెవెన్యూ అధికారులు బుకాయిస్తున్నారని, ఇది దారుణమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకున్న ఒకే ఒక జీవనాధారమైన ఈ భూములే లేకుండా పోతే, తమకు ఆత్మహత్యలే శరణ్యమంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ స్పందించి తమకు న్యాయం చేయాలంటూ వారు విజ్ఞపి చేస్తున్నారు. -
రేపటి నుంచి రెండో విడత
సాక్షి, హైదరాబాద్: తొలి విడతలో పాస్ పుస్తకాలు, రైతు బంధు చెక్కులు తీసుకోని రైతుల కోసం రెండో విడతగా ఈనెల 21 నుంచి మండల కేంద్రాల్లో పంపిణీ జరగనుంది. షెడ్యూల్ ప్రకారం ఈనెల 10 నుంచి 19 వరకు రాష్ట్రవ్యాప్తంగా 10 వేలకు పైగా రెవెన్యూ గ్రామాల్లో రైతులకు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. మొత్తం 51 లక్షలకు పైగా పుస్తకాలు పంపిణీ చేయాల్సి ఉండగా, 40 లక్షల వరకు రైతులు తీసుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల దాదాపు 20 శాతం మంది పాస్ పుస్తకాలను తీసుకోలేదని రెవెన్యూ యంత్రాంగం లెక్కలు వేసింది. దీంతో వారికి రెండో విడతలో పంపిణీ చేయనున్నారు. ఆధార్‌తోపాటు ఆధారం కూడా.. వాస్తవానికి ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసిన పంపిణీ కార్యక్రమంలోనే రైతులు తమ భూములకు సంబంధించిన పాస్ పుస్తకాలు, రైతుబంధు చెక్కులు తీసుకున్నారు. అయితే స్థానికంగా నివాసం ఉండని వారు, ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాల్లో ఉండి ఇక్కడ భూములున్న వారు, తమ గ్రామంలో పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన రోజున వెళ్లలేని వారు తీసుకోలేదు. ఇలా పాస్ పుస్తకాలు తీసుకోని రైతులు సగటున 20 శాతం మంది వరకు ఉంటారని అంచనా. రంగారెడ్డి జిల్లాలో ఇది 30 శాతం వరకు ఉన్నట్లు సమాచారం. వీరి కోసం స్పెషల్ డ్రైవ్ ఉంటుందని రెవెన్యూ శాఖ మొదటి నుంచీ చెబుతున్నా రైతుల్లో కొంత సందేహం ఉండేది. ఈ సందేహాన్ని నివృత్తి చేస్తూ ఈనెల 21 నుంచి అన్ని జిల్లాల్లో మలి విడత (పాస్ పుస్తకాలు తీసుకోని రైతులకు) పంపిణీ ప్రారంభించాలని సీసీఎల్ఏ నుంచి జిల్లాలకు ఆదేశాలు వెళ్లాయి. ఈ మేరకు అన్ని జిల్లాల్లో సోమవారం నుంచి ప్రక్రియ ప్రారంభం కానుంది. గ్రామంలో పాస్ బుక్కు తీసుకోని రైతులు తమ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుందని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. మిగిలిపోయిన పాస్ పుస్తకాలను పంపిణీ చేసేందుకు అక్కడ సిబ్బంది అందుబాటులో ఉంటారని, వారికి ఆధార్ కార్డుతోపాటు ఇతర ఆధారాలు చూపిస్తే సదరు రైతు పాస్ పుస్తకం, రైతుబంధు చెక్కు అందజేస్తారని అంటున్నారు. ఈ నేపథ్యంలో గ్రామాల్లో పాస్ పుస్తకాలు తీసుకోని రైతులు మండలాలకు మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. షెడ్యూల్ ప్రకారం పాస్ పుస్తకాలు, చెక్కుల పంపిణీ పూర్తయిందని, ఇక గ్రామాల్లో పంపిణీ ఉండదని రెవెన్యూ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. -
‘వారి పాలన రైతులకు చుక్కలు చూపించింది’
సాక్షి, రాజన్న సిరిసిల్ల: మంత్రి కేటీఆర్, ఎంపీ వినోద్ కుమార్ జిల్లాలోని బోయినపల్లి మండలం విలాసాగర్లో మంగళవారం రైతు బంధు చెక్కులు, పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్, టీడీపీ పాలన రైతులకు చుక్కలు చూపిస్తే, టీఆర్ఎస్ ప్రభుత్వం చెక్కులు ఇస్తుందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం 50 ఏళ్ళు అధికారంలో ఉండి రైతులకు ఐదు రూపాయల సహాయం చేయలేదని, కానీ నాలుగేళ్ళ టీఆర్ఎస్ పాలనలో నాలుగు వేల చెక్కు ఇస్తున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ పెద్దలు జానారెడ్డి మాటలు వింటే బాదేస్తుందని, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డిలా గడ్డం పెంచుకుంటే సన్నాసుల్లో కలుస్తారు తప్ప సమస్యలు పరిష్కారం కావని తెలిపారు. రెండు లక్షల వరకు పంట రుణం మాఫీ చేస్తామంటున్న కాంగ్రెస్ నాయకులకు రైతుల గురించి మాట్లాడే అర్హత లేదని ఆయన అన్నారు. రైతు మోహంలో ఎప్పూడూ సంతోషం ఉండడమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. రైతు బంధు పథకంతో దేశానికే తెలంగాణ ఆదర్శంగా మారిందని కేటీఆర్ అన్నారు. దేశంలో హరిత విప్లవానికి తెలంగాణా కేంద్ర బిందువు అవుతుందని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న 46 వేల చెరువులు నింపేందుకు మిషన్ కాకతీయ ద్వారా కృషి చేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ 86 ఏళ్ల తర్వాత భూ రికార్డుల ప్రక్షాళన చేసి 60 లక్షల మంది రైతులకు కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు ఇస్తున్న నాయకుడని కొనియాడారు. తెలంగాణలో కోటి 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే బృహత్తర కార్యక్రమానికి కేసీఆర్ కంకణం కట్టుకున్నారని తెలిపారు. వ్యవసాయానికి ఉపాధి హామీని అనుసంధానం చేసే విధంగా కేంద్రం నిర్ణయం తీసుకోవాలన్నారు. -
నకిలీ పాస్ పుస్తకాలు ఇస్తే పీడీయాక్ట్
సాక్షి, యాదాద్రి : నకిలీ పాస్‌పుస్తకాలు, నకిలీ రిజిస్ట్రేషన్లు చేస్తే పీడీయాక్ట్ నమోదు చేస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి మహమూద్ అలీ హెచ్చరించారు. శుక్రవారం రాత్రి భువనగిరి మండలం హన్మాపురంలో జరిగిన రైతుబంధు పథకం సభలో ఆయన వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద రైతు కావడం వల్లే రైతుల సంక్షేమం కోసం పాటుపడుతున్నారని పేర్కొన్నారు. ఆంధ్రాపరిపాలన అంతా అంధేరి పాలనగా సాగిందన్నారు. మన ముఖ్యమంత్రి రైతుల సంక్షేమానికి బడ్జెట్లో రూ. 12వేల కోట్లు కేటాయించారన్నారు. రైతుబంధు పథకం ద్వారా 58 లక్షల మంది రైతులకు చెక్కులు ఇస్తున్నామన్నారు. భూరికార్డుల ప్రక్షాళనను రెవెన్యూ సిబ్బంది 95 శాతం పూర్తి చేశారని అభినందించారు.100శాతం భూ వివాదాలు లేకుండా రికార్డుల ప్రక్షాళన చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి పోచా రం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రైతులకు నీళ్లు, కరెంటు, పెట్టుబడి సాయం, పంటకు మద్దతు ధర ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. రైతు సమన్వయ సమితి వేదికలకు రూ. 300ల కోట్లు కేటాయించామన్నారు. రూ.12 లక్షలతో ఒక మోడల్ రైతు వేదిక నిర్మిస్తామన్నారు. తెలంగాణ దేశంలోనే మోడల్రాష్ట్రంగా ఎదుగుతుందన్నారు. రైతు కష్టాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి వారి సమస్యలను తీరుస్తుంటే కాంగ్రెస్ వాళ్లు ఆగమాగం అవుతున్నారని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 18 లక్షల ఆయకట్టు స్థిరీకరణ, 20లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు కల్పించబోతున్నామన్నారు. ఇంతవరకు పాలించిన ప్రధానులు, ముఖ్యమంత్రులు రైతుల కష్టాలను పట్టించుకోలేదని విమర్శించారు. లక్షల అప్పులు రైతులకు మిగిల్చారని ఆరోపించారు. హన్మాపురం గ్రామంలో 555 రైతులకు రూ. 45.18.085 లక్షలను రైతు బంధు ద్వారా ఇస్తున్నామన్నారు. రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా సుకేందర్‌రెడ్డి మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా వ్యవసాయ రంగానికి దశదిశను చూపించే రైతుబంధు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టారన్నారు. 58 లక్షల మంది రైతులకు మొదటి విడతలో రూ.5,700ల కోట్లు, రెండవ విడతలో నవంబర్ 18న రూ. 5,700ల కోట్లు పెట్టుబడి సాయం అందిస్తున్నామన్నారు. రైతుల బీమాకోసం రూ. 500ల కోట్లు సీఎం కేటాయించారన్నారు. సభకు అధ్యక్షత వహించిన భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ రైతుబంధు కార్యక్రమం పండుగ వాతావరణంలో జరుగుతుందన్నారు. రైతు బంధు చెక్కులు తీసుకున్న రైతుల కళ్లల్లో ఆనందం కనిపిస్తుందన్నారు. తనకు వచ్చే రైతు బంధు చెక్కుల మొత్తాన్ని రైతు సమన్వయ సమితికి ఇచ్చేస్తానన్నారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజీవ్ త్రివేది, వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పార్థసారథి, భూరికార్డుల ప్రక్షాళన రాష్ట్ర అధికారి వాకాటి కరుణ, కలెక్టర్ అనితారామచంద్రన్, రాచకొండ సీపీ మహేష్ భగవత్, రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్ కొలుపుల అమరేందర్‌తోపాటు గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ జడల అమరేందర్, గ్రామ సర్పంచ్ వెంకటేష్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
రైతుబంధు పధకం అన్నదాతలకు వరం
-
‘పెట్టుబడి’ పంపిణీకి సర్వం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: రైతుబంధు, పాస్‌పుస్తకాల పంపిణీకి సర్వం సిద్ధం చేశామని డిప్యూటీ సీఎం, రెవెన్యూ మంత్రి మహమూద్ అలీ, ఎంపీ, రైతు సమన్వయ సమితి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం సచి వాలయంలో రైతుబంధు, రైతు పాస్‌పుస్తకాల పంపిణీపై మీడియా సమావేశం జరిగింది. మహమూద్ అలీ మాట్లాడుతూ దేశంలో ఎవరూ చేయలేని పనిని సీఎం కేసీఆర్ రైతుల కోసం రైతుబంధు పేరుతో చేస్తున్నారన్నారు. ఈ నెల 10న హుజూరాబాద్‌లో రైతుబంధు, పాస్‌పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభిస్తారన్నారు. 1.4 కోట్ల ఎకరాలకు 58.06 లక్షల చెక్కులు, రూ.5,608.09 కోట్లు పంపిణీ చేయాల్సి ఉండగా.. ముందుగా 1.3 కోట్ల ఎకరాల్లో 56.14 లక్షల ఎకరాలకు 5,392.29 కోట్లు పంపిణీ చేస్తారన్నారు. మొత్తం 10,823 గ్రామాల్లో పంపిణీ కార్యక్రమానికి ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలు, పంచాయతీరాజ్ బిల్డింగ్, ప్రభుత్వ స్థలాల్లో ఏర్పాట్లు చేశామన్నారు. రైతులకు ఇబ్బందులు రాకుండా మంచినీళ్లు, టెంట్ లాంటివి ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. చెక్కులు రైతుకే ఇవ్వాలని, రైతు అక్కడికి రాకుంటే రైతు ఇంటికెళ్లి చెక్కులు ఇవ్వాలని సూచించామన్నారు. పాస్‌పుస్తకాల ముద్రణకు 8 కంపెనీలు ముందుకొచ్చాయని, టెండర్ల ద్వారా ఈ–ప్రక్రియ జరిగిందన్నారు. ముద్రణ టెండర్‌ను మద్రాసు కంపెనీ దక్కించుకుందన్నారు. గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లా డుతూ రైతులకు కొత్త పాస్‌పుస్తకాలు ఇవ్వాలన్నది కేసీఆర్ గొప్ప ఆలోచనని కొనియాడారు. పాస్‌పుస్తకాల ముద్రణలో కొన్ని తప్పులుంటే వాటిని కలెక్టర్ కార్యాలయంలో సవరిస్తారన్నారు. దీనిపై ప్రతిపక్షాలు అర్థంలేని ఆరోపణలు చేస్తున్నాయని తేల్చి చెప్పారు. దీన్ని మీడియా భూతద్దంలో చూపొద్దని, ఈ గొప్ప కార్యక్రమంలో మీడియా కూడా పాలుపంచుకోవాలని కోరారు. ఆధార్, పాస్‌పోర్టు, డ్రైవింగ్లైసెన్స్, ఓటర్ ఐడీకార్డు చూపించి రైతుబంధు చెక్, పాస్‌పుస్తకాలు తీసుకోవచ్చని అన్నారు. మొత్తం రూ.90 కోట్లతో ముద్రణ జరిగితే 80 కోట్ల కుంభకోణం జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపణలు చేయడం విడ్డూరమన్నారు. వ్యవసాయం చేయనివాడు చెట్టుమీద ఉండి ఏదైనా మాట్లాడొచ్చని, ఇది మంచి పద్ధతి కాదని హితవు పలికారు. ఎనిమిది జాతీయ బ్యాంకుల ద్వారా డబ్బులు సమకూర్చామని అన్నారు. మూడు నెలల్లోపు రైతు ఎప్పుడైనా చెక్‌ను బ్యాంకులో వేసుకోవచ్చని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు ఈ ఎనిమిది రోజుల కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు, సభ్యులు పాల్గొంటారన్నారు. -
రూ.80 కోట్లు దోచుకున్నారు
సాక్షి, హైదరాబాద్ : రైతు పాస్‌పుస్తకాల ముద్రణలో భారీ కుంభకోణం చోటు చేసుకుందని, రూ.80 కోట్ల దోపిడీ జరిగిందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ) అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. బతుకమ్మ చీరల తరహాలో జరిగిన ఈ కుంభకోణంపై న్యాయవిచారణ జరపాలని డిమాండ్ చేశారు. సోమవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ అత్యంత భద్రతాప్రమాణాలతో పాస్‌పుస్తకాలను ముద్రిస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రగల్భాలు పలికారని, ఇప్పుడు ఆ భద్రతా ప్రమాణాలు లేకుండానే నాసిరకం పుస్తకాలను ముద్రిస్తున్నారని విమర్శించారు. ఈ పుస్తకాల ముద్రణ టెండర్లను ప్రభుత్వ ప్రెస్‌లకు కాకుండా పనికిరాని ప్రైవేటు కంపెనీలకు ఇచ్చారని, నాలుగు కంపెనీల్లో రెండింటిపై ఇదివరకే అనర్హత వేటు పడిందని పేర్కొన్నారు. 26 భద్రతా ప్రమాణాలతో, వాటర్, ట్యాంపర్ ప్రూఫ్ పుస్తకాలను ఇస్తామని కేసీఆర్ అసెంబ్లీలో చెప్పారని, ఇప్పుడు ఆ ఫీచర్లను 18కి కుదించారని, ఏ ప్రూఫ్‌కు దిక్కులేదని ఎద్దేవా చేశారు. ఈ పాస్‌పుస్తకాల కోసం రైతుల నుంచి రూ.160 వసూలు చేస్తున్నారని, కానీ, ఈ పుస్తకాలను బయటి ప్రింటర్లు రూ.50కే ఇస్తామని చెబుతున్నారని అన్నారు. ఇలా 71 లక్షల పాస్‌పుస్తకాల ముద్రణకుగాను రూ.80 కోట్లు దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. పాస్‌పుస్తకాల భద్రతా ప్రమాణాలపై రాజీపడొద్దని, ఈ విధంగా పుస్తకాలను ముద్రిస్తే నకిలీవి పుట్టుకొస్తాయని, ఫోర్జరీ అవుతాయని, అలా జరిగితే తమకు సంబంధం లేదని మింట్ కాంపౌండ్ ప్రెస్ అధికారులు చెప్పారని ఉత్తమ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో జరిగిన సమావేశాలకు ప్రెస్ జనరల్ మేనేజర్ రమాకాంత్ దీక్షిత్ హాజరయ్యారని, ఆయన పేరిట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాసిన లేఖలో ఈ విషయాన్ని స్పష్టం చేశారని, తాము ముద్రణ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు చెప్పారని తెలిపారు. కేసీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలన్నీ, ఈ ప్రభుత్వం కుంభకోణాల ప్రభుత్వంగా మారిపోయిందని విమర్శించారు. ఈ కుంభకోణంపై న్యాయవిచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోనికి వస్తాయన్నారు. -
చిన్న రైతులు బలి ?
సాక్షి, అమరావతి బ్యూరో: రెంటచింతల మండలంలోని మిట్టగుడిపాడు గ్రామంలో సంచలనం రేకెత్తిస్తున్న పట్టాదారు పాస్ పుస్తకాల బాగోతంలో ఉన్నతాధికారులు పెద్ద చేపల్ని వదిలేసి చిన్న రైతులపై ప్రతాపాన్ని చూపుతున్నారు. గ్రామానికి చెందిన ముగ్గురు బీసీ రైతులు రెండు దశాబ్దాల కిందట బతుకుదెరువు కోసం ప్రభుత్వ పోరంబోకు భూమికి పట్టాలు ఇప్పించాలంటూ స్థానిక అధికారులకు అర్జీలు దాఖలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన మరో రైతు గొట్టం సుబ్బారెడ్డి కూడా తమ పూర్వీకులకు సంబంధించిన సర్వే నంబర్ 164/బీ /ఎ భూమిని తన కుమారుడు నాసర్‌రెడ్డికి తన ద్వారా ఆయన భార్య పద్మజకు బదిలీ చేస్తూ రిజిస్టర్ డాక్యుమెంట్స్ ప్రకారం పాస్ పుస్తకం తీసుకున్నారు. అయితే 164/బీ/ఎకు బదులు పొరపాటున 163వ సర్వే నంబర్‌పై భూమి బదలాయిస్తూ పట్టాదారు పాస్ పుస్తకాన్ని అధికారులు పై ముగ్గురు రైతులతో కలిపి జారీ చేశారు. ఇదే సమయంలో మరో రైతు రాయ నాగిరెడ్డి కూడా తన పూర్వీకుల నుంచి సంక్రమించిన భూమికి పాస్ పుస్తకం తీసుకుని అప్పులుపాలై విక్రయించగా మిగిలిన సుమారు 25 సెంట్ల భూమిని కలిగి ఉన్నారు. రాజకీయ కక్ష సాధింపు చర్య పార్టీ రంగు పులిమి అప్పటి వీఆర్వో మేకపోతుల కృష్ణారెడ్డిని, అప్పటి తహసీల్దార్ శేషగిరిరావు, అప్పటి ఆర్ఐ ప్రసాద్‌రావు , గొట్టం సుబ్బారెడ్డి , మిగిలిన రైతుల్ని కార్యాలయానికి గత డిసెంబర్లో పిలిపించి ప్రస్తుత తహసీల్దార్ జి.లెవి విచారించారు. పట్టాదారు పాస్ పుస్తకాలు కలిగిన ఐదుగురితో పాటు అప్పటి వీఆర్వో మేకపోతుల కృష్ణారెడ్డి, గొట్టం సుబ్బారెడ్డి, గొట్టం నాసరరెడ్డిపై ఎస్ఐ యాదాల కోటేశ్వరరావు చర్యలు తీసుకోవడం విస్మయం కలిగిస్తోంది. అసలు పాస్‌పుస్తకం జారీ కావాలంటే వీఆర్వో, ఆర్ఐ, తహసీల్దార్, ఆర్డీవో అధికారుల సంతకాలు తప్పనిసరి. అయితే, ఈ కేసులో రైతుల్ని , వీఆర్వోలను బలి చేయడం కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యగా భావిస్తున్నారు. అసలు ఈ కేసుకు సంబంధించి బాధ్యులైన ఆర్ఐ ప్రసాదరావు, తహసీల్దార్ శేషగిరిరావు, ఆర్డీవో శ్రీనివాస్‌పై చర్యలు తీసుకోవకపోవడం ఆశ్చర్యకరం. ఈవిషయమై మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గుంటూరు రూరల్ ఎస్పీ అప్పలనాయుడు, గురజాల డీఎస్పీ కె.వి.వి.ఎన్.వి. ప్రసాద్ దృష్టికి తీసుకెళ్లి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. -
పాస్ పుస్తకాల ముద్రణ టెండర్లలో గోల్మాల్
-
పాస్ పుస్తకాల టెండర్లలో గోల్మాల్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయ భూములకిచ్చే పాస్‌పుస్తకాల ముద్రణ టెండర్లలో గోల్మాల్ జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి. టెండర్ నిబంధనలకు విరుద్ధంగా కనీసం సాంకేతిక బిడ్‌లో అర్హత కూడా సాధించని ఏజెన్సీలకు, ఏపీ ప్రభుత్వం బ్లాక్‌లిస్టులో పెట్టిన ఏజెన్సీకి ముద్రణ బాధ్యతలివ్వడం విమర్శలకు తావిస్తోంది. అత్యంత పకడ్బందీగా, సెక్యూరిటీ ఫీచర్లతో ఇవ్వాల్సిన పాస్ పుస్తకాల ముద్రణకు టెండర్లను ఇటు అర్హత, అటు అనుభవమూ లేని కంపెనీలకు ఇష్టారాజ్యంగా కట్టబెట్టడం విమర్శలకు తావిస్తోంది. ఎడాపెడా కట్టబెట్టారు రాష్ట్రంలో 65 లక్షల కమతాలకు పాస్ పుస్తకాలివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు రెండుసార్లు టెండర్లు పిలిచినా ఏ కంపెనీ ముందుకు రాకపోవడంతో నామినేషన్ విధానంలో కేంద్ర అధీనంలోని సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్‌కు బాధ్యతలిచ్చింది. అయితే అన్ని లక్షల పుస్తకాలను తాము హడావుడిగా ముద్రించలేమని, ఏప్రిల్ నెలాఖరుకల్లా వీలవుతుందని ప్రెస్ అధికారులు చెప్పడంతో ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. మళ్లీ టెండర్లు పిలవగా 9 ఏజెన్సీలు టెండర్లు వేశాయి. వీటి ఖరారులో నిబంధనలను పాటించలేదనే ఆరోపణలొస్తున్నాయి. 9 టెండర్లు వస్తే అందులో 8 ఏజెన్సీలకు ముద్రణ బాధ్యతలివ్వడం గమనార్హం! టెండర్ నిబంధనల ప్రకారం ఎల్1 ఏజెన్సీకి 50 శాతం ముద్రణ బాధ్యతలివ్వాలి. మిగతా 50 శాతం పుస్తకాలను 20:20:10 నిష్పత్తిలో మరో మూడు ఏజెన్సీలకు ఎల్1 కోట్ చేసిన ధరకే ఇవ్వాలి. కానీ ఎల్1గా వచ్చిన మద్రాస్ సెక్యూరిటీ ప్రింటర్స్‌కు కేవలం 10.70 లక్షల (15 శాతం) పుస్తకాల ముద్రణ అప్పగించారు! పైగా సాంకేతిక బిడ్‌లో అర్హత పొందని వాటికీ టెండర్ ఖరారు చేశారు. అంతేగాక మీసేవల విషయంలో ఏపీ బ్లాక్‌లిస్టులో పెట్టిన మరో ఏజెన్సీని పట్టించుకోకుండా ఎంపిక చేశారు! పైగా దానికి ఎల్1తో సమానంగా పుస్తకాల ముద్రణ బాధ్యతలిచ్చారు! సాంకేతిక బిడ్‌లో బోర్లా పడ్డ మరో ఏజెన్సీకి ఓ మంత్రి, మరో ఎమ్మెల్సీ సిఫార్సుతో ఒక జిల్లాలోని 1.5 లక్షల పుస్తకాల ముద్రణ అప్పగించారు. ఇలా 8 ఏజెన్సీలకు పాస్ పుస్తకాల ముద్రణ అప్పగించి, ఏ జిల్లాలో పుస్తకాలను ఎవరు ముద్రించాలో జాబితా తయారు చేశారు. మంగళవారం నుంచే ముద్రణ మొదలైనట్టు తెలుస్తోంది. ‘సెక్యూరిటీ’ ప్రధానం కాదట! ఇదిలా ఉంటే, పాస్ పుస్తకాల ముద్రణ బాధ్యతల నుంచి తామెందుకు తప్పుకోవాల్సి వచ్చిందనే దానిపై కేంద్ర అధీనంలోని సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ కొత్త ట్విస్ట్ ఇచ్చింది. ముందుగా అనుకున్న ధరకు కాకుండా ఒక్కో పుస్తకానికి రూ.250 అడిగినందుకు ఒప్పందం రద్దు చేసుకున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం తెలిసిందే. కానీ, సెక్యూరిటీ విషయంలో రాజీ పడకూడదనే ఆలోచనతోనే ముద్రణ బాధ్యతల నుంచి తాము తప్పుకున్నామని ప్రెస్ జనరల్ మేనేజర్ రమాకాంత్ దీక్షిత్ స్పష్టం చేశారు. ఈ మేరకు రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి మార్చి 24న ఆయన లేఖ కూడా రాశారు. అంతేకాదు, ‘‘పాస్ పుస్తకాల ముద్రణలో మాకు సెక్యూరిటీ ప్రధానం కాదు. అవసరమైతే కొన్ని సెక్యూరిటీ ఫీచర్లను తగ్గించుకుని వీలైనంత త్వరగా పుస్తకాలను మాకు అందుబాటులోకి తెండి’’ అని ఫిబ్రవరి 22న జరిగిన సమావేశంలో టీఎస్టీఎస్ ఎండీ చెప్పారంటూ ఆ లేఖలో ఆయన పేర్కొనడం గమనార్హం!! -
ఆధార్ అనుసంధానానికి రైతుల వెనుకంజ!
సాక్షి, హైదరాబాద్: కొత్త పాస్ పుస్తకాల జారీ కోసం ఆధార్ నంబర్ ఇచ్చేందుకు కొందరు రైతులు వెనుకాడుతున్నారు. రాష్ట్రంలో ఉన్న మొత్తం రైతు ఖాతాల్లో కేవలం 75 శాతం మాత్రమే ఖాతాలు ఆధార్‌తో అనుసంధానమయ్యాయని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. మరో 10 శాతం వరకు ఆధార్ వివరాలు వచ్చే అవకాశముందని, మిగిలిన 15 శాతం మేర అనుసంధానం కష్టమేనని క్షేత్రస్థాయి రెవెన్యూ సిబ్బంది చెబుతున్నారు. అంటే ఆధార్ నమోదు చేయని 15 శాతం రైతు ఖాతాలకు పెట్టుబడి సాయం అందదన్నమాట. వెనుకంజ ఎందుకో.. ఆధార్ వివరాలు ఇచ్చేందుకు నిరాకరించడం వెనుక పలు కారణాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తమ భూమికి సంబంధించిన రికార్డులను నమోదు చేయించుకునేందుకు ఆసక్తి చూపిన స్థానికేతర రైతులు ఆధార్ వివరాలు ఇవ్వడం లేదని రెవెన్యూ సిబ్బంది అంటున్నారు. భూ రికార్డుల ప్రక్షాళన సమయంలో తమ భూమి ఉన్న గ్రామానికి వచ్చి వెళ్లిన రైతులు ఆ తర్వాత కనిపించడం లేదని పేర్కొంటున్నారు. పెట్టుబడి సాయం వద్దనుకునే వారు.. ఆధార్ నంబర్ ఇస్తే తమ ఆస్తులన్నీ ఎక్కడ బయటపడి పోతాయనే భయంతో కూడా అనుసంధానానికి వెనుకంజ వేస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా నల్లధనంతో భూములు కొనుగోలు చేసిన వారు మాత్రం ఆధార్ ఇచ్చేందుకు ససేమిరా అంటున్నారని రెవెన్యూ యంత్రాంగం అంటోంది. ఒక్కసారి ప్రభుత్వానికి ఆధార్ నంబర్ ఇస్తే, తర్వాత కొనుగోలు చేసే ఆస్తుల వివరాలన్నీ తెలుస్తాయనే ఆలోచనతో కొంత మంది ఆధార్ ఇవ్వడానికి వెనుకాడుతున్నారని సమాచారం. ఆధార్ నమోదు సమయంలోనే కొందరు తమ వివరాలను ఎలాంటి ఇతర కార్యక్రమాల కోసం వాడకూడదనే ఆప్షన్‌ను ఎంచుకున్నారు. అలాంటి వారి వివరాల కోసం రెవెన్యూ సిబ్బంది వారి ఇళ్లకు వెళుతున్నామని చెబుతున్నారు. భూ రికార్డుల నమోదుకు కనిపించిన ఆసక్తి ఆధార్ అనుసంధానం విషయంలో కనపడకపోవడం గమనార్హం. పాస్‌పుస్తకం–ఆధార్ గణాంకాలివే.. రాష్ట్రంలోని మొత్తం రైతు ఖాతాలు: 72,11,511 ఇప్పటివరకు ఆధార్ అనుసంధానం అయినవి: 53,34,769 ఆధార్ కార్డులివ్వని ఖాతాలు: 18,76,742 ఆధార్ ఇచ్చినా ఫొటోలు కనిపించని ఖాతాలు: 2,65,600 ఆధార్ ఆమోదం లభించని ఖాతాలు: 1,36,849 -
కొత్త పాసు పుస్తకాల ముద్రణ ఒప్పందం రద్దు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రైతులకు కొత్త పాసు పుస్తకాల జారీకి సంబంధించి పెద్ద అవాం తరమే ఎదురైంది. వచ్చే నెల 11న రాష్ట్ర వ్యాప్తం గా రైతులందరికీ కొత్త పాసు పుస్తకాలను అంద జేసే ఆలోచనలో ఉన్న ప్రభుత్వానికి కేంద్ర సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ మెలిక పెట్టింది. గత ఒప్పందం ప్రకారం రూ.200కు ఓ పాసు పుస్తకం ఇవ్వాల్సి ఉండగా, ప్రింటింగ్ ప్రారంభించాల్సిన సమయంలో పాసు పుస్తకానికి రూ.250 ఇవ్వాలని ప్రెస్ అధికారులు పట్టుబట్టినట్టు సమాచారం. దీంతో పాటు మార్చి 11 కల్లా తాము పాసు పుస్తకాలను ఇవ్వలేమని, ఏప్రిల్ 30 వరకు గడువు కావాలని మెలిక పెట్టారని, అందుకే టెండర్లు రద్ద య్యా యని ప్రభుత్వ వర్గా లు చెబుతున్నాయి. ఈ విషయంలో కేంద్ర ప్రింటింగ్ ప్రెస్ తీరుపై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకుని, కొత్త టెండర్లు పిలవాలని ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర సంస్థ నిర్వాకంతో పాసు పుస్తకాల పంపిణీని వాయిదా వేయాల్సి వచ్చిం దని ఆయన వ్యాఖ్యానించినట్టు సమాచారం. సీఎం ఆదేశాలతో రాష్ట్ర టెక్నలాజికల్ సర్వీసెస్ (టీఎస్టీఎస్) హుటాహుటిన కొత్త టెండర్ షెడ్యూల్‌ను తయారు చేసింది. దీనిప్రకారం ఈ నెల 23 నుంచి మార్చి 2న మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆన్లైన్లో బిడ్లను స్వీకరిస్తారు. అదేరోజు మధ్యాహ్నం బిడ్లు ఓపెన్ చేస్తారు. -
ఏసీబీ ఉచ్చులో వీఆర్వో
దాచేపల్లి: పాసు పుస్తకాల కోసం ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటున్న వీఆర్వోను దాచేపల్లిలో ఏసీబీ అధికారులు శుక్రవారం రాత్రి పట్టుకున్నారు. గామాలపాడు వీఆర్వోగా పనిచేస్తున్న కొత్తపల్లి బెంజిమెన్ యిరికేపల్లికి చెందిన ఆవుల శ్రీనివాసరావు దగ్గర రూ.4వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ డిఎస్పీ సీహెచ్. దేవానంద్ శాంతో, సీఐలు వెంకటేశ్వరరావు, ఫిరోజ్‌లు పట్టుకున్నారు. డీఎస్పీ కథనం ప్రకారం సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. యిరికేపల్లికి చెందిన ఆవుల శ్రీనివాసరావు తండ్రి మల్లయ్య, భార్య ప్రియాంకల పేరుమీద గామాలపాడు శివారులో ఉన్న 1.70ఎకరాల పొలానికి పాసు పుస్తకాల కోసం వీఆర్వోను ఆశ్రయించారు. గతేడాది ఆక్టోబర్‌లో మీసేవలో ఆయన దరఖాస్తు చేసుకోగా డిసెంబర్లో వీరి పేరుమీద పుస్తకాలు వచ్చాయి. వాటిని ఇవ్వాలంటే ఒక్కోదానికి రూ.3వేల చొప్పున ఇవ్వాలని శ్రీనివాసరావును వీఆర్వో డిమాండ్ చేశాడు. ఒక్కోదానికి రూ.2వేల చొప్పున ఇస్తానని ఒప్పందం చేసుకున్నాడు. ఈ క్రమంలో వీఆర్వో కు లంచం ఇవ్వడం ఇష్టంలేని శ్రీనివాసరావు ఏసీబీ అధికారుల్ని ఆశ్రయించారు. బెంజిమెన్ ఉంటున్న ఇంట్లో శ్రీనివాసరావు నుంచి రూ. 4వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్‌హ్యాండ్‌గా పట్టుకున్నారు. బాధితుడి నుంచి ఏసీబీ అధికారులు సేకరించారు. తహసీల్దార్ డి. మల్లికార్జునరావు సంఘటన స్థలానికి వచ్చారు. ప్రభుత్వ అధికారులు లంచం అడిగితే ఏసీబీ అధికారులకు సమాచారం ఇవ్వాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని డీఎస్పీ దేవానాంద్ తెలిపారు. -
పాత పాస్ పుస్తకాలేనా..?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతులకు హైసెక్యూరిటీ ఫీచర్లతో పాస్ పుస్తకాలు ఇవ్వాలన్న ప్రభుత్వ యోచన సందిగ్ధంలో పడింది. అధునాతన పాస్ పుస్తకాల ముద్ర ణపై ప్రైవేటు కంపెనీలు స్పందించకపో వడం, ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్‌లు కూడా ముందుకు రాకపోవడంతో.. పాత తరహా పుస్తకాలతోనే సరిపెట్టు కోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. దీంతో కొన్ని సెక్యూరిటీ ఫీచర్ల ను తగ్గించి పాస్ పుస్తకాలను ముద్రించే దిశ గా ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్ అధికారులతో రెవెన్యూ ఉన్నతాధికారులు మంతనాలు జరుపుతున్నారు. దీనిపై ఒకటి రెండు రోజుల్లో తుది నిర్ణయం వెలువడనుంది. భూప్రక్షాళన నేపథ్యంలో.. భూరికార్డుల ప్రక్షాళన అనంతరం వచ్చిన వివరాల ఆధారంగా రాష్ట్రంలోని రైతులం దరికీ కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అత్యంత భద్రతా ప్రమాణాలతో కూడిన 75 లక్షలకుపైగా పుస్తకాల ముద్రణ కోసం గత నెలలో టెండ ర్లను ఆహ్వానించింది. గత నెల 22 వరకు గడువు ఇచ్చింది. కానీ బిడ్లు రాకపోవడంతో 29వ తేదీ వరకు ఒకసారి, ఫిబ్రవరి 1 వరకు మరోసారి పొడిగించింది. అయినా ఒక్క బిడ్ కూడా దాఖలు కాలేదు. అటు గతంలో పాస్ పుస్తకాలను ముద్రించిన మద్రాస్ సెక్యూరిటీ ప్రింటింగ్ (ఎంఎస్పీ) ప్రెస్ కూడా రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలను చూసి వెనక్కు తగ్గింది. దాదాపు 20 సెక్యూరిటీ ఫీచర్లతో 20 పేజీలతో కూడిన 75 లక్షల పాస్ పుస్తకాలను 21 రోజుల్లో ముద్రించి ఇవ్వాలన్న నిబంధన కారణంగా ప్రైవేటు కంపెనీలన్నీ వెనుకడుగు వేసినట్లు చెబుతున్నారు. రంగంలోకి రాజీవ్‌శర్మ.. పాస్ పుస్తకాల ముద్రణకు ఒక్క బిడ్ కూడా రాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌శర్మ రంగంలోకి దిగారు. రెవెన్యూ ఉన్నతాధికారులతో భేటీ అయి, ప్రత్యామ్నా యాలపై చర్చించి సీఎంకు సమాచారమి చ్చారు. దీంతో ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్లోనే పాస్ పుస్తకాలను ముద్రించాలని సీఎం సూచించారు. ఈ మేరకు రెవెన్యూ ఉన్నతాధి కారులు మూడు, నాలుగు రోజులుగా ప్రింటింగ్ ప్రెస్ అధికారులతో చర్చలు జరుపుతున్నారు. కానీ ప్రభుత్వం కోరుతున్న సెక్యూరిటీ ఫీచర్ల విషయంలో ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్ అధికారులు కూడా చేతులెత్తేసినట్టు సమాచారం. ముఖ్యంగా పాస్ పుస్తకం దిగువ భాగంలో వినియోగించా ల్సిన పలుచని వస్త్రాన్ని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుందని, దీనితోపాటు మరికొన్ని సెక్యూరిటీ ఫీచర్ల విషయంలోనూ ఇబ్బంది వస్తుందని తేల్చి చెప్పినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని మింట్ కాంపౌండ్ ముద్రణాలయంలో పాస్ పుస్తకాలను ముద్రించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇందులో రోజుకు రెండున్నర లక్షల వరకు పాస్ పుస్తకాలను ముద్రించే సౌలభ్యం ఉండడంతో.. కొన్ని సెక్యూరిటీ ఫీచర్లను తగ్గించి ముద్రణ బాధ్యత అప్పగించనున్నట్లు సమాచారం. దీనిపై ఒకటి రెండు రోజుల్లోనే తుది నిర్ణయం తీసుకోనున్నారు. మొత్తంగా రైతులకు పాత తరహా పాస్ పుస్తకాలే కొత్తగా ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. -
పట్టణాల్లో ప్రక్షాళన!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అన్ని రకాల భూములకు సరైన లెక్కలుండాలని, ప్రతీ అంగుళం భూమికి ఎవరు యజమానో తేల్చాలని అధికారులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. భూ రికార్డుల ప్రక్షాళనతో గ్రామీణ ప్రాంతాల్లో భూముల వివరాల నిగ్గు తేలిందని, ఇదే తరహాలో పట్టణాలు, నగర ప్రాంతాల్లో కూడా భూముల వివరాలు తేల్చాలని స్పష్టం చేశారు. మార్చి 11న రాష్ట్రవ్యాప్తంగా కొత్త పాస్ పుస్తకాల పంపిణీ చేపట్టాలని నిర్ణయించినందున, ఆ నెల 5వ తేదీకల్లా పాస్ పుస్తకాలు జిల్లాలకు చేరేలా కార్యాచరణ రూపొందిం చుకోవాలని సూచించారు. కొత్త పాస్ పుస్తకాలు, పహాణీలు, భూ రికార్డుల ప్రక్షాళన, ధరణి నిర్వహణ తదితర అంశాలపై గురువారం ప్రగతి భవన్లో సీఎం సమీక్షించారు. ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ముఖ్య కార్యదర్శులు నర్సింగ్‌రావు, శాంతాకుమారి, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, ల్యాండ్ రికార్డుల విభాగం డైరెక్టర్ వాకాటి కరుణ, మీ సేవ కమిషనర్ వెంకటేశ్వర్రావు, రంగారెడ్డి కలెక్టర్ రఘునందన్ రావు, మేడ్చల్ కలెక్టర్ ఎంవీ రెడ్డి, ఎమ్మెల్యే ఆలం వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఎండీసీ చైర్మన్ శేరి సుభాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రైవేటు ఆస్తులకు ప్రత్యేక నంబర్లు ‘భూ రికార్డుల ప్రక్షాళన గొప్ప విజయం సాధించింది. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతీ అంగుళం భూమి లెక్క తేలింది. 93 శాతం భూముల విషయంలో స్పష్టత వచ్చింది. కోర్టు కేసులు, ఇతర వివాదాల్లో ఉన్న భూములకు సంబంధించి పార్ట్–బిలో నిర్ణయం జరుగుతుంది. ఈ ప్రక్షాళనతో గ్రామీణ ప్రాంతాల్లో భూ వివాదాలు తగ్గిపోతాయని భావిస్తున్నాం. పట్టణాలు, నగరాల్లో కూడా ఈ వాతావరణం రావాలి. ఇందుకు చేపట్టాల్సిన చర్యలపై అధ్యయనం చేయాలి. ప్రైవేటు ఆస్తులకు కూడా సర్వే నంబర్ల తరహాలో ప్రత్యేక నంబర్లు కేటాయించే విధానం తీసుకొచ్చే అంశాన్ని పరిశీలించాలి. తెలంగాణ భూ భాగంలోని ప్రతీ అంగుళం భూమి ఎవరి ఆధీనంలో ఉంది, అందులో ఎలాంటి కార్యకలాపాలు జరగుతున్నాయి.. తదితర వివరాలన్నీ ప్రభుత్వం వద్ద ఉండాలి’అని సీఎం అధికారులకు సూచించారు. భవిష్యత్తులో భూ వివాదాలకు తావులేకుండా రికార్డులన్నీ ప్రక్షాళన చేయడంతోపాటు వాటిని పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు. పాస్ పుస్తకంపై రైతు ఫొటో, ప్రత్యేక నంబర్ ‘పాస్ పుస్తకాలు, పహాణీల్లో ప్రస్తుతం 31 కాలమ్స్ ఉన్నాయి. కాలక్రమేణా వచ్చిన మార్పుల వల్ల చాలా కాలమ్స్ అవసరం లేదు. ప్రభుత్వం భూమి శిస్తు వసూలు చేసిన కాలంలో కొన్ని కాలమ్స్ అవసరం ఉండేది. ఇప్పుడు ఇవన్నీ ఉండటం వల్ల అనవసర గందరగోళం ఏర్పడుతుంది. రైతుల వద్ద ఉండే పాస్ పుస్తకాలు, పహాణీల్లో అన్ని వివరాలు అవసరం లేదు. అత్యవసరం అనుకున్న వివరాలుంటే చాలు. రైతు పేరు, ఖాతా నంబరు, సర్వే నంబరు, విస్తీర్ణం, భూమి పొందిన విధానం వంటి కొన్ని ముఖ్యమైన కాలమ్స్ ఉంటే సరిపోతుంది. పాస్ పుస్తకాల్లో, పహాణీల్లో పరభాషా పదాలు చాలా వాడుతున్నారు. అవి రైతులకు అర్థం కావు. కాబట్టి మన రైతులు వాడే పదాలనే పాస్ పుస్తకాలు, పహాణీల్లో వాడాలి. ఈ మార్పులతో కొత్త పాస్ పుస్తకాలు, పహాణీలు తయారు కావాలి’’అని సీఎం సూచించారు. ఈ మేరకు ఏ కాలమ్స్ ఉంచాలి, ఏ కాలమ్స్ తీసేయాలనే దానిపై విస్తృత చర్చ జరిపి నిర్ణయం తీసుకున్నారు. అందుకు అనుగుణంగానే కొత్త పాస్ పుస్తకాలు, పహాణీలు పంపిణీ చేయాలని, పాస్ పుస్తకంపైన ఖచ్చితంగా రైతు ఫోటో ఉంచాలని, ప్రతీ పాస్ పుస్తకానికి ప్రత్యేక నంబరు కేటాయించాలని నిర్ణయించారు. -
కొత్త పాస్ పుస్తకాల పంపిణీకి ముహూర్తం కుదిరింది
-
పైసలిస్తేనే.. పాస్‌బుక్!
పర్చూరు: పట్టాదారు పాసుపుస్తకాలకు ఎంతో కొంత ముట్టజెప్పందే మంజూరయ్యే పరిస్థితులు తహశీల్దారు కార్యాలయాల్లో కనిపించటం లేదు. ఇది రెవెన్యూశాఖలో బహిరంగ రహస్యం. అడంగల్‌లో పేరు మార్పు నుంచి.. పట్టాదారు పాసు పుస్తకాలు మంజూరయ్యే వరకు రెవెన్యూ కార్యాలయాల్లో ‘దక్షిణ’లు సమర్పించుకోవాల్సిందే.. లేకుంటే సవాలక్ష కొర్రీలె పెట్టి పాసు పుస్తకం కోసం పెట్టిన దరఖాస్తులను తిరస్కరిస్తున్నారు. రెవెన్యూలో ప్రతి పనికి ఒక రేటు నిర్ణయించేశారనే ఆరోపణలు నిపిస్తున్నాయి. భూమిపై యాజమాన్య హక్కును కల్పించే పట్టాదారు పాసుపుస్తకం రెవెన్యూ అధికారులకు కాసులు కురిపిస్తోంది. భూముల ధరలు పెరగడంతో పట్టాదారు పాసుపుస్తకం అనివార్యమైంది. ఇదే అదునుగా రెవెన్యూశాఖలో కొందరు క్షేత్రస్థాయి సిబ్బంది అవినీతి దుకాణం తెరిచేశారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. మీ సేవాలో దరఖాస్తు చేసుకున్నప్పటికీ రెవెన్యూ సిబ్బందిని సంతృప్తి పరచకపోతే తిరస్కరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అడంగల్ పేరు మార్పు నుంచే...! భూమి కొనుగోలుకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్యాత రెవెన్యూ రికార్డుల్లోని అడంగల్‌లో పేరు మార్చుకోవాల్సి ఉంటుంది. అందుకు దరఖాస్తు చేసుకున్న తరువాత సంబంధిత ఫైలు వీఆర్వోల పరిశీలనకు వెళుతుంది. ఇక్కడ నుంచే అసలైన కథ మొదలవుతుంది. ఏవరైతే దర ఖాస్తు చేసుకున్నారో వారు వీఆర్వోను కలిసి చేతులు తడపకపోతే కొద్దిరోజుల పాటు పెండింగ్ ఉంచి అనంతరం తిరస్కరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అడంగల్ పేరు మార్పు కాకుండా పాసుపుస్తకానికి దరఖాస్తు చేసుకోలేని పరిస్థితి ఉండడంతో దరఖాస్తుదారులు రెవెన్యూ అధికారులకు సంతర్పణలు చేసుకుంటున్నారు. తహశీల్దారు కార్యాలయాల్లోని వీఆర్వోలు అన్నీ సక్రమంగా ఉంటే వెయ్యి రూపాయిల నుంచి 5 వేలు వరకు వసూలు చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. అదే వివాదాస్పద భూములకైతే రూ. 20 వేలు సమర్పించిన తర్యాతే అడంగల్ లో పేరు మార్పు, అనంతరం పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు అవుతోందనే ప్రచారం జరుగుతోంది. క్షేత్రస్థాయి పరిశీలన కరువు.. పట్టాదారు పాసుపుస్తకం మంజూరుకు తహశీల్దారు స్థాయి అధికారి నేరుగా సంబంధిత పొలాన్ని పరిశీలించాలి. ఈ విధానం అమలు కావడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వీఆర్వో లే అన్ని పనులు చక్కబెట్టి సీటుకు ఒక రేటు ప్రకారం అందించేస్తున్నారు. దీంతో అధికారులు కార్యలయాలకే పరిమితమై సంతకాలతో పని ముగించేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాంకేతికంగా ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా రెవెన్యూ వ్యవస్థకు పట్టిన అవినీతి కంపు మాత్రం వీడడం లేదు. ఈ విషయంపై ఆర్డీవో శ్రీనివాసరావును వివరణ కోరగా పట్టాదారు పాసుబుక్‌లు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టే అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరినైనా ఇబ్బంది పెడితే తమ దృష్టికి తీసుకు వారాలని, తాము సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. -
రైతులకుకొత్త పాసుపుస్తకాల పంపిణీపై మెలిక
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో వచ్చే ఏడాది జనవరి 26 నుంచి రైతులకు ఇవ్వనున్న కొత్త పాసుపుస్తకాలపై సర్కారు మెలిక పెట్టనుంది. పంట రుణం లేదా భూమిని కుదువపెట్టి రుణాలు తెచ్చుకున్న రైతులు తమ భూములకు కొత్త పాసుపుస్తకాలు పొందాలనుకుంటే కచ్చితంగా రుణం ఇచ్చిన బ్యాంకు నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) తెచ్చుకోవాలని, అప్పుడే రైతులకు కొత్త పాసుపుస్తకాలు మంజూరు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. భూ రికార్డుల ప్రక్షాళన ఈ నెల 31 నాటికి పూర్తి కానుండటంతో ఆ రికార్డుల ఆధారంగా ఇచ్చే కొత్త పాసుపుస్తకాల విషయంలో కసరత్తు ప్రారంభించిన ప్రభుత్వం ఈ మేరకు మార్గదర్శకాలను రూపొందిస్తోంది. రుణాలు లేకుంటే నేరుగా ఇంటికే.. కొత్త పాసుపుస్తకాల కోసం రైతులు ఎలాంటి దరఖాస్తులు చేసుకోవాల్సిన అవసరం లేదని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. రికార్డుల ప్రక్షాళన పూర్తయిన తర్వాత ప్రభుత్వమే రైతుల ఇళ్లకు కొరియర్ ద్వారా పాసుపుస్తకాలు పంపుతుందని, పాసుపుస్తకాల కోసం రైతులు ఎక్కడికీ వెళ్లాల్సిన పనిలేదంటున్నారు. అయితే ఇది బ్యాంకుల్లో ఎలాంటి రుణాలు లేని భూములకు మాత్రమే వర్తించనుంది. బ్యాంకుల్లో పంట రుణాలు లేదా ఇతర రుణాలు తీసుకొని ఉంటే మాత్రం రైతులు ఆ రుణాలను చెల్లించి బ్యాంకుల నుంచి ఎన్వోసీ తెచ్చుకుని తహసీల్దార్ కార్యాలయాల్లో సమర్పించాల్సి ఉంటుంది. ఈ లెక్కన ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా 26.90 లక్షల మంది రుణాలు తీసుకున్న రైతులు, అంతకు ముందు రుణాలు తీసుకున్న వారు కచ్చితంగా బ్యాంకుల నుంచి ఎన్వోసీలు తెచ్చుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే పాసుపుస్తకంపై తహసీల్దార్ డిజిటల్ సిగ్నేచర్ చేస్తారు. అప్పుడు కూడా ఎలాంటి దరఖాస్తు లేకుండానే రైతు ఇంటికి పాసు పుస్తకం వస్తుందని రెవెన్యూ వర్గాలంటున్నాయి. ప్రచురించేది ఎవరు? కొత్త పాసుపుస్తకాల ప్రచురణ విషయంలో కూడా ప్రభుత్వం తర్జనభర్జనలు పడుతోంది. అత్యంత పకడ్బందీగా రూపొందిస్తున్న పాసుపుస్తకాలను ప్రచురించి జారీ చేసే అధికారం తహసీల్దార్లకు ఇవ్వాలా లేదా ప్రభుత్వమే ప్రచురించి రైతులకు నేరుగా పంపాలా అనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని సమాచారం. ఒకవేళ తహసీల్దార్లకు ఆ అధికారం ఇస్తే మాత్రం మంజూరీతోపాటు పబ్లిషర్ సిగ్నేచర్ కూడా వారికే ఇవ్వాలని లేదంటే నేరుగా సీసీఎల్ఏ నుంచి పంపాలని యోచిస్తోంది. ఈ విషయంలో రెవెన్యూ ఉన్నతాధికారులు సాధ్యాసాధ్యాలను పరిశీలించి త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు. భూ రికార్డులకు కొత్త పోర్టల్ భూ రికార్డులను ఆన్లైన్లో అందుబాటులో ఉంచేందుకు ఇప్పుడున్న వెబ్‌ల్యాండ్ పోర్టల్ స్థానంలో కొత్త పోర్టల్ తేవాలనే యోచనలో రెవెన్యూ ఉన్నతాధికారులున్నారు. వెబ్‌ల్యాండ్ పోర్టల్‌ను తాత్కాలికంగా నిలుపుదల చేయగా ప్రస్తుతం జరుగుతున్న భూ రికార్డుల ప్రక్షాళన వివరాలను ల్యాండ్ రికార్డ్స్ అప్డేషన్ ప్రాసెస్ (ఎల్‌ఆర్‌యూపీ) అనే పోర్టల్‌లో నమోదు చేస్తున్నారు. దీన్ని పబ్లిక్ డొమైన్లో అనుసంధానించకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ అధికారులకు మాత్రమే ఈ పోర్టల్‌లో లాగిన్ అయ్యే అవకాశం ఉంది. అయితే భూ రికార్డుల ప్రక్షాళన పూర్తయ్యాక ఈ పోర్టల్‌ను ప్రజలకు అందుబాటులోకి తేనున్నారు. ఇందుకోసం ఇప్పుడున్న వెబ్‌ల్యాండ్ పోర్టల్ కాకుండా కొత్త పోర్టల్‌తో అనుసంధానం చేయాలని నిర్ణయించినట్లు రెవెన్యూ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. -
భూరికార్డుల ప్రక్షాళన!
-
భూరికార్డుల ప్రక్షాళన!
గ్రామం యూనిట్‌గా త్వరలో విస్తృత స్థాయిలో సర్వే ♦ సర్వే ఆఫ్ ఇండియా సహా ప్రతిష్టాత్మక సంస్థల సహకారం ♦ అన్ని భూములపై స్పష్టత.. వివాదాలకు చెక్ ♦ ప్రతి భూమికి కొత్త నంబర్లు.. కొత్త పాస్‌బుక్‌లు ♦ అధికారులతో 7 గంటలపాటు సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా సమీక్ష సాక్షి, హైదరాబాద్ రాష్ట్రంలోని భూముల రికార్డులన్నింటినీ ప్రక్షాళన చేయాలని.. ఏ భూమి ఎవరి పేరు మీద ఉన్నదనే విషయం నిగ్గుతేల్చాలని అధికారులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని సూచించారు. ఇకపై భూమి అమ్మకాలు, కొనుగోళ్లన్నీ పూర్తి పారదర్శకంగా జరగాలని స్పష్టం చేశారు. పట్టాదారు పాస్ పుస్తకాలు, పహాణీ పత్రాలు మరింత సరళంగా ఉండాలని.. గందరగోళానికి దారి తీసే అంశాలకు తెరవేయాలని చెప్పారు. గ్రామం యూనిట్‌గా, వీలైనంత త్వరగా సర్వే సెటిల్మెంట్ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించారు. రాష్ట్రంలో భూ రికార్డుల ప్రక్షాళనకు అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం కేసీఆర్ సోమవారం ప్రగతి భవన్లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ, సీఎస్ ఎస్పీ సింగ్, సీనియర్ అధికారులు ఎస్.నర్సింగ్‌రావు, బీఆర్ మీనా, జయేశ్ రంజన్, శాంతకుమారి, ప్రియదర్శిని, నదీమ్ అహ్మద్, స్మితా సబర్వాల్, భూపాల్‌రెడ్డి, వెంకటేశ్వర్రావు, రంగారెడ్డి కలెక్టర్ రఘునందన్‌రావు, జేసీ సుందర్ అబ్నార్ తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. ఏడు గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ‘‘భూములకు సంబంధించి నిజాం కాలంలో 1936లో చేసిన బందోబస్తు తప్ప మళ్లీ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం జరగలేదు. దీంతో ఎన్నో ఇబ్బందులు, వివాదాలు తలెత్తున్నాయి. శాంతి భద్రతల సమస్యలకు కారణమవుతున్నాయి. ఈ పరిస్థితిని సరిదిద్దడానికి రాష్ట్రంలోని భూమి అంతటినీ సర్వే చేయాలి. ఏ భూమి, ఎంత విస్తీర్ణంలో, ఎవరి పేరు మీద ఉందో గుర్తించాలి. ఇందుకు సర్వే ఆఫ్ ఇండియాతో పాటు దేశంలోని వివిధ సర్వే ఏజెన్సీల సహకారం తీసుకోవాలి..’’అని కేసీఆర్ పేర్కొన్నారు. విస్తృతంగా సర్వే.. రాష్ట్రంలోని 10,850 రెవెన్యూ గ్రామాల్లో సర్వే జరగాలని.. 3,500 మంది రెవెన్యూ అధికారుల్లో ఒక్కొక్కరిని మూడు గ్రామాలకు ఇన్చార్జిగా నియమించాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఒక్కో గ్రామంలో పదిహేను రోజుల్లో గ్రామస్తులు, గ్రామ రైతు సంఘం ఆధ్వర్యంలో ఆధునిక పరికరాలతో సర్వే చేయాలన్నారు. సర్వే ఆఫ్ ఇండియాతో పాటు ఇతర సర్వే ఏజన్సీల సహకారం తీసుకోవాలని సూచించారు. మంచి కార్యక్రమం కాబట్టి ప్రజలు సహకరిస్తారని పేర్కొన్నారు. అన్నీ ఆన్లైన్.. ఈ సర్వే సమయంలో కలెక్టర్‌తో పాటు రెవెన్యూ అధికారులకు మరో పనేదీ అప్పగించేది లేదని కేసీఆర్ చెప్పారు. ‘‘ప్రస్తుతం ఇస్తున్న పట్టాదారు పాస్ పుస్తకాలు, పహాణీ పత్రాలు కూడా గందరగోళంగా ఉన్నాయి. అన్ని కాలమ్స్ అవసరం లేదు. సరళంగా ఉండాలి. భూముల వివరాలు కచ్చితంగా తేల్చాక ఆ వివరాలన్నీ ఆన్లైన్లో పొందుపరచాలి. సర్వే పూర్తయిన తర్వాత కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వాలి. ప్రతి భూమికి ప్రత్యేక నంబర్ కేటాయించాలి. అవసరమైతే భూములకు హద్దు రాళ్లు కూడా పాతాలి. గ్రామస్థాయిలో నిర్వహించే రికార్డుల్లో ఉన్న వివరాలే సీసీఎల్ఏ దగ్గర కూడా ఉండాలి. ఎక్కడ ఏ మార్పు జరిగినా ఆన్లైన్లోనే అన్ని చోట్లా రికార్డులు మారాలి. డబ్బులు బ్యాంకులో వేసినా, ఏటీఎం నుంచి తీసుకున్నా.. వెంటనే బ్యాంకు రికార్డుల్లో నమోదుకావడం, ఎస్సెమ్మెస్ రావడం ఎలా జరుగుతుందో భూ రికార్డుల నిర్వహణ కూడా అలా ఉండాలి..’’అని కేసీఆర్ సూచించారు. రైతుల లెక్కల్లో తేడాలు.. వచ్చే ఏడాది నుంచి రైతులకు రెండు పంటలకు కలిపి ఎకరానికి రూ.8 వేలు పెట్టుబడిగా అందివ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని.. దాని కోసం వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాల్లో సర్వే నిర్వహించారని కేసీఆర్ తెలిపారు. కానీ ఆ సర్వేలో వెల్లడైన వివరాలు రెవెన్యూ రికార్డులతో సరిపోలడం లేదన్నారు. వ్యవసాయ శాఖ ఓ గ్రామంలో 300 మంది రైతులున్నారని తేల్చితే.. రెవెన్యూ శాఖ రికార్డుల్లో 1,100 మంది వరకు ఉన్నట్లుగా లెక్కలు ఉన్నాయని తెలిపారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వమిచ్చే పెట్టుబడి సాయం ఎవరికి అందాలనే సందేహం వస్తుందన్నారు. లెక్కా పత్రం లేకుండా, భూమి కలిగిన అసలైన రైతులకే డబ్బులు అందకుంటే అది పెద్ద కుంభకోణంగా మారి ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని పేర్కొన్నారు. నేరాలు, గందరగోళానికీ చెక్.. ప్రస్తుతం భూ రికార్డులు సరిగా లేక అవినీతి, శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతున్నాయని... భూ వివాదాల కారణంగా హత్యలు కూడా జరుగుతున్నాయని కేసీఆర్ పేర్కొన్నారు. వీటన్నింటికీ చరమగీతం పాడాలంటే ఏ భూమి ఎవరికి చెందినదనే విషయంలో పూర్తి స్పష్టత రావడం అవసరమని చెప్పారు. ఈ మేరకు రెవెన్యూ శాఖ స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని.. గ్రామం యూనిట్‌గా సర్వే జరగాలని సూచించారు. ‘గ్రామంలో ఎంత భూమి ఉంది? ఏ భూమి ఎవరి పేరు మీద ఉంది.? మొత్తం రాష్ట్రంలోని 2.70 కోట్ల ఎకరాల విస్తీర్ణంలో ఏ భూమి దేని కింద ఉంది..?’అనే మొత్తం వివరాలు తయారు చేయాలని చెప్పారు. ఇలా ప్రక్షాళన చేయడం ద్వారా ప్రభుత్వం అమలు చేసే వ్యవసాయ పెట్టుబడి పథకం సక్రమంగా అమలవుతుందని... భవిష్యత్తులో వివాదాలను నివారించినట్లు కూడా అవుతుందని పేర్కొన్నారు. -
పాస్‌బుక్ లేకుండా పంట రుణాలు
బ్యాంకర్లకు రెవెన్యూ శాఖ సూచన సాక్షి, హైదరాబాద్: పాసు పుస్తకాలు లేకుం డానే రైతులు పంట రుణాలను పొందే సదు పాయం రెవెన్యూ శాఖ కల్పించింది. రైతుల పాస్‌పుస్తకాలు, పహాణీలు సమర్పించకున్నా పంట రుణాలను మంజూరు చేయాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.ఆర్.మీనా బ్యాంకర్లకు సూచించారు. భూముల వివరాలను కచ్చితంగా తెలిపేలా ప్రభుత్వం వెబ్‌ల్యాండ్ పోర్టల్‌ను అందుబా టులోకి తెచ్చిందని, ఆన్లైన్లోనే వివరాలసు సరిచూసుకుని రుణాలు ఇవ్వవచ్చని పేర్కొ న్నారు. ఎస్బీఐ తెలంగాణ సర్కిల్ చీఫ్ జనరల్మేనేజర్ హరిదయాళ్ ప్రసాద్ అధ్యక్ష తన బ్యాంకర్ల స్టీరింగ్ కమిటీ సమావేశం గురువారం జరిగింది. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.ఆర్.మీనా, వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి సి.పార్థసారథి, ఐఏఎస్ అధికారి సందీప్ సుల్తానియా, ఎల్ఎల్బీసీ కన్వీనర్ యు.ఎన్.ఎన్.మైయా, రిజర్వు బ్యాంకు ప్రతినిధి జె.మేఘనాథ్, సుబ్బయ్య పాల్గొన్నారు. ఒకే వ్యవసాయ భూమిపై ఒకటి కంటే ఎక్కువ మంది పంట రుణాలు తీసుకోకుండా వెబ్‌ల్యాండ్ పోర్టల్ ను వినియోగించుకోవచ్చని మీనా చెప్పారు. ఇప్పటికే 21 బ్యాంకులు ఈ పోర్టల్‌ను విని యోగిస్తున్నాయన్నారు. ప్రస్తుత ఖరీఫ్ సీజ నులో ఇప్పటివరకు 8,35,748 మంది రైతులకు రూ.6,056 కోట్ల పంట రుణాలను ఇచ్చినట్లు తెలిపారు. రైతులందరికీ ప్రధాన మంత్రి ఫసల్‌బీమా యోజన వర్తించేలా బ్యాంకర్లు రుణాలు రెన్యూవల్ చేయాలన్నా రు. వాతావరణ ఆధారిత బీమా పథకం అమలుచేస్తున్న మిరప పంటకు ప్రీమియం చెల్లింపు తేదీని జూలై 15 వరకు, పత్తి పంట కు జూలై 31 వరకు పొడిగించినట్లు తెలిపా రు. పత్తి సాగు రైతులు వాతావరణ ఆధారి త బీమా పథకాన్ని ఉపయోగించుకునేలా చూడాలన్నారు. బ్యాంకులన్నీ పంట రుణా లు, బీమా అమలు చేసేలా చర్యలు తీసుకుం టున్నాయని హరిదయాళ్ తెలిపారు. -
‘రాజు’గారి చెరలో..
నాడు వ్యవసాయ భూమి అని అడ్డుచక్రం తప్పుడు పాస్‌పుస్తకాలతో మాయాజాలం నేడు అదే ప్లాట్ల కొనుగోలుకు మంత్రాంగం వ్యవహారం కోర్టులో ఉన్నా బేఖాతరు రాజు తలచుకుంటే కానిదేముంటుంది.. తిమ్మిని బమ్మిని చేయగలరు.. ఒప్పును తప్పుగా చూపించగలరు.. కావాలనుకుంటే.. మళ్లీ ఆ తప్పునే ఒప్పుగా మార్చేయగలరు.. సబ్బవరం మండలంలో విశ్రాంత ఉద్యోగులు జీవితకాల కష్టార్జితంతో కొనుక్కున్న ప్లాట్ల విషయంలో ఓ ‘రాజు’గారు ఆడుతున్న కబ్జా క్రీడ ఇదే చెబుతోంది.. కొన్నేళ్ల క్రితం రైతుల నుంచి జీపీఏ తీసుకొని వేసిన లే అవుట్లో వందలాది మంది ప్లాట్లు కొంటే.. వాటిని కాజేసేందుకు తప్పుడు పాస్‌పుస్తకాలు సృష్టించారు. వ్యవసాయ భూమి అంటూ అడ్డు చక్రం వేశారు.. దానిపై కొనుగోలుదారులు కోర్టు కెళ్లారు.. వ్యవహారం అక్కడే ఉంది..అయినా ఖాతరు చేయకుండా సదరు ‘రాజు’గారు తన అనుచరుల పేరిట తక్కువ ధరకు వాటిని చేజిక్కించుకునేందుకు చక్రం తిప్పుతున్నారు. -
‘దొంగ పాస్ పుస్తకాల’పై విచారణ
వినుకొండ టౌన్: దొంగ పాస్ పుస్తకాల తయారీ, ఆన్లైన్ చేయటానికి అందినకాడికి గుంజుతున్నారన్న అరోపణలపై రెవెన్యూ డివిజనల్ అధికారి రవీంద్ర దర్యాప్తు చేయనున్నారన్న సమాచారం వినుకొండ ప్రాంతంలోని రెవెన్యూ ఉద్యోగుల్లో బుధవారం కలకలం రేపింది. ఇప్పటి వరకు అప్రతిహాతంగా కొనసాగిస్తున్న అవినీతి బండారం ఎక్కడ బట్టబయలవుతుందోనని రెవెన్యూ సిబ్బందిలో ఆందోళన మొదలైంది. నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో అవినీతి వీఆర్వోలు తమ తప్పులు కప్పి పుచ్చుకోవడానికి అప్పుడే దిద్దుబాటు చర్యలకు దిగినట్లు తెలుస్తోంది. ‘సాక్షి’ పత్రికలో వచ్చిన కథనం మేరకు మండల అధికారుల నుంచి ఆర్డీవో ఇప్పటికే కొంత సమాచారం సేకరించినట్లు సమాచారం. దీంతో రెవెన్యూ ఉద్యోగులు ఈ విషయం అటు తిరిగి ఇటు తిరిగి తమ మీదకు ఎక్కడ వస్తుందోనని గుమ్మనంగా వ్యవహరిస్తున్నారు. పాస్ పుస్తకాలు, ఆన్లైన్ నమోదులో సాక్ష్యాధారాలతో సహా ఓ మహిళా వీఆర్వో అడ్డంగా బుక్కవ్వడం, బాధితులు పోలీసులను ఆశ్రయించడం పట్టణంలో చర్చనీయాంశం అయింది. ఆర్డీవో నిష్పక్షపాతంగా విచారణ చేస్తే రైతులకు మేలు చేసిన వారవుతారని అనుకుంటున్నారు. అవినీతి వీఆర్వోలు, వారికి సహకరించిన అధికారుల భరతం పట్టడం వల్ల పారదర్శకంగా ఆన్లైన్లో భూ యజమానుల పేర్లు పైసా ఖర్చు లేకుండా ఎక్కించుకోగలమని పేద రైతులు భావిస్తున్నారు. -
నకిలీ పాస్ పుస్తకాల కేసులో ఇద్దరి అరెస్ట్
పరారీలో వీఆర్వో, అటెండర్ కొడకండ్ల : నకిలీ పాస్ పుస్తకాల తయారీ కేసులో ఇద్దరు నిందితులను శుక్రవారం అరెస్ట్ చేసినట్లు ఎస్సై ఎంబాడి సత్యనారాయణ తెలి పారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వీఆర్వో, తహసీల్దార్ కార్యాలయ అటెండర్ పరారీలో ఉన్నారని చెప్పారు. వివరాలిలా ఉన్నాయి.. కొడకండ్ల శివారు దుబ్బతండాకు చెందిన ధరావత్ భీమానాయక్ మండలంలోని వివిధ గ్రామాల రైతుల పేరిట కంప్యూటర్ పహాణీల మోటేషన్, కరెక్షన్ల కోసం రెవెన్యూ కార్యాలయంలో 41 దరఖాస్తులు అందజేశాడు. వీటిపై ఇన్చార్జ్ తహసీల్దార్ రాములునాయక్, సీనియర్ అసిస్టెంట్ దేవానాయక్, రామవరం వీఆర్వో కనకరాజు క్షేత్రస్థాయికి వెళ్లి విచారణ చేపట్టగా భూములు లేని వారి పేరిట కూడా దరఖాస్తులు ఉన్నట్లు తెలిసిం ది. ఇవి నకిలీ పాస్‌పుస్తకాలుగా అనుమానించిన తహసీల్దార్ ఈనెల 18న పోలీస్‌స్టేçÙన్లో ఫిర్యా దు చేశారు. ఎస్సై విచారణ చేపట్టగా 41 దరఖాస్తుల్లో 18 మందికి మాత్రమే భూములున్నట్లు తేలింది. ధరావత్ భీమానాయక్, భానోత్ యా కూబ్ పాస్ పుస్తకాలు చేయిస్తామని చెప్పి అమాయక రైతుల నుండి డబ్బులు తీసుకున్నారు. సద రు రైతులు తమ పని ఏమైందని అడగగా, వారి ద్దరూ కొడకండ్ల, పోచంపెల్లి వీఆర్వో దోకూరు సైదులును ఆశ్రయించారు. ఒక్కోదానికి రూ.3 వేల చొప్పున రూ.54 వేలు తీసుకున్న సైదులు వారికి 18 పాస్ పుస్తకాలను అందించాడు. ఈ పుస్తకాల్లో రైతుల వివరాలను భీమానాయక్ రాయగా, తహసీల్దార్, ఆర్డీఓ ఫోర్జరీ సంతకాలను యాకూబ్ చేశాడు. తహసీల్దార్ కార్యాలయ అటెండర్ ఎద్దు మల్లయ్య ఒక్కో పుస్తకానికి రూ.300 చొప్పున తీసుకొని తహసీల్దార్, కార్యాలయ ముద్రలు వేశాడు. అయితే ఈ పుస్తకాలలో రైతుల పేర్లు, ఊరి పేర్లు మార్చి మోటేషన్, కరెక్షన్ల కోసం భీమానాయక్ తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. నకిలీ పాస్ పుస్తకాలన్నీ 2012లో అప్పటి తహసీల్దార్ ప్రభాకర్‌రావు ఫోర్జరీ సంతకాలతో రూపొందించినట్లు ఎస్సై తెలిపారు. నింది తుల నుంచి 18 పాస్ పుస్తకాలు, తహసీల్దార్ కార్యాలయ ముద్రలను స్వాధీనం చేసుకొని, వారిపై 420, 468,471 ఐపీసీ సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశామని వివరించారు. దళారులను నమ్మి మోసపోవద్దు.. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని ఎస్సై సూచించారు. ఈ ముఠాకు డబ్బులిచ్చిన వారు ఇంకెవరైనా ఉంటే ఫిర్యాదు చేయాలని చెప్పారు. ఇప్పటికే పాస్ పుస్తకాలు చేయించుకున్న వారు అవి సరైనవా కాదా అని తహసీల్దార్ కార్యాలయం లో పరి శీలించుకోవాలన్నారు. బాధితులు ఫిర్యాదు చేస్తే నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. నకిలీ పుస్తకాలతో బ్యాంకు రుణాలు పొందిన వారి జాబితా తీసుకొని విచారణ చేపడతామని, ఫోర్జరీ సంతకాలను ఫోరెనిక్స్ ల్యాబ్‌కు పంపుతామని తెలిపారు. కేసు విచారణ త్వరితగతిన పూర్తి చేయడంలో ఏఎస్సై కుమారస్వామి, హెడ్ కానిస్టేబుల్ శంకర్, పీసీలు విద్యాసాగర్, సురేష్ కృషి చేశారని చెప్పారు. -
జోరుగా నకిలీ పాసు పుస్తకాల దందా!
కొడకండ్ల : అమాయక రైతులే ఆసరాగా కొంతమంది దళారులు నకిలీ పట్టాదారు పాసు పుస్తకాల తయారీ దందాను కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. రెవెన్యూ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసినా పనులు కాక విసిగిపోయిన అన్నదాతలే లక్ష్యంగా కార్యకలాపాలు సాగిస్తున్నట్లు సమాచారం. ఆయా గ్రామాల్లోని కొంతమంది దళారులుగా అవతారమెత్తి నకిలీ పాసు పుస్తకాల సృష్టికర్తల కోసం క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కో రైతు నుంచి ఎకరానికి రూ.5వేల నుంచి రూ.7వేల చొప్పున వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. డబ్బు చేతికి అందగానే పదిహేను రోజుల వ్యవధిలో పని పూర్తి చేస్తామంటూ నమ్మబలుకుతున్నట్లు పేర్కొంటున్నారు. పాసు పుస్తకాల తయారీ ప్రక్రియ తర్వాత కంప్యూటర్ పహాణీల్లో నమోదు కోసం రెవెన్యూ యంత్రాంగంలోని పలువురు సిబ్బందిని మచ్చిక చేసుకొని ఉండొచ్చని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొడకండ్ల మండల కేంద్రం శివారులోని ఓ గిరిజన తండా కేంద్రంగా కొంతమంది ఈ నకిలీ పాసు పుస్తకాల తయారీని కొనసాగిస్తున్నట్లు భావిస్తున్నారు. ఈ ముఠాకు పోచంపల్లి, గంట్లకుంట, రామవరం తదితర గ్రామాల్లో కొంతమంది మధ్యవర్తులు ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. -
వెబ్ ల్యాండ్‌తో గుండెలు లబ్‌డబ్
♦ పట్టాదారు పాసు పుస్తకాలు రద్దు చేయొద్దని వినతి ♦ తప్పుల తడకగా ఆన్లైన్లో భూ రికార్డులు రైతుల్లో ఆందోళన గురజాల: పట్టాదారు పాసు పుస్తకాలను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయడంపై నియోజకవర్గంలోని రైతులు ఆందోళన చెందుతున్నారు. పాస్ పుస్తకం, టైటిల్ డీడ్ ఉంటే భరోసాగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఆన్లైన్లో భూ రికార్డులు నమోదు కూడా తప్పుల తడకగా ఉందని, భూముల సర్వేల్లో తప్పులు, విస్తీర్ణాలు మారిపోవడం, హక్కుదార్ల పేర్లు కూడా వెబ్‌ల్యాండ్‌లో మారిపోయే అవకాశం ఉందని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆన్లైన్లో భూముల వివరాలు, విస్తీర్ణం నమోదు, యజమాని పేరు వంటివి చూసుకునే పరిజ్ఞానం రైతులకు ఉండదని వారు ఆయోమయంలో పడతారని రైతు సంఘాల నేతలు అంటున్నారు. పట్టాదారు పాసుపుస్తకాలను, టైటిల్ డీడ్స్‌ను వ్యవస్థను రద్దు చేయడం వల్ల రైతుల ఆస్తులకు రక్షణ ఉండదని, ఈ విధానం బడా బాబులకే కొమ్ము కాసేదిగా ఉందని వారు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా పాస్ పుస్తకాలను రద్దుచేస్తూ జారీ చేసిన జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఎల క్ట్రానిక్ పాస్ బుక్ (ఈ పాస్ బుక్) విధానంపై రైతులకు అసలు అవ గాహన లేదని, ఈ విధానం అమల్లోకి వస్తే అక్రమాలకు మరింత ఎక్కువవుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. పట్టాదారు పాసు పుస్తకాలతో రైతులకు భరోసా పాసు పుస్తకాలు టైటిల్ డీడ్స్ రైతులకు ఒక భరోసానిస్తాయి. వెబ్ ల్యాండ్, ఈ పాస్ పుస్తకాలు విధానం లోపాల పుట్ట. యథావిధిగా పట్టాదారు పుస్తకాలు కొనసాగించాలి. పుస్తకాలు ఉంటేనే రైతులకు ధైర్యంగా ఉంటుంది. పాసు పుస్తకాల రద్దు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలి.ఆన్లైన్లో భూ రికార్డులు వ్యవహారం దారుణంగా ఉంది. -బత్తుల చంద్రం,రైతు ఆన్లైన్లో ఇబ్బందులు తప్పవు ఆన్‌లైన్‌తో రైతులకు ఇబ్బందులు తప్పవు. చదువురాని వారు పట్టాదారు పాసు పుస్తకాలు ఉంటే ధైర్యంగా ఉంటుంది. ఆన్లైన్లో చూసుకోవాలంటే వారికి తెలియదు. దీంతో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. పభుత్వం ప్రవేశపెట్టిన జీవోను రద్దు చేసి యథావిధిగా పట్టాదారు పుస్తకాలు కొనసాగించాలి. - ఎం. గంగానాయక్ -
పాస్‌పుస్తకాల గందరగోళం
అయోమయంలో రైతులు స్పష్టత లేదంటున్న రిజిస్ట్రేషన్ అధికారులు నెల్లూరు: ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయంలోనూ స్పష్టత లేదనే విషయానికి రిజిస్ట్రేషన్ శాఖ నిదర్శనంగా నిలుస్తోంది. కొంతకాలంగా రైతుల వద్ద ఉన్న పాస్‌పుస్తకాలకు కాలం చెల్లుతుందని, వాటి స్థానంలో మ్యుటేషన్ పద్ధతిలో వన్ బీ వస్తుందని చెప్పుకొంటూ వచ్చారు. వాస్తవానికి మే 1 నుంచి అమల్లోకి వస్తుందని చెప్పినా అప్పుడు తాత్కాలికంగా నిలిపేశారు. అప్పటి నుంచి పాస్‌పుస్తకాలు ఉండవని ప్రభుత్వం పేర్కొంది. మరోసారి జూలై 1 నుంచి అమలు చేస్తున్నట్లు ఇటీవల ఆ శాఖ ఉన్నతాధికారుల నుంచి రిజిస్ట్రేషన్ శాఖకు ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఇంకోవైపు రెండు రోజుల క్రితం ఆ శాఖ మంత్రి పాస్‌పుస్తకాలను రద్దు చేయట్లేదని చెప్పడం రైతుల్లో అయోమయానికి దారితీసింది. రిజిస్ట్రేషన్‌కు వచ్చే రైతులు పాస్‌పుస్తకాల విషయమై అడుగుతుండటంతో ఏమి చెప్పాలో పాలుపోక రిజిస్ట్రార్ అధికారులు తికమకపడుతున్నారు. పాస్‌పుస్తకాలు రద్దయితే సమస్యలు.. పాస్‌పుస్తకాలు రద్దయితే చాలా సమస్యలు వస్తాయని పలువురు రిజిస్ట్రేషన్ అధికారులు పేర్కొంటున్నారు. రిజిస్ట్రేషన్‌కు వచ్చే వారి వద్ద నుంచి పాస్‌పుస్తకాన్ని తీసుకొని ఎంత పొలం మరొకరికి రిజిస్ట్రేషన్ చేస్తారో తెలుసుకుంటారు. అక్కడ సర్వే నంబర్, ఎంత పొలం అనే నంబర్ వద్ద రిజిస్ట్రేషన్ అధికారులు రౌండ్మార్క్ చేస్తారు. అయితే పాస్‌పుస్తకాల రద్దుతో ఒక స్థలాన్ని విక్రయించే సమయంలో డబుల్, త్రిబుల్ రిజిస్ట్రేషన్లు కూడా జరిగే అవకాశం ఉంది. ‘చుక్కల’ విషయంలోనూ స్పష్టతేదీ..? జిల్లాలో వేల ఎకరాల చుక్కల భూములు ఉన్నాయి. వాటిని హక్కుదారులు మాత్రమే అనుభవించేందుకు అర్హులని ప్రభుత్వం పేర్కొంది. చుక్కల భూమిని కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని ఇటీవల చెప్పినా, దానిపైనా స్పష్టత లేదు. రెవెన్యూ శాఖ వద్ద మాత్రం చుక్కల భూమికి డాట్లు కనిపిస్తుండటం, రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్దకు వచ్చే సరికి మాత్రం చుక్కలు కనిపించడంలేదు. ఈ పరిణామంతో రైతులతో పాటు రిజిస్ట్రేషన్ అధికారులు కూడా తలలు పట్టుకుంటున్నారు. వెబ్‌ల్యాండ్‌లో డేటా ఆధారంగా చేస్తున్నాం: పట్టాదారు పాస్‌పుస్తకాలు లేకపోయినా ప్రస్తుతానికి వెబ్‌ల్యాండ్ ఆధారంగా రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. బ్యాంకులకు సంబంధించిన పాస్‌పుస్తకాలు ఉంటాయి అంటున్నారు. అయితే ఆ విషయం తెలీదు. ఉన్నతాధికారుల ఆదేశాలను పాటిస్తాం. మునుస్వామి, రిజిస్ట్రేషన్ అధికారి -
1బీలో తప్పుల కుప్పలు
అయోమయంలో రైతులు నిజనిర్ధారణ కమిటీ ఎదుట ఆవేదన ఈ-పాస్ బుక్ రద్దు చేయాలని డిమాండ్ కైకలూరు : ‘కుటుంబానికి ఏ కష్టమొచ్చినా తాతముత్తాతల నుంచి పాస్‌పుస్తకాలు, టైటిల్ డీడ్లు ఆదుకున్నాయి. ఇప్పుడు ఈ-పాస్ బుక్‌లు అంటూ ఆన్లైన్ వ్యవస్థను తీసుకొచ్చారు... తీరా అందులో మా పేర్లు లేవు’ అని రైతు సంఘాల నిజనిర్ధారణ కమిటీ ఎదుట కలిదిండి మండలం కొండూరు గ్రామ రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. ఈ నెల ఒకటో తేదీ నుంచి పట్టాదారు పాసుపుస్తకం, టైటిల్ డీడ్‌ను రద్దు చేస్తూ ప్రభుత్వం జీవో 255 జారీ చేసింది. ఈ నేపథ్యంలో రైతాంగ సమాఖ్య అధ్యక్షుడు యెర్నేని నాగేంద్రనాథ్ స్వగ్రామమైన కలిదిండి మండలం కొండూరు పంచాయతీ కార్యాలయం వద్ద రైతు సంఘాల నిజనిర్ధారణ కమిటీ ఆదివారం రైతులతో ముఖాముఖి నిర్వహించింది. ఏ రైతును కదిపినా ఆందోళనే వ్యక్తమైంది. 15 ఎకరాలకు ఏటా శిస్తు చెల్లిస్తున్నా 1బీలో ఎకరం మాత్రమే నమోదయిందని ఒక రైతు, ఒకే భూమికి ఇద్దరు శిస్తు చెల్లిస్తున్నా సరిచేయలేదని మరో రైతులు.. ఇలా అందరూ తమ సమస్యలను కమిటీకి విన్నవించారు. గ్రామంలో మొత్తం 536 రైతుల పట్టాదారు పుస్తకాలను పరిశీలించగా ఈ-పాస్ బుక్ 1బీలో 125 మంది రైతుల పేర్లు, భూమి విస్తీర్ణం తప్పులు ఉన్నట్లు కమిటీ గుర్తించింది. రైతు సంఘ నాయకుల పరిస్థితీ ఇంతే... రైతు సమస్యలపై నిరంతరం పోరాడే రైతు సంఘాల నాయకుల భూములు కూడా రికార్డుల్లో నమోదు కాలేదు. యెర్నేని నాగేంద్రనాథ్ బంధువులకు చెందిన సర్వే నంబరు 320లో 15 ఎకరాల 40 సెంట్లు పట్టా భూమి ప్రభుత్వ భూమిగా నమోదయింది. యెర్నేని పుష్పవతమ్మకు చెందిన భూములు 1బీలో రుద్రరాజు బాలకుమారి పేరు మీద ఉన్నాయి. గ్రామంలో బాలకుమారి ఎవరో పెద్దలు కూడా చెప్పలేకపోతున్నారు. వైఎస్సార్ సీపీ రైతు విభాగ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వి.ఎస్.నాగిరెడ్డికి చెందిన 1బీ రికార్డులలో తండ్రి పేరు తప్పుగా నమోదయ్యింది. కొండూరులో భూములు కలిగిన డెల్టా ఫిష్పార్మర్స్ అసోషియేషన్ జనరల్ సెక్రటరీ రామచంద్రరాజుకు చెందిన భూమి వివరాలు తప్పుగా నమోదయ్యాయి. తమ పరిస్థితే ఇలా ఉంటే ఇక సామన్య రైతుల సంగతేంటని రైతు సంఘ నాయకులు విస్మయం వ్యక్తంచేశారు. రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిందే ప్రభుత్వం విడుదల చేసిన జీవో 255 ప్రకారం 1బీలో నమోదయిన వివరాలు ఆధారంగా భూమి బదలాయింపులు, రుణాల మంజూరు జరిగితే అసలు భూమి యజమానికి తెలియకుండానే అన్యాక్రాంతమయ్యే అవకాశాలు ఎక్కువుగా ఉన్నాయని రైతు సంఘాల నాయకులు పేర్కొన్నారు. ఆన్లైన్ విధానంపై అవగాహన లేని రైతులు 1బీలో తమ పేరు ఉందా? లేదా అని తెలుసుకునేందుకు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని పేర్కొన్నారు. రైతాంగ సమైఖ్య అధ్యక్షుడు యెర్నేని నాగేంద్రనాథ్, వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ ఎం.వి.ఎస్నాగిరెడ్డి, ఏపీ రైతు సంఘ రాష్ట్ర అధ్యక్షుడు పి.రామచంద్రయ్య, డెల్టా పరిరక్షణ సమితి నాయకుడు కొలనుకొండ శివాజీ, కుమారస్వామి, కొలనుకొండ శివాజీ, రాజమోహనరావు, రామచంద్రరాజు తదితరులు పాల్గొన్నారు. రెవెన్యూ అధికారులు భయపడుతున్నారు... ప్రభుత్వ అనాలోచితంగా తీసుకున్న నిర్ణయం కారణంగా రెవెన్యూ అధికారులు సైతం భయపడుతున్నారు. లోపాలను విమర్శించే రైతు నాయకుల సూచనలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలి. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పట్టదార్ పుస్తకాలను రద్దు చేయడం తగదు. అభ్యంతరాలను వినకుండానే జీవో విడదల చేయడం మంచిదికాదు. ఈ-పాస్ బుక్ విధానాన్ని రద్దు చేయాలి. - ఎం.వి.ఎస్ నాగిరెడ్డి, వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రైతులకు నరకం ఈ-పాస్ బుక్‌లో తమ పేర్లు లేక రైతులు నరకం అనుభవిస్తున్నారు. పాస్‌బుక్‌లో ఉన్నవి కూడా 1బీలో నమోదు కాలేదు. వారసత్వంగా సక్రమించి, మూజువాణి పద్ధతిలో అన్నదమ్ములు పంచుకున్న భూ ముల వివరాలకు అనేకచోట్ల 1బీలో నమోదు కాలేదు. వెబ్‌ల్యాండ్ ఆధారంగా భూ బదాలయింపులు, రుణాల మంజూరు విధానాన్ని రద్దు చేయాలి. కొత్త విధానంతో భూ కబ్జాలు జరిగే అవకాశం ఉంది. - యెర్నేని నాగేంద్రనాథ్, రైతాంగ సమాఖ్య అధ్యక్షుడు -
రెవెన్యూ అధికారులకు చంద్రబాబు వార్నింగ్
కృష్ణా: రెవెన్యూ అధికారులపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం కృష్ణా జిల్లాలోని పెనుగంచిప్రోలు జన్మభూమి సభలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జన్మభూమి సభలో పట్టాదారు పాస్ పుస్తకాలపై అక్కడి రైతులు నిరసనకు దిగారు. దాంతో రెవెన్యూ అధికారులు ఎమ్మార్వో, వీఆర్వోలపై చంద్రబాబు మండిపడ్డారు. ఆన్లైన్లో భూముల వివరాలు నమోదు చేయాలని వారిని ఆదేశించారు. అంతేకాక పనితీరు మార్చుకోవాలంటూ రెవెన్యూ అధికారులను చంద్రబాబు హెచ్చరించారు. -
'సీఐడీకి అవసరం లేదు.. పోలీసులే విచారిస్తారు'
అనంతపురం: నకిలీ పాస్ పుస్తకాల కేసును పోలీసులే విచారిస్తారని ఏపీ డీజీపీ జేవీ రాముడు స్పష్టం చేశారు. ఈ కేసును సీఐడీకి అప్పగించాల్సిన పనిలేదని అన్నారు. అనంతపురం పోలీసులే ఈ కేసు విచారణను కొనసాగిస్తారని వివరించారు. ఇక కాల్ మనీ వ్యవహారంపై స్పందిస్తూ అధిక వడ్డీలతో ప్రజలను వేధించేవారిపై కఠిన చర్యలు తీసుకొని తీరుతామని స్పష్టం చేశారు. కొత్త మనీ ల్యాండరింగ్ చట్టాన్ని కచ్చితంగా అమలు చేసి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. -
కూకట్పల్లి ఏసీపీ ఇంటిపై ఏసీబీ దాడులు
♦ రూ. 2.9 కోట్ల విలువజేసే ఆస్తులున్నట్లు గుర్తింపు ♦ ఏసీపీ సంజీవరావు అరెస్టు సాక్షి, హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కూకట్పల్లి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సంజీవరావును అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. ఆయన కార్యాలయంతో పాటు బంధువుల ఇళ్లలో శనివారం ఏకకాలంలో సోదాలు చేసిన ఏసీబీ అధికారులు 2.9 కోట్ల విలువైన ఆస్తులున్నట్టుగా గుర్తించారు. బాలానగర్ హస్మత్‌పేటలోని సంజీవరావు నివాసంతో పాటు హైదరాబాద్, వరంగల్, మెదక్ జిల్లాలోని బంధువుల ఇళ్లలో ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. అలాగే కూకట్‌పల్లిలోని ఏసీపీ కార్యాలయంలోనూ దాడులు చేశారు. ఈ సోదాల్లో బాలానగర్‌లోని హస్మత్‌పేటలో కమర్షియల్ కాంప్లెక్స్, సికింద్రాబాద్ కార్ఖానాలోని ఓల్డ్ వాసవి కాలనీలో మూడు ఫ్లాట్లు, మెదక్ జిల్లాలోని ములుగు మండలం కొత్యాల గ్రామం ఆలీనగర్‌లో 36.09 ఎకరాల వ్యవసాయ భూమి, రంగారెడ్డి జిల్లా శామీర్‌పేటలోని కేశవరంలో తొమ్మిది ఎకరాల 18 గుంటల వ్యవసాయ భూమితో పాటు ఓ ఫామ్‌హౌస్, వరంగల్ జిల్లాలోని బచ్చన్నపేటలో 44.12 ఎకరాల వ్యవసాయ భూమి, ఏపీ10 ఏఎం 2277 నంబర్ గల స్విఫ్ట్ కారు, టీఎస్03 ఏడీ 3366 నంబర్ గల హోండా సిటీ కారు, 750 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.3.29 లక్షల నగదు ఆస్తులున్నట్లు గుర్తించామని ఏసీబీ అధికారులు తెలిపారు. అయితే ఈ ఆస్తుల విలువ మార్కెట్లో రూ.13 కోట్లపైనే ఉంటుందని అంటున్నారు. అక్రమార్జనలో ఈ ఏసీపీ తీరే వేరు.... అధికారాన్ని అడ్డంపెట్టుకొని ఎస్హెచ్ఓల పరిధిలోని కేసుల్లోనూ తలదూర్చడమే కాకుండా ఇష్టారాజ్యంగా అక్రమార్జనకు పాల్పడినట్లు కూకట్పల్లి ఏసీపీ సంజీవరావుపై ఎన్నో ఆరోపణలున్నాయి. కూకట్పల్లి, కేపీహెచ్‌బీ, మియాపూర్ పోలీస్స్టేషన్ల పరిధిలోని వివాదాస్పద నిర్మాణాల్లో తలదూర్చి అందిన కాడికి దండుకునేవాడని తెలుస్తోంది. ఎస్సీ, ఎస్టీ కేసుల విచారణ ఏసీపీ పరిధిలోనిది కావడంతో అనేక కేసుల్లో డబ్బులు డిమాండ్ చేసి రాజీకుదిర్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. సదరు కేసుల్లో ఈయనకు చెందిన ఓ బినామీ పాత్ర కీలకంగా ఉండటం గమనార్హం. ఫాంహౌస్‌లోనూ సోదాలు... శామీర్‌పేట్: మండల పరిధి కేశవరంలో సంజీవరావుకు సంబంధించిన ఓ ఫాంహౌస్‌లో ఏసీబీ రంగారెడ్డి జిల్లా డీఎస్పీ ప్రభాకర్ ఆధ్వర్యంలో సోదాలు చేశారు. కూకట్పల్లి ఏసీపీకి సంబంధించిన భూములు బినామీ పేర్ల మీద కేశవరంలో ఉన్నాయని తెలిపారు. గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 29లో సంజీవరావుకు సంబంధించిన వ్యవసాయ క్షేత్రంలోని గెస్ట్‌హౌస్‌లో సోదాలు చేసి వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. సర్వే నంబర్ 29లో సుమారు 10 ఎకరాల భూమి గుర్తించామన్నారు. సదరు భూమి సంజీవరావు అత్త శశికళ, కుమారుడు సుశాంత్ పేర్లమీద ఉన్నాయని తెలిపారు. సోదాల్లో ఏసీబీ సీఐ వెంకట్‌రెడ్డి, సిబ్బంది ఉన్నారు. అల్వాల్‌లోనూ... అల్వాల్ : అలాగే ఏసీబీ డీఎస్పీ సునీత ఆధ్వర్యంలో శనివారం అల్వాల్‌లోని సంజీవరావు నివాసంలో సోదాలు నిర్వహించారు. అల్వాల్‌లోని జి+1 ఇంటితో పాటు కమర్షియల్ కాంప్లెక్స్, 75 తులాల బంగారు నగలు, 3 లక్షల 29 వేల నగదు, 18 విదేశీ మద్యం బాటిళ్లు ఇంట్లో లభించాయని ఆమె తెలిపారు. ఇదిలా ఉండగా సంజీవరావు 1979లో ఎస్ఐగా పోలీసు విధులలో చేరి సీఐ, ఏసీపీగా విధులు నిర్వహించినట్లు తెలిసింది. మూట పడేశారు.... ఒక వైపు ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తుండగా, సంజీవరావు కుటుంబ సభ్యులు ఇంట్లో కిటికీ నుంచి ఓ మూట బయట పడేశారు. ఈ విషయాన్ని పాత్రికేయులు ఏసీబీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో మూటను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పాసు బుక్కులు, ఇతరులకు సంబంధించిన స్థలాల పత్రాలు అందులో ఉన్నట్లు తెలిసింది. -
విన్నపాలు..కన్నీళ్లు
సమస్యలపై స్పందించని అధికారగణం గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోని వైనం నెలల తరబడి జెడ్పీ చుట్టూ తిరుగుతున్నా ఫలితం శూన్యం అధికారులు స్వయంగా ప్రకటించిన పెండింగ్ ఫిర్యాదులు 16,741 గుంటూరు వెస్ట్ 40 ఏళ్ల క్రితం ప్రభుత్వం 200 ఎకరాలు ఇచ్చింది. 2003లో 100 ఎ కరాలకు పాస్ పుస్తకాలు ఇచ్చా రు. ఇప్పటివరకు టైటిల్ డీడ్లు ఇవ్వలేదు. ఫలితంగా బ్యాంకుల నుంచి రుణాలు మంజూరు కావడంలేదంటూ కారంపూడి మండ లం నరమాలపాడు గ్రామానికి చెందిన వై.లక్ష్మి అనే మహిళతోపాటు గ్రామస్తులు ఫిర్యాదు. గ్రామంలోని గంగాభవానీ వాటర్ ఫిల్లింగ్ సెంటర్ నిర్వాహకులు. పంచాయతీ అనుమతులు లేకుం డా వాటర్ ఫిల్లింగ్ చేస్తున్నారు. మురుగుకాల్వల మధ్య ఏర్పాటు చేసిన ప్లాంట్ నుంచి వాటర్ ఫిల్లింగ్ చేస్తూ ప్రజల ఆరోగ్యానికి హాని కలిగిస్తున్నారంటూ తెనాలి మండలం కొలకలూరు గ్రా మానికి చెందిన కాలిశెట్టి భావన్నారాయణ, కాలి శెట్టి రమేష్‌బాబు, బద్దుల చంద్రశేఖర్ ఫిర్యాదు. పూర్వార్జితంగా వచ్చిన పొలాన్ని నా తమ్ముడు కం చేటి రమేష్ ఆక్రమించుకుని పాస్ పుస్తకాలు పొం దాడు. 2012లో అప్పటి వీఆర్ఓ ద్వారా కంచేటి రమేష్ తన కుమారుడి పేరుతో రిజిస్టర్ చేయించుకున్నాడు. న్యాయం చేయమని అధికారులను కో రుతున్నా ప్రయోజనం లేకుండాపోతుందంటూ క్రోసూరు మండలం పీసపాడు గ్రామానికి చెందిన కంచేటిసాంబశివరావు, కంచేటి రమ్యల ఫిర్యాదు. వీరంతా ఇప్పటివరకు ఐదుసార్లు పైబడి గ్రీవెన్స్‌సెల్‌లో దరఖాస్తులు అందజేసినవారే. ఇటువంటి ఉదాహరణలు చాలా...చాలా ఉన్నాయి. గుంటూరులోని జిల్లా పరిషత్ కార్యాలయంలో ప్రతి సోమవారం ప్రజా సమస్యలపై ‘మీ కోసం’ వేదికలో జిల్లా ఉన్నతాధికారులు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తుంటారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వృద్ధులు, వికలాంగులు, మహిళలు, రైతులు ఇలా అన్నివర్గాల ప్రజలు ఎన్నో వ్యయప్రయాసలు భరించి తమ గోడును అధికారులకు మొరపెట్టుకునేందుకు ఇక్కడకు వస్తుంటారు. అయితే సమస్యలు పరిష్కారమవుతా యని ఇక్కడకు వచ్చేవారికి నిరాశే మిగులుతుంది. దరఖాస్తులైతే స్వీకరిస్తున్నారుగానీ, వాటిని పరిష్కరించడంలో అధికారుల వైఫల్యం కనిపిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవు తోంది. నెలలతరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా సమస్యలు పరిష్కరించడంలో కొంతమంది అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. అధికారుల పిలుపునకు స్పందన కరువు ... జిల్లాలోని వివిధ విభాగాలలో 16,741 ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నట్లు జిల్లా అధికారులు స్వయంగా ప్రకటించారు. 18,311 దరఖాస్తులు స్వీకరించిన అధికారులు కేవలం 1570 ఫిర్యాదులను మాత్రమే పరిష్కరించారు. ఈ నెల 6వ తేదీ లోపు సగమైనా పూర్తిచేయాలని జిల్లా అధికారులు ఇచ్చిన పిలుపునకు స్పందన కరువైంది. జిల్లా పరిషత్ అధికారులు నెలవారీ జరిపే మండల పరిషత్ సూపరింటెండెంట్ల సమావేశాల్లో కూడా గ్రీవెన్స్‌సెల్ ఫిర్యాదులపై చర్చిస్తున్నా ఫలితం నామమాత్రమే. జిల్లా అధికారుల వద్ద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు ... సర్వే, భూ రికార్డుల ఏడీ వద్ద..79, మీసేవ ఏవో వద్ద..62, డీపీఓ 49, ఎండోమెంట్ ఈవో 21, జెడ్పీ సీఈఓ 23, వికలాంగుల సంక్షేమశాఖ 20, జీజీహెచ్ 18, రిజి స్ట్రార్10, మైనర్ ఇరిగేషన్14, మైనింగ్ ఏడీ(గుం టూరు), ఆర్డబ్ల్యూఎస్ 9, మైనార్టీ వెల్ఫేర్ 8, ఎక్సైజ్, హయ్యర్ ఎడ్యుకేషన్ వద్ద 7 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇవన్నీ కూడా కొన్ని విభాగాలకు చెందిన జిల్లా అధికారుల వద్ద పెండింగ్‌లో ఉ న్న దరఖాస్తులు. ఇవికాక మండలాల్లోని ప్రభుత్వ కా ర్యాలయాల్లో వందలసంఖ్యలో ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయి. పరిష్కారానికి కృషి ఏదీ? గ్రీవెన్స్ ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ, వాటి పరిష్కారానికి కృషి జరగడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ప్రజా సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి, వాటిని పరిష్కరించాల్సిన అధికారుల తీరుపై ప్రజలు అసహ నం వ్యక్తంచేస్తున్నారు. ఇకనైనా అధికారులు తమ సమస్యలపై మానవతా దృక్పథంతోనైనా పరిష్కరించాలని ఫిర్యాదుదారులు కోరుతున్నారు. -
బ్యాంకులకు టోకరా
‘నకిలీ’లు బ్యాంకులకే కన్నం వేశారు. బోగస్ పాస్‌పుస్తకాలతో బురిడీ కొట్టించి కోట్లాది రూపాయలను కొల్లగొట్టారు. సర్కారు స్థలాలను తనఖా పెట్టి కొందరు.. లేని భూమిని పట్టాదారు పుస్తకాల్లో చూపించి మరికొందరు.. దొంగ పాస్‌పుస్తకాలు, ఫోర్జరీ సంతకాలతో ఇంకొందరు బ్యాంకులకు టోకరా కొట్టారు. బ్యాంకర్ల హస్తలాఘవం.. రెవెన్యూ సిబ్బంది అండదండలతో గుట్టుగా సాగిన ఈ అవినీతి పరంపర వెలుగులోకి వస్తోంది. జిల్లాలో దాదాపు రూ.5 కోట్ల మేర కుంభకోణంజరిగినట్లు ప్రాథమికంగా గుర్తించిన యంత్రాంగం.. ఈ బాగోతంపై లోతుగా విచారణ జరపాలని నిర్ణయించింది. - బోగస్ పాస్‌పుస్తకాలతో రూ.5 కోట్ల మేర కుచ్చుటోపీ - అధికారుల విచారణతో వెలుగులోకి అక్రమాల చిట్టా - బ్యాంకర్ల హస్తం.. రెవెన్యూ సిబ్బంది చేతివాటం సాక్షి, రంగారెడ్డి జిల్లాప్రతినిధి: గతంలో పహాణీ, పట్టా పాస్‌పుస్తకాలను అట్టిపెట్టుకొని బ్యాంకులు రుణాలు మంజూరు చేసేవి. ఇదే అదనుగా కొందరు అక్రమార్కులు దొంగ పాస్‌పుస్తకాలను సృష్టించి సర్కారీ స్థలాలను రికార్డుల్లోకెక్కించి బ్యాంకర్లను తప్పుదోవ పట్టించారు. రుణగ్రహీత దరఖాస్తును నిశితంగా పరిశీలించకుండా.. క్షేత్రస్థాయిలో భూమి స్థితిగతులను తెలుసుకోకుండా రుణాలివ్వడంతో కోట్ల రూపాయలు పక్కదారి పట్టాయి. ఇటీవల ఈసీలు, ఆన్లైన్ పహాణీలను తప్పనిసరి చేయడంతో ఈ అవినీతి గుట్టు బయటపడింది. ఇప్పటికే యాచారం, మర్పల్లి, మంచాల, మోమిన్‌పేట, షాబాద్, గండేడ్, ధారూరు తదితర మండలాల్లో నకిలీ పాసు పుస్తకాలతో బ్యాంకులను మోసగించినట్లు రెవె న్యూ, బ్యాంకు యాజమాన్యాలు గుర్తించాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లాలో వెలుగు చూసిన నకిలీ పాసు పుస్తకాల రాకెట్‌ను తలదన్నెలా జిల్లాలోనూ ‘బోగస్’ చిట్టా బహిర్గతమవడం అధికారవర్గాలను విస్మయపరుస్తోంది. తిలాపాపం.. తలా పిడికెడు! నకిలీ పాస్ పుస్తకాలతో రుణాలు పొందడమే కాకుండా.. రుణ మాఫీ కూడా వర్తింపజేయడంతో సర్కారు ఖజానాకు భారీగా చిల్లు పడింది. బోగస్ పట్టాల సృష్టిలో రెవెన్యూ సిబ్బంది కీలక పాత్ర పోషించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. తహసీల్దార్/ ఆర్డీఓ కార్యాలయాల నుంచి తస్కరించిన పాస్‌పుస్తకాల్లో ఫోర్జరీలతో బినామీలను సృష్టించి బ్యాంకులకు టోపీ పెట్టారు. బ్యాంకర్లు కూడా పాస్ పుస్తకాలు అసలువా? నకిలీవా అనేది తేల్చుకోకపోవడం.. రికార్డుల్లో నమోదైన భూమిపై క్షేత్రస్థాయిలో తెలుసుకోకపోవడం నిధుల దుర్వినియోగానికి దారి తీసింది. అంతేకాకుండా మీ-సేవ కేంద్రాల్లో రికార్డులను ట్యాంపరింగ్ చేసి వాటి ద్వారా రుణాలు తీసుకున్న విషయాన్ని కూడా బ్యాంకర్లు పసిగట్టలేకపోయారు. రుణ వితరణలో దళారీల ప్రమేయం కూడా తోడు కావడంతో రుణాలు అనర్హుల పాలయినట్లు తెలిసింది. నకి‘లీలలు’ మచ్చుకు కొన్ని.. - యాచారం మండలం నక్కర్తమేడిపల్లి, పల్లె చెల్కతండా, నల్లవెల్లి, మంతన్‌గౌరెల్లి, మొండిగౌరెల్లి తదితర గ్రామాల్లో ప్రభుత్వ భూములను పాస్‌పుస్తకాల్లో చూపి.. బ్యాంకులను మోసం చేశారు. ఇప్పటికే దాదాపు 150 మంది నకిలీ పాసుపుస్తకాలతో బ్యాంకుల నుంచి రుణాలు పొందినట్లు తేలింది. ఈ తతంగంలో ఆరుగుర్ని అరెస్టు చేసిన పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. - మంచాల మండలం బోడకొండ దక్కన్ గ్రామీణ బ్యాంకులో నకిలీ పాస్బుక్కులతో పెద్ద సంఖ్యలో బినామీ రైతులు రుణాలు పొందగా.. ఇటీవల ప్రభుత్వం అమలు చేసిన రుణమాఫీకి సైతం అర్హుల య్యా రు. గ్రామపంచాయతీలో అర్హుల వివరాలను ప్రదర్శించిన సమయంలో అనర్హుల చిట్టా బయటపడింది. దీంతో స్థానిక రెవెన్యూ యంత్రాంగం పట్టాదారు పుస్తకాల జారీపై పూర్తిస్థాయి విచారణకు ఉపక్రమించింది. - మోమిన్‌పేట మండలం చిట్టెంపల్లి, రాళ్లడుగుపల్లి, ఎన్కెపల్లి, మోమిన్‌పేట, మర్పల్లి మండలం మొగిలిగుండ్ల, కోంశెట్టిపల్లి, కోటమర్పల్లి గ్రామాల్లో 25 మంది ఖాతాదారులు బోగస్ పీటీ బుక్కులతో బుధేరా కార్పొరేషన్ బ్యాంకు నుంచి లక్షలాది రూపాయలను రుణంగా పొందారు. - పరిగి మండల పరిధిలోని రంగాపూర్, మాదారం, రాఘవాపూర్, లఖ్నాపూర్, నస్కల్, సయ్యద్‌మల్కాపూర్, మల్లెమోనిగూడ, గండేడ్ మండలంలో రెడ్డిపల్లి, బల్సుర్‌గొండ, బల్సుర్‌గొండ తండా, కొండాపూర్‌లలో, దోమ మండల పరిధిలోని గూడూరు, పూడూరు మండల పరిధిలోని రాకంచర్ల, తిర్మలాపూర్, తదితర గ్రామాల్లోని భూములకు సంబంధించి పలువురు రైతులు వెయ్యి ఎకరాలపై బినామీలు పాసుపుస్తకాలు సమర్పించి దాదాపు రూ.3కోట్ల మేర రుణాలు పొందారు. ఈ తంతును గుర్తించిన అధికారులు క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నిర్ణయించారు. -
పచ్చనోటిస్తేనే పాస్ అవుతోంది
♦ జేసీ ఫోన్ఇన్లో బాధితుల ఫిర్యాదులు ♦ మూడు రోజులకు ఒకసారి ఫోన్ ఇన్ - జాయింట్ కలెక్టర్ ఒంగోలు టౌన్ : జిల్లాలో జరుగుతున్న మీ ఇంటికి మీ భూమి కార్యక్రమంపై మూడు రోజులకు ఒకసారి ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జాయింట్ కలెక్టర్ హరిజవహర్‌లాల్ వెల్లడించారు. శుక్రవారం తన చాంబర్లో నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమం ముగిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కోర్టు పరిధిలో లేని భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. పట్టాదారు పాస్ పుస్తకాలు వంటివి పారదర్శకంగా అందించేందుకు మీ సేవ కేంద్రాల ద్వారా ఇస్తున్నట్లు తెలిపారు. ప్రజలు కూడా దళారీలను ఆశ్రయించకుండా నేరుగా మీ సేవ కేంద్రాలకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జిల్లాలో ఈనెల 10నుండి ప్రారంభమైన మీ ఇంటికి మీ భూమికి సంబంధించి ఇప్పటివరకు 14090అర్జీలు వచ్చాయని, అందులో 7213అర్జీలను అక్కడికక్కడే పరిష్కరించినట్లు చెప్పారు. 826అర్జీలను తిరస్కరించినట్లు తెలిపారు. ఆర్ఎస్ఆర్కు సంబంధించి 93గ్రామాల్లో 2లక్షల 90వేల రికార్డులను నమోదు చేశామని, మరో 4లక్షల రికార్డులను నమోదు చేయాల్సి ఉందని వివరించారు. ఫోన్ ఇన్ కార్యక్రమంలో సర్వే అండ్ ల్యాండ్ ఏడీ నరసింహారావు, డీ సెక్షన్ సూపరింటెండ్ ప్రసాద్‌లు పాల్గొన్నారు. ఫిర్యాదుల పరంపర... పచ్చనోటిస్తేనే పాస్ బుక్కులు పాసవుతున్నాయని, అవినీతి రాజ్యమేలుతోందని పలువురు బాధితులు జాయింట్ కలెక్టర్ హరి జవహర్లాల్ తన చాంబర్లో శుక్రవారం నిర్వహించిన ఫోన్‌ఇన్‌కు ఫిర్యాదు చేశారు. టైటిల్ డీడ్ కోసం నాలుగు నెలల నుంచి దర్శి తహసీల్ధార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని దర్శి మండలం ముండ్లమూరుకు చెందిన అంబవరపు వెంకటరెడ్డి ఫిర్యాదు చేశారు. టైటిల్ డీడ్ ఇప్పిస్తానంటూ వీఆర్ఓ ఆరువేల రూపాయలు తీసుకున్నా పని మాత్రం జరగలేదన్నారు. దీనికి జేసీ స్పందిస్తూ మీ సేవ కేంద్రం ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దర్శిలో ఉంటున్న తన అన్న తిరుపతిరెడ్డికి సర్వే నెం 3లో 2.70 ఎకరాల భూమి ఉందని, ఆయన ఇటీవల మరణించడంతో తన వదిన పేరున పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వాలని తహసీల్ధార్‌ను కోరితే రూ.1500 డిమాండ్ చేశారని ప్రస్తావించగా వెంటనే తిరుపతిరెడ్డి భార్యకు పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వాలని దర్శి తహసీల్ధార్‌ను ఆదేశించారు. ఇంకొల్లు తహసీల్ధార్ కార్యాలయంలో కరప్షన్ ఎక్కువైంది. ప్రతి పనికి డబ్బులు అడుగుతున్నారు. కరప్షన్‌ను అరికట్టాలని ఇంకొల్లు మండలం సుబ్బారెడ్డిపాలెంకు చెందిన రామకోటిరెడ్డి ఫిర్యాదు చేశాడు. తాను కొనుగోలు చేసిన భూమిని ప్రభుత్వ భూమిగా చూపిస్తున్నారని, న్యాయం చేయాలని కోమటిగుంట కృష్ణ అనే వ్యక్తి వేడుకోగా వెంటనే సమస్యను పరిష్కరించాలని జేసీ రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. పాస్ పుస్తకానికి ఏడాది నుంచీ తిప్పుకుంటున్నారని పొన్నలూరు మండలం వెలటూరు గ్రామానికి చెందిన కొండేటి వెంకటేశ్వర్లు ఫిర్యాదు చేశాడు. పొన్నలూరు తహసీల్ధార్ కల్యాణ్‌తో జేసీ ఫోన్లో మాట్లాడి పరిష్కరించాలని సూచించారు. తన భూమి వివరాలను మీ సేవలో చూసుకుంటే ఒక్క సెంట్ కూడా తన పేరు లేకుండా ఆక్రమించేశారని అర్ధవీడు మండలం కాకర్లకు చెంధిన పెరికె లక్ష్మణబాబు వాపోయాడు. దీనిపై విచారించి నివేదిక ఇవ్వాలని రెవెన్యూ అధికారిని ఆదేశించారు. -
‘రద్దు’తో రైతుకు కొత్త చిక్కులు
కంటిలో నలక పడిందని కన్ను తీసేస్తామన్నట్టు పాస్ పుస్తకాల రద్దుతో లంచగొండి తనం మటుమాయం కాదుగానీ రైతుల కష్టాలకు అంతుండదు. ఇక, 1బి రికార్డు ద్వారానే బ్యాంకు అప్పులు తదితర లావాదేవీలు జరిపిస్తామనడం వెర్రితనం. రైతుల పట్టాదారు పాస్ పుస్త కాలను త్వరలోనే రద్దు చేస్తా మంటూ ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన ప్రకటన రాష్ట్ర రైతాంగాన్ని తీవ్ర ఆందో ళనకు గురిచేస్తోంది. గతంలో రైతులు ఎదుర్కొనవలసి వస్తుండిన అనేక సమస్యలకు విరుగుడుగానే నాటి ముఖ్య మంత్రి యన్.టి.రామారావు పట్టాదారు పాస్ పుస్తకా లను ప్రవేశపెట్టారు. దీంతో అంతవరకు బ్యాంకులు, గ్రామీణ సహకార పరపతి సంఘాల రుణాల విషయం లో రైతాంగం ఎదుర్కొంటున్న అనేక ఇబ్బందులు తొల గిపోయాయి. అంతేకాదు రైతాంగానికి నేడు అవి అత్యా వశ్యకమైనవిగా మారాయి కూడా. వాటిని రద్దు చేస్తా మంటూ ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయం రైతులను ఒక్కసారిగా అయోమయ పరిస్థితులలో పడ వేసింది. ప్రభుత్వం అంటున్నట్టుగా పాస్‌బుక్కులు రద్ద య్యేసరికే ‘1బి’లో (భూమి హక్కును తెలిపే రికా ర్డు)ఆన్లైన్లో భూయజమానులుగా తమ పేర్లు నమోదు అవుతాయనే భరోసా లే దు. కాబట్టి పాసు పుస్తకాల రద్దు తర్వాత తమ పరిస్థితి ఏమిటో తెలియని ఆందోళనలో రైతాంగం ఉంది. పెద్ద సంఖ్యలో రైతులు ఇప్పటికీ పాసు పుస్తకాల కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరు గుతూనే ఉన్నారు. పాస్ బుక్ కోసం రూ.4 లక్షల లంచం అడగడంతో కడప జిల్లాలో ఒక రైతు ఆత్మహత్య చేసుకో వాల్సివచ్చింది! ప్రభుత్వం రద్దు చేస్తామంటున్న పాస్ పుస్తకానికి రైతాంగంలో ఎంత విలువందో ఇది తెలియ జేయడం లేదా? పాసు పుస్తకాల జారీలోని అవినీతిని, వాటి దుర్వినియోగాన్ని అరికట్టాలంటే రెవెన్యూ వ్యవస్థ లోని లోపాలను సరిదిద్దాలి. పాసుపుస్తకాల రద్దు ఎలా ఆ పని చేయగలదో ఎవరికీ అర్థంకానిది. ఇక ప్రభుత్వం సూచిస్తున్న ప్రత్యామ్నాయం పూర్తి అయోమయం. ఏ రిజిష్టరులో గ్రామ కంఠాలుగా నమోదైన భూములను ఇప్పుడనుభవిస్తున్న రైతులకిస్తారా లేక ప్రభుత్వ భూమి కింద నమోదు చేస్తారా? సమాధానం లేదు. ‘1బి’ రికా ర్డుల్లో 50 శాతం కూడా అసలు రైతుల పేర్లు నమోదు కాలేదు. దస్తావేజులన్నీ ఉన్నా విలువైన భూములను 1బిలో చేర్చాలంటే రైతులు ఎంతో కొంత చేయి తడపా ల్సిందే. 1బి రికార్డు సరిచేయడం మంచిదే. కానీ అదేమీ ఒకటి, రెండు వారాల్లో అయ్యేది కాదు. 1బి లో అసలు రైతుల పేర్లను నమోదు చెయ్యాలంటే... చాలా సంద ర్భాల్లో పూరా నంబరులోని మొత్తం భూమికంటే ఎక్కు వ భూమి ఇప్పటికే నమోదయి ఉంటోంది. ఆ పూరా నంబర్లలో నమోదై ఉన్న రైతుల దస్తావేజులను తనిఖీ చేయాలి. కొన్ని సందర్భాలలో తిరిగి సర్వే చేయిస్తే తప్ప పూర్తి రికార్డుగా పరిగణించలేం. దీనికి చాలా సమయమే పడుతుంది. సర్వేయర్లూ పెద్ద సంఖ్యలో కావాలి. లేక పోతే 1బి తప్పుల తడకగా ఉండటం ఖాయం. ఇప్పటికే ప్రభుత్వ అవసరాల కోసం తీసుకున్న భూమిని సబ్ డివి జన్ చేయలేదు. అది కూడా మొత్తం సర్వే నంబర్లలో, అసైన్డ్ భూమి కింద సబ్ రిజిస్ట్రార్ రికార్డులలో నమోదై ఉంది. ఆ సర్వే నంబరులో మిగిలి ఉన్న రైతుల భూమిని అమ్మాలంటే రెవెన్యూ వారు అడంగల్ సబ్ డివిజన్ చేసి, వాటి 1బిలలో మార్పులు చేసి, సబ్ రిజిస్ట్రార్ ద్వా రా, జిల్లా రిజిస్ట్రార్‌కి పంపాలి. ఆ తర్వాత ఐజీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ అధికారి నుంచి ఆదేశాలు వస్తే తప్ప రిజిస్ట్రేషన్ కాదు. ఒక సామాన్య రైతు ఇంత పని చేయడం చాలా కష్టం. రెవెన్యూ వ్యవస్థలో మార్పులు చేయాల్సిన అవసరం ఉండటం వల్ల రికార్డు సరిచేయ కుండా మార్పు చేస్తే రైతులకు తమ భూమి, ఏఏ నంబ ర్లలో ఉందో అర్థం కాని పరిస్థితి ఎదురవుతుంది. కం టిలో నలక పడిందని కన్ను తీసేస్తామన్నట్టు పాస్ పుస్త కాలను రద్దు చేసేస్తే... లంచగొండితనం మటుమాయం కాదుగానీ రైతుల కష్టాలకు అంతుండదు. ఇక, 1బి రికార్డు ద్వారానే బ్యాంకు అప్పులు తదితర లావా దేవీలు జరిపిస్తామనడం వెర్రితనం. 1బి రికార్డు సరి చేయవలసింది రెవెన్యూ అధికారులు కారా? కంప్యూట ర్లో 1బి రికార్డు నమోదుకు వారు లంచం తీసుకోరా? మరి పాస్ పుస్తకాల రద్దుతో ప్రయోజనం ఏమిటి? రాష్ట్రంలో ప్రభుత్వం పని చేయడం లేదు, అంతా అధి కారుల పాలనే. కాబట్టి పాస్ పుస్తకాల జారీని క్షేత్ర స్థాయిలో పరిశీలించి ఆ క్రమంలో సమూల మార్పులు తెచ్చి పాస్ పుస్తకాల జారీని సులభతరం చేయాలి. మరో ముఖ్యమైన అంశం కాలువల ఆధునికీకరణ. డా॥వై.ఎస్. రాజశేఖరరెడ్డి గారు పురాతన డెల్టా వ్యవ స్థను పూర్తి స్థాయిలో ఆధునికీకరణం చేయడానికి నడుం బిగించారు. కాగా, ప్రస్తుత ప్రభుత్వం డెల్టా ఆధునికీ కరణనే రద్దు చేసింది. ఇక రుణమాఫీ అంటూ ఆర్భాటం చేసి, రైతు వ్యవస్థనే రద్దు చేయబోతోంది. సహకార సం ఘాల ద్వారా దీర్ఘకాలిక అప్పులకు వడ్డీ రాయితీ జీఓ ఇవ్వక దాన్నీ రద్దు చేసింది. ఇక వ్యవసాయ యాంత్రీక రణ పేరిట కొందరు టీడీపీ కార్యకర్తలు సబ్సిడీ యంత్రా లను రైతులకు అమ్మి సొమ్ము చేసుకొంటున్నారు. ఇదిలా ఉండగా, రైతులకు విత్తనాలను సరఫరా చేయలేక, వారిని నేరుగా ప్రైవేట్ మార్కెట్లో కొనుక్కోమనే నిస్స హాయ స్థితిలో ప్రభుత్వం ఉంది. రైతులకు లాభసాటి యైన కనీస మద్దతు ధరను ఇవ్వకపోగా, ఎరువుల సబ్సి డీని మధ్య దళారుల చేతికి అందించి రైతుని దగా చేస్తోం ది, వ్యవసాయరంగాన్ని నష్టపరుస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం తన తప్పుడు విధానాలు విడనాడి రైతుకింత మేలు చేసే దిశకు మరలాలని కోరుతున్నాం. (వ్యాసకర్త రాష్ట్ర నీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య ప్రధాన కార్యదర్శి) మొబైల్: 9440204323 - కొవ్వూరి త్రినాథరెడ్డి -
మరో 10 నకిలీ పాసుపుస్తకాలు
కలిగిరి : కలిగిరిలోని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్‌లో 10 నకిలీ పాసుపుస్తకాలు, అడంగళ్, 1బీలతో రుణాలు పొందినట్లు తహశీల్దార్ లావణ్య గుర్తించారు. కలిగిరిలో ఏపీజీబీలో తీసుకున్న పంట రుణాలపై శనివారం తహశీల్దార్ విచారణ జరిపారు. ఇటీవల ఏపీజీబీలో నకిలీ పాసుపుస్తకాలతో రుణాలు పొందడానికి ప్రయత్నిస్తుండగా బ్యాంకుమేనేజర్‌కు అనుమానంవచ్చి పట్టుకున్న విషయం తెలిసిందే. దీనిపై తహశీల్దార్ విచారణ చేపట్టారు. అందులో భాగంగా 2014 నవంబర్ నుంచి మంజూరు చేసిన 150 పంట రుణాలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను పరిశీలించారు. వాటిలో 10 మంది నకిలీ పాసుపుస్తకాలు, అడంగల్, 1బీలతో రుణాలు పొందినట్లు గుర్తించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ లావణ్య మాట్లాడుతూ 10 మందికి సంబంధించిన పాసుపుస్తకాలు, అడంగళ్, 1బీలు పూర్తిస్థాయిలో రెవెన్యూ రికార్డుల్లో పరిశీలిం చి, నిర్ధారించుకున్న అనంతరం సంబంధిత వ్యక్తులపై కేసులు పెడతామన్నారు. బ్యాంక్‌ను మోసం చేసి రుణాలు పొందినందుకు బ్యాంకు తరుఫున కూడా కేసు పెట్టాలని మేనేజర్ వీరరాఘవులుకు సూచించారు. ఈ టెక్నాలజీకి సంబంధించిన అడంగళ్, 1బీలను ఫోర్జరీ చేయడాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతామన్నారు. నకిలీ పాసుపుస్తకాల సూత్రధారులను పట్టుకుంటే పూర్తివిషయాలు వెలుగులోకి వస్తాయన్నారు. 10 మంది నకిలీ పాసుపుస్తకాలు, అడంగళ్, 1బీల వివరాలను నమోదు చేసుకున్నారు. -
పట్టాదారు పాసుపుస్తకాలు రద్దు!
* రాష్ట్రప్రభుత్వ సూత్రప్రాయ నిర్ణయం * టైటిల్ డీడ్స్ కూడా కాలగర్భంలో కలసినట్టే.. * ఇక అన్నింటికీ ‘1-బి’నే ఆధారం * ‘మీ భూమి’ నుంచి ‘1-బి’ రికార్డు నేరుగా డౌన్లోడ్ * ‘వెబ్‌ల్యాండ్’ డేటా ప్రకారం బ్యాంకు రుణాలు * మరి పట్టాదారు పాసుపుస్తకాలు రద్దయితే రైతులకు బ్యాంకు రుణాలెలా? సాక్షి, హైదరాబాద్: కొండనాలుకకు మందేసి ఉన్న నాలుక ఊడగొట్టే చందంగా ఉంది సర్కారు తీరు. రెవెన్యూశాఖలో అక్రమాలను నియంత్రించలేక ఏకంగా పట్టాదారు పాసుపుస్తకాలను రద్దు చేయాలని నిర్ణయించింది. ఫలితంగా రైతులు ఎంతో విలువైన ఆస్తి పత్రాల్లా భావించే పట్టాదారు పాసుపుస్తకాలకు కాలం చెల్లనుంది. పట్టాదారు పాసుపుస్తకాల జారీ, వెబ్‌ల్యాండ్‌లో భూ వివరాల అప్డేట్, మ్యుటేషన్లు(భూ యాజమాన్య హక్కుల సవరణ) కోసం క్షేత్రస్థాయి రెవెన్యూ సిబ్బంది భారీ అక్రమాలకు పాల్పడుతున్నారంటూ విమర్శలు రావడం, వీటిపై పత్రికల్లోనూ కథనాలు రావడంతోపాటు రెవెన్యూ అక్రమాలను నియంత్రించలేకపోతున్నామంటూ జాయింట్ కలెక్టర్లు రెవెన్యూ మంత్రి సమక్షంలోనే పేర్కొన్న నేపథ్యంలో ప్రభుత్వం దీనిపై చర్చించింది. అయితే అక్రమాలను నియంత్రించే మార్గాలను అన్వేషించే బదులుగా సమస్యకు పరిష్కారంగా ఏకంగా పట్టాదారు పాసు పుస్తకాలను రద్దు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయానికి వచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. ఈ దిశగా ప్రభుత్వం తుదినిర్ణయం తీసుకుని కార్యరూపంలోకి తెస్తే పట్టాదారు పాసుపుస్తకాలకు కాలం చెల్లినట్లే. పట్టాదారు పాసుపుస్తకాల విధానాన్ని రద్దు చేయడమంటే టైటిల్‌డీడ్స్(భూ యాజమాన్యహక్కుల పత్రాలు)నూ కాలగర్భంలో కలిపేసినట్లే. ఇక ‘1-బి’నే ఆధారం! రైతులు ప్రస్తుతం పట్టాదారు పాసుపుస్తకాలను తనఖాపెట్టి వాణిజ్య, సహకార బ్యాంకుల్లో దీర్ఘకాలిక, స్వల్పకాలిక రుణాలు పొందుతున్నారు. ప్రభుత్వం పట్టాదారు పాసుపుస్తకాల విధానాన్ని అధికారికంగా రద్దు చేస్తే.. ప్రత్యామ్నాయంగా ప్రస్తుతం రెవెన్యూ శాఖలో ఉన్న ‘1-బి’(భూ యాజమాన్య) రికార్డు జిరాక్స్ పత్రాలను ఉపయోగించవచ్చని అధికారులు చెబుతున్నారు. ఆ మేరకు రైతులు ‘మీభూమి’ వెబ్సైట్ ద్వారా ‘1-బి’ నుంచి వారికి చెందిన భూముల వివరాలను డౌన్లోడ్ చేసుకుని బ్యాంకుల్లో పెట్టి రుణాలు పొందవచ్చని సూచిస్తున్నారు. ‘సర్కారు భూమి’(మీ భూమిలోని డేటానే ఇందులో ఉంటుంది) వెబ్‌ల్యాండ్ ఆధారంగా రుణాలిచ్చేలా బ్యాంకులను ప్రభుత్వం ఒప్పించనుంది. రైతుల భూముల డేటా నేరుగా చూసుకునేందుకు వీలుగా ఇప్పటికే బ్యాంకులకు ‘సర్కారు భూమి’ వెబ్‌ల్యాండ్‌ను రెవెన్యూ శాఖ అందుబాటులోకి తెచ్చింది. దీనిప్రకారం రుణాలివ్వడంలో బ్యాంకులకు అభ్యంతరం ఉండకపోవచ్చునంటున్నారు. ప్రైవేటు రుణాల మాటేమిటి? సన్న, చిన్నకారు రైతులకు బ్యాంకులిస్తున్న రుణాలు పది శాతమే. మిగిలిన 90 శాతం వరకు వడ్డీ వ్యాపారులనుంచే రుణాలు పొందుతున్నారు. వడ్డీ వ్యాపారులు చాలామంది పట్టాదారు పాసుపుస్తకాలను, భూముల కొనుగోలు డాక్యుమెంట్లను తనఖా పెట్టుకుని రుణాలిస్తున్నారు. ఈ పుస్తకాలు రద్దయితే ప్రైవేటు వ్యాపారుల నుంచి రుణాలు పొందడం చిన్న రైతులకు ఇబ్బంది కావచ్చని రెవెన్యూ అధికారులు సైతం అంగీకరిస్తుండడం గమనార్హం. రద్దు ఎలా పరిష్కారం.. రెవెన్యూలో అక్రమాల నియంత్రణకు పాసు పుస్తకాలను రద్దు చేయడం ఎలా పరిష్కారమో అర్థంకాని ప్రశ్నగా మారిందని ఈ శాఖలో సుదీర్ఘ అనుభవమున్న అధికారులు అంటున్నారు. వెబ్‌ల్యాండ్ డేటాలో సర్వే నంబర్లవారీగా రైతుల భూముల వివరాలుంటేనే బ్యాంకులు రుణాలిస్తాయి. ఇప్పటివరకూ 40 నుంచి 50 శాతం డేటాలోకి ఎక్కలేదు. పట్టాదారు పాసు పుస్తకాలను రద్దు చేస్తే వీరికి బ్యాంకు రుణాలెలా వస్తాయి? వెబ్‌ల్యాండ్‌లోకి భూవివరాలు ఎక్కించాలంటే రెవెన్యూ సిబ్బంది డబ్బు డిమాండు చేస్తుంటే.. దీనిని కట్టడి చేయడం మాని వెబ్‌ల్యాండ్ ఆధారంగా రుణాలిప్పించే విధానం తెస్తామని చెప్పడంలో అర్థమేంటీ? ’ అని ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో అన్నారు. -
పైకమిస్తేనే పాస్ పుస్తకం
‘రెవెన్యూ’ చేతివాటం - రూ.25 వేల నుంచి లక్ష వరకు వసూలు - ఇప్పటికే పెండింగ్‌లో టైటిల్‌డీడ్స్, పాస్‌పుస్తకాలు - అధికారులు పట్టించుకోవడం లేదంటున్న ప్రజలు విజయవాడ : స్థిరాస్తి లావాదేవీలకు కీలకమైన పట్టాదారు పాస్‌పుస్తకం, టైటిల్ డీడ్స్ మంజూరులో రెవెన్యూ అధికారుల చేతివాటం పెచ్చుమీరింది. లంచాలు ఇస్తేనే పాస్ పుస్తకాలు మంజూరవుతున్నాయి. తహశీల్దార్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు పాస్ పుస్తకాలు ఇచ్చేందుకు వేలాది రూపాయలు గుంజుతున్నారు. స్థిరాస్తి వ్యాపారం చేస్తున్న రియల్టర్లు, బిల్డర్లు భూములు, క్రయ విక్రయాలు చేసి చేతులు మార్చుకోవటానికి దండిగా పైకం ఇచ్చి పాస్ పుస్తకాలు పొందటాన్ని అలవాటు చేశారు. ఆస్తుల క్రయ, విక్రయాలు, బ్యాంకు రుణాలు, తనఖాలకు విధిగా పట్టాదారు పాస్‌పుస్తకం అవసరం కావడంతో వాటి కోసం ప్రజలు రెవెన్యూ సిబ్బందికి లంచాలు సమర్పించుకోవాల్సి వస్తోంది. గత నాలుగేళ్లుగా పాస్ పుస్తకం కావాలంటే కనీసం రూ.25 వేల నుంచి లక్ష వరకు వసూలు చేస్తున్నారు. కాగా జిల్లా వ్యాప్తంగా 50 మండల రెవెన్యూ కార్యాలయాల్లో కనీసం 30 కార్యాలయాల్లో కుప్పలుతెప్పలుగా పాస్ పుస్తకాలు పెండింగ్‌లో ఉన్నాయి. విజయవాడ, మచిలీపట్నం, గుడివాడ, నూజివీడు రెవెన్యూ డివిజన్ల్లో 10 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. పాస్ పుస్తకం కోసం మీసేవలో దరఖాస్తు చేసి రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారని విమర్శలు వస్తున్నాయి. భారీ మొత్తంలో డబ్బు ఇచ్చిన వారికి రోజుల్లో పాస్‌పుస్తకం మంజూరవుతోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. పాస్ పుస్తకం జారీ ఇలా.. పాస్ పుస్తకం పొందాలంటే ముందుగా మీసేవ కేంద్రంలో దరఖాస్తు చేయాలి. దాన్ని వీఆర్ఓ పరిశీలించి నివేదిక రాయాలి. రెవెన్యూ ఇన్స్పెక్టర్ విచారించి తహశీల్దార్‌కు నివేదిక ఇస్తారు. ఇదంతా జరగడానికి కనీసం నెల రోజుల వ్యవధి పడుతోంది. టైటిల్ డీడ్స్‌ను రెవెన్యూ డివిజనల్ అధికారి మంజూరు చేస్తారు. తహశీల్దార్‌కు పంపినా ఆర్డీవో కార్యాలయాల్లో అవి కదలటం లేదు. లంచాలు ఇచ్చిన వారికి మాత్రం టైటిల్ డీడ్స్ ఇచ్చేస్తున్నారు. బ్రోకర్ల హవా కాగా పాస్ పుస్తకాలు, టైటిల్ డీడ్స్ మం జూరులో రెవెన్యూ కార్యాలయాల వద్ద బ్రోకర్లు హల్చల్ చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న కొందరు బ్రోకర్లు రెవెన్యూ సిబ్బందితో మిలాఖత్ అయి పాస్‌పుస్తకాలకు రేటు కుదిర్చి మంజూరు చేయిస్తున్నారు. బ్రోకర్లు ద్వారా వెళ్లిన వారికి పాస్‌పుస్తకాలు వెంటనే మంజూరు అవుతున్నాయని ప్రజలు చెబుతున్నారు. పాస్ పుస్తకాలు రద్దు చేసే యోచన కాగా పాస్ పుస్తకాలను రద్దు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అవినీతిని అరికట్టలేక పట్టాదారు పాస్ పుస్తకాల వ్యవస్థను పూర్తిగా రద్దు చేసి దాని స్థానంలో ప్రత్యామ్నాయంగా ఆస్తి ధృవీకరణ సర్టిఫికెట్ జారీ చేసే విషయం పరిశీలిస్తున్నట్లు సమాచారం. -
పట్టాలు, పాస్‌పుస్తకాలు ఉంటే పరిహారం ఓకే
- సాగులో ఉండేవాటిపై చర్చించి నిర్ణయిస్తాం : ఆర్టీవో - ఎకరాకు రూ.10లక్షలు ఇవ్వాలని రైతుల డిమాండ్ శ్రీకాళహస్తి: రైతులకు పాస్‌పుస్తకాలు...పట్టాలు ఉంటే పరిహారం ఓకే.... ఇవే వీ లేకుండా రైతులు సాగుచేసుకుంటున్న భూములకు పరిహారం ఇచ్చే విషయం పై మాత్రం చర్చించి నిర్ణయం తీసుకుంటాం’ అని తిరుపతి ఆర్డీవో వీరబ్రహ్మం అన్నారు. శ్రీకాళహస్తి మండలంలో భూ ముల సేకరణపై శనివారం తహశీల్దార్ కార్యాలయంలో ఆర్టీవో వీరబ్రహ్మంతో పాటు తహశీల్దార్ చంద్రమోహన్ రైతులతో రెండోసారి సమావేశం నిర్వహిం చారు. రైతులు తమకు ఉన్న కొద్దిపాటి భూములు ఇచ్చేస్తే ఎలా బతకాలి అం టూ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆర్డీవో వీరబ్రహ్మం మాట్లాడతూ గతం లో శ్రీసిటీ ఏర్పాటుకు రైతుల నుంచి భూములను ఉచితంగా సేకరించారు, ఇప్పుడు భూములకు డబ్బులు ఇస్తామని చెప్పినా సంకోచిస్తున్నారు ఎందు కు... అంటూ రైతులను ప్రశ్నించారు. అంతేకాదు ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు భూముల సేకరణను వ్యతిరేకించడం మాములే అంటూ రైతులకు తెలిపారు. డీకేటీ భూములు తీసుకునే హక్కు తమ కు ఉన్నా...ఆ భూములను అభివృద్ధి చేశారని ఉద్దేశంతో పరిహారం ఇస్తున్న ట్లు చెప్పారు. దీంతో రైతులు ఏర్పేడు మండలంలోని జంగాలపల్లి రైతులకు ప రిహారం ఇచ్చినట్టే తమకు ఇవ్వాలని కో రారు. ఏర్పేడు మండలంలో కేంద్ర ప్రభుత్వం విద్యాసంస్థలు ఏర్పాటు చే స్తుండడంతో వారే పరిహారం ఇస్తారని...శ్రీకాళహస్తి మండలంలో రాష్ట్ర ప్రభుత్వం పరిహారం చెల్లించాల్సి ఉం టుందని, ఏర్పేడు స్థాయిలో శ్రీకాళహస్తి మండలంలో పరిహారం చెల్లించడం కుదరదని తేల్చిచెప్పారు. పాస్‌పుస్తకాలు,పట్టాలు ఉన్నవారికి పరిహారం ఇస్తారని, ఇవిలేకుండా భూమిని సాగుచేసుకుంటున్న వారికి పరిహారం విషయమై చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలి పారు. భూములున్న పలువురు రైతుల నుంచి బ్యాంక్ అకౌంట్ నెంబర్లు తీసుకుంటున్నామని, అయితే వారందరికీ పరిహారం ఇస్తున్నట్లు కాదని...ఆ భూ ములపై సమగ్ర విచారణచేసిన తర్వాత వారు అర్హులైతేనే పరిహారం వస్తుందని తెలిపారు. రైతులు భూములు ఇవ్వకపోతే ఫ్యాక్టరీలు బెంగ ళూరు,చెన్నై,హైదరాబాద్‌కు వెళ్లే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అయితే రైతులు చివరగా ఎకరానికి రూ.10లక్షలు ఇస్తేనే భూములు ఇస్తామని, లేదంటే సెంటు భూమి ఇచ్చే ది లేద నిచెప్పారు. దీంతో ఆర్డీవో మరోసమావేశంలో పరిహారంపై చర్చలు జరిపి స్పష్టం చేస్తామని తెలిపారు. -
ఏసీబీకి చిక్కిన వీఆర్వో
విజయనగరం : లంచం తీసుకుంటూ ఓ వీఆర్వో ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఈ సంఘటన విజయనగరం జిల్లా గోర్ల మండలం కెల్ల గ్రామంలో మంగళవారం జరిగింది. వివరాలు..కెల్ల గ్రామ వీఆర్వో కె. రామారావు రైతులకు పాస్ పుస్తకాలు అందించేందుకు రూ.10వేలు డిమాండ్ చేశాడు. దీంతో రైతులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ అధికారులు పథకం ప్రకారం వీఆర్వోను పట్టుకున్నారు. వీఆర్వో ను అదుపులోకి తీసుకుని ,కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (గోర్ల) -
నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాల రాకెట్ ముఠా అరెస్టు
ఒంగోలు క్రైం: ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలంలో నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాల రాకెట్ ముఠాను పుల్లలచెరువు పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ చిరువోలు శ్రీకాంత్ బుధవారం విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి నకిలీ పాస్ పుస్తకాల తయారీ, అమ్మకంతోపాటు పలు అంశాలను వివరించారు. ఈ ఏడాది జనవరి 30న పుల్లలచెరువు మండల తహశీల్దార్ ఎన్.వెంకటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వివరించారు. పుల్లలచెరువు మండలం చెన్నంపల్లి గ్రామానికి చెందిన నారు వెంకటేశ్వరరెడ్డి నకిలీ పాస్ పుస్తకాల వ్యవహారానికి ప్రధాన సూత్రధారని పేర్కొన్నారు. వెంకటేశ్వరరెడ్డి గుంటూరు నగరంలోని లాలాపేటలో ఉన్న ప్రింటింగ్ ప్రెస్ యజమానులను ఆశ్రయించి నకిలీ పాస్ పుస్తకాల ప్రింటింగ్ చేయించేవాడు. అలా పూర్తి చేసుకున్న పాస్ పుస్తకాలను పుల్లల చెరువు మండలం ముటుకుల గ్రామానికి చెందిన ఉప్పాల శ్రీనివాసులు, యర్రగొండపాలెం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో డాక్యుమెంట్ రైటర్‌గా పని చేస్తున్న పూట్ల సుబ్బారావు, యర్రగొండపాలెంకు చెందిన ముక్కుమూడి రూబేనులకు పట్టాదారు పాస్ పుస్తకాలను విక్రయించేవాడు. ఈ పుస్తకాల్లో తహశీల్దార్ సంతకం, ఆర్ఐ సంతకం, వీఆర్ఓ సంతకంతోపాటు టైటిల్డీడ్లో ఆర్డీఓ సంతకాలు కూడా ఫోర్జరీవే. ఉప్పాల శ్రీనివాసులు ఫోర్జరీ సంతకాలు చేయటంలో చేయి తిరిగిన వ్యక్తి. పూట్ల సుబ్బారావు డాక్యుమెంట్ రైటర్‌గా పని చేస్తూ తహశీల్దార్, ఆర్డీఓ, ఆర్ఐల స్టాంపులను తయారు చేయించి ఈ పాస్ పుస్తకాలపై ముద్రించేవాడు. పూట్ల సుబ్బారావు డాక్యుమెంట్ రైటర్‌గా పని చేస్తూ తహశీల్దార్, ఆర్డీఓ, ఆర్ఐల స్టాంపులను తయారు చేయించి ఈ పాస్ పుస్తకాలపై ముద్రించేవాడు. ముక్కుమూడి రూబేనుతో కలిసి ఈ ముగ్గురు పుల్లలచెరువు గ్రామానికి చెందిన తంగెళ్ళ మూర్తయ్య, కొలకలూరి కుమార్, రాచకొండ నాగయ్యలకు విక్రయించేవారు. ఈ ముగ్గురూ కలిసి ఒక్కో రైతు వద్ద రూ.35 వేలు తీసుకొని పట్టాదారు పాస్ పుస్తకం, టైటిల్డీడ్లను అమ్మేసేవారు. ఈ విధంగా కొనుగోలు చేసిన వారు పొలాలున్నట్లుగా ఆ పాస్ పుస్తకాల్లో రాయించేసి బ్యాంకుల్లో రుణాలు కూడా పొందినట్లు తెలిసిందని ఎస్సీ తెలిపారు. ఫోర్జరీ సంతకాలతో నకిలీ పాస్ పుస్తకాలను తయారు చేసి దుర్వినియోగానికి పాల్పడినందుకుగాను వీరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఈ నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాల రాకెట్ ప్రస్తుతం పుల్లలచెరువు మండలం వరకు మాత్రమే విచారించామని, జిల్లావ్యాప్తంగా ఏమైనా ఇలాంటి పరిస్థితి ఉందేమోనని ప్రత్యేకంగా పోలీస్ బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. దాదాపు 500కుపైగా నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాలు వివిధ వ్యక్తుల వద్ద ఉన్నట్లు దర్యాప్తులో తేలిందన్నారు. పుల్లలచెరువులోని నాలుగు బ్యాంకుల్లో ఈ పాస్ పుస్తకాలను పెట్టి సుమారు రూ.2 కోట్లు రుణాలు పొందినట్లు సమాచారం ఉందని, అయితే ఆయా బ్యాంకులపై విచారణ చేపడతామన్నారు. రెవెన్యూ కార్యాలయంలో అధికారులు, సిబ్బంది, బ్యాంకుల్లో మేనేజర్లు, ఫీల్డు ఆఫీసర్ల పాత్రపై కూడా కన్నేసినట్టు పేర్కొన్నారు. వాళ్ళ ప్రమేయం ఉందని తేలితే ఆయా అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. పాస్ పుస్తకాలను ప్రింటింగ్ చేస్తూ నేరానికి సహకరించిన గుంటూరు నగరంలోని లాలాపేటకు చెందిన ప్రింటింగ్ ప్రెస్ యజమానులు ఆకుల రమేష్, రామ్మోహన్‌లను కూడా త్వరలో అరెస్ట్ చేస్తామన్నారు. సమావేశంలో ట్రైనింగ్ ఐపీఎస్ అధికారి బిఆర్ వరుణ్, జిల్లా అదనపు ఎస్పీ బి.రామానాయక్, మార్కాపురం డీఎస్పీ శ్రీహరిబాబు తదితరులు ఉన్నారు. -
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వీఆర్వో
బంట్వారం: ఒకవైపు లంచం అడిగితే నాకు చెప్పండి అని ముఖ్యమంత్రి చెప్తుంటే మరోవైపు ఏ చిన్న పని కావాలన్నా చేతులు తడపందే పని జరగటం లేదు. పట్టా మార్పిడి అయిన పాస్ పుస్తకాలు చేతికివ్వడానికి కూడా లంచం అడిగిన సంఘటన రంగారెడ్డి జిల్లాలో జరిగింది. గురువారం ఉదయం బంట్వారం మండలం రొంపల్లి గ్రామానికి చెందిన రైతు నర్సింహులు పట్టా మార్పిడి అయిన తన పాస్ పుస్తకాలివ్వమని వీఆర్వో శివకుమార్‌ను కోరాడు. దానికి వీఆర్వో మూడు వేలు లంచం అడగడంతో రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ముందుగా వల పన్నిన ఏసీబీ అధికారులు రైతు నుంచి శివకుమార్ లంచం తీసుకుంటున్న సమయంలో వీఆర్వోను రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. -
మాయం
బ్రహ్మంగారిమఠం: ఒకటికాదు.. రెండు కాదు.. ఏకంగా 145 పాస్ పుస్తకాలు మాయం అయ్యాయి. మండలంలో ఈ విషయం చర్చనీయాంశమైంది. రేకులకుంట గ్రామ పంచాయితీ పరిధిలోని జెడ్.కొత్తపల్లె గ్రామంలో ప్రభుత్వ బంజరు భూమి పట్టాలు పొందిన లబ్ధిదారులకు సంబంధించిన 145 పట్టాదారు పాసుపుస్తకాలు స్థానిక వీఆర్ఓ ప్రతాప్‌రెడ్డి స్వాధీనంలో ఉండేవి. మూడు రోజుల క్రితం రెవెన్యూ కార్యాలయంలోని ఆయన ట్రంకుపెట్టెలో నుంచి ఇవి మాయమైనట్లు సమాచారం. ఇవి చోరీకి గురయ్యాయా.. లేక మాయం చేశారా అనేది తెలియాల్సి ఉంది. బ్రహ్మంసాగర్ ముంపు గ్రామాలకు చెందిన వారికి డీకేటీ పట్టాలు ఇచ్చారు. ఇందుకు సంబంధించిన లబ్ధిదారులకు ఇవ్వటానికి పట్టాదారు పాసుపుస్తకాలు సిధ్దం చేశారు. భూములు చూపించిన అనంతరం పాసుపుస్తకాలు పంపిణీ చేసేందుకు తహశీల్దార్ సుబ్బరామయ్య సిద్ధంగా ఉండగా ఒక్కసారిగా ఇవి మాయమయ్యాయి. -
కాసులు కొట్టు.. పాస్‌బుక్ పట్టు
రెవెన్యూ సిబ్బంది వసూళ్ల పర్వం * పాస్‌పుస్తకాలు, టైటిల్ డీడ్లకు డిమాండ్ * భూముల క్రయవిక్రయాలు, బ్యాంకుల్లో రుణాల కోసం రైతుల పాట్లు గుడివాడ : జిల్లాలో పాస్‌పుస్తకాలు, టైటిల్ డీడ్లకు కొరత ఏర్పడింది. భూముల క్రయవిక్రయాలు చేయాలన్నా.. బ్యాంకుల్లో రుణాలు పొందాలన్నా పాస్‌పుస్తకం, టైటిల్ డీడ్ తప్పనిసరి. దీంతో వీటి కోసం రైతులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో భూముల క్రయవిక్రయాలు జోరందుకున్నందున పాత పట్టాదార్ పాస్‌పుస్తకాలు, టైటిల్ డీడ్లకు డిమాండ్ పెరిగింది. దీనిని ఆసరాగా చేసుకున్న పలువురు సిబ్బంది అందుబాటులో ఉన్న కొన్ని పుస్తకాలను విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ-పాస్ బుక్ కావాలంటే 45 రోజులు ఆగాల్సిందే.. ప్రస్తుతం తహశీల్దార్ కార్యాలయాల్లో ఉన్న పట్టాదార్ పాస్‌పుస్తకాలు, టైటిల్ డీడ్లు అయిపోతే కొత్తగా ఇవ్వాల్సిన వారందరికీ ఎలక్ట్రానిక్ పాస్‌పుస్తకాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఇప్పటికే కొన్ని మండలాల్లో ఈ-పాస్ పుస్తకాలు అందిస్తున్నారు. ఈ-పాస్ పుస్తకాల మంజూరుకు దాదాపు నెలన్నరకు పైగా సమయం పడుతుంది. దీంతో సత్వరం తమ అవసరాలు తీరడం కోసం పాత పాస్‌పుస్తకాలు పొందేందుకు రైతులు ప్రయత్నిస్తున్నారు. రూ.5 వేల నుంచి 10 వేల వరకు వసూళ్లు... భూముల క్రయవిక్రయాలు చేయాలంటే తప్పనిసరిగా పట్టాదార్ పాస్‌పుస్తకంతో పాటు భూమి యాజమాన్యపు హక్కు పత్రం (టైటిల్ డీడ్) కావాలి. ఇవి లేకుండా రిజిస్ట్రేషన్లు జరిగే పరిస్థితి లేదు. దీంతో వెంటనే పాస్‌పుస్తకం, టైటిల్ డీడ్ కావాలంటే రెవెన్యూ సిబ్బందికి అధిక మొత్తంలో సొమ్ము చెల్లించాల్సి వస్తోందని రైతులు అంటున్నారు. జిల్లాలో ప్రస్తుతం మచిలీపట్నం, నూజివీడు, విజయవాడ, గుడివాడ డివిజన్లలోని కొన్ని మండలాల్లో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఏ నిమిషంలో భూమి ధర ఎలా మారుతుందో తెలియని పరిస్థితిలో వెంటనే రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలనుకునేవారి సంఖ్య పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో పట్టాదార్ పాస్‌పుస్తకాల కోసం రైతులు నానా అగచాట్లు పడుతున్నారు. నూజివీడు, ఆగిరిపల్లి, పామర్రు, ఉయ్యూరు, నందిగామ, గుడివాడ మండలంలోని వలివర్తిపాడు, నాగవరప్పాడు ప్రాంతాల్లో భూముల ధరలు ఎక్కువగా ఉన్నందున ఆయా ప్రాంతాల రైతులు పట్టాదార్ పాస్‌పుస్తకం కావాలంటే రూ.5 వేలు నుంచి రూ.10 వేల వరకు చెల్లించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నవి అరకొర.. పెండింగ్‌లో దరఖాస్తులు... * జిల్లా వ్యాప్తంగా ఈ-పాస్‌బుక్‌లు, టైటిల్ డీడ్లు ఇచ్చేందుకు గాను ప్రస్తుతం పాస్‌పుస్తకాలు, టైటిల్ డీడ్ల ముద్రణ ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో కొన్ని మండలాల్లో మాత్రమే పుస్తకాలు ఉన్నాయి. * నూజివీడు డివిజన్లో ఇప్పటికే దాదాపు 400 పట్టాదార్ పాస్‌పుస్తకాలు, టైటిల్ డీడ్లు పెండింగ్ ఉన్నట్లు సమాచారం. * గుడివాడ డివిజన్లో మండలానికి దాదాపు వందకు పైగా పాస్‌పుస్తకాలు పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ముద్రించిన పుస్తకాలు ఆర్డీవో కార్యాలయంలో మాత్రమే ఉన్నాయని సమాచారం. * రియల్‌భూం ఉన్న ఉయ్యూరు, పామర్రు, విజయవాడ, పెనమలూరు మండలాల్లోనూ పట్టాదార్ పాస్‌పుస్తకాలు లేవని చెబుతున్నారు. * కొన్నిచోట్ల వీఆర్వోలు ఈ పరిస్థితిని ముందే పసిగట్టి పాస్‌పుస్తకాలు బ్లాక్‌చేసి కాసులు దండుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. * ప్రతి పుస్తకానికి వీఆర్వో దగ్గర నుంచి, పైస్థాయి అధికారి వరకు పెద్ద ఎత్తున మామూళ్లు ముట్టజెబితేనే పాస్‌పుస్తకం చేతికందుతుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. * ప్రభుత్వం ఆన్లైన్ ద్వారా ఇచ్చే ఈ-పాస్‌బుక్ విధానం జిల్లా వ్యాప్తంగా ఒకేసారి ప్రారంభిస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. * ఈ-పాస్‌బుక్ చేతికి అందాలంటే మీ-సేవా కేంద్రంలో దరఖాస్తు చేశాక.. అది రెవెన్యూ కార్యాలయానికి చేరుతుంది. ఆ తర్వాత దీనిపై నోటీసులు ఇస్తారు. నోటీసులు ఇచ్చిన తరువాత 45 రోజులు ఆగాల్సి ఉంది. అక్కడ నుంచి ఆర్డీవో కార్యాలయానికి వెళ్లి.. తరువాత హైదరాబాద్ వెళ్లి తిరిగి రావాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ విధానం ఆలస్యం అవుతున్నందున మాన్యువల్ పాస్‌పుస్తకాలు, టైటిల్ డీడ్లు సరఫరా చేయాలని పలువురు కోరుతున్నారు. -
నూరుశాతం ఆధార్‌తో అనుసంధానం చేయాలి
ఒంగోలు టౌన్ : జిల్లాలోని పట్టాదారు పాస్ పుస్తకాలను రెండు మూడు రోజుల్లో నూరుశాతం ఆధార్‌తో అనుసంధానం చేయాలని జాయింట్ కలెక్టర్ యాకూబ్ నాయక్ ఆదేశించారు. గురువారం ప్రకాశం భవనంలోని కలెక్టర్ కాన్ఫరెన్స్ హాలులో ఒంగోలు డివిజన్ పరిధిలోని తహశీల్దార్లు, సర్వేయర్లతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. పట్టాదారు పాస్ పుస్తకాలను ఆధార్‌తో అనుసంధానం చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే తహశీల్దార్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇకనుంచి ఈ-పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తామన్నారు. ఎక్కడైనా మ్యాన్యువల్ పట్టాదారు పాస్ పుస్తకాలు ఉంటే వెంటనే వాటిని ఈ-పట్టాదారు పాస్ పుస్తకాలుగా మార్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కొత్తపట్నం, చినగంజాం మండలాల్లో గ్రామానికి ఒకటి చొప్పున 1-బీలు ఉండాల్సి ఉండగా, రెండు మూడు ఉన్నాయని, వాటిని సమగ్రంగా విచారించాలని ఆదేశించారు. కొంతమంది రైతులు గ్రామాల్లో ఉండకపోవడంతో ఆధార్ అనుసంధానంలో జాప్యం జరుగుతోందని జాయింట్ కలెక్టర్ దృష్టికి తహశీల్దార్లు తీసుకురాగా వారంతా వచ్చేవిధంగా చొరవచూపాలని సూచించారు. సర్వే నంబర్లు కనిపించకుండా ఉన్నా వాటిపై కూడా విచారించాలన్నారు. కౌలు రైతులందరికీ రుణ అర్హత కార్డులు అందించాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. ప్రస్తుతం వ్యవసాయ సీజన్ ప్రారంభమైనందున సకాలంలో రుణ అర్హత కార్డులు అందించడం వల్ల కొంతమేర కౌలు రైతులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. మండలాల వారీగా కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు లక్ష్యాలు కేటాయించామని, వాటి ని త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అక్టోబర్ మొదటి వారంలో పండుగలు ఉన్నందు న వాటికి ముందుగానే చౌకధరల దుకాణాల నుంచి నిత్యావసరాలు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. డీలర్లు సకాలంలో డీడీలు చెల్లించే విధంగా చూడటంతో పాటు సరుకు రవా ణా, ప్రజలకు అందడంలో జాప్యం జరగకుండా చూడాలన్నారు. మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన బియ్యం కూడా పాఠశాలలకు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జి.గంగాధర్‌గౌడ్, నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ డీఐఓ మోహన్‌కృష్ణ, ఒంగోలు ఆర్డీఓ ఎంఎస్ మురళి పాల్గొన్నారు. -
పాస్‌పుస్తకాల సీడింగ్‌లో వెనుకబడ్డాం
కలెక్టర్ యువరాజ్ విశాఖ రూరల్: పట్టాదార్ పాస్‌పుస్తకాల ఆధార్ సీడింగ్‌లో జిల్లా రాష్ట్రంలో తొమ్మిదో స్థానంలో ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ తెలిపారు. రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహశీల్దార్లు ప్రత్యేక చొరవ చూపుతూ వారి పరిధిలోని భూముల వివరాలు వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేసే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆర్డీవో, తహశీల్దార్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 4,75,076 పట్టాదార్ పాస్‌పుస్తకాలు ఉన్నాయని, వీటిలో 2,80,865 పట్టాదార్ల వివరాలు మాత్రమే ఆధార్‌తో అనుసంధానం జరిగిందన్నారు. అదే విధంగా జిల్లాలో 1,67,261 మంది పట్టాదారుల వివరాలు నోషనల్ ఖాతాలో ఉండగా, వాటిలో కేవలం 3,638 మంది పట్టాదార్ల వివరాలు ఆధార్‌తో అనుసంధానమయ్యాయన్నారు. వెబ్‌ల్యాండ్‌లో ఇప్పటి వరకు కేవలం 59 శాతం పట్టాదార్ల వివరాలు మాత్రమే ఆధార్‌తో అనుసంధానం చేస్తూ నమోదు చేయడం జరిగిందని వివరించారు. ఈ సీడింగ్ కార్యక్రమంపై ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించేందుకు విస్తృత స్థాయిలో ప్రచారం నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఆధార్ అనుసంధానం కాని భూముల రిజిస్ట్రేషన్లు, క్రయ, విక్రయాలు భవిష్యత్తులో నిలుపుదల చేస్తారనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. రేషన్‌కార్డుల ఆధార్ సీడింగ్ 95 శాతం పూర్తయినందున,ఆ డేటాను సేకరించి పట్టాదార్ల సీడింగ్‌కు వినియోగించాలని చెప్పారు. ఈసమావేశంలో పాడేరు సబ్ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, ఏజేసీ వై.నరసింహారావు, ఎస్డీసీలు భవానిదాస్, వెంకటేశ్వర్లు, ఆర్డీవోలు వెంకటమురళి, వసంతరాయుడు, సూర్యారావు, డి.సెక్షన్ సూపరింటెండెంట్ రత్నం పాల్గొన్నారు.