సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రతి ఒక్క రైతుకూ జూన్ 2లోగా కొత్త పట్టాదారు పుస్తకం, రైతుబంధు చెక్కులు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. సాంకేతిక కారణాల వల్ల కొన్ని చోట్ల కొద్దిమందికి పట్టాదారు పాస్ పుస్తకాలు, చెక్కులు అందలేదని ప్రభుత్వానికి సమాచారం అందినట్లు చెప్పారు. గ్రామాల్లో పంపిణీ చేసిన సందర్భంలో హాజరు కాలేకపోయిన వారు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి బుక్కులు, చెక్కులు తీసుకోవాలని పేర్కొ న్నారు. పాస్‌బుక్కుల పంపిణీ, రైతుబంధుపై ప్రగతిభవన్‌లో మంగళవారం ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.
ఇప్పటివరకు జరిగిన కార్యక్రమాన్ని సమీక్షించడంతోపాటు మిగిలిన వారికి పాస్ పుస్తకాలు, చెక్కులు అందించడానికి అవసరమైన వ్యూహం ఖరారు చేసేందుకు మంత్రులు, కలెక్టర్లతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. బుధవారం మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రగతిభవన్‌లో ఈ సమావేశం జరగనుంది. ‘‘ఆధార్ కార్డు అనుసంధానం కాకపోవడంతోపాటు మరికొన్ని కారణాల వల్ల కొన్ని చోట్ల రైతులకు పాస్‌పుస్తకాలు అందలేదు. చెక్కులు చేతికి రాలేదు. కొన్నిచోట్ల రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. భూరికార్డులు సరిచేసే కార్యక్రమాన్ని కొన్నిచోట్ల సరిగా నిర్వహించలేదని తెలుస్తోంది.
ప్రభుత్వం రైతుల కోసం ఇంత చిత్తశుద్ధితో పనిచేస్తున్నా అధికారులు కొన్నిచోట్ల అందుకు అనుగుణంగా విధులు నిర్వహించకపోవడం అసంతృప్తి కలిగిస్తోంది. ఇప్పటికైనా యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగాలి. ప్రతీ ఒక్క రైతుకు పట్టాదారు పాస్ పుస్తకాలు, చెక్కులు పంపిణీ చేయాలి. జూన్ 2 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ విధానం అమల్లోకి వస్తుంది. అప్పటికల్లా అందరి వద్ద కొత్త పాస్ పుస్తకాలుండాలి. రికార్డులన్నీ అప్‌డేట్ అయి ఉండాలి’’ అని ముఖ్యమంత్రి ఆదేశించారు. అసెంబ్లీ స్పీకర్ ఎస్.మధుసూదనాచారి, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, హరీశ్‌రావు, లక్ష్మారెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, ఎంపీలు సంతోష్ కుమార్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎండీసీ చైర్మన్ శేరి సుభాష్‌రెడ్డి, సీనియర్ అధికారులు ఎస్.నర్సింగ్‌రావు, రామకృష్ణారావు, రాజేశ్వర్ తివారీ, శాంతకుమారి, వికాస్ రాజ్, జగన్‌మోహన్,
వెంకట్రామ్‌రెడ్డి, సందీప్ సుల్తానియా, భూపాల్‌రెడ్డి సమావేశంలో పాల్గొన్నారు.
రైతుబంధుకు గొప్ప స్పందన
దేశంలో మరే ప్రభుత్వ కార్యక్రమానికి రానంత గొప్ప స్పందన రైతుబంధుకు వచ్చిందనిసీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించి నూటికి నూరు శాతం కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని పిలుపునిచ్చారు. ‘‘రికార్డు సమయంలో భూ రికార్డుల ప్రక్షాళన చేసి, రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు అందించడం సాధారణ విషయం కాదు. ప్రభుత్వం ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతోంది. ఎన్నో పథకాలు తెస్తుంది. కానీ పంట పెట్టుబడి పథకానికి వచ్చినంత గొప్ప స్పందన మరే కార్యక్రమానికి రాలేదు.
ఆఫీసుల చుట్టూ తిరగకుండా, ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా భూమి రికార్డులు సరిచేసి కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వడం, పెట్టుబడి సాయం అందివ్వడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. రైతుల సంక్షేమానికి మించిన ప్రాధాన్యం ప్రభుత్వానికి మరొకటి లేదు. అందుకే వ్యవసాయ రంగానికి ఎక్కువ నిధులిస్తున్నాం. రైతులకు మేలు చేయగలిగితేనే సాధించిన తెలంగాణకు సార్థకత. రూ.12 వేల కోట్లతో రైతుబంధు కార్యక్రమం అమలు చేస్తుంటే చాలా మంది భయపడ్డారు. కానీ రైతులకు నేరుగా మేలు చేసే కార్యక్రమం కాబట్టి మొండి పట్టుదలతో ముందుకుపోయాం. పంట పెట్టుబడికి ప్రభుత్వం అందించిన సాయం చేతికందిన తర్వాత రైతుల్లో చెప్పలేని ఆనందం, అప్పుల బాధ తప్పిందనే ఊరట కనిపిస్తోంది’’ అని సీఎం అన్నారు.
కలెక్టర్లతో నేడు అత్యవసర సమీక్ష
జూన్ 2 నాటికి పాస్ పుస్తకాలు, చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ముగించేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులు, కలెక్టర్లతో బుధవారం మధ్యాహ్నం సమావేశం కానున్నారు. జిల్లాల వారీగా ఇప్పటివరకు ఎంత మంది రైతులకు పాస్ పుస్తకాలు, చెక్కులు అందించారు? ఇంకా ఎన్ని మిగిలాయి? ఎందుకు మిగిలాయి? వారికి బుక్కులు, చెక్కులు ఎప్పుడిస్తారు? అసలు ఏ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి? తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తారు. తక్షణ వ్యూహంతో పాటు రైతులకు జీవిత బీమా పథకం, కంటి వెలుగు, రాష్ట్ర అవతరణ వేడుకలు, పంచాయతీ రాజ్ ఎన్నికల ఏర్పాట్లు తదితర అంశాలపైనా ఈ భేటీలో చర్చిస్తారు.
సీఎంకు స్పీకర్ అభినందనలు
రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు, చెక్కులు అందించినందుకు అసెంబ్లీ స్పీకర్ మధుసూధనాచారి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమం రైతుల్లో ఎంతో ఆనందం నింపిందని, గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొందని స్పీకర్ అన్నారు. ప్రగతి భవన్‌కు వచ్చి సీఎంకు పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలిపారు. విజయవంతంగా రైతుబంధు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డిలను సీఎం అభినందించారు. తెలంగాణలో వ్యవసాయాభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించడంతోపాటు చెక్కుల పంపిణీకి భారీగా కసరత్తు చేసిన వ్యవసాయాధికారులను కూడా అభినందించారు. వ్యవసాయ శాఖ కమిషనర్ జగన్‌మోహన్, హర్టికల్చర్ కమిషనర్ వెంకట్రామ్‌రెడ్డి, వివిధ జిల్లాలకు చెందిన వ్యవసాయాధికారులు సీఎంను కలిశారు.
Comments
Please login to add a commentAdd a comment