
అన్నింటికీ ‘ఆధార్’
- ఆధార్‌కార్డుల కోసం కుస్తీ పడుతున్న ప్రజలు
- ఐదారుసార్లు వివరాలు నమోదు చేసుకున్న అందని వైనం
- ఆధార్ లేని వ్యక్తులు 10 లక్షల పైనే!
కర్నూలు(అగ్రికల్చర్): ప్రభుత్వ పథకాలన్నింటికి ఆధార్‌నంబర్ తప్పనిసరైంది. ఇటీవల పట్టాదారు పాస్ పుస్తకాలతో సహా రేషన్‌కార్డులు, సామాజిక భద్రత పథకం పింఛన్లు, ఎన్‌ఆర్‌ఈజీఎస్ జాబ్ కార్డులు తదితర అన్నింటికి ఆధార్‌తో అనుసంధానం చేసే ప్రక్రియను ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీని వల్ల బోగస్‌ను నివారించాలనేది ప్రభుత్వం ఉద్దేశం. అయితే నేటికి లక్షల మందికి ఆధార్ నంబర్లు రాకపోవడం తీవ్ర గందరగోళానికి దారి తీస్తోంది. జిల్లాలో ఆధార్ నమోదు చేయించుకోవాల్సిన వారు 40 లక్షలకు పైగా ఉన్నారు. ఇందులో 75 శాతం మందికి ఆధార్ నంబర్లు వచ్చినా 25 శాతం మందికి రాలేదు. వీరిలో 15 శాతం మంది ఏకంగా ఐదారుసార్లు వివరాలతో పాటు బయో మెట్రిక్ నమోదు చేయించుకున్నా ఆధార్‌నంబర్ రాలేదు.
దీంతో వారు పడరానిపాట్లు పడుతున్నారు. రుణమాఫీని అమలు చేయడానికి ప్రభుత్వం పట్టాదారు పాస్‌పుస్తకాలను ఆధార్‌తో అనుసంధానం చేస్తోంది. అనుసంధానం కాకపోతే రుణమాఫీతో పాటు వివిధ ప్రభుత్వ పథకాల కింద లబ్ధికి దూరం కావాల్సి వస్తుంది. అయితే కొందరు ఎన్నిసార్లు వివరాలు నమోదు చేయించుకున్నా నంబర్లు రాక పడుతున్న ఆందోళన అంతా ఇంతా కాదు. జిల్లాలో 7,45,189 పట్టాదారులు ఉన్నారు. వీరిలో వేలాది మందికి ఆధార్ నంబరు రాకపోవడం వల్ల పట్టాలను అనుసంధానం చేసే కార్యక్రమం నత్తనడకన సాగుతోంది.
దాదాపు 20 రోజులుగా ఈ కార్యక్రమం చురుగ్గా జరుగుతున్న ఇంతవరకు 3,78,490 పట్టాలను మాత్రమే అనుసంధానం చేసినట్లు సమాచారం. ఆలూరు మండలంలో 15980 పట్టాలు ఉంటే కేవలం 5744 పట్టాలను, కౌతాళం మండలంలో 25363 పట్టాలు ఉంటే 9270 పట్టాలను మాత్రమే ఆధార్‌తో అనుసంధానం చేసినట్లు తెలుస్తోంది. ఇలా హాలహర్వి, కొసిగి, ఆదోని, ఆస్పరి, మంత్రాలయం, చిప్పగిరి, గోనెగండ్ల, వెలుగోడు, ఓర్వకల్లు, సి.బెళగల్, వెల్దుర్తి, పాములపాడు, బండి ఆత్మకూరు, బనగానపల్లి, నంద్యాల, శిరివెళ్ల తదితర మండలాల్లో కూడా అదే పరిస్థితి. పట్టాలను ఆధార్‌తో అనుసంధానం చేసే కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ కన్నబాబు స్వయంగా పర్యవేక్షిస్తూ రోజు సమీక్షలు నిర్వహిస్తున్నారు. అయినా ఆశించిన స్థాయిలో పురోగతి కనిపించడం లేదు.
ఆధార్ కోసం కుస్తీ పడుతున్నాం...
కర్నూలు మండలం నందనపల్లి పంచాయతీలోని ఎన్‌ఎస్ తండాకు చెందిన ఆర్.కైలాస్ నాయక్ 2012లో ఆధార్ కోసం బయో మెట్రిక్‌తో పాటు వివరాలు నమోదు చేయించుకున్నారు. ఎన్‌రోల్‌మెంటు నంబరు 1171 270 172 71 30 20 140 13 1150 856 కానీ ఆధార్ నంబరు రాలేదు. తర్వాత నాలుగుసార్లు వివరాలు నమోదు చేయించుకున్న ఫలితం లేదు. కైలాస్‌నాయక్ భార్య లక్ష్మీ దేవి పరిస్థితి ఇదే. ఎన్‌ఎస్.తండాలోనే పలు కుటుంబాలకు ఆధార్ నంబర్లు రాలేదు.
ఆధార్ లేక స్కాలర్‌షిప్‌కు దూరం...
కర్నూలుకు చెందిన బి.విశాల నంద్యాల ఆర్‌జీఎం ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్నారు. మూడు సార్లు ఆధార్ కోసం ఎన్‌రోల్‌మెంటు చేసుకున్నారు. ఎన్‌రోల్‌మెంటు నంబర్లు 2052/11373/00668 తేది 23.6.2014, 2052/11373/00281 తేది 07-04-2014, 1094/10211/03971 తేది 6-1-2013. కాని ఇంతవరకు ఆధార్ నంబరు రాలేదు.దీంతో స్కాలర్‌షిప్, ఫీజు రీ ఇంబర్స్‌మెంట్‌కు దూరం అవుతున్నారు.
విద్యుత్ కనెక్షన్లకూ ఆధార్
కర్నూలు(రాజ్‌విహార్) : విద్యుత్ కనె క్షన్లకు కూడా ఆధార్ నంబర్లను అనుసంధానం చేయనున్నారు. విద్యుత్ సర్వీసు కనెక్షన్లు ఉన్న ప్రతి వినియోగదారుడు తన ఆధార్ నంబర్‌ను సర్వీస్ నంబర్‌తో అనుసంధానం చేయాలని ఎస్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ హెచ్.వై.దొర ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో స్థానిక అధికారుల్లో కదలిక వచ్చింది. కొత్త కనెక్షన్లు తీసుకునే ప్రతి వినియోగదారుడు కూడా అన్ని డాక్యుమెంట్ పత్రాలతో పాటు ఆధార్ కార్డు నంబర్‌ను కూడా ఇవ్వాల్సి ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా దాదాపు 10.30 లక్షల మంది విద్యుత్ వినియోగదారులు ఉన్నారు.
ఇందులో అత్యధికంగా 8 లక్షలకు పైగా గృహ వినియోగదారులు, 1.13 లక్షల మంది వ్యవసాయ వినియోగదారులు ఉన్నారు. వీరందరికీ ఇక ఆధార్ కష్టాలు మొదలుకానున్నాయి. వినియోగదారులు స్పాట్ బిల్లింగ్ కోసం ఇళ్లు, షాపులకు వచ్చే మీటర్ రీడర్ (బిల్లులు ఇచ్చే సిబ్బంది)లకు తమ ఆధార్ నంబర్లు ఇచ్చి సహకరించాలని కర్నూలు డివిజనల్ ఆపరేషన్ డీఈ ఎం.ఉమాపతి కోరారు. ఆధార్ కార్డు ఇంకా రాని వినియోగదారులు తమ ఎన్‌రోల్‌మెంట్(నమోదు) నంబర్ ఇచ్చి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.