నేనే వీఆర్వో.. నేనే ఎమ్మార్వో.. | - | Sakshi
Sakshi News home page

నేనే వీఆర్వో.. నేనే ఎమ్మార్వో..

Published Wed, Jul 5 2023 1:42 AM | Last Updated on Wed, Jul 5 2023 1:52 PM

- - Sakshi

కనిగిరి రూరల్‌: ‘‘నేనే వీఆర్వో.. నేనే ఎమ్మార్వో’’ అన్నట్లు జగన్నాథం సురేష్‌ అనే యువకుడు ఇష్టారాజ్యంగా భారీ అక్రమాలకు పాల్పడ్డాడు. నియోజకవర్గంలోని కనిగిరి, హెచ్‌ఎంపాడు, పీసీపల్లి తదితర మండలాలకు చెందిన సుమారు 12 మందికి దొంగ ఇళ్ల పట్టాలు, అసైన్డ్‌ భూముల డీకే పట్టాలు, పాస్‌ పుస్తకాలు తయారు చేసి ఇచ్చి సుమారు రూ.అర కోటి పైగా స్వాహా చేసినట్లు తెలుస్తోంది. ఇందులో మరో ఇద్దరు కూడా ఉన్నట్లు తెలుస్తుండగా, కొందరూ రెవెన్యూ అధికారుల పాత్రకూడా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.

వెలుగు చూసింది ఇలా..
లింగసముద్రం మండలానికి చెందిన జగన్నాథం సురేష్‌ కొంత కాలంగా కనిగిరి ప్రాంతంలో ఉంటున్నాడు. గతంలో ఉన్న తహసీల్దార్‌కు ఇతను వాహన డ్రైవర్‌గా కూడా పనిచేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇతను అక్రమాలకు పాల్పడ్డాడు. సురేష్‌, పొదిలికి చెందిన అతని స్నేహితుడు మర్రిబోయిన రమణయ్య కలిసి పట్టణంలోని సూరా పాపిరెడ్డి కాలనీలో తమకు పట్టాలు ఉన్నాయని పట్టణానికి చెందిన సుధాకర్‌కు చెప్పారు. అతను అతని స్నేహితుడైన బాషాకు చెప్పాడు. వీరిద్దరూ కలిసి పట్టణంలోని చింతపాలేనికి చెందిన కొండారెడ్డికి రూ.1.50 లక్షలకు అమ్మించారు. రమణయ్య అమ్మిన పట్టాను కొనుగోలుదారుడు ఆన్‌లైన్‌ చేసేందుకు తహసీల్దార్‌ కార్యాలయంలో చూపించుకున్నాడు.

ప్రభుత్వ ఆన్‌లైన్‌, లిఖిత పూర్వక రికార్డుల్లో రమణయ్య పేరు లేదు. దీంతో బాధితుడు కొండారెడ్డి తనకు ఆ ఇంటి స్థలం వద్దని, అది దొంగపట్టా అని చెబుతూ తన డబ్బులు తిరిగి ఇవ్వాలని దాన్ని అమ్మించిన బాషా, సుధాకర్‌లను కోరాడు. దీంతో వీరిద్దరు సురేష్‌, రమణయ్యలకు చెప్పారు. వారు డబ్బులు తిరిగి ఇవ్వకుండా, సమాధానం చెప్పకుండా తప్పించుకుని తిరుగుతున్నారు. సుమారు 6 నెలల నుంచి కనిపించకుండా తిరుగుతున్నారు. ఈక్రమంలో మంగళవారం అర్బన్‌ కాలనీలో మరొకరి దొంగపట్టాలు అమ్మేందుకు సురేష్‌, రమణయ్యలు వచ్చినట్లు బాధితులు తెలుసుకున్నారు. సుధాకర్‌, బాషా మరికొందరు వెళ్లి సురేష్‌, రమణయ్యలను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

ఎస్పీకి ఫిర్యాదు:
అయితే అప్పటికే కనిగిరి మండలం చల్లగిరిగిలకు చెందిన వంగేపురం కోటమ్మ.. తనకు అసైన్డ్‌ భూమి 3 ఎకరాలు ఇప్పిస్తానని చెప్పి రూ.1.50 లక్షల డబ్బులు సురేష్‌ అనే అతను తీసుకుని మోసం చేశాడని, ఏడాది నుంచి నగదు ఇవ్వకుండా కనిపించడం లేదని ఎస్పీ మలికా గర్గ్‌కు స్పందనలో ఫిర్యాదు చేసింది. దీంతో స్థానిక పోలీసులకు ఎస్పీ ఆఫీసు నుంచి రిఫర్‌ చేశారు. ఈమేరకు కనిగిరి పోలీసులు సురేష్‌ కోసం గాలిస్తున్నారు. ఇంతలో సురేష్‌ దొరకడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసున్నారు.

పట్టాలపై సంతకాలన్నీ గత తహసీల్దార్‌, ప్రస్తుత ఆర్డీఓ పేరుతోనే..
అయితే ఈ దొంగపట్టాలన్నీ గతంలో కనిగిరిలో పనిచేసిన తహసీల్దార్‌, ప్రస్తుత కనిగిరి ఆర్డీఓ అజయ్‌కుమార్‌ పేరుతో ఉన్నాయి. దీంతో నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. సురేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలియడంలో బాధితులు ఒక్కొక్కరుగా పోలీస్‌ స్టేషన్‌కు చేరుతున్నారు.

అసైన్డ్‌ భూములు ఇప్పిస్తానని రూ.3 లక్షలు స్వాహా...
వాగుపల్లి గ్రామ సమీపంలో ప్రభుత్వ అసైన్డ్‌ భూములు పెట్టిస్తానని చెప్పి ఐదుగురి దగ్గర సురేష్‌ రెండు దఫాలుగా రూ.3 లక్షలు తీసుకున్నాడు. మొదట రూ.1.50 లక్షలు తీసుకుని భూమి డీకే పట్టాలు ఇచ్చాడు. ఆ తర్వాత రూ.1.50 లక్షలు తీసుకుని పట్టాదారు పాస్‌ పుస్తకాలు ఇచ్చాడు. ఆ తర్వాత ఆన్‌లైన్‌ పూర్తయ్యాక మరో రూ.3 లక్షలు ఇవ్వాలని తెలిపాడు. కానీ ఏడాది నుంచి కనిపించడం లేదు. ఫోన్‌ కూడా ఎత్తడం లేదు. దీంతో ఆ పట్టాలను, పాస్‌ పుస్తకాలను తహసీల్దార్‌ కార్యాలయంలో తీసుకెళ్లి చూపించగా, అవి దొంగవిగా చెప్పారు. కనీసం మ్యాన్యువల్‌ బుక్‌లో కూడా లేవని తేల్చారు. ఈమేరకు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు వాగుపల్లికి చెందిన బాధితుడు వెంకటరెడ్డి తెలిపాడు.

చిన ఇర్లపాడులో.. .
అలాగే చిన ఇర్లపాడులో డీకే పట్టాలు పెడతామని చెప్పి ఆంధోని, రూత్‌, బ్రహ్మారెడ్డి, జయపాల్‌తో పాటు తన దగ్గర రూ.3 లక్షలు డబ్బులు తీసుకుని దొంగపట్టాలు ఇచ్చాడని ముద్దా బాబు అనే వ్యక్తి తెలిపాడు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే నెల్లూరు జిల్లాకు చెందిన మరొకరి దగ్గర రూ.5 లక్షల డబ్బులు తీసుకుని దొంగ ఇంటి పట్టాలు ఇచ్చి మోసం చేసినట్లు బాధి తులు తెలిపారు. ఇలా అనేక మంది బాధితులు ఉన్నట్లు సమాచారం. బాధితుడు వాగుపల్లికి చెందిన మూలే వెంకటరెడ్డి ఫిర్యాదు మేరకు ఫోర్జరీ సంతకాలతో దొంగపట్టాలు, పాస్‌ పుస్తకాలు ఇచ్చిన నెల్లూరు జిల్లా లింగసముద్రంకు చెందిన సురేష్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై దాసరి ప్రసాద్‌ తెలిపారు.

విచారణకు ఆదేశించా..
నా పేరుతో సంతకం పెట్టి కొందరు దొంగ పట్టాలు, పాస్‌ పుస్తకాలు తయారు చేసినట్లు నా దృష్టికి వచ్చింది. దీనిపై తక్షణ విచారణ జరిపి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను ఆదేశించాను. అలాగే ఫోర్జరీ సంతకాలు, దొంగ స్టాంప్‌లతో పట్టాలు తయారు చేసిన వ్యక్తిపై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేస్తాను.
– టీ అజయ్‌కుమార్‌, కనిగిరి ఆర్డీవో

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement